దేవుని కుమారులు మరియు కుమార్తెలు
మనమంతా అక్షరాలా దేవుని పిల్లలమని మనం నిజంగా విశ్వసిస్తాము మరియు ఆ కారణం చేత, మనం ఆయనలా మారగల సామర్థ్యాన్ని కలిగియున్నాము.
ఈ రోజు, దేవుడు బయల్పరచిన అత్యంత సంతోషకరమైన, మహిమాన్వితమైన మరియు శక్తివంతమైన సువార్త సత్యాలలో ఒకదానిని నేను ప్రస్తావించాలనుకుంటున్నాను. అదే సమయంలో, ఈ సత్యము కొరకు మనం వ్యంగ్యంగా విమర్శలకు గురవుతున్నాము. కొన్ని సంవత్సరాల క్రితం నాకు ఎదురైన ఒక అనుభవం ఈ సువార్త సత్యం పట్ల నాకున్న విలువను విస్తారంగా వృద్ధిచేసింది.
సంఘ ప్రతినిధిగా, నేను ఒకసారి ఒక మతపరమైన సమావేశానికి ఆహ్వానించబడ్డాను. అక్కడ ఆ క్షణం నుండి, దాదాపు అన్ని ఇతర క్రైస్తవ సంఘాలు, తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు మరియు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున బాప్తిస్మపు విధిని నీటితో నిర్వహించినంత వరకు, అన్ని బాప్తిస్మములు చెల్లుబాటు అయ్యేవిగా గుర్తించబడతాయని ప్రకటించబడింది. తర్వాత ఈ విధానం యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము ద్వారా నిర్వహించబడే బాప్తిస్మములకు వర్తించదని వివరించబడింది.
సమావేశము తర్వాత నేను ప్రకటనకు బాధ్యత వహించే నాయకుడిని కలిసి ఆ మినహాయింపుకు గల కారణాలను లోతుగా పరిశోధించగలిగాను. మా మధ్య ఒక అద్భుతమైన మరియు తెలివైన సంభాషణ జరిగింది.
క్లుప్తంగా చెప్పాలంటే, ఇతర క్రైస్తవ సంఘాలు తరచు త్రిత్వముగా సూచించే దైవసమూహము గురించిన మన ప్రత్యేక నమ్మకాలతో ఆ మినహాయింపు ప్రధాన సంబంధం కలిగి ఉందని అతను నాకు వివరించాడు. తన విశ్వాసాలను మరియు అతని సంఘ విధానాన్ని నాకు వివరించడానికి అతను సమయాన్ని వెచ్చించినందుకు నేను నా ప్రశంసలను వ్యక్తం చేశాను. మా సంభాషణ ముగింపులో, మేము కౌగిలించుకొని, ఆపై వీడ్కోలు చెప్పుకున్నాము.
నేను మా చర్చ గురించి తరువాత ఆలోచిస్తున్నప్పుడు, ఈ నాయకుడు “త్రిత్వము యొక్క రహస్యం” అని పిలిచే వాటిని కడవరి దిన పరిశుద్ధులు అర్థం చేసుకోలేరని చెప్పడం నా మనస్సును బాధించింది. అతను దేనిని సూచిస్తున్నాడు? సరే, అది దేవుని స్వభావాన్ని గురించి మన అవగాహనకు సంబంధించినది. తండ్రియైన దేవుడు “స్పర్శించగలుగు మనుష్య శరీరమువలె మాంసము, ఎముకలు గల శరీరమును కలిగియుండి ఉన్నతస్థితిలోనున్న వ్యక్తి; [మరియు] అలాగే కుమారుడు కూడా” అని మనము విశ్వసిస్తున్నాము.. ఆ విధంగా, మనం దేవుని స్వభావం గురించి మాట్లాడే ప్రతిసారీ, ఏదో ఒక మార్గంలో ఏదో ఒక విధంగా మన స్వంత స్వభావం గురించి కూడా మాట్లాడుతున్నాము.
