“మీరు నా స్నేహితులు”
“మీరు నా స్నేహితులు” అనే రక్షకుని ప్రకటన దేవుని పిల్లలందరి మధ్య ఉన్నతమైన మరియు పరిశుద్ధమైన సంబంధాలను నిర్మించడానికి స్పష్టమైన పిలుపు.
వివాదం మరియు విభజనతో నిండిన ప్రపంచంలో, ప్రజాసంబంధ చర్చలు తీర్పు మరియు అపహాస్యంతో భర్తీ చేయబడి, స్నేహాలు -ఇజంలు మరియు -ఈయులు ద్వారా నిర్వచించబడిన చోట ఐక్యత, ప్రేమ మరియు చెందియుండడం కోసం మనం చూడగలిగే స్పష్టమైన, సరళమైన, దైవిక ఉదాహరణ ఉందని నేను తెలుసుకున్నాను. ఆ ఉదాహరణే యేసు క్రీస్తు. ఆయన గొప్ప మధ్యవర్తియని నేను సాక్ష్యమిస్తున్నాను.
మనం ఆయన స్నేహితులం
1832, డిసెంబరులో “దేశాల మధ్య అలజడి యొక్క ప్రత్యక్షతలు” సంఘము ఏర్పాటు చేయబడినప్పటి నుండి ఉన్నవాటి కంటే “ఎక్కువగా కనబడడం” జరిగినప్పుడు, ఒహైయోలోని కర్ట్‌లాండ్‌లో ఉన్న కడవరి-దిన పరిశుద్ధ నాయకులు ఒక సమావేశం కోసం సమకూడారు. “[వారికి] ఆయన చిత్తాన్ని బయల్పరచాలని వేర్వేరుగా, కంఠధ్వనితో ప్రభువుకు” వారు ప్రార్థించారు. తీవ్రమైన కష్టాల సమయంలో ఈ నమ్మకమైన సభ్యుల ప్రార్థనలకు అంగీకారంగా ప్రభువు వారిని ఓదార్చారు, పరిశుద్ధులను మూడుసార్లు రెండు శక్తివంతమైన పదాలతో—“నా స్నేహితులు” అని సంబోధించారు.
యేసు క్రీస్తు చాలాకాలంగా తన నమ్మకమైన అనుచరులను తన స్నేహితులు అని పిలిచారు. సిద్ధాంతము మరియు నిబంధనలలో పధ్నాలుగు సార్లు, రక్షకుడు పవిత్రమైన మరియు విలువైన సంబంధాన్ని నిర్వచించడానికి స్నేహితుడు అనే పదాన్ని ఉపయోగిస్తారు. ప్రపంచం నిర్వచించినట్లుగా—సోషల్ మీడియా అనుచరులు లేదా “లైకుల” ప్రకారం స్నేహితుడు అనే పదం గురించి నేను మాట్లాడడం లేదు. అది ఇన్‌స్టాగ్రామ్ లేదా Xలో హ్యాష్‌ట్యాగ్ లేదా సంఖ్యతో సూచించబడదు.
యుక్తవయస్సులో, “మనం కేవలం స్నేహితులుగా ఉండలేమా?” లేదా “స్నేహితులుగా ఉండిపోదాం” అనే బాధాకరమైన మాటలు విన్నప్పుడు నాకు భయంకరమైన సంభాషణలు గుర్తుకొచ్చాయని నేను అంగీకరిస్తున్నాను. “మీరు కేవలం నా స్నేహితులు” అని ఆయన చెప్పినట్లు పరిశుద్ధ లేఖనాలలో ఎక్కడా మనం వినలేదు. బదులుగా ఆయన ఇలా బోధించారు, “తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువానికంటె ఎక్కువైన ప్రేమగలవాడెవడును లేడు.” “నా తండ్రి నాకిచ్చినవారు మీరే; మీరు నా స్నేహితులు.”
అభిప్రాయము స్పష్టంగా ఉంది: రక్షకునికి మనలో ప్రతీ ఒక్కరి గురించి తెలుసు మరియు మనల్ని కావలికాస్తూ ఉంటారు. ఈ సంరక్షణ సామాన్యమైనది లేదా అల్పమైనది కాదు. బదులుగా, అది ఉన్నతమైనది, ఘనమైనది మరియు నిత్యమైనది. “మీరు నా స్నేహితులు” అనే రక్షకుని ప్రకటనను “మనము ఏకమైయుండులాగున” దేవుని పిల్లలందరి మధ్య ఉన్నతమైన మరియు పరిశుద్ధమైన సంబంధాలను నిర్మించడానికి స్పష్టమైన పిలుపుగా నేను చూస్తున్నాను. మనము ఏకం కావడానికి అవకాశాలను మరియు అందరి కొరకు చెందియున్న భావాన్ని రెండిటిని కోరుతూ కలిసి పనిచేయడానికి ప్రయత్నించినప్పుడు మనము వీటిని నిర్మిస్తాము.
