యేసు క్రీస్తు నామమును తీసుకొనుట
మనం యేసు క్రీస్తుతో ఎంత ఎక్కువగా గుర్తింపు పొంది, ఆయనను గుర్తుంచుకుంటామో, అంత ఎక్కువగా ఆయనలా ఉండాలని కోరుకుంటాము.
2018 లో, యూటా విశ్వవిద్యాలయంలో, “డా. రస్సెల్ ఎమ్. నెల్సన్ మరియు డాంట్జెల్ డబ్ల్యు. నెల్సన్ ప్రెసిడెన్షియల్ చైర్ ఇన్ కార్డియోథొరాసిక్ సర్జరీ” అనే ప్రత్యేక పండితస్థానాన్ని ఏర్పాటుచేసారు—కార్డియో అంటే “గుండె” మరియు థొరాసిక్ అంటే “ఛాతీ.” ఇది గుండె శస్త్రవైద్యునిగా అధ్యక్షులు నెల్సన్ గారి ముఖ్యమైన పనిని మరియు ఆయన దివంగత భార్య డాంట్జెల్ నుండి ఆయనకు లభించిన మద్దతును గౌరవించింది. ఈ పండితస్థానం భవిష్యత్తులో కూడా కొనసాగేలా రూపొందించబడిన నిధి ద్వారా చెల్లించబడింది. ఈ రకమైన ప్రతిష్టాత్మక పండితస్థానానికి ఎంపికైన వ్యక్తి గుర్తింపును, జీతంలో మద్దతును మరియు పరిశోధన నిధులను పొందుతారు.
పండితస్థానానికి ఎంపికైన మొదటి శస్త్రవైద్యుడు డాక్టర్ క్రెయిగ్ హెచ్. సెల్జ్‌మన్, ఆయన మన సంఘ సభ్యుడు కాదు, కానీ నైపుణ్యం కలిగిన గుండె శస్త్రవైద్యుడు. డాక్టర్ సెల్జ్‌మన్‌కు ఈ పండితస్థానాన్ని ప్రదానం చేసే కార్యక్రమానికి, అధ్యక్షులు నెల్సన్ మరియు ఆయన భార్య సహోదరి వెండి డబ్ల్యు. నెల్సన్‌తో సహా అనేకమంది ముఖ్య అతిథులు హాజరయ్యారు. సమావేశంలో, అధ్యక్షులు నెల్సన్ తన మార్గదర్శక శస్త్రవైద్య వృత్తి గురించి వినయంగా మాట్లాడారు.
తర్వాత ఈ పండితస్థానానికి నియమించబడడం తనకు ఎంత విలువైనదో డా. సెల్జ్‌మన్ పంచుకున్నారు. నాలుగు రోజుల క్రితం, చాలాసేపు ఆపరేషన్ గదిలో గడిపిన తర్వాత, తన రోగులలో ఒకరు శస్త్రచికిత్సకు తిరిగి వెళ్లాల్సి ఉన్నట్లు తాను కనుగొన్నానని ఆయన చెప్పారు. ఆయన అలసిపోయారు మరియు ఆసుపత్రిలో మరో రాత్రి గడపాల్సి వస్తుందని తెలిసి నిరాశ చెందారు.
ఈ సాయంత్రం, డాక్టర్ సెల్జ్‌మన్ తనతో తాను జీవితాన్ని మార్చే సంభాషణ జరిపారు. ఆ క్షణంలో, ఆయన ఇలా అనుకున్నారు, “శుక్రవారం, నేను డాక్టర్ నెల్సన్ గారి పేరుతో ఇచ్చే పండితస్థానానికి నియమితుడనవుతాను. ఆయన ఎల్లప్పుడూ తన భావోద్వేగాలను అదుపులో ఉంచుకునే వ్యక్తిగా, అందరినీ గౌరవంగా చూసే వ్యక్తిగా మరియు ఎప్పుడూ తన నిగ్రహాన్ని కోల్పోని వ్యక్తిగా పేరుగాంచారు. ఇప్పుడు నా పేరు ఆయన పేరుతో ముడిపడి ఉంటుంది కాబట్టి, నేను ఆయనలాగా ఉండడానికి ప్రయత్నించాలి.” డాక్టర్ సెల్జ్‌మన్ అప్పటికే చాలా శ్రద్ధగల సర్జన్. కానీ ఆయన ఇంకా మెరుగ్గా ఉండాలని కోరుకున్నారు.
