2020–2024
కొద్ది సంవత్సరముల కాలములోనే
2024 అక్టోబరు సర్వసభ్య సమావేశము


16:16

కొద్ది సంవత్సరముల కాలములోనే

మనం విశ్వాసంతో మరియు విధేయతతో లేనట్లయితే, దేవుడు ఇచ్చిన సమృద్ధి యొక్క ఆశీర్వాదాన్ని మనల్ని దారిమళ్ళించే మరియు కలవరపెట్టే గర్వకారణమైన శాపంగా మనం మార్చవచ్చు.

నా ప్రియమైన సహోదర సహోదరీలారా, ఈ రోజు వేదికపై కూర్చొని, కోవిడ్ తర్వాత మొదటిసారిగా ఈ సమావేశ మందిరం మూడింతలు నిండడాన్ని నేను చూశాను. మీరు యేసు క్రీస్తుకు అంకితమైన శిష్యులు, నేర్చుకోవడానికి ఆతృత కలిగియున్నారు. మీ విశ్వసనీయతకు నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. మరియు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను.

ఎజ్రా టాఫ్ట్ బెన్సన్ 1985 నవంబరు నుండి 1994 మే వరకు యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘము యొక్క అధ్యక్షుడిగా పనిచేశారు. అధ్యక్షులు బెన్సన్ సంఘాధ్యక్షులైనప్పుడు నాకు 33 సంవత్సరాలు మరియు ఆయన మరణించినప్పుడు 42 సంవత్సరాలు. ఆయన బోధనలు మరియు సాక్ష్యం నన్ను లోతైన మరియు శక్తివంతమైన మార్గాల్లో ప్రభావితం చేసాయి.

అధ్యక్షులు బెన్సన్ గారి పరిచర్య యొక్క ముఖ్యాంశాలలో ఒకటి, మోర్మన్ గ్రంథము యొక్క ఉద్దేశ్యం మరియు ప్రాముఖ్యతపై ఆయన దృష్టి పెట్టడం. మోర్మన్ గ్రంథము “మన మతము యొక్క ప్రధాన రాయి—మన సాక్ష్యం యొక్క ప్రధాన రాయి, మన సిద్ధాంతం యొక్క ప్రధాన రాయి, మన ప్రభువు మరియు రక్షకుని గురించిన సాక్ష్యంలో ప్రధాన రాయి” అని ఆయన పదేపదే నొక్కి చెప్పారు. యేసు క్రీస్తు యొక్క ఈ కడవరి-దిన నిబంధనలో కనిపించే గర్వం అనే పాపం గురించిన బోధనలు మరియు హెచ్చరికలను కూడా ఆయన తరచుగా నొక్కి చెప్పారు.

అధ్యక్షులు బెన్సన్ గారు చేసిన ఒక నిర్దిష్ట బోధన నన్ను బాగా ప్రభావితం చేసింది మరియు మోర్మన్ గ్రంథము గురించి నా అధ్యయనాన్ని ప్రభావితం చేస్తూనే ఉంది. ఆయన ఇలా చెప్పారు:

“మోర్మన్ గ్రంథము … మన కాలము కొరకు వ్రాయబడింది. నీఫైయులు ఈ గ్రంథాన్ని ఎప్పుడూ కలిగిలేరు; ప్రాచీన కాలానికి చెందిన లేమనీయులు కూడా కలిగిలేరు. ఇది మన కోసం ఉద్దేశించబడింది. మోర్మన్ నీఫైయుల నాగరికత యొక్క ముగింపులో వ్రాసాడు. ఆది నుండి అన్ని విషయాలను చూసే దేవుని ప్రేరేపణతో, [మోర్మన్] మనకు బాగా సహాయపడగల కథలు, ప్రసంగాలు మరియు సంఘటనలను ఎంచుకుంటూ శతాబ్దాల గ్రంథాలను సంక్షిప్తీకరించాడు.”

