సర్వసభ్య సమావేశము
సాక్ష్యము యొక్క నిత్యమైన బహుమతి
2025 అక్టోబరు సర్వసభ్య సమావేశము


12:17

సాక్ష్యము యొక్క నిత్యమైన బహుమతి

దేవుని యొక్క ప్రతి కుమారుడు లేదా కుమార్తె తమకు తాముగా లోతైన, దృఢమైన మరియు ఖచ్చితమైన జ్ఞానాన్ని పొందగలరు.

నా ప్రియమైన సహోదర సహోదరీలారా, ఇటీవల నేను పునఃస్థాపన నుండి మూడు శక్తివంతమైన సత్యాల గురించి ఆలోచిస్తున్నాను. ఈ సత్యాలు నా జీవితాన్ని ఎంతో గొప్పగా దీవించాయి. ఈరోజు, యేసు క్రీస్తు సువార్తకు ఒక యదార్థమైన సాక్షిగా నా ప్రయాణంలో ఈ సత్యాలు నన్ను ఎలా నడిపించాయో మీతో పంచుకోవాలనుకుంటున్నాను.

1. దేవుడు మన ప్రియమైన పరలోక తండ్రి

ఆయన సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు. క్రీస్తు యొక్క వెలుగు ద్వారా మరియు పరిశుద్ధాత్మ యొక్క పరిచర్య ద్వారా, ఆయన ప్రభావం ప్రతిచోటా ఉంటుంది. మనల్ని ఆశీర్వదించడం ఆయన స్వభావమైయున్నది.

ఆయన మన గతాన్ని, వర్తమానాన్ని మరియు నిత్య గమ్యాన్ని చూస్తారు. ఆయనకు మరుగైనదేదియు లేదు.

“సిలెస్టియల్‌గా ఆలోచించండి” అనే అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ గారి ఆహ్వానం మన పరలోక తండ్రి దృక్పథాన్ని మరియు స్వభావాన్ని అనుకరించమని మనల్ని ప్రోత్సహిస్తుంది.

ఆయన యొక్క దైవిక లక్షణాల కారణంగా, మన పరలోక తండ్రి మనకు ప్రతి మంచి బహుమానమును ఇస్తారు, ప్రతిదాన్ని ఆయన నిత్యమైన దృక్పథంతో మరియు దివ్యదృష్టితో ఇస్తారు.

2. కర్తృత్వం అనేది మన కోసం ఎంపిక చేసుకోవడానికి మరియు చర్య తీసుకోవడానికి ఒక బహుమతి

అది బాగా ఎంపిక చేసుకోవడానికి కూడా బాధ్యత.

ఆ ప్రత్యేక హక్కు కోసం యేసు క్రీస్తు తన అమూల్యమైన రక్తంతో అంతిమ మూల్యాన్ని చెల్లించారు.

కొన్నిసార్లు కర్తృత్వం అంటే కోరుకున్నది చేయడం అని మనం నమ్మవచ్చు. అయితే వాస్తవానికి విలువ చెల్లించబడింది కాబట్టి, కర్తృత్వం అనేది ఒక పవిత్రమైన బహుమతి.

మనము ప్రతినిధులము మరియు ప్రతినిధులు ఏదో ఒకదానికి బాధ్యత వహిస్తారు. ఈ సందర్భంలో, మనకున్న జ్ఞానం ఆధారంగా మనం చేసే ఎంపికలకు మరియు మనకు ఇవ్వబడిన బహుమతులకు మనమే బాధ్యత వహిస్తాము. పర్యవసానాలకు బాధ్యత వహించకుండా మనం ఒక ఎంపిక చేసుకోలేము.

మనకు కర్తృత్వం ఎందుకు ఉంది?

మంచిని ఎంచుకోవడానికి.

క్రీస్తును ఎన్నుకోవడానికి.

మళ్ళీ మళ్ళీ—నిత్యజీవమును ఎన్నుకోవడానికి.

