సర్వసభ్య సమావేశము
క్రీస్తు ఎడలనున్న సరళత
2025 అక్టోబరు సర్వసభ్య సమావేశము


11:18

క్రీస్తు ఎడలనున్న సరళత

క్రీస్తు యొక్క సిద్ధాంతాన్ని సరళీకృతమైన మరియు కేంద్రీకృతమైన రీతిలో అన్వయించడం మన దైనందిన జీవితంలో ఆనందాన్ని కనుగొనడానికి మనకు సహాయపడుతుంది.

1. పరిచయం

ముప్పై మూడు సంవత్సరాల క్రితం, యూటా ఓగ్డెన్ మిషనులో సువార్తికునిగా సేవ చేయడానికి నాకు పిలుపు వచ్చింది. అయితే, నేను యూరప్ నుండి వస్తున్నాను కాబట్టి, “క్యారెట్‌లతో ఆకుపచ్చ జెల్-ఓ” మరియు “అంత్యక్రియల బంగాళాదుంపలు” వంటి కొన్ని స్థానిక యూటా సంప్రదాయాలు కొంచెం విచిత్రంగా అనిపించాయి!

అయినప్పటికీ, అనేకమంది పరిశుద్ధుల భక్తి మరియు శిష్యత్వం, సంఘ సమావేశాలకు హాజరయ్యే జనుల యొక్క అపారమైన సంఖ్య మరియు సంపూర్ణముగా పనిచేసే సంఘ కార్యక్రమాల స్థాయి నన్ను బాగా ఆకట్టుకున్నాయి. నా సువార్తసేవ ముగిసినప్పుడు, నేను అనుభవించిన ఆ ఆనందం మరియు నేను గమనించిన ఆధ్యాత్మిక బలం మరియు పరిపక్వత నా భవిష్యత్తు కుటుంబానికి కూడా అందుబాటులో ఉండేలా చూసుకోవాలనుకున్నాను. “చిరకాల పర్వతముల నీడలలో” నా జీవితాన్ని గడపడానికి త్వరగా తిరిగి రావాలని నేను నిశ్చయించుకున్నాను.

అయితే, ప్రభువు వేరే ప్రణాళికలను కలిగియున్నారు. నా స్వంత వార్డులో నా మొదటి ఆదివారం నాడు, తెలివైన నా బిషప్పు మా వార్డులో యువకుల అధ్యక్షుడిగా సేవచేయడానికి నన్ను పిలిచారు. ఈ అద్భుతమైన యువకుల సమూహానికి సేవ చేస్తున్నప్పుడు, క్రీస్తు శిష్యుడిగా ఉండడం వల్ల కలిగే ఆనందం, సంఘ సమావేశాల పరిమాణంతో లేదా కార్యక్రమాల స్థాయితో చాలా తక్కువ సంబంధం కలిగి ఉంటుందని నేను త్వరగా నేర్చుకున్నాను.

కాబట్టి, నేను నా అందమైన భార్య, మార్గరెట్‌ను వివాహం చేసుకున్నప్పుడు, మేము యూరప్‌లోనే ఉండి, మా స్వదేశమైన జర్మనీలో మా కుటుంబాన్ని పెంచాలని సంతోషంగా నిర్ణయించుకున్నాము. చాలా సంవత్సరాల క్రితం అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ బోధించిన దానిని మేము కలిసి చూసాము: “మనము అనుభవించు సంతోషము మన జీవితపు పరిస్థితులతో పెద్దగా సంబంధము కలిగిలేదు, కానీ మన జీవితాల దృష్టితో పూర్తి సంబంధము కలిగియున్నది.” మన జీవితాల యొక్క దృష్టి క్రీస్తు మరియు ఆయన సువార్త సందేశంపైన ఆధారపడి ఉన్నప్పుడు, మనం ఎక్కడ నివసిస్తున్నా శిష్యత్వం యొక్క పూర్తి ఆశీర్వాదాలను అనుభవించగలము.

