సర్వసభ్య సమావేశము
క్రీస్తునందు నిరూపించబడి, బలపరచబడితిమి
2025 అక్టోబరు సర్వసభ్య సమావేశము


13:11

క్రీస్తునందు నిరూపించబడి, బలపరచబడితిమి

నిరూపించే క్షణాలు ప్రభువు మిమ్మల్ని విడిచిపెట్టారనడానికి రుజువులు కావు. బదులుగా, అవి ఆయన మిమ్మల్ని శుద్ధిచేసి బలోపేతం చేయడానికి తగినంతగా ప్రేమిస్తున్నారనడానికి రుజువులు.

నా ప్రియమైన సహోదర సహోదరీలారా, మనం కలుసుకున్నప్పుడు ప్రభువు ప్రేమను నేను అనుభవిస్తున్నాను. మీతో మాట్లాడడానికి నేను వినమ్రుడనై ఉన్నాను. నేను మాట్లాడే మాటల కంటే, ప్రభువు మీరు వినాలని కోరుకునే వాటిని ఆత్మ మీ హృదయాలలోకి తీసుకువెళ్లాలని నేను ప్రార్థిస్తున్నాను.

చాలా కాలం క్రితం, నేను కళాశాలలో చదువుతున్నప్పుడు భౌతిక శాస్త్రం మరియు గణితం నేర్చుకోవాలని ప్రయత్నించాను. నేను చాలా ఒత్తిడికి లోనయ్యాను. నాకు అతీతమైన దానిని నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నానని నాకు అనిపించసాగింది. నేను ఒత్తిడికి లోనైన కొద్దీ, ప్రయత్నాన్ని కొనసాగించడానికి శక్తి తగ్గుతున్నట్లు అనిపించింది. నా నిరుత్సాహం, నా ప్రయత్నాలు దాదాపు ఫలించలేదని నాకు అనిపించేలా చేసింది. నేను మానేయడం గురించి, తేలికైనది చేయడం గురించి ఆలోచించడం ప్రారంభించాను.

నేను బలహీనంగా భావించాను. నేను ప్రార్థిస్తున్నప్పుడు, ప్రభువు యొక్క నిశ్శబ్ద హామీని నేను అనుభవించాను. “నేను నిన్ను పరీక్షిస్తున్నాను, కానీ నేను నీతో కూడా ఉన్నాను” అని ఆయన నా మనసుతో చెప్పినట్లు అనిపించింది.

ఆ మాటలకు అర్థం నాకు అప్పుడు తెలియదు. కానీ ఏమి చేయాలో నాకు తెలుసు—నేను పనికి వెళ్ళాను.

తరువాతి సంవత్సరాల్లో ఆలోచించడం మరియు పని చేయడం ద్వారా, లేఖనాలలోని ఈ ప్రోత్సాహకరమైన సందేశాన్ని నేను అర్థం చేసుకున్నాను: “నన్ను బలపరచు క్రీస్తు యందే నేను సమస్తమును చేయగలను.”

భౌతిక శాస్త్రంతో నా పోరాటం నిజానికి ప్రభువు ఇచ్చిన బహుమానం అని నేను నేర్చుకున్నాను. ఆయన నాకు సహాయం చేయడానికి అక్కడ ఉంటారనే విశ్వాసం ఉంటే, ఆయన సహాయంతో అసాధ్యం అనిపించే పనులను నేను చేయగలనని ఆయన నాకు బోధిస్తున్నారు. ఈ బహుమానం ద్వారా, ప్రభువు నన్ను నిరూపించడానికి మరియు బలోపేతం చేయడానికి పనిచేస్తున్నారు.

నిరూపించు అనే పదానికి అనేక అర్థాలు ఉన్నాయి. దేనినైనా నిరూపించడం అంటే దానిని పరీక్షించడం కాదు. దాని బలాన్ని పెంచడం. ఉక్కు ముక్కను నిరూపించడం అంటే దానిని ఒత్తిడికి గురిచేయడం. దాని నిజమైన స్వభావం మెరుగుపరచబడి బయలుపరచబడే వరకు వేడి, బరువు మరియు ఒత్తిడి జోడించబడతాయి. నిరూపించడం ద్వారా ఉక్కు బలహీనపడదు. నిజానికి, అది నమ్మదగినదిగా, ఎక్కువ భారాలను భరించేంత బలంగా మారుతుంది.

