సర్వసభ్య సమావేశము
మంచి వార్తల తయారీ విధానం
2025 అక్టోబరు సర్వసభ్య సమావేశము


10:39

మంచి వార్తల తయారీ విధానం

యేసు క్రీస్తును మీ జీవితంలోనికి ఎక్కువగా చేర్చడం ఎలా ఉంటుంది?

మీరు ఎప్పుడైనా నా స్వంత రాష్ట్రం లూసియానాని దర్శించి ఉంటే, మీకు మా రుచికరమైన వంటకాలు చాలా తెలిసి ఉండవచ్చు—గంబో, జంబాలయ, ఎటౌపి మరియు ఇంకా అనేకమైన రుచికరమైన వంటకాలున్నాయి.

అప్పుడప్పుడు, ఆ రుచికరమైన వంటకాలలో ఒక దానిని వండడానికి నాకు తగినంత ధైర్యమున్నట్లు అనిపిస్తుంది. అన్ని పదార్థాలను కలిపి, వివరణాత్మక సూచనలను అనుసరించిన తర్వాత నమోదుకాని చివరి దశ ఏమిటంటే, రుచిని పరీక్షించి ఏదైనా లోపించిందేమో చూడడం. ఆ సమయంలో, క్రియోల్ వంట నిపుణులు “దానిలో టోనీస్ (Tony’s) ఎక్కువగా వెయ్యి” అని నా చెవులలో గుసగుసలాడడం నాకు వినిపిస్తుంది. టోనీస్ (Tony’s) అనేది నా స్వస్థలమైన లూసియానాలోని ఒపెలోసాస్‌లో తయారు చేయబడిన ఒక క్రియోల్ మసాలా. తయారీ విధానాన్ని అనుసరించినప్పుడు చేయబడిన లోపాలను భర్తీ చేయడానికి “రహస్య పదార్థంగా” అది తరచుగా ఉపయోగించబడింది.

నా భార్య, మిఛెల్ మరియు నాకు లూసియానాలో మిషను నాయకులుగా పనిచేసే గౌరవం దక్కింది. సువార్తికులు వారి కుటుంబాలకు తిరిగి వెళ్ళే ముందు, మిషను ఇంటిలో వారి చివరి రాత్రి, ఆమె ప్రత్యేక జాంబలయ వంటకాన్ని ఎలా వండాలో నేర్పించే సంప్రదాయాన్ని మేము కలిగి ఉన్నాము. యేసు క్రీస్తు యొక్క పునఃస్థాపించబడిన సువార్త గురించి వారి సాక్ష్యములకు అదనంగా, మా సువార్తికులు తయారీ విధానాల పట్ల ప్రశంసతో మిషనును విడిచి వెళ్ళేవారు.

కొన్ని నెలల క్రితం, నేను సంఘ మీడియా గ్రంథాలయం ద్వారా బ్రౌజింగ్ చేస్తూ, Restoration Conversations with President Russell M. Nelson (అధ్యక్షులు నెల్సన్‌తో పునఃస్థాపన సంభాషణలు) అని పిలువబడిన చిన్న వీడియోల సేకరణకు లింకును చూసాను. చిన్న వీడియోలలో ఒక దాని శీర్షిక నా దృష్టిని ఆకర్షించింది మరియు నాకు చిరునవ్వు తెప్పించింది. అది “Scriptures Are God’s Recipes for Happy Living (లేఖనాలు సంతోషంగా జీవించడానికి దేవుని యొక్క తయారీ విధానాలు)” అని పిలువబడింది. వెంటనే నేను ఆ రెండు నిముషాల వీడియోపై క్లిక్ చేసాను మరియు సంతోషంగా ఎలా ఉండాలనే దానిపై ప్రాథమిక పిల్లల గుంపుకు అధ్యక్షులు నెల్సన్ ఒక సరళమైన, శక్తివంతమైన సందేశాన్ని బోధించడాన్ని చూసాను. ఆయన ఇలా బోధించారు: “మీరు ఒక కేకు తయారు చేస్తుంటే, సూచనలు అనుసరిస్తారు కదా, అవునా? ప్రతీసారి మీకు మంచి ఫలితం వస్తుంది, అవునా”?

