ఆశానిగ్రహమనే సుగుణంతో అలంకరించబడింది
ఆశానిగ్రహం అనే క్రీస్తు వంటి సద్గుణంతో మన మనస్సులను మరియు హృదయాలను అలంకరించుకోవాలని నేను మనందరికీ హృదయపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాను.
2021, మే లో, సాల్ట్ లేక్ దేవాలయ పునర్నిర్మాణ పనులను సందర్శించినప్పుడు, కాల పరీక్షకు నిలిచిన భౌతిక మరియు ఆధ్యాత్మిక కళాఖండమైన ఆ పవిత్ర కట్టడాన్ని పరిమిత వనరులు మరియు అచంచల విశ్వాసంతో నిర్మించిన అగ్రగాముల ప్రయత్నాలను చూసి అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఆశ్చర్యపోయారు. అయితే, కాలక్రమేణా దేవాలయ మూల పునాది రాళ్లలో అంతరాలు మరియు రాతి పనిలో అస్థిరతకు కారణమైన కోత ప్రభావాలను కూడా ఆయన గమనించారు, ఇది నిర్మాణాత్మకంగా బలపరచవలసిన అవసరం యొక్క స్పష్టమైన సంకేతాలను సూచిస్తుంది.
ప్రకృతి శక్తులను తట్టుకునేందుకు దేవాలయ పునాదిని బలోపేతం చేయడానికి ముఖ్యమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నట్లే, యేసు క్రీస్తులో మన స్వంత ఆధ్యాత్మిక పునాదిని బలోపేతం చేయడానికి మనం కూడా అసాధారణ చర్యలు—బహుశా మనం ఇంతకు ముందు ఎన్నడూ తీసుకోని చర్యలు—తీసుకోవాలని మన ప్రియమైన ప్రవక్త మనకు బోధించారు. ఆయన చిరస్మరణీయ సందేశంలో, వ్యక్తిగతంగా ఆలోచించడానికి ఆయన మనకు రెండు గంభీరమైన ప్రశ్నలను ఇచ్చారు: “మీ పునాది ఎంత దృఢంగా ఉంది? మీ సాక్ష్యాన్ని మరియు సువార్త యొక్క మీ అవగాహనను ఏవిధంగా బలోపేతం చేయడం అవసరం?”
యేసు క్రీస్తు యొక్క సువార్త, మన ఆత్మలలో ఆధ్యాత్మిక వినాశనాన్ని నివారించడానికి దైవికంగా ప్రేరేపించబడిన మరియు ప్రభావవంతమైన మార్గాలను అందిస్తుంది, మన పునాదిని శక్తివంతంగా బలోపేతం చేస్తుంది, మన విశ్వాసంలో అంతరాలను, మన సాక్ష్యంలో మరియు సువార్త యొక్క పవిత్ర సత్యాలను అర్థం చేసుకోవడంలో అస్థిరతను నివారించడానికి సహాయపడుతుంది. ఈ ఉద్దేశ్యాన్ని సాధించడానికి ఒక ప్రత్యేక సందర్భోచిత సూత్రం సిద్ధాంతము మరియు నిబంధనలు యొక్క 12వ ప్రకరణంలో కనుగొనబడింది, ఇది ప్రవక్త జోసెఫ్ స్మిత్ ద్వారా జోసెఫ్ నైట్‌కు ఇవ్వబడిన ఒక బయల్పాటు, అతను ప్రభువు చిత్తాన్ని అర్థం చేసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించిన నీతిమంతుడు, కేవలం బాహ్య మార్పు కోసం కాదు, కానీ తన శిష్యత్వంలో స్థిరంగా నిలబడడానికి—“ఆకాశవిశాల స్తంభాల వలె స్థిరంగా” ఉండడానికి ప్రయత్నించినవాడు. ప్రభువు ఇలా ప్రకటించారు:
“ఇదిగో, నేను నీతోను, ఈ కార్యమును ముందుకు తీసుకొనివచ్చి, స్థాపించుటకు కోరికలుగల వారందరితో మాట్లాడుచున్నాను;
“అతని సంరక్షణలో ఉంచబడిన ఏ విషయమందైనను వినయము కలిగి, ప్రేమాపూర్ణుడై, విశ్వాసము, నిరీక్షణ, దాతృత్వము కలిగియుండి, అన్ని విషయములందు నిగ్రహము కలిగియుంటే తప్ప ఎవడునూ ఈ కార్యమునందు సహకరించలేడు.”
