సర్వసభ్య సమావేశము
అందరు ఆత్మీయాభివృద్ధిని పొందవచ్చును
2025 అక్టోబరు సర్వసభ్య సమావేశము


11:21

అందరు ఆత్మీయాభివృద్ధిని పొందవచ్చును

మనం యేసు క్రీస్తుపై దృష్టి సారించి, ఆయన సిద్ధాంతాన్ని బోధించి, శ్రద్ధగా నేర్చుకున్నప్పుడు, యేసు క్రీస్తుపై మన విశ్వాసాన్ని మరింతగా పెంచుకోవడానికి మరియు ఆయనలా మారేందుకు మనకు సహాయపడడానికి పరిశుద్ధాత్మను మనం ఆహ్వానిస్తాము.

విశ్వవిద్యాలయంలోని ఒక యువ విద్యార్థి గురించి ఒక కథ చెప్పబడింది, అతను ఒక కష్టమైన తరగతితో ఇబ్బంది పడ్డాడు, కాబట్టి అతను తనకు సహాయం చేయడానికి ఒక బోధకుడిని నియమించుకున్నాడు. కోర్సు ముగిసే సమయానికి, విద్యార్థులు చివరి పరీక్షకు ఒక కాగితం ముక్కను తీసుకురావచ్చని, దానిపై వారు కోరుకున్నది ఏదైనా ఉంచవచ్చని అధ్యాపకుడు ప్రకటించాడు. కొంతమంది విద్యార్థులు పాఠాలు మరియు పాఠ్యపుస్తకాల నుండి సేకరించిన సమాచారంతో భూతద్దం ఉపయోగించి మాత్రమే చదవగలిగేలా చిన్న చీటీని తయారుచేసారు. అయితే ఆ యువకుడు ఒక ఖాళీ కాగితం మరియు ఒక కొత్త మనిషితో చివరి పరీక్షకు వచ్చాడు. అధ్యాపకుడు అతనిని ప్రశ్నించగా, ఆ యువకుడు, “మీరు ఒక కాగితం ముక్క తీసుకుని దాని మీద ఏదైనా ఉంచవచ్చని చెప్పారు” అని జవాబిచ్చాడు. అతను ఆ కాగితాన్ని తన రాతబల్ల పక్కన నేలపై ఉంచి, “నా బోధకుడు నా కాగితంపై నిలబడాలని నేను కోరుకుంటున్నాను” అని చెప్పాడు.

పరిశుద్ధాత్మ

యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘ సభ్యులుగా, దైవసమూహములోని సభ్యుని యొక్క సహవాసంతో దీవించబడిన మనం, అత్యంత పరిపూర్ణమైన బోధకుడి సహాయాన్ని పొందవచ్చు. పరిశుద్ధాత్మ సమస్త సంగతులను యెరుగును, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చును మరియు “అన్ని సంగతులను [మనకు] జ్ఞాపకము చేయును.” ప్రభువు స్వరాన్ని వినడం యొక్క ప్రాముఖ్యతను గురించి అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ చాలా తరచుగా మాట్లాడారు. పరిశుద్ధాత్మ నడిపింపును ఎలా ఆహ్వానించాలో ఆయన మనకు నేర్పించారు మరియు బయల్పాటును పొందుటకు మన ఆధ్యాత్మిక సామర్థ్యమును హెచ్చించమని పదేపదే ఆయన మనల్ని వేడుకున్నారు.

ఈ రోజు ప్రత్యేకంగా గృహములో మరియు సంఘములో సువార్త అభ్యాసం మరియు బోధనకు సంబంధించి పరిశుద్ధాత్మ పాత్రను పరిగణించమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ విలువైన బహుమతికి అర్హులుగా జీవించడానికి మనం కృషి చేస్తున్నప్పుడు, విశ్వాస ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మ ఇవ్వబడుతుంది. రక్షకుని విధానములో బోధించుట అనే ప్రేరేపిత సంఘ పుస్తకము, పరిశుద్ధాత్మ ప్రభావాన్ని ఆహ్వానించడంలో సహాయపడేలా ప్రభువు స్థాపించిన అదనపు సూత్రాలను వివరిస్తుంది.