3. మన సాక్ష్యం పరిశుద్ధాత్మ శక్తి ద్వారా వస్తుంది

పరిశుద్ధాత్మ నుండి వచ్చే సాక్ష్యం భౌతికంగా చూడడం కంటే గొప్పది. ఆయన, తండ్రి మరియు కుమారుని యొక్క ప్రధానమైన సాక్షి. అధ్యక్షులు నెల్సన్ ఇలా బోధించారు, “రాబోయే దినాలలో, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు, మార్గదర్శకత్వము, ఆదరణ మరియు స్థిరమైన ప్రభావము లేకుండా ఆత్మీయంగా బ్రతికియుండుట సాధ్యముకాదు.”

సహోదర సహోదరీలారా, అందుకే నేడు మనలో ప్రతీ ఒక్కరికి పరిశుద్ధాత్మ యొక్క శక్తి అవసరం.

పరిశుద్ధాత్మ ద్వారా వచ్చే సాక్ష్యం అనేక విధాలుగా రావచ్చు. చీకటి గదిలో లైటు బల్బులా అది నాటకీయంగా మరియు అకస్మాత్తుగా రావచ్చు. అది కాలక్రమేణా మరియు క్రమంగా వచ్చే సూర్యోదయం లాగా ఉండవచ్చు. అది కాంతి కిరణాల వలె రావచ్చు, అప్పుడప్పుడు స్వచ్ఛమైన తెలివితేటలకు గురికావచ్చు. మార్గం ఏదైనప్పటికీ, అది పరిశుద్ధాత్మ ద్వారా వస్తుంది.

జమైకాలో సాక్ష్యము కనుగొనడం

నేను అందమైన జమైకాలో పెరిగాను; అది సరదాగా మరియు అద్భుతంగా ఉండేది. అయితే, నేను ఉన్నత పాఠశాల ప్రారంభించినప్పుడు, కొంతమంది సహవిద్యార్థులు మరియు స్నేహితులు, యేసు క్రీస్తు సంఘ సభ్యుడిగా ఉండాలనే నా నిర్ణయాన్ని అర్థం చేసుకోలేకపోయారు. “నువ్వు ఆ సంఘములో ఎలా చేరగలవు?,” మొదటి దర్శనాన్ని సూచిస్తూ—“ఆ కథను నువ్వు ఎలా నమ్మగలవు?” మోర్మన్ గ్రంథాన్ని సూచిస్తూ—“ఆ పుస్తకాన్ని నువ్వు ఎలా చదవగలవు?”. “నువ్వు నిజంగా అవన్నీ నమ్ముతావా?” “నీ జీవితాన్ని ఎందుకు వృధా చేసుకుంటున్నావు?” అని వాళ్ళు అడిగేవారు.

సాల్ట్ లేక్ దేవాలయము
పరిశుద్ధ వనము
మోర్మన్ గ్రంథము

అది బాధాకరంగా ఉండేది, ముఖ్యంగా నేను ప్రేమించే వ్యక్తుల నుండి వచ్చినప్పుడు.

కానీ వారికి తెలియనిది ఏమిటంటే: నాకు పరిశుద్ధాత్మతో ఒక అనుభవం ఉంది. ఆ సాక్ష్యం నా హృదయాన్ని నింపడంతో, అది రోజుల తరబడి ఉన్న నా బాధను తగ్గించింది మరియు “ఒక్క క్షణం పాటు, పరలోక దృశ్యం నా కళ్ళ ముందు [కనిపించింది].”

బహుశా ఈ ప్రశ్నలలో కొన్నింటిని మిమ్మల్ని కూడా అడిగి ఉండవచ్చు. బహుశా, ఇప్పుడు కూడా నాలాగే మీపై ఈ దాడి జరుగుతుండవచ్చు.

పరిశుద్ధాత్మ వరము మరియు సాక్ష్యము అందరికీ అందుబాటులో ఉన్నాయి.

