2020–2024
మన విమోచన యొక్క ఆనందము
2024 అక్టోబరు సర్వసభ్య సమావేశము


12:9

మన విమోచన యొక్క ఆనందము

యేసు క్రీస్తు యొక్క ప్రేమ మరియు శక్తి మనలో ప్రతి ఒక్కరినీ మన తప్పులు, బలహీనతలు మరియు పాపముల నుండి రక్షించగలదు మరియు మనం మరింత గొప్పగా మారడానికి సహాయపడగలదు.

సుమారు 10 సంవత్సరాల క్రితం, రక్షకుని చిత్రాన్ని గీయాలని నేను ప్రేరణ పొందాను. నేను ఒక చిత్రకారిణిని అయినప్పటికీ, ఇది కొంచెం ఒత్తిడిగా అనిపించింది. యేసు క్రీస్తు యొక్క ఆత్మను సంగ్రహించే చిత్రపటాన్ని నేను ఎలా చిత్రించాలి? నేను ఎక్కడ ప్రారంభించాలి? మరియు నాకు సమయం ఎక్కడ దొరుకుతుంది?

ఇలా నాకు సందేహాలున్నప్పటికీ, నేను ముందుకు సాగాలని మరియు ప్రభువు నాకు సహాయం చేస్తారని నమ్మాలని నిర్ణయించుకున్నాను. అయితే సాధ్యతలను ఆయనకు వదిలివేసి నేను ముందుకు సాగవలసి వచ్చింది. నేను ప్రార్థించాను, ఆలోచించాను, పరిశోధించాను, రూపు రేఖలు గీసాను మరియు సహాయమును, వనరులను కనుగొనడానికి నేను దీవించబడ్డాను. తెల్లటి తైలవర్ణచిత్రాల వస్త్రము మరింతగా మారడం ప్రారంభించింది.

రక్షకుని వర్ణచిత్రం పురోగతిలో ఉంది.

ఈ ప్రక్రియ సులభంగా లేదు. కొన్నిసార్లు నేను ఆశించినట్లుగా అది కనిపించలేదు. కొన్నిసార్లు ప్రేరణ పొందిన గీతలు మరియు ఆలోచనలు గల క్షణాలు ఉన్నాయి. మరియు చాలా సార్లు, నేను మళ్లీ మళ్లీ ప్రయత్నించవలసి వచ్చింది.

చివరకు తైలవర్ణచిత్రం సంపూర్ణమై పొడిగా ఉందని నేను భావించినప్పుడు, దుమ్ము ధూళి నుండి రక్షించడానికి పారదర్శక మెరుగునూనెను పూయడం ప్రారంభించాను. నేను అలా చేసినపుడు, వర్ణచిత్రం‌లోని జుట్టు మారడం, చెమ్మ రావటం మరియు కరిగిపోవడాన్ని నేను గమనించాను. నేను మెరుగునూనెను చాలా త్వరగా పూసినట్లు వెంటనే గ్రహించాను, వర్ణచిత్రం‌లోని ఆ భాగం ఇంకా తడిగా ఉంది!

నేను నా వర్ణచిత్రం‌లోని కొంత భాగాన్ని మెరుగునూనె‌తో తుడిచేశాను. అయ్యో, నా హృదయం కుంగిపోయింది. దేవుని సహాయంతో నేను చేసిన దానిని నేనే నాశనం చేసినట్లుగా అనిపించింది. అకస్మాత్తుగా, జరిగినదాని గురించి చాలా విచారంగా అనిపించింది. నిరాశతో, ఇలాంటి పరిస్థితిలో ఎవరైనా సాధారణంగా చేసే పనినే నేను చేసాను: మా అమ్మను పిలిచాను. ఆమె తెలివిగా మరియు ప్రశాంతంగా ఇలా చెప్పింది, “గతించిన దానిని నువ్వు తిరిగి పొందలేవు, కానీ నీకు లభించిన దానితో నువ్వు చేయగలిగినంత ఉత్తమంగా చేయి.”

పూర్తయిన రక్షకుని వర్ణచిత్రం‌.