2. క్రీస్తు ఎడలనున్న సరళత

ఏది ఏమైనప్పటికీ, విభిన్నమైన మరియు తరచుగా పరస్పర విరుద్ధమైన సందేశాలు మరియు అవసరాలతో ఎక్కువగా లౌకికమైన, సంక్లిష్టమైన మరియు గందరగోళంగా ఉన్న ప్రపంచంలో, మన నేత్రములకు అంధత్వం రాకుండా, మన హృదయాలు కఠినంగా మారకుండా చూసుకుంటూ, యేసు క్రీస్తు సువార్త యొక్క “స్పష్టమైన, ప్రశస్థమైన వాక్యములపై” మనం ఎలా దృష్టి కేంద్రీకరించగలము? గందరగోళ సమయంలో, “క్రీస్తు ఎడలనున్న సరళతపై” దృష్టి కేంద్రీకరించమని గుర్తుచేస్తూ అపొస్తలుడైన పౌలు కొరింథులోని పరిశుద్ధులకు గొప్ప సలహా ఇచ్చాడు.

క్రీస్తు యొక్క సిద్ధాంతము మరియు సువార్త నియమము ఎంత సరళమైనవి అంటే, చిన్న పిల్లలు కూడా వాటిని అర్థం చేసుకోగలరు. యేసు క్రీస్తునందు విశ్వాసముంచి, పశ్చాత్తాపపడి, బాప్తిస్మము పొంది, పరిశుద్ధాత్మ వరము ద్వారా పవిత్రపరచబడి, అంతము వరకు సహించుట ద్వారా మనం యేసు క్రీస్తు యొక్క విమోచన శక్తిని పొందగలము మరియు మన పరలోక తండ్రి మన కొరకు సిద్ధపరచిన అన్ని ఆధ్యాత్మిక ఆశీర్వాదాలను పొందగలము. అధ్యక్షులు నెల్సన్ ఈ ప్రయాణాన్ని చాలా అందంగా “నిబంధన మార్గంగా” మరియు “యేసు క్రీస్తు యొక్క భక్తిగల శిష్యులుగా” మారే ప్రక్రియగా వర్ణించారు.

ఈ సందేశం చాలా సరళంగా ఉంటే, క్రీస్తు యొక్క ధర్మశాస్త్రాన్ని పాటించడం మరియు ఆయన మాదిరిని అనుసరించడం ఎందుకు అంత సవాలుగా అనిపిస్తుంది? ప్రయత్నం లేదా శ్రద్ధ లేకుండా సులభంగా సాధించగలిగేది అని మనం సరళత్వమును తప్పుగా అర్థం చేసుకొనియుండవచ్చు. క్రీస్తును అనుసరించడానికి నిరంతర ప్రయత్నం మరియు నిరంతర మార్పు అవసరం. మనము “ప్రకృతి సంబంధియైన మనుష్యుని [విసర్జించి] … [చిన్నపిల్లవాని వలె మారాలి].” ఇందులో చిన్న పిల్లలు చేసే విధంగా, మనం “ప్రభువుపై నమ్మకముంచడం” మరియు సంక్లిష్టతను వీడడం కూడా ఉన్నాయి. క్రీస్తు యొక్క సిద్ధాంతాన్ని సరళీకృతమైన మరియు కేంద్రీకృతమైన రీతిలో అన్వయించడం మన దైనందిన జీవితంలో ఆనందాన్ని కనుగొనడానికి సహాయపడుతుంది, మన పిలుపులలో మార్గదర్శకత్వాన్ని ఇస్తుంది, జీవితంలోని అత్యంత సంక్లిష్టమైన ప్రశ్నలకు సమాధానమిస్తుంది మరియు మన అతిగొప్ప సవాళ్ళను ఎదుర్కోవడానికి శక్తిని అందిస్తుంది.