మనల్ని బలపరచడానికి ప్రభువు దాదాపు అదే విధంగా మనల్ని నిరూపిస్తారు. ఆ నిరూపణ తేలికైన లేదా సౌకర్యవంతమైన క్షణాల్లో రాదు. మనం భరించగలమని అనుకున్న దానికంటే ఎక్కువగా మనం సాగదీయబడినట్లు అనిపించే క్షణాల్లో అది వస్తుంది. మనం ఎదగడం కొనసాగించాలని మరియు మన ప్రయత్నాలలో ఎప్పుడూ అలసిపోకూడదని, మనం ఎప్పుడూ ఆశ వదులుకోకూడదని, ప్రయత్నిస్తూనే ఉండాలని ప్రభువు బోధిస్తున్నారు.

మనం యేసు క్రీస్తుపై విశ్వాసం ఉంచడం కొనసాగించినప్పుడు—ప్రస్తుతానికి మనకు విషయాలు అసాధ్యం అనిపించినప్పటికీ—మనం ఆధ్యాత్మికంగా బలంగా మారతాము. పవిత్ర లేఖన గ్రంథాలు ఈ సత్యాన్ని నొక్కి చెబుతున్నాయి.

ఉదాహరణకు, ప్రవక్త మొరోనై ఆ విధంగా నిరూపించబడ్డాడు మరియు బలపరచబడ్డాడు. జీవితంలో చివరి సంవత్సరాలను అతను ఒంటరిగా గడిపాడు. తనకు స్నేహితులు లేరని, తన తండ్రి చంపబడ్డాడని, తన ప్రజలు నాశనం చేయబడ్డారని అతను రాశాడు. అతని ప్రాణం తీయాలని చూసిన వారు అతన్ని వేటాడారు.

అయినప్పటికీ మొరోనై నిరాశ చెందలేదు. బదులుగా, తనను చంపాలనుకునే ప్రజల వారసులతో సహా, తాను బ్రతికి ఉండగా చూడలేని వ్యక్తుల కోసం యేసు క్రీస్తు గురించిన తన సాక్ష్యాన్ని పలకలపై చెక్కాడు. అతను మన కోసం రాశాడు. కొందరు తన మాటలను ఎగతాళి చేస్తారని అతనికి తెలుసు. కొందరు వాటిని తిరస్కరిస్తారని అతనికి తెలుసు. అయినప్పటికీ అతను రాయడం కొనసాగించాడు.

అతని నిరూపణలో, మొరోనై విశ్వాసం శుద్ధి చేయబడింది మరియు బలపరచబడింది. అది మరింత స్వచ్ఛంగా మారింది. అతని మాటలు అంతము వరకు విశ్వాసంతో సహించిన వ్యక్తి యొక్క శక్తిని కలిగి ఉంటాయి. అతని సాక్ష్యాన్ని చదివేటప్పుడు మనం ఆ శక్తిని అనుభవించవచ్చు:

“ఇప్పుడు మొరోనై అను నేను, నాకు ముఖ్యము అనిపించిన దానిని వ్రాయుదును; నేను, నా సహోదరులైన లేమనీయులకు వ్రాయుచున్నాను; క్రీస్తు యొక్క రాకడను గూర్చి సూచన ఇవ్వబడినప్పటి నుండి నాలుగు వందల ఇరువది సంవత్సరముల కంటే అధికము గతించిపోయినవని వారు తెలుసుకొనవలెనని నేను కోరుచున్నాను.

“మీకు ఉద్భోధించు విధములో నేను కొద్ది మాటలు పలికిన తరువాత, నేను ఈ వృత్తాంతములను ముద్రవేయుదును.

“ఇదిగో, మీరు ఈ సంగతులను చదివినప్పుడు, మీరు వాటిని చదువుట దేవునియందు వివేకమైన యెడల, ఆదాము యొక్క సృష్టి నుండి మీరు ఈ సంగతులను అందుకొను సమయము వరకు నరుల సంతానముపట్ల ప్రభువు ఎంత కనికరముతోనుండెనో మీరు జ్ఞాపకము చేసుకొనవలెనని, దానిని మీ హృదయములలో ధ్యానించవలెనని నేను మీకు ఉద్భోధించుచున్నాను.

