2020–2024
అనుదిన జీవితంలో ప్రభువుకు పరిశుద్ధత
2024 అక్టోబరు సర్వసభ్య సమావేశము


14:17

అనుదిన జీవితంలో ప్రభువుకు పరిశుద్ధత

ప్రభువుకు పరిశుద్ధత అనుదిన జీవితాన్ని పవిత్రంగా చేస్తుంది. అది మనల్ని ప్రభువుకు మరియు ఒకరినొకరికి దగ్గర చేసి, సంతోషపరుస్తుంది.

ఇటీవల మా గాంగ్ కుటుంబం తిరిగి కలుసుకున్నప్పుడు, డాడీ జోకుల పోటీ ఉన్న సరదా టాలెంట్ షో జరిగింది.

కానీ ఈ పోటీ అసాధారణమైనది. ఒక జట్టులో తాత (నేను) మరియు 12, 11 వయస్సులు గల ఇద్దరు మనవళ్ళు ఉన్నారు. మరొక జట్టులో, గెరిట్ డబ్ల్యు. గాంగ్ శైలిలో డాడీ జోకులు చెప్పడానికి ఒక బంధువు ద్వారా కృత్రిమ మేధస్సు (AI) ప్రోగ్రామ్ ఉంది. తాత గెరిట్ గాంగ్‌కు పోటీగా AI గెరిట్ గాంగ్.

మనవళ్ళు, నేను ముందుగా మొదలుపెట్టాము.

తన కారును నాశనం చేసిన డైనోసార్‌ను మీరు ఏమని పిలుస్తారు? టైరన్నోసారస్ రెక్స్.

AI గెరిట్ గాంగ్‌కు ఇలా సూచించబడింది—గెరిట్ డబ్ల్యు. గాంగ్ లాగా ఆలోచించండి. ఆయనలా మాట్లాడండి.

AI గెరిట్ గాంగ్—“ఆసక్తిగల, ఆలోచనాత్మకమైన మరియు ఉత్తేజపరిచే ఆయన శైలిని అనుసరిస్తూ, గెరిట్ డబ్ల్యు. గాంగ్ మాట్లాడినట్లుగా, ఒక డాడీ జోకు ఇదిగో: వినయపూర్వకమైన చెట్టు ప్రజలను ఎందుకు నవ్వించింది? ఎందుకంటే అది ప్రేమలో పాతుకుపోయింది మరియు దయ గల కొమ్మలతో చేరుకుంది. ఆ చెట్టులాగే మనం కూడా మన మూలాల్లో బలాన్ని, ఇతరులకు దయ చూపడంలో ఆనందాన్ని పొందగలం.”

సరే, మీరేమనుకుంటున్నారు? అందుకే వాటిని డాడీ జోకులు అన్నారు.

మన చుట్టూ నవ్వడానికి, ఆనందించడానికి, కృతజ్ఞతతో చూడడానికి అవకాశాలున్నాయి. మనది అనుదిన జీవితంలో ఆనందం మరియు పరిశుద్ధత గల సువార్త. పరిశుద్ధత పవిత్ర ప్రయోజనం కోసం విషయాలను వేరు చేస్తుంది. కానీ పరిశుద్ధత మనల్ని పవిత్రమైన వాటితో అనుదిన జీవితాన్ని నింపమని—ఈ ప్రపంచంలోని ఒత్తిళ్ళు, సవాళ్ళ మధ్య అనుదిన ఆహారంలో ఆనందించమని కూడా ఆహ్వానిస్తుంది. ప్రభువుతో నడిచేందుకు మనం తప్పక పరిశుద్ధంగా మారాలి, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు మరియు పరిశుద్ధంగా మారడంలో మనకు సహాయపడేందుకు, ఆయనతో పాటు నడవమని ప్రభువు మనల్ని ఆహ్వానిస్తున్నారు.

మనలో ప్రతీఒక్కరికి ఒక కథ ఉంది. సహోదరి గాంగ్ మరియు నేను మిమ్మల్ని—అనేక ప్రదేశాలలో మరియు పరిస్థితులలో ఉన్న సంఘ సభ్యులను, స్నేహితులను—కలుసుకున్నప్పుడు, అనుదిన జీవితంలో ప్రభువుకు పరిశుద్ధత గురించి మీ కథలు మాకు స్ఫూర్తినిస్తాయి. మీరు ఈ సూత్రాల ప్రకారం జీవిస్తున్నారు: దేవునితో సహవాసం, సంఘంలో మరియు పరస్పరం కనికరము, దేవుడు, కుటుంబం మరియు స్నేహితులతో నిబద్ధత మరియు నిబంధన—యేసు క్రీస్తులో కేంద్రీకృతమైయుండడం.

