గాలి వీచుటను ఎన్నడూ మానలేదు
దేవుని దీవెనలు పొందేందుకు వారి ప్రయాణంలో ఇతరులు పురోగమించడానికి మనం సహాయపడగలము.
2015లో, బ్రెజిల్‌లోని పెర్నాంబుకో రాష్ట్రంలో, జె. రూబెన్ క్లార్క్ లా సొసైటీకి చెందిన 62 మంది సభ్యులు నాలుగు వేర్వేరు నర్సింగ్‌హోమ్‌లలో నివసిస్తున్న వారి చట్టపరమైన సవాళ్లను పరిశోధించడంలో రాష్ట్ర విచారణకర్త కార్యాలయంతో సహకరించారు. ఒక శనివారం ఐదు గంటల పాటు, ఈ న్యాయవాదులు 200 మంది నివాసితులను ఒక్కొక్కరిని ఇంటర్వ్యూ చేశారు, వీరిలో ప్రతి ఒక్కరూ సమాజం చేత మరచిపోబడ్డారు.
వారి ఇంటర్వ్యూల సమయంలో, వృద్ధ నివాసితులపై జరిగిన వదిలివేయడం, సరిగ్గా ఆదరించకపోవడం మరియు నిధుల దుర్వినియోగం వంటి అనేక నేరాలను వారు కనుగొన్నారు. ఈ లా సొసైటీలో ముఖ్యమైన భాగం బీదలను మరియు అవసరతలో ఉన్నవారిని ఆదుకోవడం. కేవలం రెండు నెలల తర్వాత, బాధ్యులైన వారిపై విచారణకర్త విజయవంతంగా అభియోగాలు మోపారు.
వారి సహాయం, “మీ తోటి ప్రాణుల సేవలో మీరున్న యెడల, మీరు మీ దేవుని సేవలోనే ఉన్నారు” అనే రాజైన బెంజమిన్ బోధనకు సరైన ఉదాహరణ.
ప్రో బోనో [చెల్లింపు లేకుండా] ప్రాజెక్ట్ సమయంలో నేను వ్యక్తిగతంగా ఇంటర్వ్యూ చేసిన ఒక నివాసి లూసియా అనే దయగల 93 ఏళ్ళ మహిళ. మా సేవకు కృతజ్ఞతతో, ఆమె సరదాగా “నన్ను పెళ్ళి చేసుకో!” అని గట్టిగా అరిచింది.
ఆశ్చర్యంతో, నేను ఇలా జవాబిచ్చాను: “అక్కడ ఆ అందమైన యువతిని చూడండి! ఆమె నా భార్య మరియు రాష్ట్ర విచారణకర్త.”
ఆమె వెంటనే తిరిగి జవాబిచ్చింది: “అయితే ఏంటి? ఆమె యవ్వనంగా ఉంది, అందంగా ఉంది, సులభంగా మళ్ళీ పెళ్ళి చేసుకోగలదు. నాకున్నది నువ్వే!”
అద్భుతమైన నివాసితులకు వారి సమస్యలు అన్నీ ఆ రోజు పరిష్కారం కాలేదు. వాగ్దాన దేశానికి సవాలుతో కూడిన ప్రయాణంలో తమ పడవలలో ఉన్న జెరెడీయులు, “వారిపైన విరచుకుపడిన పర్వతముల వంటి అలల వలన సముద్రపు లోతులలో సమాధి చేయబడినట్లే,” వారు నిస్సందేహంగా అప్పుడప్పుడు కష్టాలను అనుభవిస్తూనే ఉన్నారు.
కానీ సమాజం చేత వారు మరచిపోబడడంతో సంబంధం లేకుండా, ప్రేమగల పరలోక తండ్రికి వారు వ్యక్తిగతంగా తెలుసని, వారి అతిసాధారణ ప్రార్థనలకు కూడా ఆయన ప్రతిస్పందిస్తారని ఆ శనివారంనాడు నర్సింగ్‌హోమ్ నివాసితులు తెలుసుకున్నారు.
