సర్వసభ్య సమావేశము
యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్త ప్రేమ
2025 అక్టోబరు సర్వసభ్య సమావేశము


14:34

యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్త ప్రేమ

స్వస్థత మరియు క్షమాపణ రెండూ యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్త ప్రేమలో వాటి సంపూర్ణతలో కనిపిస్తాయి.

అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ పట్ల నా ప్రేమను మరియు మనలో ప్రతీ ఒక్కరిపై ఆయన చూపిన అద్భుతమైన ప్రభావానికి నా కృతజ్ఞతను తెలియజేస్తున్నాను. మరియు అధ్యక్షులు డాలిన్ హెచ్. ఓక్స్ గారి దివ్యమైన జీవితాన్ని కాపాడి, ఘనంగా చేసినందుకు మనందరి తరఫున దేవునికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను.

ప్రతీ సంవత్సరం గడిచేకొద్దీ, మన రక్షకుడైన యేసు క్రీస్తు పట్ల మరియు ఆయన దయగల ప్రాయశ్చిత్తం పట్ల నేను అధిక ప్రేమను అనుభవిస్తున్నాను. మరణం మరియు పాపంపై విజయం సాధించడం ద్వారా ఆయన చేసిన అత్యున్నత త్యాగం మానవ చరిత్ర అంతటిలో అత్యంత ముఖ్యమైన సంఘటన. ఆయన దైవిక బహుమానాన్ని అర్థం చేసుకోవడమనేది నాకు సమాధిని దాటి కొనసాగే ఒక ఆధ్యాత్మిక జ్ఞానం.

ప్రభువైన యేసు క్రీస్తు

పాపాన్ని క్షమించడంలో మరియు ఇతరుల పాపాల వల్ల కలిగే గాయాలను నయం చేయడంలో రక్షకుడు చూపే శక్తివంతమైన కనికరము దేవుని ప్రేమకు అత్యంత అద్భుతమైన రుజువు.

చాలా తీవ్రమైన పాపాలకు క్షమాపణ కోరుకునే వారికి నిరీక్షణను అందించాలని మరియు ఇతరుల తీవ్రమైన పాపాల వల్ల కలిగిన బాధాకరమైన గాయాల నుండి స్వస్థత కోరుకునే వారికి ఓదార్పునివ్వాలని నేను కోరుకుంటున్నాను.

స్వస్థత మరియు క్షమాపణ రెండూ యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్త ప్రేమలో వాటి సంపూర్ణతలో కనిపిస్తాయి.

యేసు క్రీస్తు నందు విశ్వాసము

మీరు తీవ్రమైన పాపాలు చేసి, పశ్చాత్తాప ప్రక్రియలో ఉంటే లేదా పూర్తిగా పశ్చాత్తాపపడి క్షమాపణ యొక్క చెప్పలేని ఆనందాన్ని అనుభవించాలనే కోరికతో ఉంటే, దయచేసి ఈ అద్భుతం మీ కోసం వేచియుందని తెలుసుకోండి. రక్షకుడు నిరంతరం “నా యొద్దకు రండి” అని పిలుస్తున్నారు.

మన రక్షకుడైన యేసు క్రీస్తుపై మీ విశ్వాసాన్ని బలోపేతం చేయడం, ఆయనను తెలుసుకోవాలనే, ఆయనను విశ్వసించాలనే మరియు మీ హృదయాన్ని ఆయనకు అప్పగించాలనే మీ ఆత్మ యొక్క కోరికను బలపరుస్తుంది. ఈనస్ తన క్షమాపణ గురించి ఇలా అడిగాడు: “ప్రభువా, ఇది ఎట్లు చేయబడెను?” “నీవు ముందెన్నడూ వినియుండని, చూచియుండని ఆ క్రీస్తు నందున్న నీ విశ్వాసమును బట్టి ఇది చేయబడెను” అని ప్రభువు చెప్పారు.

