సర్వసభ్య సమావేశము
దేవునితో సమాధానపడుడి
2025 అక్టోబరు సర్వసభ్య సమావేశము


10:22

దేవునితో సమాధానపడుడి

యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తం ద్వారా దేవునితో సమాధానపడడం అచంచలమైన విశ్వాసానికి దారితీస్తుంది.

నేను లేఖనాలను అధ్యయనం చేస్తున్నప్పుడు, నా దృష్టిని ఆకర్షించే పదాలు నాకు కనిపిస్తాయి, ప్రధానంగా నా జీవితంలో నేను పొందిన అనుభవాల ఫలితంగా వాటికి ప్రత్యేక అర్థం ఉంది. వృత్తిపరంగా నేను ఫోరెన్సిక్ అకౌంటెంట్‌గా పనిచేశాను. ఆ నేపథ్యంతో, నేను లేఖనాలను చదివేటప్పుడు సమాధానపడు అనే పదం నా దృష్టిని ఆకర్షించింది. లెక్కలు చూడడం, ఖాతాల తనిఖీ మరియు పరిశోధనాత్మక నైపుణ్యాలను వర్తింపజేయడం ద్వారా నివేదించబడిన మొత్తాలను ఆర్థిక రికార్డులతో సమన్వయం చేయడం నా పని. మరో మాటలో చెప్పాలంటే, ఖచ్చితత్వం మరియు చెల్లుబాటును నిర్ధారించడానికి ఆర్థిక నివేదికలను అంతర్లీన ఆర్థిక పత్రాలతో సమలేఖనం చేయడం నా లక్ష్యం. వ్యత్యాసాలను పరిష్కరించడానికి నేను శ్రద్ధగా ప్రయత్నించాను మరియు చాలా చిన్న వ్యత్యాసాలను కూడా పరిష్కరించడానికి గణనీయమైన సమయం కేటాయించడం సర్వసాధారణం.

అపొస్తలుడైన పౌలు కొరింథీయులతో “దేవునితో సమాధానపడుడి” అని వేడుకున్నాడు. దేవునితో సమాధానపడడం అంటే దేవునితో తిరిగి సామరస్యంలోకి తేబడడం లేదా మన పాపాలు లేదా చర్యల వల్ల దేవునితో దెబ్బతిన్న లేదా తెగిపోయిన సంబంధాన్ని పునరుద్ధరించడం. సరళంగా చెప్పాలంటే, దేవునితో సమాధానపడడం అంటే మన చిత్తాన్ని మరియు చర్యలను దేవుని చిత్తంతో సమలేఖనం చేయడం లేదా అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ గారిచే బోధించబడినట్లుగా, మన జీవితాల్లో దేవునికి మిక్కిలి ప్రాధాన్యతనివ్వడం.

లేఖనాలలో బోధించినట్లుగా, “శాశ్వతమరణము యొక్క మార్గమును లేదా నిత్యజీవము యొక్క మార్గమును ఎంచుకొనుటకు” మనల్ని మనం నిర్వహించుకొనుటకు మనం స్వతంత్రులైయున్నాము. కానీ మనం శ్రద్ధగా లేకపోతే, మనల్ని మనం నిర్వహించుకోగలిగే ఈ స్వేచ్ఛ దేవుని చిత్తంతో సమలేఖనాన్ని కోల్పోవడానికి దారితీయవచ్చు.

మనం దేవునికి విరోధంగా ఉన్నప్పుడు లేదా సమలేఖనంగా లేనప్పుడు, మనం సయోధ్యను సాధించగల ఏకైక మార్గం “క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము ద్వారా [దేవునితో] సమాధానపడడం” అని ప్రవక్తయైన జేకబ్ బోధించాడు. సమాధానపడడం అనేది కనికరముపై ఆధారపడి ఉంటుందని మనం గ్రహించాలి, అంటే యేసు క్రీస్తు యొక్క కృపగల ప్రాయశ్చిత్త చర్య సమాధానపడడాన్ని సాధ్యం చేస్తుంది.

