2020–2024
మూలాలను పోషించండి, కొమ్మలు పెరుగుతాయి
2024 అక్టోబరు సర్వసభ్య సమావేశము


14:31

మూలాలను పోషించండి, కొమ్మలు పెరుగుతాయి

మీ సాక్ష్యం యొక్క కొమ్మలు పరలోక తండ్రి మరియు ఆయన ప్రియ కుమారుని యందు మీ లోతైన విశ్వాసం నుండి బలాన్ని పొందుతాయి.

స్వికావ్‌లో ఒక పాత ప్రార్థనామందిరం

ఒక రకంగా 2024వ సంవత్సరం నాకొక మైలురాయి వంటిది. నేను బాప్తిస్మం పొంది, జర్మనీలోని స్వికావ్‌లో ఉన్న యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘ సభ్యునిగా నిర్ధారించబడి 75 సంవత్సరాలు పూర్తయింది.

యేసు క్రీస్తు యొక్క సంఘములో నా సభ్యత్వం నాకు అమూల్యమైనది. నా సహోదర సహోదరీలారా, మీతోపాటు, దేవుని యొక్క నిబంధన జనుల మధ్య లెక్కింపబడడం నా జీవితంలోని గొప్ప గౌరవాలలో ఒకటి.

శిష్యత్వానికి సంబంధించిన నా వ్యక్తిగత ప్రయాణం గురించి ఆలోచించినప్పుడు, నాకు తరచుగా స్వికావ్‌లోని పాత బంగళా గుర్తొస్తుంది, అక్కడ నాకు చిన్నతనంలో యేసు క్రీస్తు సంఘము యొక్క సంస్కార సమావేశాలకు హాజరైన ప్రియమైన జ్ఞాపకాలున్నాయి. అక్కడ నా సాక్ష్యపు అంకురం దాని ప్రారంభ పోషణను పొందింది.

ఈ ప్రార్థనామందిరంలో గాలితో నడిచే పాత ఆర్గాన్ ఉండేది. ప్రతి ఆదివారం ఆర్గాన్ పని చేయడానికి ధ్వనిని నిర్వహించే దృఢమైన మీటను పైకి క్రిందికి నెట్టడానికి ఒక యువకుడు నియమించబడేవాడు. ఈ ముఖ్యమైన పనిలో సహాయం చేసే గొప్ప విశేషాధికారాన్ని నేను కొన్నిసార్లు పొందాను.

సమూహం మా ప్రియమైన కీర్తనలు పాడుతుండగా, ఆర్గాన్‌లో గాలి అయిపోకుండా ఉండేందుకు నేను నా శక్తికొద్దీ నింపాను. ధ్వని నిర్వాహకుని స్థానం నుండి, నేను కొన్ని అద్భుతమైన గాజు కిటికీల గొప్ప వీక్షణను కలిగి ఉన్నాను, ఒకటి రక్షకుడైన యేసు క్రీస్తును, మరొకటి పరిశుద్ధ వనము‌లో జోసెఫ్ స్మిత్‌ను చిత్రీకరిస్తుంది.

పరిశుద్ధుల సాక్ష్యాలను వింటూ, సీయోను కీర్తనలను పాడుతుండగా సూర్యకాంతి పడిన కిటికీలను చూస్తున్నప్పుడు నాకు కలిగిన పవిత్రమైన భావాలు ఇప్పటికీ నాకు గుర్తున్నాయి.

ఆ పరిశుద్ధ స్థలంలో, ఇది నిజమని దేవుని ఆత్మ నా మనస్సుకు, హృదయానికి సాక్ష్యమిచ్చింది: యేసు క్రీస్తు లోక రక్షకుడు. ఇది ఆయన సంఘము. ప్రవక్త జోసెఫ్ స్మిత్ తండ్రియైన దేవుడు మరియు యేసు క్రీస్తును చూసారు, వారి స్వరాలను విన్నారు.

ఈ సంవత్సరం ప్రారంభంలో, యూరప్‌లో ఒక నియామకంపై, స్వికావ్‌కు తిరిగివెళ్ళే అవకాశం నాకు లభించింది. ప్రియమైన ఆ పాత ప్రార్థనామందిరం అక్కడ లేకపోవడం విచారకరం. ఒక పెద్ద అపార్ట్‌మెంటు కట్టడానికి చాలా సంవత్సరాల క్రితం అది కూల్చివేయబడింది.

