ప్రభువు తన కార్యమును వేగవంతం చేస్తున్నారు
ప్రభువు తన కార్యమును వేగవంతం చేస్తున్నప్పుడు, ఆయన సువార్తను అంగీకరించే వారిని మనం ప్రేమించాలి, వారిని పోషించాలి మరియు వారికి సేవ చేయాలి.
చార్లెస్ డికెన్స్ తన ప్రామాణిక నవల ది టేల్ ఆఫ్ టూ సిటీస్ను “కొన్ని మంచి సమయాలు వుండవచ్చు, కొన్ని చెడ్డ సమయాలు వుండవచ్చు” అనే ప్రకటనతో ప్రారంభించారు. ఒక విధంగా, ఇది మన కాలంలో కూడా నిజం.
మనం “భూమియంతయు సంక్షోభములోనుండిన” అల్లకల్లోల సమయంలో జీవిస్తున్నాము. యేసు క్రీస్తు యొక్క అనుచరులుగా, సమాధానపరచువారిగా ఉండమని అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఇచ్చిన ఉపదేశాన్ని ఈ ఉదయం ఎల్డర్ గ్యారీ ఇ. స్టీవెన్‌సన్ అందంగా నొక్కిచెప్పారు. “చెడ్డ సమయాల్లో” ఐక్యత, శాంతి మరియు స్వస్థతను పెంపొందించడంలో ఇది ఒక ముఖ్యమైన భాగం.
మనం “ఉత్తమ సమయాల్లో” కూడా జీవిస్తున్నాము, దానిని నేను నొక్కి చెప్తాను. సువార్త యొక్క సంపూర్ణత “భూదిగంతముల వరకు … ప్రకటింపబడుతుంది” అని సిద్ధాంతము మరియు నిబంధనల ముందుమాటలో, 1వ ప్రకరణములో ప్రభువు ప్రకటించారు. మన కాలంలో ప్రభువు నిజంగా తన కార్యమును వేగవంతం చేస్తున్నారు. ఈ సవాలుతో కూడిన సమయాలలో కూడా వేగవంతంగా జరిగిన మరియు జరగబోతున్న వాటికి మనం ఎంతో కృతజ్ఞులమై ఉండాలి. ప్రభువు యొక్క అనుచరులు ఆయన స్వరాన్ని వినడానికి మరియు విశాల హృదయాలతో, మనస్సులతో స్పందించడానికి హక్కు కలిగిన కాలంలో మనం జీవిస్తున్నాము. రక్షకునికి మరియు ఆయన ఆజ్ఞలకు కట్టుబడియున్న యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘ సభ్యులు, ఉద్దేశ్యాన్ని మరియు లోతైన వ్యక్తిగత శాంతిని కనుగొంటున్నారు.
సంఘ చరిత్రలో వివిధ సమయాల్లో, నిబంధన మార్గంలోకి ప్రవేశించిన వారిలో గణనీయమైన అభివృద్ధి ఉంది. అలాంటి ఒక కాలం 1837 మరియు 1850 మధ్య సంభవించింది. ప్రభువు యొక్క పునఃస్థాపించబడిన సంఘములోని తొలి అపొస్తలులలో కొందరు యునైటెడ్ కింగ్‌డమ్‌లో సువార్తసేవలను అందించారు. ఈ సువార్తసేవల ఫలితంగా వేలాదిమంది సంఘములో చేరారు మరియు 1850 నాటికి అమెరికా సంయుక్త రాష్టాలలో కంటే యునైటెడ్ కింగ్‌డమ్‌లో ఎక్కువమంది సంఘ సభ్యులు నివసిస్తున్నారు. ఆ సమయంలో, ప్రభువు ఈ పరిశుద్ధులను యూటాలో సమకూడమని ఆదేశించారు. సామూహిక వలసలు జరిగాయి, కొందరికి శాశ్వత వలస నిధి అందించిన రుణాల మద్దతు లభించింది.
