సర్వసభ్య సమావేశము
యెహోవా హృదయమును లక్ష్యపెట్టును
2025 అక్టోబరు సర్వసభ్య సమావేశము


10:41

యెహోవా హృదయమును లక్ష్యపెట్టును

ఆయన ఉద్దేశాలను నెరవేర్చుకోవడానికి మరియు ఆయన కోరుకునే విధంగా మనం మారడానికి మనకు సహాయం చేయడానికి దేవునికి కావలసినది, మనలో ప్రతీ ఒక్కరం మన హృదయాలను పూర్తిగా ఆయన తట్టు తిప్పుకోవడమే.

యెష్షయి కుమారులలో నుండి ఇశ్రాయేలుకు కొత్త రాజును ఎన్నుకోమని ఆజ్ఞాపించబడినప్పుడు, ప్రవక్తయైన సమూయేలు, యెష్షయి పెద్ద కుమారుడైన ఏలీయాబును చూసి, “నిజముగా యెహోవా అభిషేకించువాడు యెదుట నిలిచియున్నాడని” ఉత్సాహంగా అన్నాడు. కానీ ఏలీయాబు ప్రభువు ఎన్నుకున్న సేవకుడు కాదు. రక్షకుడు సమూయేలును ఇలా హెచ్చరించారు: “అతని రూపమును అతని యెత్తును లక్ష్యపెట్టకుము, మనుష్యులు లక్ష్యపెట్టువాటిని యెహోవా లక్ష్యపెట్టడు; నేను అతని త్రోసివేసియున్నాను. మనుష్యులు పైరూపమును లక్ష్యపెట్టుదురుగాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును.”

దావీదు తన సోదరులలో శారీరకంగా బలవంతుడు లేదా అత్యంత నైపుణ్యం కలిగినవాడు కాకపోవచ్చు, కానీ దేవుని దృష్టిలో అతని హృదయం దృఢంగా ఉంది. అతను దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమించాడు మరియు ఆయనకు విధేయత చూపాలనే లోతైన కోరికను కలిగియున్నాడు. దేవుని ప్రేమ, శక్తి మరియు వాగ్దానం చేయబడిన దీవెనలపై అతనికి అచంచలమైన విశ్వాసం ఉంది, ఆ తరువాత అతను ప్రభువు సహాయంతో గొల్యాతుతో నిర్భయంగా పోరాడి ఓడించినప్పుడు ఆ విశ్వాసాన్ని ప్రదర్శించాడు.

ఆయన ఉద్దేశాలను నెరవేర్చుకోవడానికి మరియు ఆయన కోరుకునే విధంగా మనం మారడానికి మనకు సహాయం చేయడానికి దేవునికి కావలసినది, మనలో ప్రతీ ఒక్కరం మన హృదయాలను పూర్తిగా ఆయన తట్టు తిప్పుకోవడమే అని ఈ కథ మనకు బోధిస్తుంది. ఒక న్యాయవాదికి ఆయన ఇలా ఆజ్ఞాపించారు, “నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతో ప్రేమింపవలెను.” ప్రవక్త జోసెఫ్ స్మిత్‌తో ఆయన ఇలా అన్నారు, “ఇదిగో హృదయమును, సిద్ధమైన మనస్సును ప్రభువు కోరును.” మరియు నీఫైయులకు, పునరుత్థానుడైన రక్షకుడు ఈ ఆహ్వానాన్ని అందించారు: “మీరు విరిగిన హృదయమును, నలిగిన ఆత్మను బలిగా నాకు అర్పించెదరు.”

అలా ఎందుకు? మన హృదయాలు పూర్తిగా ఆయన తట్టు తిరిగితే, ఆయన ప్రాయశ్చిత్త త్యాగం కారణంగా మన మర్త్య సవాళ్లను అధిగమించడానికి, శోధనను ఎదిరించడానికి, దిశానిర్దేశం మరియు అవగాహనను పొందడానికి మరియు మన జీవితాల్లో ఆనందం మరియు శాంతిని అనుభవించడానికి మనకు అవసరమైన బలం మరియు ఆధ్యాత్మిక బహుమతులతో మనం దీవించబడతామని రక్షకుడు బోధించారు. “చిన్నవిషయముల నుండి గొప్ప సంగతులు సంభవించును.” “బలహీనమైన సంగతులను బలపరచగలనని” మరియు ఈ మర్త్య జీవితంలో విజయం సాధించడానికి మరియు నిత్యజీవాన్ని పొందడానికి మనకు అవసరమైన ప్రతీదాన్ని అనుగ్రహిస్తానని ఆయన చెప్పారు. “హృదయశుద్ధిగలవారు ధన్యులు; వారు దేవుని చూచెదరు” అని ఆయన చెప్పారు.

