సర్వసభ్య సమావేశము
మోర్మన్ గ్రంథం—మన ప్రయాణంలో ఒక అమూల్యమైన నిధి
2025 అక్టోబరు సర్వసభ్య సమావేశము


9:47

మోర్మన్ గ్రంథం—మన ప్రయాణంలో ఒక అమూల్యమైన నిధి

మనం మోర్మన్ గ్రంథములో కనుగొనబడిన క్రీస్తు యొక్క మాటలను విందారగించినప్పుడు, నిత్య సత్యములను గ్రహించడానికి ఆత్మ మనకు సహాయపడతారు.

మీ జీవితాన్ని మార్చిన బహుమతిని ఎవరైనా మీకు ఇచ్చిన క్షణం మీకు గుర్తుందా? నా జీవితంలోని అత్యంత గొప్ప బహుమానాలలో ఒకదానిని నేను పొంది ఈ అక్టోబరు నాటికి 40 సంవత్సరాలు పూర్తవుతుంది. నేను ఉన్నత పాఠశాలలో ఉండగా, మా తరగతి సహవాసులలో ఒకరు మిగిలిన యువకుల కంటే సంతోషంగా ఉండడాన్ని నేను గమనించాను. నేను అతనితోపాటు ఉండడాన్ని ఆనందించాను. ఒకరోజు, అతను, తాను యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘ సభ్యుడని నాకు చెప్పాడు. తరువాత అతను నాకు ఒక బహుమతి ఇచ్చాడు: మోర్మన్ గ్రంథము యొక్క ప్రతి. అతను నన్ను కొన్ని పేజీలు చదవమని మరియు నా ప్రశ్నలకు సమాధానం ఇవ్వగల ఇద్దరు స్నేహితులను కలవమని ఆహ్వానించాడు. ఆ స్నేహితులే సువార్తికులు.

నేను సువార్తికులను కలిసినప్పుడు, వారు క్రీస్తు యొక్క సిద్ధాంతమును నాకు బోధించారు మరియు ప్రవక్త మొరోనై యొక్క ఆహ్వానాన్ని అనుసరించమని నాకు చెప్పారు: “మీరు ఈ సంగతులను పొందినప్పుడు, ఇవి సత్యమా కాదా అని మీరు నిత్యుడగు తండ్రియైన దేవుడిని క్రీస్తు యొక్క నామమందు అడుగవలెనని నేను మీకు ఉద్బోధించుచున్నాను; మీరు యథార్థ హృదయముతో, క్రీస్తు నందు విశ్వాసము కలిగియుండి, మనఃపూర్వకముగా అడిగిన యెడల, ఆయన వాటి సత్యమును పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మీకు ప్రత్యక్షపరచును” (మొరోనై 10:4).

మోర్మన్ గ్రంథంలో కొన్ని పేజీలను నేను చదివాను మరియు ప్రార్థించాను. సువార్తికులు నాకు బోధించిన విషయాలన్నిటి గురించి నాకు లోతైన అవగాహన లేనప్పటికీ, నేను చదువుతున్నది మంచిదని మరియు దేవుని నుండి వచ్చినదని నా హృదయంలో భావించాను. నేను మొరోనై వాగ్దానము యొక్క నిర్ధారణను పొందాను: “పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మీరు అన్ని సంగతుల యొక్క సత్యమును తెలుసుకొనగలరు” (మొరోనై 10:5).

నేను యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘములో బాప్తిస్మము పొందిన తరువాత, కొంతమంది స్నేహితులు నేను తప్పుడు నిర్ణయం తీసుకున్నానని నన్ను ఒప్పించడానికి ప్రయత్నించారు. అయితే నేను అలాంటి సందేహాలను లేదా వ్యతిరేకతను ఎదుర్కొన్న ప్రతిసారీ, లేఖనాలను అధ్యయనం చేయడం ద్వారా మరియు నేను దేవునితో చేసుకున్న నిబంధనలకు కట్టుబడి ఉండడానికి ప్రార్థించడం ద్వారా నేను కొత్త నిర్ధారణను పొందాను. అప్పటి నుండి, మోర్మన్ గ్రంథము నా సహవాసిగా ఉన్నది మరియు నా మర్త్య ప్రయాణంలో అమూల్యమైన నిధిగా మారింది.