పెరుగుతున్న సాక్ష్యాలు ఈ అద్భుతమైన వాస్తవాన్ని ఎత్తిచూపుతాయి: ఆధ్యాత్మిక నిబద్ధత లేదా బాంధవ్యం లేని వారి కంటే మత విశ్వాసులు సగటున సంతోషంగా, ఆరోగ్యంగా, మరింత సంతృప్తికరంగా ఉంటారు. సంతోషం మరియు జీవితంలో సంతృప్తి, మానసిక మరియు శారీరక ఆరోగ్యం, అర్థం మరియు ప్రయోజనం, స్వభావం మరియు సుగుణం, సన్నిహిత సామాజిక సంబంధాలు, ఆర్థిక మరియు భౌతిక స్థిరత్వం—ప్రతిదానిలో మతపరమైన అభ్యాసకులు అభివృద్ధి చెందుతారు.

వారు అన్ని వయస్సులలో మరియు జనాభా సమూహాలలో మెరుగైన శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మరియు జీవితంలో ఎక్కువ సంతృప్తిని పొందుతారు.

పరిశోధకులు “మత నిర్మాణ స్థిరత్వం” అని పిలిచేది జీవితంలో అనుకోని సంఘటనలు జరిగినప్పుడు స్పష్టత, ఉద్దేశ్యం మరియు ప్రేరణను అందిస్తుంది. విశ్వాస గృహం మరియు పరిశుద్ధుల సమాజం ఏకాంతవాసం మరియు ఒంటరితనంతో పోరాడుతుంది. ప్రభువుకు పరిశుద్ధత అనేది అపవిత్రమైన వాటికి, ఇతరులను విమర్శించే తెలివితక్కువతనానికి, కోపానికి మరియు డబ్బు కోసం ధృవీకరించే వ్యాఖ్యానాలకు “వద్దు” అని చెబుతుంది. ప్రభువుకు పరిశుద్ధత అనేది పవిత్రమైన మరియు గౌరవప్రదమైన వాటికి “అవును” అని చెబుతుంది, మనం విశ్వాసంతో ఆయనను అనుసరిస్తున్నప్పుడు మనం స్వేచ్ఛగా, సంతోషకరమైన, అత్యంత ప్రామాణికమైన, ఉత్తమమైన వ్యక్తిగా మారడానికి “అవును” అని చెబుతుంది.

అనుదిన జీవితంలో ప్రభువుకు పరిశుద్ధత ఎలా ఉంటుంది?

అనుదిన జీవితంలో ప్రభువుకు పరిశుద్ధత అనేది వివాహమై ఒక సంవత్సర కాలం గడిపిన ఇద్దరు యౌవనస్థుల వలె కనిపిస్తుంది, విశదమవుతున్న వారి జీవితాల్లో యథార్థతతో మరియు దుర్బలత్వంతో వారు సువార్త నిబంధనలు, త్యాగం మరియు సేవను పంచుకుంటారు.

ఆమె ఇలా ప్రారంభిస్తుంది, “ఉన్నత పాఠశాలలో, నేను నిరాశతో ఉన్నాను. దేవుడు నా కోసం లేడని భావించాను. ఒకరోజు రాత్రి, ఒక స్నేహితురాలి నుండి ఈ సందేశం వచ్చింది, ‘హేయ్ నువ్వు ఎప్పుడైనా ఆల్మా 36 చదివావా?’

“నేను చదవడం ప్రారంభించినప్పుడు, నేను శాంతి మరియు ప్రేమతో ముంచివేయబడ్డాను అని ఆమె చెప్పింది. నన్ను గట్టిగా కౌగిలించుకున్నట్లు అనిపించింది. నేను ఆల్మా 36:12 చదివినప్పుడు, పరలోక తండ్రి నన్ను చూసారని మరియు నేను ఎలా భావిస్తున్నానో ఆయనకు తెలుసని నేను తెలుసుకున్నాను.”

ఆమె ఇలా కొనసాగించింది, “మేము పెళ్ళి చేసుకునే ముందు, దశమభాగం గురించి నాకు గొప్ప సాక్ష్యం లేదని నేను నా కాబోయే భర్తతో నిజాయితీగా చెప్పాను. ఇతరులు ఇవ్వడానికి చాలా ఉన్నప్పుడు, దేవుడికి మనం ఎందుకు డబ్బులివ్వాలి? ఇది డబ్బు గురించి కాదు, కానీ మనల్ని అడిగిన ఆజ్ఞను అనుసరించడం గురించినది అని వివరించడానికి నా కాబోయే భర్త సహాయం చేశాడు. దశమభాగం చెల్లించడం ప్రారంభించమని అతడు నన్ను సవాలు చేశాడు.