అందుకే, కనీసం కొంతవరకైనా, యేసు క్రీస్తు తన మర్త్య పరిచర్యలో శాస్త్రులను మరియు పరిసయ్యులను చాలా తరచుగా సరిదిద్దారని నేను నమ్ముతున్నాను. ఆయన ధర్మశాస్త్రాన్ని పాటించడంలో వారు శ్రద్ధ వహించినప్పటికీ, తప్పుడు కారణాల చేత వారు అలా చేశారు. “ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది,” అని ఆయన వారిని గద్దించారు.

ఇది ఆయన శిష్యులందరికీ ఒక గంభీరమైన జ్ఞాపిక—మన మాటలు మరియు చర్యల ద్వారా మనం ఏమి చేస్తాము అనేది మాత్రమే కాదు, యేసు క్రీస్తు మనల్ని ఏమి చేయమని అడిగారో వాటిని ఎందుకు చేస్తామనేది కూడా ముఖ్యం—మన కోరికలు మరియు ఉద్దేశ్యాలతో సహా. ఆయన ఇలా చెప్పారు, “ఏలయనగా ప్రభువైన నేను మనుష్యులందరికి వారి క్రియలను బట్టి, వారి హృదయ వాంఛలను బట్టి తీర్పుతీర్చెదను.” మన పరలోక తండ్రి తన పిల్లల నుండి యాంత్రికమైన విధేయత మరియు సేవ కంటే అధికంగా కోరుతున్నారు. మనం ఆయనను హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నాము కాబట్టి, ఆ క్రియలను నిజమైన ఉద్దేశ్యంతో చేయాలని ఆయన కోరుతున్నారు. ఆయనలా మారాలని మనం కోరుకోవాలని ఆయన కోరుతున్నారు.

ఇప్పుడు, మన హృదయాల ఆధ్యాత్మిక ఆరోగ్యం రక్షకుని ప్రధాన ఆందోళన అయితే—నిజమైన శిష్యుడిలో ఆయన ఏమి చూస్తున్నారు—మన హృదయాలను మనం పరీక్షించుకొని, అది దేవుని దృష్టిలో సరైనదో కాదో ఎలా తెలుసుకోగలం?

ఇటీవల, నేను మరియు నా భార్య పోర్చుగల్‌లోని మా మిషను నుండి తిరిగి వచ్చినప్పుడు, మా శారీరక స్థితిని అంచనా వేయడానికి మేము వరుస ఆరోగ్య పరీక్షలను చేయించుకున్నాము. ఆ పరీక్షలలో కొన్ని మా గుండె యొక్క ఆరోగ్యంపై దృష్టి సారించాయి—రక్త పరీక్షలు, ఎకోకార్డియోగ్రామ్‌లు మరియు ఒత్తిడి పరీక్షలు వంటివి. మన హృదయాల ఆధ్యాత్మిక స్థితిని అంచనా వేయడానికి మనం ఉపయోగించగల ఆధ్యాత్మిక పరీక్షల సముదాయాన్ని కూడా రక్షకుడు మనకు అందించారని నేను నమ్ముతున్నాను. నేను మీతో కొన్ని పంచుకోవాలనుకుంటున్నాను.

ఆధ్యాత్మిక పరీక్షలతో మీ హృదయాన్ని అంచనా వేయడం

మొదటిది, మన దృష్టి, ప్రాధాన్యతలు మరియు ఉద్దేశాలు

“నీ ధనమెక్కడ నుండునో అక్కడనే నీ హృదయము ఉండును,” అని యేసు బోధించారు. ధనమంటే మనకు విలువైనది, దాని కొరకు మనం మన కృషిని మరియు శ్రద్ధను అంకితం చేస్తాము. మన సమయాన్ని ఎక్కడ గడపాలని మరియు మన దృష్టిని ఎక్కడ కేంద్రీకరించాలని మనం ఎంచుకుంటామో, అలాగే మనం చేసే పనిని చేయడానికి మనల్ని ఏది ప్రేరేపిస్తుందో, అది మన హృదయాల గురించి ఎక్కువగా తెలియజేస్తుంది. రక్షకుడు ఇలా హెచ్చరించారు, ఆయనచే పిలువబడినవారు అనేకులు కాగా ఏర్పరచబడినవారు కొందరే, “ఎందుకనగా వారి హృదయాలు లోక విషయములపైన ఎంతగానో ఉంచబడి, మనుష్యుల సన్మానములను [వారు] కోరెదరు.” నా జీవితంలో రక్షకుడిని నేను ప్రాధాన్యతగా చేసుకుంటున్నానా? నేను చేసే ప్రతిదానిలో ఆయన మహిమయే నా లక్ష్యంగా ఉందా?