మొరోనై ఇలా జతచేసాడు, “మీకైమీరు సమస్త భక్తిహీనత నుండి ఉపేక్షించుకొని, మీ పూర్ణ శక్తి, మనస్సు మరియు బలముతో దేవుడిని ప్రేమించిన యెడల, అప్పుడు ఆయన కృప మీకు చాలును.”

పాపం నుండి దూరమై, దేవుని వైపు తిరగడం మరియు యేసు క్రీస్తుపై మీ విశ్వాసాన్ని బలోపేతం చేయడం ఒక అందమైన ప్రారంభం. దేవునికి మీ చిత్తాన్ని వినయంగా సమర్పించడంలో మీ బిషప్పు లేదా శాఖాధ్యక్షుని వద్ద తీవ్రమైన పాపాన్ని అంగీకరించడం కూడా ఉంటుంది, కానీ మీ పూర్తి క్షమాపణ రక్షకుని నుండి వస్తుంది. క్షమాపణ అనేది యేసు క్రీస్తు యొక్క కృప ద్వారా అందించబడిన దైవిక బహుమానం.

నిజాయితీ

దేవుని వద్దకు నిజంగా తిరిగి రావాలనే కోరిక మీ పరలోక తండ్రితో, మీతో, గాయపడిన వారితో మరియు మీ యాజకత్వ నాయకుడితో పూర్తిగా నిజాయితీగా ఉండాలనే దృఢ సంకల్పంతో కూడి ఉంటుంది. విరిగిన హృదయంతో, నలిగిన ఆత్మతో ఆయన దగ్గరకు రావాలనే మీ సంకల్పాన్ని బట్టి మీ పరలోక తండ్రి ఆనందిస్తారు. నలిగిన ఆత్మను కలిగి ఉండడం అంటే వినయంగా మిమ్మల్ని మీరు దేవుని చేతుల్లో పెట్టుకోవడం; విరిగిన హృదయాన్ని కలిగి ఉండడం అంటే “దైవచిత్తానుసారమైన దుఃఖము” అని అపొస్తలుడైన పౌలు వర్ణించినట్లుగా, ఏదేమైనా ఆయన వద్దకు తిరిగి రావాలనే ఆత్మ యొక్క లోతైన కోరికను కలిగియుండడం.

విరిగిన దానిని పునరుద్ధరించడం

మీ ఆరాటం విరిగిన వాటిని బాగుచేయాలనే మీ కోరికకు దారితీస్తుంది. అయినప్పటికీ, కొన్ని విషయాలు మీరు బాగుచేయలేరని గ్రహించి, మీ చర్యల ఫలితంగా గాయపడిన వారిని స్వస్థపరచడానికి ప్రభువు తన కృప ద్వారా సహాయం చేయాలని మీరు హృదయపూర్వకంగా ప్రార్థిస్తారు.

ఇతరులపై తీవ్రమైన పాపం యొక్క ప్రభావాలను అధిగమించడం తరచుగా బాధాకరమైనది. “వారు చేసిన కీడును సరిచేయుటకు శ్రద్ధగా ప్రయత్నిస్తున్న” మోషైయ కుమారుల ఉదాహరణను మీరు అనుసరిస్తున్నారా? మీరు చూడలేకపోతున్న దాని గురించి మీరు గౌరవించే వారితో మాట్లాడండి.

నేను ఈ ప్రసంగాన్ని సిద్ధం చేస్తుండగా, పశ్చాత్తాపపడి సంఘానికి తిరిగి రావాలని కోరుకుంటున్న ఒకరి నుండి నాకు ఊహించని ఒక ఈమెయిల్ వచ్చింది. అతని మాజీ భార్య ఇప్పటికీ “[వారి] నిత్య వివాహం రద్దుచేయబడడం, [పిల్లలతో ఇబ్బందులు], ఆర్థిక భద్రతను కోల్పోవడం, … ఖర్చులను భరించలేకపోవడం, [మరియు] మోసగించబడ్డాననే తీవ్ర భావోద్వేగాలు” వంటి వాటితో బాధపడుతోంది.

