వారు తమ స్వంత న్యాయాధిపతులైయున్నారు
మనం యేసు క్రీస్తునందు విశ్వాసాన్ని సాధన చేసి, దేవునితో నిబంధనలు చేసి పాటించి, మన పాపాలకు పశ్చాత్తాపపడినట్లైతే, న్యాయపీఠము మనకు ప్రీతికరముగా ఉంటుంది.
మొరోనై నుండి “క్రీస్తు నొద్దకు రండి,” “ఆయనలో పరిపూర్ణులు కండి,” “సమస్త భక్తిహీనతనుండి [మనల్ని మనం] ఉపేక్షించుకొనవలెను” మరియు “[మన] పూర్ణ శక్తి, మనస్సు మరియు బలముతో దేవుడిని ప్రేమించవలెను” అనే ప్రేరేపిత ఆహ్వానాలతో మోర్మన్ గ్రంథము ముగుస్తుంది. ఆసక్తికరంగా, ఆయన బోధనలోని చివరి వాక్యం పునరుత్థానం మరియు అంతిమ తీర్పు రెండింటినీ ముందే సూచిస్తుంది.
“నా ఆత్మ మరియు శరీరము తిరిగి ఏకమై, సజీవులకును మృతులకును నిత్య న్యాయాధిపతియైన గొప్ప యెహోవా యొక్క ప్రీతికరమైన న్యాయపీఠము యెదుట మిమ్ములను కలుసుకొనుటకు ఆకాశమండలము గుండా జయించిన వానిగా నేను ముందుకు తేబడువరకు, దేవుని పరదైసులో విశ్రాంతి పొందుటకు నేను త్వరగా వెళ్ళుదును” అని అతడు చెప్పాడు.
అంతిమ తీర్పును వివరించడానికి మొరోనై “ప్రీతికరమైన” అనే పదాన్ని ఉపయోగించడం నాకు ఆసక్తిని కలిగించింది. మోర్మన్ గ్రంథంలోని ఇతర ప్రవక్తలు కూడా తీర్పును “మహిమకరమైన దినముగా” మరియు మనం “విశ్వాసము గల దృష్టితో ఎదురుచూడవలసినదిగా” వర్ణించారు. అయినప్పటికీ మనం తీర్పు దినం గురించి ఊహిస్తున్నప్పుడు, “సిగ్గు మరియు భయంకరమైన దోషారోపణ,” “భీతి మరియు భయము” మరియు “అంతము లేని దౌర్భాగ్యపు స్థితి” వంటి ఇతర ప్రవచనాత్మక వర్ణనలు గుర్తుకు వస్తాయి.
భాషలో ఈ స్పష్టమైన వ్యత్యాసం, ఆధ్యాత్మికంగా సిద్ధంగా లేని వారి కోసం మొరోనై మరియు ఇతర ప్రవక్తలు హెచ్చరించిన భయంతో కాకుండా, ఆ గొప్ప దినం కోసం ఆతృతగా మరియు ఆశాజనకంగా ఎదురుచూసేందుకు క్రీస్తు యొక్క సిద్ధాంతము వారికి వీలు కల్పించినట్లుగా సూచిస్తుందని నేను నమ్ముతున్నాను. మీరు మరియు నేను ఏమి నేర్చుకోవాలని మొరోనై అర్థం చేసుకున్నాడు?
పరలోక తండ్రి యొక్క సంతోషము మరియు కనికరము యొక్క ప్రణాళికను, తండ్రి ప్రణాళికలో రక్షకుని ప్రాయశ్చిత్త పాత్రను మరియు “తీర్పు దినమున [మన] స్వంత పాపములకు లెక్క అప్పగించవలసియుండుటను” మనం పరిగణిస్తుండగా పరిశుద్ధాత్మ సహాయం కోసం నేను ప్రార్థిస్తున్నాను.
