2020–2024
ఎన్నటికీ మరువలేని దినములు
2024 అక్టోబరు సర్వసభ్య సమావేశము


14:19

ఎన్నటికీ మరువలేని దినములు

రాబోయే క్షణాలు, అన్నిచోట్ల సంఘ సభ్యులకు యేసు క్రీస్తు సువార్త యొక్క సువర్తమానమును పంచుకోవడానికి అధిక అవకాశాలను అందిస్తాయి.

పరిచయము

నా ప్రియమైన సహోదర సహోదరీలారా, ఈ యుగములోని యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము యొక్క చరిత్ర, ప్రభువు తన సంఘమును ఎలా నడిపించారో తెలిపే దైవిక అనుభవాలతో ప్రకాశవంతంగా ఉంది. మన చరిత్రకు ఒక దశాబ్దం ఉంది, అయితే, అది అన్నిటికంటే అత్యున్నతమైనది—1820 నుండి 1830 వరకు ఉన్న దశాబ్దం. 1820వ సంవత్సరం వసంత ఋతువులో పరిశుద్ధ వనములో తండ్రియైన దేవుణ్ణి మరియు ఆయన కుమారుడైన యేసు క్రీస్తును చూసిన ప్రవక్త జోసెఫ్ స్మిత్ యొక్క అనుభవంతో ప్రారంభమై, 1830, ఏప్రిల్ 6 వరకు కొనసాగిన ఆ దశాబ్దం ఇతర దశాబ్దాల కంటే భిన్నంగా ఉంది.

బంగారు పలకలను అందజేస్తున్న మొరోనై.
మెల్కీసెదకు యాజకత్వము యొక్క పునఃస్థాపన.
ఆలీవర్ కౌడరీ.

ఈ విశేషమైన సంఘటనలను పరిగణించండి! యువ ప్రవక్త, దేవదూత మొరోనైతో సంభాషించాడు, బంగారు పలకలను అనువదించాడు మరియు మోర్మన్ గ్రంథాన్ని ప్రచురించాడు! అతడు అహరోను మరియు మెల్కీసెదెకు యాజకత్వముల పునఃస్థాపనకు సాధనముగా ఉన్నాడు, తర్వాత అతడు సంఘమును ఏర్పాటుచేసాడు! ఆలీవర్ కౌడరీ ఆ యుగమును: “ఎన్నటికీ మరువలేని దినములివి” అని చక్కగా వర్ణించాడు. ఆ అద్భుతమైన సంఘటనలు నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి.

ఈ సంవత్సరం, మనము దాదాపు రెండు శతాబ్దాల క్రితం చూసిన వ్యవస్థాపక దశాబ్దం నుండి ఇతర దశాబ్దాల కంటే కూడా మహత్వపూర్ణమైనదిగా నిరూపించబడే దశాబ్దాన్ని ప్రారంభించామని సూచించడానికి నేను చాలా ధైర్యంగా ఉన్నాను.

మన దశాబ్దం

నన్ను వివరించనివ్వండి. ఇప్పుడు 2024 మరియు 2034 మధ్య, సేవ చేయడానికి, సభ్యులు మరియు స్నేహితులతో ఏకమవ్వడానికి మరియు మునుపెన్నడూ లేనంత ఎక్కువ మందికి యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘమును పరిచయం చేయడానికి అపూర్వమైన అవకాశాలను కలిగించే ప్రభావశీల సంఘటనలను మనము అనుభవిస్తాము.

అధ్యక్షులు నెల్సన్ యొక్క 100వ పుట్టినరోజు వేడుక.

అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ యొక్క 100వ జన్మదినాన్ని పది లక్షల మందితో జరుపుకున్నప్పుడు ఒక నిజమైన చారిత్రాత్మక ఘట్టం యొక్క శక్తిని మనము చూశాము.

అధ్యక్షులు నెల్సన్ జన్మదినాన్ని నివేదిస్తూ, న్యూస్‌వీక్ పత్రిక, “ప్రపంచంలోని వృద్ధ మత నాయకుడు 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు” అని ఒక శీర్షిక వ్రాసింది. ఆ తర్వాత వారు ప్రపంచంలోని 10 మంది వృద్ధ విశ్వాస నాయకుల జాబితా చేశారు—పోప్ ఫ్రాన్సిస్ మరియు దలై లామాలను కలిగి ఉన్న జాబితాలో అధ్యక్షులు నెల్సన్ మొదటి స్థానంలో ఉన్నారు.