అతని యాజకత్వ నాయకుడు “[అతని మాజీ భార్య మరియు పిల్లల కోసం అతను ఇంకా ఏమి చేయగలడో] ప్రార్థనాపూర్వకంగా ఆలోచించమని [అడగాలని] ఎలా భావించాడో” అతను నాతో పంచుకున్నాడు. అనుమతితో నేను అతని ఈమెయిల్‌లో కొంత భాగాన్ని పంచుకుంటాను:

“విడాకుల తీర్పు పత్రంలో నేను ఇస్తానన్న పరిహారం [డబ్బు] ఉదారంగా ఉందని నేను [మొదట] అనుకున్నాను, కానీ ఉపవాసం ఉండి దాని గురించి ప్రార్థించమని నా శాఖాధ్యక్షుడు నన్ను ప్రోత్సహించారు.

“ప్రారంభంలో, నేను మరింత పరిహారమివ్వాలనే ఆలోచనతో ఇబ్బంది పడ్డాను. నా పాపాలు ఆర్థికపరమైనవి కావు కాబట్టి, ‘ఉదారమైన పరిహారం’ అంటే నిజంగా ఏమిటో నేను ఆలోచించాను… [కానీ] అది కేవలం డబ్బు గురించి మాత్రమే కాదని నేను త్వరలోనే గ్రహించాను.

“నా యాజకత్వ నాయకులు [నా మాజీ భార్య] మరియు నా పిల్లలను కలుసుకొని, వారు ఇంకా ఇబ్బంది పడుతున్నారని మరియు స్వస్థత పొందలేదని గ్రహించారు. …

“నా కొత్త లక్ష్యం విశ్వాసంతో ముందుకు సాగడం. … ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేయాలనే నా కోరికను నేను వ్యక్తం చేశాను. … నా జీతం ప్రకారం ప్రతీ జీతంలో గణనీయమైన భాగాన్ని [నా మాజీ భార్యకు ఒక నిర్దిష్ట మొత్తాన్ని పంపాలని] నిర్ణయించుకున్నాను. మొదటి చెల్లింపు చేయడానికి ముందు, ప్రభువు [నా మనస్సులో ఆ మొత్తానికి రెండింతలు] చెల్లించాలనే [భావన కల్పించారు].

“నష్టపరిహారం అంటే కేవలం డబ్బు గురించినది కాదని నేను నేర్చుకున్నాను. అది నా జీవితాన్ని వినయంగా ప్రభువుకు అంకితం చేయడం గురించినది. … నా తప్పుడు ఎంపికల కారణంగా నా కుటుంబం నుండి నేను తీసుకున్న దానిని భర్తీ చేయడానికి ఈ డబ్బు సహాయపడుతుంది. అది ప్రతిఫలంగా ఏమీ ఆశించకుండా వాగ్దానాలు చేసి, నిలబెట్టుకోవడం మరియు చెల్లింపుల గురించి చింతించకుండా ఉండేలా ఆమెకు సహాయం చేయడం గురించినది, తద్వారా ఆమె ఆత్మను వెదకగలదు.”

మీరు విచ్ఛిన్నం చేసిన దాన్ని పునరుద్ధరించడానికి మీరు చేసే ప్రయత్నాలకు డబ్బుతో సంబంధం లేకపోవచ్చు, కానీ మీరు వినయంగా ప్రభువుతో చర్చించినప్పుడు, మీరు చేయగలిగేది ఇంకా ఎక్కువ ఉందని మీరు కనుగొనవచ్చు.

అంచెలంచెలుగా దైవిక ఆమోదం

మీరు ప్రభువు నుండి క్షమాపణ కోరుతున్నప్పుడు, ఆయన పూర్తి ఆమోదం కోసం వేచి ఉన్నప్పుడు ఓపికగా ఉండండి. ఈ లేఖనాన్ని పరిగణించండి:

“వారు మిక్కిలి వినయముతో తమనుతాము తగ్గించుకొని దేవునికి బలముగా మొరపెట్టిరి; … దినమంతయు వారు తమ దేవునికి మొరపెట్టిరి. … [కానీ] వారి దోషముల నిమిత్తము ప్రభువు వారి మొర వినుటకు ఆలస్యము చేసెను.”

