కుటుంబ ప్రకటన—దేవుని మాటలు
ఈ ప్రకటనకు దైవిక మూలం ఉంది, కాబట్టి మనం దానిని దేవుని మాటలకు అర్హమైన భక్తితో ఆదరించాలి.
2025 అక్టోబరులో జరుగుతున్న ఈ సర్వసభ్య సమావేశం “కుటుంబము: ప్రపంచమునకు ఒక ప్రకటన” అనే ప్రకటన యొక్క 30వ వార్షికోత్సవాన్ని సూచిస్తుంది. దైవిక రూపకల్పన ద్వారా, ఈ ప్రకటన, దాని బహిర్గత పదాలతో, “కుటుంబమును సమాజము యొక్క ప్రధాన భాగముగా నిర్వహించడానికి మరియు బలోపేతం చేయడానికి” సృష్టించబడింది.
మీరు తల్లి, తండ్రి, కూతురు, కొడుకు, మనవడు, తాతా-మామ్మ, అత్త, మామ, సోదరుడు, సోదరి లేదా బంధువు ఎవరైనా, ప్రతి ఒక్కరూ ఒక కుటుంబానికి చెందినవారు. ముఖ్యంగా, మనలో ప్రతీ ఒక్కరూ, ప్రకటన పేర్కొన్నట్లుగా, “పరలోక తల్లిదండ్రులకు ప్రియమైన ఆత్మ కుమారుడు లేదా కుమార్తె అయ్యున్నారు … దైవిక స్వభావమును, గమ్యమును కలిగియున్నారు.”
2015లో నేను పరిశుద్ధ అపొస్తలునిగా పిలువబడినప్పుడు, నాకు ఈ సలహా ఇచ్చారు, “ఈ ప్రకటన ఇప్పుడు మీదే. మీ పేరు [శీర్షికలో ‘పన్నెండుమంది అపొస్తలుల సలహాసభ’ అనే పదాలను సూచిస్తూ] ఇక్కడ ఉంది. దాన్ని అనుభూతి చెందండి మరియు మీకు అది స్వంతమైనట్లు బోధించండి.”
కుటుంబ ప్రకటన నాకు చాలా ఇష్టం. ఆఫ్రికా నుండి ఆస్ట్రేలియా వరకు మరియు మధ్యలో ప్రతిచోటా దేవుని నిత్య ప్రణాళికలో కుటుంబం యొక్క పాత్ర గురించి నేను సాక్ష్యమిచ్చాను. ఈ ప్రకటనకు దైవిక మూలం ఉంది, కాబట్టి మనం దానిని దేవుని మాటలకు అర్హమైన భక్తితో ఆదరించాలి.
గుర్తుంచుకోండి, సహోదర సహోదరీలారా, నేను ఈ వేదిక నుండి మునుపటి సర్వసభ్య సమావేశంలో చెప్పినట్లుగా, “మాటలు ముఖ్యమైనవి.”
మనం నమ్మే దాని యొక్క ప్రధాన సందేశంగా ప్రకటన గురించి కొంత నేపథ్యాన్ని మీకు అందిస్తాను.
1994లో, ప్రకటనను సమర్పించడానికి ఒక సంవత్సరం ముందు, పన్నెండుమంది అపొస్తలుల సమూహము కుటుంబం, వివాహం మరియు లింగం కొరకైన దేవుని చట్టాల నుండి సమాజం మరియు ప్రభుత్వాలు ఎలా వైదొలగుతున్నాయో చర్చించింది. “కానీ అది మేము చూసిన దాని యొక్క ముగింపు కాదు,” అని అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ తరువాత వివరించారు. “లైంగిక కార్యముపై అన్ని ప్రమాణములు మరియు పరిమితులను తీసివేయడానికి వివిధ వర్గాల ప్రయత్నాలను మేము చూడగలిగాము. లింగ బేధము యొక్క కలవరమును మేము చూసాము. అది అంతా వచ్చుటను మేము చూడగలిగాము.”