మీరు మీ స్వంత జీవితాన్ని గురించి ఆలోచిస్తున్నప్పుడు, మీరు పరలోక తండ్రి నుండి దూరంగా వెళ్ళినందున మీరు ఆయనకి దూరంగా ఉన్నట్లు భావించిన సమయం గురించి ఆలోచించండి. ఉదాహరణకు, మీరు ఆయనకు ప్రార్థన చేయడంలో లేదా ఆయన ఆజ్ఞలను పాటించడంలో బహుశా తక్కువ శ్రద్ధ చూపి ఉండవచ్చు. మనం దేవుని నుండి దూరం కావాలని ఎంచుకున్నట్లే, మనం తప్పకుండా సమాధానపడే ప్రయత్నాన్ని ప్రారంభించడానికి ఎంచుకోవాలి. ప్రభువు మన బాధ్యతను నొక్కిచెప్తూ ఇలా అన్నారు, “నా యొద్దకు రండి, నేను మీ యొద్దకు వచ్చెదను; శ్రద్ధతో నన్ను వెదకుడి, మీరు నన్ను కనుగొందురు; అడుగుడి, మీకు ఇవ్వబడును; తట్టుడి, మీకది తెరువబడును.”

ఈ ముఖ్యమైన సంబంధాన్ని పునరుద్ధరించడానికి మరియు సమాధానపడడానికి రక్షకుడు మనకు ఎలా సహాయం చేస్తారు? నా మట్టుకు, అధ్యక్షులు నెల్సన్ గారి సలహాను అనుసరించి ప్రతిరోజూ పశ్చాత్తాపపడినప్పుడు, దేవునితో సమాధానపడడానికి నా ప్రయాణంలో నేను గొప్ప పురోగతిని సాధిస్తాను. కారణం ఏమిటంటే, సమాధానపడడం అనేది పాపం యొక్క అడ్డంకిని తొలగించడం ద్వారా, ప్రత్యేకించి దేవుడు మరియు మానవాళి మధ్య విచ్ఛిన్నమైన సంబంధాన్ని పునరుద్ధరించడాన్ని సూచిస్తుంది.

లేఖనాలలో మనం చదివే గొప్ప సయోధ్యలలో ఒకటి ఈనస్ గురించినది. అతని జీవితంలో ఏదో దేవునితో సమలేఖనంలో లేదు. దేవునితో సమాధానపడేందుకు యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తంపై ఆధారపడడానికి అతను ఉదాహరణగా నిలిచాడు. పశ్చాత్తాపపడాలనే తన కోరిక, తన వినయం, తన దృష్టి మరియు తన దృఢ సంకల్పాన్ని అతను వివరించాడు. “ఈనస్, నీ పాపములు క్షమించబడినవి, నీవు ఆశీర్వదించబడుదువు” అని ఒక స్వరం అతనికి చెప్పినప్పుడు దేవునితో అతని సయోధ్య ధృవీకరించబడింది. “ఈనస్ అను నేను, దేవుడు అబద్ధమాడడని ఎరుగుదును; కావున నా అపరాధము తొలగించబడెను” అని ఈనస్ చెప్పినప్పుడు పశ్చాత్తాపం మరియు సమాధానపడడం అతనిపై చూపిన ప్రభావాన్ని అతను గుర్తించాడు.

సమాధానపడడం అపరాధ భావనల నుండి ఉపశమనాన్ని మాత్రమే కాకుండా మనలో మరియు ఇతరులతో శాంతిని కూడా తెస్తుంది. ఇది సంబంధాలను స్వస్థపరుస్తుంది, హృదయాలను మృదువుగా చేస్తుంది మరియు మన శిష్యత్వాన్ని బలపరుస్తుంది, దేవుని యెదుట నమ్మకాన్ని పెంచుతుంది. “ఈనస్ అను నేను ఈ మాటలను వినిన తరువాత ప్రభువునందు నా విశ్వాసము నిశ్చలమగుట మొదలాయెను,” అని ఈనస్ చెప్పినప్పుడు అతడు వర్ణించిన సయోధ్య యొక్క మరొక ఫలము నాకు గొప్ప నిరీక్షణను, నమ్మకాన్ని ఇస్తుంది.

నా చిన్నతనంలో, మా తాతగారికి పెద్ద చెర్రీ తోట ఉండేది. నాకు తోటలో పనిచేసే అవకాశం లభించింది, ఎక్కువగా వేసవిలో చెర్రీ పళ్ళు కోసే సమయంలో. చాలా చిన్న పిల్లవాడిగా, నా ప్రమేయం ఎంత అంటే ఒక బకెట్టు ఇవ్వబడడం, ఆపై చెర్రీలు కోయడానికి చెట్టు పైకి పంపబడడం.

