నువ్వు నిజంగా ఎవరో తెలుసుకో
శిష్యత్వ మార్గంలో మనం ఎక్కడ ఉన్నా, మనం నిజంగా ఎవరమనేది బాగా అర్థం చేసుకుంటే మన జీవితాలు సంపూర్ణముగా మారతాయి.
చాలా సంవత్సరాల క్రితం, మా కుమార్తె తన మిషనులో గంభీరమైన అనుభవాన్ని పొందింది. ఆమె ఆమోదంతో, ఆ వారం ఆమె మాకు రాసిన దాని నుండి ఒక సారాంశాన్ని నేను పంచుకుంటున్నాను:
“నిన్నటి దినము, తిరిగి వచ్చిన ఒక సభ్యురాలు మమ్మల్ని వీలైనంత త్వరగా రమ్మని అడిగారు. మేము అక్కడికి చేరుకునేసరికి, ఆమె నేలపై పడి, ఆపుకోలేకుండా ఏడుస్తూ కనిపించింది. కన్నీళ్లతో, ఆమె ఉద్యోగం కోల్పోయిందని, ఆమె అపార్ట్‌మెంట్ నుండి గెంటివేయబడబోతోందని, మరోసారి నిరాశ్రయురాలవుతుందని మాకు చెప్పింది.”
మా కుమార్తె ఇలా కొనసాగించింది: “నేను వేగంగా నా లేఖనాలను వెదకడం మొదలుపెట్టాను, ఆమెకు సహాయపడే వచనం—ఏదైనా—ఏమైనా కనుగొనడానికి ప్రయత్నించాను. నేను సరియైన వచనం కోసం చూస్తున్నప్పుడు ఇలా ఆలోచించాను, ‘నేను ఏమి చేస్తున్నాను? క్రీస్తు ఇలా చేయరు. ఇది నేను పరిష్కరించగల సమస్య కాదు, కానీ ఆమె నా సహాయం అవసరమైన దేవుని కుమార్తె.’ కాబట్టి, నేను నా లేఖనాలను మూసివేసి, ఆమె పక్కన మోకరిల్లి, ఆమె లేచి నిలబడి ఈ పరీక్షను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండే వరకు ఆమెతో కలిసి ఏడుస్తూ ఆమెను పట్టుకున్నాను.”
ఆ స్త్రీ ఓదార్చబడిన తర్వాత, మా కుమార్తె, ఆమె దైవిక విలువ యొక్క వాస్తవికతను అర్థం చేసుకోవడానికి మరియు మన ఉనికి యొక్క అత్యంత ప్రాథమిక సత్యాలలో ఒకటైన—మనం దేవుని ప్రియమైన కుమారులు మరియు కుమార్తెలమని, మనం బాధపడుతున్నప్పుడు మన పట్ల పరిపూర్ణ కరుణను కలిగియున్న దేవుడు మనం తిరిగి నిలబడడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారని ఆమెకు బోధించడానికి లేఖనాలను ఉపయోగించింది.
మన సువార్తికులు బోధించే సిద్ధాంతంలోని మొదటి అంశమైన దేవుడు మన ప్రియమైన పరలోక తండ్రి అనేది జ్ఞానోదయం కలిగిస్తుంది. ప్రతి తదుపరి సత్యం మనం నిజంగా ఎవరు అనే ప్రాథమిక అవగాహనపై ఆధారపడి ఉంటుంది.
ప్రాథమిక ప్రధాన అధ్యక్షురాలు, సూసన్ హెచ్. పోర్టర్ ఇలా బోధించారు: “దేవుని బిడ్డగా మీరెంత పరిపూర్ణంగా ప్రేమించబడుతున్నారో తెలుసుకొని, అర్థం చేసుకున్నప్పుడు అది సమస్తాన్ని మార్చివేస్తుంది. మీరు తప్పులు చేసినప్పుడు మీ గురించి మీరు భావించే విధానాన్ని అది మారుస్తుంది. కష్టమైన విషయాలు జరిగినప్పుడు మీరు భావించే విధానాన్ని అది మారుస్తుంది. దేవుని ఆజ్ఞలను మీరు చూసే విధానాన్ని అది మారుస్తుంది. ఇతరుల పట్ల మీ దృష్టిని మరియు మార్పు తేవడంలో మీ సామర్థ్యాన్ని అది మారుస్తుంది.”
