2020–2024
యేసు క్రీస్తు యొక్క సిద్ధాంతము సరళమైనది
2024 అక్టోబరు సర్వసభ్య సమావేశము


16:6

యేసు క్రీస్తు యొక్క సిద్ధాంతము సరళమైనది

పరలోక తండ్రి పిల్లలకు యేసు క్రీస్తు యొక్క సరళమైన సిద్ధాంతాన్ని బోధించే పవిత్రమైన కార్యానికి నేను సాక్ష్యమిస్తున్నాను.

మనందరికీ మనం ప్రేమించే కుటుంబ సభ్యులు ఉన్నారు, వారు దేవుని పిల్లలందరినీ దయనీయంగా మార్చే విధ్వంసకుడైన సాతాను యొక్క స్థిరమైన శక్తులచేత శోధించబడతారు మరియు పరీక్షించబడతారు. మనలో చాలామందికి నిద్రలేని రాత్రులు ఉన్నాయి. మనము మంచి కోసం ప్రతీ శక్తిని ఉపయోగించి ప్రమాదంలో ఉన్న వ్యక్తులను చుట్టుముట్టడానికి ప్రయత్నించాము. మనము వారి కోసం ప్రార్థనలో వేడుకున్నాము. మనము వారిని ప్రేమించాము. మనము వీలైనంత ఉత్తమ ఉదాహరణగా నిలిచాము.

ప్రాచీన కాలానికి చెందిన జ్ఞానవంతుడైన ప్రవక్త అయిన ఆల్మా కూడా ఇలాంటి పరీక్షలను ఎదుర్కొన్నాడు. అతను నడిపించిన మరియు ప్రేమించిన వ్యక్తులు తరచుగా క్రూరమైన శత్రువుచేత దాడికి గురవుతున్నారు, అయినప్పటికీ వారు ఇప్పటికీ దుష్ట ప్రపంచంలో నీతిమంతులైన పిల్లలను పెంచడానికి ప్రయత్నిస్తున్నారు. విజయంపై తన ఏకైక ఆశ ఒక శక్తి అని ఆల్మా భావించాడు, మనం కొన్నిసార్లు దానిని తక్కువ అంచనా వేయవచ్చు మరియు చాలా తక్కువగా ఉపయోగించుకోవచ్చు. అతను దేవుని సహాయం కోసం వేడుకున్నాడు.

దేవుడు సహాయం చేయాలంటే, అతను నాయకత్వం వహించిన వారితో పాటు అతని విరోధులకు కూడా పశ్చాత్తాపం అవసరమని ఆల్మాకు తెలుసు. అందువలన, అతను యుద్ధానికి భిన్నమైన విధానాన్ని ఎంచుకున్నాడు.

మోర్మన్ గ్రంథము దానిని ఇలా వివరిస్తుంది: “ఇప్పుడు వాక్యము యొక్క బోధన, న్యాయమైన దానిని చేయుటకు జనులను నడిపించుటలో అత్యంత ప్రభావవంతమైనందున—ఖడ్గము లేదా వారికి సంభవించిన ఇతర వాటన్నిటి కంటే జనుల మనస్సులపై అధిక శక్తివంతమైన ప్రభావము కలిగియున్నందున—దేవుని వాక్యము యొక్క ప్రభావమును వారు ప్రయత్నించుట ప్రయోజనకరమని ఆల్మా తలంచెను.”

దేవుని వాక్యం అనేది యేసు క్రీస్తు మరియు ఆయన ప్రవక్తలచేత బోధించబడిన సిద్ధాంతం. సిద్ధాంతము యొక్క పదాలకు గొప్ప శక్తి ఉందని ఆల్మాకు తెలుసు.

సిద్ధాంతము మరియు నిబంధనలు యొక్క 18వ ప్రకరణములో, ప్రభువు తన సిద్ధాంతం యొక్క పునాదిని బయల్పరిచారు:

“ఏలయనగా, ఇదిగో పశ్చాత్తాపపడమని అన్ని ప్రాంతములలోనున్న మనుష్యులందరిని నేనాజ్ఞాపించుచున్నాను. …

“ఏలయనగా ఇదిగో, నీ విమోచకుడైన ప్రభువు శరీరమందు మరణమును సహించెను; కాబట్టి మనుష్యులందరు పశ్చాత్తాపపడి, ఆయన యొద్దకు వచ్చుటకు ఆయన మనుష్యులందరి బాధను సహించెను.