అయితే క్రీస్తు యొక్క శిష్యులుగా మన జీవితకాల ప్రయాణంలో ఈ సరళతను ఆచరణాత్మకంగా ఎలా అమలు చేయవచ్చు? రక్షకుడిని అనుసరించడానికి మనం ప్రయత్నిస్తున్నప్పుడు, “శుద్ధమైన సత్యం, శుద్ధమైన సిద్ధాంతం మరియు శుద్ధమైన బయల్పాటు” పై దృష్టి కేంద్రీకరించాలని అధ్యక్షులు నెల్సన్ మనకు గుర్తు చేశారు. “ప్రభువైన యేసు క్రీస్తు నన్ను ఏమి చేయమని కోరుతున్నారు?” అని క్రమం తప్పకుండా అడగడం విస్తారమైన నిర్దేశాన్ని బయల్పరుస్తుంది. ఆయన మాదిరిని అనుసరించడం వలన అనిశ్చితి గుండా సురక్షితమైన మార్గం లభిస్తుంది మరియు రోజురోజుకూ ప్రేమతో, మార్గదర్శకంగా ఉండే హస్తాన్ని పట్టుకోగలుగుతాము. ఆయనే సమాధానకర్తయగు అధిపతి మరియు మంచి కాపరి. ఆయనే మన ఆదరణకర్త మరియు విమోచకుడు. ఆయనే మన కోట మరియు ఆశ్రయదుర్గము. ఆయన ఒక స్నేహితుడు—మీ స్నేహితుడు మరియు నా స్నేహితుడు! దేవుణ్ణి ప్రేమించమని, ఆయన ఆజ్ఞలను పాటించమని మరియు మన పొరుగువారిని ప్రేమించమని ఆయన మనందరినీ ఆహ్వానిస్తున్నారు.

మనం ఆయన మాదిరిని అనుసరించాలని ఎంచుకొని, క్రీస్తునందు విశ్వాసంతో ముందుకు సాగి, ఆయన ప్రాయశ్చిత్త శక్తిని హత్తుకొని, మన నిబంధనలను గుర్తుంచుకున్నప్పుడు, ప్రేమ మన హృదయాలను నింపుతుంది, నిరీక్షణ మరియు స్వస్థత మన ఉత్సాహాన్ని పెంచుతుంది, చేదు మరియు దుఃఖం కృతజ్ఞతతో మరియు వాగ్దానం చేయబడిన ఆశీర్వాదాల కోసం వేచి ఉండడానికి సహనంతో భర్తీ చేయబడతాయి. కొన్నిసార్లు, అనారోగ్యకరమైన పరిస్థితి నుండి మనల్ని మనం దూరం చేసుకోవలసి రావచ్చు లేదా నిపుణుల సహాయాన్ని పొందవలసి రావచ్చు. అయితే ప్రతి సందర్భంలోనూ, సరళమైన సువార్త సూత్రాలను అన్వయించడమనేది ప్రభువు యొక్క మార్గంలో జీవితపు సవాళ్లను అధిగమించడంలో మనకు సహాయపడుతుంది.

ప్రార్థన, ఉపవాసం, లేఖన అధ్యయనం, అనుదిన పశ్చాత్తాపం, వారానికొకసారి సంస్కారంలో పాల్గొనడం మరియు క్రమం తప్పకుండా ప్రభువు మందిరములో ఆరాధించడం వంటి సాధారణ చర్యల నుండి మనం పొందే శక్తిని మనం కొన్నిసార్లు తక్కువ అంచనా వేస్తాము. కానీ మనం “ఏదైనా గొప్ప కార్యము చేయవలసిన” అవసరం లేదని గుర్తించి, స్వచ్ఛమైన మరియు సరళమైన సిద్ధాంతాన్ని అన్వయించడంపై దృష్టి కేంద్రీకరించినప్పుడు, అత్యంత సవాలుతో కూడిన పరిస్థితులలో కూడా మన కోసం సువార్త ఎలా “అద్భుతంగా పనిచేస్తుందో” చూడడం మనం ప్రారంభిస్తాము. మనం హృదయ వేదనను అనుభవించినప్పుడు కూడా, మనం శక్తిని మరియు “దేవుని సముఖములో ఆత్మస్థైర్యాన్ని” కనుగొంటాము. “సమాధానము, ఆనందము, సంతోషాలను ఆ సరళత్వములోనే … [మనం] కనుగొంటాము,” అని ఎల్డర్ ఎమ్. రస్సెల్ బాల్లర్డ్ మనకు చాలాసార్లు గుర్తు చేశారు.