తండ్రి యొక్క సంతోష ప్రణాళిక
తండ్రి ప్రణాళిక యొక్క ప్రధాన ఉద్దేశ్యం, ఆయన ఆత్మీయ పిల్లలు భౌతిక శరీరాన్ని పొందడానికి, మర్త్య అనుభవం ద్వారా “మంచి చెడులను” నేర్చుకోవడానికి, ఆధ్యాత్మికంగా ఎదగడానికి మరియు శాశ్వతంగా అభివృద్ధి చెందడానికి అవకాశాలను కల్పించడం.
సిద్ధాంతము మరియు నిబంధనలు “నైతిక స్వతంత్రతగా” సూచించేది, తన కుమారులు మరియు కుమార్తెలకు అమర్త్యత్వమును, నిత్యజీవమును ఇవ్వాలనే దేవుని ప్రణాళికలో ముఖ్యభాగమైయుంది. ఈ ముఖ్యమైన సూత్రం లేఖనాలలో స్వతంత్రతగా మరియు ఎంచుకోవడానికి, పనిచేయడానికి కావలసిన స్వేచ్ఛగా కూడా వర్ణించబడింది.
“నైతిక స్వతంత్రత” అనే పదం బోధనాత్మకమైనది. “నైతిక” అనే పదానికి పర్యాయపదాలు “మంచి,” “నిజాయితీ” మరియు “సద్గుణము.” “స్వతంత్రత” అనే పదానికి పర్యాయపదాలు “చర్య,” “కార్యాచరణ” మరియు “పని.” కాబట్టి, “నైతిక స్వతంత్రత”ను మంచి, నిజాయితీ, సద్గుణం మరియు సత్యమైన మార్గాలలో మన కోసం ఎంచుకునే మరియు వ్యవహరించే సామర్థ్యంగా, విశేషాధికారంగా అర్థం చేసుకోవచ్చు.
దేవుని యొక్క సృష్టిలో “పనిచేయునవి, పనిచేయబడునవి” రెండూ ఉన్నాయి. మరియు నైతిక స్వతంత్రత అనేది దైవికంగా రూపొందించబడిన “స్వతంత్ర చర్య యొక్క శక్తి”, అది దేవుని పిల్లలుగా మనం చర్య తీసుకోబడే వస్తువులుగా కాకుండా చర్య తీసుకునే ప్రతినిధులుగా మారడానికి మనకు శక్తినిస్తుంది.
పరలోక తండ్రి పిల్లలు “వారి దేవుడైన ప్రభువు వారికి ఆజ్ఞాపించిన సంగతులన్నిటిని గైకొందురో లేదోనని” చూడడానికి నిరూపించబడే స్థలంగా భూమి సృష్టించబడింది. సృష్టి మరియు మన మర్త్య ఉనికి యొక్క ప్రాథమిక ఉద్దేశ్యం ఏమిటంటే, ప్రభువు మనల్ని ఎలా మారమని ఆహ్వానిస్తున్నారో అలా వ్యవహరించడానికి మరియు మారడానికి మనకు అవకాశాన్ని అందించడం.
ప్రభువు హనోకుతో ఇలా చెప్పారు:
“ఇదిగో వీరందరు నీ సహోదరులు; వారు నా హస్తకృత్యములు, వారిని సృజించిన దినమున వారికి గల జ్ఞానమును నేనిచ్చితిని; ఏదేను తోటలో నరునికి నేను స్వతంత్రతను ఇచ్చితిని;
“వారు ఒకరికొకరు ప్రేమ కలిగియుండవలెనని, వారి తండ్రియైన నన్ను ఎన్నుకొనవలెనని నీ సహోదరులకు చెప్పి, ఆజ్ఞను కూడా ఇచ్చితిని.”