“పశ్చాత్తాపము యొక్క షరతులపై మనుష్యులందరిని తన యొద్దకు తెచ్చుటకు మరణము నుండి ఆయన తిరిగి లేచెను.”

“మీరు సాగిలపడి నా నామమున తండ్రిని ఆరాధించవలెను.

“… మీరు తప్పక పశ్చాత్తాపపడి, యేసు క్రీస్తు నామములో బాప్తిస్మము పొందవలెను.”

“మీరు పొందెదరని నమ్ముచు, విశ్వాసముతో నా నామమున తండ్రిని అడుగుడి, మీరు పరిశుద్ధాత్మను కలిగియుందురు.”

“ఇప్పుడు, మీరు దీనిని పొందిన తరువాత, మీరు అన్ని విషయములలో నా ఆజ్ఞలను తప్పక పాటించవలెను.”

“యేసు క్రీస్తు నామమును మీపై తీసుకొనుడి, సత్యమును గంభీరముగా ప్రకటించుడి.

“ఎందరైతే పశ్చాత్తాపపడి, యేసు క్రీస్తు అను నా నామమున బాప్తిస్మము పొంది, అంతము వరకు సహించెదరో, అట్టివారందరు రక్షింపబడెదరు.”

ఆ కొన్ని గద్యభాగాలలో, ఆయన సిద్ధాంతాన్ని ఎలా బోధించాలనే దానికి రక్షకుడు మనకు సరైన ఉదాహరణనిచ్చారు. ఈ సిద్ధాంతం ఏమిటంటే, ప్రభువైన యేసు క్రీస్తు నందు విశ్వాసము, పశ్చాత్తాపము, బాప్తిస్మము, పరిశుద్ధాత్మ వరమును పొందడం మరియు అంతము వరకు సహించడం దేవుని పిల్లలందరినీ ఆశీర్వదిస్తుంది.

మనం ప్రేమించే వారికి ఈ సూత్రాలను బోధిస్తున్నప్పుడు, సత్యాన్ని తెలుసుకోవడానికి పరిశుద్ధాత్మ మనకు సహాయం చేస్తారు. మనకు పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణలు అవసరం కాబట్టి, నిజమైన సిద్ధాంతాన్ని బోధించడానికి మించిన ఊహాగానాలు లేదా వ్యక్తిగత వివరణలకు మనం దూరంగా ఉండాలి.

మీరు ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తిని మీరు ప్రేమిస్తున్నప్పుడు అది చేయడం కష్టం. బోధించబడిన సిద్ధాంతాన్ని అతను లేదా ఆమె విస్మరించి ఉండవచ్చు. ఇది క్రొత్త లేదా సంచలనాత్మకమైన దానిని ప్రయత్నించడానికి శోధిస్తుంది. కానీ మనం నిజమైన సిద్ధాంతానికి మించి బోధించకుండా అప్రమత్తంగా మరియు జాగ్రత్తగా ఉన్నప్పుడు మాత్రమే పరిశుద్ధాత్మ సత్యాత్మను బయల్పరుస్తారు. తప్పుడు సిద్ధాంతం దగ్గరకు రాకుండా ఉండేందుకు నిశ్చయమైన మార్గాలలో ఒకటి, మన బోధనలో సరళంగా ఉండడాన్ని ఎంచుకోవడం. ఆ సరళత ద్వారా భద్రత పొందబడుతుంది మరియు తక్కువ కోల్పోబడుతుంది.