And I Partook [మరియు నేను తీసుకున్నాను], క్రిస్టిన్ ఎమ్. యీ చేత

కాబట్టి నేను ప్రార్థించాను, సహాయం కోసం ప్రాధేయపడ్డాను మరియు సరిచేయడానికి రాత్రంతా చిత్రించాను. మరుసటి ఉదయాన్నే వర్ణచిత్రాన్ని చూడటం నాకు గుర్తుంది—అది మునుపటి కంటే మెరుగైనదిగా కనిపించింది. ఇది ఎలా సాధ్యమైంది? సరిదిద్దుకోలేని తప్పు అని నేను అనుకున్నది ఆయన దయగల హస్తం స్పష్టంగా కనిపించే అవకాశం. వర్ణచిత్రాన్ని‌ సరిచేయడంతోనో లేదా నాకు సహాయం చేయడంతోనో ఆయన ముగించలేదు. గొప్ప సంతోషం మరియు ఉపశమనం నా హృదయాన్ని నింపాయి. వర్ణచిత్రాన్ని సరిదిద్దడం మాత్రమే కాకుండా, మనలో ప్రతి ఒక్కరినీ మన తప్పులు, బలహీనతలు మరియు పాపముల నుండి రక్షించడానికి మరియు మనం మరింత గొప్పగా మారడానికి సహాయపడే ఆయన ప్రేమ మరియు శక్తి గురించి నాకు మరింత నేర్పించిన ఈ అద్భుతాన్నిబట్టి, ఆయన దయను బట్టి నేను ప్రభువును స్తుతించాను.

“సరి చేయలేని” వర్ణచిత్రాన్ని సరి చేయడానికి దయతో ఆయన నాకు సహాయం చేసినప్పుడు, రక్షకునిపట్ల నా కృతజ్ఞతాభావం బాగా పెరిగింది, అలాగే నా బలహీనతలపై ఆయనతో కలిసి పనిచేయాలని మరియు నా తప్పుల కొరకు క్షమించబడాలని నేను ప్రయత్నించినప్పుడు, నా రక్షకునిపట్ల నా వ్యక్తిగత ప్రేమ మరియు కృతజ్ఞత మరింతగా పెరిగాయి. నేను మారగలిగినందుకు మరియు శుద్ధి చేయబడినందుకు నేను నా రక్షకునిపట్ల ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటాను. నా హృదయం ఆయన వద్ద ఉంది, నేను ఏమి చేయాలని మరియు ఎలా మారాలని ఆయన కోరుకుంటున్నారో అదే చేయాలని నేను ఆశిస్తున్నాను.

పశ్చాత్తాపం దేవుని ప్రేమను అనుభూతి చెందడానికి మరియు మనకు ఎన్నడూ తెలియని మార్గాలలో ఆయనను తెలుసుకొని ప్రేమించటానికి అనుమతిస్తుంది. రక్షకుని పాదాలకు అభిషేకం చేసిన స్త్రీ గురించి ఆయన ఇలా చెప్పారు, “ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడెను. ఎవనికి కొంచెముగా క్షమింపబడునో, వాడు కొంచెముగా ప్రేమించును.” ఆమె విస్తారముగా ప్రేమించింది గనుక ఆయన విస్తారముగా క్షమించారు.

మనం మళ్లీ ప్రయత్నించగలమని తెలుసుకోవడంలో అలాంటి ఉపశమనం మరియు నిరీక్షణ ఉంది—ఎల్డర్ డేవిడ్ ఎ. బెడ్నార్ బోధించినట్లుగా, మనం నిజముగా మరియు హృదయపూర్వకంగా పశ్చాత్తాపపడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ యొక్క శుద్ధిచేయు శక్తి ద్వారా మన పాపముల యొక్క నిరంతర క్షమాపణను పొందగలము.

యేసు క్రీస్తు యొక్క విమోచన శక్తి మన నిబంధనలలో వాగ్దానం చేయబడిన గొప్ప దీవెనలలో ఒకటి. మీరు పవిత్రమైన విధులలో పాల్గొంటున్నప్పుడు దీని గురించి ఆలోచించండి. ఆ విమోచన శక్తి లేకుండా, మనము పరలోకమందున్న మన తండ్రి గృహానికి మరియు మనం ప్రేమించే వారి వద్దకు తిరిగి చేరలేము.