ఏది నిత్యమైనది మరియు ఏది కాదు?

నా చిన్ననాటి ప్రియమైన భవనం ఇప్పుడు కేవలం ఒక జ్ఞాపకమని తెలుసుకోవడం విచారకరమని నేను ఒప్పుకుంటున్నాను. నా దృష్టిలో అది పవిత్రమైన భవనం. కానీ అది ఒక భవనం మాత్రమే.

దానికి విరుద్ధంగా, చాలా సంవత్సరాల క్రితం నేను పరిశుద్ధాత్మ నుండి పొందిన ఆత్మీయ సాక్ష్యం గతించిపోలేదు. నిజానికి అది మరింత బలపడింది. యేసు క్రీస్తు సువార్త యొక్క ప్రాథమిక సూత్రాల గురించి నా యవ్వనంలో నేను నేర్చుకున్న విషయాలు నా జీవితమంతా నా స్థిరమైన పునాదిగా ఉన్నాయి. నా పరలోక తండ్రితో మరియు ఆయన ప్రియమైన కుమారునితో నేను కల్పించుకున్న నిబంధన సంబంధం నాతోనే నిలిచింది—స్వికావ్ ప్రార్థనామందిరం కూల్చివేయబడిన తర్వాత మరియు గాజు కిటికీలు పోయిన చాలా కాలం తర్వాత కూడా.

“భూమియు ఆకాశమును గతించినను, నా మాటలు ఏ మాత్రము గతింపవు” అని యేసు చెప్పారు.

“పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు, సమాధానవిషయమైన నా నిబంధన తొలగిపోదు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు.”

ఈ జీవితంలో మనము నేర్చుకోగల అతి ముఖ్యమైన విషయాలలో ఒకటి, ఏది నిత్యమైనది మరియు ఏది కాదు అనే వాటి మధ్య వ్యత్యాసం. ఒకసారి మనం దానిని అర్థం చేసుకుంటే—మన అనుబంధాలు, మనం చేసే ఎంపికలు, మనం జనులను ఆదరించే తీరు అన్నీ మారతాయి.

ఏది నిత్యమైనది మరియు ఏది కాదు అని తెలుసుకోవడం యేసు క్రీస్తు మరియు ఆయన సంఘము గురించి సాక్ష్యాన్ని పెంచుకోవడంలో కీలకమైనది.

కొమ్మలను చూసి మూలాలని తప్పుగా అనుకోవద్దు

ప్రవక్త జోసెఫ్ స్మిత్ బోధించినట్లు, యేసు క్రీస్తు యొక్క పునఃస్థాపించబడిన సువార్త, “అన్నిటిని, సత్యము యొక్క ప్రతీ అంశాన్ని హత్తుకుంటుంది.” కానీ దాని అర్థము, అన్ని సత్యాలు సమానమైన విలువను కలిగియున్నాయని కాదు. మన విశ్వాసానికి పునాదిగా ఉన్న కొన్ని సత్యాలు కీలకమైనవి, ఆవశ్యకమైనవి. మిగిలినవి అనుబంధములు లేదా కొమ్మలు—విలువైనవే, కానీ అవి ప్రధానమైన వాటితో జతచేయబడినప్పుడు మాత్రమే.

ప్రవక్త జోసెఫ్ ఇలా కూడా చెప్పారు, “మన మతం యొక్క ప్రాథమిక సూత్రాలు ఏవనగా, యేసు క్రీస్తు మరణించారని, సమాధి చేయబడ్డారని, మూడవరోజు తిరిగి లేచారని మరియు పరలోకంలోకి ఆరోహణమయ్యారని ఆయనకు సంబంధించి అపొస్తలులు మరియు ప్రవక్తల యొక్క సాక్ష్యము; మన మతానికి సంబంధించిన మిగతావన్నీ దానికి అనుబంధములు మాత్రమే.”

మరొకమాటలో చెప్పాలంటే, యేసు క్రీస్తు మరియు ఆయన ప్రాయశ్చిత్త త్యాగము మన సాక్ష్యము యొక్క మూలాలు. మిగతావన్నీ కొమ్మలు.

