2020–2024
ఆధ్యాత్మిక ప్రశ్నలకు జవాబులు వెదకడం
2024 అక్టోబరు సర్వసభ్య సమావేశము


12:27

ఆధ్యాత్మిక ప్రశ్నలకు జవాబులు వెదకడం

ప్రియమైన మిత్రులారా, మన మనఃపూర్వకమైన సువార్త ప్రశ్నలు ఎదగడానికి మనకు సహాయపడే అవకాశాలను పరలోక తండ్రికి మరియు యేసు క్రీస్తుకు అందించగలవు.

ఇది ఆశ్చర్యం కలిగించవచ్చని నాకు తెలుసు, కానీ మన సౌర వ్యవస్థలో తొమ్మిది గ్రహాలు ఉన్నాయని పాఠశాలలో నేర్పించినప్పుడు నేను గుర్తుంచుకోగలిగిన వయస్సులో ఉన్నాను. ఆ గ్రహాలలో ఒకటైన ప్లూటో, 1930లో కనుగొనబడిన తర్వాత, ఇంగ్లాండ్‌లోని ఆక్స్‌ఫర్డ్‌కు చెందిన 11 ఏళ్ళ వెనీషా బార్నీ ద్వారా దానికి ఆ పేరు పెట్టబడింది. మరియు 1992 వరకు, ప్లూటో మన సౌర వ్యవస్థలో అత్యంత సుదూర వస్తువుగా విశ్వసించబడింది. ఈ సమయంలో, తరగతిగదు‌లు మరియు వైజ్ఞానిక ప్రదర్శన‌లలో మన సౌర వ్యవస్థ యొక్క కాగితపు నమూనాలను కనుగొనడం సర్వసాధారణం, ప్రతీ ఒక్కటి తెలిసిన సరిహద్దులో ప్లూటో యొక్క స్థానాన్ని వివరిస్తుంది. చాలామంది శాస్త్రవేత్తలు ఆ అంచుకు అవతల సౌర వ్యవస్థ ఖాళీ స్థలాన్ని కలిగియుందని నమ్ముతారు.

ఏదేమైనప్పటికీ, ఖగోళ శాస్త్రవేత్తలు క్రమం తప్పకుండా జాడ కనిపెట్టే ఒక నిర్దిష్ట రకం తోకచుక్క యొక్క మూలానికి సంబంధించి శాస్త్రీయ సమాజంలో ఒక దీర్ఘకాలిక ప్రశ్న మిగిలిపోయింది. మరియు మన సౌర వ్యవస్థ యొక్క మరొక సుదూర ప్రాంతాన్ని కనుగొనే ముందు దశాబ్దాలుగా ఆ ప్రశ్న కొనసాగింది. వారికి ఉన్న పరిమిత జ్ఞానంతో, శాస్త్రవేత్తలు తదుపరి అధ్యయనం మరియు అన్వేషణకు అనుమతించే ముఖ్యమైన సాంకేతిక పురోగతులను ఉత్పత్తి చేయడానికి ఆ దశాబ్దాల మధ్యనున్న కాలాన్ని ఉపయోగించుకున్నారు. వారి అంతిమ పురోగతి మన గ్రహ మండలాన్ని పునర్నిర్మించింది, దాని ఫలితంగా ప్లూటో ఈ కొత్త అంతరిక్ష ప్రాంతంలో స్థానాన్ని పొందింది మరియు మన సౌర వ్యవస్థ ఎనిమిది గ్రహాలను కలిగియుంది.

ప్లూటోను దగ్గరగా అన్వేషించే పనిలో ఉన్న ఒక ప్రముఖ గ్రహసంబంధ శాస్త్రవేత్త మరియు న్యూ హొరైజన్స్ స్పేస్ మిషన్ కొరకు ప్రధాన పరిశోధకుడు ఈ అనుభవం గురించి ఇలా అన్నారు: “మన సౌర వ్యవస్థ యొక్క భౌగోళిక శాస్త్రం గురించి మనము అర్థం చేసుకున్నాము అని మనుష్యులు అనుకున్నారు. మనము అర్థం చేసుకోలేదు. మన సౌర వ్యవస్థలోని గ్రహాల సంఖ్యను అర్థం చేసుకున్నామని మనము అనుకున్నాము. మరియు మనము తప్పు చేసాము.”

