2020–2024
“ఆయనను నేనే”
2024 అక్టోబరు సర్వసభ్య సమావేశము


15:23

“ఆయనను నేనే”

క్రీస్తు యొక్క దాతృత్వము—దైవిక చిత్తానికి పూర్తి విధేయతలో స్పష్టమవుతుంది—నిలకడగా మరియు కొనసాగుతూనే ఉంటుంది.

ఇది విశ్రాంతి దినము మరియు క్రీస్తు గురించి, ఆయన సిలువ వేయబడుట గురించి మాట్లాడడానికి మనము సమకూడాము. నా విమోచకుడు సజీవుడని నాకు తెలుసు!

యేసు యొక్క మర్త్య జీవితపు చివరి వారంలోని ఈ దృశ్యాన్ని పరిశీలించండి. కర్రలతో, కత్తులతో సాయుధులైన రోమన్ సైనికులతో సహా అనేకమంది గుమిగూడారు. చేతిలో జ్యోతులు కలిగి ఉన్న ప్రధాన యాజకుల నుండి వచ్చిన అధికారుల నేతృత్వంలో, ఈ గంభీరమైన గుంపు ఒక నగరాన్ని జయించడానికి బయలుదేరలేదు. ఈ రాత్రి వారు ఒకే ఒక్క వ్యక్తి కోసం వెదుకుతున్నారు, ఆయుధం ధరించడం, సైనిక శిక్షణ పొందడం లేదా అతని మొత్తం జీవితంలో ఎప్పుడూ శారీరక పోరాటంలో పాల్గొనడం తెలియని వ్యక్తి కోసం.

సైనికులు సమీపిస్తున్నప్పుడు, యేసు తన శిష్యులను రక్షించే ప్రయత్నంలో ముందుకు వచ్చి, “మీరెవని వెదకుచున్నారు?” అని అడిగారు. “నజరేయుడైన యేసు” అని వారు జవాబిచ్చారు. “ఆయనను నేనే, అని యేసు చెప్పారు. … … ఆయన–నేనే ఆయనను అని వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేలమీద పడిరి.”

ఇది నాకు, లేఖనాలన్నింటిలో అత్యంత ఉత్తేజకరమైన పంక్తులలో ఒకటి. ఇతర విషయాలతోపాటు, దేవుని కుమారుడు—పాత నిబంధన యొక్క గొప్ప యెహోవా మరియు కొత్త నిబంధన యొక్క మంచి కాపరి, ఎలాంటి ఆయుధాలు ధరించని వాని సన్నిధిలో ఉండడం—గాలివాన తగులకుండా ఈ ఆశ్రయం, సమాధానకర్తయగు ఈ అధిపతి మరియు రాబోవుచున్న మేలుల విషయమై ఈ ప్రధాన యాజకుని యొక్క స్వరాన్ని వినడం మాత్రమే విరోధులను తిప్పి పంపడానికి, వారిని కుప్పలా పోగు చేసి, మొత్తం సమూహము ఆ రాత్రి వంటగదిలో పనిచేయడం మేలని కోరుకునేలా చేయడానికి సరిపోతుందని అది నాకు సూటిగా చెబుతుంది.

కొన్ని రోజుల క్రితం, ఆయన విజయోత్సాహముతో నగరంలోకి ప్రవేశించినప్పుడు, “పట్టణమంతయు”—“ఈయన ఎవరు?” అని కలవరపడిందని లేఖనం చెబుతోంది. “ఈయన ఎవరు?” అనేది ఆ గందరగోళ సైనికులు ఇప్పుడు అడుగుతున్న ప్రశ్న! అని మాత్రమే నేను ఊహించగలను.

ఆ ప్రశ్నకు జవాబు ఆయన చూపుల్లో ఉండకపోవచ్చు, ఎందుకంటే యెషయా దాదాపు ఏడు శతాబ్దాల క్రితం ఇలా ప్రవచించాడు, “అతనికి సురూపమైనను సొగసైనను లేదు మనమతని చూచి, అపేక్షించునట్లుగా అతనియందు సురూపము లేదు.” ఇది ఖచ్చితంగా శుద్ధిచేయబడిన ఆయన వస్త్రాల‌లో లేదా గొప్ప వ్యక్తిగత సంపదలో లేదు, ఇందులో ఏదీ ఆయనకు లేదు. ఇది స్థానిక ప్రార్థనా మందిరాల్లో వృత్తిపరమైన శిక్షణ వల్ల రాదు, ఎందుకంటే ఆయన వాటిలో దేనిలోనైనా చదువుకున్నట్లు మనకు ఆధారాలు లేవు, అయినప్పటికీ ఆయన తన యవ్వనంలో అద్భుతంగా సిద్ధమైన లేఖకులను మరియు న్యాయవాదులను కలవరపెట్టగలిగి, “అధికారము గలవానివలె” తన సిద్ధాంతంతో వారిని ఆశ్చర్యపరిచారు.”