స్వతంత్రతను వినియోగించుకోవడానికి ప్రాథమిక ఉద్దేశ్యాలు ఒకరినొకరు ప్రేమించుకోవడం మరియు దేవుణ్ణి ఎన్నుకోవడం. ఈ రెండు ఉద్దేశ్యాలు దేవుణ్ణి మన పూర్ణహృదయముతోను, పూర్ణాత్మతోను, పూర్ణమనస్సుతోను ప్రేమింపవలెను మరియు మన పొరుగువారిని మనవలె ప్రేమింపవలెను అనే మొదటి మరియు రెండవ గొప్ప ఆజ్ఞలతో ఖచ్చితంగా సరిపోతాయి.
మనం ఆజ్ఞాపించబడ్డామని పరిగణించండి—కేవలం హెచ్చరించబడడం లేదా సలహా ఇవ్వబడడం కాదు, కానీ—మన స్వతంత్రతను ఉపయోగించి ఒకరినొకరు ప్రేమించుకోవాలని మరియు దేవుణ్ణి ఎన్నుకోవాలని ఆజ్ఞాపించబడ్డాము. లేఖనాలలో, “నైతిక” అనే సవరించే పదం కేవలం విశేషణం కాదు, బహుశా మన స్వతంత్రతను ఎలా ఉపయోగించాలో తెలియజేసే దైవిక నిర్దేశం కూడా కావచ్చు అని నేను సూచించవచ్చా.
ఒక సుపరిచితమైన కీర్తనకు “Choose the Right [సరైనదాన్ని ఎంచుకోండి]” అనే శీర్షిక ఒక కారణం చేత పెట్టబడింది. మనం కోరుకున్నప్పుడల్లా ఏది చేయాలనుకుంటే అది చేసే నైతిక స్వతంత్రతతో మనం దీవించబడలేదు. బదులుగా, తండ్రి యొక్క ప్రణాళిక ప్రకారం, నిత్య సత్యాన్ని వెదకడానికి మరియు దానికి అనుగుణంగా పనిచేయడానికి మనకు నైతిక స్వతంత్రత లభించింది. “[మనకు మనము] ప్రతినిధులుగా,” మనం ఆతృతతో మంచి కార్యములలో నిమగ్నమై, “[మన] స్వంత ఇష్టపూర్వకముగా అనేక కార్యములు చేసి, అధికమైన నీతిని నెరవేర్చవలెను.”
నైతిక స్వతంత్రత యొక్క నిత్య ప్రాముఖ్యత పూర్వమర్త్య సలహాసభ యొక్క లేఖన వృత్తాంతంలో నొక్కి చెప్పబడింది. తన పిల్లల కోసం చేయబడిన తండ్రి యొక్క ప్రణాళికకు వ్యతిరేకంగా లూసిఫరు తిరుగుబాటు చేశాడు మరియు స్వతంత్ర చర్య యొక్క శక్తిని నాశనం చేయడానికి ప్రయత్నించాడు. విశేషమేమిటంటే, అపవాది యొక్క ధిక్కరణ నేరుగా నైతిక స్వతంత్ర సూత్రంపై కేంద్రీకృతమై ఉంది.
దేవుడు ఇలా వివరించారు, “సాతాను నా యెడల తిరుగుబాటు చేసి … నేను నరునికిచ్చిన స్వతంత్రతను నాశనము చేయుటకు చూచెను, … కాబట్టి, అతడు పడద్రోయబడునట్లు నేను చేసితిని.”
దేవుని పిల్లలు నీతిమంతులుగా ప్రవర్తించగలిగి, “తమకు తాము ప్రతినిధులుగా” మారే సామర్థ్యాన్ని తీసివేయడమే అపవాది యొక్క స్వార్థపూరిత పథకం. పరలోక తండ్రి పిల్లలను కేవలం చర్య తీసుకోబడగల వస్తువులుగా మార్చడమే అపవాది ఉద్దేశం.