గతంలో, ఆయన శస్త్రచికిత్స బృందానికి ఆయన అలసట మరియు నిరాశ గురించి తెలిసిపోయేది, ఎందుకంటే ఆయన దానిని తన పద్ధతిలో మరియు స్వరంలో చూపించియుండవచ్చు. కానీ ఆ రాత్రి ఆపరేషన్ గదిలో, డాక్టర్ సెల్జ్‌మన్ తన బృందానికి ప్రత్యేకంగా మద్దతు ఇవ్వడానికి మరియు అర్థం చేసుకోవడానికి మనస్సాక్షితో కృషి చేశారు. అది మార్పును కలిగించిందని ఆయన భావించారు మరియు డాక్టర్ నెల్సన్ లాగా ఉండడానికి ప్రయత్నిస్తూనే ఉండాలని నిర్ణయించుకున్నారు.
ఐదు సంవత్సరాల తరువాత, అధ్యక్షులు నెల్సన్ తన వృత్తిపరమైన పత్రాలను యూటా విశ్వవిద్యాలయానికి విరాళంగా ఇచ్చారు. అధ్యక్షులు నెల్సన్‌కు అధికారికంగా కృతజ్ఞతలు తెలిపేందుకు విశ్వవిద్యాలయం నుండి ప్రముఖులు వచ్చారు. ఈ కార్యక్రమంలో, డా. సెల్జ్‌మన్ మరలా మాట్లాడారు. అధ్యక్షులు నెల్సన్ పేరులో మొదటి అక్షరాలైన RMN గురించి ప్రస్తావిస్తూ, ఆయన ఇలా అన్నారు, “ఇప్పుడు యూటా విశ్వవిద్యాలయంలోని కార్డియోథొరాసిక్ సర్జరీ విభాగంలో ‘RMN’ అనే ఒక తత్వం విస్తరించి ఉంది.”
నిరుత్సాహకర పరిస్థితుల్లో, డా. సెల్జ్‌మన్ ఇలా వివరించారు: “మేము ఇప్పుడు మా శిక్షణార్థులకు నేర్పించేదే నేను చేస్తాను—దృష్టి కేంద్రీకరించడం, దాన్ని అధిగమించడం మరియు మీరు చేయగలిగినంత ఉత్తమంగా చేయడం. ఈ తత్వం ప్రతిరోజూ మాలో నివసిస్తుంది. విభాగంలో ప్రతి సభ్యునికి మరియు ప్రతీ కొత్త శిక్షణార్థికి మేము లాపెల్ పిన్‌లను ఇస్తాము. పిన్ దిగువన ‘RMN’ అనే అక్షరాలు ఉంటాయి. RMN తత్వం మా శిక్షణకు పునాది; దానిని మేము అందరికీ బోధిస్తాము.” డా. సెల్జ్‌మన్ తన పూర్వ వైఖరిని, ఆకాంక్షలను ఉద్దేశ్యపూర్వకంగా మార్చుకున్నారు, ఎందుకంటే ఆయన పేరు ఇప్పుడు అధ్యక్షులు నెల్సన్ పేరుతో అనుసంధానించబడి ఉంది.
డా. సెల్జ్‌మన్ పాల్గొన్న ఈ సంఘటనల శ్రేణి నన్ను నేను ఇలా ప్రశ్నించుకునేలా చేసింది: “నా పేరును యేసు క్రీస్తు పేరుతో ముడిపెట్టినప్పటి నుండి నేను ఎలా మారాను? ఫలితంగా నేను క్రీస్తులాంటి తత్వాన్ని స్వీకరించానా? నేను నిజంగా మంచిగా మరియు మరింతగా ఆయనలాగా మారడానికి ప్రయత్నించానా?”
డాక్టర్ సెల్జ్‌మన్ అనుభవంలో, మనం యేసు క్రీస్తు నామాన్ని మనపైకి తీసుకునే ప్రక్రియకు కనీసం ఐదు సమాంతరాలను చూడవచ్చు. ఆ ప్రక్రియ బాప్తిస్మముతో ప్రారంభమైనప్పటికీ, మనం మరింత స్వచ్ఛంగా మరియు పవిత్రంగా ఉండి, ఆయనలాగా మారే వరకు అది పూర్తి కాదు.