“నా సాక్ష్యం పెరగడాన్ని నేను నిజంగా చూశాను,” అని ఆమె చెప్పింది. “కొన్నిసార్లు డబ్బు ఇబ్బందులు ఎదురవుతాయి, కానీ మేము చాలా ఆశీర్వాదాలను చూశాము మరియు ఏదో ఒకవిధంగా జీతాలు సరిపోతాయి.”

అలాగే, “నా నర్సింగ్ తరగతి‌లో, ఏకైక సంఘ సభ్యురాలిని మరియు వివాహం చేసుకున్న ఏకైక వ్యక్తిని నేనే. తోటివిద్యార్థు‌లు నన్ను ఏకాకిని చేసారని భావించడం వల్ల మరియు నా నమ్మకాల గురించి, నేను నా వస్త్రాలు ధరించడం గురించి లేదా నేను చాలా చిన్న వయస్సులో వివాహం చేసుకోవడం గురించి ప్రతికూల వ్యాఖ్యలు చేయడం వల్ల నేను చాలాసార్లు విసుగు చెంది లేదా ఏడుస్తూ తరగతి‌ని వదిలి వెళ్ళానని” ఆమె చెప్పింది.

ఇంకా ఆమె ఇలా కొనసాగించింది, “ఈ గత సెమిస్టర్‌లో నా నమ్మకాలను ఎలా మెరుగ్గా వినిపించాలో మరియు సువార్తకు మంచి ఉదాహరణగా ఎలా ఉండాలో నేను నేర్చుకున్నాను. నా జ్ఞానం మరియు సాక్ష్యం పెరిగింది, ఎందుకంటే నేను స్థిరంగా నిలబడడానికి మరియు నేను నమ్మేదానిలో బలంగా ఉండడానికి నా సామర్థ్యంలో నేను పరీక్షించబడ్డాను.”

ఆ యువ భర్త ఇలా అన్నాడు, “నా సువార్తసేవకు ముందు నాకు కాలేజీ బేస్‌బాల్ ఆడేందుకు అవకాశాలు వచ్చాయి. కష్టమైన నిర్ణయం తీసుకొని, ఆ అవకాశాలను పక్కన పెట్టి, నేను ప్రభువు సేవకు వెళ్ళాను. దేనికోసమైనా సరే ఆ రెండు సంవత్సరాల అనుభవాలను నేను వదులుకోలేను.

“ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, నేను కష్టమైన మార్పును ఆశించాను, కానీ నేను బలంగా, వేగంగా మరియు ఆరోగ్యంగా ఉన్నాను అని అతడు చెప్పాడు. నేను వెళ్ళినప్పటి కంటే గట్టిగా విసురుతున్నాను. నేను కలలుగన్న పాఠశాల‌తో సహా, నేను విడిచివెళ్ళినప్పటి కంటే ఎక్కువగా ఆడడానికి నాకు అవకాశా‌లు ఉన్నాయి. మరీ ముఖ్యంగా, నేను గతంలో కంటే ఎక్కువగా ప్రభువుపై ఆధారపడుతున్నాను,” అన్నాడు.

అతనిలా ముగించాడు, “మన ప్రార్థనలలో పరలోక తండ్రి మనకు శక్తిని వాగ్దానం చేస్తారని ఒక సువార్తికునిగా నేను బోధించాను, కానీ కొన్నిసార్లు నా విషయంలో నేను దానిని మరచిపోతాను.”

సువార్తసేవ ద్వారా పరిశుద్ధతను వ్యక్తపరచడం నుండి వచ్చే మన దీవెనల ఖజానా నిండుగా ఉంది. ఆర్థికాంశాలు, సమయం మరియు ఇతర పరిస్థితులు తరచుగా సులభం కాదు. కానీ అన్ని వయస్సులు మరియు నేపథ్యాలు గల సువార్తికులు ప్రభువుకు పరిశుద్ధతను సమర్పించినప్పుడు, విషయాలు ప్రభువు యుక్తకాలంలో మరియు విధానంలో జరుగగలవు.

48 సంవత్సరాల క్రితం జరిగిన అనుభవాన్ని ఒక సీనియర్ సువార్తికుడు ఇలా పంచుకున్నారు, “నేను సువార్తసేవకు వెళ్ళరాదని, కళాశాల విద్యను అభ్యసించాలని మా నాన్న కోరుకున్నారు. ఆ తర్వాత కొంతకాలానికి ఆయనకు గుండెపోటు వచ్చి, 47 ఏళ్ళ వయస్సులో మరణించారు. నేను అపరాధిగా భావించాను. నా తండ్రితో నేను సరైన సంబంధాన్ని ఎలా నిలుపుకోగలను?

“తరువాత,” అతనిలా కొనసాగించాడు, “నేను సువార్తసేవ చేయాలని నిర్ణయించుకున్న తర్వాత, నేను ఒక కలలో మా నాన్నను చూశాను. శాంతియుతంగా మరియు సంతృప్తిగా, నేను సేవ చేస్తానని ఆయన సంతోషంగా ఉన్నారు.”