1852లో ఇంగ్లాండ్ మరియు వేల్స్ నుండి పెద్ద సంఖ్యలో పరివర్తన చెందినవారు సాల్ట్ లేక్ లోయకు తరలివచ్చిన వృత్తాంతం నాకు చాలా ఇష్టం. ప్రథమ అధ్యక్షత్వముచేత ఎమిగ్రేషన్ లోయ ముఖద్వారం వద్ద కలుసుకోబడిన ఈ బృందాన్ని కెప్టెన్ పిట్స్ సంగీత బృందం అనుసరించింది. “సహోదరీలు మరియు పిల్లలతో సహా యాత్రికుల బృందమంతా, మండుతున్న ఎండలో మరియు దెబ్బతిన్న వాతావరణంలో నడుస్తున్నారు, కానీ వారు నిరాశ చెందలేదు; వారి హృదయాలు తేలికగా మరియు ఉత్సాహంగా ఉన్నాయి, ఇది వారి సంతోషకరమైన మరియు ఆనందకరమైన ముఖాల ద్వారా స్పష్టంగా వ్యక్తమవుతుంది” అని Deseret News వార్తాపత్రిక వారిని గురించి వర్ణించింది.
వారు “దేవాలయ భవనాన్ని దాటుతున్నప్పుడు, … వేలాదిమంది పురుషులు, స్త్రీలు మరియు పిల్లలు, నగరంలోని వివిధ ప్రాంతాల నుండి అద్భుతమైన మరియు సంతోషకరమైన స్వాగతంలో ఐక్యంగా గుమిగూడారు.” అధ్యక్షులు బ్రిగమ్ యంగ్ వారిని ఉద్దేశించి ఇలా అన్నారు: “ఇశ్రాయేలు దేవుడైన ప్రభువు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. … మేము మీ కొరకు నిరంతరం ప్రార్థించాము; ఇశ్రాయేలును సమకూర్చమని, సువార్త ప్రకటించడం ద్వారా మనుష్యులను రక్షించమని మరియు మెస్సీయ రాకకు వారిని సిద్ధం చేయమని మాకు ఆజ్ఞాపించిన ఆయనకు, మీ నిమిత్తం ప్రతిరోజూ వేలాది ప్రార్థనలు సమర్పించబడుతున్నాయి.”
ఆ ఆనందకరమైన సందర్భ స్ఫూర్తితో, నూతనముగా పరివర్తన చెందిన వారందరికీ మరియు ప్రభువు సంఘానికి తిరిగి వచ్చే వారందరికీ నేను మరోసారి హామీ ఇస్తున్నాను: మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాము; మాకు మీరు కావాలి; ప్రభువుకు మీరు కావాలి. మేము మిమ్మల్ని కవాతు దళాలతో స్వాగతించకపోవచ్చు, కానీ సిలెస్టియల్ రాజ్యములో తండ్రి అయిన దేవుడు మరియు యేసు క్రీస్తు వద్దకు నడిపించే నిబంధన మార్గంలో ముందుకు సాగడానికి మీరు చేసే ప్రయత్నాలకు పరలోక ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉండాలని మేము ప్రార్థిస్తున్నాము.
మన కాలంలో యేసు క్రీస్తుపై విశ్వాసం పెరుగుతుందనడానికి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘమునందు, పరివర్తనలలో మరియు పరివర్తన చెందినవారి భాగస్వామ్యములో గణనీయమైన పెరుగుదల ఉంది. గత 36 నెలల్లో దాదాపు 9,00,000 మంది పరివర్తన చెందినవారు సంఘములో చేరారు. పరివర్తన చెందిన వీరు మొత్తం సంఘ సభ్యత్వంలో దాదాపు 5 శాతం మంది ఉన్నారు. మీరు ఎంచుకున్న మార్గం పట్ల కొత్త సభ్యులైన మిమ్మల్ని మేము చేతులు చాచి, లోతైన ప్రశంసలతో స్వాగతిస్తున్నాము.
