2020–2024
పవిత్ర లేఖనములు—విశ్వాసానికి పునాది
2024 అక్టోబరు సర్వసభ్య సమావేశము


14:7

పవిత్ర లేఖనములు—విశ్వాసానికి పునాది

పరివర్తన చెందడంలో మరియు సువార్తలో విశ్వాసంగా నిలిచియుండడంలో పవిత్ర లేఖనాల ప్రాముఖ్యతను మనం తక్కువ అంచనా వేయలేము.

నా భార్య, మేరీ మరియు నేను ఇటీవల చూసిన ఒక టీ-షర్టు ముందు భాగంలో ఒక పుస్తక చిత్రం మరియు ఒక సందేశం ఇలా ఉంది, “పుస్తకాలు: నిజంగా చేతితో పట్టుకొనే పరికరము.”

“పుస్తకాలు: నిజంగా చేతితో పట్టుకొనే పరికరము,” అని టీ-షర్టు ప్రకటించింది.

నేను ఈ ఆసక్తికరమైన సందేశం గురించి మరియు చేతితో పట్టుకొనే అన్ని రకాల పరికరాలు ఎంత ముఖ్యమైనవిగా మారాయనే దాని గురించి ఆలోచించాను. మరింత ఆలోచించిన తర్వాత, ఏదైనా పరికరం లేదా కృత్రిమ మేధస్సుతో కూడినది కూడా దైవిక బయల్పాటు నుండి వచ్చే ఆధ్యాత్మిక నడిపింపు వలె ముఖ్యమైనది లేదా ప్రత్యేకమైనది కాలేదని నేను గ్రహించాను.

చేతితో పట్టుకొనేదైనా లేదా డిజిటల్‌ది అయినా, పరిశుద్ధ బైబిలు మరియు మోర్మన్ గ్రంథము: యేసు క్రీస్తు యొక్క మరియొక నిబంధన లోక రక్షకుడైన యేసు క్రీస్తు నుండి ఆధ్యాత్మిక నడిపింపును, బోధనను అందిస్తాయి. ప్రాచీన ప్రవక్తలకు మరియు జనులకు దేవుని ఆదేశాలను వ్రాసియుంచడంలో మరియు మన స్వంత వ్యక్తిగత జీవితాలకు అవి అందించే మార్గదర్శకత్వంలో ఈ పుస్తకాల విస్తారమైన పాత్ర మూలంగా మనము వాటిని విలువైనవిగా భావిస్తున్నాము.

సజీవ ప్రవక్తల బోధనలతో కలిపి, ఈ పవిత్ర లేఖనాలు నేటి ప్రపంచంలో మనకు సిద్ధాంతపరమైన దిశను అందిస్తాయి. ప్రభువు నుండి మార్గదర్శకత్వం కోరుకునే వ్యక్తులకు మరియు కుటుంబాలకు ఉపదేశాన్ని, దిద్దుబాటును, ఓదార్పును మరియు సాంత్వనను ఇచ్చినప్పుడు ఈ లేఖనాలు అత్యంత శక్తివంతమైనవి.

పరిశుద్ధాత్మ నుండి వచ్చిన ఆధ్యాత్మిక ప్రేరణతో కలిసిన లేఖనాలు, విరిగిన హృదయాలు, నలిగిన ఆత్మలు కలిగియుండి, యేసు క్రీస్తును అనుసరించాలని కోరుకునే వారి పరివర్తనను సులభతరం చేసే ప్రాథమిక వనరుగా కొనసాగుతున్నాయి. విశ్వాసాన్ని అణగద్రొక్కడానికి విరోధి నిరంతరం చేసే ప్రయత్నాలను తట్టుకునే పునాదిని నిర్మించడంలో లేఖనాలు సహాయపడతాయి.

కొత్తగా మార్పుచెందిన వారు సంఘ చరిత్ర అంతటా ఆశీర్వదించబడ్డారు మరియు దానికి జీవనాధారంగా ఉన్నారు. ఒక ఉదాహరణ నాకు చాలా విలువైనది. నేను యువ బిషప్పు‌గా ఉన్నప్పుడు, ఇద్దరు అద్భుతమైన సువార్తికురాళ్ళు విలియం ఎడ్వర్డ్ మస్మెన్ కుటుంబానికి బోధిస్తున్నారు. తండ్రి, చాలా సమర్థుడైన న్యాయవాది, ఒక పెద్ద సంస్థ‌లో ప్రధాన న్యాయవాది. అంకితభావం గల అతని భార్య, జానెట్, మరింతగా క్రీస్తువంటి జీవితాన్ని జీవించడానికి కృషి చేయడంలో కుటుంబానికి సహాయపడుతోంది.