చేయడం మరియు మారడం
యేసు క్రీస్తు యొక్క సువార్త మనల్ని ఏదో ఒకటి తెలుసుకోవడానికి మరియు నైతిక స్వతంత్రత యొక్క నీతివంతమైన అభ్యాసం ద్వారా ఏదో ఒకటిగా మారడానికి ఆహ్వానిస్తుందని అధ్యక్షులు డాలిన్ హెచ్. ఓక్స్ నొక్కి చెప్పారు. ఆయన ఇలా చెప్పారు:
“అనేక బైబిలు మరియు ఆధునిక లేఖనాలు అంతిమ తీర్పు గురించి మాట్లాడుతున్నాయి, ఆ సమయంలో జనులందరు తమ కార్యములు లేదా క్రియలు లేదా వారి హృదయ వాంఛల ప్రకారం ప్రతిఫలం పొందుతారు. కానీ ఇతర లేఖనాలు మనం సాధించిన స్థితిని బట్టి తీర్పు తీర్చబడతామని సూచిస్తూ దీనిని విస్తరింపజేస్తున్నాయి.
“మనం ఎలా మారామో అనేదాని పరంగా ప్రవక్త నీఫై అంతిమ తీర్పును గురించి వివరిస్తున్నాడు: ‘వారి క్రియలు మలినమైన యెడల వారు మలినముగా ఉందురు; వారు మలినముగా ఉన్న యెడల, వారు దేవుని రాజ్యములో నివసించలేరు’ [1 నీఫై 15:33; వివరణ చేర్చబడింది]. మొరోనై ఇలా ప్రకటిస్తున్నాడు, ‘మలినమైనవారు ఇంకను మలినముగా ఉందురు మరియు నీతిమంతులు ఇంకను నీతిమంతులుగా ఉందురు’ [మోర్మన్ 9:14; వివరణ చేర్చబడింది].”
అధ్యక్షులు డాలిన్ హెచ్. ఓక్స్ ఇలా కొనసాగించారు: “అటువంటి బోధనల నుండి అంతిమ తీర్పు అనేది మనం చేసిన మంచి చెడుల మొత్తానికి విలువ కట్టడం మాత్రమే కాదని మనం నిర్ధారణకు వస్తాము. అది మనం ఎలా మారాము అనేదానికి—మన చర్యలు మరియు ఆలోచనల తుది ప్రభావానికి గుర్తింపు.”
రక్షకుని యొక్క ప్రాయశ్చిత్తము
మన పనులు మరియు కోరికలు మాత్రమే మనల్ని రక్షించవు మరియు రక్షించలేవు. “మనము సమస్తము చేసిన తర్వాత కూడా,” రక్షకుని యొక్క అనంతమైన మరియు శాశ్వతమైన ప్రాయశ్చిత్త త్యాగం ద్వారా లభించే కృపాకనికరముల ద్వారా మాత్రమే మనం దేవునితో సమాధానపడగలము.
“దేవుని కుమారుడు తన జనులను విమోచించుటకు వచ్చునని, ఆయన వారి పాపముల కొరకు ప్రాయశ్చిత్తము చేయుటకు శ్రమపడి మరణించునని, ఆయన మృతులలో నుండి లేచునని, వారి క్రియలను బట్టి అంత్య మరియు తీర్పు దినమున తీర్పు తీర్చబడుటకు మనుష్యులందరు ఆయన యెదుట నిలబడునట్లు అది పునరుత్థానమును తెచ్చునని ఆయన యందు నమ్ముట మొదలుపెట్టుడి,” అని ఆల్మా ప్రకటించాడు.
“క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము ద్వారా సువార్త నియమములకు, విధులకు విధేయత చూపుట వలన మనుష్యజాతి యావత్తు రక్షింపబడునని కూడా మనము నమ్ముచున్నాము.” మనము నిజంగా “మరలా జన్మించినట్లయితే,” విమోచకునిపై విశ్వాసం ఉంచినట్లయితే, “యథార్థ హృదయముతో” మరియు “నిజమైన ఉద్దేశంతో,” పశ్చాత్తాపపడి, “అంతము వరకు సహించినట్లైతే” మన పాపాలు మరియు దుష్ట కార్యాలు మనకు వ్యతిరేక సాక్ష్యంగా నిలబడవు కాబట్టి, మనం ఎంతో కృతజ్ఞులమై ఉండాలి.