దేవునితో ముఖాముఖిగా మాట్లాడేటప్పుడు మోషేకు కలిగిన అనుభవం గురించి మనం చదివినప్పుడు ఈ మార్పు వివరించబడింది. ఆ సంభాషణ సమయంలో, దేవుడు మోషేకు తన దైవిక వారసత్వం గురించి పదే పదే బోధించారు, “మోషే, నీవు నా కుమారుడివి” అన్నారు. మోషే ఆయన అద్వితీయ కుమారుని పోలియున్నాడని దేవుడు వివరించారు. తాను ఎవరు అని, తాను చేయవలసిన కార్యము ఉందని, తనకు ప్రేమగల పరలోక తండ్రి ఉన్నారని మోషే స్పష్టంగా అర్థం చేసుకున్నాడు.
ఈ అనుభవం తర్వాత, అపవాది అతడిని శోధించుటకు వచ్చి వెంటనే, “మనుష్య కుమారుడవైన మోషే,” అని పలికాడు. ఇది అపవాది ఆయుధశాలలో ఒక సాధారణమైన మరియు ప్రమాదకరమైన సాధనం. మన పరలోక తండ్రి మనం ఆయన బిడ్డలమని నిరంతరం ప్రేమతో గుర్తు చేస్తున్నప్పుడు, అపవాది మన బలహీనతలను బట్టి మనపై ముద్ర వేయడానికి ఎల్లప్పుడూ ప్రయత్నిస్తాడు. కానీ మోషే తాను “మనుష్యకుమారుని” కంటే ఎక్కువ అని అప్పటికే తెలుసుకున్నాడు. అతను సాతానుకు, “నీవెవడవు? ఇదిగో, నేను దేవుని కుమారుడను,” అని ప్రకటించాడు. అదేవిధంగా, మనం మర్త్యత్వపు సవాళ్లను ఎదుర్కొన్నప్పుడు లేదా మన బలహీనతలను బట్టి ఎవరైనా మనల్ని ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నట్లు మనకు అనిపించినప్పుడు, మనం నిజంగా ఎవరమనే జ్ఞానంలో మనం బలంగా నిలబడాలి. మనం ఇతరుల నుండి కాదు, దేవుని నుండి ధృవీకరణ పొందాలి. మరియు మనం అలా చేసినప్పుడు, మనం కూడా ధైర్యంగా, “నేను దేవుని బిడ్డను” అని ప్రకటించగలము.
వయో జనుల కోసం ప్రపంచవ్యాప్త భక్తి కార్యక్రమంలో, మన ప్రియమైన అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఇలా బోధించారు: “కాబట్టి నువ్వు ఎవరు? అన్నిటికంటే ముందు, నీవు ఒక దేవుని బిడ్డవు, ఒక నిబంధన బిడ్డవు మరియు యేసు క్రీస్తు యొక్క శిష్యుడవు. నీవు ఈ సత్యాలను హత్తుకున్నప్పుడు, ఆయన పరిశుద్ధ సన్నిధిలో శాశ్వతంగా జీవించాలనే నీ అంతిమ లక్ష్యాన్ని చేరుకోవడానికి మన పరలోక తండ్రి నీకు సహాయం చేస్తారు.”