మరియు ఇది నిజం, ఎందుకంటే మనమందరం “[ఆయన] స్వరూపంలో, [ఆయన] పోలికతో” సృష్టించబడ్డాము, కాగా కీర్తనాకారుడు నమోదు చేసినట్లుగా, దేవుడు ఇలా అన్నారు, “మీరు దైవములు, మీరందరు సర్వోన్నతుని కుమారులు.” ఇది పునఃస్థాపన యొక్క ఆగమనంతో ఇప్పుడు మన కోసం పునరుద్ధరించబడిన ఒక విలువైన సిద్ధాంతం. సంక్షిప్తముగా, ఇది మన సువార్తికులు మనకు బోధించే మొదటి పాఠం, మొదటి పేరా, మొదటి పంక్తి కంటే ఎక్కువ లేదా తక్కువ కాదు: “దేవుడు మన పరలోక తండ్రి మరియు మనం ఆయన పిల్లలం.”
ఇప్పుడు మీరు ఇలా అనవచ్చు, “కానీ చాలా మంది మనం దేవుని పిల్లలమని నమ్ముతారు.” అవును, నిజమే, కానీ వారి అవగాహన మనం ధృవీకరించే దాని లోతైన అర్థం యొక్క అంతరార్థం నుండి కొంచెం భిన్నంగా ఉండవచ్చు. కడవరి దిన పరిశుద్ధులకు, ఈ బోధన ఒక ఉపమానముగా చెప్పబడేది కాదు. బదులుగా, మనమంతా అక్షరాలా దేవుని పిల్లలమని మనం నిజంగా విశ్వసిస్తాము. ఆయన “[మన] ఆత్మలకు తండ్రి”6 గనుక, మనం ఆయనలా మారే అవకాశం ఉంది, అది కొందరికి అనూహ్యంగా కనిపించవచ్చు.
మొదటి దర్శనము, పునఃస్థాపనకు తలుపులు తెరిచి ఇప్పటికి 200 సంవత్సరాలు దాటింది. ఆ సమయంలో, యువ జోసెఫ్ స్మిత్ ఏ సంఘములో చేరాలో తెలుసుకోవడానికి పరలోకము నుండి మార్గదర్శకత్వం కోరారు. ఆ రోజు ఆయనకు లభించిన బయల్పాటు ద్వారా మరియు తరువాత ఆయనకు ఇవ్వబడిన బయల్పాటులలో, ప్రవక్త జోసెఫ్ దేవుని స్వభావం మరియు ఆయన పిల్లలుగా ఆయనతో మన సంబంధం గురించి జ్ఞానాన్ని పొందారు.
ఆ కారణము చేత, మన పరలోక తండ్రి ఈ అమూల్యమైన సిద్ధాంతాన్ని మొదటి నుండి బోధించారని మనం మిక్కిలి స్పష్టంగా తెలుసుకున్నాము. దీన్ని వివరించడానికి లేఖనాల నుండి కనీసం రెండు వృత్తాంతాలను ఉదహరించడానికి నన్ను అనుమతించండి.
అమూల్యమైన ముత్యములో మోషేకు దేవుడు ఇచ్చిన సూచనలను మీరు గుర్తుంచుకోవచ్చు.
మనము ఇలా చదువుతాము, “దేవుడు మోషేతో ఇలా పలికెను: ఇదిగో, సర్వశక్తిగల దేవుడైన ప్రభువును నేనే, నా నామము అంతములేనిది.” మరొకమాటలో, మోషే, నేను ఎవరో నీవు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అప్పుడు ఆయన ఇలా కూడా అన్నారు, “మరియు ఇదిగో, నీవు నా కుమారుడవు.” తరువాత ఆయన ఇలా చెప్పారు, “నా కుమారుడా మోషే, నేను నీ కొరకు ఒక కార్యమును కలిగియున్నాను; నీవు నా అద్వితీయ కుమారుని పోలియున్నావు.” ఆపై చివరిగా, ఆయన ఇలా ముగించారు, “నా కుమారుడైన మోషే, నేనిప్పుడు ఈ ఒక్క విషయమును నీకు చూపెదను.”
దేవుడు మోషేకు కనీసం ఈ ఒక్క పాఠమైనా బోధించాలని నిశ్చయించుకున్నట్లు కనిపిస్తోంది: “నీవు నా కుమారుడవు,” అని ఆయన కనీసం మూడుసార్లు పునరావృతం చేశారు. నా కుమారుడా అని జోడించకుండా మోషే పేరును కూడా ఆయన ప్రస్తావించలేదు.
