ఒకరికి పరిచర్య చేసే శక్తి
మనం ఒకరికి పరిచర్య చేసినప్పుడు, ఆ ఒకరిని క్రీస్తు నొద్దకు రమ్మని మరియు ప్రభువు మందిరంలో ఆరాధించమని మనం ఆహ్వానిస్తున్నాము.
సహోదరీ సహోదరులారా, సవాలుతోకూడిన ఈ సమయాలలో యేసు క్రీస్తు నొద్దకు రావడానికి మీ విశ్వసనీయమైన భక్తి కొరకు మీకు ధన్యవాదాలు. మీరు అద్భుతమైనవారు; మీరు అందమైనవారు; మీరు ప్రతీఒక్కరు దేవుని యొక్క బిడ్డ. మనం యేసు క్రీస్తు యొక్క నిజమైన భక్తిగల శిష్యులుగా మారినప్పుడు, అలా మారడానికి ఒకరికొకరం సహాయం చేసుకొనినప్పుడు మరియు ప్రభువు యొక్క మందిరంలో మనము ఆరాధించి, ఆయన ఆనందాన్నిఅనుభవించినప్పుడు, పరిశుద్ధాత్మ ప్రభావాన్ని మనం గుర్తించాలని నేను ప్రార్థిస్తున్నాను.
అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఇలా ఉపదేశించారు: “మన ప్రభువు మరియు రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క రెండవ రాకడ కొరకు సిద్ధపడేందుకు మీకు మరియు నాకు సమయమిదే. మన శిష్యత్వానికి మనం అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన సమయం ఇదే. మనల్ని తప్పుదోవ పట్టించే విషయాలతో నిండిన ప్రపంచంలో, మనం దీన్ని ఎలా చేయగలం?
ఆయన జవాబిచ్చారు: “దేవాలయంలో క్రమమైన ఆరాధన మనకు సహాయపడుతుంది. ప్రభువు యొక్క మందిరంలో, మనం యేసు క్రీస్తుపై దృష్టిపెడతాము. … మనం క్రమంగా ఆయన గురించి తెలుసుకుంటాము. … యేసు క్రీస్తును నిజాయితీగా వెదికే ప్రతి ఒక్కరూ దేవాలయంలో ఆయనను కనుగొంటారు.”
అయితే మనం యేసు క్రీస్తు యొక్క భక్తిగల శిష్యులుగా ఎలా మారతాము మరియు ఆవిధంగా మారడానికి ఒకరికొకరం ఎలా సహాయం చేసుకుంటాము? మనం ఒకరికి పరిచర్య చేస్తాము. రక్షకుని విధానంలో పరిచర్య చేయడంలో కరుణ, కనికరము, దయ, సహనము మరియు తీర్పు తీర్చని ప్రేమ ఇమిడి ఉంటాయి. మనం ఒకరికి పరిచర్య చేసినప్పుడు, ఆ ఒకరిని క్రీస్తు నొద్దకు రావడానికి మరియు ఆయన విమోచించు శక్తిని పొందడానికి ప్రభువు మందిరంలో ఆరాధించమని మనం ఆహ్వానిస్తున్నాము. మరొకమాటలో, ప్రభువు యొక్క మందిరానికి నడిపించే విధానాలలో ఒకరికి మనం పరిచర్య చేసినప్పుడు, యేసు క్రీస్తు యొక్క భక్తిగల శిష్యులుగా మారడానికి మనం ఒకరికొకరం సహాయం చేసుకుంటాము.