ఈ సీనియర్ సువార్తికుడు ఇలా కొనసాగించాడు, “సిద్ధాంతము మరియు నిబంధనలు 138 బోధిస్తున్నట్లుగా, మా నాన్న ఆత్మలోకంలో సువార్తికునిగా సేవ చేయగలరని నేను నమ్ముతున్నాను. 17 సంవత్సరాల వయస్సులో జర్మనీని విడిచిపెట్టి, కుటుంబాన్ని కోల్పోయిన మా ముత్తాతని మళ్ళీ కనుగొనడంలో మా నాన్న సహాయం చేస్తున్నట్లు నేను ఊహిస్తున్నాను.”

అతని భార్య ఇలా జతచేసింది, “నా భర్త కుటుంబంలోని ఐదుగురు సోదరులలో, సువార్తసేవ చేసిన నలుగురు అధునాతన కళాశాల డిగ్రీలు కలిగి ఉన్నారు.”

అనుదిన జీవితంలో ప్రభువుకు పరిశుద్ధత అనేది తన జీవితంలో దేవునికి మిక్కిలి ప్రాధాన్యతనివ్వడం నేర్చుకున్న తిరిగివచ్చిన యువ సువార్తికునిలా కనిపిస్తుంది. ఇంతకుముందు, చాలా అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని ఆశీర్వదించమని అడిగినప్పుడు, ఈ సువార్తికుడు ఇలా అన్నాడు, “నాకు నమ్మకం ఉంది; ఆయన కోలుకునేలా నేను ఆశీర్వదిస్తాను. అయినప్పటికీ, తిరిగి వచ్చిన సువార్తికుడు ఇలా అన్నాడు, “నేను కోరుకున్న దాని కోసం కాదు, కానీ ఆ వ్యక్తికి అవసరమని ప్రభువుకు తెలిసిన వాటి కోసం ప్రార్థించడం నేను ఆ క్షణంలో నేర్చుకున్నాను. నేను ఆ సహోదరుడిని శాంతి మరియు ఓదార్పుతో దీవించాను. తరువాత అతను ప్రశాంతంగా మరణించాడు.”

అనుదిన జీవితంలో ప్రభువుకు పరిశుద్ధత అనేది సంబంధం ఏర్పరచుకోవడానికి, ఓదార్పునిచ్చి, బలపరచడానికి తెర గుండా అవతలికి చేరుకొనే చిన్న చర్య వంటిది. ఒక ప్రధాన విశ్వవిద్యాలయంలోని నిర్వాహకుడు పెద్దగా పరిచయం లేని వ్యక్తులు తన కోసం ప్రార్థించడాన్ని తాను అనుభూతి చెందుతున్నట్లు చెప్పారు. ఆ వ్యక్తులు తమ జీవితాలను విశ్వవిద్యాలయానికి అంకితం చేశారు, దాని లక్ష్యం మరియు విద్యార్థుల గురించి శ్రద్ధ వహిస్తూనే ఉన్నారు.

తన భర్త ఆమెకు మరియు పిల్లలకు ద్రోహం చేసిన తర్వాత, ఒక సహోదరి ప్రతిరోజూ తన వంతు కృషి చేస్తోంది. నేను ఆమెను, ఆమె వంటి ఇతరులను బాగా మెచ్చుకుంటాను. ఒకరోజు బట్టలు మడతపెట్టి, వస్త్రాల దొంతరపై చేయి వేసుకుని, “ఏం ప్రయోజనం?” అని ఆమె తనలోతాను నిట్టూర్చింది. “నీ నిబంధనలు నాతో ఉన్నాయి” అని ఒక మృదువైన స్వరం ఆమెకు హామీ ఇచ్చినట్లు ఆమె భావించింది.

50 సంవత్సరాలుగా, మరొక సహోదరి తన తండ్రితో సంబంధం కోసం ఆరాటపడింది. ఆమె ఇలా చెప్తుంది, “పెద్దవుతున్నప్పుడు మా అన్నయ్యలు, నాన్న జట్టుగా ఉన్నారు మరియు నేను—ఏకైక కూతురిని ఒంటరిగా ఉన్నాను. మా నాన్నకి ‘నచ్చినట్లుగా’ ఉండాలని నేను ఎప్పుడూ కోరుకునేదాన్ని.

“తర్వాత, మా అమ్మ చనిపోయింది! మా నాన్నకు నాకు మధ్య ఉన్న ఏకైక అనుసంధానకర్త ఆమె.

