సర్వసభ్య సమావేశము
ఎవరూ ఒంటరిగా కూర్చోకూడదు
2025 అక్టోబరు సర్వసభ్య సమావేశము


14:3

ఎవరూ ఒంటరిగా కూర్చోకూడదు

యేసు క్రీస్తు యొక్క సువార్తను జీవించడంలో పునఃస్థాపించబడిన ఆయన సంఘములో అందరికి చోటు కల్పించడం ఇమిడియుంటుంది.

I.

50 సంవత్సరాలుగా, నేను సువార్త సంస్కృతితో సహా సంస్కృతిని అధ్యయనం చేస్తున్నాను. నేను ఫార్చ్యూన్ కుకీలతో ప్రారంభించాను.

శాన్ ఫ్రాన్సిస్కోలోని చైనాటౌన్‌లో, గాంగ్ కుటుంబ విందులు ఫార్చ్యూన్ కుకీ మరియు “వెయ్యి మైళ్ల ప్రయాణం ఒక్క అడుగుతో ప్రారంభమవుతుంది” వంటి జ్ఞానవంతమైన సామెతతో ముగిసేవి.

ఫార్చ్యూన్ కుకీలోని అదృష్టం

యువకుడిగా, నేను ఫార్చ్యూన్ కుకీలను తయారు చేసాను. తెలుపు కాటన్ చేతి తొడుగులు ధరించి, నేను ఓవెన్ నుండి వేడిగా ఉన్న గుండ్రని కుకీలను మడిచి, వాటిని ఆకారంలోకి మలిచాను.

ఫార్చ్యూన్ కుకీలను తయారు చేయడం
ఫార్చ్యూన్ కుకీని మడతపెట్టడం

ఫార్చ్యూన్ కుకీలు మొదటి నుంచి చైనీయుల సంస్కృతిలో భాగం కాదని తెలుసుకుని నేను ఆశ్చర్యపోయాను. చైనీయులు, అమెరికన్లు మరియు యూరోపియన్ల ఫార్చ్యూన్ కుకీ సంస్కృతిని వేరు చేయడానికి—అడవి మంటలను త్రికోణ పద్ధతిలో గుర్తించడానికి బహుళ ప్రదేశాలను ఉపయోగించినట్లు, నేను బహుళ ఖండాలలో ఫార్చ్యూన్ కుకీల కోసం వెతికాను. శాన్ ఫ్రాన్సిస్కో, లాస్ ఏంజిల్స్ మరియు న్యూయార్క్‌లోని చైనీయుల రెస్టారెంట్లు ఫార్చ్యూన్ కుకీలను అందిస్తాయి, కానీ బీజింగ్, లండన్ లేదా సిడ్నీలోనివి అందించవు. అమెరికన్లు మాత్రమే జాతీయ ఫార్చ్యూన్ కుకీ దినోత్సవాన్ని జరుపుకుంటారు. చైనాలోని ప్రకటనలు మాత్రమే “ప్రామాణికమైన అమెరికన్ ఫార్చ్యూన్ కుకీలను” అందిస్తాయి.

సరళంగా చెప్పాలంటే, ఫార్చ్యూన్ కుకీలు ఆహ్లాదకరమైనవి. కానీ విభిన్న పరిస్థితులలో సాంస్కృతిక పద్ధతులను పోల్చడం అనే సూత్రం సువార్త సంస్కృతిని వేరు చేయడంలో మనకు సహాయపడుతుంది. ఇప్పుడు మోర్మన్ గ్రంథ ఉపమానం మరియు కొత్త నిబంధన ఉపమాన ప్రవచనాలు నెరవేరుతున్నందున సువార్త సంస్కృతిని నేర్చుకోవడానికి ప్రభువు కొత్త అవకాశాలను అందిస్తున్నారు.

II.

ప్రతిచోటా ప్రజలు తరలివెళుతున్నారు. ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం 281 మిలియన్ల మంది అంతర్జాతీయ వలసదారులు ఉన్నారు. ఇది 1990లో ఉన్నదాని కంటే 128 మిలియన్లు ఎక్కువ మరియు 1970 అంచనాల కంటే మూడు రెట్లు ఎక్కువ. ప్రతిచోటా, అత్యధిక సంఖ్యలో పరివర్తన చెందిన వారు యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘాన్ని కనుగొంటున్నారు. ప్రతీ విశ్రాంతిదినమున, 195 దేశాలు మరియు ప్రాంతాల నుండి సభ్యులు మరియు స్నేహితులు 31,916 సంఘ సమూహాలలో సమావేశమవుతారు. మనము 125 భాషలు మాట్లాడతాము.