మొదటి సమాంతరం గుర్తింపు. నెల్సన్ పండితస్థానానికి డా. సెల్జ్‌మన్ నియామకం ఆయన పేరును అధ్యక్షులు నెల్సన్ పేరుతో ముడిపెట్టింది మరియు డాక్టర్ సెల్జ్‌మన్ అధ్యక్షులు నెల్సన్‌తో గుర్తింపు పొందడం ప్రారంభించారు. మనం యేసు క్రీస్తు పేరును మనపై తీసుకున్నప్పుడు, మన పేరును ఆయన పేరుతో అనుసంధానిస్తాము. మనం ఆయనతో గుర్తింపు పొందుతాము. మనం సంతోషంగా క్రైస్తవులుగా ప్రసిద్ధి చెందుతాము. మనం రక్షకుడిని అంగీకరిస్తాము మరియు ఆయనకు చెందినవారిగా లెక్కించబడడానికి నిస్సందేహంగా నిలబడతాము.
గుర్తింపుకు దగ్గరి సంబంధం ఉన్న మరొక సమాంతరం—జ్ఞాపకం. డాక్టర్ సెల్జ్‌మన్ తన కార్యాలయంలోకి వెళ్ళినప్పుడు, ఆయన నెల్సన్ పండితస్థానానికి నియమించబడినప్పుడు అందుకున్న పతకం వైపు ఆయన కళ్ళు ఆకర్షించబడతాయి. ఆ పతకం ఆయనకు ప్రతిరోజూ RMN తత్వాన్ని గుర్తు చేస్తుంది. మన విషయానికొస్తే, ప్రతీవారం సంస్కారంలో పాల్గొనడం వారమంతా యేసు క్రీస్తును జ్ఞాపకముంచుకోవడానికి మనకు సహాయపడుతుంది. మనం సంస్కారంలో పాలుపంచుకున్నప్పుడు, మనల్ని విమోచించడానికి ఆయన చెల్లించిన వెల యొక్క జ్ఞాపకార్థం మనం అలా చేస్తాము. మనం ఆయనను జ్ఞాపకం చేసుకోవడానికి, ఆయన గొప్పతనాన్ని గుర్తించడానికి మరియు ఆయన మంచితనాన్ని అభినందించడానికి కొత్తగా నిబంధన చేస్తాము. మనం ఆయన కృప యందు మరియు ద్వారానే, శరీరము యొక్క మరణము మరియు ఆత్మ యొక్క మరణము నుండి రక్షించబడ్డామని పదే పదే అంగీకరిస్తాము.
జ్ఞాపకం అంటే మోర్మన్ గ్రంథ ప్రవక్తయైన ఆల్మా ఇచ్చిన సలహాను మనం పాటించడం. మనం “[మన] కార్యములన్నీ ప్రభువునకై ఉండనిస్తాం మరియు [మనం ఎక్కడికి వెళ్ళినా,] అది ప్రభువునందై ఉండనిస్తాం; … [మన] తలంపులన్నీ ప్రభువు వైపు నడిపింపబడనిస్తాం; … [మరియు మనం] [మన హృదయ] వ్యామోహములు నిత్యము ప్రభువుపై నిలుపుతాం.” మనం ఇతర విషయాలలో నిమగ్నమై ఉన్నప్పుడు కూడా, మనం దేనిపై దృష్టి పెడుతున్నామనే దానితో సంబంధం లేకుండా, మన స్వంత పేర్లను గుర్తుంచుకున్నట్లే, ఆయనను కూడా గుర్తుంచుకుంటాం.
రక్షకుడు మనకోసం ఏమి చేసారో గుర్తుంచుకోవడం వల్ల కలిగే పరిణామం అనేది మూడవ సమాంతరం—అనుకరణ. డా. సెల్జ్‌మన్ అధ్యక్షులు నెల్సన్ గారిని మరియు RMN తత్వాన్ని అనుకరించడం ప్రారంభించారు. అధ్యక్షులు నెల్సన్ గారి తత్వం కేవలం యేసు క్రీస్తు యొక్క జీవితకాల శిష్యత్వానికి ఒక రుజువు అని నేను నమ్ముతున్నాను. మన విషయానికొస్తే, మనం యేసు క్రీస్తుతో ఎంత ఎక్కువగా గుర్తింపు పొంది, ఆయనను గుర్తుంచుకుంటామో, అంత ఎక్కువగా ఆయనలా ఉండాలని కోరుకుంటాము. ఆయన శిష్యులుగా, మనం మనపై దృష్టి పెట్టినప్పటి కంటే, ఆయనపై దృష్టి పెట్టినప్పుడు మనం మంచిగా మారతాము. మనం ఆయనలాగా మారడానికి ప్రయత్నిస్తాము మరియు ఆయన లక్షణాలతో ఆశీర్వదించబడాలని కోరుకుంటాము. క్రీస్తు యొక్క స్వచ్ఛమైన ప్రేమ అయిన దాతృత్వంతో నింపబడాలని మనం హృదయపూర్వకంగా ప్రార్థిస్తాము.