శ్రద్ధగల అభ్యాసాన్ని ఆహ్వానించండి

ఈ సూత్రాలలో ఒకటి, శ్రద్ధగల అభ్యాసాన్ని ఆహ్వానించడం. గతంలో, బోధన అనేది తమ స్వంత సిద్ధపాటులో ఆత్మను ఆహ్వానించడానికి, ఆ తర్వాత వారు నేర్చుకున్న దానిని, వినే పాత్రను కలిగియున్న వారికి అనగా పిల్లలు లేదా తరగతి సభ్యులతో పంచుకోవడానికి తల్లిదండ్రులు లేదా బోధకుల కొరకు ఒక అవకాశంగా మనము భావించి ఉండవచ్చు. కానీ, బోధకులు మన హృదయాలకు మరియు మనస్సులకు నేరుగా వ్యక్తిగత బయల్పాటును పెంపొందించే అభ్యాస అనుభవాలను సృష్టించినప్పుడు, అభ్యాసకులుగా మనం కూడా సిద్ధంగా ఉన్నప్పుడు బోధన మరింత ప్రభావవంతంగా ఉంటుంది. తరువాత, మన అధ్యయనం ద్వారా మరియు పరిశుద్ధాత్మ నుండి మనం నేర్చుకుంటున్న వాటిని పంచుకోవడానికి మనకు అవకాశాలు ఇవ్వబడినప్పుడు, మనం ఒకరికొకరు బోధించబడడానికి మరియు ఆత్మీయాభివృద్ధి చెందడానికి సహాయం చేస్తాము. మనం సువార్త సూత్రాలను అన్వయించుకున్నప్పుడు, ఆత్మ మళ్ళీ వాటి యథార్థతకు సాక్ష్యమిస్తారు.

పంచుకోవడానికి అవకాశాలు

అన్ని విషయాలలో, యేసు క్రీస్తు పరిపూర్ణ ఉదాహరణ. శ్రద్ధగల అభ్యాసకులుగా ఉండాలని మరియు మన స్వంత సాక్ష్యాలకు బాధ్యత వహించాలని ఆయన మనలో ప్రతి ఒక్కరినీ ఆహ్వానించారు. నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండమని, వారు నేర్చుకుంటున్న వాటిని పంచుకోమని మరియు విశ్వాసంతో పనిచేయమని ఆయన తన శిష్యులను ఆహ్వానించారు. ఆయన వారి కోసం ప్రార్థించారు, వారి దైవిక సామర్థ్యాన్ని చూశారు, వారి మాట విన్నారు మరియు వారు ప్రేమించబడ్డారని, అవసరమైనవారని వారు తెలుసుకోవడానికి సహాయం చేసారు.

బోధకులుగా, అభ్యాసకుడి పురోగతిపై, వారి అవసరాలను తీర్చడంపై మరియు జీవితకాల శిష్యత్వము చేసే ఆధ్యాత్మిక అలవాట్లను పెంపొందించుకోవడానికి వారికి సహాయం చేయడంపై మనం మరింత దృష్టి సారించవచ్చు. అభ్యాసకులుగా, మనం నేర్చుకునే ప్రక్రియలో మన కర్తృత్వాన్ని ఉపయోగించినప్పుడు, పరిశుద్ధాత్మచేత బోధించబడడానికి మన సుముఖతను మనం ఆయనకు తెలియజేస్తాము.