మన ప్రభువు మరియు రక్షకుడైన యేసు క్రీస్తు రక్షించుటకు శక్తిమంతుడైయున్నాడని నాకు తెలుసు. లోక పాపముల కొరకు ప్రాయశ్చిత్తము చేసి తన ప్రాణమునే త్యజించి మరల దానిని స్వీకరించిన దేవుని కుమారునిగా, ఆయన విమోచన మరియు పునరుత్థానం యొక్క శక్తిని కలిగియున్నారు. ఆయన అందరికి అమర్త్యత్వమును మరియు తనను ఎన్నుకునే వారికి నిత్యజీవమును సాధ్యం చేసారు. ఆయన ప్రాయశ్చిత్త త్యాగం ద్వారా మనం పశ్చాత్తాపపడగలమని మరియు నిజంగా శుద్ధి చేయబడి, విమోచించబడగలమని నాకు తెలుసు. ఆయన మిమ్మల్ని మరియు నన్ను ఈ విధంగా ప్రేమించడం ఒక అద్భుతం.

ఆయన ఇలా చెప్పారు, “మీరందరు, నేను మిమ్ములను స్వస్థపరచునట్లు ఇప్పుడు నా యొద్దకు తిరిగివచ్చి, మీ పాపముల విషయమై పశ్చాత్తాపపడి పరివర్తన నొందరా?” ఆయన మీ ఆత్మ యొక్క “పాడైన స్థలములన్నిటిని”—పాపం మరియు దుఃఖం కారణంగా పొడిగా, కఠినంగా మరియు నిర్జనంగా ఉన్న ప్రదేశాలను స్వస్థపరచగలరు—మరియు “[మీ] అరణ్యస్థలములను ఏదెనువలె మార్చగలరు.”

గెత్సేమనేలో మరియు సిలువపై క్రీస్తు అనుభవించిన బాధల యొక్క వేదనను, లోతును మనం అర్థం చేసుకోలేనట్లే, మనం “[ఆయన] దైవిక క్షమాపణ,” కరుణ మరియు ప్రేమ యొక్క హద్దులను కొలవలేము లేదా లోతులను అర్థం చేసుకోలేము.

విమోచన పొందడం సాధ్యం కాదని మీరు కొన్నిసార్లు భావించవచ్చు, బహుశా మీరు పోరాడుతున్న దాని వలననో లేదా మీరు చేసిన దాని వలననో దేవుని ప్రేమకు మరియు రక్షకుని యొక్క ప్రాయశ్చిత్త శక్తికి మీరు మినహాయింపు అని భావించవచ్చు. కానీ మీరు ప్రభువుకు అందనంత లోతులో లేరని నేను సాక్ష్యమిస్తున్నాను. రక్షకుడు “అన్నిటికంటే క్రిందకు కూడా దిగారు” మరియు మిమ్మల్ని పైకి లేపడానికి, చీకటి అగాధం నుండి మిమ్మల్ని స్వంతం చేసుకోవటానికి మరియు “ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి” మిమ్మల్ని తీసుకురావడానికి ఒక దైవిక స్థితిలో ఉన్నారు. తన శ్రమల ద్వారా, మనలో ప్రతి ఒక్కరికీ మన వ్యక్తిగత బలహీనతలను మరియు పాపములను అధిగమించడానికి ఆయన ఒక మార్గాన్ని ఏర్పాటు చేశారు. “ఆయన నామముపై విశ్వసించి పశ్చాత్తాపమునకు తగిన ఫలమును ఫలించు ప్రతి మనుష్యుని రక్షించుటకు ఆయన సమస్త శక్తి కలిగియున్నారు.”

వర్ణచిత్రాన్ని సరి చేయడానికి కృషి మరియు పరలోక సహాయం కొరకు వేడుకోవడం అవసరమైనట్లే, “పశ్చాత్తాపమునకు తగిన ఫలమును” ఫలించడం కోసం కృషి, నిష్కపటమైన హృదయం మరియు వినయం అవసరం. ఈ ఫలములు, యేసు క్రీస్తు మరియు ఆయన ప్రాయశ్చిత్త త్యాగమునందు నమ్మకముంచడం మరియు మన విశ్వాసమును సాధన చేయటం, విరిగిన హృదయము, నలిగిన ఆత్మను దేవునికి సమర్పించటం, పాపములను ఒప్పుకొని వాటిని విడిచిపెట్టటం, శిథిలమైన వాటిని మన శక్తి మేరకు పునరుద్ధరించడం మరియు నీతియుక్తముగా జీవించడానికి ప్రయత్నించడం వంటి వాటిని కలిగియున్నాయి.