New York Times కథనం నుండి వచ్చిన ఈ ప్రకటన అంతర్జాతీయ వార్తా సేకరణలో చాలా వరకు స్ఫూర్తిని సూచిస్తుంది: “వృద్ధాప్యం మరియు నాయకత్వం గురించి ఆత్మ పరిశీలనను ప్రేరేపించిన “[సంయుక్త రాష్ట్రాల] అధ్యక్ష ఎన్నికల క్రమములో, నెల్సన్ యొక్క మైలురాయి, మూడు అంకెలతో కూడిన పుట్టిన రోజు, కనీసం ఆయన సంఘములో వారికైనా, ఆశాభంగము కానీయదని చూపుతుంది. తమ అధ్యక్షుడిని కార్యనిర్వాహకుడిగా మాత్రమే కాకుండా ‘ప్రవక్తగా, దీర్ఘదర్శిగా మరియు బయల్పాటుదారునిగా’ చూసే సంఘ సభ్యుల మధ్య ఆయన ఒక ప్రముఖ వ్యక్తిగా మిగిలిపోతారు.”

అధ్యక్షులు నెల్సన్ యొక్క మైలురాయి పుట్టినరోజు, ప్రపంచ ప్రేక్షకులకు దేవుని ప్రవక్తను పరిచయం చేసే అవకాశాన్ని అందించినందుకు మనము ఎంతో కృతజ్ఞత కలిగియున్నాము, ఇది ఎన్నటికీ మరువలేని ఒక గొప్ప వేడుక.

పునరుద్ధరించిన సంఘ కార్యాలయ భవనము.

ఈ వసంతకాలం ప్రారంభంలో, టెంపుల్ స్క్వేర్ వద్ద—సంఘము గుర్తింపు పొందిన దేశాలకు ప్రాతినిధ్యం వహించే అంతర్జాతీయ జెండాల ప్రదర్శనను కలిగియున్న—పునరుద్ధరించబడిన భవనము ఒకటి ఆవిష్కరించబడింది. భవన ప్రవేశద్వారం, ఈ ప్రవచనాత్మక పదాలు వ్రాయబడిన ఒక గ్రానైట్ స్మారక చిహ్నంతో గుర్తించబడింది: “అంత్యదినములలో పర్వతములపైన యెహోవామందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటె ఎత్తుగా ఎత్తబడును, ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు.”

ఖచ్చితంగా, రాబోయే 10 సంవత్సరాలలో సంభవించే స్మారక సంఘటనలు యెషయా యొక్క ప్రవచనం నెరవేరుతుందనే ప్రత్యక్షతను కలిగి ఉంటాయి.

సాల్ట్ లేక్ దేవాలయము.

రాబోయే దశాబ్దంలో అసాధారణమైన సంఖ్యలో ప్రణాళిక చేయబడిన దేవాలయ బహిరంగ సందర్శనలు మరియు ప్రతిష్ఠాపనలను గురించి ఆలోచించండి, సంభావ్యత కలిగియున్న 164 మరియు ఆపై పెరుగుతున్న దేవాలయాల గురించి కూడా ఆలోచించండి. మీరు మరియు మీ స్నేహితులు లక్షల మంది ప్రభువు యొక్క మందిరం గుండా నడుస్తున్నారని ఊహించుకోండి. సాల్ట్ లేక్ దేవాలయము యొక్క పునఃప్రతిష్ఠ మరియు సంబంధిత కార్యకలాపాలు, ఈ సంఘటనల యొక్క ప్రతీకాత్మక కేంద్రమవుతాయి. నిశ్చయముగా ఇవి ఎన్నటికీ మరువలేని దినములు.

సంఘము యొక్క ఏర్పాటు.

సంఘ నిర్మాణము యొక్క ద్విశతాబ్ది జ్ఞాపకార్థం 2030వ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా అవకాశాలను తెస్తుంది. సంఘము ఈ మైలురాయిని ఎలా గుర్తిస్తుందో చెప్పడానికి త్వరపడుతున్నట్లు అనిపించినప్పటికీ, కుటుంబ సభ్యులను, స్నేహితులను, సహోద్యోగులను మరియు విశిష్ట అతిథులను “వచ్చి చూడండి” అని ఆహ్వానించడానికి మరియు సంఘ సభ్యుల జీవితాలలో సంఘము చూపే శక్తివంతమైన ప్రభావాన్ని బాగా అర్థం చేసుకోవడానికి ఇది ఖచ్చితంగా అనుమతిస్తుంది.