అల్బేనియాలోని పరిశుద్ధులను కలుసుకోవడం
ఉత్తర మాసిడోనియాలోని పరిశుద్ధులను కలుసుకోవడం
కోసవోలోని పరిశుద్ధులను కలుసుకోవడం
స్విట్జర్లాండ్‌లోని పరిశుద్ధులను కలుసుకోవడం
జర్మనీలోని పరిశుద్ధులను కలుసుకోవడం
జర్మనీలోని పరిశుద్ధులను కలుసుకోవడం

ఇటీవల, అల్బేనియా, ఉత్తర మాసిడోనియా, కోసవో, జర్మనీ మరియు స్విట్జర్లాండ్‌లలో, మోర్మన్ గ్రంథంలోని ఒలీవ చెట్టు ఉపమానాన్ని నెరవేర్చే కొత్త సభ్యులను నేను చూశాను. జేకబ్ 5లో, ఒలీవతోట యజమాని మరియు అతని సేవకులు వివిధ ప్రదేశాల నుండి తెచ్చిన కొమ్మలను సమకూర్చడం మరియు అంటుకట్టడం ద్వారా ఒలీవ చెట్టు వేర్లు మరియు కొమ్మలను బలపరుస్తారు. నేడు దేవుని పిల్లలు యేసు క్రీస్తులో ఒకటిగా సమకూడుతున్నారు; సువార్తను సంపూర్ణంగా జీవించడానికి మరియు పునఃస్థాపించబడిన ఆయన సువార్తను విస్తరించడానికి ప్రభువు మనకొక అద్భుతమైన సహజ మార్గాన్ని అందిస్తున్నారు.

పరలోక రాజ్యానికి మనల్ని సిద్ధం చేస్తూ, యేసు గొప్ప విందు మరియు పెండ్లి విందు యొక్క ఉపమానాలను చెబుతారు. ఈ ఉపమానాలలో, ఆహ్వానించబడిన అతిథులు రాకుండా ఉండడానికి సాకులు చెబుతారు. యజమాని తన సేవకులను “త్వరగా పట్టణపు వీధులలోనికిని సందులలోనికిని వెళ్లి” మరియు “రాజమార్గములలోనికిని కంచెలలోనికిని వెళ్లి” బీదలను అంగహీనులను కుంటివారిని గ్రుడ్డివారిని “ఇక్కడికి తోడుకొనిరమ్మని” ఆదేశిస్తాడు. ఆధ్యాత్మికంగా చెప్పాలంటే, అది మనలో ప్రతి ఒక్కరినీ.

లేఖనం ఇలా ప్రకటిస్తుంది:

“ప్రభువు యొక్క మందిరములో బాగా సిద్ధపరచిన విందుకు సమస్త రాజ్యములు ఆహ్వానించబడును.”

“ప్రభువు మార్గమును సిద్ధపరచుడి … ఆయన రాజ్యము భూమియంతటికి వెళ్ళి, దాని నివాసులు దానిని స్వీకరించి, రాబోవు దినముల కొరకు సిద్ధపడియుండెదరు.”

నేడు, ప్రభువు విందుకు ఆహ్వానించబడినవారు ప్రతి ప్రదేశం మరియు సంస్కృతి నుండి వస్తారు. వృద్ధులు మరియు యువకులు, ధనికులు మరియు పేదలు, స్థానికులు మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్నవారు వస్తారు, మనం మన సంఘ సమూహాలను మన సమాజాలుగా కనిపించేలా చేస్తాము.

ప్రధాన అపొస్తలుడిగా పేతురు, ఆకాశము తెరువబడుటయు, “నాలుగు చెంగులుపెట్టి దింప బడిన పెద్ద దుప్పటివంటిదియు చూచెను … అందులో సకల విధములైన … జంతువులు ఉండెను.” పేతురు ఇలా బోధించాడు: “దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించియున్నాను. … ప్రతి జనములోను [ప్రభువు]కు భయపడి నీతిగా నడుచుకొనువానిని ఆయన అంగీకరించును.”

మంచి సమరయుడు

మంచి సమరయుని ఉపమానంలో, యేసు మనల్ని ఒకరి వద్దకు ఒకరు మరియు ఆయన సత్రంలో—ఆయన సంఘములో ఆయన వద్దకు రావాలని ఆహ్వానిస్తున్నారు. ఆయన మనల్ని మంచి పొరుగువారిగా ఉండమని ఆహ్వానిస్తున్నారు. మంచి సమరయుడు తిరిగి వచ్చి అతని సత్రంలో ఉన్నవారి సంరక్షణకు ప్రతిఫలం ఇస్తానని వాగ్దానం చేస్తాడు. యేసు క్రీస్తు యొక్క సువార్తను జీవించడంలో పునఃస్థాపించబడిన ఆయన సంఘములో అందరికి చోటు కల్పించడం ఇమిడియుంటుంది.