క్రీస్తు ఎడలనున్న సరళతను అన్వయించుకోవడం అనేది మనం ప్రక్రియల కంటే ప్రజలకు మరియు స్వల్పకాలిక ప్రవర్తనల కంటే నిత్య సంబంధాలకు ప్రాధాన్యత ఇచ్చేలా చేస్తుంది. మన పరిచర్యను నిర్వహించడంలో చిక్కుకునే బదులు దేవుని యొక్క రక్షణ మరియు ఉన్నతస్థితి యొక్క కార్యములో “అతి ముఖ్యమైన విషయాలపై” మనం దృష్టి పెడతాము. మనం చేయలేని పనుల భారాన్ని భరించకుండా, చేయగలిగిన పనులకు ప్రాధాన్యత ఇవ్వడానికి మనల్ని మనం స్వేచ్ఛగా చేసుకుంటాము. ప్రభువు మనకు ఇలా గుర్తు చేశారు: “కాబట్టి, మంచి చేయుట యందు విసుగులేకయుండుడి, ఏలయనగా మీరు ఒక గొప్ప కార్యమునకు పునాది వేయుచున్నారు. మరియు చిన్నవిషయముల నుండి గొప్ప సంగతులు సంభవించును.” మన పరిస్థితులు ఏవైనప్పటికీ, సరళత్వముతో మరియు వినయముతో వ్యవహరించడానికి ఎంతటి శక్తివంతమైన ప్రోత్సాహం.

3. ఓమా శాస్లా

“చిన్న మరియు సాధారణమైన విషయముల” ద్వారా గొప్ప క్రియలు సాధించడంలో మా నానమ్మ మార్తా శాస్లా ఒక అద్భుతమైన ఉదాహరణ. మేము ఆమెను ప్రేమగా ఓమా శాస్లా అని పిలుస్తాము. 1926, మే 30న తూర్పు ప్రష్యాలోని సెల్బోంగెన్ అనే చిన్న గ్రామంలో ఓమా మా ముత్తవ్వతో కలిసి సువార్తను స్వీకరించారు.

ఎల్డర్ శాస్లా గారి నానమ్మ (కుడి)

ఆమె బాప్తిస్మము రోజున మార్తా శాస్లా (కుడి).

ఆమె ప్రభువును, ఆయన సువార్తను ప్రేమించింది మరియు ఆమె చేసిన నిబంధనలను పాటించాలని నిశ్చయించుకుంది. 1930లో ఆమె మా తాతను వివాహం చేసుకుంది, ఆయన సంఘ సభ్యుడు కాదు. ఈ సమయంలో సంఘ సమావేశాలకు హాజరుకావడం ఓమాకు అసాధ్యంగా మారింది, ఎందుకంటే మా తాతగారి పొలం, సమీపంలోని సంఘానికి చాలా దూరంలో ఉంది. అయితే ఆమె ఏం చేయగలదో దానిపైనే దృష్టి పెట్టింది. ఓమా ప్రార్థన చేయడం, లేఖనాలు చదవడం, సీయోను పాటలను పాడడాన్ని కొనసాగిస్తూ ఉండేది.

ఆమె తన విశ్వాసంలో చురుకుగా లేదని కొంతమంది భావించి ఉండవచ్చు, కానీ అది అసత్యం. మా అత్త మరియు మా నాన్న పుట్టినప్పుడు, ఇంట్లో యాజకత్వం లేకున్నా మరియు సమీపంలోని సంఘ సమావేశాలకు లేదా విధులకు ప్రాప్యత లేకున్నా, ఆమె మళ్ళీ తాను చేయగలిగినదంతా చేసింది మరియు తన పిల్లలకు “ప్రార్థించుట, ప్రభువు యెదుట యథార్థముగా నడుచుకొనుటను” నేర్పించడంపై దృష్టి పెట్టింది. ఆమె ప్రతిరోజూ—వారికి లేఖనాలను చదివి వినిపించేది, వారితో కలిసి సీయోను పాటలను పాడేది మరియు వారితో కలిసి ప్రార్థించేది. 100 శాతం గృహ-కేంద్రీకృత సంఘ అనుభవం.