మంచి అభ్యాసకుడిగా ఉండేందుకు నన్ను ఆహ్వానించిన బోధకురాలికి నేను కృతజ్ఞుడను. నేను కళాశాల చదువు ప్రారంభించినప్పుడు, క్రీడలు ఆడేందుకు అనుమతి పొందడానికి పాఠశాల అనేది భరించాల్సిన విషయం అని నేను తప్పుగా భావించాను. ఒకరోజు, నేను వ్రాసిన ఒక వ్యాసం చదివిన తర్వాత, నా ప్రొఫెసర్ నేను విశ్లేషణాత్మక ఆలోచనాపరుడనని ఆమె అనుకున్నట్లు నాతో చెప్పారు. దాని అర్థం ఏమిటో కూడా నాకు తెలియదు. మరింత దృష్టి కేంద్రీకరించి ప్రయత్నిస్తే, నేను ఒక మంచి విద్యార్థిని కాగలనని ఆమె చెప్పారు. నా మనసులోకి ఆ ఆలోచన ఎప్పుడూ రాలేదు. ఆమె ఆసక్తి, ప్రోత్సాహం మరియు ఆహ్వానాలు నా విద్యాభ్యాసాన్ని మార్చివేసాయి మరియు నా జీవితాన్ని ఎంతగానో దీవించాయి.

సిద్ధాంతాన్ని బోధించండి

పరిశుద్ధాత్మను ఆహ్వానించడానికి సంబంధించిన మరొక సూత్రం నిజమైన సిద్ధాంతాన్ని బోధించడం. దీని అర్థం మన సువార్త అధ్యయనం మరియు బోధన దేవుని వాక్యంలో పాతుకుపోయాయి మరియు ప్రభువు బయల్పరచని వాటిపై మనం సంచలనాత్మకంగా ఏమీ చేయము లేదా ఊహాగానాలు చేయము. బదులుగా, మనం ముఖ్యమైన మరియు శాశ్వతమైన సువార్త సూత్రాలపై దృష్టి పెడతాము, ఇది సత్యం గురించి సాక్ష్యమివ్వడానికి ఆత్మను అనుమతిస్తుంది. మళ్ళీ, మనం రక్షకుని యొక్క ఉదాహరణను అనుసరిస్తాము. “నేను చేయు బోధ నాది కాదు; నన్ను పంపినవానిదే” అని ఆయన అన్నారు.

నిజమైన సిద్ధాంతం లేఖనాలు మరియు ఆధునిక ప్రవక్తల బోధనలలో కనుగొనబడుతుంది. వ్యక్తిగతంగా మరియు కుటుంబాలుగా లేఖనాలను అధ్యయనం చేయమని మరియు ఆయన సువార్తను అధ్యయనం చేయడానికి ప్రతీ వారం సంఘానికి హాజరుకమ్మని ప్రభువు ఇచ్చిన ప్రేరేపణ, ఆయన సిద్ధాంతాన్ని నేర్చుకోవడానికి మరియు ఆయన స్వరాన్ని వినడానికి ఒక అద్భుతమైన ఏర్పాటును అందిస్తుంది. కథనం, అవి బోధించే సూత్రాలు మరియు మన జీవితాలలో ఈ సత్యాల అన్వయాన్ని అర్థం చేసుకోవడానికి మనం లేఖనాలను పరిశోధిస్తాము. లేఖనాలు అంత సులభంగా అందుబాటులో ఉండడం ఎంతటి దీవెన. ఆదాము హవ్వలు, అబినడై లేదా ప్రధాన బోధకుడైన యేసు క్రీస్తు మన గృహాలను లేదా తరగతులను సందర్శించి మనకు బోధించడాన్ని ఊహించుకోండి. మనం దేవుని వాక్యాన్ని విందారగించినప్పుడు వారు ఆవిధముగా చేయగలరు. స్థిరమైన ప్రయత్నంతో, మనం లేఖనాలను అర్థం చేసుకోవడం మరియు ప్రేమించడం నేర్చుకోవచ్చు మరియు ఆత్మ యొక్క ప్రశ్నలకు వాటిలో సమాధానాలు ఉన్నాయని విశ్వసించవచ్చు.