పిల్లలు తరువాత వారికి ఎదురయ్యే అపవాది శోధనలకు గురికాకుండా ఉన్నప్పుడే, వారు నేర్చుకోవలసిన సత్యాలు సామాజిక మాధ్యమం, సహచరులు మరియు వారి స్వంత వ్యక్తిగత శ్రమల పరధ్యానం చేత ముంచివేయబడకముందే, బోధించడం ద్వారా మనం ప్రారంభంలోనే రక్షణ సిద్ధాంతాన్ని పంచుకోగలుగుతాము. యేసు క్రీస్తు బోధనలను పిల్లలతో పంచుకోవడానికి ప్రతీ అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి. ప్రత్యర్థి శక్తుల కనికరంలేని ప్రయత్నాలతో పోలిస్తే ఈ బోధనా క్షణాలు విలువైనవి మరియు చాలా తక్కువగా ఉంటాయి. పిల్లల జీవితంలో సిద్ధాంతాన్ని చొప్పించడానికి గడిపిన ప్రతి గంటకు, ఈ రక్షణ సత్యాలను సవాలు చేసే లేదా విస్మరించే సందేశాలు మరియు చిత్రాలతో లెక్కలేనన్ని గంటల వ్యతిరేకత ఉంటుంది.

సరదాగా గడపడం ద్వారా మీ పిల్లలకు మరింత దగ్గరవ్వడం మంచిదేనా అని మీలో కొందరు ఆశ్చర్యపోవచ్చు లేదా మీ బోధనల వల్ల పిల్లవాడు ముంచివేయబడినట్లు భావించడం ప్రారంభించవచ్చా అని మీరు అడగవచ్చు. బదులుగా, మనం ఇలా పరిగణించాలి, “ఇంత తక్కువ సమయం మరియు చాలా తక్కువ అవకాశాలతో, వారి విశ్వాసానికి అనివార్యమైన సవాళ్ళకు వ్యతిరేకంగా వారిని బలపరిచే ఏ సిద్ధాంత సత్యాలను నేను పంచుకోగలను?” ఈరోజు మీరు పంచుకునే సత్యాలు వారు గుర్తుంచుకొనే సత్యాలు కావచ్చు మరియు ఈ రోజు త్వరలో గడిచిపోతుంది.

యేసు క్రీస్తు సిద్ధాంతాన్ని పంచుకోవడంలో మా ముత్తమ్మ మేరీ బొమ్మెలి యొక్క భక్తిని నేను ఎప్పుడూ మెచ్చుకున్నాను. ఆమెకు 24 ఏళ్ళ వయస్సున్నప్పుడు స్విట్జర్లాండ్‌లోని సువార్తికులు ఆమె కుటుంబానికి బోధించారు.

బాప్తిస్మం తీసుకున్న తర్వాత, మేరీ అమెరికాలోని పరిశుద్ధులతో చేరాలని కోరుకుంది, కాబట్టి ఆమె స్విట్జర్లాండ్ నుండి బెర్లిన్‌కు వెళ్లింది మరియు కుటుంబం కోసం వస్త్రాలు నేయడానికి ఆమెను నియమించుకున్న ఒక మహిళ దగ్గర పని చేసింది. మేరీ ఒక సేవకుల గదిలో నివసించింది మరియు ఇంటి నివాస ప్రాంతంలో తన మగ్గాన్ని ఏర్పాటు చేసింది.

ఆ సమయంలో, యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘము యొక్క సిద్ధాంతాన్ని బోధించడం బెర్లిన్‌లో చట్టవిరుద్ధం. కానీ మేరీ తాను నేర్చుకున్న విషయాలను పంచుకోకుండా ఉండలేనని గుర్తించింది. మేరీ బోధించినప్పుడు వినడానికి ఇంటి యజమానురాలు మరియు ఆమె స్నేహితులు మగ్గం చుట్టూ గుమికూడేవారు. జోసెఫ్ స్మిత్‌కు పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తు కనిపించడం, దేవదూతల సందర్శన మరియు మోర్మన్ గ్రంథం గురించి ఆమె మాట్లాడింది. ఆల్మా యొక్క వృత్తాంతాలను గుర్తుచేసుకుంటూ, ఆమె పునరుత్థానం యొక్క సిద్ధాంతం గురించి బోధించింది. సిలెస్టియల్ రాజ్యంలో కుటుంబాలు తిరిగి ఏకం కాగలవని ఆమె సాక్ష్యమిచ్చింది.