నిజంగా పశ్చాత్తాపం చెందడానికి మరియు మారడానికి, మొదట మనం “మన పాపములను ఒప్పుకోవాలి.” ఒక వ్యక్తి అనారోగ్యంతో ఉన్నాడని అర్థం చేసుకుంటే తప్ప మందులు తీసుకోవాల్సిన అవసరాన్ని గ్రహించలేడు. మన స్వంత ఆలోచనలను, క్రియలను పరీక్షించుకోవడానికి, నిజంగా స్వస్థత మరియు దిద్దుబాటు అవసరమయ్యే వాటిని చూడటానికి మనం ఇష్టపడని సందర్భాలు ఉండవచ్చు.

సి. ఎస్. లూయిస్ యొక్క రచనలలో, అస్లాన్ తన స్వంత పరికరాలలో చిక్కుకున్న వ్యక్తికి ఈ మాటలు తెలియజేసాడు: “ఓహ్ [మానవజాతి], మీకు మేలు చేసే ప్రతిదాని నుండి ఎంత తెలివిగా మిమ్మల్ని మీరు నిరోధించుకుంటున్నారు!”

మనకు మేలు చేసే వాటి నుండి మీరు మరియు నేను ఎక్కడ మనల్నిమనం నిరోధించుకుంటున్నాము?

దేవుడు మనల్ని దీవించాలని కోరుకునే మంచి నుండి మనల్ని మనం నిరోధించుకోవద్దు. మనం అనుభవించాలని ఆయన కోరుకునే ప్రేమ మరియు దయ నుండి. ఆయన మనకు ప్రసాదించాలని కోరుకునే వెలుగు మరియు జ్ఞానము నుండి. మనకు తక్షణమే అవసరమని ఆయనకు తెలిసిన స్వస్థత నుండి. ఆయన తన కుమారులు మరియు కుమార్తెలందరి కోసం ఉద్దేశించిన గాఢమైన నిబంధన సంబంధం నుండి మనల్ని మనం నిరోధించుకోవద్దు.

దేవుని ప్రేమ యొక్క ఆశీర్వాదాల నుండి మనల్ని మనం నిరోధించుకోవడానికి తెలిసీ తెలియకుండా తీసుకున్న ఏవైనా “యుద్ధ ఆయుధాలను” పక్కన పెట్టాలని నేను ప్రార్థిస్తున్నాను. అహంకారం, స్వార్థం, భయం, ద్వేషం, నేరం, సంతృప్తి, అన్యాయమైన తీర్పు, అసూయల యొక్క ఆయుధాలు—మన పూర్ణ హృదయాలతో దేవుణ్ణి ప్రేమించకుండా మరియు ఆయనతో మనకున్న అన్ని నిబంధనలను పాటించకుండా మనల్ని నిరోధించే ఆయుధాలు.

మనం మన నిబంధనల ప్రకారం జీవిస్తున్నప్పుడు, అహంకారం అనే ఆధ్యాత్మిక పరాన్నజీవితో సహా మన బలహీనతలను గుర్తించడానికి మరియు అధిగమించడానికి ప్రభువు మనకు అవసరమైన సహాయమును, శక్తిని అందిస్తారు. మన ప్రవక్త ఇలా చెప్పారు:

“నిర్మలత్వమునకు మార్గము పశ్చాత్తాపము మరియు నిర్మలత్వము శక్తిని ఇస్తుంది.”

“మరియు ఓహ్, రాబోయే రోజుల్లో ఆయన శక్తి మనకు ఎంతో అవసరం.”

నా వర్ణచిత్రంలాగే, మనం తప్పు చేసినప్పుడు ప్రభువు మనతో ఉన్న బంధాన్ని తెంచుకోరు లేదా మనం తడబడినప్పుడు ఆయన విడిచి వెళ్ళరు. స్వస్థత మరియు సహాయం కొరకు మనకున్న అవసరం ఆయనకు భారం కాదు, కానీ ఆయన వచ్చిన కారణం అదే. రక్షకుడు స్వయంగా ఇలా చెప్పారు:

“ఇదిగో లోకమునకు విమోచన తెచ్చుటకు, పాపము నుండి లోకమును రక్షించుటకు నేను లోకమునకు వచ్చియున్నాను.”

“ఇదిగో కనికరము గల నా బాహువు మీ వైపు చాపబడినది మరియు వచ్చు వానిని నేను చేర్చుకొందును; నా యొద్దకు వచ్చు వారు ధన్యులు.”