మేము పెళ్లి చేసుకోకముందు, నా భార్య, క్రిస్టి, పరలోక తండ్రి ప్రేమను అనుభవించడానికి మరియు ఆమె పట్ల ఆయన ప్రణాళికను అర్థం చేసుకోవడానికి ఇబ్బందిపడిన సమయం ఉంది. ఆమె మార్గదర్శకత్వం కోసం ప్రార్థించినప్పుడు, ఆమె ఇన్స్టిట్యూట్‌కు హాజరు కావాలనే ఒక ప్రేరేపణ వచ్చింది, కాబట్టి ఆమె క్రొత్త నిబంధన తరగతిలో చేరింది. ఆమె యొక్క ఇన్స్టిట్యూట్ బోధకుడు లేఖనాల నుండి బోధించే విధానం, వాటిని అతను పట్టుకున్న విధానం కూడా, అతను దేవుని వాక్యాన్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో చూపించింది. ఆమె హాజరైనప్పుడు, ఆమెకు అవసరమైనది లేఖనాలలో ఏదో ఉందని పరిశుద్ధాత్మ ఆమెతో గుసగుసలాడారు. లేఖనాల పట్ల ఆమె బోధకునికి ఉన్న ప్రేమ మరియు పరిశుద్ధాత్మ ప్రేరేపణలు దేవుని వాక్యాన్ని తీవ్రంగా అధ్యయనం చేయాలనే కోరికను ఆమెకు కలిగించాయి—అది లోతైన పరివర్తన మరియు సమర్పిత సేవ యొక్క జీవితకాల ప్రయాణంగా మారింది.

యేసు క్రీస్తుపై దృష్టిసారించండి

చివరగా, రక్షకుని విధానములో బోధించుట సూచించినట్లుగా, మన బోధన మరియు అభ్యాసం ఎల్లప్పుడూ యేసు క్రీస్తుపై కేంద్రీకరించబడాలి. మనం ఆయన గురించి మరింత తరచుగా, మరింత భక్తితో మాట్లాడవచ్చు మరియు ఆయన పట్ల సాక్ష్యం, కృతజ్ఞత మరియు ప్రేమను వ్యక్తపరచడానికి మరిన్ని అవకాశాలను వెదకవచ్చు. పరిస్థితి ఏదైనా, మనం ఆయనను జ్ఞాపకం చేసుకున్నప్పుడు, మనం “ఆయన ఆత్మను [మనతో] కలిగియుండగలము.”

మన బోధనలో యేసు క్రీస్తును కేంద్రంగా ఉంచడానికి ఒక మార్గం ఏమిటంటే, ఆయన అన్ని సువార్త సూత్రాల యొక్క పరిపూర్ణ ఉదాహరణ, స్వరూపం మరియు వ్యక్తీకరణ అని నొక్కి చెప్పడం. లేఖన వృత్తాంతంలో ఆయనను నేరుగా ప్రస్తావించకపోయినా, బోధించబడుతున్న సూత్రానికి ఉదాహరణగా మనం ఆయనను చూపించవచ్చు. మనం ఇలా అడగవచ్చు, “యేసు క్రీస్తు ఈ సూత్రానికి ఉదాహరణగా నిలిచిన సమయం గురించి మీరు ఆలోచించగలరా?”