సుమారు 20 సంవత్సరాల వయస్సులో ఉన్న, అసాధారణమైన వారి కుమారుడు మరియు కుమార్తె, ఇద్దరూ కూడా బోధించబడుతున్నారు. నలుగురూ పాఠాలు నేర్చుకున్నారు మరియు సంఘానికి హాజరవుతున్నారు. సువార్తికురాళ్ళు మోర్మన్ గ్రంథాన్ని చదవాలని మరియు ఆ పవిత్ర గ్రంథం యొక్క సాక్ష్యం కోసం ప్రార్థించాలని నొక్కిచెప్పారు. విశేషమేమిటంటే, ఆ కుటుంబీకులు ప్రార్థనాపూర్వకంగా మోర్మన్ గ్రంథాన్ని తక్కువ సమయంలో పూర్తిగా చదివారు.

స్టేకు సువార్తికులు ఇద్దరూ పూర్వం వార్డు ఉపశమన సమాజ అధ్యక్షురాళ్ళు, వారితో పాటు సంస్కార సమావేశాలకు వచ్చారు.

కుటుంబం యొక్క బాప్తిస్మం దగ్గర పడుతుండగా, వారు సంఘాన్ని విమర్శించే సాహిత్యాన్ని పెద్దమొత్తంలో అందుకున్నారు. అది ఇంటర్నెట్‌ లేని సమయం, కానీ సామాగ్రి ఒక పెద్ద అట్టపెట్టె నిండా ఉంది.

అడుగబోయే ప్రశ్నలకు సమాధానమివ్వడానికి ఇటీవల బిషప్పుగా పిలువబడిన 34 ఏళ్ళ వయస్సున్న నన్ను సువార్తికురాళ్ళు ఆహ్వానించారు. మేము వారి గదిలో సమావేశమైనప్పుడు, సంఘాన్ని విమర్శించే కరపత్రాల పెద్ద పెట్టె గది మధ్యలో ఉంది. నేను ప్రార్థనాపూర్వకంగా ఈ నియామకాన్ని అందుకున్నాను. ప్రారంభ ప్రార్థన సమయంలో, “ఇది నిజమని అతనికి ముందే తెలుసు,” అని ఆత్మ నాతో గుసగుసలాడింది. అది ముఖ్యమైనది. కుటుంబంలోని మిగిలిన వారికి ఇప్పటికే సాక్ష్యం ఉందని సహోదరీలు నమ్మారు. తండ్రి గురించి వారికి ఖచ్చితంగా తెలియదు.

అతనికి అప్పటికే సాక్ష్యము ఉందని ఆత్మ నన్ను ప్రేరేపించింది అని నేను వెంటనే అతనికి చెప్పాను. “అది నిజమేనా?” అతను నన్ను నిశితంగా చూసి, మోర్మన్ గ్రంథము మరియు సంఘము యొక్క సత్యాన్ని ఆత్మ తనకు ధృవీకరించిందని చెప్పాడు.

ఇప్పటికే ఆధ్యాత్మిక ధృవీకరణ ఉన్నట్లయితే, కరపత్రాలను సమీక్షించడం అవసరమా అని నేను అడిగాను.

అవసరం లేదని తండ్రి సమాధానమిచ్చాడు. అతని సమాధానంతో మిగిలిన కుటుంబ సభ్యులు ఏకీభవించారు.

అతను ఒక ముఖ్యమైన ప్రశ్నను కలిగి ఉన్నాడని చెప్పాడు: సంఘాన్ని వ్యతిరేకిస్తూ వారు అంత సాహిత్యాన్ని పొందడానికి గల కారణం, వారు మరొక విశ్వాసానికి చెందినవారు కావడమే. అదనంగా, అతను ఆ విశ్వాసం కోసం కొత్త ప్రార్థనా మందిరాన్ని నిర్మించడంలో సహాయం చేస్తానని పెద్ద ప్రతిజ్ఞ చేశాడు. సువార్తికురాళ్ళు దశమభాగము యొక్క ప్రాముఖ్యతను గురించి తనకు బోధించారని, దానిని తాను కృతజ్ఞతతో అంగీకరించానని, అయితే తాను ఇంతకుముందు చేసిన ప్రతిజ్ఞను కూడా గౌరవించడం తప్పు కాదా అని అతను నన్ను అడిగాడు. ప్రతిజ్ఞ చెల్లించడం గౌరవప్రదంగా మరియు సముచితంగా ఉంటుందని నేను అతనికి హామీ ఇచ్చాను.

