యేసు క్రీస్తు యొక్క కుటుంబ-కేంద్రీకృత సువార్త
మన సిద్ధాంతము మరియు నిత్య కుటుంబాలందు మన విశ్వాసము మనల్ని బలపరుస్తుంది మరియు బంధిస్తుంది.
నా ప్రియమైన సహోదర సహోదరీలారా, నా తరఫున మీ ప్రార్థనలకు ధన్యవాదాలు. నేను వాటిని అనుభవించాను.
I.
యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘ సిద్ధాంతము కుటుంబంపై కేంద్రీకరిస్తుంది. కుటుంబంపై మన సిద్ధాంతానికి దేవాలయం చాలా ముఖ్యమైనది. అక్కడ పొందిన విధులు నిత్య కుటుంబాలుగా మన పరలోక తండ్రి సన్నిధికి తిరిగి వెళ్ళడానికి మనకు వీలు కల్పిస్తాయి.
ఏప్రిల్ 2025 సర్వసభ్య సమావేశం నాటికి, అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ 200 కొత్త దేవాలయాల నిర్మాణాన్ని ప్రకటించారు. ప్రతీ సర్వసభ్య సమావేశం ముగింపులో కొత్త దేవాలయాలను ప్రకటించడం ఆయనకు చాలా ఇష్టం మరియు మనమందరం ఆయనతో కలిసి సంతోషించాము. అయితే, ప్రణాళిక మరియు నిర్మాణం యొక్క తొలి దశలలో ఇప్పుడు పెద్ద సంఖ్యలో దేవాలయాలు ఉన్నందున, కొత్త దేవాలయాల ప్రకటనను మనం నెమ్మదింపజేయడం సముచితం. అందువల్ల, పన్నెండుమంది అపొస్తలుల సమూహము యొక్క ఆమోదంతో, ఈ సమావేశంలో మేము ఏ కొత్త దేవాలయాలను ప్రకటించము. కొత్త దేవాలయాల నిర్మాణాన్ని ఎప్పుడు, ఎక్కడ ప్రకటించాలనే దానితో సహా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘ సభ్యులకు దేవాలయం యొక్క విధులను అందించడంలో మేము ఇప్పుడు ముందుకు సాగుతాము.
నేను ఇప్పుడే ఇచ్చిన నా ప్రసంగంలోని భాగం మన ప్రియమైన అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ మరణం తర్వాత వ్రాయబడింది. ఇప్పుడు చెప్పేది అనేక వారాల ముందు వ్రాయబడి ఆమోదించబడింది, కానీ అది ఇప్పటికీ ప్రభువుచే ప్రేరేపించబడిన నా బోధనలను సూచిస్తుంది.
II.
ఖచ్చితంగా 30 సంవత్సరాల క్రితం ప్రకటించబడిన కుటుంబ ప్రకటన ఇలా ప్రకటిస్తుంది, “కుటుంబము దేవునిచేత నియమించబడినది” మరియు “సృష్టికర్త ప్రణాళిక అయిన తన పిల్లల నిత్య గమ్యమునకు కుటుంబము కేంద్రమైయున్నది.” “దేవుడు భూమిని హెచ్చించి, నింపుమని ఆయన బిడ్డలకిచ్చిన ఆజ్ఞ ఇప్పటికీ అమలులో ఉన్నది” అని కూడా అది ప్రకటిస్తుంది. మరియు “పిల్లలను పుట్టించు పవిత్ర శక్తులు చట్టబద్ధముగా భార్యాభర్తలుగా వివాహము చేసుకొనిన స్త్రీ పురుషుల మధ్య మాత్రమే వినియోగింపబడవలెనని ప్రభువు ఆజ్ఞాపించారని కూడా మేము ప్రకటిస్తున్నాము.” మరియు అప్పటి ఎల్డర్ రస్సెల్ ఎమ్. నెల్సన్ బ్రిగమ్ యంగ్ విశ్వవిద్యాలయ ప్రేక్షకులకు బోధించినట్లుగా, కుటుంబము “దేవుని ప్రణాళికకు కీలకమైనది. … వాస్తవానికి, ప్రణాళిక యొక్క ఉద్దేశము కుటుంబాన్ని ఉన్నతీకరించడమే.”