మా తాతగారు చెర్రీ షేకర్ అనే యంత్రాన్ని కొనుగోలు చేసినప్పుడు చెర్రీల కోత గణనీయంగా మారిపోయింది. ఈ యంత్రం చెట్టు కాండాన్ని పట్టుకుని దానిని ఊపుతుంది, దాని వలన చెర్రీ పళ్ళు చెట్టు నుండి వాటిని సేకరించడానికి ఉపయోగించే వలలపై పడతాయి. షేకర్ చెట్టును ఊపడం ప్రారంభించినప్పుడు, దాదాపు చెర్రీ పళ్ళన్నీ క్షణాల్లో చెట్టు నుండి పడిపోవడాన్ని నేను గమనించాను. చెట్టును 10 సెకన్లు లేదా పూర్తి నిమిషం పాటు ఊపినా కూడా, కొన్ని చెర్రీలు పడిపోవని కూడా నేను గమనించాను. అవి నిజంగా కదిలించలేనివి.

ఎథిలీన్ విడుదల కావడం వల్ల చెట్టు నుండి చెర్రీలను రాల్చడం సాధ్యమవుతుంది. ఈ హార్మోను చెర్రీ కాడ మరియు చెట్టు మధ్య కణాల పొరను బలహీనపరుస్తుంది. అందువల్ల, బలహీనమైన సంబంధం కారణంగా పండిన చెర్రీ కాడ చెట్టు నుండి సులభంగా విడిపోతుంది.

లేఖనాలలో, యెష్షయి కాండము మెస్సీయ అయిన యేసు క్రీస్తుకు ఒక రూపకం అని మనం నేర్చుకుంటాము, ఆయన దావీదు రాజు తండ్రి అయిన యెష్షయి వంశం నుండి వస్తారని ప్రవచించబడింది. పండిన చెర్రీ కాడ యొక్క సంబంధాన్ని ఎథిలీన్ బలహీనపరచినట్లుగా, అవిధేయత, సందేహాలు మరియు భయాలు యెష్షయి కాండము లేదా యేసు క్రీస్తుతో మన సంబంధాన్ని బలహీనపరచగలవు, దాని వలన మనం సులభంగా కదిలించబడి ఆయన నుండి విడిపోయే అవకాశం ఉంటుంది. మనం ఎంత విశ్వాసులమైనప్పటికీ, యేసు క్రీస్తుతో మన సంబంధం బలహీనపడకుండా మనం జాగ్రత్త వహించాలి.

సిద్ధాంతము మరియు నిబంధనలలో, విశ్వాసులకు కూడా ఒక హెచ్చరిక ఇవ్వబడింది: “కానీ మనుష్యుడు కృపనుండి తొలగిపోయి, జీవముగల దేవుడిని విడిచిపోవు అవకాశము కలదు.” ప్రభువు ఇలా కొనసాగిస్తున్నారు, “అవును, … శుద్ధిచేయబడిన వారు కూడా జాగ్రత్తపడవలెను.” పడిపోకుండా ఉండడానికి, ప్రభువు ఇలా సలహా ఇస్తున్నారు, “కాబట్టి సంఘము జాగ్రత్తపడి, ఎల్లప్పుడు ప్రార్థించవలెను, లేనియెడల వారు శోధనలో పడిపోవుదురు.”

సులభంగా కదిలించబడే స్థితిని, లేఖనాలు వివరించిన విధంగా చర్యలకు రాబోయే పరిణామాలతో నాశనమునకు పరిపక్వమగుచున్న స్థితితో సమానం చేయవచ్చు. ఈ వాక్యభాగాన్ని మరింత విస్తృతంగా నాశనం, అవినీతి లేదా క్షీణ స్థితిని సూచించడానికి కూడా ఉపయోగించవచ్చు, ఇది ఏదైనా కూలిపోయేలా లేదా నాశనమయ్యేలా చేస్తుంది.