కుటుంబంపై సంఘ వైఖరిని సంగ్రహించే పత్రాన్ని, ఒక అధికారిక ప్రకటనను సిద్ధం చేయాలని పన్నెండుమంది నిర్ణయించుకున్నారు. ఆ సంవత్సరంలో, దేవునిచే పిలువబడిన ఈ అపొస్తలులు, కుటుంబం గురించి ఒక ప్రకటనను సిద్ధం చేశారు. “[వారు] ఏమి చెప్పాలి మరియు [వారు] ఎలా చెప్పాలి” అనే దాని కోసం వారు ప్రార్థనాపూర్వకంగా ప్రభువు వైపు తిరిగినట్లు అధ్యక్షులు డాలిన్ హెచ్. ఓక్స్ గుర్తుచేసుకున్నారు. వారు దానిని ప్రథమ అధ్యక్షత్వానికి సమర్పించారు—అధ్యక్షులు హావర్డ్ డబ్ల్యు. హంటర్, గార్డన్ బి. హింక్లీ మరియు థామస్ ఎస్. మాన్సన్‌లకు వారి పరిశీలన కోసం పంపారు.
కొన్ని నెలల తర్వాత 1995, మార్చిలో అధ్యక్షులు హంటర్ మరణించారు మరియు అధ్యక్షులు హింక్లీ సంఘము యొక్క 15వ అధ్యక్షులయ్యారు. ప్రకటన ఇప్పుడు ఆయన చేతుల్లో ఉంది. సంఘానికి ఈ ప్రకటన చేయడానికి సరైన సమయం ఎప్పుడు? ఆ సమయం ఆరు నెలల తర్వాత వచ్చింది.
సర్వసభ్య సమావేశానికి ముందు సెప్టెంబరు 23న జరిగిన ప్రధాన మహిళా సమావేశానికి కొన్ని రోజుల ముందు, అధ్యక్షులు హింక్లీ మరియు ఆయన సలహాదారులు ఉపశమన సమాజ ప్రధాన అధ్యక్షత్వముతో సమావేశమై చర్చించారు. సహోదరీలు, అపొస్తలుల మాదిరిగానే, మహిళలు మరియు కుటుంబాల గురించి ఆందోళన చెందున్నారు. వారు రాబోయే సమావేశాన్ని కుటుంబాలపై కేంద్రీకరించారు.
అధ్యక్షులు హింక్లీ సమావేశంలో మహిళలను ఉద్దేశించి ప్రసంగించాల్సి ఉంది. తన వ్యాఖ్యల దిశ గురించి ఆయన ఆలోచిస్తున్నారు. చర్చ సాగుతున్న కొద్దీ, ఆయన కొత్తగా సృష్టించబడినప్పటికీ ఇంకా బహిరంగపరచబడని “కుటుంబము: ప్రపంచమునకు ఒక ప్రకటన”ను పేరు పెట్టి ప్రస్తావించారు. కుటుంబం గురించి నిర్ణయాత్మక ప్రకటన చేయడానికి ఈ మహిళల సమావేశం సరైన సందర్భమా?
ఉపశమన సమాజ ప్రధాన అధ్యక్షురాలు అలైన్ జాక్ తరువాత ఇలా వివరించారు: “ఆ సమయంలో కుటుంబంపై ప్రకటన ఏమిటో మాకు తెలియదు. [మేము] శీర్షికను బట్టి చెప్పగలం, అయితే కుటుంబం గురించి ఏదైనాసరే … సానుకూల విషయం అవుతుందని మేము భావించాము. … పన్నెండుమంది అపొస్తలుల సమూహములో సభ్యులు బయల్పాటు పొందుతున్నారని నేను చాలా సానుకూలంగా భావించాను.”