ప్రేమతో మరియు తీర్పుతీర్చకుండా ఒకరికి పరిచర్య చేసే శక్తి గురించి యేసు క్రీస్తు నుండి మనం నేర్చుకుంటాము. బావి వద్ద సమరయ స్త్రీ మీకు గుర్తుందా. ఈ స్త్రీ తాను ప్రాముఖ్యత లేనిదిగా, ఒంటరిగా, నిరుత్సాహంగా మరియు యెన్నికలేనిదిగా భావించియుండవచ్చు. తాను చెందిన వ్యక్తి కాదు అని ఆమె భావించి ఉండవచ్చు. ఆమె జీవితకాలమంతా ఆమెకు ఐదుగురు భర్తలున్నారు మరియు ఆమెతో జీవిస్తున్న వ్యక్తి ఆమె భర్త కాదు. ఆమె జీవితపు పరిస్థితులు తెలియకుండా ఇతరులు అన్యాయమైన తీర్పును విధించియుండవచ్చు. రోజులో అతి వేడిగా ఉన్న సమయంలో ఆమె ఒంటరిగా బావి వద్దకు రావడానికి ఇది ఒక కారణం కావచ్చు. అయినప్పటికీ, యేసు క్రీస్తు తాను మెస్సీయ అని ప్రకటించిన మొదటి వ్యక్తులలో ఆమె ఒకరు. ఆయన దృష్టిలో, ఈ స్త్రీ దేవుని యొక్క కుమార్తె.
ఒకరు ఆయన ఇచ్చే జీవ జలమును తాగుట ద్వారా నిత్య జీవమును పొందగలరని యేసు క్రీస్తు ఆ స్త్రీకి బోధించారు. ఆయన ఇలా ప్రకటించారు, “నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడును దప్పిగొనడు; … నేను వానికిచ్చు నీళ్లు నిత్యజీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండును.”
సమరయ స్త్రీ రక్షకుని ప్రేమను అనుభూతి చెందింది మరియు ఆయన మెస్సీయ అని ఆత్మ ద్వారా సాక్ష్యము పొందింది. ఈ సాక్ష్యము తరువాత, ఆమె పట్టణానికి తిరిగి వెళ్ళి, వచ్చి చూడమని ఇతరులను ఆహ్వానించింది మరియు అనేకమంది యేసే “నిజముగా క్రీస్తని, లోకరక్షకుడని తెలిసికొని” నమ్మారు. క్రీస్తు ప్రేమతో ఒకరికి పరిచర్య చేసారు; ఫలితంగా, ఇతరులు ఆయన పట్ల భక్తిగల శిష్యులుగా మారారు.
కనికరముతో ఒకరికి పరిచర్య చేసే శక్తి గురించి క్రీస్తు యొక్క అపొస్తలులైన పేతురు మరియు యోహానుల నుండి మనం నేర్చుకుంటాము. పుట్టుకతో కుంటివాడైన ఒక ప్రత్యేకమైన వ్యక్తి, డబ్బు అడుగుతూ, ప్రతిరోజూ దేవాలయ ద్వారము వద్ద పడుకొనియుండుట మీకు గుర్తుందా. ఈ వ్యక్తి తాను ప్రాముఖ్యత లేని వానిగా, ఒంటరివానిగా, నిరుత్సాహంగా మరియు యెన్నికలేని వానిగా భావించియుండవచ్చు. తాను చెందిన వ్యక్తి కాదు అని అతను భావించి ఉండవచ్చు.
“అంతట పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు; గాని నాకు కలిగినదే నీకిచ్చు చున్నాను: నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడువుమని చెప్పెను.”
పేతురు వాని కుడిచెయ్యి పట్టుకొని లేవ నెత్తెను మరియు ఆ వ్యక్తి పూర్తిగా స్వస్థతను పొందెను. ఆ అద్భుతము జరిగిన వెంటనే, ఆ వ్యక్తి పేతురు, యోహానులతో కూడా, “నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు” దేవాలయములోనికి ప్రవేశించెను. పేతురు మరియు యోహానులు ప్రభువు యొక్క మందిరానికి నడిపించిన విధానాలలో ఒకరికి పరిచర్య చేసారు మరియు ఆ వ్యక్తి క్రీస్తుపట్ల భక్తిగల శిష్యునిగా మారాడు.