మనము ఆయనలో ఒకటిగా ఉన్నాము
“రండి, నన్ను అనుసరించండి” అనే తన పిలుపులో రక్షకుడు దీనిని అందంగా ప్రదర్శించారు. ఆయన తన అపొస్తలులను పిలవడానికి విభిన్న అనుచరుల సమూహము యొక్క బహుమానాలు మరియు వ్యక్తిగత లక్షణాలను ఉపయోగించారు. ఆయన జాలరులను, జెలోతేలను, వారి ఉరిమెడు వ్యక్తిత్వాలకు పేరొందిన సహోదరులను మరియు ఒక సుంకరిని పిలిచారు. రక్షకునిపై వారికున్న నమ్మకం మరియు ఆయన యొద్దకు రావాలనే కోరిక వారిని ఏకం చేసింది. వారు ఆయన నుండి నడిపింపును వెదికారు, ఆయన ద్వారా దేవుని ప్రభావాన్ని అనుభవించారు మరియు “వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించారు.”
ఉన్నతమైన మరియు పరిశుద్ధమైన సంబంధాలను ఏర్పరచుకోవడం మనల్ని ఎలా ఒక్కటిగా చేరుస్తుందో నేను కూడా చూశాను. న్యూయార్క్ నగరంలో మా ఐదుగురు పిల్లలను పెంచడానికి నా భార్య జెన్నిఫర్, నేను ఆశీర్వదించబడ్డాము. అక్కడ రద్దీగా ఉండే మహానగరంలో, మేము పొరుగువారితో, పాఠశాల స్నేహితులు, వ్యాపార సహచరులు, మత నాయకులు మరియు తోటి పరిశుద్ధులతో విలువైన మరియు పవిత్రమైన సంబంధాలను ఏర్పరచుకున్నాము.
2020, మే లో, ప్రపంచవ్యాప్త మహమ్మారి యొక్క వ్యాప్తితో ప్రపంచం పోరాడుతున్న సమయంలోనే, ఆకస్మికంగా ఏర్పాటు చేయబడిన సమావేశంలో న్యూయార్క్ సిటీ కమీషన్ ఆఫ్ రిలీజియస్ లీడర్స్ సభ్యులు వర్చువల్‌గా సమావేశమయ్యారు. చర్చనీయాంశముల జాబితా లేదు. ప్రత్యేక అతిథులు లేరు. కేవలం మత నాయకులుగా మేము ఎదుర్కొంటున్న సవాళ్లను ఒక్కతాటిపైకి వచ్చి చర్చించమనే అభ్యర్థన. మా నగరం సంయుక్త రాష్ట్రాలలో కొవిడ్-19 మహమ్మారికి కేంద్రంగా ఉందని Center for Disease Control (సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్) అప్పుడే నివేదించింది. దీని అర్థం ఇకపై సమకూడడం జరుగదు. ఇకపై వ్యక్తిగతంగా కలవడం కుదరదు.
ఈ మత నాయకులకు, వ్యక్తిగత పరిచర్యను, సంఘ సమావేశాన్ని మరియు వారపు ఆరాధనను తీసివేయడం పెద్ద నష్టం. కార్డినల్, రెవరెండ్, రాబ్బై, ఇమామ్, పాస్టర్, పరిచారకుడు మరియు ఒక పెద్దతో కూడిన మా చిన్న సమూహం—ఒకరినొకరు వింటూ, ఓదార్చుకున్నారు మరియు మద్దతిచ్చుకున్నారు. మా విభేదాలపై దృష్టి పెట్టే బదులు, మాకు ఉమ్మడిగా ఉన్న వాటిని మేము గుర్తించాము. మేము అవకాశాల గురించి, తరువాత సంభావ్యత గురించి మాట్లాడాము. విశ్వాసం మరియు భవిష్యత్తుకు సంబంధించిన ప్రశ్నలకు మేము ధైర్యము తెచ్చుకొని ప్రతిస్పందించాము. ఆపై మేము ప్రార్థించాము. మనఃపూర్వకంగా ప్రార్థించాము.
సంక్లిష్టత మరియు విభిన్న సంస్కృతులతో నిండిన గొప్ప వైవిధ్యమైన నగరంలో, మేము ఒకే స్వరం, ఒకే ఉద్దేశ్యం మరియు ఒకే ప్రార్థనతో స్నేహితులుగా కలిసిపోవడంతో మా విభేదాలు చెదిరిపోవడాన్ని చూసాము.