త్వరలో 95 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం గురించి మాట్లాడుతూ, ఆయన ఇలా కొనసాగించారు: “‘మీరేమి తింటారు? మీ రహస్యమేమిటి?’ అని జనులు అడుగుతారు. “ఆ రహస్యం పేరు లేఖనాలు.” మీరు వాటిని చదవవచ్చు మరియు వాటిని ప్రయత్నించవచ్చు” అని ఆయన జవాబిచ్చారు.

అవును, సంతోషంగా జీవించడానికి రహస్యము ఇదే. సంతోషంగా జీవించడానికి రహస్యము, లేఖనాలలో వివరించబడినట్లుగా దేవుని యొక్క తయారీ విధానాన్ని అనుసరించుట మాత్రమే. నేను దానిని “మంచి వార్తల తయారీ విధానము” అని పిలుస్తాను.

తయారీ విధానాన్ని అనుసరించినప్పుడు ఏదైనా తప్పు జరిగితే మీరు ఏమి చేస్తారు? సరే, చివరి దశలో మంచి వార్తల తయారీ విధానములో పొందుపరచిన “రహస్య పదార్థాన్ని” ఎప్పుడూ సరైన మోతాదులో ఉపయోగించేలా మీరు చూస్తారు. జవాబు ఎల్లప్పుడూ యేసు క్రీస్తే.

మన పదార్థాలు తగినంత మంచిగా లేవని లేదా మనం సూచనలు అనుసరించడంలో విఫలమయ్యామని లేదా మనం సరైన క్రమంలో చేయలేదని లేదా మనం నియత్రించలేనిది ఏదైనా జరిగిందని మనం భావించే సమయాలను మనమందరం కలిగియుంటామని నేను అనుకుంటున్నాను.

దీనికి నివారణ ఏమిటి? కేవలము మీ జీవితంలోనికి యేసు క్రీస్తును ఆహ్వానించే వాటిని ఎక్కువగా చేర్చడమే.

కాబట్టి, యేసు క్రీస్తును మీ జీవితంలోనికి ఎక్కువగా చేర్చడం ఎలా ఉంటుంది?

మిషను అధ్యక్షునిగా సేవ చేస్తున్నప్పుడు, ప్రతి ఆరు వారాలకు ఒకసారి మా యువ సువార్తికులలో ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా కలిసే ఆనందం నాకు కలిగింది. ముఖాముఖి సమావేశంలో, సువార్తికులు తమ సహవాస ప్రభావాన్ని ఎలా మెరుగుపరచుకోవాలనే దానిపై నడిపింపును కోరడం సర్వసాధారణమైనది.

ఒక సందర్భములో, ఒక సువార్తికుడు తన వ్యక్తిగత సంభాషణకు వచ్చి, కూర్చున్నాడు. అతని శారీరక భాషను బట్టి అతని మనస్సులో ఏదో భారం ఉందని నేను అర్థం చేసుకోగలను. “ఎల్డర్, ఈరోజు నీవేమి చర్చించాలని కోరుతున్నావు?” అని నేను అడిగాను. అతడు తన సహవాసితో కలుగుతున్న సమస్యలలో కొన్నిటిని మరియు సువార్త పని చేయడానికి వారి సామర్థ్యాన్ని అది ఎలా ప్రభావితం చేస్తుందో వివరించసాగాడు. తన కళ్ళలో కన్నీళ్ళతో, అతడు నా వైపు చూసి అడిగాడు, “అధ్యక్షా, నేను ఏమి చేయాలి?”

నిజాయితీగా చెప్పాలంటే, ఆ సందర్భంలో నేను ఎలా స్పందించాలో నాకు తెలియలేదు. కొద్దిసేపటి తరువాత, నేను ఆత్మ నుండి నడిపింపు కోసం కలిసి మోకరించి, ప్రార్థన చేద్దామా అని అతడిని అడిగాను. అతడు అంగీకరించాడు మరియు మేము కలిసి మోకరించి, ప్రేరేపణ కోసం ప్రార్థన చేసాము.