ఆ శనివారంనాటి ఉపశమన సమాజ సమావేశం చారిత్రాత్మకమైనది. అధ్యక్షులు హింక్లీ కుటుంబ ప్రకటనను ఈ ముఖ్యమైన పదాలతో పరిచయం చేశారు: “సత్యంగా చిత్రీకరించబడిన చాలా కుతర్కాలతో, ప్రమాణాలు మరియు విలువలకు సంబంధించి చాలా మోసాలతో, లోకపు మచ్చను నెమ్మదిగా తీసుకోవడానికి చాలా ఆకర్షణలు మరియు ప్రలోభాలతో … ఈ సంఘము యొక్క ప్రవక్తలు, దీర్ఘదర్శులు మరియు బయల్పాటుదారులు దాని చరిత్ర అంతటా పదే పదే చెప్పిన కుటుంబానికి సంబంధించిన ప్రమాణాలు, సిద్ధాంతాలు మరియు అభ్యాసాల గురించి మేము హెచ్చరించాలని మరియు ముందస్తుగా హెచ్చరించాలని భావించాము.”
ఆ తరువాత ఆయన ప్రకటనను పూర్తిగా చదివారు. ప్రభువు చెప్పినట్లుగా, “నా నోటి మాట ద్వారా గాని లేదా నా సేవకుల నోటి మాట ద్వారా గాని చెప్పునది ఒక్కటే.”
“కుటుంబము దేవునిచేత నియమించబడినది” అని ప్రకటన చెబుతోంది. ఆ ప్రకటనలోని స్పష్టత నాకు చాలా నచ్చింది. మనలోని దైవత్వాన్ని, మన ముందున్న నిత్య భవిష్యత్తును ఎల్లప్పుడూ గుర్తుంచుకుని, మర్త్యత్వంలో జీవించడానికి ఈ ప్రకటన మనకొక పిలుపు వంటిది. అధ్యక్షులు నెల్సన్ ఇలా బోధించారు: “మీరు అక్షరాలా దేవుని ఆత్మీయ సంతానము. … “దాని గురించి తప్పుగా భావించవద్దు: మీ సామర్థ్యం దైవికమైనది. మీరు శ్రద్ధగా వెదికినప్పుడు, మీరు ఏమి కాగలరనే క్షణ దర్శనాన్ని దేవుడు మీకు ఇస్తారు.”
ఆ ప్రకటనను సమర్పించినప్పుడు, ప్రపంచంలోని చాలామంది అభిప్రాయాలతో అది ఏకీభవించలేదు. అప్పుడూ ఏకీభవించలేదు. ఇప్పుడూ ఏకీభవించలేదు. కుటుంబం, వివాహం మరియు లింగంపై ప్రకటన గురించి కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సంఘము ఆ ప్రకటనను వెనక్కి తీసుకోవాలని, సవరించాలని లేదా పక్కన పెట్టాలని కొందరు సూచిస్తున్నారు.
సహోదర సహోదరీలారా, కుటుంబంపై ఈ ప్రకటన, అధ్యక్షులు హింక్లీ చెప్పినట్లుగా, సిద్ధాంతము. సూత్రాలు తప్పుగా అమర్చబడలేదు, కానీ ప్రభువు యొక్క విధానాలతో మరియు ఆయన నిబంధన మార్గంతో పూర్తి సమలేఖనంలో ఉన్నాయి. ప్రకటన యొక్క బోధనలు మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా అప్పుడు మరియు ఇప్పుడు ఆయన అపొస్తలులకు బయల్పరచబడ్డాయి. ఇది ఆయన సంఘము; మనం జీవించే సత్యాలను ఆయన స్థాపించారు.
మీలో కొందరు ఆ ప్రకటన గురించి ఆలోచించి ఇలా అనవచ్చు, “ఇది నా విషయంలో పని చేయడం లేదు.” “ఇది అసహానుభూతిగా అనిపిస్తుంది.” “నా కుటుంబం అలా కనిపించడం లేదు.” “నేను సరిపోను.”