రెండవది, దేవుని ఆజ్ఞలను పాటించాలనే మన సంకల్పం

లేఖనం అంతటా, ప్రభువు మరియు ఆయన ప్రవక్తలు గర్వాన్ని మరియు అవిధేయతను కఠినమైన హృదయంతో ముడిపెట్టారు. నీఫై తన సహోదరులకు ఇలా ఉద్బోధించాడు: “మీరేల ప్రభువు యొక్క ఆజ్ఞలను పాటించరు? మీ హృదయ కాఠిన్యమును బట్టి మీరెందుకు నశించెదరు?” మిస్సోరిలోని పరిశుద్ధులను ప్రభువు ఇలా హెచ్చరించారు, “కానీ ఎవడైతే ఆజ్ఞాపించబడేవరకు ఏమియు చేయక, ఆజ్ఞను సందేహపూరిత హృదయముతో స్వీకరించి, సోమరితనముతో దానిని పాటించునో, అట్టివాడు నిందించబడును.” రక్షకుడు తన ఆజ్ఞలను పాటించడంలో పరిపూర్ణతను ఆశించనప్పటికీ, వాటిని పాటించాలని మన పూర్ణ హృదయంతో మనం కోరుకోవాలని మరియు కృషి చేయాలని ఆయన అడుగుతున్నారు.

మూడవది, లేఖనాలను అధ్యయనం చేయడంలో మరియు బయల్పాటును వెదకడంలో మన శ్రద్ధ

“ఈ మాటలను నీ హృదయమందు భద్రపరచుకొనుము,” అని ప్రభువు ఆలీవర్ కౌడరీని హెచ్చరించారు. లేఖనాలను శ్రద్ధగా పరిశోధించడానికి మరియు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా, మన హృదయాలలో సువార్త యొక్క యథార్థత గురించి అవగాహనను మరియు సాక్ష్యాన్ని పొందడానికి ప్రయత్నించేందుకు మనం ఆహ్వానించబడ్డాము.

చెడ్డ రాజైన నోవహు యాజకులు అలా చేయనందుకు ప్రవక్త అబినడై వారిని గద్దిస్తూ ఇలా అన్నాడు, “గ్రహించుటకు మీరు మీ హృదయములను ఉపయోగించలేదు; కావున, మీరు వివేకముగా ఉండలేదు.” నేను ప్రతిరోజూ లేఖనాలను అధ్యయనం చేయడానికి మరియు ప్రార్థన ద్వారా వాటిని అర్థం చేసుకునేలా నా హృదయాన్ని ఉపయోగించుకోవడానికి నిజాయితీగా ప్రయత్నిస్తున్నానా?

నాల్గవది, మన ఆలోచనలు మరియు మాటలు

“దురాలోచనలు హృదయములోనుండియే వచ్చును” మరియు “హృదయమందు నిండియుండు దానినిబట్టి నోరు మాటలాడును” అని రక్షకుడు బోధించారు. మన ఆలోచనలు మరియు మాటల నాణ్యత మన హృదయాల స్వచ్ఛతకు మంచి సూచిక. నేను ఇతరుల చర్యలు లేదా ఉద్దేశ్యాల గురించి లేదా నా గురించి కూడా అనేకమైన ప్రతికూల ఆలోచనలను పెంచుకుంటున్నానా? ఇతరులను తీర్పు తీర్చడానికి మరియు ఖండించడానికి నేను చాలా త్వరపడుతున్నానా? నా తప్పులకు సాకులు లేదా సమర్థనలను వెతుకుతున్నానా? మరి నా మాటల సంగతేంటి? అవి నా చుట్టూ ఉన్నవారిని ఉద్ధరించి, ప్రేరేపిస్తున్నాయా? లేదా అవి తరచుగా సంఘర్షణ మరియు ఆగ్రహాన్ని సృష్టిస్తున్నాయా?