“ఒకరోజు ‘మీ నాన్నను పిలిచి నీతో పాటు దేవాలయానికి తీసుకువెళ్ళు’ అని ఒక స్వరం చెప్పడం విన్నాను, అని ఆ సహోదరి చెప్పింది. అది ప్రభువు యొక్క మందిరానికి నేను మా నాన్నతో కలిసి నెలకు రెండుసార్లు వెళ్ళడానికి ఆరంభం. నేను ఆయన్ని ప్రేమిస్తున్నానని మా నాన్నతో చెప్పాను. ఆయన కూడా నన్ను ప్రేమిస్తున్నానని చెప్పారు.

“ప్రభువు యొక్క మందిరంలో సమయం గడపడం వల్ల మాకు స్వస్థత చేకూరింది. మా అమ్మ భూమిపై మాకు సహాయం చేయలేకపోయింది. తెగిన వాటిని సరిచేయడానికి ఆమె తెరకు అవతలి వైపు ఉండాల్సి వచ్చింది. నిత్య కుటుంబంగా సంపూర్ణత్వం కోసం మా ప్రయాణాన్ని దేవాలయం పూర్తి చేసింది.”

ఆ తండ్రి ఇలా అంటారు, “దేవాలయ ప్రతిష్ఠాపన నాకు మరియు నా ఒక్కగానొక్క కుమార్తెకు గొప్ప ఆధ్యాత్మిక అనుభవం. ఇప్పుడు మేము కలిసి హాజరవుతాము మరియు మా ప్రేమ బలపడుతుందని భావిస్తున్నాము.”

అనుదిన జీవితంలో ప్రభువుకు పరిశుద్ధత అనేది ప్రియమైన వారు మరణించినప్పుడు మృదువైన క్షణాలను కలిపి ఉంటుంది. ఈ సంవత్సరం ప్రారంభంలో, నా ప్రియమైన తల్లి, జీన్ గాంగ్, ఆమె 98వ పుట్టినరోజుకు కొన్ని రోజుల ముందు ప్రశాంతంగా మరణించింది.

“నీకు రాకీ రోడ్, వైట్ చాక్లెట్ జింజర్ లేదా స్ట్రాబెర్రీ ఐస్ క్రీం కావాలా?” అని మీరు మా అమ్మని అడిగితే, “అవును, దయచేసి, నేను ఒక్కొక్కటి రుచి చూడవచ్చా?” అంటుంది అమ్మ. ముఖ్యంగా ఆమె జీవితంలో అన్ని రుచులను ఇష్టపడినప్పుడు, మీ అమ్మకు “వద్దు” అని ఎవరు చెప్పగలరు?

నేను ఒకసారి అమ్మను ఏ నిర్ణయాలు ఆమె జీవితాన్ని బాగా తీర్చిదిద్దాయో అడిగాను.

ఆమె ఇలా చెప్పింది, “యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘములో బాప్తిస్మం పొందడం మరియు హవాయి నుండి సంయుక్త రాష్ట్రాలకు వెళ్ళడం, అక్కడ నేను మీ నాన్నను కలిశాను.”

15 సంవత్సరాల వయస్సులో బాప్తిస్మం పొంది, పెద్ద కుటుంబం నుండి మన సంఘంలో చేరిన ఏకైక సభ్యురాలైయుండి, మా అమ్మ ప్రభువు నందు నిబంధన విశ్వాసాన్ని, నమ్మకాన్ని కలిగియుంది, అది ఆమె జీవితాన్ని మరియు మా కుటుంబ తరాలను ఆశీర్వదించింది. మీరు మీ కుటుంబంలోని సభ్యులను పోగొట్టుకొని చింతిస్తున్నట్లే నేను నా తల్లిని పోగొట్టుకొని చింతిస్తున్నాను. కానీ మా అమ్మ ఉనికిలో లేకుండా పోలేదని నాకు తెలుసు. ఇప్పుడు మాత్రం ఆమె ఇక్కడ లేదు. నేను ఆమెను మరియు ప్రభువుకు అనుదిన పరిశుద్ధతకు శూరులైన ఉదాహరణలుగా వెళ్ళిపోయిన వారందరినీ గౌరవిస్తాను.

నిజమే, అనుదిన జీవితంలో ప్రభువుకు పరిశుద్ధత అనేది ఆయన పరిశుద్ధ మందిరంలోకి ప్రభువు వద్దకు తరచుగా రావడాన్ని కలిపియుంటుంది. మనం సంఘ సభ్యులమైనా లేదా సంఘంలో ఆసక్తిగల స్నేహితులమైనా ఇది నిజం.

బ్యాంకాక్ థాయ్‌లాండ్ దేవాలయ బహిరంగ సందర్శనకు ముగ్గురు స్నేహితులు వచ్చారు.

“ఇది అత్యంత స్వస్థపరిచే ప్రదేశం” అని ఒకరు చెప్పారు.

బాప్తిస్మపు తొట్టె వద్ద, మరొకరు ఇలా అన్నారు, “నేను ఇక్కడ ఉన్నప్పుడు, నేను శుభ్రంగా కడుగబడి, ఇకపై పాపం చేయరాదని కోరుకుంటున్నాను.”