కొమ్మలు ముఖ్యమైనవి కాదని చెప్పడం లేదు. చెట్టుకు కొమ్మలు అవసరం. కానీ రక్షకుడు తన శిష్యులకు చెప్పినట్లు, “తీగె ద్రాక్షావల్లిలో నిలిచి యుంటేనేగాని తనంతట తానే ఫలింపదు.” రక్షకునితో సంబంధం లేకుండా మూలాల్లో కనిపించే పోషణకు, ఒక కొమ్మ ఎండిపోయి చనిపోతుంది.

యేసు క్రీస్తు గురించి మన సాక్ష్యాలను పోషించే విషయానికి వస్తే, మనం కొన్నిసార్లు కొమ్మలను చూసి మూలాలు అనుకుంటామేమో అని నేను ఆశ్చర్యపోతాను. యేసు తన కాలంలోని పరిసయ్యులలో గమనించిన తప్పు ఇదే. వారు ధర్మశాస్త్రంలోని అత్యంత చిన్న వివరాలపట్ల ఎంతగానో శ్రద్ధ చూపారు, కానీ చివరికి “ప్రధానమైన విషయములు” అని రక్షకుడు పిలిచిన— “న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టారు.”

మీరు చెట్టును పోషించాలనుకుంటే, మీరు కొమ్మలపై నీళ్ళు చల్లరు. మీరు మూలాలకు నీళ్ళు పోస్తారు. అదేవిధంగా, మీ సాక్ష్యం యొక్క కొమ్మలు పెరగాలి మరియు ఫలాలను ఇవ్వాలనుకుంటే, మూలాలను పోషించండి. సంఘ చరిత్రలోని నిర్దిష్ట సిద్ధాంతం, అభ్యాసం లేదా అంశం గురించి మీకు సందేహం ఉంటే, యేసు క్రీస్తుపై విశ్వాసంతో స్పష్టత కోసం వెదకండి. మీ కోసం ఆయన త్యాగం, మీ పట్ల ఆయనకున్న ప్రేమ, మీ కొరకు ఆయన చిత్తాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. వినయంతో ఆయనను అనుసరించండి. మీ సాక్ష్యం యొక్క కొమ్మలు పరలోక తండ్రి మరియు ఆయన ప్రియ కుమారుని యందు మీ లోతైన విశ్వాసం నుండి బలాన్ని పొందుతాయి.

ఉదాహరణకు, మీరు మోర్మన్ గ్రంథము గురించి బలమైన సాక్ష్యం కావాలనుకుంటే, యేసు క్రీస్తు గురించి అది ఇచ్చే సాక్ష్యంపై దృష్టి పెట్టండి. మోర్మన్ గ్రంథము ఆయన గురించి ఎలా సాక్ష్యమిస్తుందో, ఆయన గురించి ఏమి బోధిస్తున్నదో, ఆయన వద్దకు రావాలని అది మిమ్మల్ని ఎలా ఆహ్వానిస్తుందో మరియు ఎలా ప్రేరేపిస్తుందో గమనించండి.

మీరు సంఘ సమావేశాలలో లేదా దేవాలయంలో మరింత అర్థవంతమైన అనుభవాన్ని కోరుకుంటే, అక్కడ మనం పొందే పవిత్ర విధులలో రక్షకుని కోసం వెదకడానికి ప్రయత్నించండి. ప్రభువును ఆయన పరిశుద్ధ మందిరంలో కనుగొనండి.

మీ సంఘ పిలుపుతో మీరు ఎప్పుడైనా అలసిపోయినట్లు లేదా ఉక్కిరిబిక్కిరి అయినట్లు భావిస్తే, యేసు క్రీస్తుపై మీ సేవను మళ్ళీ కేంద్రీకరించడానికి ప్రయత్నించండి. దానిని ఆయన పట్ల మీకున్న ప్రేమకు వ్యక్తీకరణగా చేయండి.

మూలాలను పోషించండి, కొమ్మలు పెరుగుతాయి. మరియు కాలక్రమేణా, అవి ఫలిస్తాయి.

ఆయనయందు వేరుపారినవారై కట్టబడుదురు

యేసు క్రీస్తుపై బలమైన విశ్వాసం ఒక్క రాత్రిలో రాదు. ఈ మర్త్య ప్రపంచంలో, సందేహం యొక్క ముండ్ల తుప్పలు, గచ్చపొదలు సహజంగా పెరుగుతాయి. విశ్వాసం యొక్క ఆరోగ్యకరమైన, ఫలవంతమైన చెట్టుకు ఉద్దేశపూర్వక ప్రయత్నం అవసరం. మరియు ఆ ప్రయత్నంలో ఒక ముఖ్యమైన భాగం, మనం క్రీస్తులో దృఢంగా వేరుపారినట్లు నిర్ధారించుకోవడం.