ఈ పవిత్ర బయల్పాటులో నమోదు చేయబడిన రక్షకుని మార్గదర్శకత్వం, యేసు క్రీస్తులో దృఢమైన పునాదికి ఆశానిగ్రహం ఒక ముఖ్యమైన మద్దతు అని మనకు గుర్తు చేస్తుంది. సేవ చేయడానికి పిలువబడిన వారికి మాత్రమే కాకుండా, ప్రభువుతో పవిత్ర నిబంధనలు చేసి, విశ్వాసంతో ఆయనను అనుసరించడానికి అంగీకరించే వారందరికీ ఇది ఆవశ్యకమైన సద్గుణాలలో ఒకటి. ఆశానిగ్రహం ఈ బయల్పాటులో ప్రస్తావించబడిన ఇతర క్రీస్తు వంటి లక్షణాలను సమన్వయం చేస్తుంది మరియు బలపరుస్తుంది: అవి వినయం, విశ్వాసం, నిరీక్షణ, దాతృత్వం మరియు ఆయన నుండి ప్రవహించే స్వచ్ఛమైన ప్రేమ. ఇంకా, ఆశానిగ్రహాన్ని పెంపొందించుకోవడం అనేది యేసు క్రీస్తులో మన పునాదిని బలహీనపరిచే ప్రాపంచిక ప్రభావాల వల్ల కలిగే సూక్ష్మమైన కానీ స్థిరమైన ఆధ్యాత్మిక వినాశనానికి వ్యతిరేకంగా మన ఆత్మలను రక్షించడానికి ఒక అర్థవంతమైన మార్గం.
క్రీస్తు యొక్క నిజమైన శిష్యులను అలంకరించే లక్షణాలలో ఆశానిగ్రహం రక్షకుని ప్రతిబింబంగా నిలుస్తుంది, ఇది ఆత్మ యొక్క విలువైన ఫలం, దైవిక ప్రభావంచేత మార్గనిర్దేశం చేయబడడానికి ఇష్టపడే వారందరికీ అందుబాటులో ఉంటుంది. ఇది హృదయానికి సామరస్యాన్ని తెచ్చే సద్గుణం, కోరికలు మరియు భావోద్వేగాలను జ్ఞానం మరియు ప్రశాంతతతో రూపొందిస్తుంది. లేఖనాలలో, ఆశానిగ్రహం మన ఆధ్యాత్మిక ప్రయాణంలో పురోగతి యొక్క ముఖ్యమైన భాగంగా ప్రదర్శించబడింది, మన భావాలను, మన మాటలను మరియు మన చర్యలను శుద్ధి చేస్తూ సహనం, దైవభక్తి మరియు కరుణ వైపు నడిపిస్తుంది.
ఈ క్రీస్తువంటి లక్షణాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నించే క్రీస్తు యొక్క శిష్యులు మరింత వినయంగా మారతారు మరియు ప్రేమతో నిండియుంటారు. వారిలో ప్రశాంతమైన బలం పుడుతుంది మరియు వారు కోపాన్ని అదుపులో ఉంచుకోవడంలో, ఓర్పును పెంపొందించుకోవడంలో, ప్రతికూల గాలులు తీవ్రంగా వీచినప్పుడు కూడా ఇతరులతో సహనం, గౌరవం మరియు మర్యాదతో వ్యవహరించడంలో మంచి సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. వారు ఉద్రేకంతో వ్యవహరించడానికి ప్రయత్నించరు, కానీ సాత్వికత మరియు పరిశుద్ధాత్మ యొక్క సున్నితమైన ప్రభావంతో నడిపించబడిన ఆధ్యాత్మిక జ్ఞానంతో వ్యవహరించడానికి ఎంచుకుంటారు. ఈ విధంగా, వారు ఆధ్యాత్మిక వినాశనానికి తక్కువ అవకాశం కలిగి ఉంటారు, ఎందుకంటే అపొస్తలుడైన పౌలు బోధించినట్లుగా, ఆయన గురించి వారి సాక్ష్యాన్ని బలహీనపరిచే శ్రమలను ఎదుర్కొన్నప్పుడు కూడా వారు తమను బలపరచు క్రీస్తు యందు సమస్తము చేయగలరని వారికి తెలుసు.
రక్షకునికి ప్రాతినిధ్యం వహించి, విశ్వాసం మరియు అంకితభావంతో ఆయన చిత్తాన్ని చేయాలనుకునే వారి అర్హతల గురించి పౌలు తీతుకు రాసిన లేఖలో పవిత్ర సలహా ఇచ్చాడు. వారు అతిథిప్రియులుగా, స్వస్థబుద్ధిగలవారిగా, నీతిమంతులుగా, పవిత్రులుగా ఉండాలని ఆయన చెప్పాడు—ఈ లక్షణాలు ఆశానిగ్రహము యొక్క ప్రభావాన్ని స్పష్టంగా ప్రతిబింబిస్తాయి.