మూడవ వ్యక్తి, “మీరు ఆధ్యాత్మిక శక్తిని అనుభవించగలరా?” అన్నారు.

తొమ్మిది పవిత్ర పదాలతో, మన దేవాలయాలు ఇలా ఆహ్వానిస్తాయి మరియు ప్రకటిస్తాయి:

“యెహోవా పరిశుద్ధుడు.

“ప్రభువు యొక్క మందిరము.”

ప్రభువుకు పరిశుద్ధత రోజువారీ జీవితాన్ని పవిత్రంగా చేస్తుంది. ఇది మనల్ని ప్రభువుకు మరియు ఒకరినొకరికి దగ్గర చేసి, సంతోషపరుస్తుంది మరియు మన తండ్రి అయిన దేవునితో, యేసు క్రీస్తుతో మరియు మన ప్రియమైనవారితో జీవించడానికి మనల్ని సిద్ధం చేస్తుంది.

నా స్నేహితురాలు చేసినట్లుగా, మీ పరలోక తండ్రి మిమ్మల్ని ప్రేమిస్తున్నారా అని మీరు ఆశ్చర్యపోవచ్చు. సమాధానం ఖచ్చితంగా అవును! అని ప్రతిధ్వనిస్తుంది. ప్రభువుకు పరిశుద్ధతను మనం ప్రతిరోజూ మనదిగా చేసుకున్నప్పుడు, సంతోషంగా మరియు శాశ్వతంగా మనం ఆయన ప్రేమను అనుభవించగలము. మనము ఆవిధంగా చేయాలని యేసు క్రీస్తు యొక్క పవిత్ర నామములో నేను ప్రార్థిస్తున్నాను, ఆమేన్.

వివరణలు

  1. పాత నిబంధన కాలముల నుండి, “నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై యుండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను” (లేవీయకాండము 11:44) అని మనము బోధించబడ్డాము. మనము ప్రభువు యెదుట పరిశుద్ధముగా నడుచుకొనవలెను (సిద్ధాంతము మరియు నిబంధనలు 20:69 చూడండి), పరిశుద్ధ స్థలములలో నిలుచుండవలెను (సిద్ధాంతము మరియు నిబంధనలు 45:32 చూడండి), విశ్రాంతిదినమును పరిశుద్ధముగా ఆచరించవలెను (నిర్గమకాండము 20:8 చూడండి), ప్రతిష్ఠిత వస్త్రములు ధరించుకొనవలెను (నిర్గమకాండము 29:29 చూడండి), ప్రతిష్ఠాభిషేక తైలమును ఉపయోగించవలెను (నిర్గమకాండము 30:25 చూడండి), పరిశుద్ధ ప్రవక్తల చేత దీవించబడవలెను (సిద్ధాంతము మరియు నిబంధనలు 10:46 చూడండి) మరియు పరిశుద్ధ లేఖనములు (సిద్ధాంతము మరియు నిబంధనలు 20:11 చూడండి), పరిశుద్ధ చట్టములు (సిద్ధాంతము మరియు నిబంధనలు 20:20 చూడండి) మరియు పరిశుద్ధ దేవదూతలపై (సిద్ధాంతము మరియు నిబంధనలు 20:6 చూడండి) ఆధారపడవలెను. ప్రభువుకు పరిశుద్ధత అనేది మన అనుదిన జీవితం యొక్క అన్ని అంశాలను దీవించడానికి ఉద్దేశించబడింది.

  2. మోషే 6:34 చూడండి.

  3. See “Religion and Spirituality: Tools for Better Wellbeing?,” Gallup Blog, Oct. 10, 2023, news.gallup.com. “ప్రపంచవ్యాప్తంగా, ఆధ్యాత్మికత లేదా మతం పట్ల ఎక్కువ నిబద్ధత ఉన్న వ్యక్తులు అనుకూల భావోద్వేగాలు, ఉద్దేశ్య భావం, సంఘ ఒప్పందం మరియు సామాజిక సంబంధాలతో సహా అనేక అంశాలలో మెరుగైన శ్రేయస్సును కలిగి ఉంటారు” (Faith and Wellness: The Worldwide Connection between Spirituality and Wellbeing [2023], 4, faithandmedia.com/research/gallup).

  4. వ్యాఖ్యానించబడిన ప్రతి అనుభవం—నా ప్రశంసలతో మరియు అభినందనలతో—పాల్గొన్న వ్యక్తుల మాటలలో మరియు వారి అనుమతితో పంచుకోబడింది.