జోసెఫ్ స్మిత్‌కు పాల్మైరా ఎలాంటిదో నాకు జమైకా అలాంటిది. అది నా పరిశుద్ధ వనము. పరిశుద్ధ వనములో జోసెఫ్ ప్రార్థన చేయడానికి మోకరిల్లిన ప్రదేశం ఎక్కడో నాకు ఖచ్చితంగా తెలియదు, కానీ నా పరిశుద్ధ వనము ఒక వాస్తవమైనప్పుడు నేను ఎక్కడ ఉన్నానో నాకు ఖచ్చితంగా తెలుసు. ఇది నా బాప్తిస్మము తర్వాత మూడు సంవత్సరాలకు ఒక బుధవారం ఉదయం 6:00 గంటలకు జమైకాలో మాండవిల్‌లోని ఫోర్ గ్రోవ్ రోడ్‌లో ఉన్న నా స్నానాల గదిలో జరిగింది. అప్పటికి రెండు వారాల ముందు ఒక ప్రేరేపిత సువార్తికురాలు మోర్మన్ గ్రంథాన్ని చదవమని నన్ను ఆహ్వానించినందున ఈ పవిత్రమైన అనుభవం జరిగింది. ఈరోజు సహోదరి ఆడ్రీ క్రాస్ తన కుటుంబంతో కలిసి ఈ సమావేశానికి హాజరవుతున్నారు మరియు నేను ఆమెను ఎప్పటికీ ప్రేమిస్తాను.

సువార్తికురాలితో యువ ఎల్డర్ బ్రౌన్.

ఆ అనుభవము నన్ను మార్చివేసింది.

సహోదర సహోదరీలారా, సాక్ష్యం తాత్కాలిక ప్రయోజనం కోసం ఇవ్వబడదు. మన ప్రియమైన పరలోక తండ్రి ఇచ్చిన ఈ బహుమతి నిత్యమైనది, ఎందుకంటే ఇచ్చేవారు నిత్యుడుగు తండ్రి. సాక్ష్యానికి గడువు తేదీ ఉండకూడదు. నా జీవితంలో ఏదో మారిపోయిందని లేదా ప్రపంచంలో ఏదో మారిపోయిందని అది బలహీనపడకూడదు లేదా తగ్గకూడదు. అది మరింత బలపడాలి, ఎందుకంటే తలాంతుల ఉపమానంలోని సేవకుడి యొక్క తలాంతువలె, నా వ్యక్తిగత సాక్ష్యం గుణించబడవలసిన బహుమతి—పాతిబెట్టబడునది కాదు.

నేను చిన్నప్పుడు ఎదుర్కొన్న కష్టతరమైన పరీక్షలు మరియు హింసలను తిరిగి గుర్తుచేసుకోవడం, ఇప్పుడు నాకై నేను తెలుసుకునే స్థితికి చేరుకోవడానికి నాకు సహాయపడింది. ఇవి ఒక యదార్థమైన సాక్ష్యమును పొందే మార్గంలో విశ్వాసం యొక్క ముఖ్యమైన భాగాలు అయినప్పటికీ, నేను నమ్మడం, నిరీక్షించడం లేదా విశ్వసించడం మాత్రమే చేయలేదు. ప్రశ్నలు అడగడం, అధ్యయనం చేయడం, ప్రార్థన చేయడం, ఉపవాసం ఉండడం మరియు ధ్యానించడం ద్వారా మీ స్వంత మార్గాన్ని ఏర్పరచుకున్నందుకు నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. దయచేసి ఆపకండి. సాక్ష్యము కొరకు ఈ మార్గాన్ని అనుసరించడానికి చేసే ప్రతీ ప్రయత్నం విలువైనది. మీ నుండి ఆ సాక్ష్యాన్ని తీసివేయడానికి మీరు ఎవరిని లేదా దేనిని అనుమతిస్తారు? “దేవుని నుండి లభించేదాని కంటే గొప్ప సాక్ష్యం మీకు ఏమి ఉంటుంది?”

దేవుని యొక్క ప్రతి కుమారుడు లేదా కుమార్తె తమకు తాముగా లోతైన, దృఢమైన మరియు ఖచ్చితమైన జ్ఞానాన్ని పొందగలరు. వ్యతిరేకత ఉన్నప్పటికీ తన సాక్ష్యాన్ని ధృవీకరించిన జోసెఫ్ స్మిత్‌వలే, మనం కూడా ధైర్యంగా ఇలా చెప్పగలం, “దానిని నేనెరుగుదును, దేవుడు దానిని యెరిగియున్నాడని నేనెరుగుదును, దానిని నేను తృణీకరించలేను, అలా చేయుటకు సాహసించలేను.”

