2020–2024
“ఇదిగో, నా మాదిరిని మీరు అనుసరించుడి”
2024 అక్టోబరు సర్వసభ్య సమావేశము


13:29

“ఇదిగో, నా మాదిరిని మీరు అనుసరించుడి”

మనం మన నిబంధనలను గట్టిగా పట్టుకున్నప్పుడు మరియు మన సజీవ ప్రవక్తకు మద్దతిచ్చినప్పుడు మనం ప్రభువు యొక్క దీపాన్ని పైకెత్తుతాము.

ఈ సమావేశంలోని అనేక సాక్ష్యాలతో పాటు, యేసు క్రీస్తు దేవుని కుమారుడని, మన ప్రభువు మరియు రక్షకుడని, మన తండ్రి యొక్క పిల్లలందరికీ విమోచకుడు అని అపొస్తలునిగా నేను నా సాక్ష్యాన్ని జోడిస్తున్నాను. మనం యోగ్యులమైతే, యేసు క్రీస్తు తన ప్రాయశ్చిత్తం ద్వారా, పరలోకంలో ఉన్న మన తండ్రి సన్నిధికి తిరిగి వెళ్ళడానికి మరియు నిత్యత్వం కొరకు మన కుటుంబాలతో ఉండడానికి మనకు వీలు కల్పించారు.

రక్షకుడు మన మర్త్య ప్రయాణాలకు దూరంగా లేరు. మనం ఆయనకు దగ్గరవ్వాలని గత రెండు రోజులుగా ఆయన ఎంపిక చేసుకున్న నాయకుల ద్వారా ఆయన మాట్లాడడం మనం విన్నాము. మనం జీవితపు సవాళ్ళను ఎదుర్కొన్నప్పుడు పదే పదే, తన స్వచ్ఛమైన ప్రేమ మరియు దయతో ఆయన మనల్ని ఆదరిస్తారు. నీఫై ఇలా వివరించాడు, “నా దేవుడు నాకు ఆధారమైయుండెను; నా బాధలలో నన్ను నడిపించెను. … ఆయన తన ప్రేమతో నన్ను నింపెను.”

ఆయన కార్యములో మనం ఒకరినొకరు ఆమోదించినప్పుడు ఆ ప్రేమ స్పష్టమవుతుంది.

సర్వసభ్య సమావేశంలో మన సజీవ ప్రవక్తను, ప్రథమ అధ్యక్షత్వము, పన్నెండుమంది అపొస్తలుల సమూహము, ప్రధాన అధికారులు మరియు సంఘము యొక్క అధిపతులను మనము ఆమోదిస్తాము. ఆమోదించడం అంటే మరొక వ్యక్తికి మద్దతివ్వడం, వారిపట్ల శ్రద్ధచూపడం, వారి నమ్మకానికి విశ్వాసులుగా ఉండడం, వారి మాటలపై చర్య తీసుకోవడం అని అర్థం. వారు ప్రభువు యొక్క ప్రేరేపణ ద్వారా మాట్లాడతారు; వారు ప్రస్తుత సమస్యలను, సమాజం యొక్క నైతిక పతనాన్ని మరియు తండ్రి యొక్క ప్రణాళికను అడ్డుకోవడానికి విరోధి యొక్క హెచ్చైన ప్రయత్నాలను అర్థం చేసుకుంటారు. మన చేతులను పైకెత్తడం ద్వారా, ఆ క్షణానికి మాత్రమే కాకుండా మన అనుదిన జీవితాల్లో మనం మద్దతును అందిస్తున్నాము.

ఆమోదించడంలో మన స్టేకు అధ్యక్షులు మరియు బిషప్పులకు, సమూహము మరియు నిర్మాణ నాయకులకు, బోధకులకు, మన వార్డులు మరియు స్టేకులలో శిబిర నిర్వాహకులకు కూడా మద్దతివ్వడం కలిపియుంది. ఇంటికి సంబంధించి, మనం మన భార్యలకు, మన భర్తలకు, పిల్లలకు, తల్లిదండ్రులకు, బంధువులకు మరియు ఇరుగుపొరుగు వారికి మద్దతిస్తాము. మనం ఒకరికొకరం మద్దతు ఇచ్చినప్పుడు, “మీ చేతులు ‘వడలినప్పుడు’ వాటిని పైకెత్తడానికి మాత్రమే కాకుండా, మిమ్మల్ని ఓదార్చి, మీకు సహకారమివ్వడానికి నేను మీతో ఉన్నాను” అని మనం చెప్తున్నాము.