కాబట్టి రండి—అలసిపోయి, నీరసించి, దుఃఖంతో ఉన్నవారలారా, రండి; మీ శ్రమలను విడిచిపెట్టి, మిమ్మల్ని అత్యంత ప్రేమించే వానిలో విశ్రాంతిని పొందండి. ఆయన కాడిని ఎత్తుకొనండి, ఎందుకంటే ఆయన సాత్వికుడు మరియు దీనమనస్సు గలవాడు.

మన పరలోక తండ్రి మరియు రక్షకుడు మిమ్మల్ని చూస్తారు. మీ మనసు వారికి తెలుసు. మీరు ప్రేమించే వారితో సహా, మీరు శ్రద్ధ వహించే వాటి గురించి వారు శ్రద్ధ వహిస్తారు.

తెగిపోయిన మరియు విచ్ఛిన్నమైన సంబంధాలతో సహా, కోల్పోయిన వాటినన్నింటిని రక్షకుడు విమోచించగలరు. పతనమైపోయిన వాటన్నింటిని విమోచించడానికి—చనిపోయిన మరియు నిస్సహాయంగా భావించిన వాటికి జీవం పోయడానికి ఆయన ఒక మార్గాన్ని రూపొందించారు.

ఒక పరిస్థితితో పోరాడుతూ, ఇప్పటికే అధిగమించి ఉండవలసిందని మీరు ఆలోచిస్తున్నట్లైతే, నిరాశపడకండి. మీ పట్ల మీరు ఓపికగా ఉండండి, మీ నిబంధనలను పాటించండి, తరచుగా పశ్చాత్తాపపడండి, అవసరమైతే మీ నాయకుల సహాయం తీసుకోండి మరియు మీకు వీలైనంతగా క్రమం తప్పకుండా ప్రభువు యొక్క మందిరానికి వెళ్ళండి. ఆయన మీకు పంపే ప్రేరేపణలను విని, లక్ష్యపెట్టండి. మీతో తన నిబంధన సంబంధాన్ని ఆయన విడిచిపెట్టరు.

నా జీవితంలో కష్టమైన మరియు సంక్లిష్టమైన సంబంధాలు ఉన్నాయి, వాటితో నేను కష్టపడ్డాను మరియు మెరుగుపరచడానికి హృదయపూర్వకంగా ప్రయత్నించాను. కొన్నిసార్లు చాలా తరచుగా విఫలమవుతున్నట్లు నేను భావించాను. పోయినసారి నేను ఈ విషయాలను సరిచేయలేదా? నేను నిజంగా నా బలహీనతను అధిగమించలేదా? అని నేను ఆశ్చర్యపోయాను. నేను అంత అసంపూర్ణముగా లేనని; బదులుగా, తరచూ ఎక్కువ పని చేయాల్సి ఉంటుందని మరియు ఎక్కువ స్వస్థత అవసరమని కాలక్రమేణా తెలుసుకున్నాను.

ఎల్డర్ డి. టాడ్ క్రిస్టాఫర్‌సన్ ఇలా బోధించారు: “బలహీనతను శక్తితో భర్తీ చేయడానికి దృఢ నిశ్చయంతో ప్రతి రోజు ప్రయాసపడి, తగిన తీర్పు రావాలని కోరుకునే వ్యక్తిని చూసి ప్రభువు ఖచ్చితంగా చిరునవ్వు చిందిస్తారు. నిజమైన పశ్చాత్తాపం, నిజమైన మార్పు కోసం నిరంతర ప్రయత్నాలు అవసరం కావచ్చు, కానీ అలాంటి ప్రయత్నంలో శుద్ధీకరణ మరియు పరిశుద్ధత ఉంటాయి. అటువంటి ఆత్మకు దైవిక క్షమాపణ మరియు స్వస్థత చాలా సహజంగా ప్రవహిస్తుంది.”

యేసు క్రీస్తు కారణంగా, ప్రతి రోజూ నిరీక్షణ మరియు అవకాశాలతో నిండిన ఒక కొత్త రోజు. తల్లియైన హవ్వ ప్రకటించినట్లుగా, “మన విమోచనానందమును,” పరిపూర్ణులుగా ఉండటంలో కలిగే ఆనందాన్ని, మీ పట్ల దేవునికి గల ఎనలేని ప్రేమను అనుభవించడంలో ఉన్న ఆనందాన్ని ప్రతి రోజూ మీరు మరియు నేను తెలుసుకోవచ్చు.