గత 36 నెలల్లో ఈ 9,00,000 మంది పరివర్తన చెందిన వారు, 1940లో 110వ వార్షికోత్సవం నాటికి సంఘము యొక్క మొత్తం సభ్యత్వాన్ని మించిపోయారు, ఇది 8,60,000 మంది సభ్యులకు కొద్దిగా ఎక్కువ. ఇది ఎల్డర్ జెఫ్రీ ఆర్. హాలండ్, ఎల్డర్ డీటర్ ఎఫ్. ఉఖ్‌డార్ఫ్ మరియు నేను జన్మించిన సంవత్సరం.
కొత్తగా పరివర్తన చెందిన ఈ అద్భుతమైన జనులు ప్రపంచంలోని ప్రతి ప్రాంతం నుండి వస్తారు. ఈ సంవత్సరం మొదటి ఆరు నెలల్లో, యూరప్, ఆఫ్రికా, ఆసియా, పసిఫిక్ మరియు లాటిన్ అమెరికాలో పరివర్తనలు మునుపటి సంవత్సరం కంటే 20 శాతానికి పైగా పెరిగాయి. ఉత్తర అమెరికాలో మనం 17 శాతం పెరుగుదలను చూశాము. ప్రభువు యొక్క కార్యము శక్తివంతమైన మార్గాల్లో ముందుకు సాగుతూనే ఉంది. సువార్త ప్రతీఒక్కరి హృదయాలను తాకుతోందనడానికి మరియు జీవితాలను మారుస్తుందనడానికి ఈ పెరుగుతున్న సంఖ్యలు ఒక స్పష్టమైన సాక్ష్యం.
మన కాలంలో, పరివర్తన చెందిన ఈ విలువైన వ్యక్తులు ఇకపై ఒక కేంద్ర స్థానానికి సమకూర్చబడరు. సంఘ సభ్యుల యొక్క విశ్వాసం మరియు సమర్పణ కారణంగా, ప్రపంచవ్యాప్తంగా ప్రార్థనా మందిరాలు మరియు దేవాలయాల నిర్మాణాలతో సంఘాలకు మద్దతు ఇవ్వడానికి వనరులు అందుబాటులో ఉన్నాయి. అవసరమైన యాజకత్వ తాళపుచెవులు మరియు అందించబడిన వనరులతో, ఇప్పుడు ప్రపంచంలోని చాలా ప్రాంతాలలో రక్షణ విధులు అందుబాటులో ఉన్నాయి.
మనం ఎక్కడ నివసిస్తున్నామనే దానితో సంబంధం లేకుండా, మన ప్రారంభ చరిత్ర నుండి నేను వివరించిన ఇంగ్లీష్ మరియు వెల్ష్ పరిశుద్ధులకు మేము చేసినట్లుగా ప్రస్తుత సభ్యులు వందల వేలమంది కొత్త సభ్యులను స్వాగతించవలసి ఉంటుంది. ఈ సభలో ఎల్డర్ గెరిట్ డబ్ల్యు. గాంగ్ గారి ప్రసంగం నాకు చాలా నచ్చింది, ఎవరూ భావోద్వేగపరంగా లేదా ఆధ్యాత్మికంగా ఒంటరిగా కూర్చోకూడదని ఆయన మనకు బోధించారు.
కొత్తగా వచ్చే సభ్యులను మరియు తిరిగి వచ్చే సభ్యులను అంగీకరించడం మరియు స్వాగతించడం మన పవిత్రమైన కర్తవ్యం. ప్రభువు తన కార్యమును వేగవంతం చేస్తున్నప్పుడు, ఆయన సువార్తను అంగీకరించే వారిని మనం ప్రేమించాలి, వారిని పోషించాలి మరియు వారికి సేవ చేయాలి. “ఏక హృదయమును, ఏక మనస్సును కలిగియుండి, నీతియందు [నివసించు]” సీయోను జనులను నిర్మించడంలో మనం సహాయపడగలము. ప్రభువుతో ఏకమైయుండాలంటే, మనం ప్రభువు యెదుట ఐక్యంగా ఉండాలి. బాప్తిస్మపు తేదీతో సంబంధం లేకుండా అందరు సభ్యులు ఇతరులను స్వాగతించే బాధ్యతను పంచుకుంటారు.