“అయినప్పటికీ ప్రభువు వారి మొరలను విని, వారి భారములు తేలిక … చేయసాగెను; … మరియు … వారు అంచెలంచెలుగా దేశమందు వర్ధిల్లుట మొదలుపెట్టిరి.”

ప్రభువు తన ఆశీర్వాదాన్ని మరియు ఆమోదాన్ని క్రమంగా మీకు ఇస్తున్నందున ఓపికపట్టండి.

ప్రభువు యుక్తకాలంలో, “ఈ సంగతులు ఇకపై నిన్ను కష్టపెట్టనియ్యకుము” అని ఆయన స్వరం మీకు చెబుతున్నట్లు మీరు అనుభూతి చెందుతారు. ఒక రోజు, మీరు రక్షకుని వైపు తిరగడం కొనసాగిస్తున్నప్పుడు, మీ పరలోక తండ్రి “ఆయన కుమారుని మంచితనము ద్వారా [మీ హృదయం] నుండి దోషమును తీసివేస్తారు.”

గాయపడిన మరియు బాధ పడుతున్న

మరొకరి తీవ్రమైన పాపాల వల్ల అన్యాయంగా గాయపడిన మీ కోసం, రక్షకుని ప్రేమ మరియు కనికరము, ఆయన ఓదార్పు మరియు శాంతిని పంచుకోవాలని నేను కోరుకుంటున్నాను.

మీరు అనుభవించిన విచారం, మానసిక క్షోభ, నష్టం, మోసగించబడ్డాననే తీవ్ర భావోద్వేగాలు, మీరు ఊహించని మలుపు తిరిగిన మీ జీవితం—రక్షకుడు మిమ్మల్ని ఎరుగుదురని మరియు మిమ్మల్ని ప్రేమిస్తున్నారని నేను మీకు పూర్తి హామీ ఇస్తున్నాను. ఆయనను చేరుకోండి. ఆయనే మీకు ఓదార్పు మరియు బలము; మిమ్మల్ని ఎత్తుకోవడానికి ఆయన తన దేవదూతలను పంపుతారు. మీ బాధ ఎప్పుడు పోతుంది, మీ దుఃఖం ఎప్పుడు తగ్గుతుంది, మీ అవాంఛిత జ్ఞాపకాలు ఎప్పుడు మరచిపోబడతాయి? నాకు తెలియదు. కానీ ఇది నాకు తెలుసు: మీ బాధల బూడిదెకు ప్రతిగా పూదండను తీసుకురాగల శక్తి ఆయనకు ఉంది.

మిచిగాన్‌లోని గ్రాండ్ బ్లాంక్‌లోని మన ప్రియమైన సహోదర సహోదరీలు, యేసు క్రీస్తుపై వారి దృఢ విశ్వాసంతో, వారి ధైర్యం మరియు నిస్వార్థంతో, రక్షకుని సాటిలేని ప్రేమను, కృపను సమృద్ధిగా పొందారు మరియు రాబోయే వారాలు మరియు నెలల్లో పొందుతారు.

ఆయనపై మీ నమ్మకాన్ని మీరు కొనసాగిస్తున్నప్పుడు, మీ మానసిక క్షోభ మరియు వేదనతో కూడిన మీ దుఃఖం అంతులేని ఆనందంగా మరియు శాంతిగా మారుతుంది. “మీ దుఃఖము సంతోషమగును. … మీ సంతోషమును [ఎవడును] మీ యొద్దనుండి తీసివేయడు.” ఆ క్షణం వస్తుంది. అది వస్తుందని నేను సాక్ష్యమిస్తున్నాను.