మన పరలోక తండ్రి మరియు రక్షకుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నారని నాకు తెలుసు. యేసు క్రీస్తు సమస్త మానవాళి యొక్క రక్షకుడు మరియు విమోచకుడు. ఆయన సజీవుడు. ఆయన ప్రాయశ్చిత్త త్యాగం ద్వారా పాపం మరియు మరణం యొక్క బంధకాలు శాశ్వతంగా ఛేదించబడ్డాయి, తద్వారా మనం ప్రేమించే వారితోపాటు స్వస్థతను, విమోచనను మరియు నిత్యజీవమును స్వేచ్ఛగా ఎంచుకోవచ్చు. మరియు ఈ విషయములను గురించి యేసు క్రీస్తు నామంలో నేను సాక్ష్యమిస్తున్నాను, ఆమేన్.

వివరణలు

  1. మత్తయి 19:26 చూడండి.

  2. ఒక్కసారి దేవునితో నిబంధన చేసుకున్న తర్వాత, మనము తటస్థంగా ఉన్న నేలను శాశ్వతంగా వదిలివేస్తాము. ఆయనతో అలాంటి బంధాన్ని ఏర్పరచుకున్న వారితో దేవుడు తన సంబంధాన్ని విడిచిపెట్టడు. నిజానికి, దేవునితో నిబంధన చేసుకున్న వారందరికీ ప్రత్యేకమైన ప్రేమ మరియు కరుణ లభిస్తాయి. హెబ్రీ భాషలో, ఆ నిబంధన ప్రేమను హెసెడ్ అంటారు (חֶסֶד)” (రస్సెల్ ఎమ్. నెల్సన్, “నిత్య నిబంధన,” లియహోనా, అక్టోబర్ 2022, 5).

  3. “నేను మరియు మీరు కూడా ఆ నిబంధన మార్గము లోనికి ప్రవేశించినప్పుడు, మనకు క్రొత్త జీవన విధానం ఉంటుంది. తద్వారా మనము దేవునితో సంబంధాన్ని ఏర్పరచుకుంటాము, అది ఆయన మనలను ఆశీర్వదించడానికి మరియు మార్చడానికి అనుమతిస్తుంది. నిబంధన మార్గము మనలను తిరిగి ఆయన వద్దకు నడిపిస్తుంది. మన జీవితాలలో దేవునికి మిక్కిలి ప్రాధాన్యత ఇచ్చినట్లయితే, ఆ నిబంధన మనలను ఆయనకు చాలా దగ్గరగా నడిపిస్తుంది. అన్ని నిబంధనలు కట్టుబడి ఉండేందుకు ఉద్దేశించబడ్డాయి. అవి శాశ్వతమైన సబంధాలతో బంధాన్ని ఏర్పరుస్తాయి” (రస్సెల్ ఎమ్. నెల్సన్, “నిత్య నిబంధన,” 5).

  4. ఆల్మా 26:35–36 చూడండి.

  5. ఆల్మా 22:18: “నిన్ను తెలుసుకొనుటకు నా పాపములన్నిటినీ నేను వదిలివేసెదను.”

  6. లూకా 7:47; 37–50 వచనాలు కూడా చూడండి.

  7. Speaking of the sacrament, Elder David A. Bednar said:

    “As we prepare conscientiously and participate in this holy ordinance with a broken heart and a contrite spirit, then the promise is that we may always have the Spirit of the Lord to be with us. And by the sanctifying power of the Holy Ghost as our constant companion, we can always retain a remission of our sins” (“Always Retain a Remission of Your Sins,” Liahona, May 2016, 61–62).

    “In the process of coming unto the Savior and spiritual rebirth, receiving the sanctifying power of the Holy Ghost in our lives creates the possibility of an ongoing cleansing of our soul from sin. This joyous blessing is vital because ‘no unclean thing can dwell with God’ [1 Nephi 10:21]” (“Always Retain a Remission of Your Sins,” 61).

    Elder Bednar taught at the 2023 mission leadership seminar: “And by the sanctifying power of the Holy Ghost as our constant companion, we can always retain a remission of our sins. Thus, the gospel of Jesus Christ provides second, and third, and fourth, and endless opportunities to retain a remission of our sins” (in Rachel Sterzer Gibson, “Teach to Build Faith in Jesus Christ, Elder Bednar Instructs,” Church News, June 23, 2023, thechurchnews.com).