నా ప్రియమైన సహోదర సహోదరీలారా, సాక్ష్యం అనే చిన్న మొలక శాశ్వతంగా మహిమాన్వితమైన నిశ్చయమైన జ్ఞానంగా మొలకెత్తే వరకు మీలో ఎదగనివ్వండి.

మీరు బాప్తిస్మము తీసుకొని, యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘములో నిర్ధారించబడిన సభ్యులైతే, “నాకు తెలుసో లేదో నాకు ఖచ్చితంగా తెలియదు” అనే దానితో ఇంకా ఇబ్బంది పడుతున్నట్లైతే , దయచేసి సంస్కార ప్రార్థనలోని ఈ వాగ్దానాన్ని గుర్తుంచుకోండి: “వారు ఎల్లప్పుడు ఆయన ఆత్మను వారితో కలిగియుండెదరు.” ఈ వాగ్దానం కారణంగా, మనలో ప్రతి ఒక్కరూ సాక్ష్యానికి మరియు ఖచ్చితమైన జ్ఞానానికి మార్గాన్ని అన్వేషించవచ్చు.

మీ సాక్ష్యానికి బాధ్యత వహించండి

ఇప్పుడు ఇక్కడ ఒక గొప్ప సత్యం ఉంది: సాక్ష్యం ఏ విధంగా ఇవ్వబడినా—అది సూర్యోదయంలా స్వచ్ఛముగా ఇవ్వబడినా లేదా మహిమాన్విత దర్శనంలో వచ్చినా—ఈ విలువైన బహుమతిని పొందడానికి ఇంకా ఎంపిక అవసరం.

“నేను నమ్మడాన్ని ఎంచుకున్నాను” అని చెప్పడం దేవుని నుండి సాక్ష్యాన్ని పొందడాన్ని సులభతరం చేస్తుంది. మన సాక్ష్యం బలహీనపడుతున్నట్లు మనం గుర్తిస్తే, మనం చేసే ఎంపికలే సాక్ష్యం యొక్క శక్తిని తగ్గిస్తున్నాయని గుర్తుంచుకోండి. కానీ సాక్ష్యం ఎక్కడికీ వెళ్లలేదు. మనం దానితో తిరిగి జతచేరడానికి ఎంచుకోవాలి.

నమ్మడాన్ని ఎంచుకోవడం అనేది మన కర్తృత్వమును ఉపయోగించడానికి ఒక తెలివైన మరియు శక్తివంతమైన మార్గం.

నా సాక్ష్యాన్ని నిలబెట్టుకోవడం కంటే నా కర్తృత్వాన్ని ఉపయోగించడానికి మెరుగైన మార్గం నాకు కనిపించడం లేదు.

అధ్యక్షులు నెల్సన్ ఇలా బోధించారు: “మీ సాక్ష్యానికి బాధ్యత వహించమని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. దానికోసం పని చేయండి. దాన్ని సొంతం చేసుకోండి. దానిపట్ల శ్రద్ధ వహించండి. అది వృద్ధిచెందేలా దానిని పోషించండి. దానిని సత్యముతో పోషించండి.”

నాకు, బాధ్యత వహించడం, పని చేయడం, శ్రద్ధ వహించడం, స్వంతం చేసుకోవడం, పోషించడం మరియు ఆహారం తినిపించడం అనే పదాలు విలువైన మరియు ముఖ్యమైన దాని కోసం ఒక ప్రతినిధికి బాధ్యత అప్పగించినట్లు అనిపిస్తాయి.

తొలినాటి సంఘములో, పార్లీ పి. ప్రాట్ ప్రవక్త జోసెఫ్ స్మిత్ పట్ల అసంతృప్తి చెందాడు, ఆయనను మరియు సంఘమును విమర్శించడానికి ఎంచుకున్నాడు. “పార్లీ సువార్త బోధించిన జాన్ టేలర్ పట్టణానికి వచ్చినప్పుడు, పార్లీ అతన్ని పక్కకు తీసుకెళ్లి జోసెఫ్‌ను అనుసరించవద్దని హెచ్చరించాడు. జాన్ టేలర్ పార్లీతో ఇలా అన్నాడు:

“మీరు కెనడా నుండి బయలుదేరే ముందు, జోసెఫ్ స్మిత్ దేవుని ప్రవక్త అని బలమైన సాక్ష్యాన్ని ఇచ్చారు, … మరియు మీరు ఈ విషయాలను బయల్పాటు మరియు పరిశుద్ధాత్మ వరము ద్వారా తెలుసుకున్నారని చెప్పారు.