అధ్యక్షులు బెన్సన్ ఇలా కొనసాగించారు: “మోర్మన్ గ్రంథము యొక్క ప్రధాన రచయితలలో ప్రతి ఒక్కరూ భవిష్యత్ తరాల కోసం వ్రాసినట్లు సాక్ష్యమిచ్చారు. … వారు మన కాలాన్ని చూసి, మనకు అత్యంత విలువైనవాటిని ఎంచుకుంటే, మనం మోర్మన్ గ్రంథాన్ని ఏవిధంగా అధ్యయనం చేయాలి? నిరంతరం మనల్ని మనం ఇలా ప్రశ్నించుకోవాలి, ‘[ఈ వృత్తాంతమును] తన గ్రంథములో చేర్చమని ప్రభువు మోర్మన్‌ను ఎందుకు ప్రేరేపించారు? ఈ రోజు మరియు ఈ యుగంలో జీవించడానికి నాకు సహాయపడేలా [ఈ ఉపదేశం] నుండి నేను ఏ పాఠం నేర్చుకోవచ్చు?’”

మోర్మన్ గ్రంథము అనేది ప్రాథమికంగా గతాన్ని చూసే చారిత్రక గ్రంథము కాదని అర్థం చేసుకోవడానికి అధ్యక్షులు బెన్సన్ యొక్క వ్యాఖ్యానాలు మనకు సహాయం చేస్తాయి. బదులుగా, ఈ లేఖనాల సంపుటి భవిష్యత్తుకు సంబంధించినది, మన కాలంలోని పరిస్థితులు మరియు సవాళ్ళ కోసం ఉద్దేశించిన ముఖ్యమైన సూత్రాలు, హెచ్చరికలు మరియు పాఠాలను కలిగియుంది. కాబట్టి, మోర్మన్ గ్రంథము అనేది మన భవిష్యత్తు గురించిన, మనం ఇప్పుడు జీవిస్తున్న మరియు ఇంకా జీవించబోయే కాలాల గురించిన గ్రంథము.

మోర్మన్ గ్రంథములోని హీలమన్ గ్రంథము నుండి ఈ రోజు మనకు సంబంధించిన పాఠాలను పరిగణిస్తున్నందున నేను పరిశుద్ధాత్మ సహాయం కోసం ప్రార్థిస్తున్నాను.

నీఫైయులు మరియు లేమనీయులు

హీలమన్ మరియు అతని కుమారుల గ్రంథము యేసు క్రీస్తు పుట్టుక కొరకు ఎదురుచూసిన జనులను వర్ణిస్తుంది. లేఖన గ్రంథములో వివరించబడిన అర్థ శతాబ్దము, లేమనీయుల పరివర్తనను, నీతిని మరియు నీఫైయు‌ల దుష్టత్వం, విశ్వాసభ్రష్టత్వం మరియు హేయక్రియలను ఎత్తి చూపుతుంది.

ఈ ప్రాచీన గ్రంథము నుండి నీఫైయు‌లు మరియు లేమనీయు‌ల మధ్య పోలికలు, వైరుధ్యాల శ్రేణి నేడు మనకు చాలా బోధనాత్మకంగా ఉంది.

“లేమనీయులలో అధిక భాగము నీతిమంతులైన జనులైరి, ఎంతగాననగా విశ్వాసమందు వారి దృఢత్వము మరియు నిలకడను బట్టి, వారి నీతి నీఫైయుల నీతిని మించెను.

“[మరియు] నీఫైయులలో అనేకులు కఠినపరచబడి, పశ్చాత్తాపపడక మిక్కిలి దుష్టులైయుండిరి, ఎంతగాననగా వారు దేవుని వాక్యమును, వారి మధ్య వచ్చిన సమస్త బోధను, ప్రవచనమును తిరస్కరించిరి.”