  8. “The Prophet Joseph Smith summarized succinctly the essential role of priesthood ordinances in the gospel of Jesus Christ: ‘Being born again, comes by the Spirit of God through ordinances’ [Teachings of Presidents of the Church: Joseph Smith (2007), 95]. This penetrating statement emphasizes the roles of both the Holy Ghost and sacred ordinances in the process of spiritual rebirth. …

    “Holy ordinances are central in the Savior’s gospel and in the process of coming unto Him and seeking spiritual rebirth. …

    “The ordinances of salvation and exaltation administered in the Lord’s restored Church are far more than rituals or symbolic performances. Rather, they constitute authorized channels through which the blessings and powers of heaven can flow into our individual lives. …

    “Ordinances received and honored with integrity are essential to obtaining the power of godliness and all of the blessings made available through the Savior’s Atonement” (David A. Bednar, “Always Retain a Remission of Your Sins,” 59–60).

  9. యోహాను 10:17-18; 3 నీఫై 9:22 చూడండి.

  10. జోసెఫ్ స్మిత్ అనువాదం, యోహాను 1:16; యాకోబు 6:9; మోషే 1:39 చూడండి.

  11. ఆల్మా 12:33–34 చూడండి.

  12. యోహాను 3:16 చూడండి.

  13. 3 నీఫై 9:13.

  14. “ఆయన యొద్దకు రమ్మని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను … మీరు పశ్చాత్తాపపడినప్పుడు, ఆయన మిమ్మల్ని పాపము నుండి స్వస్థపరుస్తారు. ఆయన మిమ్మల్ని విచారము మరియు భయము నుండి స్వస్థపరుస్తారు. ఈ లోకపు గాయాల నుండి ఆయన మిమ్మల్ని స్వస్థపరుస్తారు” (రస్సెల్ ఎమ్. నెల్సన్, “జవాబు ఎల్లప్పుడు యేసు క్రీస్తే,” లియహోనా, మే 2023, 127).

  15. యెషయా 51:3; యెషయా 58:10–12; యెహెజ్కేలు 36:33–36 కూడా చూడండి.

  16. James E. Talmage, Jesus the Christ (1916), 265.

  17. రస్సెల్ ఎమ్. నెల్సన్, “నిత్య నిబంధన,” 5–7 చూడండి; ఈ సందేశంలో ముగింపు వివరణలు 2 మరియు 3 కూడా చూడండి.

  18. సిద్ధాంతము మరియు నిబంధనలు 88:6; సిద్ధాంతము మరియు నిబంధనలు 122:7–9 కూడా చూడండి.

  19. 1 పేతురు 2:9; ఆల్మా 26:16–17 కూడా చూడండి.

  20. ఆల్మా 12:15; వివరణ చేర్చబడింది.

  21. ఆల్మా 34:17 చూడండి.

  22. 2 కొరింథీయులకు 7:10; 3 నీఫై 9:15–20 చూడండి.

  23. సిద్ధాంతము మరియు నిబంధనలు 58:43; 64:7 చూడండి.

  24. మోషైయ 27:32–37; ఆల్మా 26:30 చూడండి.

  25. సిద్ధాంతము మరియు నిబంధనలు 1:32 చూడండి.

  26. ఆల్మా 24:8–10 చూడండి.

  27. See Robert L. Millet, Becoming New: A Doctrinal Commentary on the Writings of Paul (2022), 26.

  28. C. S. Lewis, The Magician’s Nephew (1955), 185.

  29. మోషైయ 4:6–9 చూడండి.

  30. ఆల్మా 12:9–10; 26:22; 3 నీఫై 26:9 చూడండి.

  31. “నిబంధన మార్గం అనేది దేవునితో మన బంధానికి సంబంధించినది” (రస్సెల్ ఎమ్. నెల్సన్, “నిత్య నిబంధన,” 11; ఈ సందేశంలో ముగింపు వివరణలు 2 మరియు 3 కూడా చూడండి).

  32. ఆల్మా 24:17–19 చూడండి.

  33. సిద్ధాంతము మరియు నిబంధనలు 67:10 చూడండి.