ఏప్రిల్‌లో అధ్యక్షులు నెల్సన్ బోధించినట్లుగా: “దాతృత్వము మన స్వభావంలో భాగమైనప్పుడు, ఇతరులను కించపరిచే ప్రేరణను మనం కోల్పోతాము. మనం ఇతరులను తీర్పు తీర్చడం మానేస్తాము. మనం అన్ని వర్గాల వారిపట్ల దాతృత్వం కలిగియుంటాము. మనుష్యులందరి పట్ల దాతృత్వం … మన పురోగతికి చాలా అవసరం. దాతృత్వం దైవిక స్వభావానికి పునాది వంటిది.” దాతృత్వంతో పాటు, రక్షకుని నుండి యథార్థత, సహనం మరియు శ్రద్ధతో సహా ఇతర ఆధ్యాత్మిక బహుమానాలను మనం కోరుకుంటాము, “పెంపొందించుకుంటాము, … మరియు విస్తరిస్తాము”.
యేసు క్రీస్తును అనుకరించడం మనల్ని నాల్గవ సమాంతరానికి నడిపిస్తుంది—ఆయన ఉద్దేశాలతో సమలేఖనం. మనం ఆయన పనిలో ఆయనతో చేరుతాము. ఒక శస్త్రవైద్యునిగా, డా. నెల్సన్ ఒక బోధకుడు, వైద్యుడు మరియు పరిశోధకునిగా పేరుగాంచారు. డాక్టర్ సెల్జ్‌మన్ విభాగంలో ఉపయోగించిన లాపెల్ పిన్ ఈ ప్రయత్నాలను నొక్కి చెబుతుంది, ఇందులో బోధించు, స్వస్థపరచు మరియు ఆవిష్కరించు అనే పదాలు ఉంటాయి. మన విషయానికొస్తే, యేసు క్రీస్తు నామాన్ని మనపైకి తీసుకోవడంలో భాగంగా మన లక్ష్యాలను ఆయనతో ఇష్టపూర్వకంగా, ఉద్దేశపూర్వకంగా మరియు ఉత్సాహంగా సమలేఖనం చేసుకోవడం ఉంటుంది. మనం “ప్రేమించినప్పుడు, పంచుకున్నప్పుడు మరియు ఆహ్వానించినప్పుడు” ఆయన పనిలో ఆయనతో చేరుతాము. మనం ఇతరులకు, ముఖ్యంగా దుర్బలులకు మరియు వారి భూసంబంధమైన అనుభవాల వల్ల గాయపడిన, విరిగిన లేదా నలిగిన వారికి పరిచర్య చేసినప్పుడు ఆయన పనిలో ఆయనతో చేరుతాము.
కాబట్టి గుర్తింపు, జ్ఞాపకం, అనుకరణ మరియు సమలేఖనం ద్వారా మనం యేసు క్రీస్తు నామాన్ని పూర్తిగా మనపైకి తీసుకుంటాము. ఈ నాలుగు చేయడం మనల్ని ఐదవ సమాంతరానికి నడిపిస్తుంది—అదే సాధికారత. మన జీవితాల్లో మనం దేవుని శక్తి మరియు ఆశీర్వాదాలను పొందుతాము. నెల్సన్ పండితస్థానం డాక్టర్ సెల్జ్‌మన్‌కు గుర్తింపును మరియు మద్దతిచ్చే నిధులను అందిస్తుంది, వాటిని ఆయన తన విభాగంలో సంస్కృతిని మార్చడానికి ఉపయోగిస్తున్నారు. ఇతరులకు సహాయం చేయడానికి ఆయన తాను పొందిన “వరాన్ని” వర్తింపజేస్తారు. అదేవిధంగా, మనం రక్షకుని నామాన్ని మనపైకి తీసుకున్నప్పుడు, మన పరలోక తండ్రి మర్త్యత్వంలో మన లక్ష్యాన్ని నెరవేర్చడంలో సహాయపడడానికి తన శక్తితో మనల్ని ఆశీర్వదిస్తారు.