ప్రార్థన తరువాత, మేము కొంత సేపు మోకరించాము మరియు ఆ తరువాత ఒకరికొకరు ఎదురుగా మా కుర్చీలలో కూర్చున్నాము. మనం లేఖనాలు కలిసి చదువుదామా అని నేను అతడిని అడిగాను. మేము మా లేఖనాలు తెరిచినప్పుడు, నేను నిదానించి, అతడిని అడిగాను, “ఎల్డర్, ఈ లేఖనాన్ని మనం చదివినప్పుడు, దయచేసి క్రింది విధంగా నిన్ను నీవు ప్రశ్నించుకో: నేను ఈ లక్షణాలను జీవించిన యెడల, అది నా సహవాసమును మరియు మా సువార్త పరిచర్యను మెరుగుపరుస్తుందా?”

తరువాత మేము మొరోనై 7:45 తెరిచాము మరియు బిగ్గరగా చదివాము: “దాతృత్వము దీర్ఘకాలము సహించును, దయ చూపించును, మత్సరపడదు, ఉప్పొంగదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటికి తాళుకొనును, అన్నిటిని నమ్మును, అన్నిటిని నిరీక్షించును, అన్నిటిని ఓర్చును.”

అప్పుడు ఆ ఎల్డర్ తన కళ్ళలో కన్నీళ్ళతో నావైపు చూసి, ఇలా అన్నాడు, “అవును, అధ్యక్షా, కానీ అది చేయడం కష్టమైనది.” నేను అంగీకరించాను మరియు అతడు దేవుని కుమారుడని, ప్రభువుతో కలిసి దానిని చేయడానికి దైవిక సామర్థ్యాన్ని కలిగియున్నాడని అతనికి గుర్తు చేసాను.

తరువాత మేము డెబ్బది యొక్క ఎల్డర్ క్లార్క్ జి. గిల్బర్ట్ చేత బోధించబడిన వాలు ఉపమానమును క్లుప్తంగా చర్చించాము, అది మేము ఉన్న చోటు నుండి ప్రారంభించి, ప్రభువుతో కలిసి సానుకూల దిశలో ముందుకు, పైకి వెళ్ళాలని గుర్తు చేసింది. తరువాత చేయబోయే దానితో అతడు ముంచివేయబడుతున్నట్లు భావిస్తున్నాడని నేను చెప్పగలను, అందుచేత నేను అతడిని, “చిన్న మరియు సాధారణమైన విషయముల ద్వారా గొప్ప క్రియలు జరిగించబడును” అన్న లేఖనం గురించి అతను అర్థం చేసుకున్న దానిని వివరించమని అడిగాను. చిన్న మరియు సాధారణమైన విషయముల ద్వారా గొప్ప క్రియలు జరిగించబడతాయనే భావనను అతడు వివరించాడు. కాస్త సమయం తీసుకొని తన సహవాసి పట్ల దయ కలిగియుండడానికి అతను చేయగల రెండు చిన్న మరియు సాధారణమైన విషయాలను గుర్తించమని నేను అతడిని అడిగాను.

కొన్ని క్షణాల తరువాత, అతడు తన ఆలోచనలను పంచుకున్నాడు. మళ్ళీ కాస్త సమయం తీసుకొని తన సహవాసిపట్ల ఓపికగా ఉండడానికి అతను చేయగల రెండు చిన్న మరియు సాధారణమైన విషయాలను గుర్తించమని నేను అతడిని అడిగాను. అతడు దాదాపుగా వెంటనే రెండు ఆలోచనలు పంచుకున్నాడు. మా సమావేశానికి ముందే అతడు దీని గురించి లోతుగా ఆలోచిస్తున్నాడని స్పష్టమైంది. ఆ కొన్ని విషయాలను ప్రార్థనలో దేవుని వద్దకు తీసుకువెళ్ళమని మరియు తన ప్రణాళికను ఎలా అమలు చేయాలనే దానిపై నిర్ధారణ, నిర్దేశము మరియు ప్రేరేపణ కొరకు నిజమైన ఉద్దేశముతో అడగమని నేను అతడిని ఆహ్వానించాను. అతడు అంగీకరించాడు. మేము ముగించినప్పుడు, అతడి వారాంతపు లేఖలో క్లుప్తంగా విషయాలు తెలియజేయమని నేను అతడిని అడిగాను.