దేవాలయంలో ఆ బోధన నుండి యెరూషలేములోకి ఆయన విజయవంతమైన ప్రవేశం మరియు ఈ చివరి, అన్యాయమైన ఖైదు వరకు, యేసు మామూలుగా కష్టతరమైన, తరచుగా మోసపూరితమైన పరిస్థితులలో ఉంచబడ్డారు, వాటిలో ఆయన ఎల్లప్పుడూ విజయం సాధించారు—దైవ DNA అని తప్ప మనకు వివరణ లేని విజయాలవి.

అయినప్పటికీ, చరిత్రలో చాలామంది మన దృష్టిలో ఆయన ప్రతిరూపాన్ని మరియు ఆయన ఎవరు అనేదానికి ఆయన సాక్ష్యాన్ని సరళీకరించారు, చిన్నచూపు చూసారు. వారు ఆయన నీతిని కేవలం వివేకానికి, ఆయన న్యాయాన్ని కేవలం కోపానికి, ఆయన దయను కేవలం అనుమతికి తగ్గించారు. మనకు అసౌకర్యంగా అనిపించే బోధనలను సౌకర్యవంతంగా విస్మరించే ఆయన యొక్క సరళమైన సంస్కరణలకు మనం దోషిగా ఉండకూడదు. ఆయనను అంతిమంగా నిర్వచించే సుగుణమైన ఆయన ప్రేమకు సంబంధించి కూడా ఈ “మూగబోవడం” నిజమైంది.

ఆయన మర్త్య పరిచర్యలో యేసు రెండు గొప్ప ఆజ్ఞలున్నాయని బోధించారు. అవి ఈ సమావేశంలో బోధించబడ్డాయి మరియు ఎప్పటికీ బోధించబడతాయి: “నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను [మరియు] నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెను.” ఈ రెండు కీలకమైన మరియు విడదీయరాని విధంగా అనుసంధానించబడిన నియమాలలో మనం విశ్వాసంతో రక్షకుడిని అనుసరించాలంటే, ఆయన నిజంగా చెప్పినదానిని మనం స్థిరంగా ఆచరించాలి. ఆయన నిజంగా మనకు చెప్పినది ఏమిటంటే, “మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు.” అదే రోజు సాయంత్రం, “నేను మిమ్మును ప్రేమించినట్టే, మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను” అని ఆయన చెప్పారు.

ఆ లేఖనాలలో, నిజమైన, క్రీస్తులాంటి ప్రేమను నిర్వచించే అర్హతగల ఆ వాక్యభాగాలు—కొన్నిసార్లు దాతృత్వంగా సూచించబడినవి—ఖచ్ఛితంగా ఆవశ్యకమైనవి.

అవి దేనిని నిర్వచిస్తాయి? యేసు ఎలా ప్రేమించారు?

మొదటిది, ఆయన “[తన] పూర్ణ హృదయము, శక్తి, మనస్సు మరియు బలముతో” ప్రేమించారు, అది తీవ్రమైన బాధను నయం చేయడానికి మరియు కఠినమైన సత్యాలను మాట్లాడడానికి ఆయనకు సామర్థ్యాన్ని ఇచ్చింది. సంక్షిప్తంగా, ఆయన కృపను చూపగలరు మరియు అదే సమయంలో సత్యాన్ని నొక్కి చెప్పగలరు. లీహై తన కుమారుడైన జేకబ్‌కు ఇచ్చిన దీవెనలో చెప్పినట్లు, “పరిశుద్ధ మెస్సీయ యందు మరియు ఆయన ద్వారానే విమోచన వచ్చును. ఏలయనగా, ఆయన కృపాసత్యసంపూర్ణుడైయున్నాడు.” ఆయన ప్రేమ అవసరమైనప్పుడు ప్రోత్సాహకరమైన ఆలింగనాన్ని మరియు మింగవలసి వచ్చినప్పుడు చేదు గిన్నెను అనుమతిస్తుంది. కాబట్టి మనం మన పూర్ణ హృదయము, శక్తి, మనస్సు మరియు బలముతో ప్రేమించడానికి ప్రయత్నిస్తాము—ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్న విధానం అదే.