అధ్యక్షులు డాలిన్ హెచ్. ఓక్స్

యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్త ప్రేమను అత్యంత క్లిష్ట పరిస్థితులలో కనుగొనవచ్చు, కానీ మనందరికీ మన రక్షకుని ప్రాయశ్చిత్త కృప నిరంతరం అవసరం. అధ్యక్షులు డాలిన్ హెచ్. ఓక్స్ ఇలా బోధించారు: “మర్త్యత్వంలో ఆయన ప్రాయశ్చిత్త అనుభవం కారణంగా, మన రక్షకుడు ప్రతిచోటా ఉన్న స్త్రీ పురుషులందరినీ ఓదార్చగలరు, స్వస్థపరచగలరు మరియు బలపరచగలరు, కానీ ఆయనను వెదకుతూ ఆయన సహాయం కోరేవారికి మాత్రమే ఆయన అలా చేస్తారని నేను నమ్ముతున్నాను. ‘ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి. అప్పుడాయన మిమ్మును హెచ్చించును,’ (యాకోబు 4:10) అని అపొస్తలుడైన యాకోబు బోధించాడు. మనం ఆయనను విశ్వసించి ఆయన సహాయం కోసం ప్రార్థించినప్పుడు, మనం ఆ ఆశీర్వాదానికి అర్హులం అవుతాము.”

ఎల్డర్ నీల్<nb/>ఎల్. ఆండర్సెన్‌తో ఎల్డర్ రాబర్ట్ ఈ. వెల్స్

ఎల్డర్ రాబర్ట్ ఈ. వెల్స్

నా ప్రియమైన స్నేహితుడు మరియు మాజీ ప్రధాన అధికారి, ఇప్పుడు 97 సంవత్సరాల వయస్సు గల ఎల్డర్ రాబర్ట్ ఈ. వెల్స్ నుండి, 60 సంవత్సరాల క్రితం ఆయనకు కలిగిన అనుభవాన్ని పంచుకోవడానికి నాకు అనుమతి లభించింది:

1960లో పరాగ్వేలో నివసిస్తున్నప్పుడు, అంతర్జాతీయ బ్యాంకు నిర్వాహకుని‌గా పనిచేస్తున్నప్పుడు, అప్పటికి 32 ఏళ్ల వయస్సున్న రాబర్ట్ వెల్స్ మరియు అతని భార్య మెరిల్ రెండు వేర్వేరు విమానాలలో పైలట్లుగా ఉరుగ్వే నుండి పరాగ్వేకు ఇంటికి ప్రయాణిస్తున్నారు. దట్టమైన మేఘాలను ఎదుర్కొన్నప్పుడు, రాబర్ట్ మరియు మెరిల్ ఒకరితో ఒకరు దృశ్య మరియు రేడియో సంబంధాన్ని కోల్పోయారు. రాబర్ట్ త్వరగా క్రిందికి దిగినప్పుడు, ఆయన భార్య విమానం కూలిపోయిందని తెలుసుకున్నారు. ఆయన భార్య లేదా ఆమెతో ప్రయాణిస్తున్న ఇద్దరు స్నేహితులు ప్రాణాలతో బయటపడలేదు. ఆసున్సియోన్‌లోని ఇంట్లో ఉన్న ఆయన పిల్లలు ఏడు, ఐదు మరియు రెండు సంవత్సరాల వయస్సు గలవారు.

వెల్స్ కుటుంబము

ఎల్డర్ వెల్స్ తన బాధ గురించి ఇలా చెప్పారు:

“నా భావోద్వేగాలను కబళిస్తూ, నా ఇంద్రియాలను మొద్దుబారేలా చేస్తూ, నాలో ఉప్పొంగిన బాధను వ్యక్తపరచడానికి మాటలు ఎప్పటికీ సరిపోవు. దుఃఖంతో కూడిన కన్నీళ్లు ఆగడం లేదు. పరిస్థితిని మరింత దిగజార్చడానికి, నా భార్య మరణం యొక్క వినాశకరమైన అనుభవాన్ని ఎదుర్కోవడానికి నా మనస్సు ప్రయత్నిస్తుండగా, ఆ ప్రమాదానికి నేనే కారణమని భావించినందుకు నాకు అపరాధ భావన కలిగింది.”