సంఘ సభ్యులకు నా సలహా ఏమిటంటే, యేసు క్రీస్తు యొక్క సువార్తను అంగీకరించిన ఈ విలువైన ఎన్నుకోబడిన వ్యక్తులపట్ల మనం శ్రద్ధ చూపాలి.
కొత్తగా పరివర్తన చెందిన వారికి “ఒక స్నేహితుడు, ఒక బాధ్యత మరియు ‘దేవుని మంచివాక్యము చేత పోషించబడుట’( మొరోనై 6:4) అవసరమని అధ్యక్షులు గార్డన్ బి. హింక్లి మనకు బోధించారు.” కొత్తగా పరివర్తన చెందిన వారు అతిథులు మాత్రమే కాదని, వారు మనకు చెందినవారని వారికి భరోసా ఇచ్చే స్నేహితుల్లో మనం కూడా ఉండవచ్చు. వారు యేసు క్రీస్తు యొక్క శిష్యులని, ఇతరులకు పరిచర్య చేయగలరని మరియు సేవ చేయడానికి పిలుపులను అంగీకరించగలరని అర్థం చేసుకోవడానికి మనము వారికి సహాయపడగలము. యుక్త వయస్సులో పరివర్తన చెందినవారు పూర్తి-కాల సువార్తసేవ చేయడాన్ని పరిగణించాలి. అందరూ క్రీస్తువంటి జీవితాన్ని గడపడానికి కృషి చేయాలని దృఢంగా నిశ్చయించుకోవాలి.
చాలామంది గొప్ప వ్యక్తిగత త్యాగంతో సంఘములో చేరుతారు మరియు వారికి వారి తోటి పరిశుద్ధుల ప్రేమ మరియు మద్దతు ఎంతో అవసరం.
మీలో కొత్తగా వచ్చినవారు లేదా విశ్వాసానికి తిరిగి వస్తున్నవారు సవాళ్ళను ఎదుర్కోవచ్చు. మీ పట్ల మీరు సహనము కలిగియుండండి. సువార్తికులు మీకు ఆవశ్యకమైన సిద్ధాంతాన్ని బోధించారు, లేఖనాలలో మరియు నా సువార్తను ప్రకటించండిలో పేర్కొనబడిన రాజ్యపు నిబంధనలను మరియు విధులను వివరించారు.
విధులను మరియు నిబంధనలను స్వీకరించడం మరియు ఆజ్ఞలను పాటించడం చాలా అవసరం. ఉన్నతస్థితికి అవసరమైన నిబంధనలపై దృష్టి కేంద్రీకరించండి. సువార్త ఉన్నతస్థితిని సాధ్యం చేస్తుంది, దానికి దేవునితో పవిత్రమైన నిబంధనలను చేయడం మరియు పాటించడం అవసరం. బాప్తిస్మము, నిర్ధారణ మరియు పురుషులకు మెల్కీసెదెకు యాజకత్వాన్ని అందించడం తప్ప, మనం ప్రవేశించే నిబంధనలన్నీ దేవాలయములో నిర్వహించబడతాయి. మరణించిన వారి కోసం, ఈ రక్షణ విధులలో ప్రతీ ఒక్కటి దేవాలయములో మాత్రమే నిర్వహించబడుతుంది. దీని ప్రకారం, దేవాలయానికి వెళ్ళేందుకు మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవడం తక్షణ లక్ష్యంగా ఉండాలి.
కొన్నిసార్లు మీకు తెలిసినది సరిపోదని మీరు భావిస్తారు. సువార్త జ్ఞానం అనేది కాలక్రమేణా క్రమంగా లభించే గొప్ప ఆశీర్వాదం, కానీ అది రక్షణ విధి కాదు. సువార్త అనేది జ్ఞానానికి పరీక్ష కాదు. అయితే, అధ్యక్షులు నెల్సన్ వాగ్దానం చేసినట్లుగా: “మీరు ప్రతిరోజు ప్రార్థనాపూర్వకంగా మోర్మన్ గ్రంథాన్ని అధ్యయనం చేసినప్పుడు, మీరు ప్రతిరోజు మంచి నిర్ణయాలను తీసుకుంటారు. … మీరు అధ్యయనం చేసిన దానిని ధ్యానించినప్పుడు పరలోకపు వాకిండ్లు విప్పబడతాయి, మీ స్వంత ప్రశ్నలకు సమాధానాలను మరియు మీ స్వంత జీవితం కొరకు నడిపింపును మీరు పొందుతారు.”