మద్దతివ్వడం అనే భావన లేఖనంపై ఆధారపడియుంది. మోర్మన్ జలముల వద్ద క్రొత్తగా బాప్తిస్మము పొందిన సంఘ సభ్యులు, “అవి తేలికగునట్లు ఒకరి భారములు ఒకరు భరించుటకు; … ఆదరణ యొక్క అవసరములో ఉన్నవారిని ఆదరించుటకు; … అన్ని సమయములలో, అన్ని విషయములలో, అన్ని స్థలములలో దేవునికి సాక్షులుగా నిలబడుటకు” నిబద్ధులైయున్నారు.

నీఫైయులతో యేసు ఇలా అన్నారు: “లోకము కొరకు ప్రకాశించునట్లు మీ దీపమును పైకెత్తుడి. ఇదిగో, నా మాదిరిని మీరు అనుసరించుడి.” మనం మన నిబంధనలను గట్టిగా పట్టుకున్నప్పుడు మరియు మన సజీవ ప్రవక్త దేవుని మాటలు మాట్లాడుతున్నప్పుడు ఆయనకు మద్దతిచ్చినప్పుడు మనం ప్రభువు యొక్క దీపాన్ని పైకెత్తుతాము.

పన్నెండుమంది అపొస్తలుల సమూహము‌లో సేవ చేస్తున్నప్పుడు అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఇలా అన్నారు, “ప్రవక్తలను ఆమోదించడం అనేది ఒక వ్యక్తిగత నిబద్ధత, వారి ప్రవచనాత్మక ప్రాధాన్యతలకు మద్దతివ్వడానికి మనము మన శాయశక్తులా కృషి చేస్తాము.”

ప్రవక్తకు మద్దతివ్వడం ఒక పవిత్రమైన కార్యము. మనం నిశ్శబ్దంగా కూర్చోము, చురుకుగా ఆయనను సమర్థిస్తాము, ఆయన సలహాను అనుసరిస్తాము, ఆయన మాటలు బోధిస్తాము మరియు ఆయన కోసం ప్రార్థిస్తాము.

మోర్మన్ గ్రంథములో, రాజైన బెంజమిన్ జనులతో ఇలా చెప్పాడు, “నేను కూడా శరీరమునందు, మనస్సునందు అన్ని విధములైన బలహీనతలకు లోనైన మీవంటివాడను; అయినప్పటికీ నేను ఎన్నుకొనబడి … ప్రభువు చేత అనుమతించబడితిని; ప్రభువు నాకు దయచేసిన పూర్ణ శక్తి, మనస్సు మరియు బలముతో మీకు సేవ చేయుటకు ఆయన సాటిలేని శక్తి ద్వారా భద్రపరచబడి, కాపాడబడితిని.”

మోషే చేతులను పైకెత్తుట.

అదేవిధంగా, 100 సంవత్సరాల వయస్సులో, అధ్యక్షులు నెల్సన్ ప్రభువుచే భద్రపరచబడి, కాపాడబడ్డారు. అధ్యక్షులు హెరోల్డ్ బి. లీ, ప్రథమ అధ్యక్షత్వ సభ్యునిగా ఉన్న సమయంలో, మోషే రెఫీదీము‌లోని కొండపై నిలబడి ఉన్న ఉదాహరణను చెప్పారు. “[సంఘ అధ్యక్షుడు] అలసిపోవచ్చు,” అని ఆయన చెప్పారు. “అతని బరువైన బాధ్యతల కారణంగా వారు కొన్నిసార్లు కుంగిపోవచ్చు; కానీ మనము అతనికి మద్దతిచ్చినప్పుడు మరియు అతని మార్గనిర్దేశంలో మనము అతని వైపు నడిపించినప్పుడు, పాతాళలోక ద్వారములు మీ యెదుట మరియు ఇశ్రాయేలు యెదుట నిలువనేరవు. మీ భద్రత మరియు మా భద్రత ప్రభువు తన సంఘానికి అధ్యక్షత్వం వహించడానికి నియమించిన వారిని మనం అనుసరిస్తామా లేదా అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఈ సంఘానికి ఎవరు అధ్యక్షత్వం వహించాలని ఆయన కోరుకుంటున్నారో ఆయనకు తెలుసు మరియు ఆయన ఏ తప్పు చేయరు.”