  5. నేడు సంఘములో, 18-35 సంవత్సరాల వయస్సు గల వయోజనులు (ఒంటరి యువత మరియు వివాహిత వయోజనులతో సహా) మరియు ఒంటరి పెద్దలు (36-45 సంవత్సరాల వయస్సు) కలిపి మొత్తం సంఘ సభ్యులలో మూడింట ఒక వంతు (32.5 శాతం) ఉన్నారు. ఆ 5.623 మిలియన్ల మంది సంఘ సభ్యులలో, 18-35 సంవత్సరాల వయస్సు గల వయోజనులు మొత్తం 3.625 మిలియన్లు (వీటిలో 694,000 మంది వివాహితులు) మరియు 36-45 సంవత్సరాల వయస్సు గల ఒంటరి పెద్దలు మొత్తం 1.998 మిలియన్లు ఉన్నారు. మన వయోజనులు మరియు ఒంటరి పెద్దలు అత్యుత్తమంగా ఉన్నారు; ప్రతీ ఒక్కరు అమూల్యమైనవారు. ప్రతీ ఒక్కరికి విశ్వాసం, అన్వేషణ, స్థితిస్థాపకత మరియు కనికరము యొక్క వ్యక్తిగత కథ ఉంది. ఇక్కడ పంచుకోబడిన ఉదాహరణ నేను సంఘమంతటా అనేక సందర్భాలలో మరియు పరిస్థితులలో యువకులు మరియు ఒంటరి పెద్దలను కలిసినప్పుడు వారు పంచుకున్న విశేషమైన కథనాలు మరియు అనుభవాల శ్రేణికి ప్రతిరూపం.

  6. ప్రస్తుతం, దాదాపు 77,500 మంది సువార్తికులు ప్రపంచవ్యాప్తంగా 450 మిషన్లలో సేవ చేస్తున్నారు. ఇందులో యువ బోధనా సువార్తికులు, యువ సేవా సువార్తికులు మరియు సీనియర్ జంటలు ఉన్నారు, కానీ 27,800 మంది సీనియర్ సేవా సువార్తికులు మరియు దీర్ఘకాలిక వాలంటీర్లు లేరు. ప్రతి సువార్తికుని కథ, సిద్ధపాటు నుండి సేవచేయడం మరియు తిరిగి రావడం వరకు, వ్యక్తిగతమైనది మరియు వ్యక్తిగత అనుభవంలో ప్రభువుకు పరిశుద్ధతతో నిండి ఉంటుంది.

    అనేక మిషనరీ అనుభవాలు ఆధ్యాత్మిక నమూనాను ప్రతిబింబిస్తాయి. నిస్వార్థంగా ఆహ్వానించడం మరియు ఇతరులు యేసు క్రీస్తు వద్దకు రావడానికి సహాయం చేయడం మరియు సువార్తికుడు యేసు క్రీస్తు శిష్యుడిగా మారడం మరియు నా సువార్తను ప్రకటించండి సువార్తికుడు గురించి వ్యక్తిగత సాక్ష్యం ఇందులో ఉంది. నా సువార్తను ప్రకటించండి సువార్తికులు వారి సాక్ష్యపు అనుభవాల ద్వారా మార్చబడ్డారు, రూపాంతరం చెందారు. వారు వ్యక్తులు, ప్రదేశాలు, భాషలు మరియు సంస్కృతులను ప్రేమించడం నేర్చుకుంటారు. యేసు క్రీస్తు యొక్క పునఃస్థాపించబడిన సువార్త సంపూర్ణత యొక్క సువార్తమానములను జనములు, వంశములు మరియు ప్రజలకు తెలియజేయడం ద్వారా వారు ప్రవచనాన్ని నెరవేరుస్తున్నారు. వారు ప్రతి సహచరునిలో మంచిని కనుగొంటారు మరియు వారితో కలిసి జీవించడం నేర్చుకుంటారు. వారు అనేక పరిస్థితులు మరియు నేపథ్యాలలో సభ్యులు, నాయకులు మరియు స్నేహితులతో పని చేస్తారు, ఇంకా మరెన్నో.

    నా సువార్తను ప్రకటించండి సువార్తికులు విశ్వాసాన్ని, నమ్మకాన్ని పెంపొందించుకుంటారు. వారు పవిత్రమైన సహవాసాలను నెలకొల్పుతారు. విధేయత ఆశీర్వాదాలను మరియు అద్భుతాలను తెస్తుందని వారు నేర్చుకుంటారు. అనేక ఇతర వ్యక్తిగతీకరించబడిన మార్గాలలో, వారు నిజంగా ఇలా అవుతారు మరియు నిబంధన ద్వారా తెలుసుకుంటారు: “నేను దేవుని కుమారుడైన యేసు క్రీస్తు యొక్క శిష్యుడను” (3 నీఫై 5:13).