అదనంగా, ప్రతి సంవత్సరం ఆదివారపు సమావేశాలలో సంఘ పాఠ్యప్రణాళిక క్రమముగా పాత నిబంధన, క్రొత్త నిబంధన, మోర్మన్ గ్రంథము మరియు సిద్ధాంతము మరియు నిబంధనలను పూర్తి చేస్తుంది. కాలక్రమేణా, మీ సువార్త జ్ఞానం పెరిగేకొద్దీ మీరు మరింత ఆత్మవిశ్వాసాన్ని అనుభవిస్తారు. క్రమమైన లేఖన అధ్యయనం యేసు క్రీస్తు యొక్క సువార్తపట్ల మీ పరివర్తనను మరింత ఎక్కువ చేయడం ద్వారా మీ జీవితాలను ఆశీర్వదిస్తుంది మరియు సుసంపన్నం చేస్తుంది.
యేసు క్రీస్తు యొక్క స్వచ్ఛమైన సిద్ధాంతాన్ని నేర్చుకోవడం అనేది జీవితాంతం అనుసరించాల్సిన విషయం, సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవడంలో మరియు క్రీస్తువంటి జీవితాన్ని జీవించడంలో కూడా. ముఖ్యమైన నిబంధనలు మనం నిబంధన మార్గంగా వర్ణించే ఒక చట్రాన్ని అందిస్తాయి. ఈ సూత్రాలను అధ్యక్షులు నెల్సన్ శక్తివంతంగా బోధించారు. సభ్యులందరు, ముఖ్యంగా కొత్తవారు మరియు తిరిగి వచ్చినవారు, నిబంధనలను మరియు నిబంధన మార్గంపై ఆయన ప్రవచనాత్మక సందేశాలను అధ్యయనం చేయడం మరియు స్వీకరించడం ద్వారా ఆశీర్వదించబడతారు.
ఉన్నతస్థితికి అవసరమైన ప్రతి నిబంధనను యోగ్యతతో స్వీకరించాలనే లక్ష్యాన్ని మీరు నిర్దేశించుకుంటే, మీరు సిలెస్టియల్ రాజ్యానికి నడిపించే మార్గంలో ఉంటారు. దేవాలయం మరియు దేవాలయపు విధులపై మన దృష్టి కేంద్రీకరించబడాలి. చాలా నిబంధనలు ప్రతి వ్యక్తికి అందుబాటులో ఉంటాయి. నిత్య వివాహం అనే ఒక నిబంధన మీ ప్రయత్నాలను ఒక సహచరుడితో ఏకం చేయడాన్ని కలిగి ఉంటుంది. ఆ నిత్య సహచరుడిని కనుగొనడమే మన లక్ష్యం అయ్యుండాలి.
అయితే, ఈ సమయంలో నిత్య వివాహం సాధ్యం కాకపోతే నిరుత్సాహపడకండి. ఆజ్ఞలను పాటించే నమ్మకమైన సభ్యుల నుండి ఏ ఆశీర్వాదం కూడా నిలిపివేయబడదని ప్రవక్తలు బోధించారు. మోర్మన్ గ్రంథ ప్రవక్త, రాజైన బెంజమిన్, దీనిని అందంగా చెప్పాడు: “దేవుని ఆజ్ఞలను గైకొను వారు … విషయములన్నిటి యందు ఆశీర్వదింపబడియున్నారు … వారు అంతము వరకు … స్థిరముగా ఉన్న యెడల … వారు దేవునితో ఎన్నడూ అంతముకాని సంతోషము యొక్క స్థితిలో నివసించెదరు.”