పునఃస్థాపించబడిన సువార్త యొక్క సిద్ధాంతాన్ని పంచుకోవడంలో మేరీ యొక్క ఉత్సాహం త్వరలోనే ఇబ్బందిని కలిగించింది. కొద్దిరోజులకే మేరీని పోలీసులు జైలుకు తీసుకెళ్లారు. దారిలో, మరుసటి రోజు ఉదయానికి ముందు తాను హాజరు కావాల్సిన న్యాయమూర్తి పేరు చెప్పమని ఆమె పోలీసును అడిగింది. ఆమె అతని కుటుంబం గురించి మరియు అతను మంచి తండ్రి, భర్త అవునా కాదా అని కూడా అడిగింది. న్యాయమూర్తిని లోకసంబంధమైన మనిషిగా పోలీసు అభివర్ణించాడు.

జైలులో, మేరీ ఒక పెన్సిలు మరియు కొంత కాగితం కోరింది. ఆమె మోర్మన్ గ్రంథంలో వివరించిన విధంగా యేసు క్రీస్తు పునరుత్థానానికి సాక్ష్యమిస్తూ, ఆత్మ లోకాన్ని చర్చిస్తూ, పశ్చాత్తాపాన్ని వివరిస్తూ న్యాయమూర్తికి లేఖ రాస్తూ రాత్రంతా గడిపింది. తుది తీర్పును ఎదుర్కొనే ముందు న్యాయమూర్తి అతని జీవితంపై ప్రతిబింబించడానికి సమయం తీసుకోవాలని ఆమె సూచించింది. అతను పశ్చాత్తాపపడాల్సింది చాలా ఉందని తనకు తెలుసునని, ఇది అతని కుటుంబాన్ని తీవ్రంగా బాధపెడుతుందని మరియు అతనికి గొప్ప దుఃఖాన్ని తెస్తుందని ఆమె రాసింది. ఉదయం, ఆమె తన లేఖను పూర్తి చేసినప్పుడు, దానిని ఆమె పోలీసుకు ఇచ్చి న్యాయమూర్తికి అందజేయమని అతడిని కోరగా, అతడు అందుకు అంగీకరించాడు.

అనంతరం ఆ పోలీసును న్యాయమూర్తి తన కార్యాలయానికి పిలిపించారు. మేరీ వ్రాసిన ఉత్తరం, ఆమె పునఃస్థాపించబడిన సువార్త సిద్ధాంతాన్ని బోధిస్తున్నదని మరియు అలా చేయడం ద్వారా చట్టాన్ని ఉల్లంఘిస్తోందని అనడానికి తిరుగులేని సాక్ష్యం. అయితే, పోలీసు మేరీ ఉన్న జైలుగదికి తిరిగి రావడానికి ఎంతో సమయం పట్టలేదు. అన్ని అభియోగాలు కొట్టివేయబడ్డాయని మరియు ఆమె వెళ్ళడానికి స్వేచ్ఛగా ఉందని అతను ఆమెకు చెప్పాడు. యేసు క్రీస్తు యొక్క పునఃస్థాపించబడిన సువార్త యొక్క సిద్ధాంతాన్ని ఆమె బోధించడం వలన ఆమె జైలుకు వెళ్లవలసి వచ్చింది. మరియు ఆమె పశ్చాత్తాపం యొక్క సిద్ధాంతాన్ని న్యాయమూర్తికి ప్రకటించడం వలన ఆమె జైలు నుండి బయటకు వచ్చింది.

మేరీ బొమ్మెలి బోధన ఆమె విడుదలతో ముగిసిపోలేదు. నమోదు చేయబడిన ఆమె మాటలు ఇంకా పుట్టని తరాల వరకు నిజమైన సిద్ధాంతాన్ని అందించాయి. కొత్తగా మారిన వ్యక్తి కూడా యేసు క్రీస్తు సిద్ధాంతాన్ని బోధించగలడనే ఆమె విశ్వాసం ఆమె వారసులు వారి స్వంత శ్రమలలో బలపరచబడతారని నిర్ధారిస్తుంది.

యేసు క్రీస్తు సిద్ధాంతం గురించి మనం ఇష్టపడే వారికి బోధించడానికి మన వంతు కృషి చేస్తున్నప్పుడు, కొందరు ఇంకా స్పందించకపోవచ్చు. మీ మనసులోకి సందేహాలు రావచ్చు. రక్షకుని సిద్ధాంతాన్ని ప్రభావవంతంగా బోధించేంతగా మీకు తెలుసా అని మీరు ప్రశ్నించవచ్చు. మరియు మీరు దాన్ని బోధించడానికి ఇప్పటికే ప్రయత్నాలు చేసి ఉంటే, సానుకూల ప్రభావాలు ఎందుకు ఎక్కువగా కనిపించవు అని మీరు ఆశ్చర్యపోవచ్చు. ఆ సందేహాలకు తావివ్వకండి. సహాయం కోసం దేవుడిని ప్రార్థించండి.