  7. అత్యంత విశ్వాసపాత్రులైన మరియు ధైర్యవంతులైన మన సంఘ సభ్యులలో కొందరు, సహోదరీలు మరియు సహోదరులు, వారు ఎన్నడూ ఊహించని మరియు ఎన్నడూ ఎన్నుకోలేని పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. తరచుగా యెహోవా కొరకు కనిపెట్టుకొనియుంటూ, ఈ నిజమైన పరిశుద్ధులు ప్రతీరోజు ముందుకు సాగుతారు. ప్రభువుకు ప్రతీ ఒక్కరి గురించి తెలుసు మరియు ఈ ఉదాహరణ సున్నితంగా పంచుకున్నట్లుగా, మనలో ప్రతి ఒక్కరినీ ఆయన సమయం మరియు విధానంలో ప్రోత్సహించాలని, బలోపేతం చేయాలని కోరుకుంటారు.

  8. తల్లిదండ్రులు మరియు పిల్లలతో సంబంధాల కోసం చాలా కోరిక ఉంది. అనేక సంవత్సరాల తర్వాత కూడా, సయోధ్య, క్షమాపణ మరియు నిబంధనకు చెందియుండడం అనేవి సృష్టించబడిన లేదా పునరుద్ధరించబడిన ప్రతీ పరిస్థితికి నేను చాలా కృతజ్ఞుడిని. ఈ మంచి సహోదరికి తన తండ్రి గురించి ఎవరూ నీచంగా ఆలోచించడం ఇష్టం లేదు. ఆమె ఇలా చెప్పింది, “ఆయన మంచి, నమ్మకమైన నాయకుడు మరియు మంచి తండ్రి.

  9. తల్లిదండ్రుల విరుద్ధ స్వభావాల మూలంగా, పిల్లలు వారు ఎలా పోషించబడతారు అనే దాని ద్వారా బాగా ప్రభావితం చేయబడతారు, అయినప్పటికీ వారు సాధారణంగా వారి తల్లులు అలసిపోకుండా, నిస్వార్థంగా తల్లిగా ఉన్న ప్రారంభ సంవత్సరాలను చాలా తక్కువగా గుర్తుంచుకుంటారు. నేను భర్తగా, తండ్రిగా మరియు తాతయ్యగా మారుతున్నప్పుడు నా తల్లిదండ్రుల పట్ల నా అవగాహన, ప్రేమ మరియు ప్రశంసలు విస్తరించాయి మరియు అధికమయ్యాయనే వాస్తవాన్ని వ్యక్తీకరించడానికి పదాలు సరిపోవు. సంతోష ప్రణాళిక యొక్క తరాల స్వభావాన్ని ప్రతిబింబిస్తూ, దేవాలయంలోని నిత్యత్వపు అద్దాలలో, మనల్ని మనం ఒక దిశలో తల్లిగా, అమ్మమ్మగా, ముత్తమ్మగా మరియు మరొక దిశలో కుమార్తెగా, మనవరాలిగా, ముని-మనవరాలిగా చూడవచ్చు.

  10. నేడు, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 60 శాతం మంది సంఘ సభ్యులు ప్రభువు యొక్క మందిరానికి 50 మైళ్ల (80 కి.మీ. లేదా చాలా ప్రదేశాలలో దాదాపు గంట ప్రయాణ సమయం) దూరం లోపల నివసిస్తున్నారు. రాబోయే సంవత్సరాల్లో, ప్రకటించబడిన దేవాలయాలు పూర్తయినప్పుడు, దాదాపు మూడొంతుల మంది సంఘ సభ్యులు ప్రభువు యొక్క మందిరం నుండి ఒక గంటలోపు దూరంలో నివసిస్తారు. పరిస్థితులను బట్టి, అది ఆయన పరిశుద్ధ మందిరంలో ప్రభువు వద్దకు తరచుగా వచ్చేంత దగ్గరగా ఉంటుంది, తద్వారా విలువైన కుటుంబ సభ్యుల తరాలను, మనల్ని మరియు మన తరాలను ఆశీర్వదిస్తుంది.

  11. మన దేవాలయాలపై, “ప్రభువుకు పరిశుద్ధత, ప్రభువు యొక్క మందిరము” అనే ప్రామాణిక శాసనం ఉంటుంది. కొన్ని దేవాలయాలలో ఈ శాసనంతో పాటు సంఘం పేరును జోడించడం కూడా ఉంటుంది. కొన్ని దేవాలయాలలో శిలాశాసనం తిరగేసి ఉంటుంది: “ప్రభువు యొక్క మందిరము, ప్రభువుకు పరిశుద్ధత” (అట్లాంటాలోని లాస్ ఏంజలస్ మరియు సంయుక్త రాష్ట్రాలలోని శాన్ డియేగోలో). లోగన్ దేవాలయ శాసనం కేవలం, “ప్రభువుకు పరిశుద్ధత” అని పేర్కొంటుంది.