ఉదాహరణకు: మొదట, మనం రక్షకుని సువార్త మరియు సంఘము వైపు ఆకర్షితులం కావచ్చు, ఎందుకంటే మనం స్నేహపూర్వక సభ్యులు, దయగల బిషప్పు లేదా ప్రార్థనామందిరం యొక్క శుభ్రత చేత ఆకట్టుకోబడ్డాము. ఈ పరిస్థితులు సంఘము ఎదగడానికి ఖచ్చితంగా ముఖ్యమైనవి.

అయినప్పటికీ, మన సాక్ష్యం యొక్క మూలాలు అంతకన్నా లోతుగా ఎదగకపోతే, అంతగా స్నేహపూర్వకంగా లేని సభ్యులతో, అంతగా ఆకట్టుకోని భవనంలో కలిసే వార్డుకు మనం మారినప్పుడు మరియు బిషప్పు మనల్ని కించపరిచే విధంగా మాట్లాడినప్పుడు ఏమి జరుగుతుంది?

మరొక ఉదాహరణ: మనం ఆజ్ఞలను పాటించి, దేవాలయంలో ముద్రవేయబడితే, మనము తెలివైన, విధేయతగల పిల్లలతో కూడిన పెద్ద, సంతోషకరమైన కుటుంబంతో ఆశీర్వదించబడతామని, వారందరు సంఘములో క్రియాశీలకంగా ఉంటారని, సువార్తసేవ చేస్తారని, వార్డు గాయకబృందంలో పాడతారని మరియు ప్రతి శనివారం ఉదయం సమావేశమందిరాన్ని శుభ్రం చేయడానికి స్వచ్ఛందంగా సహాయం చేస్తారని ఆశించడం సమంజసంగా అనిపించట్లేదా?

మనమందరం దీనిని మన జీవితాల్లో చూస్తామని నేను ఖచ్చితంగా ఆశిస్తున్నాను. కానీ అది జరుగకపోతే ఏమవుతుంది? పరిస్థితులతో సంబంధం లేకుండా—ఆయనను మరియు ఆయన సమయాన్ని నమ్ముతూ మనం రక్షకునికి కట్టుబడి ఉంటామా?

మనల్ని మనం ఇలా ప్రశ్నించుకోవాలి: నా సాక్ష్యం నా జీవితంలో జరగాలని నేను ఆశిస్తున్న దానిపై ఆధారపడి ఉందా? అది ఇతరుల చర్యలు లేదా వైఖరిపై ఆధారపడి ఉందా? లేదా అది జీవితంలో మారుతున్న పరిస్థితులతో సంబంధం లేకుండా, “ఆయనయందు వేరుపారినదై కట్టబడి,” యేసు క్రీస్తుపై దృఢంగా స్థాపించబడిందా?

సంప్రదాయాలు, అలవాట్లు మరియు విశ్వాసం

మోర్మన్ గ్రంథము “దేవుని విధులను ఆచరించుట యందు ఖచ్ఛితముగా” ఉన్న జనుల గురించి చెబుతుంది. అయితే కొరిహోర్ అనే సంశయవాది రక్షకుని సువార్తను ఎగతాళి చేస్తూ, దానిని “వారి పితరుల యొక్క మూర్ఖమైన” మరియు “అవివేకపు సంప్రదాయాలు” అని పిలుస్తూ అక్కడికి వచ్చాడు. కొరిహోర్ “అనేకుల హృదయములను నడిపించివేయుచూ, దుష్టత్వమందు వారు గర్వించునట్లు చేసాడు.” కానీ ఇతరులను అతను మోసం చేయలేకపోయాడు, ఎందుకంటే వారికి, యేసు క్రీస్తు సువార్త ఒక సంప్రదాయం కంటే చాలా ఎక్కువైనది.