దేవుని యందు భయభక్తులు
మనలో చాలామంది నిత్య న్యాయాధిపతి యొక్క న్యాయపీఠము యెదుట హాజరు కావడం ఇహలోక న్యాయస్థానంలో జరిగే విచారణలా ఉంటుందని ఆశించవచ్చు. ఒక న్యాయాధిపతి అధ్యక్షత్వం వహిస్తారు. ఆధారాలు సమర్పించబడతాయి. తీర్పు ఇవ్వబడుతుంది. తుది ఫలితం ఏమిటో తెలుసుకునే వరకు మనం అనిశ్చితంగా మరియు భయంగా ఉంటాము. కానీ అలాంటి స్వభావ చిత్రీకరణ సరికాదని నేను నమ్ముతున్నాను.
“దేవుని యందు భయభక్తులు” లేదా “యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట” అని లేఖనాలు వర్ణించేది మనం తరచుగా అనుభవించే మర్త్య భయాలకు భిన్నంగా ఉంటుంది, కానీ వాటికి సంబంధించినది. భయాన్ని మరియు అందోళనను కలిగించే లోక సంబంధమైన భయములా కాకుండా, దేవుని యందు భయభక్తులు మన జీవితాల్లోకి శాంతిని, అభయాన్ని మరియు నమ్మకాన్ని ఆహ్వానిస్తాయి.
నీతివంతమైన భయం అంటే ప్రభువైన యేసు క్రీస్తు పట్ల లోతైన భక్తిగల గౌరవం మరియు విస్మయం, ఆయన ఆజ్ఞలపట్ల విధేయత, ఆయన చేతిలో అంతిమ తీర్పు మరియు న్యాయము గూర్చి ఎదురుచూడడం. విమోచకుని దైవిక స్వభావం మరియు లక్ష్యం గురించి సరైన అవగాహన, మన చిత్తాన్ని ఆయన చిత్తానికి సమర్పించుకోవాలనే సంకల్పం మరియు తీర్పు దినమున ప్రతి పురుషుడు మరియు స్త్రీ తన స్వంత మర్త్య కోరికలు, ఆలోచనలు, మాటలు మరియు చర్యలకు జవాబుదారీగా ఉంటారనే జ్ఞానం నుండి దేవుని యందు భయభక్తులు పెరుగుతాయి.
దేవుని యందు భయభక్తులు అంటే తీర్పు తీర్చబడడానికి ఆయన సన్నిధిలోకి అయిష్టంగా భయపడుతూ రావడం కాదు. బదులుగా, అది మన గురించి విషయాలు “అవి వాస్తవముగా ఉన్నట్లు” మరియు “వాస్తవముగా ఉండబోవునట్లు” చివరికి అంగీకరించే అవకాశం.
భూమిపై జీవించిన, ఇప్పుడు జీవిస్తున్న మరియు ఇంకా జీవించబోయే ప్రతీ వ్యక్తి “అవి మంచివేగాని చెడ్డవేగాని [అతని లేదా ఆమె] క్రియలను బట్టి ఆయన ద్వారా తీర్పు తీర్చబడుటకు దేవుని న్యాయస్థానము యెదుట నిలువబడుటకు తేబడును.”
మన కోరికలు నీతివంతమైనవి మరియు మన పనులు మంచివి అయితే—అనగా మనం యేసు క్రీస్తునందు విశ్వాసాన్ని సాధన చేసి, దేవునితో నిబంధనలు చేసి పాటించి, మన పాపాలకు పశ్చాత్తాపపడినట్లైతే—అప్పుడు న్యాయపీఠము మనకు ప్రీతికరముగా ఉంటుంది. ఈనస్ ప్రకటించినట్లుగా, మనం “[విమోచకుని] యెదుట నిలబడతాము; అప్పుడు [మనం] ఆయన ముఖమును సంతోషముతో చూచెదము.” మరియు చివరి రోజున మనం “నీతిని ప్రతిఫలముగా పొందుతాము.”