వాగ్దానం చేయబడిన దీవెనల వైపు జెరెడీయులు కొట్టుకొనిపోయేలా దేవుడు “ప్రచండమైన గాలి” వీచేలా చేసారు. అదేవిధంగా, ప్రభువు చేతిలో వినయపూర్వకమైన గాలిలా పనిచేయాలని మనం నిర్ణయించుకోవచ్చు. వాగ్దాన దేశం వైపు జెరెడీయులు కొట్టుకొనిపోయేలా “గాలి వీచుటను ఎన్నడూ మానలేదు,” అలాగే దేవుని ఆశీర్వాదాలను పొందేందుకు ఇతరులు వారి ప్రయాణంలో పురోగతి సాధించేలా మనం సహాయం చేయగలము.
చాలా సంవత్సరాల క్రితం, నన్ను బిషప్పుగా పిలవడం కోసం నా ప్రియమైన భార్య క్రిస్ మరియు నేను ఇంటర్వ్యూ చేయబడినప్పుడు, సలహాదారులుగా సిఫార్సు చేయడానికి ప్రార్థనాపూర్వకంగా పేర్లను పరిగణించమని మా స్టేకు అధ్యక్షుడు నన్ను కోరారు. నేను సిఫార్సు చేసిన పేర్లు విన్న తర్వాత, ఒక సహోదరుడి గురించి నేను కొన్ని విషయాలు తెలుసుకోవాలని ఆయన చెప్పారు.
మొదటిది, ఈ సహోదరుడు చదవలేడు. రెండవది, సభ్యులను సందర్శించడానికి ఉపయోగించగలిగేలా అతని దగ్గర కారు లేదు. మూడవది, అతను ఎప్పుడూ—ఎల్లప్పుడు—సంఘములో చలువ కళ్ళద్దాలు ధరించేవాడు. అధ్యక్షునికి నిజాయితీగల చింతలు ఉన్నప్పటికీ, నేను ఇంకా అతడినే నా సలహాదారుగా సిఫార్సు చేయాలని బలంగా భావించాను మరియు స్టేకు అధ్యక్షుడు నాకు మద్దతిచ్చారు.
ఆదివారం నా సలహాదారులు మరియు నేను సంస్కార సమావేశంలో ఆమోదించబడినప్పుడు, సభ్యుల ముఖాల్లో ఆశ్చర్యం స్పష్టంగా కనిపించింది. ఈ ప్రియమైన సహోదరుడు మెల్లగా వేదిక పైకి చేరుకున్నాడు, అక్కడ అతడి చలువ కళ్ళద్దాలలో పైనున్న లైట్లు ప్రకాశవంతంగా ప్రతిబింబించాయి.
అతడు నా పక్కన కూర్చున్నప్పుడు, నేను అతడిని అడిగాను, “సోదరా, మీ కంటిచూపులో ఏదైనా సమస్య ఉందా?”
“లేదు,” అన్నాడతడు.
“మరి మీరు సంఘములో చలువ కళ్ళద్దాలు ఎందుకు ఉపయోగిస్తున్నారు?” అని నేను అడిగాను. “నా మిత్రమా, సభ్యులు మీ కళ్ళను చూడాలి, మీరు కూడా వారిని బాగా చూడగలగాలి.”
ఆ క్షణంలో, అతడు తన చలువ కళ్ళద్దాలు తీసివేసాడు మరియు సంఘములో మళ్ళీ ఎప్పుడూ ఉపయోగించలేదు.
ఈ ప్రియమైన సహోదరుడు నేను బిషప్పుగా విడుదలయ్యే వరకు నాతో పాటు పనిచేశాడు. నేటికీ అతడు సంఘములో నమ్మకంగా సేవ చేస్తూనే ఉన్నాడు మరియు ప్రభువైన యేసు క్రీస్తు పట్ల అంకితభావానికి, నిబద్ధతకు ఒక ఉదాహరణగా ఉన్నాడు. అయినప్పటికీ, కొన్ని సంవత్సరాల క్రితం, అతడు చలువ కళ్ళద్దాలు ధరించి కూర్చున్న ఒక అనామకుడు, ప్రార్థనా మందిరం యొక్క ఆసనాలలో తప్పనిసరిగా మరచిపోబడినవాడు. “ఎంతమంది నమ్మకమైన సహోదర సహోదరీలు నేడు మన మధ్య మరచిపోబడి కూర్చున్నారు?” అని నేను తరచూ ఆశ్చర్యపోతాను.