నా స్నేహితులారా, నా జీవితంలో నేను కూడా ప్రాముఖ్యత లేనివానిగా, ఒంటరిగా, నిరుత్సాహంగా మరియు యెన్నికలేని వానిగా భావించిన సమయాలున్నాయి. నేను చెందినవాడను కాదని నాకు అనిపించింది. నాకు 19 సంవత్సరాలప్పుడు, నేను బాప్తిస్మము పొంది, యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘ సభ్యునిగా నిర్ధారించబడ్డాను. ఒక సంవత్సరం తరువాత, నేను పూర్తి-కాల సువార్తికునిగా సేవ చేయడానికి పిలుపును అంగీకరించాను, కానీ నేను సంఘ చరిత్ర గురించి ఇంకా ఎక్కువగా నేర్చుకోలేదు.
నా సువార్త సేవ ప్రారంభంలో, నల్లజాతి ఆఫ్రికన్ సంతతికి చెందిన వారు, ప్రభువు యొక్క మందిరంలో ఆరాధించే దీవెనలు అన్నీ ఆనందించడానికి అనుమతించబడని సమయమున్నదని నేను తెలుసుకున్నాను. మొదటిసారి దీనిని తెలుసుకొనుట వలన నాకు కోపం, కలవరం, అనుమానం మరియు భయముతో కూడిన భావాలు కలిగాయి. ఆ భావాలు ఎంత తీవ్రమైనవి అంటే కొంత సమయం నేను పరిశుద్ధాత్మను గుర్తించే సామర్థ్యాన్ని కోల్పోయాను.
అదృష్టవశాత్తు, నాకు అద్భుతమైన మిషను సహవాసి కెవిన్ విక్ ఉన్నాడు, అతడు నాకు ప్రేమ, ఓపిక మరియు దయతో పరిచర్య చేసాడు. ప్రతీ రాత్రి అతడు నాలోని సందేహము మరియు అస్థిరమైన భావాలను ప్రత్యక్షంగా చూసినప్పుడు, యువ ఎల్డర్ జాన్సన్‌తో, అతడు, “నేను నిన్ను ప్రేమిస్తున్నాను,” అని చెప్పేవాడు. దాదాపు రెండు వారాల తర్వాత, కెవిన్ ప్రేమను అనుభవించడానికి నన్ను నేను అనుమతించాను. యేసు క్రీస్తు నామములో పరలోక తండ్రిని ప్రార్థించడానికి నాకు ధైర్యం వచ్చింది. నేను ప్రార్థించినప్పుడు, నేను సిద్ధాంతము మరియు నిబంధనలు యొక్క 6వ ప్రకరణములో 21–23 వచనాల వైపు నేను ఆకర్షితుడనయ్యాను, అది ఇలా చెబుతుంది:
“ఇదిగో, దేవుని కుమారుడైన యేసు క్రీస్తును నేనే. … చీకటియందు ప్రకాశించు వెలుగును నేనే. …
“… ఈ సంగతుల సత్యమును గూర్చి నీవు తెలుసుకొనుటకు నీ హృదయమందు నీవు నాతో మొరపెట్టుకొనియున్న ఆ రాత్రిని జ్ఞాపకము చేసుకొనమని నిశ్చయముగా నేను నీతో చెప్పుచున్నాను.
“ఈ విషయమును గూర్చి నీ మనస్సుకు నేను శాంతిని కలుగజేయలేదా? దేవుని నుండి తప్ప మరే గొప్ప సాక్ష్యమును నీవు కలిగియుండగలవు?”