“… మీరు ఒకప్పుడు సంతోషించిన అదే సాక్ష్యం ఇప్పుడు నా దగ్గర ఉంది. ఆరు నెలల క్రితం ఆ పని నిజమైతే, అది ఈ రోజూ నిజమే. జోసెఫ్ స్మిత్ అప్పుడు ప్రవక్త అయితే, అతను ఇప్పుడు కూడా ప్రవక్తే.”

జోసెఫ్ స్మిత్ దేవుని ప్రవక్త అని మరియు ఆయన పొందిన ప్రవచనాత్మక బాధ్యత ఈనాటికీ కొనసాగుతుందని నేను సాక్ష్యమిస్తున్నాను. ఈ కార్యమును యేసు క్రీస్తు నిర్దేశిస్తారు.

యేసు క్రీస్తు మరియు ఆయన సువార్త యొక్క యదార్థమైన సాక్ష్యం కొరకు మీ మార్గం గురించి ఆలోచించమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మీ సాక్ష్యానికి బాధ్యత వహించండి; మీ కర్తృత్వమును తెలివిగా ఉపయోగించుకోండి మరియు ఇచ్చేవారిని, ఆయన మహిమాన్విత లక్షణాలన్నిటిని గుర్తించండి. శక్తి మీలోనే ఉందని నేను సాక్ష్యమిస్తున్నాను. మీ కోసం ఎవరూ ఎంపిక చేయలేరు. ఈ బహుమతిని ఎవరూ తీసుకొనలేరు. మీరు నమ్మడాన్ని ఎంచుకోవచ్చు.

మీరు ఇలా చేసినప్పుడు, మీ సాక్ష్యము “నిత్యజీవమునకై ఊరెడి నీటి బుగ్గగా ఉండునని నేను వాగ్దానం చేస్తున్నాను.” ఇది ఒక లంగరుగా మరియు ఒక ప్రేరణగా ఉంటుంది మరియు కష్ట సమయాల్లో మిమ్మల్ని నిలబెడుతుంది. ఇది మీరు ఆధ్యాత్మిక బహుమానాలను అభివృద్ధి చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. ఇది మీ వ్యక్తిగత పరిచర్య మరియు సేవలో మీకు సహాయపడుతుంది. ఇది సాతానుకు మరియు మీ విరోధులకు వ్యతిరేకంగా ఒక ఆయుధంగా ఉంటుంది. మీ పిల్లలు, మనవరాళ్ళు, మునిమనవళ్లలో మరియు మీరు ప్రేమించే మరియు సేవ చేసేవారిలో మీ సాక్ష్యం ప్రతిరూపం కావడాన్ని మీరు చూసినప్పుడు అది ఆనందంగా ఉంటుంది. మీరు దానిని పంచుకున్నప్పుడు మరియు సాక్ష్యమివ్వడానికి ఉపయోగించినప్పుడు అది శక్తివంతంగా ఉంటుంది.

మీకు తెలుసు అని మీకు తెలుసు. నాకు తెలుసు అని నాకు తెలుసు. మనకు యేసు క్రీస్తు మరియు ఆయన సువార్త గురించి యదార్థమైన సాక్ష్యాలు ఇంకా అవసరం. అభివృద్ధి చేసుకోండి! వెదకండి! ఇది అత్యవసరం! ఇది చివరి యుగము—కాలముల సంపూర్ణ యుగము.

యేసు క్రీస్తు ఈ సత్యాన్ని ప్రకటించారు: “ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏ మాత్రమును గతింపవు.”