కొన్నిసార్లు యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము కుటుంబ-కేంద్రీకృత సంఘముగా పిలువబడుతుంది. ఆవిధంగా ఉంది! దేవునితో మన సంబంధము మరియు మన మర్త్య జీవితపు ఉద్దేశము కుటుంబ పరంగా వివరించబడ్డాయి. యేసు క్రీస్తు సువార్త ఆయన ఆత్మీయ పిల్లల ప్రయోజనం కొరకైన మన పరలోక తండ్రి యొక్క ప్రణాళిక. నిత్య కుటుంబం యొక్క సలహాసభలో సువార్త ప్రణాళిక మనకు మొదట బోధించబడిందని మనం నిజంగా చెప్పగలము, అది మన మర్త్య కుటుంబాల ద్వారా అమలు చేయబడుతుంది మరియు ఉద్దేశించబడిన దాని గమ్యము, నిత్య కుటుంబాలలో దేవుని పిల్లలను ఉన్నతీకరించడం.
III.
ఆ సిద్ధాంతపరమైన సందర్భము ఉన్నప్పటికీ, వ్యతిరేకత ఉంది. అమెరికా సంయుక్త రాష్ట్రాలలో మనం వివాహము మరియు పిల్లల్ని కనడంలో క్షీణతతో బాధపడుతున్నాము. దాదాపు వంద సంవత్సరాలుగా వివాహిత దంపతుల నేతృత్వంలోని కుటుంబాల నిష్పత్తి క్షీణించింది మరియు జననసంఖ్య కూడా తగ్గింది. మన సంఘ సభ్యుల వివాహాలు మరియు జననాల సంఖ్య చాలా సానుకూలంగా ఉన్నాయి, కానీ అవి కూడా గణనీయంగా తగ్గాయి. కడవరి దిన పరిశుద్ధులు వివాహము యొక్క ఉద్దేశము మరియు పిల్లల విలువ గురించి తమ అవగాహనను కోల్పోకుండా ఉండడం చాలా ముఖ్యమైనది. మనం ప్రయత్నిస్తున్న భవిష్యత్తు అదే. “ఉన్నతస్థితి అనేది కుటుంబ వ్యవహారం,” అని అధ్యక్షులు నెల్సన్ మనకు బోధించారు. “యేసు క్రీస్తు సువార్త యొక్క రక్షించే విధుల ద్వారా మాత్రమే కుటుంబాలు ఉన్నతస్థితిని పొందగలవు.”
చారిత్రక కారణాల వల్ల జాతీయ స్థాయిలో వివాహం మరియు పిల్లలను కనడంలో క్షీణత అర్థం చేసుకోదగినది, కానీ కడవరి దిన పరిశుద్ధుల విలువలు మరియు అభ్యాసాలు మెరుగుపడాలి—ఆ ధోరణులను అనుసరించకూడదు.
80 సంవత్సరాల క్రితం నా బాల్యంలో, నేను మా తాత, మామ్మల పొలంలో నివసించాను, అక్కడ దాదాపు రోజులో జరిగేదంతా కుటుంబ పర్యవేక్షణలో జరిగేది. కుటుంబ కార్యకలాపాల నుండి దృష్టి మరల్చడానికి టెలివిజన్ లేదా ఇతర విద్యుత్ ఉపకరణాలు లేవు. దీనికి విరుద్ధంగా, నేటి పట్టణ సమాజంలో, కొందరు సభ్యులు స్థిరమైన కుటుంబ-కేంద్రీకృత కార్యకలాపాలను అనుభవిస్తున్నారు. పట్టణ జీవనం, ఆధునిక రవాణా, వ్యవస్థీకృత వినోదం మరియు వేగవంతమైన ఉత్తర ప్రత్యుత్తరాలు, యువత తమ ఇళ్లను నిద్రపోవడానికి మాత్రమే తిరిగి వచ్చే నివాస స్థలంగా పరిగణించడాన్ని సులభతరం చేసాయి, అక్కడ వారు నిద్రపోతారు మరియు అప్పుడప్పుడు భోజనం చేస్తారు, కానీ వారి కార్యకలాపాలపై తల్లిదండ్రుల దిశానిర్దేశం చాలా తక్కువగా ఉంటుంది.
ప్రస్తుత సంఘ సభ్యులు జీవనోపాధి పొందే విధానం ద్వారా కూడా తల్లిదండ్రుల ప్రభావాలు తగ్గాయి. గత కాలాల్లో, కుటుంబాలను ఏకం చేసిన గొప్ప ప్రభావాలలో ఒకటి, అడవుల్ని వ్యవసాయ భూములుగా మార్చడం లేదా జీవనోపాధి సంపాదించడం వంటి ఉమ్మడి లక్ష్యాన్ని సాధించడంలో కలిసి పోరాడే అనుభవం. కుటుంబము ఒక వ్యవస్థీకృత మరియు నిర్వహించబడిన ఆర్థిక ఉత్పత్తి యొక్క విభాగము. నేడు, చాలా కుటుంబాలు ఆర్థిక వినియోగ విభాగాలుగా ఉన్నాయి, దానికి అధిక స్థాయిలో కుటుంబ నిర్మాణం మరియు సహకారం అవసరం లేదు.