అధ్యక్షలు నెల్సన్ ప్రభువును సేవిస్తున్న సంవత్సరాలపై ఆధారపడతారు. ఆయన పరిపక్వత, విస్తృత అనుభవం, జ్ఞానం మరియు స్థిరంగా బయల్పాటును పొందడం ప్రత్యేకించి మన కాలానికి తగినది. ఆయన ఇలా అన్నారు: “‘లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండియుండు’ (యెషయా 11:9) రోజు కోసం యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘము ప్రపంచాన్ని సిద్ధం చేస్తోంది. … 200 సంవత్సరాల క్రితం చేసిన దైవ ప్రకటన ద్వారా ఈ కార్యానికి బలం చేకూరింది. అందులో ఏడు పదాలు మాత్రమే ఉన్నాయి: ‘ఈయన నా ప్రియ కుమారుడు. ఈయనను ఆలకించుము!’(జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:17 చూడండి).”

అధ్యక్షులు నెల్సన్ ఇలా కూడా చెప్పారు: “మన రక్షకుని గూర్చిన జ్ఞానము ప్రతి మానవ ఆత్మకు వ్యక్తిగతంగా మరింత ముఖ్యము మరియు తప్పనిసరి అయిన ఈ సమయాన్ని మించినది ప్రపంచ చరిత్రలో మరేది లేదు. మనమందరం యేసు క్రీస్తును వెంబడించి, ఆయన బోధనలను ఆలకించినట్లయితే, ప్రపంచవ్యాప్తంగా—మరియు మన వ్యక్తిగత జీవితాల్లో—ఉన్న నాశనకరమైన వివాదాలు ఎంత త్వరగా పరిష్కరించబడతాయో ఊహించండి.”

సహోదర సహోదరీలారా, మనం ఎక్కువ సహకరించడం మరియు తక్కువ విమర్శించడం, ప్రభువు వాక్యానికి, ఆయన మార్గాలకు మరియు ఇలా ఆయన చెప్పిన ప్రవక్తకు ఎక్కువ మద్దతివ్వడం చేయాలి: “దేవుని సత్యాలకు మరియు సాతాను అసత్యాలకు మధ్య తేడాను గుర్తించడం నేడు మనకున్న అతిపెద్ద సవాళ్ళలో ఒకటి. అందుకే ప్రభువు మనలను ఈవిధముగా హెచ్చిరించారు, ‘ఎల్లప్పుడూ ప్రార్థించుము; తద్వారా [మనము] సాతానును జయించవచ్చును, మరియు …[విరోధి] పనిలో సహకరించు సాతాను సేవకుల చేతులలో నుండి తప్పించుకొనవచ్చును’ [సిద్ధాంతము మరియు నిబంధనలు 10:5; వివరణ చేర్చబడింది].”

మాంటై యూటా దేవాలయ పునఃప్రతిష్ఠాపన.

గత ఏప్రిల్‌లో, సహోదరి రాస్బాండ్ మరియు నేను మాంటై యూటా దేవాలయ పునఃప్రతిష్ఠ కోసం మన ప్రియమైన ప్రవక్త మరియు సహోదరి నెల్సన్‌తో జతచేరే గౌరవాన్ని పొందాము.

అధ్యక్షుడు నెల్సన్ గదిలోకి ప్రవేశించినప్పుడు అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆయన వస్తున్నారని మాలో చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. ఆయన సమక్షంలో, ఆయన కలిగియుండే జ్ఞానాన్ని, ప్రవచనాత్మక అధికారాన్ని నేను వెంటనే అనుభవించాను. ప్రవక్తను వ్యక్తిగతంగా చూసిన ప్రజల ముఖాల్లోని ఆనందం నాలో ఎప్పటికీ నిలిచిపోతుంది.