సభ్యులు పరిపూర్ణులు కారని మీరు ఇప్పటికే గుర్తించకపోతే, ఇకపై మీరు కనుగొంటారు. మనం భూమిపై నివసించేటప్పుడు తప్పులు చేస్తామని బయలుపరచబడిన సిద్ధాంతం స్పష్టం చేస్తుంది. మనం సిలెస్టియల్ లోకంలో కాదు, అపరిపూర్ణమైన మరియు పతనమైన ప్రపంచంలో జీవిస్తున్నాము. ఈ జీవితం పరీక్షా సమయం, పశ్చాత్తాపపడడానికి మరియు మనల్ని మనం నిరూపించుకోవడానికి నిరంతరం అవకాశాలు ఉంటాయి.
యేసు క్రీస్తులా మారడానికి కృషి చేస్తున్నప్పుడు మనమందరం అసమర్థులమని భావిస్తాము. ఆయన ప్రాయశ్చిత్తం, మన అసంపూర్ణతలో ప్రతిరోజూ మనం పశ్చాత్తాపపడడానికి అనుమతిస్తుంది. మోర్మన్ గ్రంథంలోని మరొక ప్రవక్త అయిన నీఫై చెప్పినట్లుగా: “క్రీస్తు నందు నిలకడతో పరిపూర్ణమైన ప్రకాశవంతమైన నిరీక్షణ కలిగియుండి, దేవుని యొక్కయు మనుష్యులందరి యొక్కయు ప్రేమను కలిగియుండి [మనం] శ్రద్ధగా ముందుకు సాగవలెను. కావున మీరు క్రీస్తు వాక్యమును విందారగించుచూ ముందుకుసాగి, అంతము వరకు స్థిరముగానుండిన యెడల మీరు నిత్యజీవము పొందెదరని తండ్రి సెలవిచ్చుచున్నాడు.”
మన కాలంలోని సవాళ్ల గురించి మనం ఆలోచించినప్పుడు, రక్షకుడు కూడా తన భూసంబంధమైన పరిచర్యలో అల్లకల్లోలమైన మరియు హింసాత్మక సమయాల్లో జీవించారని మనం గుర్తుంచుకోవాలి. ఆయన దృష్టి ఆనాటి రాజకీయ సవాళ్లపై లేదు; అది పరిశుద్ధుల యొక్క పరిపూర్ణతపై ఉంది.
నిరంతరం అల్లకల్లోలంగా ఉండే ప్రపంచంలో రక్షకుడిని, ఆయన సిద్ధాంతాన్ని మరియు బోధనలను అనుసరించడం ఎప్పుడూ సులభం కాదు. అస్థిరమైన లోకంలో రక్షకుని యొక్క మర్త్య జీవన సమయంలో అది ఆయనకు సులభంగా లేదు, మన తొలి నాయకులకు మరియు సభ్యులకు అంత సులభంగా లేదు మరియు మనకు కూడా అంత సులభం కాదు. అదృష్టవశాత్తూ, జీవించి ఉన్న ప్రవక్తలు మన కాలానికి ప్రత్యేకంగా అవసరమైన నడిపింపును అందిస్తారు. ఆధ్యాత్మికంగా శక్తివంతమైన ఆ వారసత్వాన్ని అధ్యక్షులు డాలిన్ హెచ్. ఓక్స్ కొనసాగిస్తారు.
యేసు క్రీస్తు యొక్క సంఘ సిద్ధాంతం నిత్యమైనది మరియు సత్యమైనది అని నేను సాక్ష్యమిస్తున్నాను. యేసు క్రీస్తు జీవిస్తున్నారని మరియు ఆయన ప్రాయశ్చిత్తం కారణంగా, మనం ఆయనతో ఏకమై ఉండగలమని నేను ఖచ్చితంగా మరియు నిశ్చయంగా సాక్ష్యమిస్తున్నాను. యేసు క్రీస్తు యొక్క పవిత్ర నామములో, ఆమేన్.