అంతరిక్ష పరిశోధన చరిత్రలో ఈ కాలం గురించి నాకు ఆశ్చర్యం కలిగించేది ఏమిటంటే, వైజ్ఞానిక పరిధులను విస్తరించే ఉపమానరూపక అన్వేషణకు మరియు దేవుని పిల్లలుగా మన ఆధ్యాత్మిక ప్రశ్నలకు జవాబులు వెదకడానికి మనం చేసే ప్రయాణానికి మధ్య కొన్ని సమాంతరాలు మరియు కీలక వ్యత్యాసాలు ఉన్నాయనే విషయం. ప్రత్యేకించి, మన ఆధ్యాత్మిక అవగాహన యొక్క పరిమితులకు మనం ఎలా ప్రతిస్పందించవచ్చు మరియు వ్యక్తిగత ఎదుగుదల యొక్క తదుపరి దశ కోసం మనల్ని మనం ఎలా సిద్ధం చేసుకోవచ్చు—మరియు సహాయం కోసం మనం ఎటువైపు తిరగవచ్చు అనేవి.

ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ

ప్రశ్నలు అడగడం మరియు అర్థం కోసం వెదకడం అనేది మన మర్త్య అనుభవంలో సహజమైన మరియు సాధారణమైన భాగం. కొన్ని సమయాల్లో, పూర్తి సమాధానాలను కలిగి ఉండకపోవడం అనేది మనల్ని మన అవగాహన యొక్క అంచులకు తీసుకురావచ్చు మరియు ఆ పరిమితులు నిరుత్సాహంగా లేదా ముంచివేసేలా అనిపించవచ్చు. ఆశ్చర్యకరంగా, మనందరి కోసం పరలోక తండ్రి యొక్క సంతోష ప్రణాళిక, మన పరిమితులను లక్ష్యపెట్టకుండా మనం పురోగమించడంలో మరియు అన్ని విషయాల గురించి పూర్తి జ్ఞానం లేకపోయినా, మనం స్వంతంగా సాధించలేని వాటిని సాధించడంలో సహాయపడేలా రూపొందించబడింది. దేవుని ప్రణాళిక మన మానవజాతి యొక్క పరిమితుల పట్ల దయగలది; దేవుడు మన మంచి కాపరిగా ఉండడానికి మన రక్షకుడైన యేసు క్రీస్తును మనకు అందించారు; మరియు ఆయనను ఎంచుకోవడానికి మన కర్తృత్వాన్ని ఉపయోగించేలా మనల్ని ప్రేరేపించారు.

“ప్రశ్నలు అడగడం బలహీనతకు సంకేతం కాదు,” బదులుగా “అది వృద్ధిని సూచించేది” అని ఎల్డర్ డీటర్ ఎఫ్. ఉఖ్‌డార్ఫ్ బోధించారు. సత్యాన్వేషకులుగా మన వ్యక్తిగత ప్రయత్నం గురించి నేరుగా మాట్లాడుతూ, మన ప్రవక్త, అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్, మనకు “గాఢమైన కోరిక” ఉండాలని మరియు “యథార్థ హృదయముతో, [యేసు] క్రీస్తు నందు విశ్వాసము కలిగియుండి, మనఃపూర్వకముగా అడగాలని” బోధించారు. ఆయన ఇంకా ఇలా బోధించారు, “‘మనఃపూర్వకము’ అంటే ఇవ్వబడిన దైవిక నిర్దేశాన్ని అనుసరించాలని ఒక వ్యక్తి నిజంగా అనుకోవడం.”