పునఃప్రతిష్ఠాపన ప్రార్థనలో, ఆయన పరిశుద్ధ మందిరము తప్పనిసరిగా దేవాలయంలోకి ప్రవేశించిన వారందరికీ మద్దతివ్వాలని, “వారు పవిత్రమైన ఆశీర్వాదాలను పొందాలని, వారి నిబంధనలకు యోగ్యులుగా మరియు విశ్వాసపాత్రులుగా ఉండాలని … ఇది శాంతి మందిరం, ఓదార్పు మందిరం మరియు ఈ ద్వారాలలోకి యోగ్యతగా ప్రవేశించే వారందరికీ వ్యక్తిగత బయల్పాటు యొక్క మందిరం కావాలి” అని అధ్యక్షులు నెల్సన్ ప్రభువును వేడుకున్నారు.

ప్రపంచాన్ని చుట్టుముట్టిన భయం, అంధకారం మరియు వివాదాలను ఎదుర్కోవడానికి మనమందరం శాంతి, ఓదార్పు మరియు అన్నింటికంటే ఎక్కువగా వ్యక్తిగత బయల్పాటుతో ప్రభువు చేత పైకెత్తబడాలి.

పునఃప్రతిష్ఠాపనకు ముందు, మేము అధ్యక్షులు మరియు సహోదరి నెల్సన్‌లతో కలిసి ఎండలో నిలబడి అందమైన దృశ్యాన్ని వీక్షించాము. అధ్యక్షులు నెల్సన్ గారి పూర్వీకులలో చాలామంది ఈ ప్రాంతానికి చెందినవారు. మా వాళ్ళలో కొంతమంది చేసినట్లు, ఆయన ఎనిమిది మంది ముత్తాతలు దేవాలయం చుట్టుపక్కల ఉన్న లోయలలో స్థిరపడ్డారు. మా ముత్తాత ఆండ్రూ ఆండెర్సన్ రాకీ పర్వతాలలో మూడవదిగా ఉన్న మాంటై దేవాలయాన్ని పూర్తి చేయడానికి 11 సంవత్సరాలు శ్రమించిన ప్రారంభ అగ్రగాముల యొక్క నిర్మాణ సిబ్బందిలో పనిచేశారు.

మేము అధ్యక్షులు నెల్సన్‌ గారితో నిలబడినప్పుడు, ప్రభువు యొక్క పరిశుద్ధ మందిరాన్ని పునఃప్రతిష్ఠించే వేడుకలో దేవుని ప్రవక్తకు మద్దతిచ్చి సహకరించే అవకాశం మాకు లభించింది. అది నేను ఎప్పటికీ మర్చిపోలేని రోజు.

“ప్రభువును గౌరవించడానికి మనము దేవాలయాలను నిర్మిస్తాము” అని అధ్యక్షులు నెల్సన్ ఆ పవిత్రమైన రోజు చెప్పారు. “అవి ఆరాధించడం కోసం నిర్మించబడ్డాయి, ప్రదర్శన కోసం కాదు. మనము ఈ దేవాలయాల లోపల నిత్య ప్రాముఖ్యత కలిగిన పవిత్ర నిబంధనలను చేస్తాము.” మనము ఇశ్రాయేలును సమకూరుస్తున్నాము.

అధ్యక్షులు నెల్సన్ మరియు ఆయన ముందున్న ప్రవక్తలు పరిశుద్ధ దేవాలయాల పట్ల అధిక శ్రద్ధ చూపారు. నేడు, ప్రపంచవ్యాప్తంగా మనకు 350 ప్రభువు యొక్క పరిశుద్ధ మందిరాలు ఉన్నాయి, అవి నిర్వహించబడుతున్నాయి, ప్రకటించబడ్డాయి లేదా నిర్మాణంలో ఉన్నాయి. ప్రవక్తగా, 2018 నుండి, అధ్యక్షులు నెల్సన్ 168 దేవాలయాలను ప్రకటించారు.