ఆందోళనలు ఉన్నవారు, మీరు పరలోక తల్లిదండ్రుల బిడ్డ అని, మీ పరలోక తండ్రి కుటుంబంలో భాగమని తెలుసుకోండి. ఆయన కంటే ఎక్కువగా ఎవరికీ మీ గురించి బాగా తెలియదు లేదా ఎవరూ మీ గురించి శ్రద్ధ వహించరు. ఆయన వైపు తిరగండి, మీ హృదయాన్ని ఆయన ముందు కుమ్మరించండి, ఆయనను మరియు ఆయన వాగ్దానాలను నమ్మండి. మిమ్మల్ని ప్రేమించే మీ రక్షకుడైన యేసు క్రీస్తులో మీకు కుటుంబం ఉంది. మన పాపాలకు ప్రాయశ్చిత్తం చేయడానికి, మన తప్పులు మరియు చెడు సమయాల భారాన్ని మోయడానికి ఆయన భూమిపైకి వచ్చారు. మీరు ఏమి ఎదుర్కొంటున్నారో, ఏమి అనుభూతి చెందుతున్నారో ఆయన అర్థం చేసుకుంటారు. ఆయన వైపు తిరగండి, మీతో ఉండడానికి, మిమ్మల్ని ఉద్ధరించడానికి మరియు మిమ్మల్ని నడిపించడానికి ఆయన పరిశుద్ధాత్మను పంపుతారని నమ్మండి. వారి ప్రేమను అనుభూతి చెందండి, “అది తననుతాను నరుల సంతానము యొక్క హృదయముల యందు చిందించుకొనుచున్నది; … అది అన్ని వస్తువులను మించి మిక్కిలి కోరదగినది … ఆత్మకు మిక్కిలి ఆనందకరమైనది.”
ప్రభువు యొక్క అపొస్తలులందరూ మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తారు. మేము మీ కోసం ప్రార్థిస్తున్నాము మరియు మీ కోసం ప్రభువు యొక్క నడిపింపును కోరుకుంటున్నాము. మాతో ఉండండి. విరోధి మిమ్మల్ని తన వారిగా చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న సవాళ్ళు గల కాలంలో మీరు జీవిస్తున్నారు. మోసపోకండి. మీరు మోసపోతే, తిరిగి రండి. మిమ్మల్ని ప్రేమించే ఇతరుల చేతుల మాదిరిగానే మా చేతులూ మిమ్మల్ని చేరుకుంటాయి.
“తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రేమలో మరియు నిజాయితీలో పెంచుటకు పరిశుద్ధమైన బాధ్యతను కలిగియున్నారు,” అని ప్రకటన పేర్కొంటుంది. మోర్మన్ గ్రంథము ఈ సత్యానికి రెండవ సాక్ష్యాన్ని అందిస్తుంది. మొదటి అధ్యాయంలోని మొదటి వచనంలో, “మంచి తల్లిదండ్రులకు జన్మించిన నీఫై అను నేను” అని మనం చదువుతాము. మనలో ఎంతమంది మోర్మన్ గ్రంథాన్ని చదవనారంభించాము—మళ్ళీ మళ్ళీ ప్రారంభించాము—మరియు ఆ ప్రక్రియలో ఆ మాటలను జ్ఞాపకం చేసుకున్నాము? వాటిని కంఠస్థం చేసాము.
ప్రకటనలో నాకు ఇష్టమైన వ్యాఖ్యలలో ఇది ఒకటి: “ … యేసు క్రీస్తు యొక్క బోధనలపై పునాది వేయబడిన కుటుంబ జీవితములో సంతోషము మరింత అధికముగా పొందబడును.”
ఆనందంగా ఉండాలని ఎవరు కోరుకోరు?
యేసు క్రీస్తు యొక్క బోధనలు ఏవి? మళ్ళీ, ప్రకటనలో: “విశ్వాసం, ప్రార్థన, పశ్చాత్తాపము, క్షమాపణ, గౌరవము, ప్రేమ, దయ, పని మరియు ఆరోగ్యకరములైన, మనోరంజకములైన కార్యక్రమములు.”
ఈ కీలక సూత్రాలను వర్తింపజేయడం ద్వారా ఎవరి జీవితం మెరుగ్గా ఉండదు? మనలో ఎవరూ పరిపూర్ణంగా చేయలేరు; కానీ, “మీరు చేయగలిగినంత ఉత్తమంగా చేయండి” అనే అధ్యక్షులు హింక్లీ గారి తెలివైన మాటలను మనం అనుసరించవచ్చు.