నేను చదువుతున్నప్పుడు, నాకు గుర్తుకు వచ్చింది. మోర్మన్ గ్రంథము దేవుని యొక్క వాక్యమని మరియు జోసెఫ్ స్మిత్ పునఃస్థాపన యొక్క ప్రవక్తయని తెలుసుకోవడానికి నేను ఉపవాసముండి ప్రార్థించిన రోజు నాకు గుర్తుంది. ప్రభువు మందిరంలో చేసిన నిబంధనలను నేను జ్ఞాపకం చేసుకున్నాను, అవి నన్ను యేసు క్రీస్తుతో చాలా వ్యక్తిగతంగా, సన్నిహితమైన విధానంలో అనుసంధానించాయి. నేను రక్షకుని ప్రేమను, ఆయన కనికరమును మరియు యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము భూమి మీద ఆయన రాజ్యమని మరియు ఆయన రెండవ రాకడ కొరకు మనల్ని సిద్ధపరచడానికి ముఖ్యమైనదనే ఆయన భరోసాను అనుభూతి చెందాను. నేను జ్ఞాపకముంచుకున్నాను కనుక, పరిశుద్ధాత్మను నేను మరల గుర్తించగలిగాను మరియు యేసే క్రీస్తని, నేను ఆయన శిష్యుడనని మరింత సంపూర్ణంగా గ్రహించగలిగాను.
కొన్నిసార్లు మనం జవాబివ్వబడని ప్రశ్నలను, ప్రాముఖ్యము కాదని, నిరాశ చెందిన, ఒంటరియైన, మరియు యెన్నికలేని భావనలను కలిగియుంటాము. అయినప్పటికినీ, నా స్నేహితులారా, మనము యేసు క్రీస్తునందు విశ్వాసముతో ముందుకు సాగిపోవాలి మరియు ఆయన మాటలను జ్ఞాపకముంచుకోవాలి:
“మీ హృదయమును కలవరపడనియ్యకుడి.”
“లోకములో మీకు శ్రమ కలుగును: అయినను ధైర్యము తెచ్చుకొనుడి; నేను లోకమును జయించియున్నాను.”
ఈ వాస్తవమునకు మరియు రక్షకుని యొక్క వాగ్దానము చేయబడిన దీవెనకు నేను ఒక సాక్షిని.
కనుక, రక్షకుని యొక్క మార్గములో ఒకరికి చేసిన మన పరిచర్య మిక్కిలి ప్రభావవంతంగా ఉన్నదని నిశ్చయపరచుకోవడానికి మనం ఏమి చేయగలము? క్రీస్తు యొక్క సిద్ధాంతమును జీవించుట మనకు సహాయపడుతుంది. అధ్యక్షులు నెల్సన్ ఇలా వివరించారు, “క్రీస్తు యొక్క సిద్ధాంతాన్ని జీవించుట మన జీవితాల్లో ఆత్మీయ వేగాన్ని సృష్టిస్తూ, అత్యంత శక్తివంతమైన, సద్గుణవంతమైన మాదిరిని పుట్టించగలదు.
“యేసు క్రీస్తు యొక్క ఉన్నతమైన చట్టాలను జీవించడానికి మనం ప్రయాసపడినప్పుడు … గొప్ప దాతృత్వము, వినయము, ఔదార్యము, దయ, స్వీయ-క్రమశిక్షణ, శాంతి మరియు విశ్రాంతితో మనల్ని దీవించడం ద్వారా రక్షకుడు పతనమైన ఈ లోకం యొక్క శోధనలలో నుండి మనల్ని పైకెత్తుతారు.”
“క్రీస్తు సిద్ధాంతాన్ని జీవించడం ద్వారా ఉత్పన్నమయ్యే [ఈ ఆత్మీయ వేగం] మన దైవిక స్వభావాన్ని మన నిత్య గమ్యంగా మార్చడానికి శక్తినివ్వడమే కాకుండా, తగిన మార్గాల్లో ఇతరులకు సహాయం చేయడానికి కూడా మనల్ని ప్రేరేపిస్తుంది” అని ఎల్డర్ డేల్ జి. రెన్‌లండ్ వివరించారు. “రక్షకుని పని స్వస్థపరచుట [మనల్ని సంపూర్ణంగా మార్చడం]” అని ఎల్డర్ రెన్‌లండ్ మనకు గుర్తు చేసారు. మన పని ప్రేమించడం—ఇతరులు యేసు క్రీస్తు వైపుకు ఆకర్షించబడే విధంగా ప్రేమించడం మరియు పరిచర్య చేయడం.”