యేసు యొక్క దైవిక దాతృత్వం యొక్క రెండవ లక్షణం ఏమిటంటే, ఎల్లప్పుడూ ఆయన చిత్తాన్ని మరియు ప్రవర్తనను తన పరలోక తండ్రి చిత్తానికి అనుగుణంగా ఉంచుతూ, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాటకు ఆయన విధేయత చూపడం.

ఆయన తన పునరుత్థానం తరువాత పశ్చిమ అర్థగోళంలోకి వచ్చినప్పుడు, క్రీస్తు నీఫైయు‌లతో ఇలా అన్నారు: “ఇదిగో, నేను యేసు క్రీస్తును. … తండ్రి నాకు ఇచ్చిన ఆ చేదు గిన్నె నుండి నేను తాగియున్నాను, …ఆది నుండి … తండ్రి యొక్క చిత్తమునకు లోబడియుండుటకు నేను దానిని సహించియున్నాను.”

తననుతాను పరిచయం చేసుకోగలిగే అనేక మార్గాలలో, యేసు తండ్రి చిత్తానికి విధేయత చూపడం ద్వారా అలా చేసారు—అయినప్పటికీ, కొంతకాలానికే ఆయనకు అత్యంత అవసరం ఉన్న సమయంలో, ఈ దేవుని అద్వితీయ కుమారుడు తన తండ్రిచేత పూర్తిగా విడిచిపెట్టబడినట్లు భావించారు. క్రీస్తు యొక్క దాతృత్వం—దైవిక చిత్తానికి పూర్తి విధేయతలో స్పష్టమవుతుంది—సులభమైన మరియు సౌకర్యవంతమైన రోజులలో మాత్రమే కాకుండా, ప్రత్యేకించి సవాళ్ళుగల మరియు అత్యంత కష్టతరమైన రోజులలో నిలకడగా మరియు కొనసాగుతూనే ఉంటుంది.

యేసు “వ్యసనాక్రాంతుడు,” అని లేఖనాలు చెబుతున్నాయి. విచారం, అలసట, నిరాశ మరియు విపరీతమైన ఒంటరితనాన్ని ఆయన అనుభవించారు. వీటిలో మరియు అన్ని సమయాలలో, యేసు ప్రేమ విఫలం కాదు మరియు ఆయన తండ్రిది కూడా విఫలం కాదు. ఉదాహరణగా నిలిచేది, శక్తినిచ్చేది మరియు విశదీకరించేది—అటువంటి పరిపక్వమైన, నిజమైన ప్రేమతో—మన ప్రేమ కూడా విఫలం కాదు.

కాబట్టి, కొన్నిసార్లు మీరు ఎంత కష్టపడి ప్రయత్నిస్తే, దాన్ని పొందడం అంత కష్టమవుతుంది; ఒకవేళ, మీరు మీ పరిమితులు మరియు లోపాలపై పని చేయడానికి ప్రయత్నించినట్లే, మీ విశ్వాసాన్ని సవాలు చేయడానికి ఎవరైనా లేదా ఏదైనా నిశ్చయించుకున్నట్లయితే; మీరు అంకితభావంతో శ్రమిస్తున్నప్పుడు, మీరు ఇప్పటికీ భయంతో నిండియున్నట్లు భావిస్తే, ప్రతీ యుగంలో కొంతమంది అత్యంత నమ్మకమైన మరియు అద్భుతమైన విశ్వాసులకు కూడా ఇలాగే జరిగిందని గుర్తుంచుకోండి. మీరు చేసే ప్రతి మంచి పనిని వ్యతిరేకించడానికి విశ్వంలో ఒక శక్తి ఉందని గుర్తుంచుకోండి.