“సత్రంలో చోటు” అనే భావనలో “ఎవరూ ఒంటరిగా కూర్చోకూడదు” అని కూడా ఉంటుంది. మీరు సంఘానికి వచ్చినప్పుడు, మీరు ఎవరినైనా ఒంటరిగా చూస్తే, దయచేసి వారిని పలకరించి, వారితో కూర్చుంటారా? ఇది మీ ఆచారం కాకపోవచ్చు. ఆ వ్యక్తి మీ కంటే భిన్నంగా కనిపించవచ్చు లేదా మాట్లాడవచ్చు. అలాగే, ఫార్చ్యూన్ కుకీ చెప్పినట్లుగా, “సువార్త స్నేహం మరియు ప్రేమ ప్రయాణం మొదటి పలకరింపుతో మరియు ఎవరూ ఒంటరిగా కూర్చోకుండా ఉండడంతో ప్రారంభమవుతుంది.”

“ఎవరూ ఒంటరిగా కూర్చోకూడదు” అంటే భావోద్వేగపరంగా లేదా ఆధ్యాత్మికంగా ఎవరూ ఒంటరిగా కూర్చోకూడదు అని కూడా అర్థం. నేను విరిగిన హృదయంతో ఉన్న ఒక తండ్రితో కలిసి అతని కొడుకును చూడడానికి వెళ్ళాను. చాలాకాలం క్రితం, కొడుకు కొత్త పరిచారకుడు కావడానికి ఉత్సాహంతో ఉన్నాడు. ఆ సందర్భంలో అతని కుటుంబం అతనికి మొదటి జత కొత్త బూట్లు కొనిచ్చింది.

కానీ సంఘంలో, పరిచారకులు అతనిని చూసి నవ్వారు. అతని బూట్లు కొత్తవి, కానీ సొగసైనవి కాదు. సిగ్గుపడి, బాధపడ్డ ఆ యువ పరిచారకుడు, తాను ఇక ఎప్పటికీ సంఘానికి వెళ్లనని చెప్పాడు. నా హృదయం ఇప్పటికీ అతని కోసం, అతని కుటుంబం కోసం బాధపడుతుంది.

యెరికోకు వెళ్లే మట్టి రోడ్లపై, మనలో ప్రతి ఒక్కరినీ చూసి నవ్వడం, ఇబ్బంది పెట్టడం, బాధపెట్టడం, బహుశా తిట్టడం లేదా హింసించడం జరిగింది. వివిధ స్థాయిలలో, మనలో ప్రతీ ఒక్కరం కూడా విస్మరించాము, చూడలేదు లేదా వినలేదు, బహుశా ఉద్దేశపూర్వకంగా ఇతరులను బాధపెట్టాము. మనం బాధపడినందువల్ల మరియు ఇతరులను బాధపెట్టినందువల్లనే యేసు క్రీస్తు మనల్ని తన సత్రానికి తీసుకువస్తారు. ఆయన సంఘంలో మరియు ఆయన విధులు, నిబంధనల ద్వారా మనం ఒకరికొకరం మరియు యేసు క్రీస్తుకు దగ్గరగా వస్తాము. మనం ప్రేమిస్తాము మరియు ప్రేమించబడతాము, సేవ చేస్తాము మరియు సేవ చేయబడతాము, క్షమిస్తాము మరియు క్షమించబడతాము. దయచేసి గుర్తుంచుకోండి, “భూమికి, పరలోకం స్వస్థపరచలేని దుఃఖం లేదు”; భూమి భారాలు తేలికవుతాయి—మన రక్షకుని ఆనందం నిజమైనది.

1 నీఫై 19లో మనమిలా చదువుతాము: “ఇశ్రాయేలు యొక్క నిజమైన దేవుడిని కూడా [వారు] తమ పాదముల క్రింద త్రొక్కుదురు; … ఆయనను తృణీకరించెదరు. … అందువలన, వారు ఆయనను కొరడాతో బాధించినా ఆయన సహించును, ఆయనను కొట్టినా ఆయన సహించును. వారు ఆయనపై ఉమ్మి వేసినా ఆయన సహించును.”