“ఆ విధముగా నీఫైయులు విశ్వాసమందు క్షీణించి, దుష్టత్వమందు, హేయక్రియలందు వృద్ధిచెందుచుండగా, లేమనీయులు వారి దేవుని జ్ఞానమందు మిక్కిలిగా ఎదగనారంభించిరని మనము చూచుచున్నాము; వారు ఆయన చట్టములను, ఆజ్ఞలను పాటించి, ఆయన యెదుట సత్యమందు, నీతియందు నడవనారంభించిరి.

“ఆ విధముగా వారి దుష్టత్వము మరియు హృదయకాఠిన్యమును బట్టి, ప్రభువు యొక్క ఆత్మ నీఫైయుల నుండి ఉపసంహరించుకొనుట మొదలుపెట్టెనని మనము చూచుచున్నాము.

“ఆ విధముగా ఆయన మాటలను సులువుగా విశ్వసించుటకు వారి సమ్మతిని బట్టి, ప్రభువు లేమనీయులపై తన ఆత్మను క్రుమ్మరించుట మొదలుపెట్టెనని మనము చూచుచున్నాము.”

బహుశా నీఫైయులు విశ్వాసభ్రష్టత్వంలో క్షీణించడం యొక్క అత్యంత ఘోరమైన మరియు గంభీరమైన అంశం ఏమిటంటే, “కొద్ది సంవత్సరముల కాలములోనే ఈ దుర్ణీతులన్నియు వారిపై రావడం.”

నీఫైయులు దేవుని నుండి దూరమయ్యారు

ఒకప్పుడు నీతిమంతులైన వారు ఇంత తక్కువ సమయంలో ఎలా కఠినంగా మరియు దుర్మార్గులుగా మారగలరు? తమను సమృద్ధిగా ఆశీర్వదించిన దేవుడిని జనులు ఇంత త్వరగా ఎలా మరచిపోగలరు?

శక్తివంతమైన మరియు గంభీరమైన విధానంలో, నీఫైయు‌ల యొక్క ప్రతికూల ఉదాహరణ నేడు మనకు బోధనాత్మకమైనది.

“గర్వము … దేవుని సంఘమునకు చెందినట్టు చెప్పుకొనిన జనుల హృదయములలోనికి ప్రవేశించనారంభించింది … ఈ గర్వము వారి అత్యధిక సంపదలు మరియు దేశమందు వారి అభివృద్ధి మూలముగా కలిగింది.”

“[వారు] [వారి] హృదయములను సంపదలపై, ఈ లోకము యొక్క వ్యర్థమైన వస్తువులపై ఉంచియున్నారు,” “[వారి] హృదయములలోనికి ప్రవేశించుటకు [వారు] అనుమతించిన ఆ గర్వమును బట్టి … [వారి] అమితమైన సంపదలను బట్టి, మంచిదైన దాని నుండి దూరముగా అది [వారిని] కొనిపోయినది!

ఈరోజు ఈ శాశ్వత పాఠాన్ని నేర్చుకోమని ప్రాచీన స్వరాలు ధూళిలో నుండి మనకు మొరపెడుతున్నాయి: సమృద్ధి, ఆస్తులు మరియు సౌలభ్యం అనేవి నీతిమంతులను కూడా ఆధ్యాత్మికతను దెబ్బతీసే గర్వానికి నడిపించే శక్తివంతమైన మిశ్రమాలు.

గర్వాన్ని మన హృదయాల్లోకి ప్రవేశించడానికి అనుమతించడం అనేది పవిత్రమైన దానిని మనం అపహాస్యం చేసేలా చేయవచ్చు, ప్రవచనం మరియు బయల్పాటు యొక్క ఆత్మను సంశయించేలా చేయవచ్చు, దేవుని ఆజ్ఞలను మన పాదాల క్రింద త్రొక్కివేసేలా చేయవచ్చు, దేవుని వాక్యాన్ని నిరాకరించేలా చేయవచ్చు, ప్రవక్తలను బయటకు గెంటివేసి, గేలిచేసి, వారికి వ్యతిరేకంగా దూషించేలా చేయవచ్చు, మన దేవుడైన ప్రభువును మరచిపోయేలా చేయవచ్చు, మరియు “[మనలను] సృష్టించిన [మన] దేవుడైన ప్రభువు [మనలను] పరిపాలించి, ఏలవలెనని కోరుకోకుండా ఉండేలా చేయవచ్చు.”