వ్యక్తిగత అనుభవంలో లోతైన మూలాలు, యేసు క్రీస్తు పట్ల వ్యక్తిగత నిబద్ధత కలిగియున్నప్పుడు, మన సంప్రదాయాలు ఏమిటి, ఇతరులు ఏమి చెప్పవచ్చు లేదా ఏమి చేయవచ్చు అనే వాటికి దూరంగా ఉన్నప్పుడు, విశ్వాసం బలంగా ఉంటుంది.

మన సాక్ష్యం పరీక్షించబడుతుంది మరియు కష్టాలకు గురవుతుంది. ఎన్నడూ పరీక్షించబడకపోతే విశ్వాసం విశ్వాసమే కాదు. ఎన్నడూ వ్యతిరేకించబడకపోతే విశ్వాసం బలంగా ఉండదు. కాబట్టి మీకు విశ్వాసం యొక్క పరీక్షలు లేదా సమాధానం లేని ప్రశ్నలు ఉంటే నిరాశ చెందకండి.

మనం చర్య తీసుకునే ముందు ప్రతిదీ అర్థం చేసుకోవాలని ఆశించకూడదు. అది విశ్వాసం కాదు. ఆల్మా బోధించినట్లుగా, “విశ్వాసము విషయముల యొక్క పరిపూర్ణ జ్ఞానము కలిగియుండుట కాదు.” మన ప్రశ్నలన్నింటికీ సమాధానాలు లభించే వరకు మనము చర్య తీసుకోవడానికి వేచియుంటే, మనం సాధించగల మంచిని మనము తీవ్రంగా పరిమితం చేస్తాము మరియు మన విశ్వాసం యొక్క శక్తిని పరిమితం చేస్తాము.

విశ్వాసం అందంగా ఉంటుంది, ఎందుకంటే ఆశీర్వాదాలు ఆశించినంతగా రాకపోయినా విశ్వాసం కొనసాగుతుంది. మనము భవిష్యత్తును చూడలేము, మనకు అన్ని సమాధానాలు తెలియవు, కానీ యేసు క్రీస్తు మన రక్షకుడు మరియు విమోచకుడు కాబట్టి మనం పురోగమిస్తున్నప్పుడు ఆయనను నమ్మవచ్చు.

విశ్వాసం జీవితంలోని పరీక్షలను, అనిశ్చితులను సహిస్తుంది, ఎందుకంటే అది క్రీస్తు మరియు ఆయన సిద్ధాంతంలో దృఢంగా పాతుకుపోయింది. యేసు క్రీస్తు మరియు ఆయనను పంపిన పరలోకంలో ఉన్న మన తండ్రి, కలిసి మనం నమ్మకముంచగల అచంచలమైన, పూర్తిగా ఆధారపడదగిన వ్యక్తిగా అవుతారు.

సాక్ష్యం అనేది మీరు ఒకసారి నిర్మిస్తే, శాశ్వతంగా నిలిచియుండేది కాదు. అది మీరు నిరంతరం పోషించే ఒక చెట్టు లాంటిది. మీ హృదయంలో దేవుని వాక్యాన్ని నాటడం మొదటి మెట్టు మాత్రమే. మీ సాక్ష్యం పెరగడం ప్రారంభించిన తర్వాత, నిజమైన పని మొదలవుతుంది! అలాంటప్పుడే “అది వేరు పారునట్లు, పైకి పెరుగునట్లు మరియు ఫలము ఫలించునట్లు మీరు దానిని అధిక శ్రద్ధతో పోషిస్తారు.” దానికి “వాక్యం పట్ల అధిక శ్రద్ధ” మరియు “సహనం” అవసరం. కానీ ప్రభువు వాగ్దానాలు ఖచ్చితమైనవి: “చెట్టు మీకు ఫలము ఫలించు వరకు కనిపెట్టుచూ మీ విశ్వాసము, మీ శ్రద్ధ, సహనము మరియు దీర్ఘశాంతము యొక్క బహుమానములను మీరు పొందెదరు.”

నా ప్రియమైన సహోదర సహోదరీలారా, నా స్నేహితులారా, పాత స్వికావ్ ప్రార్థనామందిరం మరియు దాని గాజు కిటికీలను కోల్పోవడం గురించి నాలో ఒక భాగం చింతిస్తుంది. కానీ గత 75 సంవత్సరాలుగా, నేను ఊహించనంత ఉత్కంఠభరితమైన జీవిత ప్రయాణంలో యేసు క్రీస్తు నన్ను నడిపించారు. నా బాధల్లో ఆయన నన్ను ఓదార్చారు, నా బలహీనతలను గుర్తించడంలో నాకు సహాయం చేసారు, నా ఆధ్యాత్మిక గాయాలను నయం చేసారు మరియు ఎదుగుతున్న నా విశ్వాసంలో నన్ను పోషించారు.