ఆయన నామములు, పాత్రలు మరియు లక్షణాలను నేర్చుకోవడం ద్వారా, ఆయన ఏమి చేసారో నేర్చుకోవడమే కాకుండా ఆయన ఎవరనేది అర్థం చేసుకోవడం ద్వారా కూడా మనం ఆయనపై దృష్టి పెట్టవచ్చు. ఉదాహరణకు, పశ్చాత్తాపం యొక్క సూత్రాన్ని అధ్యయనం చేసేటప్పుడు, ఎలా పశ్చాత్తాపపడాలో అర్థం చేసుకోవడం ముఖ్యం. కానీ పశ్చాత్తాపాన్ని సాధ్యం చేయడానికి యేసు క్రీస్తు ఏమి చేసారో గుర్తుంచుకోవడం మరియు ఆయన గురించి, ఆయన నిజమైన స్వభావం మరియు లక్షణాల గురించి పశ్చాత్తాపం మనకు ఏమి బోధిస్తుందో అర్థం చేసుకోవడం కూడా చాలా అవసరం. పశ్చాత్తాపపడేందుకు మనకు గల అవకాశం ఆయన ప్రేమ, సహనం మరియు దయ, మన దైవిక సామర్థ్యంపై ఆయనకున్న నమ్మకం, మన పాపాలకు ప్రాయశ్చిత్తం చేయడానికి ఆయన సమ్మతి మరియు క్షమించడంలో ఆయన పొందే ఆనందం గురించి ఏమి చెబుతుంది? దేవుని గొఱ్ఱెపిల్ల, విమోచకుడు మరియు వైద్యుడు వంటి ఆయన నామములను అర్థం చేసుకోవడం—పశ్చాత్తాపం అనేది మనల్ని శుద్ధి చేయడానికి, మార్చడానికి మరియు స్వస్థపరచడానికి ఆయన ఆహ్వానం అని గ్రహించడానికి మనకు సహాయపడుతుంది. ఆయన మన కోసం ఏమి చేసారు మరియు ఆయన ఎవరు అనే దాని గురించి అది ఏమి చెబుతుంది అనే దానిపై దృష్టి పెట్టడం, మనం “పశ్చాత్తాపము నిమిత్తము విశ్వాసము కలిగియుండునట్లు” మనకు సహాయపడగలదు.

కొన్నిసమయాల్లో, లేఖన వృత్తాంతంలో వివరించబడిన రక్షకుని లక్షణాలను మనం వెంటనే చూడలేకపోవచ్చు. ఉదాహరణకు, నీఫై ఒక పడవను నిర్మించడం గురించి చదివేటప్పుడు, మనం నీఫైపై మాత్రమే దృష్టిపెట్టవచ్చు. కానీ రక్షకునిపై దృష్టిపెట్టడం అనేది ఈ వృత్తాంతం మనకు నీఫై గొప్పతనాన్ని గురించి బోధించడానికి కాదు, దేవుని యొక్క గొప్పతనాన్ని మనకు చూపించడానికి భద్రపరచబడిందని —ఆయన ఆజ్ఞలను పాటించడానికి ఆయన మనకు బలాన్ని ఇస్తారని మరియు అవసరమైన సమయాల్లో మనల్ని విడిపిస్తారని చూడడానికి మనకు సహాయపడగలదు.

పరలోక తండ్రి యొక్క పరిపూర్ణమైన సంతోష ప్రణాళికలో యేసు క్రీస్తు యొక్క ప్రధాన పాత్రపై కూడా మనం దృష్టి కేంద్రీకరించవచ్చు. మన తాత్కాలిక పరిస్థితుల దృష్టి ద్వారా ప్రణాళికను చూసే బదులు దేవుని నిత్య ప్రణాళిక యొక్క దృష్టి ద్వారా మన పరిస్థితులను చూసేలా ఇది మన జీవిత గమనాన్ని మార్చగలదు. సువార్త అనేది అవసరాల జాబితా కాదు; అది యేసు క్రీస్తు పాపాన్ని మరియు మరణాన్ని జయించారనే శుభవార్త. దేవునితో మన నిబంధనలను పాటించడం ద్వారా ఆయన అద్భుతమైన కృపను పొందడం ద్వారా మనం ఇప్పుడు ఆనందంగా జీవించగలము మరియు నిత్యత్వములో పరలోకంలో ఉన్న మన తండ్రితో జీవించడానికి సిద్ధపడగలము. లేఖనాలలో పరలోక తండ్రిని మరియు రక్షకుడిని చూడడం నేర్చుకున్నప్పుడు, మనం వారిని బాగా తెలుసుకుంటాము మరియు మన స్వంత జీవితాలలో వారి ప్రేమను, ప్రభావాన్ని మరింత తరచుగా, మరింత శక్తివంతంగా చూస్తాము.