కాబట్టి, మనం విశ్వాసంతో మరియు విధేయతతో లేనట్లయితే, దేవుడు ఇచ్చిన సమృద్ధి యొక్క ఆశీర్వాదాన్ని మనం నిత్య సత్యాలు మరియు ముఖ్యమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యతల నుండి మనల్ని మళ్ళించే మరియు దూరం చేసే గర్వకారణమైన శాపంగా మార్చవచ్చు. గర్వంతో ప్రేరేపించబడిన మరియు అతిశయోక్తితో కూడిన స్వీయ-ప్రాముఖ్యత, మన స్వంత స్వీయ-సమృద్ధిని తప్పుగా లెక్కించడం మరియు ఇతరులకు సేవ చేయడానికి బదులుగా మన కోరికలకు విలువివ్వడం వంటి వాటి నుండి మనం ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలి.

మనం గర్వంతో మనపై దృష్టి పెడుతున్నప్పుడు, ఆధ్యాత్మిక అంధత్వంతో కూడా మనం బాధపడతాము, మనలో మరియు మన చుట్టూ జరుగుతున్న చాలావాటిని, అనేకమును లేదా బహుశా అన్నింటిని కోల్పోతాము. మనం కేవలం మనపైనే దృష్టిపెడితే, యేసు క్రీస్తును “గురి”లాగా చూడలేము, ఆయనపై దృష్టి పెట్టలేము.

అటువంటి ఆధ్యాత్మిక అంధత్వం మనల్ని నీతిమార్గం నుండి తొలగిపోయేలా చేస్తుంది, నిషేధింపబడిన దారులలోపడి నశించిపోయేలా కూడా చేస్తుంది. మనం గ్రుడ్డిగా “[మన] స్వంత మార్గములకు” తిరిగి, విధ్వంసకర వక్రమార్గాలను అనుసరిస్తున్నప్పుడు, మనం మన స్వబుద్ధిని ఆధారము చేసుకుంటాము, స్వశక్తి యందు అతిశయిస్తాము, మరియు మన స్వంత జ్ఞానంపై ఆధారపడతాము.

లేమనీయుడైన సమూయేలు నీఫైయుల ద్వారా దేవుని నుండి వైదొలగడాన్ని క్లుప్తంగా ఇలా చెప్పాడు: “మీరు సంపాదించలేని దాని కొరకు మీ జీవితకాలమంతయూ మీరు వెదికిరి; దుర్నీతిని జరిగించుటలో మీరు సంతోషమును వెదికిరి, అది మన గొప్ప మరియు నిత్య అధిపతియందున్న నీతి స్వభావమునకు వ్యతిరేకమైయున్నది.”

“జనులలో అధికభాగము వారి గర్వము మరియు దుర్మార్గమందు [నిలిచియుండి], తక్కువ భాగము దేవుని యెదుట అతి జాగ్రత్తతో [నడుచుచున్నారు]” అని మోర్మన్ గమనించాడు.

లేమనీయులు దేవుని వైపు తిరిగారు

హీలమన్‌ గ్రంథములో, పెరుగుతున్న లేమనీయు‌ల నీతి నీఫైయు‌ల యొక్క వేగవంతమైన ఆధ్యాత్మిక క్షీణతకు పూర్తి విరుద్ధతను అందిస్తుంది.

పరిశుద్ధ లేఖనాలు మరియు ప్రవక్తల బోధనలను విశ్వసించడం, ప్రభువైన యేసు క్రీస్తుపై విశ్వాసాన్ని సాధన చేయడం, వారి పాపాల కొరకు పశ్చాత్తాపపడడం మరియు హృదయమందు బలమైన మార్పును అనుభవించడం ద్వారా లేమనీయులు దేవుని వైపు తిరిగి, సత్యం యొక్క జ్ఞానానికి తీసుకురాబడ్డారు.