“మీరు ఈ సంగతులను పొందినప్పుడు, ఇవి సత్యమా కాదా అని మీరు నిత్యుడగు తండ్రియైన దేవుడిని క్రీస్తు యొక్క నామమందు అడుగవలెనని నేను మీకు ఉద్బోధించుచున్నాను; మీరు యథార్థ హృదయముతో, క్రీస్తు నందు విశ్వాసము కలిగియుండి, మనఃపూర్వకముగా అడిగిన యెడల, ఆయన వాటి సత్యమును పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మీకు ప్రత్యక్షపరచును.

“పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మీరు అన్నిసంగతుల యొక్క సత్యమును తెలుసుకొనగలరు.”

మొరోనై సాక్ష్యం ఒంటరితనంలో మెరుగుపరచబడింది, కానీ పరలోకమందున్న మన తండ్రిని మరియు రక్షకుడైన యేసు క్రీస్తును వెదకడానికి అన్ని తరాలకు మార్గనిర్దేశం చేయడానికి అది వెలుగుతో ప్రకాశిస్తుంది.

మరొక మోర్మన్ గ్రంథ ప్రవక్తయైన జేకబ్, బాధలు మరియు అధిక దుఃఖాన్ని అనుభవించిన పిల్లవాడిగా నిరూపించబడ్డాడు మరియు బలపరచబడ్డాడు. కానీ అతని తండ్రియైన లీహై, దేవుడు అతని పరీక్షల ద్వారా అతన్ని ఆశీర్వదిస్తారని అతనికి బోధించాడు.

“నీ సహోదరుల కఠినత్వము వలన నీ బాల్యములో నీవు బాధలను, అధిక దుఃఖమును అనుభవించితివి.

“అయినప్పటికీ జేకబ్, అరణ్యములోని నా ప్రథమ సంతానమా, నీవు దేవుని గొప్పతనమును ఎరుగుదువు; ఆయన నీ బాధలను నీ ప్రయోజనము కొరకు ప్రతిష్ఠించును.

“అందువలన నీ ఆత్మ ఆశీర్వదింపబడును, నీవు నీ సహోదరుడైన నీఫైతో క్షేమముగా నివసించెదవు; నీ దినములు నీ దేవుని సేవలో గడిచిపోవును. కావున, నీ విమోచకుని నీతిని బట్టి నీవు విమోచింపబడితివని నేనెరుగుదును; ఏలయనగా, కాలము పరిపూర్ణమైనప్పుడు మనుష్యులకు రక్షణ తెచ్చుటకు ఆయన వచ్చునని నీవు చూచియున్నావు.”

ప్రవక్త జోసెఫ్ స్మిత్ లిబర్టీ చెరసాలలో ఉన్నప్పుడు అలా నిరూపించబడడాన్ని మరియు బలపరచబడడాన్ని అనుభవించారు. తన అత్యధిక వేదనలో, ప్రవక్త జోసెఫ్ ఇలా మొరపెట్టారు:

“ఓ దేవా, నీవెక్కడ ఉన్నావు? …

“ఎంతకాలము నీ హస్తము నిలిచియుండును?”

జోసెఫ్ బాధను సహించడం వల్ల కలిగే పవిత్ర ప్రభావాన్ని చూసి ప్రభువు ఇలా జవాబిచ్చారు:

“నా కుమారుడా, నీ ఆత్మకు శాంతి కలుగును గాక; నీ లేమి, నీ కష్టములు కొంతకాలమే ఉండును;

“దానిని నీవు సహించిన యెడల, దేవుడు నిన్ను ఉన్నతమునకు హెచ్చించును; నీ శత్రువులందరి పైన నీవు జయము పొందెదవు.”

నిరూపించడం మరియు బలపరచడం యొక్క గొప్ప ఉదాహరణ రక్షకుని ప్రాయశ్చిత్తం ద్వారా సంభవించింది. ఆయన లోక పాపములను తనపైకి తీసుకున్నారు. మన బాధలను మరియు దుఃఖాలను ఆయన భరించారు. ఆయన చేదు పాత్రను త్రాగారు. ప్రతీ క్షణంలోనూ ఆయన విశ్వాసపాత్రుడిగా నిరూపించుకున్నారు.