IV.
తల్లిదండ్రుల ప్రభావాలు తగ్గుతున్నప్పటికీ, నిత్యత్వంలో మన కుటుంబ గమ్యం కోసం సిద్ధపడడానికి కడవరి దిన పరిశుద్ధులు ఇంకా తమ పిల్లలకు బోధించే దైవిక బాధ్యతను కలిగియున్నారు (సిద్ధాంతము మరియు నిబంధనలు 68:25 చూడండి). మన కుటుంబాలన్నీ సాంప్రదాయకంగా లేనప్పుడు మనలో అనేకమంది దీనిని తప్పక చేయాలి. విడాకులు, మరణము మరియు విడిపోవడం అనేవి వాస్తవాలు. నేను పెంచబడిన కుటుంబంలో దానిని నేను అనుభవించాను.
నాకు ఏడు సంవత్సరాల వయస్సులో మా నాన్న చనిపోయారు, కనుక నా తమ్ముడు, చెల్లి మరియు నేను విధవరాలైన తల్లి చేత పెంచబడ్డాము. అత్యంత కష్టమైన పరిస్థితులలో, ఆమె ముందుకుసాగింది. ఆమె ఒంటరిగా కృంగిపోయి ఉంది, కానీ పునఃస్థాపించబడిన సంఘ సిద్ధాంతము గురించి ఆమె యొక్క శక్తివంతమైన బోధన మమ్మల్ని నడిపించింది. పిల్లల్ని పెంచడంలో పరలోక సహాయం కొరకు ఆమె ఎంతగా ప్రార్థించిందో, అంతగా ఆమె దీవించబడింది! మేము సంతోషకరమైన ఇంటిలో పెరిగాము, అక్కడ చనిపోయిన మా నాన్న ఎల్లప్పుడు జ్ఞాపకం చేసుకోబడేవారు. మాకొక తండ్రి ఉన్నారని, ఆమెకు ఒక భర్త ఉన్నారని, వారి దేవాలయ వివాహము వలన మేము ఎల్లప్పుడు ఒక కుటుంబంగా ఉంటామని ఆమె మాకు బోధించింది. మా నాన్న తాత్కాలికంగా దూరంగా ఉన్నారు, ఎందుకంటే ప్రభువు ఆయనను వేరే పని మీద పిలిచారు.
అనేక ఇతర కుటుంబాలు అంత సంతోషంగా లేవని నాకు తెలుసు, కానీ ప్రతీ ఒంటరి తల్లి పరలోక తండ్రి యొక్క ప్రేమను మరియు దేవాలయ వివాహము యొక్క అంతిమ దీవెనలను గూర్చి బోధించగలదు. మీరు కూడా దీనిని చేయగలరు! పరలోక తండ్రి యొక్క ప్రణాళిక ప్రతీఒక్కరికి ఈ అవకాశాన్ని హామీ ఇస్తుంది. మనమందరం దేవాలయ వివాహము కొరకు మరియు ఒక నిత్య కుటుంబముగా ముద్రవేయబడడం వలన వచ్చే దీవెనల కొరకు కృతజ్ఞత కలిగియున్నాము. మా అమ్మలాగే, దేవుడు “నీ బాధలను నీ ప్రయోజనము కొరకు ప్రతిష్ఠించును” (2 నీఫై 2:2) అని తన కుమారుడైన జేకబ్‌కు లీహై చేసిన వాగ్దానమును వ్యాఖ్యానించడాన్ని మనము ఇష్టపడతాము. అది పూర్తిగా లేదా ప్రస్తుతం అసంపూర్తిగా ఉన్న ప్రతీ కడవరి దిన పరిశుద్ధుని కుటుంబానికి అన్వయిస్తుంది. మనది ఒక కుటుంబ సంఘము.