“కావున ఎంతమంది ఈ జ్ఞానమునకు వచ్చిరో వారందరు విశ్వాసమందు మరియు వారు స్వతంత్రులుగా చేయబడిన ఆ విషయమందు దృఢముగాను, నిలకడగాను ఉన్నారని మీకు మీరే ఎరుగుదురు.”

“[లేమనీయులలో] అధికభాగము వారి కర్తవ్యపు బాటలో ఉన్నారు, దేవుని యెదుట జాగ్రత్తగా నడుచుచున్నారు మరియు ఆయన ఆజ్ఞలు, కట్టడలు, తీర్పులను పాటించుచున్నారని మీరు చూడవలెను. …

“… వారి సహోదరులలో మిగిలిన వారిని సత్యము యొక్క జ్ఞానమునకు తేగలుగునట్లు అలసిపోకుండా శ్రద్ధతో వారు పాటుపడుచున్నారు.”

ఫలితంగా, “విశ్వాసమందు వారి దృఢత్వము మరియు నిలకడను బట్టి, [లేమనీయుల] నీతి నీఫైయుల నీతిని మించెను.”

ఒక హెచ్చరిక మరియు ఒక వాగ్దానము

మొరోనై ఇలా ప్రకటించాడు: “ఇదిగో, ఈ విషయములు మీ మధ్యకు వచ్చు ఆ దినమున, త్వరలో రానున్న దానికి సంబంధించిన గొప్ప ఆశ్చర్యకరమైన విషయములను ప్రభువు నాకు చూపియున్నాడు.

“మీరు ఇక్కడున్నట్లుగా నేను మీతో మాట్లాడుచున్నాను, కానీ మీరింకను ఇక్కడ లేరు. ఇదిగో, యేసు క్రీస్తు మిమ్ములను నాకు చూపియున్నాడు మరియు మీ క్రియలను నేనెరుగుదును.”

మోర్మన్ గ్రంథము భవిష్యత్తుకు సంబంధించినదని, మన కాలంలోని పరిస్థితులు మరియు సవాళ్ళలో నా కోసం, మీ కోసం ఉద్దేశించబడిన ముఖ్య సూత్రాలు, హెచ్చరికలు మరియు పాఠాలను కలిగియుందని దయచేసి గుర్తుంచుకోండి.

విశ్వాసభ్రష్టత్వం రెండు ప్రాథమిక స్థాయిలలో సంభవించవచ్చు—సంస్థాగత స్థాయి మరియు వ్యక్తిగత స్థాయి. సంస్థాగత స్థాయిలో, విశ్వాసభ్రష్టత్వం మూలంగా యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘము నష్టపోదు లేదా భూమి నుండి తీసివేయబడదు.

ప్రవక్త జోసెఫ్ స్మిత్ ఇలా ప్రకటించారు: “సత్యము యొక్క ధ్వజము పైకెత్తబడింది; అపవిత్రమైన ఏ చెయ్యి ఈ పని పురోగమించకుండా ఆపలేదు; … దేవుని సత్యము ప్రతి ఖండములోనికి చొచ్చుకుపోయే వరకు, ప్రతి వాతావరణాన్ని సందర్శించే వరకు, ప్రతి దేశాన్ని తుడిచిపెట్టి, ప్రతి చెవిలో వినిపించే వరకు, దేవుని ఉద్దేశ్యాలు నెరవేరే వరకు మరియు గొప్ప యెహోవా ఆ పని పూర్తయిందని చెప్పేవరకు ధైర్యంగా, ఘనంగా, స్వతంత్రంగా ముందుకు సాగుతుంది.”

వ్యక్తిగత స్థాయిలో, మనలో ప్రతి ఒక్కరూ తప్పకుండా “[మనం] ప్రాచీన నీఫైయుల వలే మారకుండా గర్వమును గూర్చి జాగ్రత్తపడాలి.”

