“నన్ను ప్రేమించుచున్నావా?”
మనం దేవుని పట్ల మన ప్రేమను చూపించాలనుకుంటే, ఆయన మన ప్రేమను ఎలా గుర్తిస్తారో అర్థం చేసుకోవాలి.
తప్పిపోయిన కుమారుడి ఉపమానంలో, తన తమ్ముడు చెడు నిర్ణయాలు తీసుకుని “ఆస్తిని దుర్వ్యాపారమువలన పాడుచేసి,” తర్వాత తిరిగి ఇంటికి వచ్చినప్పుడు మొదట్లో సంతోషించడానికి అన్నయ్య ఇబ్బంది పడ్డాడు. అన్నయ్య యొక్క అహంకారము మరియు స్వనీతి అతని సోదరుడు పశ్చాత్తాపపడి తిరిగి రావడం వల్ల కలిగే ఆనందాన్ని స్వీకరించకుండా ఆపాయి. మన ప్రియమైన వారికి, మన మాటల ద్వారా మరియు క్రియల ద్వారా వారి పట్ల మనకున్న నిష్కపటమైన ప్రేమను తెలియజేయకుండానే మనం అవకాశాలను వదిలి పెట్టవచ్చు.
పంచుకున్న మరియు స్వీకరించబడిన నిజాయితీగల ప్రేమకు అనేక శక్తివంతమైన ఉదాహరణలు లేఖనాలలో ఉన్నాయి: నయోమి మరియు రూతు, అమ్మోన్ మరియు రాజైన లమోనై, తప్పిపోయిన కుమారుడు మరియు అతని తండ్రి, రక్షకుడు మరియు ఆయన శిష్యులు.
ప్రేమను ఉచితంగా ఇచ్చి, హృదయపూర్వకంగా స్వీకరించినప్పుడు, ఇచ్చేవారికి మరియు తీసుకునేవారికి మధ్య ప్రేమ పెరుగుదలతో ఒక సానుకూల విధానం ఏర్పడుతుంది.
దేవుని ప్రేమ పరిపూర్ణమైనది, అనంతమైనది, శాశ్వతమైనది, మరియు “అత్యంత మధురమైనది.” అది ఆత్మను “మిక్కిలి గొప్ప ఆనందముతో నింపుతుంది.” అయినప్పటికీ, కొన్నిసార్లు మన జీవితాల్లో దేవుని ప్రేమను గుర్తించడం కష్టంగా అనిపించవచ్చు. అయితే, పరిపూర్ణ ప్రేమగల మన పరలోక తండ్రి తన ప్రేమను మనం అనుభవించాలని ఎంతగా కోరుకుంటున్నారంటే, “[మనం] గ్రహించునట్లు ఆయన [మనతో] మాట్లాడును.” మనం వ్యక్తిగతంగా గుర్తించగలిగే మార్గాలలో, ఆయన మన పట్ల తన ప్రేమను వ్యక్తపరుస్తారు. ప్రకృతి యొక్క అందాలను గమనించినప్పుడు లేదా ప్రార్థనలకు సమాధానాలు పొందినప్పుడు లేదా అవసరమైన తరుణంలో మన మనస్సులో ఆలోచనలు వచ్చినప్పుడు లేదా ఆనందకరమైన మధురమైన క్షణాలను అనుభూతి చెందినప్పుడు మనం దేవుని ప్రేమను అనుభవించవచ్చు. ప్రాయశ్చిత్తముగా తనను తాను అర్పించుకోవడానికి ఆయన తన ప్రియమైన కుమారుడిని అనుమతించినప్పుడు, పరలోక తండ్రికి మనపై ఉన్న ప్రేమ యొక్క గొప్ప వ్యక్తీకరణ మనస్సు మరియు హృదయం రెండింటిలోనూ ప్రతిధ్వనిస్తుంది.