సాల్ట్ లేక్ నగరంలో 2002 వింటర్ ఒలింపిక్స్.

2034లో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేలాదిమంది ప్రముఖులు, సందర్శకులు మరియు క్రీడాకారులు, వింటర్ ఒలింపిక్ క్రీడల వేదిక అయిన సాల్ట్ లేక్ నగర వీధులను ముంచెత్తుతారు. బహుశా ప్రపంచవ్యాప్త ఐక్యతకు ఒలింపిక్ క్రీడలలో నిక్షిప్తమైన దానికంటే గొప్ప ప్రదర్శన మరొకటి ఉండదు. ప్రపంచం యొక్క దృష్టి సంఘము మరియు దాని సభ్యులపై ఉంటుంది, స్వచ్ఛందసేవకు, సేవ చేయడానికి మరియు దయగల పనుల ద్వారా సువర్తమానమును పంచుకోవడానికి అనేక అవకాశాలు కలుగుతాయి—ఇది ఎన్నటికీ మరువలేని సంఘటన.

ఈ రాబోయే క్షణాలు, అన్నిచోట్ల సంఘ సభ్యులకు యేసు క్రీస్తు సువార్త యొక్క సువర్తమానమును, మాటలు మరియు చేతల ద్వారా పంచుకునే అవకాశాలను అందిస్తాయి, ఇది ఎన్నటికీ మరువలేని ఒక దశాబ్దం.

సువర్తమానములు

తన పుట్టినరోజుకు కొన్ని వారాల ముందు జరిగిన ఒక సమావేశంలో, అధ్యక్షులు నెల్సన్ “సువర్తమానము” అనే పదాన్ని తాను ఆదరించడానికి గల కారణాన్ని పంచుకున్నారు. స్పష్టంగా ఆయన ఇలా పేర్కొన్నారు, ఈ పదము సంతోషము మరియు ఆనందాన్ని ప్రసరింపజేస్తుంది. అయితే “సువర్తమానము” దాని కంటే చాలా ఎక్కువ తెలియజేస్తుంది. ఈ పదము యూవాంజిలియన్ అనే గ్రీకు పదం నుండి వచ్చిందని, దీని అర్థం “శుభవార్త” లేదా “సువార్త” అని ఆయన వివరించారు. ఈ జీవితంలో మరియు తదుపరి జీవితంలో సంతోషము మరియు ఆనందం ఎల్లప్పుడూ యేసు క్రీస్తు యొక్క సువార్తతో ముడిపడి ఉంటాయి. ఆ విధంగా “సువర్తమానము” అనే పదము ఈ ద్వంద్వ అర్థాన్ని అద్భుతమైన రీతిలో సంగ్రహిస్తుంది.

“మనుష్యులు సంతోషము కలిగియుండునట్లు ఉన్నారు.” పరలోక తండ్రి తన ఆశీర్వాదాల ద్వారా ఆనందాన్ని కలిగించే సంతోష ప్రణాళికను అందించారు. కుటుంబాలుగా ఆయన సన్నిధిలో శాశ్వతంగా జీవించడం కూడా వీటిలో ఉంది. యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము మనల్ని విమోచించాలనే దేవుని ప్రణాళికకు కేంద్రమైయున్నది. నిత్యజీవమును పొందడానికి మనము తప్పక క్రీస్తు యొద్దకు రావాలి. మనము అలా చేసి, “ఇతరులు కూడా రావడానికి సహాయం చేసినప్పుడు, మనం రక్షణ మరియు ఉన్నతస్థితి యొక్క దేవుని కార్యములో పాలుపంచుకుంటాము.”

యేసు క్రీస్తు సువార్త యొక్క ఈ సువర్తమాన సందేశం భూమిపై అత్యంత ముఖ్యమైన సందేశం. ఇది సంఘులోని యువజనులకు మరియు వయో జనులకు ఒక ముఖ్యమైన భాగము.