మోర్మన్ గ్రంథం కేవలం ఒక గ్రంథము కంటే ఎక్కువైనది. అది యేసు క్రీస్తు యొక్క మరియొక సాక్ష్యము, ప్రవచనము మరియు బయల్పాటు యొక్క ఆత్మ ద్వారా అనేకమంది ప్రాచీన ప్రవక్తల చేత వ్రాయబడింది.

మోర్మన్ గ్రంథములో వ్రాయబడిన అత్యంత ప్రధానమైన ఘటన—ఆయన పునరుత్థానము తరువాత వెంటనే నీఫైయుల మధ్య ప్రభువైన యేసు క్రీస్తు యొక్క వ్యక్తిగత పరిచర్య. మోర్మన్ గ్రంథము “సువార్త సిద్ధాంతాలను సరళం చేస్తూ, రక్షణ ప్రణాళికను వివరిస్తూ, నరులందరికీ ఈ జీవితంలో శాంతిని, రాబోయే జీవితంలో నిత్యరక్షణను పొందుటకు ఏమి చేయవలెనో బోధిస్తుంది” (మోర్మన్ గ్రంథము యొక్క శీర్షిక పేజీ).

మోర్మన్ గ్రంథము: యేసు క్రీస్తు యొక్క మరియొక నిబంధన యొక్క మొదటి సంచిక 1830 మార్చిలో న్యూయార్క్ రాష్ట్రంలోని చిన్న నగరంలో ప్రచురించబడింది. 1829 లో ప్రవక్త జోసెఫ్ స్మిత్ గ్రంథమును అనువదించడాన్ని పూర్తి చేసినప్పుడు అతడి వయస్సు 23 సంవత్సరాలు మాత్రమే. అతడు 75 రోజుల కంటే తక్కువ సమయంలో దాదాపు మొత్తం గ్రంథాన్ని అనువదించాడు మరియు ముద్రణ ప్రక్రియకు దాదాపు ఏడు నెలలు పట్టింది.

నేడు, 150 కు పైగా దేశాలలో దాదాపు 80,000 మంది పూర్తి కాల సువార్తికులు స్వచ్ఛంద సేవకులుగా సేవ చేస్తున్నారు, మోర్మన్ గ్రంథము సత్యమని మరియు అది యేసు క్రీస్తు గురించి సాక్ష్యమిస్తుందని సాక్ష్యమివ్వడానికి తమ జీవితాలను అంకితం చేస్తున్నారు.

ఈ సంవత్సరం క్రొత్త మిషను నాయకులకు ఇటీవల జరిగిన సదస్సులో అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ మోర్మన్ గ్రంథము గురించి తన శక్తివంతమైన సాక్ష్యమును పంచుకున్నారు: “మోర్మన్ గ్రంథము … దేవుని వాక్యము. అది క్రీస్తు యొక్క సిద్ధాంతమును బోధిస్తుంది మరియు ఏ ఇతర గ్రంథముకన్నా ఎక్కువగా రక్షకుని ప్రాయశ్చిత్తము గురించి వివరిస్తుంది.”

మోర్మన్ గ్రంథమును అధ్యయనం చేయడం ద్వారా యేసు క్రీస్తు వైపు మన పరివర్తనను మరింతగా పెంచుకోవడానికి సహాయపడే మూడు సూచనలను నేను ఇవ్వాలనుకుంటున్నాను:

1. మీ అనుదిన అధ్యయనంలో శ్రద్ధగా మరియు స్థిరంగా ఉండండి

ఆల్మా మరియు మోషైయ కుమారుల వలే, మనము “దేవుని వాక్యమును తెలుసుకొనునట్లు [మనము] లేఖనములను శ్రద్ధగా వెదకాలి” (ఆల్మా 17:2) మరియు సత్యమునందు బలపరచబడాలి.

నా భార్య మరియు నేను జార్జియా అట్లాంటా మిషనులో మిషను నాయకులుగా సేవ చేస్తుండగా, ప్రతీ సువార్తికుడు ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు మోర్మన్ గ్రంథమును అధ్యయనం చేయాలని మేము ప్రోత్సహించాము. ఆ నిబద్ధత మా విశ్వాసాన్ని హెచ్చించింది మరియు అద్భుతాలను వెదకడానికి మరియు ఆశించడానికి మాకు సహాయపడింది.