కొన్ని వారాలు గడిచినప్పుడు, అతని వారాంతపు లేఖలలో విషయాలు మెరుగుపడడాన్ని నేను చూడగలిగాను. ఆ మెరుగుదలను నేను అతడి వారాంతపు లేఖలలో చూడడం మాత్రమే కాదు, కానీ అతడి సహవాసి యొక్క లేఖలలో కూడా చూడగలిగాను. మా తదుపరి వ్యక్తిగత ముఖాముఖిలో, అతడి ముఖంలో, ఆత్మలో చాలా ముఖ్యమైన మార్పును నేను చూసాను. “కాబట్టి, ఎల్డర్, దాతృత్వము ఎన్నటికీ విఫలము కాదు అనేది నిజమేనా?” అని నేను అతడిని అడిగాను. అతడు పెద్ద చిరునవ్వుతో జవాబిచ్చాడు, “అవును, చిన్న మరియు సాధారణమైన విషయముల ద్వారా గొప్ప క్రియలు జరిగించబడును.”

సంతోషమైన జీవితం కోసం మంచి వార్తల తయారీ విధానాన్ని మీరు అనుసరించినప్పుడు, అధ్యక్షులు నెల్సన్ బోధనను గుర్తుంచుకోండి: “మీకు ఎటువంటి ప్రశ్నలు లేదా సమస్యలున్నా, జవాబు ఎల్లప్పుడు యేసు క్రీస్తు యొక్క జీవితం మరియు బోధనలలో కనుగొనబడుతుంది. ఆయన ప్రాయశ్చిత్తము, ఆయన ప్రేమ, ఆయన కనికరము, ఆయన సిద్ధాంతము మరియు స్వస్థత, పురోగతి యొక్క పునస్థాపించబడిన ఆయన సువార్త గురించి మరింత నేర్చుకోండి. ఆయన వైపు తిరగండి! ఆయనను అనుసరించండి!”

మీరు “ఆయనను ఆలకించవలసిన” మరియు యేసు క్రీస్తును మీ జీవితంలోనికి ఎలా ఆహ్వానించాలో తెలుసుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు, వ్యక్తిగత బయల్పాటు గురించి అధ్యక్షులు నెల్సన్ మనకు బోధించిన క్రింది దశలను పరిగణించండి:

“మీరు క్రమంగా వెళ్ళగల నిశ్శబ్దమైన ప్రదేశాన్ని కనుగొనండి. దేవుని యెదుట మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. మీ పరలోక తండ్రి వద్ద మీ హృదయమును క్రుమ్మరించండి. జవాబుల కొరకు, ఓదార్పు కొరకు ఆయన వైపు తిరగండి.

“మీ చింతనలు, మీ భయాలు, మీ బలహీనతలు—అవును, మీ హృదయ వాంఛలన్నిటిని గూర్చి యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేయండి. ఆ తరువాత వినండి! మీ మనస్సులో వచ్చిన ఆలోచనలను వ్రాయండి. మీ భావాలను వ్రాయండి, మీరు తీసుకోవాలని ప్రేరేపించబడిన చర్యలతో వాటన్నిటిని అనుసరించండి. ఈ ప్రక్రియను మీరు ప్రతి దినము, ప్రతి నెల, ప్రతి సంవత్సరం పునరావృతం చేసిన యెడల మీరు ‘బయల్పాటు నియమంలో ఎదుగుతారు.’”

యేసు క్రీస్తు మన రక్షకుడు మరియు విమోచకుడని నేను సాక్ష్యమిస్తున్నాను. ఆయన “మనం [మన] పరలోక తండ్రి వద్దకు తిరిగి వెళ్ళడానికి అవసరమైన సమస్తమును నెరవేర్చారు.” యేసు క్రీస్తు నామములో, ఆమేన్.