సహోదర సహోదరీలారా, యేసు క్రీస్తు యొక్క సాక్ష్యము ఎప్పుడూ తాత్కాలిక బహుమతిగా ఉండకూడదు. ఇందులో—ఇచ్చేవారు గాని, బహుమతి గాని, బహుమతిని అందించేవారు గాని, బహుమతి ఎవరి గురించి అనేది గాని, ఏదీ తాత్కాలికం కాదు. మీ సాక్ష్యం కూడా ఇలాగే వర్ణించబడుగాక. “భూమియు ఆకాశమును గతించిపోయినప్పటికీ,” యేసు క్రీస్తు యొక్క సువార్తను గూర్చిన మీ సాక్ష్యము గతించిపోదు. ఈ విలువైన బహుమతిని పట్టుకునే సమయం ఇదే. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.

వివరణలు

  1. “దేవుడు మన పరలోక తండ్రి మరియు మనము ఆయన పిల్లలము. తన స్వరూపమందు ఆయన మనల్ని సృష్టించారు. ఆయన ‘స్పర్శించగలుగు మనుష్య శరీరమువలె మాంసము, ఎముకలు గల మహిమకరమైన, పరిపూర్ణమైన శరీరమును’ కలిగియున్నారు (సిద్ధాంతము మరియు నిబంధనలు 130:22).

    “దేవుడు మనల్ని వ్యక్తిగతంగా ఎరుగుదురు మరియు మనము గ్రహించగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన మనల్ని ప్రేమిస్తారు. ఆయన మన కష్టాలను, బాధలను, బలహీనతలను అర్థం చేసుకుంటారు మరియు వాటిలో ఆయన మనకు మద్దతునిస్తారు. ఆయన మన పురోగతిని చూసి సంతోషిస్తారు మరియు సరైన ఎంపికలు చేయడానికి మనకు సహాయం చేస్తారు. ఆయన మనతో సంభాషించాలనుకుంటున్నారు మరియు మనం ప్రార్థన ద్వారా ఆయనతో సంభాషించవచ్చు” (నా సువార్తను ప్రకటించండి: యేసు క్రీస్తు యొక్క సువార్తను పంచుకొనుటకు మార్గదర్శి[2023], 33).

  2. సిద్ధాంతము మరియు నిబంధనలు 84: 46-47; 88:12-13 చూడండి.

  3. “దేవుడు దేవుడే కాబట్టి, క్రీస్తు క్రీస్తే కాబట్టి, మనం సాత్వికంగా మరియు దీనమనస్సుతో వారి కృపాసనాన్ని సమీపిస్తూ వారి దగ్గరకు వస్తే, వారు మనల్ని తప్పకుండా జాగ్రత్తగా చూసుకుంటారు, ఆశీర్వదిస్తారు మరియు సహాయం చేస్తారు. వాళ్ళు మనల్ని ఆశీర్వదించకుండా ఉండలేరు. వాళ్ళు ఆశీర్వదిస్తారు. అది వాళ్ళ స్వభావం” (Jeffrey R. Holland, “Come unto Me” [Brigham Young University devotional, Mar. 2, 1997], 4, speeches.byu.edu).

  4. లూకా 12:2; మొరోనై 7:22; అబ్రాహాము 2:8 చూడండి.

  5. “‘సిలెస్టియల్‌గా ఆలోచించడం!’ అనే అభ్యాసాన్ని అవలంబించమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. సిలెస్టియల్‌గా ఆలోచించడం అంటే ఆధ్యాత్మికంగా ఆలోచించడం. ‘ఆత్మానుసారమైన మనస్సు నిత్యజీవమైయున్నదని’ మోర్మన్ గ్రంథ ప్రవక్తయైన జేకబ్ నుండి మనం నేర్చుకుంటాము” (రస్సెల్ ఎమ్. నెల్సన్, “సిలెస్టియల్‌గా ఆలోచించండి!,” సర్వసభ్య సమావేశము, అక్టోబరు, 2023).

  6. See Topics and Questions, “Agency and Accountability,” Gospel Library; 2 నీఫై 2:11, 16 కూడా చూడండి.

  7. 1 పేతురు 1:18–20; అబ్రాహాము 3:22–28 చూడండి.

  8. 1 కొరింథీయులకు 6:20 చూడండి.

  9. సిద్ధాంతము మరియు నిబంధనలు 101:78 చూడండి.