మీరు లేదా నేను గర్వం యొక్క అహంకారాన్ని నివారించడానికి తగినంత బలంగా మరియు దృఢంగా ఉన్నామని విశ్వసిస్తే, బహుశా మనం ఇప్పటికే ఈ ప్రాణాంతక ఆధ్యాత్మిక వ్యాధితో బాధపడుతున్నామని నేను సూచిస్తున్నాను. సరళంగా చెప్పాలంటే, మీరు లేదా నేను గర్వంతో మరియు గర్వం చేత బాధపడవచ్చని నమ్మకపోతే, మనం దుర్బలంగా, ఆధ్యాత్మిక ప్రమాదంలో ఉన్నాము. కొద్ది రోజులు, వారాలు, నెలలు లేదా సంవత్సరాల వ్యవధిలోనే, మనం మన ఆత్మీయ జన్మహక్కును చాలా తక్కువ ధరకు పోగొట్టుకోవచ్చు.

అయినప్పటికీ, మీరు లేదా నేను గర్వంతో మరియు గర్వం చేత బాధపడవచ్చని నమ్మినట్లయితే, మనల్ని కాపాడి, “చిన్నపిల్లవాని వలె విధేయుడై, సాత్వికుడై, వినయము మరియు సహనము కలిగి ప్రేమతో నిండి, [మన]పై విధించుటకు తగినవని ప్రభువు చూచు విషయములన్నిటికి లోబడుటకు ఇష్టపడు వాని వలె అయ్యేందుకు” మనకు సహాయపడే చిన్న మరియు సాధారణమైన విషయములను మనం స్థిరంగా చేస్తాము. “తగ్గించబడుటకు బలవంతము చేయబడకుండా తమనుతాము తగ్గించుకొను వారు ధన్యులు.”

మనము అధ్యక్షులు బెన్సన్ గారి సలహాను అనుసరించి, హీలమన్ గ్రంథము యొక్క సంక్షిప్తీకరణలో అతను చేర్చిన వృత్తాంతాలు, ఉపదేశాలు మరియు హెచ్చరికలను చేర్చమని ప్రభువు మోర్మన్‌ను ఎందుకు ప్రేరేపించారు అని మనల్ని మనం ప్రశ్నించుకున్నప్పుడు, ఈ రోజు మన వ్యక్తిగత జీవితాలు మరియు కుటుంబాల యొక్క నిర్దిష్ట పరిస్థితులకు ఈ బోధనల అన్వయాన్ని మనం గుర్తిస్తామని నేను హామీ ఇస్తున్నాను. మనం ఈ ప్రేరేపిత గ్రంథాన్ని అధ్యయనం చేస్తున్నప్పుడు మరియు ధ్యానిస్తున్నప్పుడు, “[మనము] శోధనలో ప్రవేశించకుండునట్లు గర్వమును గూర్చి జాగ్రత్తపడేందుకు” మనం నేర్చుకోవలసిన పాఠాలను చూడడానికి కళ్ళు, వినడానికి చెవులు, గ్రహించడానికి మనస్సులు మరియు అర్థం చేసుకునే హృదయాలతో మనం ఆశీర్వదించబడతాము.

నిత్య తండ్రియైన దేవుడు మన తండ్రియని నేను ఆనందంగా సాక్ష్యమిస్తున్నాను. యేసు క్రీస్తు ఆయన అద్వితీయ మరియు ప్రియ కుమారుడు. ఆయనే మన రక్షకుడు. మనము ప్రభువు ఆత్మ యొక్క సాత్వికములో నడిచినప్పుడు, మనము గర్వమును తప్పించుకుంటాము, అధిగమిస్తాము మరియు ఆయన యందు శాంతిని కలిగియుంటాము అని నేను సాక్ష్యమిస్తున్నాను. ఆవిధంగా నేను ప్రభువైన యేసు క్రీస్తు యొక్క పవిత్ర నామములో సాక్ష్యమిస్తున్నాను, ఆమేన్.