ఆయనతో మనకున్న సంబంధాన్ని దేవుడు గుర్తుచేస్తున్నారు అనేది యాదృచ్ఛికం కాదు, చాలాసార్లు లేఖనంలో పునరావృతం చేయబడినది. సంస్కార ప్రార్థనలో, ఆయనను గుర్తించగల అన్ని నామములలో, తనను “దేవా, నిత్యుడవగు తండ్రీ,” అని పిలవమని ఆయన కోరారు.
మనం నిజంగా ఎవరమో తెలుసుకున్న కొద్దీ, మన ప్రియమైన పరలోక తండ్రి మనం ఆయనతో తిరిగి జీవించడానికి మన కొరకు ఒక ప్రణాళికను అందించారని మరింత బలంగా నమ్ముతాము. ఎల్డర్ పాట్రిక్ కీరన్ ఇలా బోధించారు: “మన తండ్రి యొక్క అందమైన ప్రణాళిక, ఇంకా ఆయన ‘అద్భుతమైన’ ప్రణాళిక, మిమ్మల్ని గృహానికి తీసుకురావడానికి రూపొందించబడింది, దూరంగా ఉంచడానికి కాదు. … దేవుడు నిరంతరం మీతో అనుబంధాన్ని కోరుతూనే ఉన్నారు.” ఒక్క క్షణం ఈ విషయం గురించి ఆలోచించండి—సర్వశక్తిమంతుడైన, ప్రేమగల మన తండ్రి “నిరంతరం మీతో అనుబంధాన్ని కోరుతూనే ఉన్నారు.”
శిష్యత్వ మార్గంలో మనం ఎక్కడ ఉన్నా, మనం నిజంగా ఎవరమనేది బాగా అర్థం చేసుకుంటే మన జీవితాలు సంపూర్ణముగా మారతాయి. ఈ అవగాహనను మరింతగా పెంచుకోవడానికి నేను రెండు మార్గాలను సూచిస్తాను.
మొదటిది, ప్రార్థన
రక్షకుడు తన మర్త్య పరిచర్యను ప్రారంభిస్తున్నప్పుడు, ఆయన “దేవునితో ఉండడానికి” అరణ్యములోనికి నడిపించబడ్డారు. బహుశా మనం కేవలం ప్రార్థనలు చేయడం నుండి ప్రతిరోజూ నిజంగా దేవునితో సంభాషించడానికి మరియు “దేవునితో ఉండడానికి” తగినంత సమయం తీసుకొనేలా మన ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలి.
నా తండ్రితో మాట్లాడడానికి సిద్ధపడేందుకు కొన్ని నిమిషాలు కేటాయించినప్పుడు నా ప్రార్థనల నాణ్యత మెరుగుపడుతుందని నేను కనుగొన్నాను. ఇది పనిచేసే ఒక నమూనా అని లేఖనాలు మనకు చూపిస్తున్నాయి. అది జోసెఫ్ స్మిత్ అయినా; హీలమన్ కుమారుడు నీఫై అయినా; లేదా ఈనస్ అయినా, దేవునితో నమోదు చేయబడిన వారి సంభాషణకు ముందు అందరూ ఏదో ఒక రకమైన ధ్యానం మరియు ఆలోచన కలిగి ఉంటారు. అతని తండ్రి యొక్క మాటలు అతని హృదయములో లోతుగా నాటుకుపోయినందున అతని ఆత్మ ఆకలిగొనెనని ఈనస్ చెప్పాడు. “దేవునితో ఉండే” సమయం కోసం ప్రతిరోజూ ఆధ్యాత్మికంగా సిద్ధపడవలసిన అవసరాన్ని ఈ ఉదాహరణలలో ప్రతీ ఒక్కటి మనకు బోధిస్తుంది.
రక్షకుడు నీఫైయులకు ఇలా ఆదేశించారు, “నీవు ప్రార్థన చేయునప్పుడు, నీ గది లోనికి వెళ్ళి తలుపువేసి, రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము.”