యౌవనుల బలము కొరకు

ఇప్పుడు, ఈ రాబోయే దశాబ్దం సంఘులోని ప్రతి సభ్యునికి ఎన్నటికీ మరువలేని దినములతో నిండియుండవచ్చు, ప్రత్యేకించి యువ తరానికి చెందిన మీకు ఇది నిజం కావచ్చు. మీరు ఇప్పుడు ఇక్కడ ఉండడానికి ఎంపిక చేయబడినందున మీరు ఇప్పుడు ఇక్కడ భూమిపై ఉన్నారు. అపూర్వమైన రీతిలో, క్రీస్తు శిష్యులుగా ఉండే శక్తి మరియు సామర్థ్యం మీకు ఉన్నాయి.

అధ్యక్షులు జార్జ్ క్యు. కాన్నన్ ఇలా బోధించారు: “ప్రపంచాన్ని మరియు దుష్టుని యొక్క అన్ని శక్తులను ఎదుర్కొనుటకు, [మరియు] … అన్ని పర్యవసానములకు భయపడకుండా మన దేవుని యొక్క సీయోనును స్థాపించి, నిర్మించుటకు ధైర్యము మరియు దృఢ సంకల్పం కలిగిన ఆత్మలను దేవుడు ఈ యుగము కోసము దాచియుంచారు.”

ఆ దిశగా, ఎన్నటికీ మరువలేని ఈ దశాబ్దం మీ కోసం ఎంత ఉత్తేజకరమైనదిగా ఉంటుందో ఊహించుకోవడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ, యువ తరంతో నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఈ రాబోయే దశాబ్దంలో మిమ్మల్ని శక్తివంతం చేసే కొన్ని సలహాలను మరియు ప్రోత్సాహాన్నందించే సాధారణ మాటలను కూడా నేను అందిస్తున్నాను.

మీలో చాలా మందిలాగే, నా దగ్గర కూడా ఒక స్మార్ట్‌ఫోన్ ఉంది, సందర్భానుసారంగా మరియు ఎటువంటి ప్రేరేపణ లేకుండా, అది ఒక నిర్దిష్ట రోజున నేను ఏమి చేస్తున్నానో చూపించే ఫోటోలను వరుసగా చూపిస్తుంది. కేవలం కొన్ని సంవత్సరాలలోనే నాలో మరియు నా కుటుంబంలో ఎంత మార్పు వచ్చిందో చూడటం ఎల్లప్పుడూ ఆశ్చర్యంగా ఉంటుంది.

మీ ఫోన్‌లోని ఫోటోలు ఇప్పటి నుండి 10 సంవత్సరాల తర్వాత చూపించబడతాయని ఊహించుకోండి! మీరు ఉన్నత పాఠశాల లేదా కళాశాల నుండి పట్టభద్రులవ్వడం, మీ వరమును పొందడం, సువార్త సేవకు వెళ్లడం, వివాహం చేసుకోవడం మరియు మీ మొదటి బిడ్డను కలిగి ఉండటం మీరు చూడవచ్చు. వ్యక్తిగతంగా మీ కొరకు, ఇది ఎన్నటికీ మరువలేని ఒక దశాబ్దం. అయితే మీరు యేసు క్రీస్తు సువార్త యొక్క సువర్తమానము మీ జీవితాలను మాత్రమే కాకుండా మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు మరియు సామాజిక మాధ్యమ అనుచరుల జీవితాలను ఎలా సుసంపన్నం చేస్తుందో మరియు ఎలా మెరుగుపరుస్తుందో ఈ ప్రపంచానికి తెలియజేసే ఒక వెలుగుగా మారడానికి కూడా చురుకుగా కృషి చేస్తే అది రెట్టింపు అవుతుంది.

దీనిని ఎలా చెయ్యాలి అని మీరు ఆశ్చర్యపడుతుండవచ్చు.

దైవికంగా నియమించబడిన బాధ్యతలుగా సూచించబడే నాలుగు సాధారణ కార్యకలాపాల ద్వారా ఇది జరుగుతుందని దేవుని ప్రవక్తలు మనకు బోధించారు: మొదటిది, యేసు క్రీస్తు సువార్తను జీవించడం; రెండవది, అవసరాలలో ఉన్న వారిని ఆదుకోవటం; మూడవది, సువార్తను అందుకోమని అందరినీ ఆహ్వానించడం; మరియు నాల్గవది, నిత్యత్వము కొరకు కుటుంబాలను ఏకం చేయడం. విశేషముగా, ప్రతి ఒక్కటి చాలా సాధారణమైన మరియు సహజమైన మార్గాలలో చేయబడగలదు.