అయితే, వారు “స్వేచ్ఛాపరులుగా, ముక్కోపిగా, … కొట్టేవారిగా ఉండకూడదు” అని పౌలు హెచ్చరించాడు. ఇటువంటి లక్షణాలు రక్షకుని మనసుకు విరుద్ధంగా ఉంటాయి మరియు నిజమైన ఆధ్యాత్మిక వృద్ధిని నిరోధిస్తాయి. లేఖన సందర్భంలో, “స్వేచ్ఛాపరునిగా ఉండడు” అంటే అహంకారం మరియు గర్వంతో వ్యవహరించడానికి నిరాకరించేవాడు; “ముక్కోపి కాదు” అంటే అసహనంగా మరియు చిరాకుగా మారాలనే సహజ కోరికను నివారించేవాడు; మరియు “కొట్టనివాడు” అంటే మాటలతో, భౌతికంగా మరియు భావోద్వేగపరంగా వివాదాస్పదమైన, కలహపూరితమైన మరియు కఠినమైన ప్రవర్తనను తిరస్కరించేవాడు. మనం విశ్వాసం మరియు వినయంతో మన ప్రవర్తనను మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, మనం ఆయన కృప యొక్క దృఢమైన శిలకి స్థిరంగా లంగరు వేయబడవచ్చు మరియు ఆయన పరిశుద్ధ చేతుల్లో స్వచ్ఛమైన, మెరుగుపెట్టబడిన సాధనాలుగా మారవచ్చు.
ఆశానిగ్రహం అనే సద్గుణాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరాన్ని గురించి ఆలోచిస్తుండగా, ప్రవక్త సమూయేలు తల్లి హన్నా చెప్పిన మాటలు నాకు గుర్తుకు వస్తున్నాయి—ఆమె గొప్ప విశ్వాసం కలిగిన స్త్రీ, గొప్ప శ్రమల తర్వాత కూడా ఆమె ప్రభువుకు కృతజ్ఞతా గీతాన్ని పాడింది. ఆమె ఇలా చెప్పింది, “యెహోవా అనంతజ్ఞానియగు దేవుడు; ఆయనే క్రియలను పరీక్షించువాడు: ఇకను అంత గర్వముగా మాటలాడకుడి; గర్వపుమాటలు మీ నోట రానియ్యకుడి.” ఆమె పాట ప్రార్థన కంటే ఎక్కువైనది—అది వినయం, స్వీయ నియంత్రణ మరియు మితంగా వ్యవహరించడానికి స్వీయ-సంబోధిత ఆహ్వానం. నిజమైన ఆధ్యాత్మిక బలం హఠాత్తు ప్రతిచర్యలలో లేదా అహంకారపూరితమైన మాటలలో వ్యక్తపరచబడదని, కానీ ప్రభువు జ్ఞానంతో అనుసంధానించబడిన మితమైన, ఆలోచనాత్మక వైఖరులలో వ్యక్తపరచబడుతుందని హన్నా మనకు గుర్తు చేస్తుంది.
తరచుగా, ప్రపంచం కలహం, అహంకారం, అసహనం మరియు అతిశయోక్తి నుండి పుట్టిన ప్రవర్తనలను ఉన్నతీకరిస్తుంది, తరచుగా అలాంటి వైఖరులను దైనందిన జీవితంలోని ఒత్తిళ్లు, ధ్రువీకరణ మరియు ప్రజాదరణ వైపు మొగ్గు ద్వారా సమర్థిస్తుంది. మనం ఆశానిగ్రహం అనే సద్గుణం నుండి మన దృష్టిని మరల్చినప్పుడు మరియు మన ప్రవర్తనలో, మాట్లాడే విధానంలో పరిశుద్ధాత్మ యొక్క సున్నితమైన మరియు మితమైన ప్రభావాన్ని విస్మరించినప్పుడు, మనం సులభంగా శత్రువు ఉచ్చులో పడిపోతాము, అది అనివార్యంగా మన సామాజిక, కుటుంబ లేదా మతపరమైన సంబంధాలలో కూడా మనం తీవ్రంగా చింతించే మాటలు ఉచ్ఛరించడానికి మరియు వైఖరిని అవలంబించడానికి మనల్ని నడిపిస్తుంది. యేసు క్రీస్తు యొక్క సువార్త ముఖ్యంగా సవాళ్ళు గల సమయాల్లో ఈ సద్గుణాన్ని సాధన చేయమని మనల్ని ఆహ్వానిస్తుంది, ఎందుకంటే ప్రత్యేకించి ఈ సందర్భాలలోనే వ్యక్తుల యొక్క నిజమైన స్వభావం బయటపడుతుంది. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ఒకసారి చెప్పినట్లుగా, “ఒక వ్యక్తి యొక్క నిజమైన బలం జీవితం సులభంగా ఉన్నప్పుడు ప్రదర్శించబడదు, కానీ ఆ వ్యక్తి కష్టాలు మరియు సంఘర్షణలను అనుభవించినప్పుడు బాగా ప్రదర్శించబడుతుంది.”