ప్రతిరోజు మోర్మన్ గ్రంథమును అధ్యయనం చేయడం మరియు ప్రతీవారం సంస్కారాన్ని తీసుకోవడం ద్వారా క్రీస్తు యొక్క సిద్ధాంతమును జీవించడానికి కావలసిన మన సామర్థ్యము మెరుగుపడుతుంది. అధ్యక్షులు నెల్సన్ బోధించినట్లుగా, మోర్మన్ గ్రంథము “క్రీస్తు యొక్క సిద్ధాంతమును బోధిస్తుంది … [మరియు] ఎక్కడైననూ కనుగొనబడే యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తమును గూర్చి సంపూర్ణమైన మరియు [స్వచ్ఛమైన] అవగాహనను ఇస్తుంది.” నేను ఈ గ్రంథమును ప్రేమిస్తున్నాను. మరియు ప్రతీవారము సంస్కారములో పాలుపంచుకొనుట యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తమును గురించి మన జ్ఞానాన్ని హెచ్చిస్తుంది మరియు మన జీవితాలలో ఆత్మీయ పునరుద్ధరణ, ఓదార్పు మరియు దైవత్వం యొక్క శక్తిని అందిస్తుంది. “[యాజకత్వకము యొక్క] విధులయందు దైవత్వపు శక్తి ప్రత్యక్షపరచబడును,” అని గుర్తుంచుకోండి మరియు యేసు క్రీస్తు నుండి వచ్చే ఈ శక్తి ఒకరికి పరిచర్య చేయాలనే మన కోరికను మరియు మన సామర్థ్యాన్ని బలపరుస్తుంది.
మోర్మన్ గ్రంథమును అధ్యయనం చేయడం మరియు సంస్కారంలో పాల్గొనడం నిరుత్సాహ భావాలను తగ్గిస్తుంది, రక్షకుని మార్గంలో ఉన్నవారికి పరిచర్య చేయాలనే నా దృఢ సంకల్పాన్ని పెంచుతుంది మరియు శిష్యత్వాన్ని నా అత్యున్నత ప్రాధాన్యతగా చేసుకోవడానికి సహాయపడుతుంది.
నా స్నేహితులారా, మనం క్రీస్తు యొక్క సిద్ధాంతాన్నిజీవించి, ప్రభువు యొక్క మందిరానికి నడిపించే విధానాలలో ఒకరికి పరిచర్య చేసినప్పుడు, జవాబివ్వబడని ప్రశ్నలను కలిగియుండి, ప్రాముఖ్యము కాని వారమని, ఒంటరి వారమని మరియు యెన్నికలేని వారమనే భావాల మధ్య కూడా మనం యేసు క్రీస్తునందు విశ్వాసముతో ముందుకు సాగిపోగలము. ఆ ఒకరిని యేసు క్రీస్తు నొద్దకు రమ్మని మరియు ఆయన విమోచించు శక్తిని, ప్రేమను పొందడానికి ప్రభువు మందిరంలో ఆరాధించమని మనం ఆహ్వానిస్తాము. ప్రభువు యొక్క మందిరంలో, మనం “[రక్షకుని] కనికరమును అనుభవిస్తాము. [మనల్ని] బాగా వేధించే ప్రశ్నలకు [మనం] సమాధానాలను కనుగొంటాము. [మరియు మనం] ఆయన సువార్త యొక్క ఆనందాన్ని బాగా అర్థం చేసుకుంటాము.” యేసు క్రీస్తు నామములో, ఆమేన్.