విమానాన్ని మరింత క్షుణ్ణంగా తనిఖీ చేయనందుకు మరియు విమానాన్ని నడిపేందుకు తన భార్యకు తగిన సూచనలు ఇవ్వనందుకు రాబర్ట్ తనను తాను నిందించుకున్నారు. నిర్లక్ష్యం వల్ల తాను దోషినని ఆయన భావించారు.

రాబర్ట్ ఇలా అన్నారు:

“నా మనస్సు చీకటిగా మారింది.… నేను బ్రతికే ఉన్నాను—[పిల్లల కోసమే,] మరే ఉద్దేశ్యం లేదు.

“నాలో … బ్రతకాలనే కోరిక చచ్చిపోయింది.”

కాలక్రమేణా, రాబర్ట్ లోతైన ఆధ్యాత్మిక అనుభవాన్ని పొందారు. ఆయన ఇలా వివరించారు:

“ఒక సాయంత్రం, దాదాపు ఒక సంవత్సరం తర్వాత, నేను మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు, ఒక అద్భుతం జరిగింది. నా పరలోక తండ్రికి ప్రార్థిస్తూ, వేడుకుంటుండగా, రక్షకుడు నా ప్రక్కకు వచ్చినట్లు నాకు అనిపించింది మరియు ఒక స్పష్టమైన స్వరం నా ఆత్మతో మరియు నా చెవులలో ఈ మాటలు చెప్పడం నేను విన్నాను: ‘రాబర్ట్, నా ప్రాయశ్చిత్త త్యాగం నీ పాపాలకు, నీ తప్పులకు చెల్లించింది. నీ భార్య నిన్ను క్షమిస్తుంది. నీ స్నేహితులు నిన్ను క్షమిస్తారు. నేను నీ భారాన్ని తొలగిస్తాను. …’

“ఆ క్షణం నుండి, అపరాధ భావన [మరియు నిరాశ] యొక్క భారం నా నుండి అద్భుతంగా తొలగించబడింది. నేను రక్షించబడ్డాను! రక్షకుని ప్రాయశ్చిత్తం యొక్క ఆవరించే శక్తిని నేను వెంటనే అర్థం చేసుకున్నాను మరియు … అది నాకు నేరుగా వర్తింపజేయబడింది. … నేను … ఇంతకు ముందెన్నడూ లేని విధంగా వెలుగును మరియు ఆనందాన్ని అనుభవించాను. … నాకు సంపాదించని వరము ఇవ్వబడింది—ప్రభువు యొక్క కృపావరము. … నేను దానికి అర్హుడిని కాదు—దానికి అర్హుడిని కావడానికి నేను ఏమీ చేయలేదు, అయినప్పటికీ ఆయన దానిని నాకిచ్చారు.”

సహోదర సహోదరీలారా, మనలో ప్రతీఒక్కరం “దేవుని కృప ద్వారా క్రీస్తునందు పరిశుద్ధపరచబడి, క్రీస్తు యొక్క రక్తము చిందించబడుట ద్వారా … పరిశుద్ధులుగా, మచ్చలేనివారిగా [అగుదుము గాక].”

మన రక్షకుడు మరియు విమోచకుని ప్రేమ, కనికరము మరియు కృప గురించి నేను సాక్ష్యమిస్తున్నాను. ఆయన సజీవుడు. మనము ఆయన సొత్తు; మనము నిబంధన సంతానము. మనం ఆయనను విశ్వసించి, ఆయనను అనుసరించి, ఆయనను నమ్మినప్పుడు, ఆయన మనల్ని మన దుఃఖాల నుండి మరియు మన పాపాల నుండి పైకి లేపుతారు. అప్పుడు, ఈ మర్త్య జీవితానికి మించి, మన తండ్రి ఇంట్లో, మనం ఆయనతో శాశ్వతంగా జీవిస్తాము. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.