కాబట్టి, సమృద్ధిలో మరియు పేదరికంలో, వ్యక్తిగత ప్రశంసలలో మరియు బహిరంగ విమర్శలలో, పునరుద్ధరణ యొక్క దైవిక మూలకాల ద్వారా అలాగే అనివార్యంగా దానిలో భాగమయ్యే మానవ లోపాల ద్వారా, మనము క్రీస్తు యొక్క నిజమైన సంఘముతో కొనసాగుతూ ఉంటాము. ఎందుకు? ఎందుకంటే మన విమోచకుని మాదిరిగానే, మనము మొత్తం సమయం కొరకు—చిన్న పీఠికకు కాకుండా, అంతిమ పరీక్ష కొరకు సిద్ధపడేందుకు నిర్ణయించుకున్నాము. ఇందులో ఆనందం ఏమిటంటే, పాఠ్యక్రమం ప్రారంభానికి ముందే ప్రధానోపాధ్యాయుడు మనందరికీ తెరచిన-పుస్తకపు సమాధానాలు ఇచ్చారు. ఇంకా, మన వద్ద చాలామంది బోధకులు ఉన్నారు, వారు దారి పొడవునా నియమిత ప్రదేశాలలో ఆ సమాధానాలను మనకు గుర్తు చేస్తారు. అయితే, మనము తరగతికి హాజరు కాకపోతే ఇవేవీ బాగా పని చేయవు.

“మీరేమి వెదకుచున్నారు?” “నజరేయుడైన యేసును” అని మన పూర్ణ హృదయాలతో మనం జవాబిస్తాము. “ఆయనను నేనే,” అని ఆయన చెప్పినప్పుడు, మనం మోకరించి, ఆయనే జీవముతోనున్న క్రీస్తు అని, ఆయన ఒక్కరే మన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసారని, ఆయన మనల్ని విడిచిపెట్టారని అనుకున్నప్పుడు కూడా మనల్ని మోస్తున్నారని మన నాలుకతో ఒప్పుకుంటాం. మనం ఆయన ఎదుట నిలబడి, ఆయన చేతుల్లో, పాదాల్లో ఉన్న గాయాలను చూసినప్పుడు, ఆయన తన తండ్రి చిత్తానికి పూర్తిగా విధేయత చూపడం, మన పాపాలను భరించడం మరియు వ్యాధిననుభవించడం అంటే ఏమిటో మనం అర్థం చేసుకోవడం ప్రారంభిస్తాము—అంతా మన పట్ల ఉన్న స్వచ్ఛమైన ప్రేమ కారణంగానే. విశ్వాసం, పశ్చాత్తాపం, బాప్తిస్మం, పరిశుద్ధాత్మ వరము మరియు ప్రభువు యొక్క మందిరములో మన ఆశీర్వాదాలను పొందడం—ఇవి చివరికి దేవునిపట్ల, పొరుగువారి పట్ల మనకున్న ప్రేమను బయల్పరిచే మరియు క్రీస్తు యొక్క నిజమైన సంఘాన్ని ఆనందంగా వర్ణించే ప్రాథమిక “నియమములు, విధులు”.

సహోదర సహోదరీలారా, మన ఉన్నతస్థితి కొరకు దేవుడు అందించిన మార్గమే యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘము అని నేను సాక్ష్యమిస్తున్నాను. అది బోధించే సువార్త నిజమైనది మరియు దానిని చట్టబద్ధం చేసే యాజకత్వము భూలోక మూలాలపై ఆధారపడదు. రస్సెల్ ఎమ్. నెల్సన్, ఆయనకు ముందున్న వారు మరియు ఆయన తరువాత వచ్చేవారి వలె మన దేవుని ప్రవక్త అని నేను సాక్ష్యమిస్తున్నాను. మన రక్షణకు రాయబారి “తూర్పున పుట్టిన మెరుపు” వలె దిగి రావడాన్ని చూడడానికి సిద్ధమైన తరానికి ఒక రోజు ఆ ప్రవచనాత్మక మార్గదర్శకత్వం దారి చూపుతుంది మరియు మనము “నజరేయుడైన యేసు” అని కేకవేస్తాము. శాశ్వతంగా చాపబడిన బాహువులతో మరియు నిష్కపటమైన ప్రేమతో, “ఆయనను నేనే” అని ఆయన జవాబిస్తారు. ఈవిధంగా అపొస్తలుని శక్తి మరియు అధికారంతో, యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో నేను వాగ్దానమిస్తున్నాను, ఆమేన్.