తప్పిపోయిన కుమారుని అన్నయ్యలాగే, మన దృష్టి తరచుగా మనపైనే కేంద్రీకృతమై ఉంటుంది. దేవుడు మనపై చూపిస్తున్న ప్రేమపట్ల రుజువు కోసం వెదకడంలో మనం ఎంతగానో నిమగ్నమైపోతాము మరియు అది మనకు కనిపించనప్పుడు మనము నిరాశ చెందుతాము. కానీ అందమైన వ్యత్యాసం ఏమిటంటే, మనం దేవుని పట్ల మనకున్న ప్రేమను చూపించడంపై ఎంత ఎక్కువగా దృష్టి పెడతామో, అంత సులభంగా మన పట్ల ఆయనకున్న ప్రేమను గుర్తిస్తాము. బహుశా అందుకే, “ముఖ్యమైన ఆజ్ఞ ఏది?” అనే ప్రశ్నకు రక్షకుడు ఈ సరళమైన మరియు ముఖ్యమైన ఆహ్వానంతో స్పందించారు: “నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణమనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను.”
కొన్నిసార్లు మనం అత్యంత ప్రియమైన వారి పట్ల మన ప్రేమను చూపించే విధానం, వారు గుర్తించే విధంగా ఉండకపోవచ్చు. ఇది ఇచ్చేవారు మరియు పుచ్చుకొనే వారు ఇద్దరికీ నిరాశ కలిగించవచ్చు. వ్యక్తీకరించబడిన ప్రేమను వారు ఎలా గుర్తిస్తారని మనం ప్రేమించే వారిని అడగడం సహాయకరంగా ఉండవచ్చు. అదేవిధంగా, మనం దేవుని పట్ల మన ప్రేమను చూపించాలనుకుంటే, ఆయన మన ప్రేమను ఎలా గుర్తిస్తారో అర్థం చేసుకోవాలి. అదృష్టవశాత్తూ, ఆయన పట్ల మనకున్న ప్రేమను చూపించగల అనేక మార్గాలను ఆయన లేఖనాలలో స్పష్టంగా వివరించారు.
వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా?”
తిబెరియ సముద్రం వద్ద పేతురు మరియు పునరుత్థానుడైన ప్రభువు మధ్య జరిగిన బోధనాత్మక సంభాషణలో, ప్రభువు పట్ల మన ప్రేమను చూపించగల మార్గాలను మనం నేర్చుకుంటాము.
“యేసు సీమోను పేతురును చూచి యోహాను కుమారుడవైన సీమోనూ, వీరికంటె నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? అని అడుగగా, అతడు–అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే యెరుగుదువని ఆయనతో చెప్పెను.”
ప్రభువు చేసిన ఈ విచారణలోని కీలక ప్రశ్న ఏమిటంటే, “వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా?” మనం ప్రభువును “వీరి” కంటే ఎక్కువగా ఉంచినప్పుడు, ఆయన పట్ల మన ప్రేమను చూపిస్తాము మరియు “వీరి” అనేది ఎవరైనా కావచ్చు, ఏదైనా చర్య కావచ్చు లేదా మన జీవితాల్లో ఆయనను అత్యంత ముఖ్యమైన ప్రభావంగా ఉంచకుండా చేసేది ఏదైనా కావచ్చు.
మనం సాధించాల్సినవన్నీ లేదా సాధించాలనుకుంటున్నవన్నీ పూర్తి చేయడానికి ఒక రోజు, ఒక వారం, ఒక నెల లేదా ఒక సంవత్సరంలో తగినంత సమయం ఉండదు. మర్త్యత్వ పరీక్షలో ఒక భాగం ఏమిటంటే, మన శాశ్వతమైన మంచి కోసం అత్యంత ముఖ్యమైన దాని కోసం విలువైన సమయం అనే వనరును ఉపయోగించడం మరియు ప్రాముఖ్యత లేని వాటిని వదిలివేయడం.
అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఇలా అన్నారు: “మనలో ప్రతిఒక్కరిని అడిగే ప్రశ్న… ఒక్కటే. … దేవుడిని మీ జీవితాల్లో అత్యంత ముఖ్యమైన ప్రభావంగా ఉండనివ్వడానికి మీరు సమ్మతిస్తున్నారా? ప్రతిరోజూ మీరు చేసే దానిని ప్రభావితం చేయడానికి ఆయన మాటలు, ఆయన ఆజ్ఞలు మరియు ఆయన నిబంధనలను మీరు అనుమతిస్తారా? ఇతర వాటికి పైగా ఆయన స్వరము ప్రాధాన్యత సంతరించుకొనేలా మీరు అనుమతిస్తారా? మీరు చేయాలని ఆయన కోరేదానిని మీ ఆశయాలన్నిటి కంటే అతిముఖ్యమైన దానిగా భావించడానికి మీరు సమ్మతిస్తున్నారా? మీ చిత్తము ఆయన చిత్తమందు ఉపసంహరించబడడానికి మీరు సమ్మతిస్తున్నారా?” మనం ఆయనకు మిక్కిలి ప్రాధాన్యతనిచ్చినప్పుడు, దేవుని పట్ల మన శిష్యత్వాన్ని మరియు ప్రేమను ప్రదర్శిస్తాము.
నా గొఱ్ఱెలను కాయుము
పేతురు మరియు రక్షకుని మధ్య జరిగిన ఈ చర్చలోని తదుపరి వచనంలో, ప్రభువు మన ప్రేమ వ్యక్తీకరణలను గుర్తించే మరొక మార్గం గురించి మనం నేర్చుకుంటాము: “[ప్రభువు] మరల–యోహాను కుమారుడవైన సీమోనూ, నన్ను ప్రేమించుచున్నావా? అని రెండవసారి అతనిని అడుగగా, అతడు–అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే యెరుగుదువని ఆయనతో చెప్పెను. ఆయన–నా గొఱ్ఱెలను కాయుమని చెప్పెను.”
మనం ఆయన పిల్లలకు సేవ చేసినప్పుడు, వినినప్పుడు, ప్రేమించినప్పుడు, ఉద్ధరించినప్పుడు లేదా వారికి పరిచర్య చేసినప్పుడు పరలోక తండ్రి పట్ల మనకున్న ప్రేమను చూపిస్తాము. ఆ సేవ, తీర్పు తీర్చకుండా ఇతరులను యథార్థముగా చూడడం అంత సులభం కావచ్చు. సిద్ధాంతము మరియు నిబంధనలు యొక్క 76వ ప్రకరణములో, సిలెస్టియల్ మహిమను వారసత్వంగా పొందే వారి స్వభావం యొక్క క్షణదర్శనాన్ని మనం చూస్తాము: “అవి చూడబడిన విధముగా వారు చూచెదరు, అవి తెలియబడిన విధముగా వారు తెలుసుకొందురు.” వారు ఇతరులను దేవుడు చూసినట్లే చూస్తారు మరియు వారు మహిమాన్వితమైన దైవిక సామర్థ్యంతో ఎలా మారగలరో అలాగే ఆయన వారిని చూస్తారు.
నా సువార్తసేవ నుండి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత, యుక్తవయసులో వున్నప్పుడు నేను మరియు నా సహోదరులు ప్రారంభించిన పచ్చిక బయలు సంరక్షణ వ్యాపార బాధ్యతలను నేను చేపట్టాను. నా విశ్వవిద్యాలయ చదువులతో కూడా నేను తీరికలేకుండా ఉన్నాను. వసంత ఋతువులోని ఒక వారంలో, భారీ వర్షం వలన మరియు త్వరలో రాబోతున్న చివరి పరీక్షల వలన నేను చాలా అలసిపోయాను మరియు తోట పనిలో వెనుకబడిపోయాను.