వ్యక్తిగత విభేదాలపై దృష్టిపెట్టడానికి బదులు మేమందరం ఏకమై దేవుని సహాయాన్ని వెదికాము. మేము ప్రతి తదుపరి సమావేశాన్ని ముగించినప్పుడు మరింత ఐక్యంగా, సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఫలితంగా ఏర్పడిన సహకారం మరియు వేలాదిమంది న్యూయార్క్ వాసులకు అందించిన సేవ, విభజన, దూరం మరియు విడదీయడం కోసం పిలుపునిచ్చే ప్రపంచంలో, మనల్ని విభజించే దానికంటే మనల్ని కలిపేది చాలా ఎక్కువ అని నాకు నేర్పింది. “ఒకటిగా నుండుడి; మీరు ఒకటిగానుండని యెడల మీరు నా వారు కారు” అని రక్షకుడు అభ్యర్థించారు.
సహోదర సహోదరీలారా, మనం విభజించడానికి కారణాల కోసం వెదకడం మానేయాలి మరియు “ఒకటిగా ఉండడానికి” అవకాశాలను వెదకాలి. ఒకరి నుండి మరొకరు నేర్చుకోవడాన్ని మరియు వ్యక్తిగత ఎదుగుదలను ఆహ్వానించే ప్రత్యేకమైన బహుమానాలు మరియు లక్షణాలను ఆయన మనకు అనుగ్రహించారు. మీరు చేసేది నేను చేస్తే మరియు నేను చేసేది మీరు చేస్తే, మనకు ఒకరికొకరు అవసరం లేదని నేను తరచుగా నా విశ్వవిద్యాలయ విద్యార్థులతో చెప్పాను. కానీ నేను చేసేది మీరు చేయనందున మరియు మీరు చేసేది నేను చేయనందున, మనకు ఒకరికొకరు అవసరం. మరియు ఆ అవసరం మనల్ని ఒకచోట చేర్చుతుంది. విభజించి జయించడం అనేది స్నేహాలు, కుటుంబాలు మరియు విశ్వాసాన్ని నాశనం చేయడానికి విరోధి యొక్క ప్రణాళిక. ఏకం చేసేవాడు రక్షకుడు.
మనం ఆయనకు చెందియున్నాము
“ఒకటిగా మారడం” యొక్క వాగ్దానం చేయబడిన ఆశీర్వాదాలలో ఒకటి, చెందియున్నామనే శక్తివంతమైన భావన. “క్రీస్తుతో ఏకమై ఉండడమే నిజంగా చెందియుండడం యొక్క సారాంశం” అని ఎల్డర్ క్వింటిన్ ఎల్. కుక్ బోధించారు.
మా కుటుంబంతో కలిసి ఇటీవల పశ్చిమ ఆఫ్రికా దేశమైన ఘానాను సందర్శించినప్పుడు, నేను స్థానిక ఆచారానికి ఆకర్షించబడ్డాను. సంఘానికి లేదా ఇంటికి చేరుకున్నప్పుడు, “మీకు స్వాగతం” అనే పదాలతో మమ్మల్ని పలకరించారు. ఆహారం అందించినప్పుడు, మాకు ఆతిథ్యమిచ్చినవారు, “మీరు ఆహ్వానించబడ్డారు” అని ప్రకటించేవారు. ఈ సాధారణ పలకరింపులు లక్ష్యంతో మరియు ఉద్దేశపూర్వకంగా విస్తరించబడ్డాయి. మీకు స్వాగతం. మీరు ఆహ్వానించబడ్డారు.
మనము మన సమావేశమందిర ద్వారాలపై ఇలాంటి పవిత్ర ప్రకటనలను ఉంచుతాము. కానీ సందర్శకులకు స్వాగతం అనే చిహ్నం మాత్రమే సరిపోదు. ద్వారాల గుండా వచ్చిన వారందరినీ మనం హృదయపూర్వకంగా స్వాగతిస్తామా? సహోదర సహోదరీలారా, ఆసనాల్లో కూర్చుంటే సరిపోదు. దేవుని పిల్లలందరితో ఉన్నతమైన మరియు పరిశుద్ధమైన సంబంధాలను పెంపొందించుకోవాలనే రక్షకుని పిలుపును మనం తప్పక ఆలకించాలి. మన విశ్వాసాన్ని బట్టి మనం జీవించాలి! గ్యారేజీలో పడుకోవడం మిమ్మల్ని కారుగా మార్చనట్లే, ఆదివారం నాడు ఆసనంలో కూర్చోవడం మిమ్మల్ని మంచి క్రైస్తవునిగా మార్చదని మా నాన్న తరచుగా నాకు గుర్తు చేసేవారు.