మనం సుప్రసిద్ధులమైనా లేదా మరచిపోబడినా, మనలో ప్రతీ ఒక్కరికి కష్టాలు అనివార్యంగా వస్తాయి. మనము రక్షకుని వైపు తిరిగినప్పుడు, ఆయన “[మన] బాధలను [మన] ప్రయోజనం కొరకు ప్రతిష్టించగలరు” మరియు మన ఆధ్యాత్మిక పురోగతిని సులభతరం చేసే విధంగా మన కష్టాలకు ప్రతిస్పందించడానికి మనకు సహాయం చేయగలరు. నర్సింగ్‌హోమ్‌లో నివసించే వారు, తప్పుగా అంచనా వేయబడిన సంఘ సభ్యుడు లేదా మరెవరి కోసమైనా సరే, మనం నిరీక్షణను తీసుకువస్తూ, నిబంధన మార్గానికి ఇతరులను నడిపిస్తూ “వీచుటను ఎన్నడూ మానని గాలి” వలె కాగలము.
మన ప్రియమైన ప్రవక్త, అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్, యువతకు ఉత్తేజకరమైన మరియు స్ఫూర్తిదాయకమైన ఆహ్వానాన్ని అందించారు: “యోగ్యుడైన, సమర్థుడైన ప్రతీ యువకుడు సువార్తసేవ కోసం సిద్ధపడి, సేవ చేయాలని ప్రభువు కోరారని ఈ రోజు నేను బలంగా ధృవీకరిస్తున్నాను. కడవరి-దిన పరిశుద్ధ యువకులకు, సువార్త సేవ అనేది ఒక యాజకత్వ బాధ్యత. … యౌవనులు మరియు సమర్థులైన సహోదరీలారా, మీకు సువార్తసేవ అనేది శక్తివంతమైనదే, కానీ ఐచ్ఛికమైన అవకాశం.”
ప్రతిరోజూ, వేలాదిమంది యువతీ యువకులు సువార్తికులుగా సేవ చేయడం ద్వారా ప్రభువు యొక్క ప్రవచనాత్మక పిలుపుకు జవాబిస్తున్నారు. మీరు తెలివైనవారు మరియు అధ్యక్షులు నెల్సన్ చెప్పినట్లుగా, మీరు “లోకముపై ముందు తరము కంటె ఎక్కువ ప్రభావాన్ని కలిగియుండగలరు!” అయితే, మీరు సువార్తికుల శిక్షణా కేంద్రంలో అడుగుపెట్టిన క్షణంలోనే మీకైమీరు అన్నీ తెలిసినవారు అవుతారని దీని అర్థం కాదు.
బదులుగా, మీరు నీఫైలా భావించవచ్చు, “[మీరు] చేయవలసిన కార్యములను ముందుగా ఎరుగనివారై ఆత్మ చేత నడిపించబడతారు. అయినప్పటికీ, [మీరు] ముందుకు సాగుతారు.”
బహుశా మీరు యిర్మీయాలా అభద్రతగా భావించి, “నేను బాలుడనే: మాటలాడుటకు నాకు శక్తి చాలదు” అని చెప్పాలనుకోవచ్చు.
మీరు మీ వ్యక్తిగత లోపాలను చూసి మోషేలా కేకలు వేయాలని కూడా అనుకోవచ్చు: “ప్రభువా, నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడను.”
ప్రియమైన మరియు బలవంతులైన యువతీ యువకులైన మీలో ఎవరికైనా ఇప్పుడు ఇలాంటి ఆలోచన ఉంటే, “నేను బాలుడననవద్దు; నేను నిన్ను పంపువారందరి యొద్దకు నీవు పోవలెను,” అని ప్రభువు సమాధానం చెప్పారని గుర్తుంచుకోండి. “కాబట్టి వెళ్లుము, నేను నీ నోటికి తోడైయుండి, నీవు ఏమి పలుకవలసినది నీకు బోధించెదనని” ఆయన వాగ్దానం చేసారు.