ఆయన ఇలా చెప్పారు, “మన కాలంలో, మొత్తము అంతయు పరిపూర్ణముగా ఐక్యమై, యుగములు, తాళపుచెవులు, అధికారములు జతచేయబడాలి (సిద్ధాంతము మరియు నిబంధనలు 128:18 చూడండి). ఈ పవిత్ర ప్రయోజనాల కోసం, పరిశుద్ధ దేవాలయాలు ఇప్పుడు ప్రపంచమంతటా ఉన్నాయి. ఈ దేవాలయాల నిర్మాణం మీ జీవితాన్ని మార్చదని నేను మళ్ళీ నొక్కి చెబుతున్నాను, కానీ దేవాలయంలో మీరు చేసే సేవ తప్పకుండా మార్చుతుంది.”

“రక్షకుడు మరియు ఆయన సిద్ధాంతము దేవాలయంలో అత్యంత కీలకమైన భాగములుగా ఉన్నాయని అధ్యక్షుడు చెప్పారు. “బోధన ద్వారా మరియు ఆత్మ ద్వారా దేవాలయంలో బోధింబడే ప్రతీ విషయము యేసు క్రీస్తుపై మన అవగాహనను పెంచుతుంది. పవిత్రమైన యాజకత్వ నిబంధనల ద్వారా ఆయన ఆవశ్యకమైన విధులు మనల్ని ఆయనతో బంధించి ఉంచుతాయి. తరువాత, మనం మన నిబంధనలను పాటించినప్పుడు, ఆయన యొక్క స్వస్థపరిచే, బలపరిచే శక్తిని ఆయన మనకు వరముగా ఇస్తారు.”

“దేవాలయంలో ఆరాధించే వారందరూ దూతలు ‘వారి యెడల ఆజ్ఞను కలిగియుండి’ దేవుని శక్తిని ధరించుకొని అక్కడి నుండి వెళ్తారని అధ్యక్షులు నెల్సన్ చెప్పారు [సిద్ధాంతము మరియు నిబంధనలు 109:22]. వరము పొందిన స్త్రీగా లేదా పురుషునిగా [లేదా దేవాలయానికి హాజరయ్యే యువతగా], దేవుని శక్తిని ఆయుధముగా ధరించుకున్న మీరు ఒంటరిగా జీవితాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం లేదని తెలుసుకోవడం మీ విశ్వాసాన్ని ఎంతగా పెంచుతుంది? దేవదూతలు మీకు నిజంగా సహాయం చేస్తారని తెలుసుకోవడం మీకు ఎలాంటి ధైర్యాన్ని ఇస్తుంది?”

గెత్సేమనే తోట‌లో యేసు క్రీస్తు వినయంగా మోకరిల్లినప్పుడు దేవదూతలు మనకు మద్దతివ్వడానికి చేరుకోవడం లేఖనాల్లో వివరించబడింది. ఆయన బాధ చేత ఆయన అనంతమైన ప్రాయశ్చిత్తాన్ని అందించారు. అధ్యక్షులు నెల్సన్ ఇలా పేర్కొన్నారు, “అక్కడ, నమోదిత చరిత్ర అంతటిలో ప్రేమ యొక్క గొప్ప ఏకైక చర్య జరిగింది. … అక్కడ గెత్సేమనేలో, ప్రభువు ‘మనుష్యులందరు పశ్చాత్తాపపడి, ఆయన యొద్దకు వచ్చుటకు … మనుష్యులందరి బాధను సహించారు’ [సిద్ధాంతము మరియు నిబంధనలు 18:11].”

“యీ గిన్నె నా యొద్దనుండి తొలగించుము,” అని యేసు క్రీస్తు అడిగారు, “అయినను నా యిష్టముకాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక.

“అప్పుడు పరలోకమునుండి ఒక దూత ఆయనకు కనబడి, ఆయనను బలపరిచెను.”

నేడు మనకు మద్దతివ్వడానికి మన దగ్గరలో దేవదూతలు ఉన్నారు. “[దేవాలయములో,] పరలోకము మరియు భూమికి మధ్య తెరను ఎలా విభజించాలో, దేవుని యొక్క దేవదూతల సహాయము కోసం ఎలా అడగాలో మీరు నేర్చుకుంటారు” అని అధ్యక్షులు నెల్సన్ చెప్పారు.