  34. జేకబ్ 4:13 చూడండి. “తమ బలహీనతలను చూడనివారు అభివృద్ధి చెందలేరు. మీ బలహీనతను తెలుసుకొనుట ఒక దీవెన, ఎందుకంటే అది మీరు అణకువ కలిగియుండి, రక్షకునివైపు తిరుగునట్లు చేస్తుంది. ఆత్మ మిమ్మల్ని ఆదరించుట మాత్రమే కాదు, కాని ఆయన కర్త కూడా, దాని ద్వారా ప్రాయశ్చిత్తము మీ సహజ స్వభావాలలో మార్పును కలిగించును. అప్పుడు బలహీన విషయాలు బలమైనవిగా మారును” (హెన్రీ బి. ఐరింగ్, “నా శాంతినే మీకనుగ్రహించుచున్నాను,” లియహోనా, మే 2017, 16).

  35. రస్సెల్ ఎమ్. నెల్సన్, “మనం ఉత్తమముగా చెయ్యగలము మరియు ఉత్తమముగా ఉండగలము,” లియహోనా, మే 2019, 68.

  36. “బోధన ద్వారా మరియు ఆత్మ ద్వారా దేవాలయంలో బోధింబడే ప్రతీ విషయము యేసు క్రీస్తుపై మన అవగాహనను పెంచుతుంది. పవిత్రమైన యాజకత్వ నిబంధనల ద్వారా ఆయన ఆవశ్యకమైన విధులు మనల్ని ఆయనతో బంధించి ఉంచుతాయి. తరువాత, మనం మన నిబంధనలను పాటించినప్పుడు, ఆయన యొక్క స్వస్థపరిచే, బలపరిచే శక్తిని ఆయన మనకు వరముగా ఇస్తారు. మరియు ఓహ్, రాబోయే రోజుల్లో ఆయన శక్తి మనకు ఎంతో అవసరం.” (రస్సెల్ ఎమ్. నెల్సన్, “దేవాలయము మరియు మీ ఆత్మీయ పునాది,” లియహోనా, నవ. 2021, 93–94).

  37. 3 నీఫై 9:21.

  38. 3 నీఫై 9:14.

  39. See Erik Dewar, “Come Find His Rest” (song, 2024); మత్తయి 11:28–30 కూడా చూడండి.

  40. ద్వితీయోపదేశకాండము 30:20; యోహాను 11:25; ఈథర్ 3:14; సిద్ధాంతము మరియు నిబంధనలు 88:6, 13 చూడండి.

  41. “నా ప్రియమైన సహోదర సహోదరీలారా, ఇదిగో నా వాగ్దానం. ఇనుపదండాన్ని గట్టిగా పట్టుకోవడానికి మీ పరిస్థితులు అనుమతించినంత క్రమంగా దేవాలయంలో ఆరాధించడం కంటే ఎక్కువగా మీకు ఏదీ సహాయం చేయదు. ప్రపంచంలోని అంధకారపు పొగమంచులను మీరు ఎదుర్కొన్నప్పుడు ఏదీ మిమ్మల్ని ఎక్కువగా రక్షించదు. ప్రభువైన యేసు క్రీస్తు మరియు ఆయన ప్రాయశ్చిత్తం గురించిన మీ సాక్ష్యాన్ని ఏదీ బలపరచదు లేదా దేవుని అద్భుతమైన ప్రణాళికను ఎక్కువగా అర్థం చేసుకోవడంలో ఏదీ మీకు సహాయం చేయదు. బాధాకరమైన సమయంలో ఏదీ మీ ఆత్మను ఎక్కువగా శాంతింపజేయదు. ఏదీ పరలోకాలను ఎక్కువగా తెరవదు. ఏదీ లేదు! (రస్సెల్ ఎమ్. నెల్సన్, “యాజకత్వ తాళపుచెవుల బహుమానమందు ఆనందించండి,” లియహోనా, మే 2024, 122).

  42. రస్సెల్ ఎమ్. నెల్సన్, “నిత్య నిబంధన,” 5 చూడండి.

  43. రస్సెల్ ఎమ్. నెల్సన్, “జవాబు ఎల్లప్పుడు యేసు క్రీస్తే,” 127 చూడండి; ఈ సందేశంలో ముగింపు వివరణ 14 కూడా చూడండి.

  44. D. Todd Christofferson, “The Divine Gift of Repentance,” Liahona, Nov. 2011, 39.

  45. మోషే 5:11.

  46. 2 నీఫై 2:26–28 చూడండి.