నా స్నేహితుడు ప్రొఫెసర్ టెర్రీ వార్నర్ ఇలా అంటున్నాడు, తీర్పు తీర్చడం, కొరడాతో బాధించడం, కొట్టడం, ఉమ్మివేయడం అనేవి క్రీస్తు మర్త్య జీవితంలో మాత్రమే అప్పుడప్పుడు జరిగే సంఘటనలు కావు. మనం ఒకరినొకరం—ముఖ్యంగా ఆకలితో, దాహంతో ఉన్నవారిని, ఒంటరిగా వదిలివేయబడిన వారిని—ఎలా ఆదరిస్తామో, అదే విధంగా మనం ఆయనతో ప్రవర్తిస్తాము.

పునఃస్థాపించబడిన ఆయన సంఘంలో, ఎవరూ ఒంటరిగా కూర్చోనప్పుడు మనమందరం మెరుగ్గా ఉంటాము. మనం కేవలం వసతి కల్పించకూడదు లేదా సహించకూడదు. మనం నిజంగా స్వాగతిద్దాం, అంగీకరిద్దాం, పరిచర్య చేద్దాం, ప్రేమిద్దాం. ప్రతి స్నేహితుడు, సోదరి, సోదరుడు విదేశీయుడు లేదా అపరిచితుడు కాకుండా, ఇంటి బిడ్డగా ఉండాలి.

సంఘములో ఒంటరిగానున్న స్త్రీ

నేడు, చాలామంది ఒంటరిగా మరియు ఏకాకిగా ఉన్నట్లు భావిస్తున్నారు. సోషల్ మీడియా మరియు కృత్రిమ మేధస్సులు మానవ సాన్నిహిత్యం మరియు మానవ స్పర్శ కోసం మనం అలమటించేలా చేయగలవు. మనం ఒకరి గొంతును ఒకరు వినాలనుకుంటున్నాము. మనం నిజమైన అనుబంధాన్ని, దయను కోరుకుంటున్నాము.

సంఘములో స్నేహితులతో కూర్చోవడం

మనం సంఘంలో సరిపోమని భావించడానికి అనేక కారణాలు ఉన్నాయి—ఉపమాన రీతిగా చెప్పాలంటే, మనం ఒంటరిగా కూర్చుంటాము. మనం మన యాస, బట్టలు, కుటుంబ పరిస్థితి గురించి ఆందోళన చెందవచ్చు. బహుశా మనం సరిపోమని భావించవచ్చు; పొగ వాసన రావచ్చు; నైతిక పరిశుభ్రత కోసం ఆరాటపడవచ్చు; ఎవరితోనైనా విడిపోయి బాధపడి, ఇబ్బందిపడుతూ ఉండవచ్చు; ఏదో ఒక సంఘ విధానం గురించి ఆందోళన చెందవచ్చు. మనం ఒంటరిగా ఉండవచ్చు, విడాకులు తీసుకొని ఉండవచ్చు, వితంతువులు కావచ్చు. మన పిల్లలు అల్లరి చేయవచ్చు; మనకు పిల్లలు లేకపోవచ్చు. మనం సువార్తసేవ చేసియుండకపోవచ్చు లేదా త్వరగా ఇంటికి వచ్చియుండవచ్చు. జాబితా ఇలా కొనసాగుతూ ఉంటుంది.

మోషైయ 18:21 మన హృదయాలను ప్రేమయందు ముడివేయమని ఆహ్వానిస్తుంది. తక్కువ చింతించమని, తక్కువ తీర్పు తీర్చమని, ఇతరుల నుండి తక్కువ ఆశించమని—మరియు అవసరమైనప్పుడు, మనపట్ల మనం తక్కువ కఠినంగా ఉండాలని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మనం ఒక్క రోజులో సీయోనును సృష్టించము. కానీ ప్రతి “పలకరింపు,” ప్రతి హృదయపూర్వక సంజ్ఞ, సీయోనును దగ్గరగా తీసుకువస్తుంది. మనం ప్రభువును ఎక్కువగా విశ్వసించి, ఆయన ఆజ్ఞలన్నింటినీ పాటించాలని ఆనందంగా ఎంచుకుందాం.

III.

సిద్ధాంతపరంగా, పరిశుద్ధుల విశ్వాసం మరియు సహవాస గృహంలో, యేసు క్రీస్తుతో నిబంధన సంబంధం మూలంగా ఎవరూ ఒంటరిగా కూర్చోరు.