అనుదిన పశ్చాత్తాపము, విశ్వాసము, ఖచ్చితమైన విధేయత మరియు కష్టపడి పనిచేయడం ద్వారా సువార్తసేవ క్షేత్రంలో యేసు క్రీస్తును సేవించడానికి, “నిరంతరము కనుగొని, పశ్చాత్తాపమును బోధించి, మార్పుచెందిన వారికి బాప్తిస్మమివ్వడానికి” మీరు తీవ్రంగా ప్రయత్నించినప్పుడు, మీ సహజత్వం నుండి ఆధ్యాత్మికంగా మీరు రూపాంతరం చెందడమనేది “ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రముగా” సంభవిస్తుంది.
మీరు పేరు చీటీని ధరించినప్పటికీ, కొన్నిసార్లు మీరు గుర్తించబడనట్లు లేదా మరచిపోబడినట్లు అనిపించవచ్చు. అయితే, మీకు పరిపూర్ణమైన పరలోక తండ్రి ఉన్నారని, ఆయన మిమ్మల్ని వ్యక్తిగతంగా ఎరిగియున్నారని మరియు మిమ్మల్ని ప్రేమించే రక్షకుడు ఉన్నారని మీరు తప్పక తెలుసుకోవాలి. వారిలో లోపాలు ఉన్నప్పటికీ, మీ వ్యక్తిగత పరివర్తన ప్రయాణంలో మీకు మార్గనిర్దేశం చేయడంలో “వీచుటను ఎన్నడూ మానని గాలి” వలె మీకు సేవ చేసే మిషను నాయకులు ఉంటారు.
మీ మిషనులో మీరు “పాలు తేనెలు ప్రవహించు దేశము”లో సేవ చేస్తారు, మీరు ఆధ్యాత్మికంగా పునర్జన్మ పొందుతారు మరియు మీరు యేసు క్రీస్తుకు దగ్గరగా వచ్చినప్పుడు ఆయన యొక్క జీవితకాలపు శిష్యులు అవుతారు. మీరు ఎన్నడూ మరచిపోబడలేదని మీరు తెలుసుకుంటారు.
కొంతమంది ఉపశమనం కోసం “బహుకాలము” వేచియున్నప్పటికీ, వారికి ఇంకా సహాయం చేయడానికి “ఎవడును లేనప్పటికీ”, ఏ ఒక్కరూ ఆయన చేత ఎన్నడూ మరచిపోబడలేదని ప్రభువైన యేసు క్రీస్తు మనకు బోధించారు. దానికి విరుద్ధంగా, ఆయన మర్త్య పరిచర్యలో ప్రతీ క్షణం ఆ ఒక్కరిని వెదకడంలో ఆయన పరిపూర్ణమైన మాదిరి.
మనలో ప్రతి ఒక్కరూ—మరియు మన చుట్టూ ఉన్నవారు,—మన స్వంత శ్రమలను మరియు ప్రతిరోజూ మనల్ని ముంచెత్తే కష్టాల అలలను ఎదుర్కొంటారు. కానీ “గాలి వాగ్దానదేశము వైపు వీచుటను ఎన్నడూ మాన[లేదు] … ; ఆ విధముగా [మనము] గాలి యెదుట ముందుకు కొట్టుకొనిపోబడతాము.”
మనలో ప్రతి ఒక్కరూ ఈ గాలిలో—జెరెడీయులను వారి ప్రయాణంలో ఆశీర్వదించిన గాలి మరియు గుర్తించబడని వారు, మరచిపోబడిన వారు మన సహాయంతో తమ స్వంత వాగ్దాన దేశాలకు చేరుకొనేలా ఆశీర్వదించే గాలిలో భాగం కావచ్చు.
యేసు క్రీస్తు తండ్రితో మన న్యాయవాది అని నేను సాక్ష్యమిస్తున్నాను. ఆయన జీవించియున్న దేవుడు మరియు మనల్ని నిబంధన మార్గము వెంబడి ఎల్లప్పుడు నడిపించే బలమైన గాలిగా పనిచేస్తారు. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.