మొత్తం మీద, నా శారీరక పరీక్షలు పూర్తయిన తర్వాత, నా గుండె ఆరోగ్యంగా ఉందని—కానీ కొన్ని సమస్యలు ఉన్నాయని, అవి తీవ్రమైనవిగా మారకముందు తక్షణమే పరిష్కరించాలని నా వైద్యుడు నాకు చెప్పాడు. తర్వాత అతను కొన్ని జీవనశైలి మార్పులను సూచించాడు. అదేవిధంగా, మీరు మీ హృదయం యొక్క ఈ ఆధ్యాత్మిక అంచనా వేసినప్పుడు మరియు కొన్ని ప్రతికూల లక్షణాలు కనిపించడాన్ని గమనించినప్పుడు, దయచేసి భయపడకండి! రక్షకుడు మీకు సహాయం చేయడానికి అద్భుతమైన ఆధ్యాత్మిక ఔషధాన్ని మరియు చికిత్సను అందించారు. ఆయన మీకు ఒక నూతన హృదయాన్ని ఇస్తానని కూడా వాగ్దానం చేశారు! మీ హృదయం యొక్క ఆధ్యాత్మిక బలాన్ని మెరుగుపరచగల కొన్ని చర్యలు ఇక్కడ ఉన్నాయి.

మీ హృదయం యొక్క ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడం

ముందుగా, క్రీస్తుతో మీ సంబంధాన్ని బలపరచుకోండి

క్రీస్తుకు దగ్గరగా రావడానికి మనం ప్రతిరోజూ సమయాన్ని కేటాయిస్తున్నప్పుడు, మన హృదయాలు మార్చబడతాయి. హృదయపూర్వక ప్రార్థన మరియు క్రమం తప్పకుండా ఉపవాసం ఉండడంతో పాటుగా లేఖనాలను ప్రతిరోజూ అధ్యయనం చేయడం వలన రక్షకుని పట్ల మీ ప్రేమ పెరుగుతుంది మరియు మీ విశ్వాసం, పశ్చాత్తాపపడాలనే కోరిక బలపడుతుంది మరియు వినయంగా మీ హృదయాన్ని మీరు దేవునికి అప్పగించుకుంటారు. నీఫై నుండి ఈ ఉదాహరణను పరిగణించండి: “అందువలన, నేను ప్రభువుకు మొరపెట్టగా ఆయన నన్ను దర్శించి, నా హృదయమును మృదువుగా చేసినందున నా తండ్రి చేత పలుకబడిన మాటలన్నింటిని నేను నమ్మితిని.”

మన నీతివంతమైన కోరికలు మరియు చర్యల ద్వారా విశ్వాసపు విత్తనాన్ని పోషించడం కొనసాగిస్తున్నప్పుడు, నీఫైయుల మాదిరిగానే మన హృదయాలు శుద్ధిచేయబడడాన్ని మనం అనుభవిస్తాము: “సంతోషము మరియు ఓదార్పుతో వారి ఆత్మలు నింపబడువరకు, అలాగే దేవునికి వారి హృదయములను వారు లోబరచుటను బట్టి వచ్చిన శుద్ధి వారి హృదయములను పవిత్రపరచి, శుద్ధి చేయువరకు కూడా వారు తరచుగా ఉపవాసముండి ప్రార్థించిరి; వారి తగ్గింపునందు బలముగా మరింత బలముగా మరియు క్రీస్తు యొక్క విశ్వాసమందు ధృఢముగా మరింత దృఢముగా అయ్యిరి.”

రెండవది, మీ ఇష్టాన్ని ఆయన చిత్తానికి అనుగుణంగా చేయండి

“మీరు నన్ను ప్రేమించినయెడల నా ఆజ్ఞలను గైకొందురు,” అని రక్షకుడు బోధించారు. ఆయనతో నిబంధనలు చేసి, పాటించడం ద్వారా మన ప్రేమను ప్రదర్శించమని ఆయన మనల్ని ఆహ్వానిస్తున్నారు. ఆయన ఆజ్ఞలను పాటించడానికి మనం ప్రతిరోజూ కృషి చేసినప్పుడు, మన పాపాల కొరకు హృదయపూర్వకంగా పశ్చాత్తాపపడి, ఆయన నామమును మనపైకి తీసుకోవడంలో మరియు మన చిత్తాన్ని ఆయన చిత్తంతో అనుసంధానం చేయడంలో పట్టుదలతో ఉన్నప్పుడు, మనం పరిశుద్ధాత్మ యొక్క నిరంతర సహవాసంతో దీవించబడగలము.