  10. “యేసు క్రీస్తు సువార్త అనేది మన పరలోక తండ్రి మనం ఎలా కావాలని కోరుకుంటున్నారో అలా మారడాన్ని చూపే ఒక ప్రణాళిక. …

    “… ఈ నిష్కళంకమైన మరియు పరిపూర్ణమైన స్థితి నిబంధనలు, విధులు మరియు చర్యల స్థిరమైన క్రమము, సరైన ఎంపికల సముదాయం మరియు నిరంతర పశ్చాత్తాపం నుండి వస్తుంది” (Dallin H. Oaks, “The Challenge to Become,” Liahona, Jan. 2001, 40, 41; emphasis added); మోషే 7:33 కూడా చూడండి.

  11. మొరోనై 10:4–5 చూడండి.

  12. “ఆత్మ మాటలకే పరిమితం కానవసరం లేదు; ఆయన ఆత్మ నుండి ఆత్మకు స్పష్టమైన భాషతో సంభాషించగలరు, ఎందుకంటే దానికి పదాలు లేవు. ఇది ఆత్మ నుండి స్వచ్ఛమైన జ్ఞానం మరియు తెలివిగల సంభాషణ మరియు ఇది నిజంగా జ్ఞానాన్ని పొందడానికి ఉత్తమ మార్గం అని నేను తెలుసుకున్నాను. ఇది తాకడం లేదా చూడడం కంటే బలమైనది మరియు దీర్ఘకాలం ఉంటుంది; మనం భౌతిక ఇంద్రియాలను అనుమానించవచ్చు, కానీ పరిశుద్ధాత్మ మనతో మాట్లాడినప్పుడు మనం సందేహించలేము. ఇది అత్యంత నమ్మకమైన సాక్ష్యం. దీని కారణంగా, పరిశుద్ధాత్మను లేదా పరిశుద్ధాత్మ సాక్ష్యాన్ని తిరస్కరించడమే క్షమించరాని పాపం” (D. Todd Christofferson, “Strong Impressions of the Spirit,” Liahona, June 2013, 49).

  13. యోహాను 5:32; 2 నీఫై 31:18; 3 నీఫై 11:36 కూడా చూడండి.

  14. రస్సెల్ ఎమ్. నెల్సన్, “సంఘము కొరకు బయల్పాటు, మన జీవితాల కొరకు బయల్పాటు,” లియహోనా, మే 2018, 96. అదే ప్రసంగంలో, ఆయన ఇలా చెప్పారు:

    “వ్యక్తిగత బయల్పాటును పొందుటకు మీ ప్రస్తుతపు ఆత్మీయ సామర్ధ్యమును వృద్ధి చేయమని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. …

    “ఓహ్, మీ పరలోకమందున్న తండ్రి మీరు తెలుసుకోవాలని కోరుకునేది చాలా అధికమున్నది. ఎల్డర్ నీల్ ఎ. మాక్సవెల్ బోధించినట్లుగా, “చూచుటకు కన్నులు గలవాడు, వినుటకు చెవులు గల వారికి, తండ్రి మరియు కుమారుడు విశ్వము యొక్క రహస్యములను ఇచ్చివేస్తున్నాడని స్పష్టముగా ఉన్నది!’ …

    “… పరిశుద్ధాత్మ వరమును ఆనందించుటకు, ఆత్మ యొక్క స్వరమును ఎక్కువ తరచుగా, ఎక్కువ స్పష్టముగా వినుటకు అవసరమైన ఆత్మీయ కార్యమును చేయుటకు ఎంపిక చేయుము” (95, 96).

  15. See David A. Bednar, “The Spirit of Revelation,” Liahona, May 2011, 87–90; అలెగ్జాండర్ డుష్కు “స్తంభాలు మరియు కిరణాలు,” సర్వసభ్య సమావేశము, ఏప్రిల్, 2024 చూడండి.

  16. “Testimony,” Hymns, no. 137.

  17. సంఖ్యాకాండము 11:29; యాకోబు 1:5 చూడండి.

  18. సిద్ధాంతము మరియు నిబంధనలు 20:28; మోషే 1:3 చూడండి.