ప్రవక్త జోసెఫ్ స్మిత్‌ ఇలా బోధించారు: “దేవుని పరిశుద్ధులు ప్రతి జనము, వంశము మరియు ప్రజల నుండి ఒక్కటిగా సమకూడినప్పుడు, ‘కాలముల సంపూర్ణ యుగము … ’ అనే కడవరి దిన మహిమను చూడడం, దానిలో పాల్గొనడం మరియు అది ముందుకు సాగేలా తోడ్పడడం మన వంతు.”

దేవుడు “లోకమునకు ప్రయోజనకరమైన దానిని తప్ప మరిదేనిని చేయడు; … ఆయన పురుషులు [మరియు స్త్రీలు] అందరినీ తన వైపు ఆకర్షించగలడు. …

“… వారందరిని తన వద్దకు రమ్మని, తన మంచితనము నందు పాలుపొందమని ఆయన ఆహ్వానించుచున్నాడు; … మరియు అందరూ దేవునికి ఒకే రీతిగా ఉన్నారు.”

యేసు క్రీస్తుకు పరివర్తన చెందడం అంటే మనం ప్రకృతి సంబంధియైన మనుష్యుడిని, లోక సంస్కృతిని పక్కన పెట్టాలి. అధ్యక్షులు డాలిన్ హెచ్. ఓక్స్ బోధించినట్లుగా, దేవుని ఆజ్ఞలకు విరుద్ధమైన సంప్రదాయాన్ని మరియు సాంస్కృతిక ఆచారాన్ని మనం విడిచిపెట్టి, కడవరి దిన పరిశుద్ధులుగా మారాలి. “ఒక ప్రత్యేకమైన సువార్త సంస్కృతి ఉంది, యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘ సభ్యులందరికీ ఉమ్మడిగా కొన్ని విలువలు, అంచనాలు మరియు అభ్యాసాలు ఉన్నాయి” అని ఆయన వివరించారు. సువార్త సంస్కృతిలో పవిత్రత, వారానికొకసారి సంఘానికి హాజరు కావడం, మద్యం, పొగాకు, టీ మరియు కాఫీకి దూరంగా ఉండడం ఉన్నాయి. దీనిలో నిజాయితీ మరియు చిత్తశుద్ధి ఉన్నాయి, సంఘ స్థానాల్లో మనం పైకి లేదా క్రిందికి కాకుండా ముందుకు సాగుతున్నామని అర్థం చేసుకోవడం ఉంది.

ప్రతి దేశం మరియు సంస్కృతిలోని విశ్వాసులైన సభ్యులు, స్నేహితుల నుండి నేను నేర్చుకుంటాను. బహుళ భాషలలో మరియు సాంస్కృతిక దృక్పథాలలో అధ్యయనం చేయబడిన లేఖనాలు సువార్త అవగాహనను మరింత ఎక్కువ చేస్తాయి. క్రీస్తువంటి లక్షణాల యొక్క విభిన్న వ్యక్తీకరణలు నా రక్షకుని పట్ల నా ప్రేమను, అవగాహనను మరింత అధికం చేస్తాయి. అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ బోధించినట్లుగా, దేవుని బిడ్డగా, నిబంధన బిడ్డగా, క్రీస్తు యొక్క శిష్యునిగా మన సాంస్కృతిక గుర్తింపును మనం నిర్వచించినప్పుడు అందరూ దీవించబడతారు.

యేసు క్రీస్తు యొక్క శాంతి మన కోసం వ్యక్తిగతంగా ఉద్దేశించబడింది. ఇటీవల, ఒక యువకుడు హృదయపూర్వకంగా, “ఎల్డర్ గాంగ్, నేను ఇంకా పరలోకానికి వెళ్లగలనా?” అని అడిగాడు. అతనికి ఎప్పుడైనా క్షమాపణ లభిస్తుందా అని అతను ఆశ్చర్యపోయాడు. నేను అతని పేరు అడిగాను, జాగ్రత్తగా విన్నాను, అతని బిషప్పు‌తో మాట్లాడమని ఆహ్వానించాను, అతన్ని గట్టిగా కౌగిలించుకున్నాను. అతను యేసు క్రీస్తులో నిరీక్షణతో వెళ్ళిపోయాడు.

నేను ఆ యువకుడి గురించి మరొక సందర్భంలో ప్రస్తావించాను. తర్వాత, ఇలా ప్రారంభమయ్యే సంతకం లేని లేఖను నేను అందుకున్నాను: “ఎల్డర్ గాంగ్, నా భార్య, నేను తొమ్మిది మంది పిల్లలను పెంచాము … మరియు రెండుసార్లు సువార్తసేవ చేసాము.” కానీ “నేను ఎల్లప్పుడూ సిలెస్టియల్ రాజ్యంలోకి అనుమతించబడనని భావించాను … ఎందుకంటే యువకుడిగా నేను చేసిన పాపాలు చాలా చెడ్డవి!”