జ్ఞానమందు వర్థిల్లడానికి మన వ్యక్తిగత ప్రయత్నం, మన ప్రశ్నలు సంక్లిష్టమైనా లేకపోయినా, చర్య మరియు ఫలితం యొక్క దృష్టితో, నమూనాలను వెదకడం మరియు గుర్తించడం, ఆ తర్వాత మన అవగాహనకు ఆకృతిని ఇవ్వడానికి మరియు జ్ఞానంలో గ్రహించిన ఖాళీలను పూరించడానికి కథనాలను రూపొందించడం ద్వారా వాటిని పరిశీలించడానికి దారితీయవచ్చు. అయితే, మన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అన్వేషించడాన్ని మనం పరిగణించినప్పుడు, ఈ ఆలోచనాత్మక ప్రక్రియలు కొన్ని సమయాల్లో సహాయపడవచ్చు, కానీ పరలోక తండ్రి మరియు మన రక్షకుడైన యేసు క్రీస్తు, వారి సువార్త, వారి సంఘము మరియు మనందరి కొరకు వారి ప్రణాళిక వంటి వాటికి సంబంధించిన విషయాలను మనం వివేచించడానికి చూస్తున్నప్పుడు వాటికవే అసంపూర్ణంగా ఉంటాయి.

తండ్రియైన దేవుడు మరియు ఆయన కుమారుడు వారి జ్ఞానాన్ని మనకు అందించడం అనేది మన జీవితాల్లో మరియు వారి సమాధానాలు, వాటి అర్థాల కోసం మనం విశ్వాసంతో వెదకడంలో యేసు క్రీస్తుపై దృష్టి కేంద్రీకరించినప్పుడు పరిశుద్ధాత్మ శక్తిని మన వ్యక్తిగత గురువుగా ఆహ్వానించడానికి ప్రాధాన్యతనిస్తుంది. పవిత్ర లేఖనాన్ని అధ్యయనం చేయడానికి వెచ్చించే భక్తిగల సమయం ద్వారా సత్యాన్ని కనుగొనమని మరియు మన కాలం కొరకు ఆధునిక ప్రవక్తలు మరియు అపొస్తలుల ద్వారా ఇవ్వబడిన, కడవరి-దినాలలో బయల్పరచబడిన సత్యాన్ని వెదకమని వారు మనల్ని ఆహ్వానిస్తున్నారు. ప్రభువు యొక్క మందిరంలో క్రమమైన, ఆరాధనాపూర్వకమైన సమయాన్ని గడపాలని మరియు “పరలోకం నుండి సమాచారాన్ని పొందేందుకు” ప్రార్థనలో మోకరించాలని వారు మనల్ని వేడుకుంటున్నారు. కొండమీద ఆయన ప్రసంగాన్ని వినడానికి అక్కడున్న వారికి “అడుగుడి మీకియ్యబడును; వెదకుడి మీకు దొరకును; తట్టుడి మీకు తీయబడును” అని యేసు చేసిన వాగ్దానం, ఆయన భూలోక పరిచర్యలో నిజమైనట్లే మన కాలంలోనూ మనకు నిజమవుతుంది. “పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి మంచి యీవుల నిచ్చును” అని మన రక్షకుడు హామీ ఇస్తున్నారు.

ప్రభువు బోధించే విధానము, “ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము.” మనకిచ్చిన ప్రస్తుత ఆజ్ఞకు మరియు తరువాత ఇవ్వబోయే ఆజ్ఞకు మధ్య ఉన్న ఖాళీ సమయంలో మనం “యెహోవా కొరకు ఎదురుచూడవలసిన” అవసరం ఉండవచ్చు. ఈ ఆజ్ఞల మధ్య గల సమయంలో మన గొప్ప ఆధ్యాత్మిక శిక్షణ సంభవించగలదు—ఇది మనం తీవ్రంగా కోరుకున్న దానికోసం “సహనంతో భరించి”, నిబంధన ద్వారా మనం దేవునితో చేసిన పవిత్రమైన వాగ్దానాలను కొనసాగించడానికి మన శక్తిని పునరుద్ధరించుకొనే స్థితి.

పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తుతో గల మన నిబంధన సంబంధము దేవుని రాజ్యములో ప్రబలే మన పౌరసత్వాన్ని సూచిస్తుంది. అక్కడ మన నివాసానికి మన జీవితాన్ని దైవిక నియమాలకు అనుగుణంగా మార్చుకోవడం మరియు ఆధ్యాత్మికంగా ఎదగడానికి కృషి చేయడం అవసరం.