ప్రపంచం మనల్ని చూడకుండా మన ద్వారా ఆయనను చూసేలా మనం మన జీవితాన్ని గడపాలి. ఇది ఆదివారాల్లో మాత్రమే జరగదు. ఇది కిరాణా దుకాణం, గ్యాస్ పంపు, పాఠశాల సమావేశం, ఇరుగుపొరుగు సమావేశాలు—బాప్తిస్మం పొందిన మరియు బాప్తిస్మం పొందని మన కుటుంబ సభ్యులు పనిచేసే మరియు నివసించే అన్ని ప్రదేశాలలో జరుగుతుంది.
మనకు ఒకరికొకరు అవసరమని మరియు కలిసి మనకు ఆయన అవసరమనే దానికి గుర్తుగా నేను ఆదివారంనాడు ఆరాధిస్తాను. లౌకిక ప్రపంచంలో మనల్ని వేరుచేసే మన ప్రత్యేక బహుమానాలు మరియు ప్రతిభలు పవిత్ర ప్రదేశంలో మనల్ని ఏకం చేస్తాయి. ఒకరికొకరు సహాయం చేసుకోవాలని, ఒకరినొకరు ఉద్ధరించాలని మరియు ఒకరినొకరు మెరుగుపరుచుకోవాలని రక్షకుడు మనకు పిలుపునిచ్చారు. ఆయన రక్తస్రావ రోగముగల ఒక స్త్రీని స్వస్థపరచినప్పుడు, ఆయన దయ కోసం ప్రాధేయపడిన కుష్ఠురోగిని శుద్ధి చేసినప్పుడు, తాను ఇంకా ఏమి చేయగలనని అడిగిన యౌవనుడికి సలహా ఇచ్చినప్పుడు, తెలిసినప్పటికీ తన విశ్వాసంలో తడబడిన నీకొదేమసును ప్రేమించినప్పుడు మరియు ఆనాటి ఆచారానికి సరిపోని స్త్రీతో పాటు బావి వద్ద కూర్చొని మెస్సీయ యొక్క నియమితకార్యము గురించి ప్రకటించినప్పుడు ఆయన చేసినది ఇదే. నా దృష్టిలో ఇదే సంఘము—సమకూడే, మెరుగుపడే, బాగుచేయబడే మరియు తిరిగి దృష్టి కేంద్రీకరించే ప్రదేశం. అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ బోధించినట్లుగా: “సువార్త వల ప్రపంచంలోనే అతి పెద్ద వల. దేవుడు అందరినీ తన యొద్దకు రమ్మని ఆహ్వానించారు. … ప్రతీఒక్కరి కోసం స్థలముంది.”
కొందరికి మీరు చెందియుండరని భావించే అనుభవాలు ఉండవచ్చు. మీకు మరియు నాకు రక్షకుని సందేశం ఒకటే: “ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును.” యేసు క్రీస్తు సువార్తయే మనకు సరైన స్థలం. సంఘానికి రావడం మంచి భవిష్యత్తుపై ఆశ కల్పిస్తుంది, మీరు ఒంటరిగా లేరనే వాగ్దానాన్ని మరియు మనకు వారి అవసరం ఉన్నంతగా వారికి మన అవసరం ఉన్న సంఘ సమూహాన్ని అందిస్తుంది. “తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మతో ఏకమైయుండడమనేది చెందియుండడంలో నిస్సందేహంగా అత్యున్నతమైనది” అని ఎల్డర్ డి. టాడ్ క్రిస్టాఫర్‌సన్ స్థిరంగా చెప్పారు. సంఘాన్ని విడిచివెళ్ళి, తిరిగి వచ్చే అవకాశం కోసం చూస్తున్న ఎవరికైనా, నేను నిత్య సత్యాన్ని మరియు ఆహ్వానాన్ని అందిస్తున్నాను: మీరు చెందియున్నారు. తిరిగి రండి. ఇదే సమయం.
వివాదాస్పద మరియు విభజించబడిన ప్రపంచంలో, రక్షకుడైన యేసు క్రీస్తు గొప్ప మధ్యవర్తి అని నేను సాక్ష్యమిస్తున్నాను. “ఒకటిగానుండుము” అనే రక్షకుని ఆహ్వానానికి అర్హులుగా ఉండమని మరియు ఆయన చెప్పినట్లుగా, “మీరు నా స్నేహితులు” అని ధైర్యంగా ప్రకటించమని మనలో ప్రతి ఒక్కరినీ నేను ఆహ్వానిస్తున్నాను. యేసు క్రీస్తు యొక్క పవిత్ర నామములో, ఆమేన్.