మిషను తరువాత ప్రతిరోజూ లేఖన అధ్యయనము కొరకు మనకు అదే సమయం అందుబాటులో ఉండకపోవచ్చు, కానీ ప్రతిరోజూ ప్రార్థనాపూర్వకంగా మోర్మన్ గ్రంథమును అధ్యయనం చేయడానికి మీరు నిజాయితీగా ప్రాధాన్యత ఇచ్చిన యెడల, ప్రభువు మరియు ఆయన వాగ్దానాలందు మీరు గొప్ప ఆత్మీయ బలాన్ని మరియు విశ్వాసాన్ని పొందుతారు.

2. క్రీస్తు యొక్క మాటలను విందారగించడం ద్వారా మీ అధ్యయనాన్ని మరింత అర్థవంతమైనదిగా చేయండి

“క్రీస్తు యొక్క మాటలను విందారగించుడి; ఏలయనగా క్రీస్తు యొక్క మాటలు మీరు చేయవలసిన కార్యములన్నిటినీ మీకు తెలుపును” (2 నీఫై 32:3) అని నీఫై బోధించాడు.

విందు చేసుకోవడం అంటే చదవడం కంటే ఎక్కువ—దాని అర్థం ఆస్వాదించడం, ఆలోచించడం మరియు అన్వయించడం. మీరు మోర్మన్ గ్రంథమును అధ్యయనము చేసినప్పుడు, మీ లేఖన అధ్యయనమును మరింత అర్థవంతమైనదిగా చేసే విధానాలను పరిగణించండి. ఉదాహరణకు:

  • సువార్త గ్రంథాలయం యాప్‌లో అందుబాటులో ఉన్న అధ్యయన సహాయాలను ఉపయోగించండి.

  • దేవుని ప్రణాళికను అర్థం చేసుకోవడానికి మనకు సహాయపడే మరియు మన పరలోక తండ్రితో నిబంధనలు చేసి, పాటించడానికి మనల్ని నడిపించే నిత్య సత్యాలను గుర్తించండి.

  • మీ అధ్యయనంలో మీరు నేర్చుకున్న ముఖ్యమైన వాక్యభాగాలను గుర్తించండి మరియు మీ భావాలను వ్రాయండి.

మోర్మన్ గ్రంథము మన ఆత్మల యొక్క ప్రశ్నలకు జవాబివ్వగల శక్తిని కలిగియున్నది. “అవి మాకు ప్రయోజనకరముగా ఉండునట్లు మరియు మేము నేర్చుకొనునట్లు లేఖనములన్నిటినీ మాతో పోల్చితిని”(1 నీఫై 19:23) అని నీఫై చెప్పినట్లుగా, మనం కుడా చెప్పగలగాలి.

మనం క్రీస్తు యొక్క మాటలను విందారగిస్తుండగా, అవి బయల్పాటుకు ద్వారం తెరుస్తాయి మరియు మన జీవితంలోని వివిధ పరిస్థితులలో ఆయనకు దగ్గరగా ఉండడానికి మనం ఏమి చేయాలో మనకు చూపుతాయి.

3. మోర్మన్ గ్రంథము యొక్క సత్యాన్ని గురించి మీ సాక్ష్యమివ్వండి

జీవ వృక్ష ఫలమును తన కుటుంబంతో పంచుకోవాలని లీహై కోరినట్లుగా (1 నీఫై 8:12 చూడండి), మనం మోర్మన్ గ్రంథమును గూర్చి సాక్ష్యమును పొందినప్పుడు, యేసు క్రీస్తు యొక్క సువార్తను తెలుసుకొనుట నుండి కలిగిన ఆనందాన్ని పంచుకోవాలనే కోరికను మనం వృద్ధి చేస్తాము.