నీఫై ఇలా సాక్ష్యమిచ్చాడు, “మీరు దేవుని యెదుట ఎట్టి వేషధారణ, మోసము లేకుండా హృదయము యొక్క పూర్ణ ఉద్దేశ్యముతో కుమారుని అనుసరించుచూ, మనఃపూర్వకముగా మీ పాపములకు పశ్చాత్తాపపడుచూ, బాప్తిస్మము ద్వారా క్రీస్తు నామమును మీపై ధరించుకొనుటకు మీరు సిద్ధముగా ఉన్నారని తండ్రికి సాక్ష్యమిచ్చిన యెడల … మీరు పరిశుద్ధాత్మను పొందెదరని నేనెరుగుదును.” పరిశుద్ధాత్మ మీకు మార్గనిర్దేశం చేసి, ప్రభువు చిత్తాన్ని తెలుసుకోవడానికి మరియు మంచి ఎంపికలు చేసుకోవడానికి మీకు సహాయం చేస్తారు.

చివరిగా, మీ పూర్ణ హృదయముతో దేవునికి మరియు ఇతరులకు సేవ చేయండి

“మీ పూర్ణ హృదయముతో ఆయనను సేవించండి” అని రక్షకుడు అందరినీ ఆహ్వానిస్తున్నారు. ప్రభువు మనల్ని చేయమని అడిగిన ప్రతి పనిని—ఆజ్ఞలను పాటించడం, సంస్కారములో పాలుపంచుకోవడం, దేవాలయంలో ఆరాధించడం మరియు ఇతరులకు సేవ చేయడం వంటి వాటిని—యథార్థ హృదయముతో మరియు మనఃపూర్వకముగా చేయాలని మనం ఎంచుకున్నప్పుడు, ప్రతి సేవ మరియు ఆరాధన మన విశ్వాసాన్ని మరియు సాక్ష్యాన్ని బలపరిచి, దేవుని పట్ల మరియు మన తోటి మనిషి పట్ల ఆనందం మరియు ప్రేమతో మన హృదయాలను నింపే శక్తివంతమైన ఆధ్యాత్మిక అనుభవంగా మారుతుంది.

ప్రవక్తయైన ఆల్మా యొక్క ప్రశ్న నేటికీ ప్రతిధ్వనిస్తుంది: “మీరు దేవునివలన ఆత్మీయముగా జన్మించియున్నారా? మీ రూపముల యందు ఆయన స్వరూపమును పొందియున్నారా? మీ హృదయముల యందు ఈ బలమైన మార్పును అనుభవించియున్నారా?”

సహోదర సహోదరీలారా, రక్షకునికి ఈ రోజే మీ పూర్ణ హృదయమును అర్పించమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ప్రతీ ఆరాధన మరియు సేవ హృదయపూర్వకముగా మరియు ఉద్దేశ్యపూర్వకముగా ఉండనివ్వండి. ప్రపంచంలోని అంతరాయాలను పక్కన పెట్టండి మరియు మీ జీవితంలోని ప్రతీ రోజు ప్రభువు కోసం అర్థవంతమైన సమయాన్ని గడపడానికి ప్రయత్నించండి. పశ్చాత్తాపపడి మీ పూర్ణ హృదయముతో ఆయన వద్దకు తిరిగి రండి, ఆయన మిమ్మల్ని క్షమించి తన ప్రేమ యొక్క బాహువులలో మిమ్మల్ని శాశ్వతముగా చుట్టుముడతారు. ఈ లోకసంబంధమైన విషయములను ప్రక్కన పెట్టి, మీ దృష్టికి ఆయన మహిమయే లక్ష్యముగా ఉండునట్లు ఎంచుకొని, ఉత్తమమైన సంగతులను వెదకండి. ఆయన మీ ఆలోచనలను మరియు మీ హృదయము యొక్క కోరికలను ఎరుగును మరియు మీరు ఆయన యొద్దకు వచ్చినప్పుడు, ఆయన మీకు ఈ జీవితంలో బలము, నమ్మకము, శాంతి, ఆనందం మరియు ఆయన సిలెస్టియల్ రాజ్యములో శాశ్వత స్థానం ఇచ్చి ఆశీర్వదిస్తారు.

యేసు క్రీస్తు జీవిస్తున్నారని నాకు తెలుసు. ఆయనే మన విమోచకుడు. ఆయన మిమ్మల్ని మరియు నన్ను తన పూర్ణ హృదయముతో ప్రేమిస్తున్నారు. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.