నిబంధన జనులుగా, ప్రభువుకు చేసిన పవిత్ర వాగ్దానాలపట్ల లోతైన ఆధ్యాత్మిక నిబద్ధతతో జీవించడానికి, ఆయన తన పరిపూర్ణ మాదిరి ద్వారా స్థాపించిన నమూనాను జాగ్రత్తగా అనుసరించడానికి మనం పిలువబడ్డాము. బదులుగా ఆయన ఇలా వాగ్దానమిచ్చారు, “నిశ్చయముగా, నిశ్చయముగా నేను మీతో చెప్పుచున్నాను, ఇదే నా సిద్ధాంతము; దీనిపైన కట్టువారు నా బండ మీద కట్టుదురు మరియు పాతాళలోక ద్వారములు వారి యెదుట నిలువనేరవు.”
Let Not Your Heart Be Troubled (మీ హృదయమును కలవరపడనియ్యకుడి), హావర్డ్ లియోన్ చేత, Havenlight యొక్క సౌజన్యంతో
భూమిపై రక్షకుని పరిచర్య ఆయన స్వభావం యొక్క అన్ని అంశాలలో ఆశానిగ్రహం యొక్క సద్గుణంతో గుర్తించబడింది. తన పరిపూర్ణ మాదిరి ద్వారా, ఆయన మనకు “శ్రమలయందు సహనము కలిగియుండము, దూషించు వారిని దూషించకుము” అని బోధించారు. కలహాలు మరియు వివాదాల కారణంగా మనం కోపానికి లొంగిపోకూడదని ఆయన బోధించినప్పుడు, ఆయన ఇలా ప్రకటించారు: “మీరు పశ్చాత్తాపపడి చిన్నబిడ్డవలె కావలెను.” హృదయం యొక్క పూర్ణ ఉద్దేశ్యంతో ఆయన వద్దకు రావాలనుకునే వారందరూ తాము కోపంగా ఉన్న వారితో లేదా తమకు వ్యతిరేకంగా ఏదైనా కలిగి ఉన్న వారితో రాజీపడాలని కూడా ఆయన బోధించారు. మనల్ని కఠినంగా, నిర్దయగా, అగౌరవంగా లేదా నిర్లక్ష్యంగా చూసినప్పుడు, ఆయన కృప మనల్ని విడిచిపోదని, సమాధాన విషయమైన ఆయన నిబంధన మన జీవితాల నుండి తొలగిపోదని నిశ్చల వైఖరి మరియు కరుణా హృదయంతో ఆయన మనకు హామీ ఇచ్చారు.
కొన్ని సంవత్సరాల క్రితం, నేను, నా భార్య మెక్సికో నగరంలో కొంతమంది విశ్వాసులైన సంఘ సభ్యులను కలిసే పవిత్రమైన విశేషాధికారాన్ని పొందాము. వారిలో చాలామంది, వ్యక్తిగతంగా లేదా వారి ప్రియమైనవారి ద్వారా, అపహరణలు, నరహత్యలు మరియు ఇతర హృదయ విదారక విషాదాలతో సహా వర్ణించలేని శ్రమలను భరించారు.
ఆ పరిశుద్ధుల ముఖాల్లోకి మేము చూసినప్పుడు, కోపం, ఆగ్రహం లేదా ప్రతీకారం తీర్చుకోవాలనే కోరిక మాకు కనిపించలేదు. బదులుగా, మేము నిశ్శబ్ద వినయాన్ని చూశాము. వారి ముఖాలు, దుఃఖంతో గుర్తించబడినప్పటికీ, స్వస్థత మరియు ఓదార్పు కోసం హృదయపూర్వకమైన కోరికను ప్రసరింపజేశాయి. బాధతో వారి హృదయాలు విరిగిపోయినప్పటికీ, ఈ పరిశుద్ధులు యేసు క్రీస్తుపై విశ్వాసంతో ముందుకు సాగారు, వారి బాధలు వారి విశ్వాసంలో అంతరాలుగా మారకూడదని లేదా సువార్త గురించి వారి సాక్ష్యంలో అస్థిరతను కలిగించకూడదని ఎంచుకున్నారు.