“నీ సమస్త సహాయము కొరకు దేవునికి మొరపెట్టుము; … నీ హృదయ వ్యామోహములు నిత్యము ప్రభువుపై నిలుపుము.”

“ఇప్పుడు మీరు వినయ విధేయతలు కలిగి, మృదువుగానుండి, సులువుగా లోబడునట్లుండవలెనని, సహనము మరియు దీర్ఘశాంతముతో నిండి సమస్త విషయములలో మితముగానుండి, అన్ని సమయములలో దేవుని ఆజ్ఞలు గైకొనుట యందు శ్రద్ధగా ఉండవలెనని, ఆత్మీయముగా భౌతికముగా మీకవసరమైన వాటికొరకు అడుగుచూ మీరు పొందువాటన్నిటి కొరకు దేవునికి ఎల్లప్పుడు కృతజ్ఞతలు చెల్లించవలెనని నేను కోరుచున్నాను.”

మీరు ప్రార్థిస్తే, మీరు దేవునితో మాట్లాడితే, మీ ప్రియమైన వ్యక్తి కోసం మీరు ఆయన సహాయాన్ని వేడుకుంటే మరియు సహాయం కోసం మాత్రమే కాకుండా, మీరు కోరుకున్నవన్నీ వెంటనే లేదా బహుశా ఎప్పటికీ పొందకపోవడం నుండి వచ్చే సహనం మరియు సౌమ్యతకు ధన్యవాదాలు తెలిపితే, అప్పుడు మీరు ఆయనకు దగ్గరవుతారని నేను మీకు వాగ్దానం చేస్తున్నాను. మీరు శ్రద్ధ గలవారిగా మరియు దీర్ఘశాంతము గలవారిగా మారతారు. ఆపై మీరు ఇష్టపడే వారికి సహాయం చేయడానికి మీరు చేయగలిగినదంతా చేసారని మరియు మీరు ఎవరి కోసం ప్రార్థిస్తున్నారో వారు వారిని అడ్డగించే సాతాను ప్రయత్నాలను ఎదుర్కొంటున్నారని మీరు తెలుసుకోవచ్చు.

“యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు; వారు పక్షిరాజులవలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు; అలయక పరుగెత్తుదురు; సొమ్మసిల్లక నడిచిపోవుదురు.”

కుటుంబాలకు సంబంధించిన లేఖనాధార గ్రంథములో మీరు నిరీక్షణను కనుగొనగలరు. వారికి బోధించినవాటికి దూరమైన వారి గురించి లేదా క్షమాపణ కోసం దేవునితో పెనుగులాడుతున్న చిన్నవాడగు ఆల్మా, మోషైయ కుమారులు మరియు ఈనస్ వంటివారి గురించి మనం చదువుతాము. వారి సంక్షోభ సమయంలో, వారు తమ తల్లిదండ్రుల మాటలను, యేసు క్రీస్తు సిద్ధాంతం యొక్క సత్యాలను గుర్తు చేసుకున్నారు. గుర్తుంచుకోవడం వారిని రక్షించింది. ఆ పవిత్రమైన సిద్ధాంతం గురించి మీ బోధన గుర్తుంచుకోబడుతుంది.

పరలోక తండ్రి పిల్లలకు యేసు క్రీస్తు యొక్క సరళమైన సిద్ధాంతాన్ని బోధించే పవిత్రమైన కార్యానికి నేను సాక్ష్యమిస్తున్నాను, అది ఆధ్యాత్మికంగా శుద్ధి చేయబడి, చివరికి దేవుని సన్నిధిలోకి స్వాగతించబడడానికి మరియు కుటుంబాలుగా ఆయనతో, ఆయన కుమారునితో ఎప్పటికీ మహిమలో జీవించడానికి మనల్ని అనుమతిస్తుంది. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.