దీనికి విరుద్ధంగా, మన కోరికలు చెడ్డవి మరియు మన పనులు దుష్టమైనవి అయితే, అప్పుడు న్యాయపీఠము భయానికి కారణమవుతుంది. మనకు “పరిపూర్ణ జ్ఞానము,” “స్పష్టమైన జ్ఞాపకము,” మరియు “[మన] స్వంత దోషము యొక్క సజీవమైన భావన” ఉంటాయి. “మనము మన దేవుని వైపు చూచుటకు ధైర్యము చేయలేము; మీరు మా మీద పడి ఆయన సన్నిధి నుండి మమ్ములను మరుగుచేయమని బండలను, పర్వతములను మనము ఆజ్ఞాపించగలిగిన యెడల మనము సంతోషించెదము.” మరియు చివరి రోజున మనం “దుష్టత్వానికి [మన] ప్రతిఫలం పొందుతాము.”
చివరికి, మనమే మన స్వంత న్యాయాధిపతులమైయున్నాము. మనం ఎక్కడికి వెళ్ళాలో ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభువు సన్నిధిలో, మనం మర్త్యత్వంలో ఏమి కావడానికి ఎంచుకున్నామో గుర్తిస్తాము మరియు నిత్యత్వములో మనం ఎక్కడ ఉండాలో మనకై మనం తెలుసుకుంటాము.
వాగ్దానము మరియు సాక్ష్యము
అంతిమ తీర్పు ప్రీతికరమైనది కాగలదని అర్థం చేసుకోవడం మొరోనైకి మాత్రమే పరిమితమైన దీవెన కాదు.
రక్షకుని పట్ల అంకితభావం కలిగియున్న ప్రతీ శిష్యుడికి అందుబాటులో ఉన్న వాగ్దాన దీవెనలను ఆల్మా వివరించాడు. ఆయన ఇలా చెప్పారు:
“పునరుత్థానము యొక్క అర్థము, చెడుకు చెడు లేదా శరీర సంబంధమైన దానికి శరీర సంబంధమైన దానిని లేదా అపవాది సంబంధమైన దానికి అపవాది సంబంధమైన దానిని—మంచిదైన దానికి మంచి దానిని, నీతియైన దానికి నీతియైన దానిని, న్యాయమైన దానికి న్యాయమైన దానిని, కనికరముగల దానికి కనికరముగల దానిని యథాస్థితికి తెచ్చుటయైయున్నది.
“… న్యాయముగా వ్యవహరించుము, నీతిగా తీర్పు తీర్చుము మరియు నిరంతరము మేలు చేయుము; నీవు ఈ క్రియలన్నిటినీ చేసిన యెడల, అప్పుడు నీవు నీ ప్రతిఫలమును పొందెదవు; కనికరము నీకు తిరిగి పునఃస్థాపించబడును; న్యాయము నీకు తిరిగి పునఃస్థాపించబడును; న్యాయమైన తీర్పు నీకు తిరిగి పునఃస్థాపించబడును; మరలా నీవు మంచిని ప్రతిఫలముగా కలిగియుందువు.”
యేసు క్రీస్తు మన సజీవ రక్షకుడని నేను ఆనందంగా సాక్ష్యమిస్తున్నాను. ఆల్మా యొక్క వాగ్దానం నిజమైనది మరియు మీకు, నాకు వర్తిస్తుంది—ఈ రోజు, రేపు మరియు శాశ్వతంగా. ఆవిధంగా నేను ప్రభువైన యేసు క్రీస్తు యొక్క పవిత్ర నామములో సాక్ష్యమిస్తున్నాను, ఆమేన్.