“తండ్రులు ప్రేమ మరియు నీతితో వారి కుటుంబములపై అధ్యక్షత్వం వహించాలి,” మరియు “తల్లులు వారి పిల్లల పోషణకు ప్రాథమికముగా బాధ్యులు” అని ప్రకటనలో మనం చదువుతాము. అధ్యక్షత్వం వహించడం అంటే ఆధిపత్యం చెలాయించడం కాదు మరియు పోషణ అంటే అప్రధానమైనది కాదు. భిన్నమైనప్పటికీ దేవుడు స్త్రీ పురుషులకు ఒకరినొకరు పూరించే సమానమైన మరియు ముఖ్యమైన పాత్రలను ఇచ్చారు.
ఒక వ్యక్తిగత కథను మీతో పంచుకోవాలనుకుంటున్నాను.
ఒకరోజు నేను నా భార్యను సంప్రదించకుండా ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించుకున్న తర్వాత, ఆమె మరియు నేను సమాన భాగస్వాములుగా ఉండి బాగా పని చేయడం నేర్చుకున్నాము. నేను చేసిన పని ఆమెను ఆశ్చర్యపరిచింది, ఆమెను కలవరపెట్టింది మరియు ఆమెను చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంచింది. తర్వాత, ఆమె నా భుజంపై చేయి వేసి, “రాన్, దయచేసి, ఇంకెప్పుడూ నాతో అలా ప్రవర్తించకు” అని గట్టిగా చెప్పింది. అప్పటి నుండి మేము ఒకరితోఒకరం కలిసి పనిచేస్తున్నాము.
కుటుంబ ప్రకటనలో మనమిలా కనుగొంటాము: “తండ్రులు మరియు తల్లులు సమాన భాగస్థులుగా ఒకరికొకరు సహాయము చేసుకొనుటకు బద్ధులైయున్నారు.”
సమానం అనేది ముఖ్యమైన పదం. గత కొన్ని సంవత్సరాలుగా సహోదరి రాస్బాండ్ మరియు నేను, “మన పవిత్ర బాధ్యతలు” అని ప్రకటనలో వర్ణించిన దానిపై కలిసి పనిచేస్తూ, సమాన బాధ్యత గల వివాహాన్ని రూపొందించుకున్నాము. మా పిల్లలందరూ ఇప్పుడు వివాహం చేసుకున్నారు కాబట్టి, సహోదరి రాస్బాండ్ మరియు నేను, వారికి మరియు వారి జీవిత భాగస్వాములకు సమాన భాగస్వాములుగా ఎలా ఉండాలనే సలహా ఇస్తూనే ఉన్నాము.
మనం దేవుని మహిమయే లక్ష్యంగా జీవించినప్పుడు, మనం ఒకరినొకరు గౌరవించుకుంటాము మరియు ఒకరికొకరు మద్దతిస్తాము. నీతి యొక్క ఆ దైవిక నమూనాలు మన వ్యక్తిగత జీవితాలలో, మన కుటుంబాలలో మరియు సమాజంలో స్థిరత్వానికి దారితీస్తాయి.
మన పరలోక తండ్రి ఆయన వద్దకు మనల్ని నడిపించడంలో సహాయపడడానికి, నేర్చుకోవడంలో మరియు ప్రేమ, బలము, ఉద్దేశ్యము మరియు శాశ్వత అవగాహనతో నింపబడడంలో మనకు సహాయపడడానికి కుటుంబం గురించి ప్రకటనను అందించారు. ఆయనకు మరియు ఆయన ప్రియ కుమారునికి దగ్గరగా జీవించమని నా పూర్ణ హృదయంతో నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. మీరు అలా చేస్తున్నప్పుడు, ఆత్మ మిమ్మల్ని ప్రేరేపిస్తారని, నడిపిస్తారని మరియు “సమస్త జ్ఞానమునకు మించిన” వారి వాగ్దాన శాంతిని మీ హృదయంలో అనుభూతి చెందడానికి మీకు సహాయపడతారని నేను వాగ్దానం చేస్తున్నాను. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.