మన సిద్ధాంతము మరియు నిత్య కుటుంబాలందు మన విశ్వాసము మనల్ని బలపరుస్తుంది మరియు బంధిస్తుంది. పిల్లలమైన మేము యూటా, పేసన్ దగ్గర ఆయన పొలములో నివసించినప్పుడు మా అమ్మ తరఫు తాతయ్య వాగ్దానాన్ని నేను ఎన్నడూ మరచిపోను. కొలరాడోలోని సుదూర డెన్వర్‌లో మా నాన్న మరణించారనే విషాద వార్తను ఆయన నాకు చెప్పారు. నేను పడక గదిలోపలికి వెళ్ళి మంచం పక్కన మోకరించి, తీవ్రంగా దుఃఖించాను. తాతయ్య నా వెనుక వచ్చి, నా పక్కన మోకరించి, “నేను నీకు నాన్నగా ఉంటాను,” అన్నారు. కుటుంబాలు ఒక సభ్యుడిని కోల్పోయినప్పుడు లేదా ఒక సభ్యుడిని మరచిపోలేనప్పుడు ఆ వెలితిని పూరించడానికి తాత, మామ్మలు ఏమి చేయగలరు అనడానికి ఆ మృదువైన వాగ్దానము ఒక శక్తివంతమైన మాదిరి.
పిల్లల కోసం ఆ పాత్రను నిర్వహించే ఒంటరి లేదా వివాహితులైన తల్లిదండ్రులు—మరియు తాత, మామ్మలు వంటి ఇతరులు—ప్రావీణ్యముగల బోధకులు. మిక్కిలి శక్తివంతమైన వారి బోధన మాదిరి ద్వారా ఉంటుంది. వివాహము మరియు పిల్లల యొక్క ప్రాముఖ్యత, జీవితపు ఉద్దేశ్యము మరియు ఆనందానికి నిజమైన మూలం వంటి నిత్య విలువలను ప్రదర్శించడానిక మరియు నేర్చుకోవడానికి కుటుంబం అనువైన ప్రదేశము. దయ, క్షమాపణ, స్వీయ నియంత్రణ, విద్య మరియు నిజాయితీగల పని యొక్క విలువ వంటి ఇతర ముఖ్యమైన జీవితపు పాఠాలను నేర్చుకోవడానికి కూడా అది ఉత్తమమైన స్థలము.
అయితే, అనేకమంది సంఘ సభ్యులు సువార్త విలువలు మరియు అంచనాలను స్వీకరించని ప్రియమైన కుటుంబ సభ్యులను కలిగియున్నారు. అటువంటి సభ్యులకు మన ప్రేమ మరియు సహనము అవసరము. ఒకరితో ఒకరు సంబంధం పెట్టుకునేటప్పుడు, మనం కోరుకునే పరిపూర్ణత మర్త్యత్వం యొక్క ఒత్తిడితో కూడిన పరిస్థితులకే పరిమితం కాదని మనం గుర్తుంచుకోవాలి. సిద్ధాంతము మరియు నిబంధనలు 138:57–59 లోని గొప్ప బోధన మర్త్యత్వము తరువాత ఆత్మ లోకంలో పశ్చాత్తాపము మరియు ఆత్మీయ అభివృద్ధి కొనసాగవచ్చని మనకు హామీ ఇస్తుంది. మరీ ముఖ్యంగా, ఒకరినొకరు బలోపేతం చేసుకోవడానికి కుటుంబాలు ఏకమైనప్పుడు, యేసు క్రీస్తు యొక్క మహిమగల, రక్షించే ప్రాయశ్చిత్తము కారణంగా మర్త్యత్వములో మనమందరం అనుభవించే పాపాలు మరియు అనివార్యమైన లోపాలు పశ్చాత్తాపము ద్వారా క్షమించబడతాయని మనందరం గుర్తుంచుకోవాలి.
V.
మన రక్షకుడైన యేసు క్రీస్తు మన అంతిమ ఆదర్శప్రాయుడు. ఆయన బోధనలు మరియు స్వీయ-త్యాగాల ప్రకారం మన జీవితాలను తీర్చిదిద్దుకుంటే మనం ఆశీర్వదించబడతాము. క్రీస్తును అనుసరించడం మరియు ఒకరికొకరి సేవలో మనల్ని మనం సమర్పించుకోవడం అనేది ఇప్పుడు సర్వసాధారణంగా కనిపిస్తున్న స్వార్థానికి మరియు వ్యక్తివాదానికి ఉత్తమ పరిష్కారం.