ఈ పరిపక్వత దేనిని సూచిస్తుంది? మనం మార్చబడలేని స్థితికి చేరుకోగలమని దీని అర్థమా? లేదు, మనం మారడానికి ఇష్టపడని సమయానికి చేరుకోగలమని దీనర్థం అని నేను అనుకుంటున్నాను. నాశనమునకు పరిపక్వమవ్వడానికి విరుగుడు ఏమిటంటే, యేసు క్రీస్తుతో మన సంబంధాన్ని బలోపేతం చేసే పనులను చేయడం. ఇంతకుముందు చెప్పినట్లుగా, పశ్చాత్తాపం ఈనస్‌ను అచంచలమైన విశ్వాసం యొక్క స్థాయికి నడిపించింది. పశ్చాత్తాపంలో—క్రమం తప్పకుండా, సత్వరమే మరియు తరచుగా పశ్చాత్తాపం చెందడంలో బలం ఉంది. అధ్యక్షులు నెల్సన్ మనకు బోధించినట్లుగా, “పశ్చాత్తాపము పైన క్రమం తప్పకుండా, అనుదినం కేంద్రీకృతం చెయ్యడము కంటే మరేది కూడా మిక్కిలి స్వేచ్ఛనిచ్చేది, ఘనత చేకూర్చేది లేదా మన వ్యక్తిగత అభివృద్ధికి మిక్కిలి ఆవశ్యకమైనది ఏదియు లేదు.”

పశ్చాత్తాపంతో పాటు, మన జీవితాల్లో దేవుని హస్తం గురించి తెలుసుకోవడం, బయల్పాటును వెదకడం మరియు పొందడం, దేవుడు మాట్లాడేటప్పుడు ఆయన మాట వినడం ఇవన్నీ మనం కదిలించబడకుండా ఉండడానికి సహాయపడతాయని ప్రవక్త జేకబ్ బోధించాడు. “అందువలన మేము ప్రవక్తల వ్రాతలను పరిశోధించుచున్నాము, మేము అనేక బయల్పాటులను, ప్రవచనాత్మను కలిగియున్నాము; ఈ సాక్ష్యములన్నిటినీ కలిగియుండి మేము ఒక నిరీక్షణను పొందితిమి మరియు మా విశ్వాసము నిశ్చలమాయెను,” అని కూడా జేకబ్ బోధించాడు. ప్రవక్తలు మరియు అపొస్తలుల మాటలను, ఆహ్వానాలను వినడం మరియు వాటిపై చర్య తీసుకోవడం మనల్ని నిరీక్షణ, విశ్వాసం మరియు బలంతో నింపగలదు, తత్ఫలితంగా మన విశ్వాసం నిశ్చలంగా మారుతుంది.

దేవునితో సమాధానపడాలనే కోరిక పశ్చాత్తాపపడాలనే కోరికతో కూడి ఉండాలని నేను నేర్చుకున్నాను. పశ్చాత్తాపపడడం మరియు యేసు క్రీస్తు ప్రాయశ్చిత్తం యొక్క ఆశీర్వాదాలను అనుభవించడం అనేది అచంచలమైన విశ్వాసానికి దారితీస్తుంది. అచంచలమైన విశ్వాసం ఎల్లప్పుడూ దేవునితో సమాధానపడాలనే కోరికకు దారితీస్తుంది. ఇది ఒక వృత్తాకార లేదా పునరావృత నమూనా.

సహోదర సహోదరీలారా, యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తం ద్వారా దేవునితో సమాధానపడమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. నిబంధనలు చేసి, పాటించడం రక్షకునితో మన సంబంధాన్ని బలంగా చేస్తుందని, తద్వారా నాశనానికి పరిపక్వమవ్వకుండా నివారిస్తుందని నేను సాక్ష్యమిస్తున్నాను. యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తం ద్వారా దేవునితో ఈ విధంగా సమాధానపడడం అచంచలమైన విశ్వాసానికి దారితీస్తుందని నేను సాక్ష్యమిస్తున్నాను.

పరలోక తండ్రి మిమ్మల్ని, నన్ను ప్రేమిస్తున్నారని నాకు తెలుసు మరియు ఆయన తన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తును మన రక్షకునిగా, విమోచకునిగా మరియు గొప్ప సమాధానకర్తగా పంపారు. నేను యేసు క్రీస్తు గురించి సాక్ష్యమిస్తున్నాను మరియు యేసు క్రీస్తు నామంలో అలా చేస్తున్నాను, ఆమేన్.