మస్మెన్ కుటుంబము.

వారి కొడుకు, కోడలు మరియు కూతురితో మస్మెన్‌లు.

కుటుంబం మొత్తం బాప్తిస్మం పొందింది. ఒక సంవత్సరం తరువాత వారు కాలిఫోర్నియా ఓక్లాండ్ దేవాలయంలో కుటుంబంగా ముద్రవేయబడ్డారు. నేను హాజరు కావడం విశేషం. కొడుకు న్యాయవిద్య పూర్తి చేశాడు, కాలిఫోర్నియా బార్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు మరియు వెంటనే జపాన్‌లో నమ్మకమైన సువార్తసేవ చేశాడు. తరువాతి తరాలు సువార్త పట్ల విశ్వాసంగా ఉండడాన్ని నేను సంవత్సరాలుగా గమనిస్తున్నాను. మనుమరాళ్ళలో ఒకరు ముద్రవేయబడినప్పుడు, దానిని నిర్వహించే అవకాశం నాకు లభించింది.

మన కాలంలో జరుగుతున్న పరివర్తనలు కూడా అంతే గొప్పవి. గత జూన్‌లో కాన్సాస్ సిటీ చీఫ్స్ యొక్క హెడ్ ఫుట్‌బాల్ కోచ్ ఆండీ రీడ్ మరియు నేను, మా విశ్వాసం మరియు ఇతర విశ్వాసాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇతరులతో కలిసి, న్యూయార్క్ నగరంలోని రివర్‌సైడ్ సంఘములో బహుళవిశ్వాస కార్యక్రమంలో మాట్లాడాము. కోచ్ రీడ్ రెండవ అవకాశాల గురించి, ఆహ్వానాలు మరియు అవకాశాలకు ప్రతిస్పందించడం గురించి నొక్కి చెప్పాడు, యేసు క్రీస్తు యొక్క సువార్త బోధించేది ఇదే. మరుసటి రోజు ఉదయం, మా భార్యలు, టామీ రీడ్ మరియు మేరీతో కలిసి, మేము మాన్‌హాట్టన్ రెండవ వార్డులో జరిగిన సంస్కార సమావేశానికి హాజరయ్యాము. అది ఒక ఆధ్యాత్మిక సేవ. సమూహంలో చాలామంది కొత్తగా పరివర్తన చెందిన వారున్నారు. ఇటీవల బాప్తిస్మం పొందిన ఐదుగురు సభ్యులు, నలుగురు పురుషులు మరియు ఒక యువకుడు, సంస్కారాన్ని అందిస్తున్న అహరోను యాజకత్వ సభ్యులలో ఉన్నారు. సంఘమంతటా ఇదే విధంగా కొత్త సభ్యుల ప్రవాహం జరుగుతోందని నివేదించడానికి నేను సంతోషిస్తున్నాను.

పవిత్రమైన ఆహ్వానాలకు స్పందిస్తూ, తమ జీవితాలను మార్చుకుని, యేసు క్రీస్తును అనుసరించే అవకాశాన్ని అంగీకరించేవారిలో గుర్తించదగిన పెరుగుదలకు మేము కృతజ్ఞులం. పరిశుద్ధ బైబిలు మరియు మోర్మన్‌ గ్రంథములో బోధించినట్లుగా వారు విశ్వాసము, పశ్చాత్తాపము, బాప్తిస్మము మరియు నిర్ధారణ ద్వారా నిబంధన మార్గంలోకి ప్రవేశిస్తారు.

పరివర్తన చెందడంలో మరియు సువార్తలో విశ్వాసంగా నిలిచియుండడంలో పవిత్ర లేఖనాల ప్రాముఖ్యతను మనం తక్కువ అంచనా వేయలేము. మోర్మన్ గ్రంథములో వివరించబడిన ప్రాచీన ప్రవక్తలకు యేసు క్రీస్తు యొక్క నియమితకార్యము గురించి తెలుసు మరియు వారు ఆయన సువార్తను బోధించారు. మోర్మన్ గ్రంథము యొక్క బోధనలను నేర్చుకొని, అర్థం చేసుకుని, అన్వయించుకున్నప్పుడు దేవునికి దగ్గరవ్వడానికి అది మనకు సహాయం చేస్తుంది. “ఒక మనుష్యుడు ఏ ఇతర గ్రంథము కన్నను [ఈ గ్రంథము] యొక్క సూక్తులననుసరించిన యెడల దేవునికి చేరువగునని” ప్రవక్త జోసెఫ్ స్మిత్ బోధించారు.