ఆ లేఖ ఇలా కొనసాగింది, “ఎల్డర్ గాంగ్, ఆ యువకుడు క్షమించబడతాడనే నిరీక్షణను పొందాడని మీరు చెప్పినప్పుడు, నేను ఆనందంతో నిండిపోయాను, బహుశా నేను [క్షమించబడగలను] అని గ్రహించడం ప్రారంభించాను.” “ఇప్పుడు నన్ను నేను ఇష్టపడుతున్నాను కూడా!” అని ఆ లేఖ ముగిసింది.

మనం ఒకరి యొద్దకు ఒకరు మరియు ఆయన సత్రంలో ప్రభువు వద్దకు వచ్చే కొద్దీ నిబంధన అనుబంధం మరింత అధికమవుతుంది. ఎవరూ ఒంటరిగా కూర్చోనప్పుడు ప్రభువు మనందరినీ ఆశీర్వదిస్తారు. ఏమి జరుతుందో ఎవరికి తెలుసు? మనం ఎవరి పక్కన కూర్చున్నామో ఆ వ్యక్తి మన ఉత్తమ ఫార్చ్యూన్ కుకీ స్నేహితుడు కావచ్చు. గొర్రెపిల్ల విందులో మనం ఆయనకు మరియు ఒకరికొకరం చోటు కల్పించుకుందామని నేను వినయంగా ప్రార్థిస్తున్నాను, యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో, ఆమేన్.

వివరణలు

  1. See “Fortune Cookies Didn’t Come from China,” Royal Examiner, Dec. 26, 2021, royalexaminer.com/fortune-cookies-didnt-come-from-china; “National Fortune Cookie Day,” Days of the Year, daysoftheyear.com/days/fortune-cookie-day.

  2. సాంస్కృతిక త్రిభుజాకార ప్రక్రియ, సువార్త సంస్కృతి, స్థానిక జాతీయ సంస్కృతి మరియు ఆధునిక సార్వజనీన సంస్కృతిగా పరిగణించబడే వాటిని వేరు చేయడానికి కూడా సహాయపడుతుంది.

  3. International Organization for Migration, World Migration Report 2024, 21, publications.iom.int/books/world-migration-report-2024. “2022లో, ప్రపంచంలో 117 మిలియన్ల మంది స్థానభ్రంశం చెందారు మరియు 71.2 మిలియన్ల మంది అంతర్గతంగా స్థానభ్రంశం చెందారు” (World Migration Report 2024, xii).

  4. జేకబ్ 5 చూడండి.

  5. ప్రతి భాష మరియు సంస్కృతిలో హృదయంలోని సున్నితమైన విషయాలను వివరించే పదాలు మరియు మాటలు ఉంటాయి. మనం ఒకరి నుండి ఒకరు నేర్చుకునే కొద్దీ పునఃస్థాపించబడిన ఆయన సువార్తను మనం సంపూర్ణంగా జీవించడం అధికమవుతుంది. ఇటీవల సహోదరీలు ఏన్నలి (మొదట మ్యూనిచ్ నుండి) మరియు సుజీ మైయర్స్, ఎల్డర్ ఎరిక్ మరియు సహోదరి క్రిస్టియాన్ కోపిష్కి, ఎల్డర్ జోర్గ్ మరియు సహోదరి జూలియా క్లెబింగాట్ హృదయాన్ని తాకే ప్రత్యేకమైన జర్మన్ పదాలను పంచుకున్నారు. ఈ పదాలు వివరించే భావాలు ఉపరితల లాంఛనప్రాయానికి మించి ఉంటాయి. అవి అలవాటు లేదా విధికి మించి ఉంటాయి. ఈ భావాలు హృదయం గురించి; వెచ్చని, సన్నిహిత సంబంధాల గురించి; మన దైవిక ఆత్మలలో ఆధ్యాత్మిక ఆనందం గురించి మాట్లాడతాయి. జర్మన్ భాష‌లోని ఈ ప్రత్యేక పదాలలో Gemütlichkeit and gemütlich, Heimat, Heimweh, Geborgenheit, Zuflucht, Herzensangelegenheit, Herzensmensch, మరియు Schummerstunde (ఉత్తరదిశ నుండి వచ్చిన అరుదైన కవితా పదం) ఉన్నాయి.