అయితే, మోషే ఒంటరిగా విడిచిపెట్టబడిన తర్వాత, దేవుని సన్నిధిలో లేనందున అతను బలహీనంగా భావించాడు. అప్పుడే సాతాను అతన్ని శోధించడానికి వచ్చాడు. మీరు ఇక్కడ ఒక నమూనాను చూడగలరా? అతడు చెప్పిన మొదటి విషయం ఏమిటంటే, “మోషే, మనుష్య కుమారుడా, నన్ను ఆరాధించుము.”
ఈ సందర్భంలో, తనను ఆరాధించమని సాతాను చేసిన అభ్యర్థన కేవలం ఒక పరధ్యానంగా ఉండవచ్చు. ఆ బలహీన క్షణంలో మోషేకు వచ్చిన ఒక భావ సూచకమైన శోధన ఏమిటంటే, గందరగోళానికి గురికావడం మరియు అతను దేవుని బిడ్డ కాదు, “మనుష్య కుమారుడు” మాత్రమే అని నమ్మడం.
“మోషే సాతానును చూచి: నీవెవడవు? అని అడిగాడు. ఏలయనగా ఇదిగో, నేను ఆయన అద్వితీయ కుమారుని పోలియున్న దేవుని కుమారుడను.” అదృష్టవశాత్తూ, మోషే గందరగోళానికి గురికాలేదు మరియు పరధ్యానం చెందడానికి తనను తాను అనుమతించలేదు. నిజంగా అతను ఎవరు అనే పాఠాన్ని అతడు నేర్చుకున్నాడు.
తదుపరి వృత్తాంతము మత్తయి 4లో కనుగొనబడింది. ప్రభువు కేవలం మూడు సార్లు మాత్రమే శోధింపబడ్డారని, పండితులు దీనికి “యేసు యొక్క మూడు శోధనలు” అని పేరు పెట్టారు, కానీ ఇది వాస్తవం కాదు.
ఈ శోధనల యొక్క అర్థం మరియు విషయమును వివరించడానికి వందల గ్యాలన్ల సిరా ఉపయోగించబడింది. మనకు తెలిసినట్లుగా, యేసు అరణ్యమునకు కొనిపోబడెనని వివరించడం ద్వారా ఈ అధ్యాయం ప్రారంభమవుతుంది, “మరియు ఆయన నలువది దినములు నలువదిరాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలి గొనెను.”
సాతాను యొక్క మొదటి శోధన ప్రభువు యొక్క భౌతిక అవసరాలను తృప్తిపరచడానికి మాత్రమే సంబంధించినది. “ఈ రాళ్లు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుము,” అని అతడు రక్షకుడిని సవాలు చేసాడు.
రెండవ ప్రలోభం దేవుణ్ణి శోధించడంతో సంబంధం కలిగియుండవచ్చు: “నీవు క్రిందికి దుముకుము: ఆయన నిన్నుగూర్చి తన దూతల కాజ్ఞాపించును అని వ్రాయబడియున్నది.”
చివరిగా, సాతాను యొక్క మూడవ శోధన ప్రాపంచిక కోరికలు మరియు కీర్తిని సూచిస్తుంది. యేసుకు, “ఈ లోక రాజ్యములన్నిటిని చూపించిన తర్వాత, … నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసినయెడల వీటినన్నిటిని నీకిచ్చెదనని [సాతాను] ఆయనతో చెప్పెను.”
వాస్తవానికి, సాతాను శోధన యొక్క అంతిమ లక్ష్యం, ఆ మూడు నిర్దిష్టమైన రెచ్చగొట్టే విషయాలతో తక్కువ సంబంధం కలిగి ఉండి, యేసు క్రీస్తును ఆయన దైవిక స్వభావాన్ని ప్రశ్నించడానికి శోధించడంతో ఎక్కువ సంబంధం కలిగియుండవచ్చు. “నీవు దేవుని కుమారుడవైతే”; నీవు నిజంగా దానిని విశ్వసిస్తే, ఏదో ఒకటి చేయమని కనీసం రెండు సార్లు సాతాను నుండి సవాలుతో కూడిన ఆరోపణతో ప్రలోభపెట్టడం జరిగింది.
యేసు ఉపవాసముండి ప్రార్థన చేయడానికి అరణ్యమునకు వెళ్ళే ముందు ఏమి జరిగిందో దయచేసి గమనించండి: క్రీస్తు యొక్క బాప్తిస్మపు వృత్తాంతాన్ని మనము కనుగొంటాము. మరియు ఆయన నీటి నుండి బయటకు వచ్చినప్పుడు, “ఆకాశము నుండి ఒక స్వరము ఇలా పలికింది, ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనయందు నేనానందించుచున్నాను.”