1945లో మా తాతగారు ఇంటికి దూరంగా యుద్ధంలో సేవ చేస్తున్నారు. శత్రువులు తమ పొలాన్ని సమీపించినప్పుడు, ఓమా తన ఇద్దరు చిన్న పిల్లలను తీసుకొని సురక్షితమైన స్థలంలో ఆశ్రయం పొందేందుకు తమ ప్రియమైన పొలాన్ని విడిచిపెట్టింది. కష్టతరమైన మరియు ప్రాణాంతకమైన ప్రయాణం తర్వాత, చివరకు 1945, మే లో వారు ఉత్తర జర్మనీలో ఆశ్రయం పొందారు. వారి ఒంటిపై ఉన్న బట్టలు తప్ప మరేమీ వారికి మిగలలేదు. కానీ ఓమా తాను చేయగలిగిన దానితో కొనసాగింది: ఆమె తన పిల్లలతో కలిసి ప్రార్థించింది—ప్రతిరోజూ. మరియు ఆమె హృదయపూర్వకంగా కంఠస్థం చేసిన సీయోను పాటలను వారితో కలిసి పాడింది—ప్రతిరోజూ.

జీవితం చాలా కష్టంగా ఉండేది మరియు చాలా సంవత్సరాలు వారు తినడానికి తగినంత ఆహారం ఉండేలా చూసుకోవడంపైనే దృష్టి పెట్టారు. కానీ 1955లో, అప్పటికి 17 ఏళ్ల మా నాన్న, రెండ్స్‌బర్గ్ నగరంలో వర్తక పాఠశాలకు వెళ్తున్నారు. ఆయన ఒక భవనం దగ్గరగా నడుస్తూ, బయట, “కిర్చ్ జేసు క్రిస్టీ డెర్ హైలేగన్ డెర్ లెస్టెన్ టియేజియి”—“యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము” అని వ్రాసి ఉన్న ఒక చిన్న బోర్డును చూశారు. ఆయన ఇలా అనుకున్నారు, “ఇది ఆసక్తికరంగా ఉంది; ఇది అమ్మ యొక్క సంఘము.” కాబట్టి, ఆయన ఇంటికి వచ్చినప్పుడు, ఆమె సంఘాన్ని కనుగొన్నానని ఓమాతో చెప్పారు.

దాదాపు 25 సంవత్సరాలుగా సంఘముతో ఏ సంబంధం లేకుండా ఉన్న తర్వాత ఆమెకు ఎలా అనిపించి ఉంటుందో మీరు ఊహించవచ్చు. తరువాతి ఆదివారం హాజరు కావాలని ఆమె నిశ్చయించుకుంది మరియు మా నాన్నగారిని తనతో పాటు రమ్మని ఒప్పించింది. వారు నివసించే చిన్న గ్రామం నుండి రెండ్స్‌బర్గ్ 20 మైళ్ల (32 కి.మీ)కంటే ఎక్కువ దూరంలో ఉంది. కానీ ఇది ఓమాను సంఘానికి వెళ్లకుండా ఆపలేదు. మరుసటి ఆదివారం, ఆమె మా నాన్నతో కలిసి తన సైకిల్‌పై ఎక్కి సంఘానికి వెళ్లింది.

సంస్కార కూడిక ప్రారంభమైనప్పుడు, మా నాన్నగారు అది త్వరలోనే ముగుస్తుందని ఆశించి చివరి వరుసలో కూర్చున్నారు. ఇది ఒమా యొక్క సంఘము, ఆయనది కాదు. ఆయన చూసినది అంత ప్రోత్సాహకరంగా లేదు: హాజరైన వారిలో కొంతమంది వృద్ధ మహిళలు మరియు సమావేశంలోని ప్రతిదాన్ని సమర్థవంతంగా నడిపిస్తున్న ఇద్దరు యువ సువార్తికులు మాత్రమే ఉన్నారు. కానీ అప్పుడు వారు పాడడం ప్రారంభించారు మరియు వారు మా నాన్న చిన్నప్పటి నుండి విన్న: “Come, Come, Ye Saints [కమ్, కమ్, యీ సేయింట్స్],” “O My Father [ఓ మై ఫాదర్],” “Praise to the Man [ప్రెయిజ్ టు ద మాన్]” అనే సీయోను పాటలను పాడారు. తనకు చిన్నప్పటి నుండి తెలిసిన సీయోను పాటలను ఈ చిన్న మంద పాడడం విన్నప్పుడు ఆయన మనస్సు భావోద్వేగానికి గురైంది మరియు ఎటువంటి సందేహం లేకుండా వెంటనే సంఘము నిజమని ఆయనకు తెలిసింది.