విధేయత

మోర్మన్ గ్రంథము అంతటా బోధించబడిన ఒక ముఖ్య సూత్రం ఏమిటంటే, దేవుని పిల్లలు విధేయతను ప్రదర్శించడానికి మరియు వారి నిబంధనలను కొనసాగించడానికి ఎంచుకున్నప్పుడు, వారు నిరంతర ఆధ్యాత్మిక మార్గదర్శకత్వాన్ని, దిశను పొందుతారు. మన విధేయత మరియు శ్రద్ధ ద్వారా మనం జ్ఞానం మరియు తెలివితేటలు సంపాదించవచ్చని ప్రభువు మనకు చెప్పారు. దేవుని చట్టాలు మరియు ఆజ్ఞలు మన జీవితంలో అడ్డంకులుగా ఉండేందుకు కాదు గానీ, వ్యక్తిగత బయల్పాటు మరియు ఆధ్యాత్మిక విద్యకు శక్తివంతమైన ప్రవేశమార్గాలుగా ఉండేందుకు రూపొందించబడ్డాయి. “దేవుని నుండి బయల్పాటు ఎల్లప్పుడూ ఆయన నిత్య చట్టానికి అనుగుణంగా ఉంటుంది” మరియు “అది ఆయన సిద్ధాంతానికి ఎప్పుడూ విరుద్ధంగా ఉండదు” అని అధ్యక్షులు నెల్సన్ కీలకమైన సత్యాన్ని బోధించారు. ఆయన హేతువుల గురించి పూర్తి జ్ఞానం లేకపోయినా, దేవుని ఆజ్ఞలకు మీ ఇష్టపూర్వక విధేయత మిమ్మల్ని ఆయన ప్రవక్తల సహవాసంలో ఉంచుతుంది. మోషే 5, ఆదాము మరియు ప్రభువు దూత మధ్య ఒక నిర్దిష్ట పరస్పర సంభాషణ గురించి మనకు బోధిస్తుంది.

ప్రభువు ఆదాము మరియు హవ్వలకు, “వారి దేవుడైన ప్రభువును ఆరాధించి, తమ మందలో తొలిచూలున పుట్టిన వాటిని ప్రభువుకు అర్పణగా తేవలెనని ఆజ్ఞలిచ్చిన” తర్వాత, “ఆదాము ప్రభువు ఆజ్ఞలకు లోబడియుండెను” అని లేఖనాలు చెప్తున్నాయి. తరువాత మనము ఇలా చదువుతాము, “అనేక దినములైన తరువాత ప్రభువు దూత ఆదాముకు ప్రత్యక్షమై—నీవెందుకు ప్రభువుకు బలులను అర్పించుచున్నావని అడిగెను. అందుకు ఆదాము—నేనెరుగను, కానీ ప్రభువు నన్నాజ్ఞాపించెనని చెప్పెను.”

ఆదాము యొక్క విధేయత అతని అవగాహనకు ముందుంది మరియు అతను యేసు క్రీస్తు ప్రాయశ్చిత్తం యొక్క పవిత్ర చిహ్నంలో పాల్గొంటున్నట్లు పవిత్రమైన జ్ఞానాన్ని పొందడానికి అతన్ని సిద్ధం చేసింది. అలాగే, మన వినయపూర్వకమైన విధేయత, మనలో ప్రతీ ఒక్కరి కోసం దేవుని విధానాలు మరియు ఆయన దైవిక ఉద్దేశ్యం గురించి మన ఆధ్యాత్మిక వివేచనకు మార్గం సుగమం చేస్తుంది. మన విధేయతను పెంపొందించుకోవడానికి ప్రయత్నించడం మనల్ని మన రక్షకుడైన యేసు క్రీస్తుకు దగ్గర చేస్తుంది, ఎందుకంటే ఆయన చట్టాలు మరియు ఆజ్ఞలపట్ల విధేయత ప్రభావవంతంగా ఆయనతో సంబంధాన్ని ఏర్పరుస్తుంది.

అదనంగా, సువార్త నియమాలు మరియు పవిత్ర నిబంధనలను మనం విశ్వాసంతో పాటించడం ద్వారా మనం ఇప్పటికే వారసత్వంగా పొందియున్న తెలివి మరియు జ్ఞానం పట్ల మనకున్న విశ్వసనీయత, పరిశుద్ధాత్మ నుండి సమాచారాన్ని పొందడానికి మరియు నిర్వాహకులుగా ఉండడానికి మన సంసిద్ధతకు కీలకమైన సిద్ధపాటు.

పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తు అన్ని సత్యాలకు మూలం మరియు వారి జ్ఞానాన్ని ఉదారంగా పంచుకుంటారు. అలాగే, దేవునిపై ఆధారపడకుండా ఎటువంటి వ్యక్తిగత జ్ఞానం మనకు లేదని అర్థం చేసుకోవడం, ఎవరిని ఆశ్రయించాలో మరియు ముందుగా ఎవరిపై మన నమ్మకాన్ని ఉంచాలో తెలుసుకోవడంలో మనకు సహాయపడుతుంది.

ప్రగాఢ నమ్మకం

ఎలీషా ప్రవక్త ద్వారా కుష్టు వ్యాధి నుండి స్వస్థత పొందిన సైన్యాధిపతియైన నయమాను గురించిన పాత నిబంధన వృత్తాంతం నాకు చాలా ఇష్టమైనది. ఒక “చిన్నదాని” దృఢమైన విశ్వాసం ఒక వ్యక్తి యొక్క జీవన గమనాన్ని ఎలా మార్చేసిందో ఈ కథ వివరిస్తుంది మరియు ఆయనపై, ఆయన ప్రవక్తపై నమ్మకం ఉంచిన వారిపట్ల దేవుని దయ ఎలా ఉంటుందో విశ్వాసులందరికీ బయల్పరచింది. పేరులేనిది అయినప్పటికీ, ఈ యువతి కూడా మన అవగాహనను పెంచడంలో సహాయపడింది. ఆమె సాక్ష్యంపై నయమానుకు గల నమ్మకం, దేవుడు ఎంచుకున్న సేవకుని వద్దకు స్వస్థత కోసం తన విన్నపాన్ని తీసుకువెళ్ళడానికి అతన్ని ప్రేరేపించింది.

యొర్దాను నదిలో స్నానము చేయమని చెప్పిన ఎలీషా ప్రవక్త సూచనలకు నయమాను ప్రతిస్పందన మొదట సందేహాస్పదంగా మరియు కోపంగా ఉంది. కానీ ప్రవక్త సలహాకు విధేయుడిగా ఉండమని అతనికి ఇవ్వబడిన ఆహ్వానం, అతని స్వస్థతకు మరియు దేవుడు నిజమైనవాడని అతడు నాటకీయంగా తెలుసుకోవడానికి దారితీసింది.

మన ఆధ్యాత్మిక విన్నపాలలో కొన్ని సహేతుకంగా గుర్తించదగిన సమాధానాలను కలిగి ఉన్నాయని మరియు మనకు గణనీయమైన అసౌకర్యాన్ని కలిగించకపోవచ్చని మనం కనుగొనవచ్చు. లేదా నయమాను వలె, ఇతర అవసరాలు మరింత సవాలుగా ఉన్నాయని మరియు మనలో కష్టమైన, సంక్లిష్టమైన భావాలను సృష్టించవచ్చని మనం కనుగొనవచ్చు. లేదా మన సౌర వ్యవస్థ గురించి ఖగోళ శాస్త్రవేత్తల ముందస్తు నిర్ధారణల వర్ణన మాదిరిగానే, ఆధ్యాత్మిక సత్యం కోసం మన అన్వేషణలో, మనం ప్రత్యేకంగా మన స్వంత పరిమిత అవగాహనపై ఆధారపడినట్లయితే, మనము అసత్యమైన వివరణలను చేరుకోవచ్చు, దాని యొక్క దుఃఖకరమైన, అనాలోచిత పరిణామం మనల్ని నిబంధన మార్గం నుండి దూరంగా నడిపించి వేస్తుంది. అంతేకాకుండా, “సమస్త శక్తి, వివేకము, గ్రహింపును కలిగియుండి; అన్ని సంగతులను గ్రహించుచుండి,” కనికరము కలిగియున్న దేవుడు ఆయన నామమందు మన విశ్వాసం ద్వారా జ్ఞానోదయాన్ని అందించే వరకు కొన్ని ప్రశ్నలు కొనసాగవచ్చు.