దైవికంగా నియమించబడిన బాధ్యతలు

దైవికంగా నియమించబడిన ఈ నాలుగు బాధ్యతల పట్ల మీరు విధేయత చూపితే మీ కొరకు ఇది ఎన్నటికీ మరువలేని దశాబ్దం అవుతుందని నేను మీకు వాగ్దానం చేస్తున్నాను. ఇది వేటిని కలిగియుందో పరిశీలిద్దాం.

దైవికంగా నియమించబడిన నాలుగు బాధ్యతలు.
ప్రార్థిస్తున్న యువతి.

మొదటిది, యేసు క్రీస్తు యొక్క సువార్తను జీవించండి. ప్రవక్తల మాటలను అధ్యయనం చేయండి మరియు పరలోకంలో ఉన్న మీ తండ్రిని ప్రేమించడం నేర్చుకోండి. మీ హృదయాలను ఆయన తట్టుకు తిప్పండి మరియు ఆయన త్రోవలలో నడవడానికి కృషి చేయండి. ఎల్డర్ యులిసెస్ సోవారెస్ వివరించిన “నిబంధన విశ్వాసం” ద్వారా ఉద్ధరించబడండి. రక్షకుడు మిమ్మల్ని బలపరుస్తారని మరియు మీకు మద్దతిస్తారని తెలుసుకొని యేసు క్రీస్తును అనుసరించడానికి నిబంధనలు చేయడం ద్వారా ఈ విశ్వాసం వస్తుంది.

సువార్తను జీవించడంలో మీరు అనుభవించే ఆనందాన్ని మీ స్నేహితులను చూడనివ్వండి మరియు వారు స్వీకరించే అత్యుత్తమ సువార్త సందేశం మీరే అవుతారు.

రెండవది, అవసరాలలో ఉన్న వారిని దయతో ఆదుకోండి. మీ తరం తక్కువ అదృష్టవంతుల గురించి అసాధారణంగా శ్రద్ధ వహిస్తుంది. విపత్తు సంభవించినప్పుడు మరియు సంఘ సభ్యులు శిధిలాలను తొలగించి, బాధలో ఉన్నవారిని ఓదార్చడానికి పరుగెత్తినప్పుడల్లా, “హెల్పింగ్ హ్యాండ్స్” టీ-షర్టులు ధరించిన వారిలో ఎక్కువ మంది యుక్తవయస్కులు మరియు ఇరవైల వయస్సు గలవారు. “ఒకరి భారాలను మరొకరు మోయడం” మరియు “ఆదరణ యొక్క అవసరములో ఉన్నవారిని ఆదరించడం” మీ స్వభావం. ఇలా చేయడం ద్వారా మనం “క్రీస్తు నియమమును నెరవేర్చుతాము.”

అవసరతలో ఉన్నవారి కోసం జామ్ సేకరిస్తున్న పిల్లలు.

ఇవాన్, ఒక యువ ప్రాథమిక వయస్సున్న బాలుడు, తన స్థానిక ఫుడ్ బ్యాంకుకు విరాళంగా ఇవ్వడానికి వేరుశెనగ వెన్న మరియు జెల్లీ శాండ్‌విచ్‌లను సేకరిస్తూ తన పాఠశాల వేసవి సెలవులను గడపాలని నిర్ణయించుకున్నాడు. అతను JustServe వెబ్‌సైట్‌లో ఒక ప్రాజెక్ట్‌ను కనుగొన్నాడు. యువకుడైన ఇవాన్ 700 కంటే ఎక్కువ జెల్లీజాడీలను సేకరించడంలో సహాయపడటానికి తన పాఠశాల మొత్తం తరగతిని చేర్చుకున్నాడు! మీరు సేవ చేసే వ్యక్తుల పట్ల మీకున్న శ్రద్ధ, దేవుని పట్ల మీకున్న ప్రేమ మరియు మీ పొరుగువారిని మీలాగే చూసుకోవాలనే మీ కోరికతో ముడిపడి ఉందని వారికి తెలియజేయండి.

బ్రెజిల్‌లోని సువార్తికులు.