మోర్మన్ గ్రంథము దేవుని వాక్యమని తెలుసుకోవడానికి, మనము దానిని చదవాలి, ధ్యానించాలి మరియు దాని గురించి ప్రార్థించాలి, ఆపై దాని సూక్తులననుసరించి నడుచుకోవాలి. యథార్థ హృదయముతో, నిజమైన ఉద్దేశ్యముతో, క్రీస్తు నందు విశ్వాసము కలిగియుండి మనం ప్రార్థించినప్పుడు, దేవుడు మనకు ఆ గ్రంథం యొక్క సత్యాన్ని బయల్పరుస్తారని ప్రవక్త మొరోనై వాగ్దానమిచ్చారు. శాశ్వతమైన పరివర్తనకు మోర్మన్ గ్రంథమును అధ్యయనం చేయడం అవసరం.

బైబిలు మరియు మోర్మన్ గ్రంథము మధ్య ఉన్న సంబంధాన్ని చేతితో పట్టుకొనే పరికరాలుగా మనం ఆలోచిస్తున్నప్పుడు, ఒకరు ఇలా ప్రశ్నించవచ్చు. రెండు పుస్తకాలు జోడించబడతాయి మరియు “నీ చేతిలో ఏకమవుతాయి” అని ప్రభువు ప్రకటిస్తే, అవి ఎంత ఉపయోగకరంగా మరియు బహుమానపూర్వకంగా ఉంటాయని మీరు అనుకుంటున్నారు? “యూదా కర్రతునక” అయిన బైబిలు మరియు “యోసేపు కర్రతునక” అయిన మోర్మన్ గ్రంథము గురించి ప్రభువు ప్రకటించినది ఇదే.

అనేక ముఖ్యమైన అంశాలలో, మోర్మన్ గ్రంథము బైబిలు‌ను మెరుగుపరిచే మరియు నిర్మించే ప్రాథమిక సిద్ధాంతాన్ని అందిస్తుంది. యేసు క్రీస్తు ప్రాయశ్చిత్తం యొక్క సిద్ధాంతం ఒక గంభీరమైన ఉదాహరణ.

యేసు క్రీస్తు మరణం మరియు పునరుత్థానంతో సహా ఆయన మర్త్య పరిచర్య గురించి బైబిలు ఖచ్చితమైన వృత్తాంతాన్ని అందిస్తుంది. మోర్మన్ గ్రంథము యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తం గురించి మరింత స్పష్టంగా చెప్తుంది, దాని గురించి ప్రవక్తలు ఆయన మరణానికి ముందు వివరంగా చెప్పారు.

ఆల్మా 42వ అధ్యాయము యొక్క శీర్షిక యేసు క్రీస్తు ప్రాయశ్చిత్తం యొక్క సిద్ధాంతపరమైన ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తుంది.

అది ఇలా చదువబడుతుంది: “పశ్చాత్తాపపడి, దేవుడిని సేవించుటకు మనుష్యుని సమర్థునిగా చేయుటకు మర్త్యత్వము ఒక పరిశీలనా సమయమైయున్నది—పతనము సమస్త మానవజాతిపై ఐహికమైన, ఆత్మీయమైన మరణమును తెచ్చెను—పశ్చాత్తాపము ద్వారా విమోచన వచ్చును—లోక పాపముల నిమిత్తము దేవుడు తానే ప్రాయశ్చిత్తము చేయును—పశ్చాత్తాపపడు వారి కొరకు కనికరము కలదు—మిగిలిన వారందరు దేవుని న్యాయమునకు లోబడియున్నారు—ప్రాయశ్చిత్తము మూలముగా కనికరము వచ్చును—నిజముగా పశ్చాత్తాపపడువారు మాత్రమే రక్షింపబడుదురు.”

అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఇలా చెప్పారు, “మీరు ప్రతిరోజూ ప్రార్థనాపూర్వకంగా మోర్మన్ గ్రంథాన్ని అధ్యయనం చేసినప్పుడు, మీరు ప్రతిరోజూ—మంచి నిర్ణయాలను తీసుకుంటారు.” “మోర్మన్ గ్రంథములో మీరు ప్రతిరోజూ నిమగ్నమైనట్లయితే, మీరు అనుదిన దుష్ప్రభావాల నుండి రక్షించబడగలరని” కూడా ఆయన వాగ్దానం చేస్తున్నారు.

నేను చెప్పినట్లుగా, చేతితో పట్టుకొనే అసలైన పరికరం—ఒక పుస్తకం అనే భావనతో నేను ఆకట్టుకోబడ్డాను. అయినప్పటికీ, ఈ రోజు ప్రపంచంలో ఇంటర్నెట్ యొక్క అద్భుతమైన ప్రాముఖ్యతను నేను గుర్తించాను. చేతితో పట్టుకొనే ఒక ఆధునిక పరికరం గతంలో ఒక పెద్ద గ్రంథాలయాన్ని నింపినంత సమాచారాన్ని అందించగలదు. ఇలాంటి సమయంలో జీవిస్తున్నందుకు మనం కృతజ్ఞులం. ఇది పవిత్ర గ్రంథాలు మరియు సంఘ పుస్తకాలను డిజిటల్‌గా అందుబాటులో ఉంచడానికి అనుమతించినందుకు నేను ప్రత్యేకంగా కృతజ్ఞుడిని. సువార్తను అధ్యయనం చేయడానికి ఇంటర్నెట్ ఒక శక్తివంతమైన సాధనం. నేడు, చాలామంది వ్యక్తులు సాంకేతికతను ఉపయోగించి స్నేహితులతో లేఖనాలను పంచుకుంటున్నారు. ఉదాహరణకు, మోర్మన్ గ్రంథ యాప్, స్నేహితులకు మోర్మన్ గ్రంథాన్ని పరిచయం చేయడానికి ఒక అద్భుతమైన మార్గం మరియు మీరు ఎక్కడ ఉన్నా సాధారణమైన, సహజమైన మార్గాల్లో సులభంగా దానిని పంచుకోవచ్చు.

మోర్మన్ గ్రంథ యాప్.

ఇంటర్నెట్ అనేక ఆశీర్వాదాలను అందించినప్పటికీ, దురదృష్టవశాత్తూ, నేను ఇంతకు ముందు వివరించినట్లు సంఘాన్ని విమర్శిస్తూ వ్రాసిన కరపత్రాల వలె, ఇది సందేహాన్ని సృష్టించడానికి మరియు విలువైన సువార్త సూత్రాలపై విశ్వాసాన్ని బలహీనపరచడానికి కూడా ఉపయోగించబడింది. ఇది అధ్యక్షులు నెల్సన్ పేర్కొన్న “అనుదిన దుష్ప్రభావాలలో” భాగం కాగలదు.

విరోధి మరియు అతనికి సహాయం చేసేవారు, తెలిసీ తెలియకనే, మిమ్మల్ని దేవుని సత్యం నుండి దూరం చేయాలనే ఉద్దేశంతో, నేను ఇంతకు ముందు వివరించినట్లు పెట్టె నిండా సంఘాన్ని విమర్శించే వ్రాతపూర్వక సామాగ్రితో సమానమైనదాన్ని ఇంటర్నెట్‌లో సృష్టించారు.

సంవత్సరాలుగా సందేహాన్ని సృష్టించడానికి లేవనెత్తిన సమస్యలు విశేషంగా ఒకేలా ఉన్నాయి. నేను నా 20 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు, 1960ల కాలం నాటితో మీరు మన రోజును పోల్చినప్పుడు ఇది ప్రత్యేకంగా నిజమైనది.

అన్ని విషయాలలో తీర్పును ఉపయోగించాలని మరియు తెలివిగా ఉండాలని లేఖనాలు మనకు బోధిస్తాయి. ఇంటర్నెట్‌ను సానుకూల మార్గంలో లేదా విధ్వంసకర మార్గంలో ఉపయోగించవచ్చు.