వారం మధ్యలో ఆకాశం నిర్మలమైంది, తరగతుల తర్వాత తోట పని చేయాలని నేను ప్రణాళిక చేసుకున్నాను. కానీ నేను ఇంటికి వచ్చేసరికి, నా బండి మరియు పరికరాలు పోయాయి. ఆసక్తిగా, నేను ప్రణాళిక చేయబడిన తోటలను సందర్శించాను; ప్రతీ ఒక్కటి అప్పటికే అందంగా కత్తిరించబడ్డాయి. ప్రణాళిక ప్రకారం చివరి తోట వద్ద, కోత యంత్రం వెనుక నా తమ్ముడు నడుస్తున్నట్లు నేను చూశాను. అతను నన్ను చూసి, నవ్వి, చేయి ఊపాడు. కృతజ్ఞతతో ఉప్పొంగిపోయి, నేను అతన్ని కౌగిలించుకుని కృతజ్ఞతలు తెలిపాను. అతను చేసిన అర్థవంతమైన సేవా చర్య, అతని పట్ల నాకున్న ప్రేమను మరియు విశ్వాసాన్ని గాఢంగా బలపరిచింది. ఒకరికొకరు సేవ చేసుకోవడం అనేది దేవుని పట్ల మరియు ఆయన ప్రియ కుమారుని పట్ల మనకున్న ప్రేమను చూపించడానికి ఒక స్పష్టమైన మార్గం.
అన్ని విషయములందు ఆయన హస్తమును అంగీకరించండి
కృతజ్ఞతతో కూడిన హృదయాన్ని కలిగియుండడం ద్వారా కూడా మనం దేవుని పట్ల మనకున్న ప్రేమను ప్రదర్శిస్తాము. ప్రభువు ఇలా అన్నారు, “అన్ని విషయములందు ఆయన హస్తమును అంగీకరించని వారు తప్ప, … ఏ విషయములోను మనుష్యుడు దేవుని నొప్పించడు.” మన జీవితాల్లోని ప్రతి మంచి విషయానికి ఆయనే మూలమని గుర్తించడం ద్వారా మనం దేవుని పట్ల మనకున్న ప్రేమను చూపిస్తాము.
ఒక కంపెనీని ప్రారంభించిన తొలినాళ్లలో, నేను మరియు నా వ్యాపార భాగస్వామి ముఖ్యమైన సమావేశాలకు ముందు పరలోక తండ్రి సహాయం కోసం హృదయపూర్వకంగా ప్రార్థించేవాళ్ళం. సమయానుకూలంగా, దేవుడు మా ప్రార్థనలకు సమాధానమిచ్చారు మరియు మా సమావేశాలు సజావుగా సాగాయి. ఒక సమావేశం తర్వాత, మేము సహాయం కోసం తొందరపడి అడిగేవారమని, కానీ కృతజ్ఞతలు చెప్పడానికి నెమ్మదిగా ఉన్నామని నా వ్యాపార భాగస్వామి ఎత్తి చూపాడు. అప్పటి నుండి, మా విజయాలలో ప్రభువు హస్తాన్ని గుర్తిస్తూ కృతజ్ఞతతో కూడిన హృదయపూర్వక ప్రార్థనలు చేయడం అలవాటు చేసుకున్నాము. మనం దేవుని పట్ల మనకున్న ప్రేమను “కృతజ్ఞతాపూర్వకమైన దృక్పథంతో” చూపిస్తాము.
మీరు నన్ను ప్రేమించినయెడల నా ఆజ్ఞలను గైకొందురు
పరలోక తండ్రి పట్ల మరియు ఆయన ప్రియమైన కుమారుని పట్ల మన ప్రేమను చూపించడానికి మరొక మార్గం వారికి విధేయత చూపడం. “మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు” అని రక్షకుడు చెప్పారు. ఈ రకమైన విధేయత అజ్ఞానం వల్ల లేదా బలవంతంగా రాదు, కానీ నిజాయితీగా మరియు ఇష్టపూర్వకంగా ప్రేమను వ్యక్తపరుస్తుంది. మనం విధేయులుగా ఉండాలని కోరుకోవాలని పరలోకమందున్న తండ్రి కోరుతున్నారు. సహోదరి తమారా డబ్ల్యు. రూనియా దీనిని “ప్రేమపూర్వక విధేయత” అని పిలిచారు. ఆమె ఇలా అన్నారు, “మనకు ఇంకా పరిపూర్ణ విధేయత లేకపోయినా, మనం ఇప్పుడు ప్రేమపూర్వక విధేయతను ప్రయత్నిస్తాము, మనం ఆయనను ప్రేమిస్తున్నాము కాబట్టి మళ్ళీ మళ్ళీ ఆయనతోనే ఉండాలని ఎంచుకుంటాము.”