  6. లూకా 14:21, 23. అదేవిధంగా, పెండ్లి విందు యొక్క ఉపమానంలో, ఆహ్వానించబడిన అతిథులు రానప్పుడు, రాజు తన సేవకులను “రాచమార్గము”లో “[వారు] కనుగొనిన వారందరినీ” పోగుచేయమని ఆదేశిస్తాడు (మత్తయి 22:9).

  7. సిద్ధాంతము మరియు నిబంధనలు 58:9; సిద్ధాంతము మరియు నిబంధనలు 58:6–8, 10–12 కూడా చూడండి.

  8. సిద్ధాంతము మరియు నిబంధనలు 65:3, 5; సిద్ధాంతము మరియు నిబంధనలు 33:17 కూడా చూడండి.

  9. అపొస్తలుల కార్యములు 10:11–12, 34–35; అపొస్తలుల కార్యములు 10:9–10, 13–18, 24–33, 44–48; 11:1–18; 15:6–11. కూడా చూడండి.

  10. మనం ఆయన సత్రంలో ఆయన యొద్దకు మరియు ఒకరి యొద్దకు ఒకరు కలిసి రావడం అనే చిత్రం 3 నీఫై 18:32లో వ్యక్తపరచబడింది. మన ప్రార్థనా స్థలాలలో “ఎవరూ ఒంటరిగా కూర్చోకపోవడం” మరియు మనం ఒకరికొకరు హృదయపూర్వకంగా సేవ చేయడం అనేవి మనం మరియు వారు “తిరిగి వచ్చి పశ్చాత్తాపపడి, హృదయము యొక్క పూర్ణ ఉద్దేశ్యముతో [ఆయన] వద్దకు రావడానికి, [ఆయన] వారిని స్వస్థపరచడానికి; మరియు [మనం] వారికి రక్షణను తీసుకురావడానికి సాధనాలు కాగలవు.”

  11. సిద్ధాంతము మరియు నిబంధనలు 104:15, 17 మనకిలా గుర్తుచేస్తుంది, “సమస్తమూ [ప్రభువు]వి” మరియు “భూమి వనరులతో నిండియుండి, కావలసినదానికంటే అధికముగా కలిగి ఉన్నది.” దీని ప్రకారం, పేదలు మరియు ధనవంతులు అందరూ ఉన్నతీకరించబడడానికి మరియు తగ్గించబడడానికి ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. అలాగే, రాజైన బెంజమిన్ ఇలా అడుగుతాడు, “మనమందరము బిచ్చగాళ్ళము కాదా?” దీని ద్వారా ధనవంతులు మరియు పేదలు ప్రతి ఒక్కరూ “మీకు కలిగిన సంపదను ఒకరితోనొకరు పంచుకోవడానికి” ఇష్టపూర్వకంగా బాధ్యత వహిస్తారు (మోషైయ 4:19, 21; మోషైయ 4:25–27 కూడా చూడండి).

  12. In “Come, Ye Disconsolate” (Hymns, no. 115), Thomas Moore writes: “Come to the mercy seat, fervently kneel. గాయపడిన మీ హృదయాలను ఇక్కడకు తీసుకురండి; ఇక్కడ మీ వేదనను చెప్పండి. “పరలోకము స్వస్థపరచలేని దుఃఖం భూమిపైన ఏదీ లేదు.”

  13. 1 నీఫై 19:7, 9. కొండమీది ప్రసంగంలో, ప్రభువు ఇలా అంటున్నారు, “నిన్ను ఒక చెంప మీద కొట్టువాని వైపునకు రెండవ చెంప కూడ త్రిప్పుము; నీ పైబట్ట ఎత్తికొని పోవువానిని, నీ అంగీని కూడ ఎత్తి కొనిపోకుండ అడ్డగింపకుము” (లూకా 6:29).

  14. మత్తయి 25:35–40 చూడండి.

  15. “No more a stranger nor a guest, but like a child at home” (“My Shepherd Will Supply My Need,” Hymns—For Home and Church, Gospel Library).

  16. యేసు క్రీస్తు యొక్క సువార్త కాలాన్ని మరియు సంస్కృతిని అధిగమిస్తుంది. అమెరికాలోని పురాతన సాంస్కృతిక నేపథ్యం సందర్భంలో మోర్మన్ గ్రంథం యేసు క్రీస్తు సువార్త యొక్క సంపూర్ణతను బోధిస్తుందనేది నాకొక అద్భుతమైన సాక్ష్యం.

  17. As taught by the Prophet Joseph Smith and his counselors in the First Presidency in Teachings of Presidents of the Church: Joseph Smith (2007), 513; ఎఫెసీయులకు 1:10 కూడా చూడండి.