దీర్ఘ-కాలిక సభ్యులు మరియు కొత్తగా సువార్తను అధ్యయనం చేస్తున్నవారు ఇద్దరూ తాము ఏమి చూస్తున్నామనేది ఆలోచించాలి. అనైతికమైన, అవినీతిగల లేదా అన్యాయమైన విషయాలను అలరించవద్దు. మీరు అలా చేస్తే, యాంత్రిక పద్ధతులు విశ్వాసాన్ని నాశనం చేసే మరియు మీ నిత్య పురోగతిని దెబ్బతీసే మార్గంలో మిమ్మల్ని నడిపించగలవు. మీరు సానుకూలంగా లేదా ప్రతికూలంగా వ్యవహరించవచ్చు. నీతిని వెదకండి మరియు ఇంటర్నెట్ యొక్క చీకటి అగాథాలను, ప్రతికూల విషయాలపై సమయాన్ని వృధాచేయడాన్ని నివారించండి. మీ జీవితాన్ని సానుకూలమైన, నీతివంతమైన ఆలోచనలతో నింపుకోండి, ఆనందంగా ఉండండి, ఆనందించండి కానీ మూర్ఖత్వానికి దూరంగా ఉండండి. అందులో తేడా ఉంది. పదమూడవ విశ్వాస ప్రమాణం ఒక అద్భుతమైన మార్గదర్శి. అన్నింటిని మించి, మోర్మన్ గ్రంథములో క్రమంగా నిమగ్నమవ్వండి, అది మీ జీవితంలోకి ఆత్మను ఆకర్షించి, తప్పు నుండి సత్యాన్ని గుర్తించడంలో మీకు సహాయపడుతుంది.

ఏ విధంగానైనా నిబంధన మార్గం నుండి దారితప్పిన వారికి నా సలహా ఏమిటంటే, పవిత్ర లేఖనాలు, ప్రవచనాత్మక మార్గదర్శకత్వం, ఇంటిలో మతపరమైన ఆచారాలు మరియు విశ్వాసపూరిత సంగీతానికి తిరిగి రండి. ప్రతీ ఆత్మ ప్రభువుకు విలువైనది. మాకు మీరు కావాలి! ప్రభువుకు మీరు కావాలి మరియు మీకు ఆయన కావాలి! మీరు ఎల్లప్పుడూ స్వాగతించబడతారు. నా అనేక సంవత్సరాల సంఘ సేవలో, నిబంధన మార్గానికి తిరిగి వచ్చి, ఆపై వారికిష్టమైన వారికి లేదా వారికి పరిచయమైన ప్రతి ఒక్కరికీ సేవ చేసి, ఆశీర్వదించిన అద్భుతమైన వ్యక్తులను నేను ఎంతో ఆరాధించాను.

పవిత్ర లేఖనాలు మరియు సజీవ ప్రవక్తలు, ప్రేమగల పరలోక తండ్రి తన పిల్లలందరికీ తన సంతోష ప్రణాళికను అందుబాటులో ఉంచే ముఖ్యమైన మార్గం.

యేసు క్రీస్తు యొక్క దైవత్వం మరియు ఆయన ప్రాయశ్చిత్తం యొక్క వాస్తవికతను గూర్చి నేను నా స్థిరమైన సాక్ష్యాన్నిస్తున్నాను, యేసు క్రీస్తు నామములో, ఆమేన్.

వివరణలు

  1. 2 తిమోతికి 3:16 చూడండి.

  2. నా సువార్తను ప్రకటించండి: యేసు క్రీస్తు సువార్తను పంచుకోవడానికి మార్గదర్శి (2023), 28; 2 నీఫై 2:7; 3 నీఫై 12:19; సిద్ధాంతము మరియు నిబంధనలు 20:37; Ezra Taft Benson, “A Mighty Change of Heart,” Ensign, Oct. 1989, 2–5 కూడా చూడండి.

  3. సహోదరీలు బెవర్లీ బ్రిడ్జ్ మరియు షెరిల్ మోర్గాన్‌లు సువార్తికురాళ్ళు.

  4. కుమారుడు, విలియం ఈ. మస్మెన్ III, స్టాన్‌ఫోర్డ్ నుండి పట్టభద్రుడయ్యాడు మరియు శాన్ ఫ్రాన్సిస్కోలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో న్యాయ పాఠశాలలో చదువుతున్నాడు. అతని సోదరి, ఆన్ సి. మస్మెన్, స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుతున్నారు.

  5. సహోదరీలు ఎలినోర్ మేర్ మరియు లూయిస్ జాన్సన్ స్టేకు సువార్తికులుగా ఉన్నారు.