తల్లిదండ్రులు తమ పిల్లలకు సువార్త సూత్రాలతోపాటు ఆచరణాత్మక జ్ఞానాన్ని బోధించాల్సిన బాధ్యత కూడా కలిగియున్నారు. కుటుంబాలు కలిసి అర్థవంతమైన పనులు చేసినప్పుడు వారు ఏకమవుతారు. కుటుంబ తోటలు కుటుంబ అనుబంధాలను నిర్మిస్తాయి. సంతోషకరమైన కుటుంబ అనుభవాలు కుటుంబ బంధాలను బలోపేతం చేస్తాయి. విడిది, క్రీడా కార్యాకలాపాలు మరియు ఇతర వినోదం ప్రత్యేకంగా కుటుంబ అనుబంధాలకు విలువైనది. కుటుంబాలు పూర్వీకులను గుర్తు చేసుకోవడానికి కుటుంబ కలయికలను ఏర్పాటు చేయాలి, అది దేవాలయానికి దారి తీస్తుంది.
తల్లిదండ్రులు పిల్లలకు తోటలో మరియు ఇంటిలో పని చేయడంతో సహా ప్రాథమిక జీవన నైపుణ్యాలను నేర్పించాలి. భాషలను నేర్చుకోవడం అనేది సువార్త సేవ కోసం మరియు ఆధునిక జీవితం కోసం ఉపయోగకరమైన సిద్ధపాటు. ఈ విషయాల బోధకులు తల్లిదండ్రులు లేదా తాత మామ్మలు లేదా విస్తరించిన కుటుంబ సభ్యులు కావచ్చు. కుటుంబము మరియు దాని సభ్యులకు సంబంధించిన అన్ని విషయాలపై ఒక సమూహంగా నేర్చుకొని, కలిసి చర్చించినప్పుడు కుటుంబాలు అభివృద్ధి చెందుతాయి.
“కానీ దానికంతా మాకు సమయం లేదు” అని కొందరు చెప్పవచ్చు. నిజముగా విలువైన దానిని చేయడానికి సమయాన్ని కేటాయించడానికి, చాలామంది తల్లిదండ్రులు తమ సాంకేతిక పరికరాలను ఆపివేస్తే, తమ కుటుంబాన్ని ఉత్తేజపరచగలరని గ్రహిస్తారు. తల్లిదండ్రులారా, గుర్తుంచుకోండి, ఆ పిల్లలు రాత్రి భోజనం కోసం నిజంగా కోరుకునేది మీతో గడిపే సమయం.
వారు కలిసి ప్రార్థించి, దీవెనల కొరకు కృతజ్ఞత చెల్లించడానికి రాత్రి పగలు మోకరించి, ఉమ్మడి సమస్యల కోసం ప్రార్థించినట్లైతే, కుటుంబాలకు గొప్ప దీవెనలు కలుగుతాయి. సంఘ సేవలలో మరియు ఇతర భక్తిసంబంధమైన సందర్భాలలో కుటుంబాలు కలిసి ఆరాధించినప్పుడు కూడా వారు ఆశీర్వదించబడతారు. కుటుంబ కథల ద్వారా, కుటుంబ సంప్రదాయాలను ఏర్పరచడం ద్వారా మరియు పవిత్రమైన అనుభవాలను పంచుకోవడం వలన కూడా కుటుంబ బంధాలు బలపరచబడతాయి. “మన స్వంత జీవితాలు మరియు మన పూర్వీకుల నుండి ప్రేరేపించబడిన కథనాలు … శక్తివంతమైన బోధనా సాధనాలు,” అని అధ్యక్షులు స్పెన్సర్ డబ్ల్యు. కింబల్ మనకు గుర్తు చేసారు. అవి తరచుగా మనకు మరియు మన భావితరాలకు ప్రేరేపణను ఇచ్చే ఉత్తమ వనరులు.
మన నిత్య తండ్రి యొక్క అద్వితీయ కుమారుడైన, ప్రభువైన యేసు క్రీస్తు గురించి నేను సాక్ష్యమిస్తున్నాను. పరలోక కుటుంబ పునఃకలయికకు నడిపించే నిబంధన మార్గాన్ని అనుసరించమని ఆయన మనల్ని ఆహ్వానిస్తున్నారు. కర్ట్‌లాండ్ దేవాలయంలో పునఃస్థాపించబడిన తాళపు చెవుల చేత నిర్దేశించబడి, యాజకత్వము యొక్క ముద్రణా శక్తులు కుటుంబాలను నిత్యత్వం కోసం ఒకచోట చేర్చుతాయి సిద్ధాంతము మరియు నిబంధనలు 110:13–16 చూడండి). అవి ప్రస్తుతం ప్రపంచమంతటా పెరుగుతున్న ప్రభువు యొక్క దేవాలయాలలో ఉపయోగించబడుతున్నాయి. ఇది నిజం. మనం దీనిలో భాగమవుదామని నేను ప్రార్థిస్తున్నాను, యేసు క్రీస్తు నామములో, ఆమేన్.