మోర్మన్ గ్రంథంతో సహోదరి బెన్సన్

ఈ సమావేశములో మాతో పాటు హాజరవుతున్న మా సువార్తికులలో ఒకరైన, సహోదరి బెన్సన్, తన తమ్ముడికి సహాయపడాలనే తన కోరికను నాతో పంచుకుంది. ఆ సమయంలో, అతను కళాశాలకు హాజరు కావడానికి సిద్ధపడుతున్నాడు మరియు సువార్తసేవ చేయడం గురించి ఖచ్చితంగా లేడు. ఆమె సువార్తసేవ సమయంలో మొదటి నాలుగు నెలల కాలంలో మోర్మన్ గ్రంథమును చదివి, తనకు ఇష్టమైన వచనాలను గుర్తించి, తరువాత ఆ ప్రతిని తన సోదరునికి పంపమని సహోదరి బెన్సన్‌‌ను ఆహ్వానించాలని నేను ప్రేరేపించబడ్డాను.

సహోదరి బెన్సన్‌ గుర్తించబడిన మోర్మన్ గ్రంథ ప్రతిని తన సోదరునికి పంపి, ప్రతీ రాత్రి దాని నుండి చదవమని ఆహ్వానించింది. తరువాత ఆమె నాతో ఇలా పంచుకున్నది: “నా సువార్తసేవకు ముందు, నా సోదరుడు పూర్తి-కాల సువార్తసేవ చేయాలనుకుంటున్నాడో లేదో ఖచ్చితంగా తెలియలేదు. నెమ్మదిగా కాలక్రమేణా, అతడు మోర్మన్ గ్రంథమును చదివినప్పుడు, అతడు తన జీవితంలో హెచ్చింపబడిన ఆనందాన్ని కనుగొన్నాడు మరియు సువార్తసేవ చేయాలని ఆలోచించడం ప్రారంభించాడు.”

ఎల్డర్ బెన్సన్

సహోదరి బెన్సన్‌ తన సువార్తసేవ పూర్తి చేయడానికి రెండు వారాల ముందు, ఆమె సోదరుడు అతని సువార్తసేవకు పిలుపు అందుకున్నాడు. ఇప్పుడు అతడు మెక్సికో టక్స్‌ట్లా గుటియర్జ్ మిషనులో సేవ చేస్తున్నాడు. మోర్మన్ గ్రంథము ద్వారా, ఎల్డర్ బెన్సన్‌ తన జీవితాన్ని ఆధ్యాత్మిక స్పష్టతతో చూడగలిగాడు, అది ప్రభువుకు సేవ చేయాలని నిర్ణయించడానికి మరియు విషయాలు సక్రమంగా జరుగుతాయని నమ్మడానికి అతన్ని నడిపించింది. ఆ నిర్ణయం ఒక అద్భుతం— క్రీస్తు యొక్క మాటల శక్తి ద్వారా ప్రభావితం చేయబడింది.

నా ప్రియమైన సహోదర సహోదరీలారా, మోర్మన్ గ్రంథమును మరింత లోతుగా అధ్యయనం చేయమని మీలో ప్రతి ఒక్కరినీ నేను ప్రోత్సహిస్తున్నాను. మనం మోర్మన్ గ్రంథములో కనుగొనబడిన క్రీస్తు యొక్క మాటలను విందారగించినప్పుడు, నిత్య సత్యములను గ్రహించడానికి మరియు ప్రభువు తన సందేశాన్ని వినడానికి సిద్ధపరచిన వారికి విశ్వాసంతో మన సాక్ష్యాలను పంచుకోవడానికి ఆత్మ మనకు సహాయపడతారని నాకు తెలుసు. ప్రభువు ఇలా బోధించారు, “నేను ఎన్నుకొనిన వారు నా స్వరమును వినెదరు, వారి హృదయములను కఠినపరచుకొనరు” (సిద్ధాంతము మరియు నిబంధనలు 29:7). ఎవరైతే విశ్వాసముతో దేవుడిని అడుగుతారో వారు పరిశుద్ధాత్మ శక్తి చేత మోర్మన్ గ్రంథము యొక్క సత్యమును గూర్చి మరియు దైవత్వమును గూర్చి సాక్ష్యమును పొందుతారని నేను సాక్ష్యమిస్తున్నాను. దీనిని గూర్చి నేను యేసు క్రీస్తు నామములో సాక్ష్యమిస్తున్నాను, ఆమేన్.

వివరణలు

  1. Russell M. Nelson, “Sacrament Meeting” (address given at the seminar for new mission leaders, June 23, 2025).