ఆయనను ఎంచుకోవాలనుకునేలా మనలను ప్రేరేపించడానికి పరలోక తండ్రి మనకు కర్తృత్వమునిచ్చారు. ఆయన కార్యము మరియు మహిమ మనకు నిత్యజీవమును ఇచ్చుట మాత్రమే కాదు, కానీ ఆయన వద్దకు తిరిగి రావడమే మన గొప్ప కోరిక అనే నిరీక్షణను కూడా కలిగియుంది. అయితే, విధేయత చూపమని ఆయన మనల్ని ఎప్పుడూ బలవంతం చేయరు. “నొ దిస్, దట్ ఎవ్రి సోల్ ఈజ్ ఫ్రీ” అనే కీర్తనలో మనం ఇలా పాడతాము:
మిషను నాయకులుగా, నా భార్య క్రిస్టినా మరియు నేను చాలామంది సువార్తికులచే ప్రేరణ పొందాము, అది ఒక సువార్తికుని ప్రమాణం కాబట్టి వారు విధేయత చూపాలని ఎంచుకోలేదు, కానీ వినయంగా ఆయనకు ప్రాతినిధ్యం వహించడం ద్వారా ప్రభువు పట్ల తమ ప్రేమను వారు చూపించాలనుకున్నారు.
ఎల్డర్ డేల్ జి. రెన్‌లండ్ ఇలా చెప్పారు: “మన పరలోక తండ్రి యొక్క లక్ష్యము తన బిడ్డలు సరైన దానిని చేయునట్లు చేయుట కాదు; ఆయన బిడ్డలు సరైనదానిని చేయుటకు ఎన్నుకొని మరియు చివరకు ఆయనవలే కావలని ఆయన కోరుచున్నాడు. ఆయన కేవలము మనము విధేయులుగా ఉండాలని కోరినట్లయితే, మన ప్రవర్తనలను ప్రభావితం చేయడానికి ఆయన తక్షణమే బహుమతులు మరియు శిక్షను ఉపయోగించేవారు.” మనం దేవునికి విధేయత చూపి, ఆయనను అనుసరించాలని ఎంచుకున్నప్పుడు ఆయన పట్ల మనకున్న ప్రేమను చూపిస్తాము.
మన జీవితాల్లో వారిని మొదటి స్థానంలో ఉంచి, ఒకరికొకరు సేవ చేసుకుని, వారి నుండి వచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని కృతజ్ఞతతో అంగీకరించి, వారికి విధేయత చూపి అనుసరించాలని ఎంచుకున్నప్పుడు, మన పరలోక తండ్రి మరియు మన రక్షకుడు వారి పట్ల మన ప్రేమ వ్యక్తీకరణలను గుర్తిస్తారు.
మనలో ప్రతి ఒక్కరూ నిజంగా దేవుని బిడ్డలని, ఆయన మనల్ని పరిపూర్ణంగా ప్రేమిస్తున్నారని నేను సాక్ష్యమిస్తున్నాను. మనం గుర్తించి, అర్థం చేసుకునే మార్గాలలో ఆయన ప్రేమను మనం అనుభవించాలని ఆయన కోరుకుంటున్నారు అని నేను సాక్ష్యమిస్తున్నాను. అందమైన వైరుధ్యం ఏమిటంటే, మనం ఆయన పట్ల మనకున్న ప్రేమను చూపించినప్పుడు, మన పట్ల ఆయనకున్న ప్రేమను మరింత లోతుగా అనుభవిస్తాము. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.