  19. మత్తయి 25:14–30 చూడండి. “పరిశుద్ధాత్మ నుండి నేను పొందిన ఆధ్యాత్మిక సాక్ష్యం … చనిపోలేదు. నిజానికి అది మరింత బలపడింది. యేసు క్రీస్తు సువార్త యొక్క ప్రాథమిక సూత్రాల గురించి నా యవ్వనంలో నేను నేర్చుకున్న విషయాలు నా జీవితమంతా నా స్థిరమైన పునాదిగా ఉన్నాయి” (డీటర్ ఎఫ్. ఉఖ్‌డార్ఫ్, “మూలాలను పోషించండి, కొమ్మలు పెరుగుతాయి,” సర్వసభ్య సమావేశము, అక్టో. 2024).

  20. సిద్ధాంతము మరియు నిబంధనలు 6:23.

  21. జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:25.

  22. ఆల్మా 32:27, 30, 37–38, 41 చూడండి.

  23. సిద్ధాంతము మరియు నిబంధనలు 20:77 చూడండి.

  24. సిద్ధాంతము మరియు నిబంధనలు 88:33 చూడండి.

    “తర్వాత బహుశా అతి ముఖ్యమైన భాగం, బహుమతిని స్వీకరించడం. … బహుమతిని నిజంగా స్వీకరించడం అంటే, మనం దానికి విలువనిస్తాము, దానిని మన జీవితాల్లో పూర్తిగా ఉపయోగించుకుంటాము మరియు ఇచ్చేవారిని కృతజ్ఞతతో గుర్తుంచుకుంటాము.

    “బహుమతిని స్వీకరించడం నిష్క్రియాత్మకం కాదు, కానీ ఉద్దేశపూర్వకమైన, అర్థవంతమైన ప్రక్రియ, అది కేవలం ఒక ప్యాకెట్టును తెరవడం కంటే చాలా ఎక్కువైనది. స్వీకరించడం అంటే ఒకవిధంగా ఇచ్చేవారికి, తీసుకునేవారికి మధ్య బంధాలను బలోపేతం చేసేలా బహుమతిని మరియు ఇచ్చేవారి హృదయాన్ని అభినందించడం మరియు జతచేయడం” (ప్యాట్రిక్ కీరన్, “ఆయన బహుమతిని స్వీకరించండి,” సర్వసభ్య సమావేశము, ఏప్రిల్, 2025).

  25. Russell M. Nelson, “Choices for Eternity” (worldwide devotional for young adults, May 15, 2022), Gospel Library.

  26. సిద్ధాంతము మరియు నిబంధనలు 70:3–4 చూడండి.

  27. Saints: The Story of the Church of Jesus Christ in the Latter Days, vol. 1, The Standard of Truth, 1815–1846 (2018), 280–81.

  28. మోషైయ 4:9–12 చూడండి.

  29. సిద్ధాంతము మరియు నిబంధనలు 63:23; వివరణ చేర్చబడింది.

  30. ఆల్మా 5:46–48 చూడండి. జోసెఫ్ స్మిత్ ఇలా బోధించారు, “బయల్పాటు లేకుండా రక్షణ రాదు. అది లేకుండా ఎవరైనా పరిచర్య చేయడం వ్యర్థం. … ప్రవక్త కాకుండా ఏ వ్యక్తి కూడా యేసు క్రీస్తు యొక్క పరిచారకుడు కాలేరు. యేసు గురించి సాక్ష్యం లేకుండా ఎవరూ యేసు క్రీస్తుకు పరిచారకుడిగా ఉండలేరు మరియు ఇదే ప్రవచన స్ఫూర్తి.” (The Joseph Smith Papers, History, 1838–1856, volume C-1 [2 November 1838–31 July 1842] [addenda], 12, josephsmithpapers.org; spelling, capitalization, and punctuation modernized).

  31. “మనం యుగాల శిఖరాగ్రంపై నిలబడి, గొప్ప మరియు గంభీరమైన చరిత్రను చూసి ఆశ్చర్యపోతున్నాము. గతంలోని వారందరూ సూచించిన చివరి మరియు అంతిమ యుగం ఇది” (Gordon B. Hinckley, “At the Summit of the Ages,” Liahona, Jan. 2000, 90).

  32. మత్తయి 24:35.

  33. మొరోనై 10:30 చూడండి.