రక్షకునిపై, ఆయన సిద్ధాంతము మరియు ఆయన సంఘముపై మన విశ్వాసం యొక్క మూలాలను నిరంతరం పోషించాలని నా హృదయపూర్వక ప్రార్థన మరియు దీవెన. దీని గురించి మన రక్షకుడు, మన విమోచకుడు మరియు మన యజమానియైన యేసు క్రీస్తు యొక్క పవిత్ర నామములో నేను సాక్ష్యమిస్తున్నాను, ఆమేన్.

వివరణలు

  1. 2024వ సంవత్సరం నాటికి, నేను ప్రధాన అధికారిగా పిలువబడి 30 సంవత్సరాలు అవుతుంది మరియు ఆ పిలుపు ఫలితంగా మా కుటుంబం జర్మనీ నుండి సంయుక్త రాష్ట్రాల‌కు రావలసి వచ్చి 25 సంవత్సరాలు అవుతుంది. మరియు దాదాపు సరిగ్గా 20 సంవత్సరాల క్రితం—2004, అక్టోబరు 2న—నేను పన్నెండుమంది అపొస్తలుల సమూహము‌లో సభ్యునిగా మరియు “సర్వలోకమునందు క్రీస్తు నామమునకు” (సిద్ధాంతము మరియు నిబంధనలు 107:23) ప్రత్యేక సాక్షిగా ఆమోదించబడ్డాను.

  2. కొన్ని రకాలుగా, ఆ భవనం గురించి నా భావాలు ఆల్మా ప్రజలు మోర్మన్ జలముల గురించి భావించినట్లుగా ఉన్నాయి—అది వారికి ఒక అందమైన ప్రదేశం, ఎందుకంటే “అక్కడ [వారు] తమ విమోచకుని గూర్చి తెలుసుకున్నారు” (మోషైయ 18:30).

  3. మత్తయి 24:35; జోసెఫ్ స్మిత్—మత్తయి 1:35 కూడా చూడండి.

  4. యెషయా 54:10; 3 నీఫై 22:10 కూడా చూడండి.

  5. అధ్యక్షులు థామస్ ఎస్. మాన్సన్ ఈ మాటలతో ఇదే సత్యాన్ని బోధించారు: “భూమిపై ఈ స్వల్పకాలిక ప్రయాణంలో మనం నేర్చుకోవలసిన గొప్ప పాఠాలలో, ఏది ముఖ్యమైనది మరియు ఏది కాదు అనే దాని మధ్య తేడాను గుర్తించడంలో మనకు సహాయపడే పాఠాలు ఉన్నాయని నేను నమ్ముతున్నాను. ఆ అత్యంత ముఖ్యమైన విషయాలు మిమ్మల్ని దాటనివ్వవద్దని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను” (“Finding Joy in the Journey,” Liahona, Nov. 2008, 85). అదేవిధంగా, అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఇటీవల మనల్ని “సిలెస్టియల్‌గా ఆలోచించండి” అని ప్రోత్సహించినప్పుడు, “మర్త్యత్వము అనేది గొప్ప నిత్య ప్రాముఖ్యతగల విషయాలను ఎంచుకోవడాన్ని నేర్చుకునే ఒక ప్రత్యేక తరగతి” (“సిలెస్టియల్‌గా ఆలోచించండి!,” లియహోనా, నవ. 2023, 118) అని చెప్పారు.

  6. Teachings of Presidents of the Church: Joseph Smith (2007), 264; see also Teachings of Presidents of the Church: Brigham Young (1997), 16–18.

  7. Teachings: Joseph Smith, 49.

  8. యోహాను 15:4.

  9. మత్తయి 23:23, క్రొత్తగా సవరించబడిన ప్రామాణిక అనువాదం.