ఆయన మహిమాన్వితమైన ప్రాయశ్చిత్తం కారణంగా, యేసు క్రీస్తు మన పరీక్షా సమయాల్లో మనల్ని బలపరచగలరు. మనం మర్త్యత్వంలో అనుభవించే అన్ని సవాళ్లను ఆయన అనుభవించారు కాబట్టి, మనకు ఎలా సహాయం చేయాలో ఆయనకు తెలుసు. “తన జనుల బాధలను, రోగములను ఆయన తనపై తీసుకొనును … వారి బలహీనతలను బట్టి తన జనులను ఎట్లు ఆదరించవలెనో శరీరమును బట్టి ఆయన ఎరుగునట్లు తీసుకొనును.”

గెత్సెమనేలో రక్షకుడు

గెత్సేమనే తోటలో ఉన్నప్పుడు, సాధ్యమైతే ఈ శోధన తొలగిపోనిమ్ము అని రక్షకుడు తండ్రిని అడిగారు—అయినను తండ్రి చిత్తమైతే ఆయన దానిని చేస్తానని కూడా రక్షకుడు చెప్పారని మనం నేర్చుకుంటాము. మరో మాటలో చెప్పాలంటే, రక్షకుడు సందేహాన్ని మరియు అనిశ్చితిని కూడా స్వీకరించారు, కానీ ఆయనకు తన పరలోక తండ్రిపై విశ్వాసం ఉంది.

సహోదర సహోదరీలారా, మీరు నిరూపించబడడం మరియు బలపరచబడడం మొరోనై లేదా జేకబ్ లేదా ప్రవక్త జోసెఫ్ లాగా కనిపించకపోవచ్చు. కానీ అది జరుగుతుంది. అది నిశ్శబ్దంగా, కుటుంబ జీవితపు శోధనల ద్వారా రావచ్చు. అది అనారోగ్యం, నిరాశ, దుఃఖం లేదా ఒంటరితనం ద్వారా రావచ్చు.

ఈ క్షణాలు ప్రభువు మిమ్మల్ని విడిచిపెట్టారనడానికి రుజువులు కావని నేను సాక్ష్యమిస్తున్నాను. బదులుగా, అవి ఆయన మిమ్మల్ని శుద్ధిచేసి బలోపేతం చేయడానికి తగినంతగా ప్రేమిస్తున్నారనడానికి రుజువులు. నిత్య జీవ భారాన్ని మోయడానికి ఆయన మిమ్మల్ని బలవంతులుగా చేస్తున్నారు.

మన సేవలో మనం నమ్మకంగా ఉంటే, ప్రభువు మనల్ని శుద్ధి చేస్తారు. ఆయన మనల్ని బలపరుస్తారు. ఒకనాడు, మనం వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ శోధనలే ఆయన ప్రేమకు నిదర్శనమని మనం చూస్తాము. మహిమలో ఆయనతో నిలబడగలిగేలా ఆయన మనల్ని రూపొందిస్తున్నారని మనం చూస్తాము. ప్రభువు యొక్క అపొస్తలుడైన పౌలు తన జీవితం చివరలో చెప్పినట్లుగా, “నేను మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడ ముట్టించితిని, విశ్వాసము కాపాడుకొంటిని.”

దేవుడు మిమ్మల్ని ఎరుగునని నేను సాక్ష్యమిస్తున్నాను. మీరు ఎదుర్కొనే శోధనలు ఆయనకు తెలుసు. ఆయన మీతో ఉన్నారు. ఆయన మిమ్మల్ని విడిచిపెట్టరు. యేసు క్రీస్తు దేవుని యొక్క కుమారుడని నేను సాక్ష్యమిస్తున్నాను. ఆయనే మన బలం, మన విమోచకుడు, మన నిరీక్షణ. మనం ఆయనను విశ్వసిస్తే, ఆయన మన ఆధ్యాత్మిక శక్తిని మనం భరించాల్సిన ప్రతీ శోధనకు సమానంగా చేస్తారు. ఈవిధంగా యేసు క్రీస్తు యొక్క పవిత్ర నామములో నేను సాక్ష్యమిస్తున్నాను, ఆమేన్.