మూడవది, సువార్తను అందుకోమని అందరిని ఆహ్వానించండి. ఈ సంవత్సరం మేము ప్రపంచవ్యాప్తంగా 36 కొత్త మిషనులను ప్రారంభించాము, పూర్తి-కాల సువార్త సేవ‌లను అందించాలనుకునే వారందరికీ వసతి కల్పించాము. చాలామంది యువత అధికారిక మతపరమైన కార్యకలాపాలలో పూర్తిగా పాల్గొనకుండా వెనుకంజ వేస్తున్న ఈ యుగంలో, ఇది విశేషమైనది మరియు మీ సాక్ష్యాల యొక్క అద్భుతమైన స్వభావాన్ని తెలియజేస్తుంది. పూర్తి-కాల సేవ చేస్తున్నా లేదా చేయకున్నా, దయచేసి మీరు ప్రేమిస్తున్నప్పుడు, పంచుకున్నప్పుడు మరియు యేసు క్రీస్తు యొక్క సువార్తను అన్వేషించడానికి వారిని ఆహ్వానించినప్పుడు మీ సహచరులను ప్రభావితం చేయగల మీ అపారమైన సామర్థ్యాన్ని గ్రహించండి.

ప్రెస్టన్ ఇంగ్లండ్ దేవాలయం వద్ద యువత.

నాల్గవది, నిత్యత్వము కొరకు కుటుంబాలను ఏకం చేయండి. నేను ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేవాలయాలను సందర్శిస్తున్నప్పుడు, బాప్తిస్మపు తొట్టె వద్ద నిరీక్షిస్తున్న యౌవనుల సమూహాలను మరియు విధి పనివారుగా పనిచేస్తున్న వయో జనుల సంఖ్యను చూసి ఆశ్చర్యపోయాను. ఇటీవల స్కాట్లాండ్ మరియు ఐర్లాండ్ నుండి 600 మందితో కూడిన ఒక యువ బృందం ప్రెస్టన్ ఇంగ్లండ్ దేవాలయానికి వెళ్లి, 4,000మందికి పైగా మృతుల కొరకు విధులను నిర్వహించింది, వీరిలో చాలా మంది వారి సొంత పూర్వీకులు! కుటుంబ చరిత్రలో నిమగ్నమై ఉండాలని, దేవాలయంలో సమయం గడపాలని మరియు సమాన అర్హత కలిగిన భాగస్వామిని దేవాలయంలో వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న పురుషుడు లేదా స్త్రీగా మిమ్మల్ని మీరు జాగ్రత్తగా సిద్ధం చేసుకోవాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. దేవాలయాన్ని మీ జీవితంలో ఒక క్రమమైన భాగంగా మార్చుకోవడానికి ఇప్పుడే మీ జీవితంలో ఒక నమూనాను అభివృద్ధి చేయండి.

ముగింపు

నా ప్రియమైన సహోదర సహోదరీలారా మరియు నా ప్రియమైన యువ స్నేహితులారా, రాబోయే రోజుల్లో మనలో ప్రతి ఒక్కరికీ కష్టాలు ఉండవచ్చు. అయితే, మనము ఈ రాబోయే దశాబ్దపు అపూర్వమైన క్షణాల్లోకి ప్రవేశిస్తున్నప్పుడు, జీవించడం, శ్రద్ధ వహించడం, ఆహ్వానించడం మరియు ఏకం చేయడం వంటి సాధారణ కార్యకలాపాల ద్వారా మనం సువర్తమానమును పంచుకుందాం. మనము అలా చేస్తున్నప్పుడు, ప్రభువు మనకు ఎన్నటికీ మరువలేని అనుభవాలను అనుగ్రహిస్తారు.

నిష్కపటమైన హృదయంతో మరియు నిజమైన ఉద్దేశ్యంతో ప్రభువును చేరుకునే వారు, పెదవులపై రక్షకుని పేరును మరియు వారి ఆత్మలలో పరిశుద్ధాత్మను కలిగియున్నవారు, ఈ గొప్ప మరియు మహిమాన్వితమైన యాత్రకు బయలుదేరే వారు, సమృద్ధిగల సిలెస్టియల్ దీవెనలను కనుగొని అనుభవిస్తారని మరియు దేవుడు మీ మాట వింటారని, ఆయనకు మీరు తెలుసునని, ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నారనే సాక్ష్యం పొందుకుంటారని నేను సాక్ష్యమిస్తున్నాను. మీరు ఎన్నటికీ మరువలేని దినములను అనుభవిస్తారు. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.