అది గదిలో అయినా లేదా పడకగదిలో అయినా, మీరు ఒంటరిగా ప్రార్థన చేయడానికి, మీ ఆత్మను నిశ్చలంగా ఉంచడానికి మరియు “మిక్కిలి నిమ్మళముగా మాటలాడు ఒక స్వరము” యొక్క ప్రేరణలను అనుభవించడానికి ఒక స్థలాన్ని కనుగొనడమే సూత్రం. మనం కృతజ్ఞతతో ఉన్న విషయాల గురించి మరియు మన తండ్రి వద్దకు మనం తీసుకురావాలనుకుంటున్న ప్రశ్నలు లేదా ఆందోళనల గురించి ఆలోచించడం ద్వారా మనం సిద్ధపడవచ్చు. మనం వాడుక పద్ధతిలో ప్రార్థించడం కాకుండా, వీలైతే మన తండ్రితో బిగ్గరగా మాట్లాడడానికి ప్రయత్నించాలి.
మన జీవితాల్లోని గందరగోళంలో, మనం పసిపిల్లలతో కుస్తీ పడుతున్నప్పుడు లేదా సమావేశాల మధ్య పరిగెడుతున్నప్పుడు, మనకు విలాసవంతమైన నిశ్శబ్ద గదులు మరియు ఆలోచనాత్మక సిద్ధపాటు ఉండకపోవచ్చు—కానీ మనం రోజు ప్రారంభంలో “దేవునితో ఉండడానికి” ప్రయత్నించినప్పుడు ఆ నిశ్శబ్ద, శీఘ్ర మరియు అత్యవసర ప్రార్థనలు చాలా అర్థవంతంగా ఉంటాయి.
చాలా కాలంగా ప్రార్థన చేయని వారు లేదా తమ ప్రార్థనలు వినబడుతున్నాయని భావించని వారు కొందరు ఉండవచ్చు. మీ పరలోక తండ్రి మిమ్మల్ని ఎరిగియున్నారని, మిమ్మల్ని ప్రేమిస్తున్నారని మరియు మీ నుండి వినాలని కోరుతున్నారని నేను మీకు వాగ్దానం చేస్తున్నాను. ఆయన మీతో సంభాషించాలని కోరుకుంటున్నారు. మీరు ఎవరో మీరు గుర్తుంచుకోవాలని ఆయన కోరుకుంటున్నారు.
ఎల్డర్ జెఫ్రీ ఆర్. హాలండ్ ఇటీవల ఇలా బోధించారు: “మీరు ఎంత గొప్పగా ప్రార్థిస్తున్నా, ఇంకా ప్రార్థించండి. మీరు ఎంత గట్టిగా ప్రార్థించినా, ఇంకా గట్టిగా ప్రార్థించండి.”
మన ప్రార్థనలను తరచుగా చేయడం మరియు వాటి తీవ్రతను పెంచడంతో పాటు, ప్రతిరోజూ మోర్మన్ గ్రంథాన్ని అధ్యయనం చేయడం మరియు దేవాలయములో ఆరాధించడం మన మనస్సులను బయల్పాటు కోసం సిద్ధం చేయడంలో సహాయపడుతుంది. మన పరలోక తండ్రితో మన సంభాషణను మెరుగుపరచుకోవడానికి మనం కృషి చేస్తున్నప్పుడు, మనం ఆయన పిల్లలమని మరింత గాఢంగా భావించేలా ఆయన మనల్ని దీవిస్తారు.
రెండవది, యేసే క్రీస్తు అని తెలుసుకోండి
ఆయన పిల్లలుగా మనపై పరలోక తండ్రికి ఉన్న ప్రేమకు గొప్ప నిదర్శనం ఏమిటంటే, మనం ఇంటికి తిరిగి రావడానికి సహాయం చేయడానికి ఆయన తన కుమారుడిని, మన స్వంత రక్షకుడిని పంపారనే వాస్తవికత. కాబట్టి, మనము ఆయనను తెలుసుకోవలసిన అవసరం ఉంది.