మనము ఈ సంబంధమును గమనిస్తున్నామా? మనము ఇక్కడ ఒక నమూనాను గుర్తించగలమా?
మన దైవిక స్వభావం మరియు విధి గురించి మనకు బోధించబడిన ప్రతిసారీ, సమస్త నీతి యొక్క విరోధి వాటిని ప్రశ్నించడానికి మనల్ని ప్రలోభపెట్టడంలో ఆశ్చర్యం లేదు.
వాస్తవంగా మనమెవరమో మనకు నిజంగా తెలిస్తే మన నిర్ణయాలు ఎంతో భిన్నంగా ఉంటాయి.
మనము సవాలుతో కూడిన ప్రపంచంలో, సంక్షోభముగల ప్రపంచంలో జీవిస్తున్నాము, అక్కడ గౌరవప్రదమైన వ్యక్తులు కనీసం మన మానవ గౌరవాన్ని నొక్కి చెప్పడానికి ప్రయత్నిస్తారు, అయితే మనం సంఘానికి చెందినవారమైయుండి మన దృష్టిని పెంచి, మనల్ని దైవత్వంలోనికి ఆహ్వానించే సువార్తను స్వీకరించాము.
“పరలోకమందున్న [మన] తండ్రి పరిపూర్ణుడు గనుక, మీరును పరిపూర్ణులుగా ఉండవలెను” అనే యేసు ఆజ్ఞ, ఆయన యొక్క అధిక అంచనాలకు మరియు మన శాశ్వతమైన అవకాశాలకు స్పష్టమైన ప్రతిబింబం. ఇప్పుడు, ఇవేవీ రాత్రికి రాత్రే జరగవు. అధ్యక్షుడు జెఫ్రీ ఆర్. హాలండ్ మాటల ప్రకారం, ఇది “చివరకు” జరుగుతుంది. కానీ వాగ్దానం ఏమిటంటే, మనం “క్రీస్తు నొద్దకు వచ్చినట్లయితే,” మనము “ఆయనలో పరిపూర్ణులమవుతాము.” దానికి చాలా ప్రయత్నం అవసరం—ఏదో ఒక ప్రయత్నం కాదు, దైవిక ప్రయత్నం. ఆయన ప్రయత్నం!
ఇప్పుడు, శుభవార్త ఏమిటంటే, పరలోకంలో ఉన్న మన తండ్రి క్లుప్తంగా ఇలా చెప్పారు, “ఏలయనగా నరునికి అమర్త్యత్వమును, నిత్యజీవమును ఇచ్చుటయే నా కార్యమును మహిమయైయున్నది.”
అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ యొక్క “సిలెస్టియల్‌గా ఆలోచించండి” అనే ఈ ఆహ్వానం మన దైవిక స్వభావం, మూలం మరియు సంభావ్య గమ్యం గురించి ఒక అద్భుతమైన జ్ఞాపికను సూచిస్తుంది. యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్త త్యాగం ద్వారా మాత్రమే మనం సిలెస్టియల్‌ను పొందగలము.
బహుశా అందుకే సాతాను యేసును ఆయన భూసంబంధమైన పరిచర్య ప్రారంభం నుండి చివరి వరకు అదే శోధనతో ప్రలోభపెట్టాడు. యేసును సిలువపై వ్రేలాడదీసినప్పుడు, “మార్గమున వెళ్లుచుండినవారు, … నీవు దేవుని కుమారుడవైతే, సిలువమీదనుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి” అని మత్తయి నమోదు చేశాడు. ఆయన వాటిని లక్ష్యపెట్టకుండా మనకు అన్ని సిలెస్టియల్ దీవెనలు పొందే మార్గం అందించినందుకు దేవునికి మహిమ కలుగును గాక.
మన ఆనందానికి గొప్ప మూల్యం చెల్లించబడిందని మనం ఎప్పుడూ గుర్తుంచుకుందాం.
నేను అపొస్తలుడైన పౌలుతో పాటు సాక్ష్యమిస్తున్నాను, “మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతోకూడ సాక్ష్యమిచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము; క్రీస్తుతోకూడ మహిమపొందుటకు ఆయనతో శ్రమపడినయెడల, క్రీస్తుతోడి వారసులము.” యేసు క్రీస్తు నామములో, ఆమేన్.