  6. న్యూయార్క్ లేటర్-డే సెయింట్ ప్రొఫెషనల్ అసోసియేషన్ (NYLDSPA) రెవరెండ్ ఎ. ఆర్. బెర్నార్డ్ మరియు కోచ్ ఆండ్రూ “ఆండీ” డబ్ల్యు. రీడ్‌ను మాన్‌హాట్టన్‌లోని చారిత్రాత్మక ఇంటర్ డినామినేషనల్ రివర్‌సైడ్ సంఘములో సత్కరించింది. మన విశ్వాసం మరియు అనేక ఇతర విశ్వాసాలకు చెందిన సంఘ నాయకులు కూడా హాజరయ్యారు, వీరిలో ముందుగా గౌరవించబడిన మతగురువు జోసెఫ్ పోటస్నిక్ కూడా ఉన్నారు.

  7. See Tad Walch, “How Andy Reid’s Beliefs in Jesus Christ and a Second Chance for Michael Vick Guide the Kansas City Chiefs,” Deseret News, July 3, 2024, deseret.com.

  8. 2024, జనవరి 1 నుండి 2024, ఆగస్టు 30 వరకు 198,000ల కంటే ఎక్కువమంది కొత్తగా పరివర్తన చెందినవారు బాప్తిస్మం పొందారు.

  9. మోర్మన్ గ్రంథము ఎందుకు మన మతము యొక్క ప్రధానరాయి అని నా సువార్తను ప్రకటించండి యొక్క 5వ అధ్యాయము వివరిస్తుంది.

  10. మోర్మన్ గ్రంథ పీఠిక.

  11. ఒక మనుష్యుడు ఏ ఇతర గ్రంథము కన్నను మోర్మన్ గ్రంథము యొక్క సూక్తులననుసరించిన యెడల దేవునికి చేరువగునని ప్రవక్త జోసెఫ్ స్మిత్ చెప్పారు (మోర్మన్ గ్రంథ పీఠిక చూడండి).

  12. మొరోనై 10:4 చూడండి.

  13. యెహెజ్కేలు 37:15–17; 2 నీఫై 3:12 చూడండి.

  14. యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము గురించి తెలిపే ప్రాయశ్చిత్తము అనే పదము క్రొత్త నిబంధనలో కేవలం ఒక్కసారి పేర్కొనబడింది (రోమా 5:11 చూడండి). మోర్మన్ గ్రంథములో, ప్రాయశ్చిత్తము అనే పదము గురించి 24 సార్లు సూచించబడింది. 2 నీఫై 2:10 ప్రాయశ్చిత్తం ద్వారా జతచేయబడిన “సంతోషాన్ని” వివరిస్తుంది (see also index to the Book of Mormon, “Jesus Christ, Atonement through”).

  15. రస్సెల్ ఎమ్. నెల్సన్, “మోర్మన్ గ్రంథము: ఇది లేకపోతే మీ జీవితం ఎలా ఉండేది?”, లియహోనా, నవ. 2017, 62–63.

  16. ఆన్‌లైన్‌లో రండి, నన్ను అనుసరించండి నుండి ప్రతీ వారం మనం చదివినప్పుడు మనం ఎంతగా దీవించబడతామో ఆలోచించండి.

  17. కొన్ని సమస్యలు కేవలం అసత్యమైనవి. కొందరు చారిత్రక వాస్తవాలను తగిన సందర్భం లేకుండానే చెప్తారు. కొందరు బైబిలు మరియు మోర్మన్ గ్రంథము రెండింటికీ విరుద్ధంగా ఉన్న సామాజిక సమస్యల కోసం వాదిస్తున్నారు. కొందరు ప్రభువు ఇంకా బయల్పాటును అందించని సమస్యల గురించి ఆలోచిస్తున్నారు.

  18. డూమ్‌స్క్రోలింగ్ అనేది సోషల్ మీడియా లేదా న్యూస్ ఫీడ్‌లలో ప్రతికూల లేదా నిరుత్సాహపరిచే వార్తల కోసం అలవాటుగా మరియు స్థిరభావంతో శోధించే చర్య (see Merriam-Webster.com Dictionary, “doomscroll”).

  19. ఇటీవలి సంవత్సరాలలో సంఘము గణనీయమైన వృద్ధిని మరియు హెచ్చైన హాజరును అనుభవించింది. సంఘమును విడిచివెళ్ళే వారి శాతం గతంలో కంటే తక్కువగా ఉంది, కానీ మనకు ప్రతీ సభ్యుడు అవసరం.