దేవదూతలు సహకారమందిస్తారు. దేవుని యొక్క సహకారం. “ఇదిగో, నా మాదిరిని మీరు అనుసరించుడి” అని నీఫైయులైన తన అపొస్తలులతో యేసు చెప్పారు. మనం మన ప్రవక్తను ఆమోదిస్తున్నప్పుడు, ఆయన “లోకానికి వెలుగైయున్న” మన రక్షకునిచేత పిలువబడ్డారని మనం సాక్ష్యమిస్తున్నాము.

ప్రియమైన అధ్యక్షులు నెల్సన్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభువు యొక్క సంఘ సభ్యులు మరియు స్నేహితుల తరఫున, మీ బోధనలకు మద్దతివ్వడానికి, క్రీస్తువంటి జీవనానికి మీ మాదిరికి మద్దతివ్వడానికి మరియు మనందరి విమోచకుడైన మన ప్రభువు మరియు రక్షకుని గురించి మీ మనఃపూర్వకమైన సాక్ష్యానికి మద్దతివ్వడానికి మేము ఆశీర్వదించబడినట్లు భావిస్తున్నాము.

యేసు క్రీస్తు “లోకమునకు … వెలుగైయున్నారు” అని అపొస్తలునిగా నేను నా సాక్ష్యమిస్తున్నాను. ఆయన శిష్యులుగా, మనమందరం ఆయన మాదిరిని “అనుసరిద్దాం”. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.

వివరణలు

  1. సిద్ధాంతము మరియు నిబంధనలు 1:38 చూడండి.

  2. 2 నీఫై 4:20-21.

  3. రోనాల్డ్ ఎ. రాస్బాండ్, “మాటలు ముఖ్యమైనవి,” లియహోనా, మే 2024, 70–76 చూడండి.

  4. సిద్ధాంతము మరియు నిబంధనలు 81:5.

  5. మోషైయ 18:8-9.

  6. 3 నీఫై 18:24; వివరణ చేర్చబడింది.

  7. Russell M. Nelson, “Sustaining the Prophets,” Liahona, Nov. 2014, 75.

  8. మోషైయ 2:11.

  9. సిద్ధాంతము మరియు నిబంధనలు 21:6; 81:5 చూడండి.

  10. Harold B. Lee, in Conference Report, Oct. 1970, 153.

  11. యేసు క్రీస్తు సువార్త సంపూర్ణత యొక్క పునఃస్థాపన: ప్రపంచానికి ద్విశతాబ్ది ప్రకటన,”లో ఇలా చెప్పబడింది: “వాగ్దానము చేయబడిన పునఃస్థాపన నిరంతర బయల్పాటు ద్వారా ముందుకు సాగునని మేము సంతోషముగా ప్రకటించుచున్నాము. దేవుడు ‘సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చునప్పుడు’ (ఎఫెసీయులకు 1:10), ఈ భూమి మునుపటిలా ఇంకెన్నడూ ఉండదు.”

  12. Russell M. Nelson, “The Future of the Church: Preparing the World for the Savior’s Second Coming,” Liahona, Apr. 2020, 6–7.

  13. రస్సెల్ ఎమ్. నెల్సన్, “శుద్ధమైన సత్యం, శుద్ధమైన సిద్ధాంతం మరియు శుద్ధమైన బయల్పాటు,” లియహోనా, నవ. 2021, 6.

  14. రస్సెల్ ఎమ్. నెల్సన్, “ఆత్మీయ వేగము యొక్క శక్తి,” లియహోనా, మే 2022, 99.

  15. Dedicatory Prayer, Manti Utah Temple, 21 April 2024,” ChurchofJesusChrist.org.

  16. మోర్మన్ గ్రంథము‌లో, మొరోనై ఒంటరిగా ఉన్నప్పుడు మరియు శత్రువులచే వేటాడబడినప్పుడు, ప్రవక్త మోర్మన్ తన కొడుకు మొరోనైని ఓదార్చడానికి ఒక లేఖలో ప్రయత్నించాడు. అతనిలా వ్రాసాడు, “క్రీస్తు నిన్ను పైకి లేపును గాక; ఆయన శ్రమలు, మరణము … నీ మనస్సునందు నిత్యము నిలిచియుండును గాక” (మొరోనై 9:25).