ఆ పవిత్ర సమావేశం ముగింపులో, మేము వారిలో ప్రతి ఒక్కరినీ పలకరించాము. ప్రతి కరచాలనం, ప్రతి ఆలింగనం, ప్రభువు సహాయంతో జీవితంలోని నిరాశలు మరియు సవాళ్లపట్ల మనం నిగ్రహంతో స్పందించగలమని నిశ్శబ్ద సాక్ష్యంగా మారింది. వారి నిశ్శబ్దమైన మరియు నిరాడంబరమైన మాదిరి అన్ని విషయాలలో ఆశానిగ్రహంతో రక్షకుని మార్గంలో నడవడానికి ఒక సున్నితమైన ఆహ్వానంగా పనిచేసింది. మేము దేవదూతల సమక్షంలో ఉన్నట్లుగా భావించాము.
అందరికంటే గొప్పవాడైన యేసు క్రీస్తు, ప్రతి స్వేదరంధ్రం నుండి రక్తం కారే వరకు మన కోసం బాధపడ్డారు, అయినప్పటికీ ఆయన తన హృదయం కోపంతో రగిలిపోవడానికి ఎప్పుడూ అనుమతించలేదు, అలాంటి బాధల మధ్య కూడా ఆయన పెదవుల నుండి కలహపూరితమైన, అభ్యంతరకరమైన లేదా అపవిత్రమైన మాటలు బయటకు రాలేదు. పరిపూర్ణ ఆశానిగ్రహం మరియు సాటిలేని సాత్వికతతో, ఆయన తన గురించి తాను ఆలోచించలేదు, కానీ దేవుని పిల్లలలో ప్రతీ ఒక్కరి గురించి—గతం, వర్తమానం మరియు భవిష్యత్తులోని వారి గురించి ఆలోచించారు. అపొస్తలుడైన పేతురు క్రీస్తు యొక్క ఉన్నతమైన వైఖరికి సాక్ష్యమిస్తూ ఇలా ప్రకటించాడు: “ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు; ఆయన శ్రమపెట్టబడియు బెదిరింపక, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను.” అత్యంత వేదనను అనుభవిస్తూ కూడా, రక్షకుడు పరిపూర్ణమైన మరియు దైవికమైన ఆశానిగ్రహాన్ని ప్రదర్శించారు. ఆయన ఇలా ప్రకటించారు, “అయినప్పటికీ, తండ్రికి మహిమ కలుగును గాక మరియు నేను త్రాగి, నరుల సంతానము కొరకైన సిద్ధపాటులను ముగించితిని.”
నా ప్రియమైన సహోదర సహోదరీలారా, మన ప్రియమైన అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ గారి ప్రవచనాత్మక పిలుపుకు పవిత్ర ప్రతిస్పందనగా, మన మనస్సులను మరియు హృదయాలను ఆశానిగ్రహం అనే క్రీస్తు వంటి సద్గుణంతో అలంకరించుకోవాలని నేను మనందరికీ హృదయపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాను. మన చర్యలు మరియు మాటలలో ఆశానిగ్రహమనే సూత్రాన్ని ఉద్దేశపూర్వకంగా చేర్చడానికి విశ్వాసంతో, శ్రద్ధతో మనం కృషి చేస్తున్నప్పుడు, మన విమోచకుని యొక్క నిశ్చయమైన పునాదిపై మన జీవితాలను మరింత సురక్షితంగా బలోపేతం చేసుకుంటామని మరియు లంగరు వేస్తామని నేను సాక్ష్యమిస్తున్నాను.
నిరంతరం ఆశానిగ్రహాన్ని పాటించడం మన ఆత్మను శుద్ధి చేసి, రక్షకుని ముందు మన హృదయాన్ని పవిత్రం చేస్తుందని, క్రమంగా మనల్ని ఆయనకు దగ్గరగా తీసుకువెళుతుందని మరియు ఆయన రెండవ రాకడ సమయంలో మనం ఆయనను కలిసే ఆ మహిమాన్వితమైన రోజు కోసం నిరీక్షణతో, శాంతితో మనల్ని సిద్ధం చేస్తుందని నేను గంభీరంగా సాక్ష్యమిస్తున్నాను. మన రక్షకుడైన యేసు క్రీస్తు నామములో నేను ఈ పవిత్ర మాటలను పంచుకుంటున్నాను, ఆమేన్.