25 సంవత్సరాల తర్వాత మా నానమ్మ హాజరైన మొదటి సంస్కార కూడిక, యేసు క్రీస్తు యొక్క పునఃస్థాపించబడిన సువార్త యొక్క యథార్థత గురించి మా నాన్నకు వ్యక్తిగత నిర్ధారణ లభించిన కూడిక. మూడు వారాల తర్వాత, 1955, సెప్టెంబరు 25న, మా తాత మరియు మా అత్తతో కలిసి ఆయన బాప్తిస్మం తీసుకున్నారు.

రెండ్స్‌బర్గ్‌లో ఆ చిన్న సంస్కార కూడిక జరిగి ఇప్పటికి 70 సంవత్సరాలు పైబడింది. ఆ ఒంటరి రాత్రులలో ఆమె చేయగలిగిన చిన్న మరియు సాధారణ విషయాలైన ప్రార్థన చేయడం, లేఖనాలు చదవడం మరియు పాటలు పాడడం వంటి వాటిని చేయడానికి ఆమె ఎలా భావించి ఉంటుందో అని నేను ఓమా గురించి తరచుగా ఆలోచిస్తాను. నేను ఈరోజు ఇక్కడ సర్వసభ్య సమావేశములో నిలబడి మా ఓమా గురించి మాట్లాడుతున్నప్పుడు, ఆమెకు కష్టాలు ఉన్నప్పటికీ నిబంధనలను పాటించాలని మరియు ప్రభువుపై నమ్మకం ఉంచాలనే ఆమె సంకల్పం—ఆమె పట్ల మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన అద్భుతమైన పరిశుద్ధుల పట్ల నా హృదయాన్ని వినయం మరియు కృతజ్ఞతతో నింపుతుంది, వారు సవాలుతో కూడిన తమ పరిస్థితులలో క్రీస్తు ఎడలనున్న సరళతపై దృష్టి సారించి, ఇప్పుడు చిన్న మార్పును చూసినా, బహుశా భవిష్యత్తులో ఏదో ఒక రోజు గొప్ప విషయాలు జరుగుతాయని నమ్ముతున్నారు.

4. చిన్న మరియు సాధారణమైన విషయాలు

సువార్త యొక్క చిన్న మరియు సాధారణమైన విషయాలు మరియు విశ్వాసంతో క్రీస్తుపై దృష్టి కేంద్రీకరించడం మనల్ని నిజమైన ఆనందానికి నడిపిస్తుందని, శక్తివంతమైన అద్భుతాలను తీసుకువస్తుందని మరియు వాగ్దానం చేయబడిన అన్ని ఆశీర్వాదాలు నెరవేరుతాయనే నమ్మకాన్ని మనకు ఇస్తుందని నా స్వంత అనుభవం ద్వారా నేను నేర్చుకున్నాను. ఇది మీకు ఎంత సత్యమో నాకు అంతే సత్యము. ఎల్డర్ జెఫ్రీ ఆర్. హాలండ్ మాటల్లో చెప్పాలంటే, “కొన్ని దీవెనలు వెంటనే వస్తాయి, కొన్ని ఆలస్యంగా వస్తాయి, కొన్ని పరలోకములోకి వెళ్ళే వరకు రావు; కానీ యేసు క్రీస్తు సువార్తను హత్తుకొనువారికి, అవి వస్తాయి.” దీనిని గూర్చి నేను యేసు క్రీస్తు నామములో సాక్ష్యమిస్తున్నాను, ఆమేన్.