  17. 1888లో మాంటై యూటా దేవాలయ ప్రతిష్ఠాపనకు ముందు, యూటాలోని మరో రెండు దేవాలయాలు ఇదివరకే ప్రతిష్ఠించబడ్డాయి: 1877లో సెయింట్ జార్జ్ యూటా దేవాలయం మరియు 1884లో లోగన్ యూటా దేవాలయం. పునఃస్థాపన యొక్క మొదటి దేవాలయము ఒహైయోలోని కర్ట్‌లాండ్‌లో నిర్మించబడి, 1836లో ప్రతిష్ఠించబడింది. సేవలతో పాటుగా గొప్ప ఆధ్యాత్మిక ప్రత్యక్షతలు వచ్చాయి మరియు మోషే, ఎలియాసు మరియు ఏలియాలచే యాజకత్వ తాళపుచెవులు పునఃస్థాపించబడ్డాయి, తద్వారా దేవాలయ కార్యము మరియు ఇశ్రాయేలు సమకూర్పు నిజంగా ప్రారంభమవుతుంది.

    జోసెఫ్ స్మిత్ ఇలా నమోదు చేసారు, “ఇది పెంతెకొస్తను పండుగదినము మరియు ఇది నిజంగా గుర్తుంచుకోవడానికి చాలాకాలం పాటు ఉండే ఒక వరము, ఎందుకంటే సందేశము ఈ ప్రదేశం నుండి ప్రపంచం నలుమూలలకు వెళుతుంది మరియు ఈ రోజు యొక్క సంఘటనలు పవిత్ర చరిత్ర యొక్క పేజీలలో వ్రాయబడి అన్ని తరాలకు అందించబడతాయి. పెంతెకోస్తు దినం వలె, ఈ రోజు సర్వోన్నతుడైన దేవుని పరిశుద్ధులకు ఉత్సవ సంవత్సరంగా మరియు సంతోషించే సమయంగా లెక్కించబడుతుంది మరియు జరుపుకోబడుతుంది” (Joseph Smith, Journal, 1835–1836, pp. 189–90, josephsmithpapers.org; spelling, capitalization, and punctuation modernized). పరిశుద్ధులలో అత్యధికులు వారి ఇళ్లను మరియు సమాజాన్ని విడిచిపెట్టిన తర్వాత, నావూ దేవాలయం అధికారికంగా మే 1846లో ప్రతిష్ఠించబడింది. 6,000 కంటే ఎక్కువమంది పరిశుద్ధులు పశ్చిమ దేశాలకు పారిపోయే ముందు దేవాలయ నిబంధనలు చేసుకున్నారు. (See Church History Topics, “Nauvoo Temple,” Gospel Library.)

  18. Russell M. Nelson, in “President Nelson Rededicates Manti Utah Temple,” Apr. 21, 2024, newsroom.ChurchofJesusChrist.org.

  19. See Scott Taylor, “A By-the-Numbers Look at the 168 Temples Announced by President Nelson,” Church News, Apr. 14, 2024, thechurchnews.com.

  20. Russell M. Nelson, “The Future of the Church,” 8–9.

  21. రస్సెల్ ఎమ్. నెల్సన్, “దేవాలయము మరియు మీ ఆత్మీయ పునాది,” లియహోనా, నవ. 2021, 93–94.

  22. రస్సెల్ ఎమ్. నెల్సన్, “యాజకత్వ తాళపుచెవుల బహుమానమందు ఆనందించండి,” లియహోనా, మే 2024, 121.

  23. Russell M. Nelson, “The Atonement,” Ensign, Nov. 1996, 35.

  24. లూకా 22:42-43.

  25. రస్సెల్ ఎమ్. నెల్సన్, “దేవాలయము మరియు మీ ఆత్మీయ పునాది,” 96.

  26. 3 నీఫై 18:24.

  27. 3 నీఫై 11:11.

  28. 3 నీఫై 11:11.