మనం దేవునితో అదనపు నిబంధనలు చేసుకున్నప్పుడు, మనం యేసు క్రీస్తు నామాన్ని మరింత పూర్తిగా మనపైకి తీసుకుంటాము. తత్ఫలితంగా, దేవుడు మరింతగా తన శక్తితో మనల్ని ఆశీర్వదిస్తారు. అధ్యక్షులు నెల్సన్ బోధించినట్లుగా: “బాప్తిస్మపు తొట్టెలలో, దేవాలయాలలో నిబంధనలు చేసి—మరియు వాటిని పాటించే—ప్రతీ వ్యక్తి యేసు క్రీస్తు యొక్క శక్తిని అధికంగా పొందుతారు. దేవునితో నిబంధనలను పాటించినందుకు బహుమతి పరలోక శక్తి … అది మన శ్రమలు, శోధనలు మరియు బాధలను బాగా ఎదిరించడానికి మనల్ని బలపరుస్తుంది.”
మనం ఆధ్యాత్మికంగా మరింత గ్రహించగలుగుతాము. అసాధ్యమైనవిగా అనిపించే పరిస్థితులను ఎదుర్కోవడానికి మనకు మరింత ధైర్యం వస్తుంది. యేసు క్రీస్తును అనుసరించాలనే మన సంకల్పంలో మనం మరింత బలపరచబడతాము. మనం అతిక్రమించినప్పుడు మరింత త్వరగా పశ్చాత్తాపపడి ఆయన వైపు తిరిగి వస్తాము. ఆయన శక్తి మరియు అధికారంతో ఆయన సువార్తను పంచుకోవడంలో మనం మెరుగ్గా అవుతాము. మనం తక్కువ తీర్పు తీర్చేవారిగా, చాలా తక్కువ తీర్పు తీర్చేవారిగా ఉంటూ, అవసరంలో ఉన్నవారికి సహాయం చేస్తాము. మన పాపాలకు క్షమాపణను నిలుపుకుంటాము. మనం ఎక్కువ శాంతిని కలిగియుంటాము మరియు మనం ఎల్లప్పుడూ ఆనందించగలము కాబట్టి, మనం మరింత సంతోషంగా ఉంటాము. ఆయన మహిమ మన చుట్టూ ఉంటుంది మరియు ఆయన దూతలు మన యెడల ఆజ్ఞ కలిగియుంటారు.
రక్షకుడు మనల్ని ఇలా ఆహ్వానిస్తున్నారు, “నా నామములో తండ్రి యొద్దకు వచ్చి, తగిన కాలమందు ఆయన సంపూర్ణత్వమును పొందండి.” దీనిని చేయమని నేను మిమ్మల్ని కోరుతున్నాను. మన పరలోక తండ్రి యొద్దకు రండి. యేసు క్రీస్తు నామమును మీపై తీసుకోండి. ఆయనతో గుర్తింపు పొందండి. ఆయనను ఎల్లప్పుడు జ్ఞాపకముంచుకోండి. ఆయనలా ఉండడానికి ప్రయత్నించండి. ఆయన పనిలో ఆయనతో చేరండి. మీ జీవితంలో ఆయన శక్తిని మరియు ఆశీర్వాదాలను పొందండి. మీ హృదయంలో ఆయన నామాన్ని ఇష్టపూర్వకంగా మరియు ఉద్దేశపూర్వకంగా ముద్రించుకోండి. ఇది మీకు దేవుని ముందు “నిలబడడానికి” వీలు కల్పిస్తుంది మరియు మీ తరఫున రక్షకుని వాదనకు మిమ్మల్ని అర్హులను చేస్తుంది. మీరు పరలోకమందున్న మన తండ్రి రాజ్యంలో ఉన్నతమైన వారసుడిగా, ఆయన తొలి సంతానమైన మన ప్రియ రక్షకుడు మరియు విమోచకునితో సహ వారసుడిగా అవుతారు.
ఆయన సజీవుడు. నాకిది ఖచ్చితంగా తెలుసు. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. ఆయన మీ కోసం తన ప్రాణాన్ని ఇచ్చారు. ఆయన ద్వారా మీరు తండ్రి దగ్గరకు రావాలని మిమ్మల్ని వేడుకుంటున్నారు. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.