నేను యౌవనములో ఉండగా రక్షకుని యొక్క జీవితంలోని చివరి రోజుల గురించి మా బోధకుడు బోధించినప్పుడు నేను అనుభవించిన ఆత్మను ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటాను. మేడగది, గెత్సేమనే, గొల్గొతా మరియు ఖాళీ సమాధిలోని సంఘటనల ప్రాముఖ్యతను చూడడానికి అతడు మాకు సహాయం చేశాడు. రక్షకుని పట్ల తన ప్రగాఢ కృతజ్ఞతను మరియు ఆయనను అనుసరించాలనే తన తీవ్రమైన కోరికను అతడు పంచుకున్నాడు. అతని బోధన యేసు క్రీస్తు గురించి సాక్ష్యమివ్వడానికి పరిశుద్ధాత్మకు ఒక ఆహ్వానం. ఆ తరగతిలో నేను అనుభవించిన ఆత్మ నా విశ్వాసాన్ని బలపరిచింది మరియు రక్షకుని పట్ల నాకున్న ప్రేమను, ప్రశంసలను పెంచింది. నా జీవితమంతా ఆ బోధకుడి యొక్క ప్రభావం నాతో నిలిచియుంది. మరొక బోధకుడి గురించి చెప్పబడినట్లుగా, “ఆయన విశ్వాసపు జ్వాల చేత మనం ప్రేరేపించబడగలము.

ముగింపు

మన గృహములలో మరియు సంఘ సమావేశాలలో, మనం యేసు క్రీస్తుపై దృష్టి సారించి, ఆయన సిద్ధాంతాన్ని బోధించి, శ్రద్ధగా నేర్చుకున్నప్పుడు, యేసు క్రీస్తుపై మన విశ్వాసాన్ని మరింతగా పెంచుకోవడానికి మరియు ఆయనలా మారేందుకు మనకు సహాయపడడానికి మనం పరిశుద్ధాత్మను ఆహ్వానిస్తాము, అదే సమస్త సువార్త బోధన మరియు అభ్యాసం యొక్క లక్ష్యం.

బోధించే చిత్రలేఖనం

నా జీవితంలోని బోధకులకు, మంచి తల్లిదండ్రుల నుండి, స్థానిక నాయకుల నుండి, ఉపాధ్యాయుల వరకు, ఈ వేదిక నుండి బోధించడానికి మరియు సాక్ష్యమివ్వడానికి పిలువబడిన పురుషులు మరియు స్త్రీల వరకు, యేసు క్రీస్తును తెలుసుకోవడానికి మరియు అనుసరించడానికి మనకు సహాయపడే వారికి నేను కృతజ్ఞుడను. మరియు పరిపూర్ణ బోధకుడైన పరిశుద్ధాత్మకు నేను కృతజ్ఞుడను. పరలోక తండ్రి మనల్ని ప్రేమిస్తున్నారని మరియు మన కోసం ఒక పరిపూర్ణ ప్రణాళికను కలిగియున్నారని; యేసే క్రీస్తు, లోక రక్షకుడు మరియు విమోచకుడు అని; ఆయన సువార్త మరియు సంఘము పునఃస్థాపించబడ్డాయని పరిశుద్ధాత్మ ద్వారా నేను తెలుసుకున్నాను. ఈ విషయాల గురించి నేను యేసు క్రీస్తు నామములో కృతజ్ఞతతో సాక్ష్యమిస్తున్నాను, ఆమేన్.