  10. పురాతన అమెరికా సంస్కృతులు మరియు మోర్మన్ గ్రంథ ప్రజల మధ్య పురావస్తు సారూప్యతలను గమనించడం ఆసక్తికరంగా ఉందా? ఉండవచ్చు. జోసెఫ్ స్మిత్ మోర్మన్ గ్రంథము‌ను ఎలా అనువదించాడు అనే వివరాల గురించి లేఖకులు మరియు ఇతరుల వృత్తాంతాల నుండి తెలుసుకోవడం సహాయకరంగా ఉందా? కొందరికి ఉంది. అయితే ఇవేవీ మోర్మన్ గ్రంథము దేవుని వాక్యమని శాశ్వత సాక్ష్యమును నిర్మించవు. దాని కోసం, మీరు మోర్మన్ గ్రంథంలో రక్షకుని కనుగొనాలి, ఆయన స్వరం మీతో మాట్లాడడం వినాలి. ఇది జరిగిన తర్వాత, పురాతన నగరమైన జరహేమ్ల ఎక్కడ ఉంది లేదా యూరీము మరియు తుమ్మీము ఎలా ఉంటాయనే పట్టింపు మీకు ఉండదు. అవసరమైతే అవి మీ చెట్టునుండి కత్తిరించివేసే కొమ్మలు, కానీ చెట్టు అలాగే ఉంటుంది.

  11. సిద్ధాంతము మరియు నిబంధనలు 84:19–20 చూడండి.

  12. జాయ్ డి. జోన్స్, “ఆయన కొరకు,” లియహోనా, నవ. 2018, 50–52 చూడండి.

  13. ఆదికాండము 3:18 చూడండి.

  14. “యేసు క్రీస్తు మరియు ఆయన సువార్త గురించి [మన] స్వంత సాక్ష్యానికి బాధ్యత వహించండి. దానికోసం పని చేయండి. అది వృద్ధిచెందేలా దానిని పోషించండి” అని అధ్యక్షులు నెల్సన్ మనందరిని ఆహ్వానించారు (“లోకమును జయించి, విశ్రాంతి కనుగొనుడి,” లియహోనా, నవ. 2022, 97).

  15. కొలొస్సయులకు 2:7.

  16. ఆల్మా 30:3.

  17. ఆల్మా 30:12–16, 31 చూడండి.

  18. ఆల్మా 30:18.

  19. ఆసక్తికరంగా, కొరిహోర్ వాదనలు ఇటీవల పరివర్తన చెందిన లేమనీయులైన అమ్మోన్ జనులను ఏమాత్రం ఒప్పించలేకపోయాయి (ఆల్మా 30:19–20 చూడండి), వారు క్రీస్తును అనుసరించడం తమ తండ్రుల సంప్రదాయాల మూలంగా కాదు.

    దీనికి విరుద్ధంగా, “వారు తమ పితరుల సంప్రదాయములందు విశ్వసించలేదు” (మోషైయా 26:1–4 చూడండి) కాబట్టి, ప్రభువు యొక్క సంఘము నుండి తమనుతాము వేరు చేసుకున్న యువతరం గురించి కూడా మోర్మన్ గ్రంథము చెబుతుంది. కుటుంబాలు నీతివంతమైన సంప్రదాయాలను నెలకొల్పడం మంచిది. అయితే ఆ సంప్రదాయాల వెనుక ఉన్న కారణాలను కుటుంబాలు స్పష్టంగా అర్థం చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. మనం ప్రతిరోజూ ఉదయం మరియు రాత్రి ఎందుకు ప్రార్థిస్తాము? మనకు కుటుంబ లేఖన అధ్యయనం ఎందుకు ఉంది? మనము వారానికోసారి గృహ సాయంకాలం, కుటుంబ ప్రోత్సాహకార్యక్రమాలు మరియు సేవా ప్రణాళికలు మొదలైన వాటిని ఎందుకు నిర్వహిస్తాము? ఈ సంప్రదాయాలు మనల్ని పరలోక తండ్రికి మరియు యేసు క్రీస్తు‌కు ఎలా దగ్గర చేస్తాయో మన పిల్లలు అర్థం చేసుకుంటే, వారు తమ స్వంత కుటుంబాల్లో వాటిని కొనసాగించడానికి మరియు వాటిని మెరుగుపరచడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది.

  20. ఆల్మా 32:21. దానికి తెలిసిన దాని వల్ల కాదు, కానీ అది చేసే దాని వల్ల విశ్వాసం శక్తివంతమైనది.

  21. హెబ్రీయులకు 10:23 చూడండి.

  22. ఆల్మా 32:37, 41–43.