నయమాను వృత్తాంతం నుండి ఒక ముఖ్యమైన హెచ్చరిక ఏమిటంటే, దేవుని చట్టాలు మరియు ఆజ్ఞలపట్ల విధేయతను ప్రతిఘటించడం మన ఎదుగుదలను పొడిగించవచ్చు లేదా ఆలస్యం చేయవచ్చు. యేసు క్రీస్తును మన గొప్ప వైద్యునిగా కలిగియున్నందుకు మనము ధన్యులం. దేవుని చట్టాలు మరియు ఆజ్ఞలపట్ల మన విధేయత, మన కోసం ఆయన నిర్దేశించిన చికిత్సా ప్రణాళిక ప్రకారం మనకు అవసరమని ఆయనకు తెలిసిన అవగాహనను, స్వస్థతను అందించడానికి మన రక్షకునికి అడ్డు తొలగించగలదు.

ఎల్డర్ రిచర్డ్ జి. స్కాట్ ఇలా బోధించారు, “ఈ జీవితం ప్రగాఢమైన నమ్మకంతో—యేసు క్రీస్తుపై నమ్మకం, ఆయన బోధనలపై నమ్మకం, ఇప్పుడు సంతోషం కోసం మరియు ఉద్దేశపూర్వకంగా, అత్యంత సంతోషకరమైన నిత్య ఉనికి కోసం ఆ బోధనలకు విధేయులై ఉండేలా పరిశుద్ధాత్మ చేత నడిపించబడినట్లుగా మన సామర్థ్యంపై నమ్మకంతో కూడిన అనుభవం. విశ్వసించడం అంటే ఆది నుండి అంతం తెలియకుండా ఇష్టపూర్వకంగా విధేయత చూపడం (సామె. 3:5-7 చూడండి). ఫలితాలు పొందడానికి, మీ స్వంత వ్యక్తిగత భావాలు మరియు అనుభవంపై మీకున్న నమ్మకం కంటే ప్రభువుపై మీకున్న నమ్మకం మరింత శక్తివంతంగా మరియు శాశ్వతంగా ఉండాలి.

ఎల్డర్ స్కాట్ ఇలా కొనసాగించారు: “విశ్వాసాన్ని సాధన చేయడమంటే, ప్రభువు మీతో ఏమి చేస్తున్నారో ఆయనకు తెలుసునని మరియు ఆయన దానిని ఎలా చేయగలరో మీరు అర్థం చేసుకోలేనప్పటికీ, మీ శాశ్వతమైన మంచి కోసం ఆయన దానిని సాధించగలరని నమ్మడం.”

ముగింపు సాక్ష్యము

ప్రియమైన మిత్రులారా, మన మనఃపూర్వకమైన సువార్త ప్రశ్నలు ఎదగడానికి మనకు సహాయపడే అవకాశాలను పరలోక తండ్రికి మరియు యేసు క్రీస్తుకు అందించగలవని నేను సాక్ష్యమిస్తున్నాను. నా స్వంత ఆధ్యాత్మిక ప్రశ్నలకు—గతం మరియు వర్తమానం లోనివి—ప్రభువు నుండి జవాబులు వెదకడానికి నా వ్యక్తిగత ప్రయత్నం, ఆయనపట్ల విధేయతను మరియు ప్రస్తుతం నేను కలిగి ఉన్న ఆధ్యాత్మిక జ్ఞానంపట్ల విశ్వసనీయతను సాధన చేయడానికి నా అవగాహనకు మరియు దేవుని అవగాహనకు మధ్య గల ఖాళీని ఉపయోగించేందుకు నన్ను అనుమతించింది.

పరలోక తండ్రిపై మరియు ఆయన పంపిన ఆయన ప్రవక్తలపై మీ నమ్మకాన్ని ఉంచడం, మిమ్మల్ని ఆధ్యాత్మికంగా పైకెత్తడానికి మరియు విస్తరించియున్న దేవుని జ్ఞానం వైపుకు మిమ్మల్ని ముందుకు నెట్టడానికి మీకు సహాయపడుతుందని నేను సాక్ష్యమిస్తున్నాను. మీరు మారతారు కాబట్టి మీ అనుకూలస్థానం మారుతుంది. మీరు ఎంత ఎత్తులో ఉంటే, అంత దూరం చూడగలరని దేవునికి తెలుసు. ఆ ఎత్తుకు చేరమని మన రక్షకుడు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.