    నేడు సంఘ సభ్యులు అనేక రకాల రాజకీయ, సామాజిక మరియు ఆర్థిక పరిస్థితులలో నివసిస్తున్నారు. మన వార్డులు మరియు శాఖలు పరిమాణం మరియు నాయకత్వ వనరులలో మారుతూ ఉంటాయి. Principles of “uniformity and adaptation” can help strengthen family and His restored Church in gospel ways wherever we live (see Handbook 2: Administering the Church [2010], 17.0).

  18. 2 నీఫై 26:24, 33, వివరణ చేర్చబడింది; 2 నీఫై 29; ఆల్మా 29:8 కూడా చూడండి. “ప్రతి మనుష్యుడు సువార్త యొక్క సంపూర్ణతను తన మాతృభాషలో, తన స్వంత భాషలో వినును” అని సిద్ధాంతము మరియు నిబంధనలు 90:11 వాగ్దానమిస్తుంది. మన ఇళ్లలో మరియు సంఘంలో భాషాపరమైన భాషలు మరియు సువార్త సాంస్కృతిక భాషను ఒకచోట చేర్చినప్పుడు ఈ వాగ్దానం నెరవేరుతుంది.

  19. See Dallin H. Oaks, “Repentance and Change,” Liahona, Nov. 2003, 37–40.

  20. Dallin H. Oaks, “Repentance and Change,” 39.

  21. See Dallin H. Oaks, “Repentance and Change,” 38–39.

  22. విశ్వాస ప్రమాణాలు 1:13 చూడండి. యేసు క్రీస్తులో విభిన్నమైన కొమ్మలు మరియు వేర్లు ఒకటిగా ముడిపడి ఉన్నప్పుడు, మనం “పవిత్రమైనది, రమ్యమైనది, ఖ్యాతిగలది లేదా పొగడదగినది” ఎక్కువగా కనుగొంటాము. మనం మొదటిదానిని చివరిదానిగా మరియు చివరిదానిని మొదటిదానిగా చూస్తాము. నేర్చుకునేవారు బోధించినప్పుడు మరియు బోధించేవారు నేర్చుకుంటున్నప్పుడు మనం ఆనందిస్తాము. అందరూ అర్థము చేసుకుంటారు మరియు ఆత్మీయాభివృద్ధిని పొంది, కలిసి ఆనందిస్తారు (సిద్ధాంతము మరియు నిబంధనలు 50:22 చూడండి).

  23. See Russell M. Nelson, “Choices for Eternity” (worldwide devotional for young adults, May 15, 2022), Gospel Library.

  24. బ్రిగం యం‌గ్‌తో కలిసి ప్రథమ అధ్యక్షత్వములో పనిచేసిన జెడిడియా ఎమ్. గ్రాంట్, ఆత్మ లోకం యొక్క దర్శనాన్ని నివేదించారు, అందులో అనేక రకాల అందమైన పువ్వులు కలిసి వృద్ధి చెందుతాయి, బహుశా అది వైవిధ్యంలో ఐక్యత మరియు అందానికి రూపకం కావచ్చు. “నేను ఈ భూమిపై మంచి తోటలను చూశాను, కానీ అక్కడ ఉన్న తోటలతో పోల్చగలిగేలా నేను ఎప్పుడూ చూడలేదు” అని ఆయన చెప్పారు. “నేను అనేక రకాల పువ్వులను చూశాను మరియు కొన్నింటిలో యాభై నుండి వంద వరకు వేర్వేరు రంగుల పువ్వులు ఒకే కొమ్మపై పెరుగుతున్నాయి.” “నీతిమంతులైన ఆత్మలు కలిసి ఉన్న ఆత్మ లోకం యొక్క అందం మరియు మహిమను” ఆయన అనుభవించారు (“Remarks, at the Funeral of President Jedediah M. Grant, by President Heber C. Kimball,” Deseret News, Dec. 10, 1856, 317).

    అధ్యక్షులు డేవిడ్ ఓ. మెఖే కూడా దేవుని నిత్య నగరం యొక్క కల లేదా దర్శనాన్ని నమోదు చేశారు, అక్కడ ఆయన చెట్లు, పండ్లు, పొదలు మరియు పువ్వులు పరిపూర్ణంగా వికసించినట్లు చూశారు. “నేను గ్రహించినట్లుగా, తియ్యని పండ్లు, అందమైన లేతరంగు గల ఆకులు కలిగిన పొదలు మరియు పరిపూర్ణంగా వికసించిన పువ్వులు ప్రతిచోటా పుష్కలంగా ఉన్నాయి” (Teachings of Presidents of the Church: David O. McKay [2003], 1).