చాలా సంవత్సరాల క్రితం, స్టేకు అధ్యక్షుడిగా పనిచేస్తున్నప్పుడు, దేవాలయంలో విధి పనివాడిగా సేవచేయడానికి ఒక సహోదరుడి కోసం నేను సిఫార్సును సమర్పించాను. అతను ఎంత అద్భుతమైన విధి పనివాడు అవుతాడో వివరించిన తర్వాత, నేను అనుకోకుండా “ఆమోదించవద్దు” అని నొక్కాను, అదే సిఫార్సును నేను సమర్పించాను. నేను ఈ సందేశాన్ని రద్దు చెయ్యడానికి ప్రయత్నించి విఫలమైన తర్వాత, దేవాలయ అధ్యక్షుడికి ఫోన్ చేసి, “నేను ఘోరమైన తప్పు చేశాను” అని చెప్పాను. ఆ మంచి దేవాలయ అధ్యక్షుడు, సంకోచం లేకుండా, “అధ్యక్షులు ఏర్, క్షమించబడనిది మరియు తుదకు సరిదిద్దలేనిది ఏదీ మీరు చేయలేదు” అని అన్నారు. ఎంత గొప్ప సత్యము. వాస్తవానికి, యేసు క్రీస్తు “రక్షించుటకు శక్తిమంతుడు.”
2019 లో దేవాలయ సిఫార్సు ప్రశ్నలలో గొప్ప మార్పు వచ్చింది. గతంలో, మన రక్షకుడిగా మరియు విమోచకుడిగా యేసు క్రీస్తు యొక్క పాత్ర గురించి మీకు సాక్ష్యం ఉందా అని ఒక ప్రశ్న అడిగేవారు. ఇప్పుడు మీ రక్షకుడిగా మరియు విమోచకుడిగా ఆయన పాత్ర గురించి మీకు సాక్ష్యం ఉందా అని అడుగుతున్నారు. యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము ఇతరులకు మాత్రమే కాదు; అది మీ కొరకు మరియు నా కొరకు పనిచేస్తుంది. ఆయనే నా రక్షకుడు. ఆయనే మీ రక్షకుడు. వ్యక్తిగతంగా. ఆయన ద్వారా మాత్రమే మీరు మరియు నేను మన తండ్రితో ఉండడానికి తిరిగి వెళ్ళగలము.
కాబట్టి, సహోదర సహోదరీలారా, మనం ఆయనను వెతుకుదాం. తండ్రితో మరియు మనలో ప్రతీ ఒక్కరితో ఆయనకున్న దైవిక సంబంధాన్ని అధ్యయనం చేద్దాం. మనం పశ్చాత్తాపపడినప్పుడు, మన విమోచకుడి ద్వారా మనలో ప్రతీ ఒక్కరికి వ్యక్తిగతంగా వచ్చే విమోచించు ప్రేమ గీతమును పాడడాన్ని అనుభవిద్దాం. “రక్షించుటకు శక్తిమంతుడైనవాని” గురించి మనం తెలుసుకున్నప్పుడు, దేవుని పిల్లలుగా, మనమే ఆయన ఆనందము—ఆయన అతి ముఖ్యమైన దృష్టి అని—మరియు మనలో ప్రతి ఒక్కరూ రక్షింపబడడానికి విలువైనవారమని మనం అర్థం చేసుకుంటాము.
మనకు ప్రేమగల పరలోక తండ్రి ఉన్నారని నేను సాక్ష్యమిస్తున్నాను. బలమైన ప్రార్థన, వ్యక్తిగత బయల్పాటు మరియు యేసు క్రీస్తు యొద్దకు వచ్చుట ద్వారా మనం ఈ నిత్య సత్యాన్ని తెలుసుకున్నప్పుడు, మనం ఇప్పుడు మరియు ఎల్లప్పుడూ “నేను దేవుని బిడ్డను” అని ధైర్యంగా ప్రకటించగలము. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.