దేవుని వైపు చూచి జీవించుము
దేవుని వైపు చూడడం ద్వారా మాత్రమే వ్యక్తులు, కుటుంబాలు మరియు దేశాలు కూడా అభివృద్ధి చెందగలవు.
గత జూన్‌లో, దక్షిణ ఆఫ్రికాలోని లెసూతో దేశంలో ఒక ఘోర ప్రమాదం జరిగింది. వారి జిల్లా నుండి యువతుల సమావేశం కోసం సంఘం యొక్క మపూత్సో శాఖకు చెందిన 20 మంది యువతులు మరియు వారి ఏడుగురు నాయకులతో కూడిన చిన్న బస్సు రాజధాని నగరం మాసెరుకు వెళుతోంది. ఉదయం వారు రెండు వరుసల రహదారిపై ప్రయాణిస్తుండగా, ఎదురుగా వస్తున్న ఒక కారు, మరొక వాహనాన్ని దాటడానికి ప్రయత్నిస్తూ, బస్సు వెళుతున్న వరుసలోకి దూసుకెళ్లింది. ఎదురుగా ఢీకొనకుండా ఉండేంత స్థలం కానీ, సమయం కానీ లేదు మరియు కొన్ని క్షణాల్లో వాహనాలు ఢీకొని, రోడ్డు పైనుండి బోల్తా పడి, మంటల్లో చిక్కుకున్నాయి.
ఈ ప్రమాదంలో మొత్తం 15 మంది మరణించారు, వారిలో ఆరుగురు యువతులు, ఇద్దరు యువతుల నాయకులు, శాఖాధ్యక్షుడు మరియు అతని భార్య ఉన్నారు. ప్రాణాలతో బయటపడినవారు, కుటుంబ సభ్యులు మరియు స్నేహితులు కోపం, నిరాశ మరియు అపరాధ భావనతో సహా అనేక రకాల భావోద్వేగాలను వ్యక్తం చేశారు. ఈ భావాలు మరియు సమాధానం లేని ప్రశ్నలు ఉన్నప్పటికీ, వారు ఒకరినొకరు ఓదార్చుకున్నారు మరియు పవిత్ర సంగీతం, లేఖనాలు మరియు ప్రార్థన ద్వారా దేవుని వైపు తిరిగారు, అక్కడ వారు ఓదార్పును పొందారు. ప్రాణాలతో బయటపడిన పదిహేడేళ్ల సెట్సొవానా సెలబెలి, “యేసు క్రీస్తు మనల్ని ప్రేమిస్తారు మరియు మన హృదయాలు గాయపడినప్పటికీ మనతో ఉన్నారు” అని సాక్ష్యమిచ్చింది.
కాలిన గాయాలతో ఆసుపత్రిలో చేరిన ఒక యువతి మరియు ఒక నాయకురాలు కలిసి మోర్మన్ గ్రంథాన్ని అధ్యయనం చేశారు. ఒకరు ఇలా అన్నారు, “ఇటీవల, మేము మొరోనై నుండి చదువుతున్నాము మరియు మొరోనై నేను భావిస్తున్న దానినే సరిగ్గా చెబుతున్నాడు. అతను మాట్లాడేటప్పుడు, ‘మీరు ఈ పదాలు నేర్చుకోవాలి, ఎందుకంటే మీరు దీనిని ఎదుర్కోవడంలో సహాయపడేందుకు అవి మీ కోసం వ్రాయబడ్డాయి’ అని అతను చెబుతున్నట్లుగా ఉంది.”
మరణించిన వారి కోసం జరిగిన ఉమ్మడి అంత్యక్రియల కార్యక్రమంలో, ప్రాంతీయ డెబ్బదియైన ఎల్డర్ సియాబొంగా మఖైజ్ ఇలా సలహా ఇచ్చారు, “ఈ సమయంలో మనమందరం ప్రభువు వైపు తిరిగి, మన హృదయాలను ఓదార్చమని మరియు మనం అనుభవించే బాధను తగ్గించమని ఆయనను అడగాలి.” పొరుగున ఉన్న లెరీబె శాఖకు చెందిన యువతుల అధ్యక్షురాలు మాంఫో మకూరా ఇలా వేడుకున్నారు: “ప్రభువు వైపు తిరగండి మరియు ఆయన చిత్తాన్ని అంగీకరించే బలాన్ని కనుగొనండి. యేసు క్రీస్తే ‘మన విశ్వాసానికి కర్త మరియు దానిని కొనసాగించువాడు’ [హెబ్రీయులకు 12:2]. అటూ ఇటూ చూడకుండా ఆయన వైపు చూడండి.”
ఆయన వైపు చూడండి. ఆమె మాటలు ఆల్మా తన కుమారుడైన హీలమన్‌కు ఇచ్చిన సలహాను ప్రతిధ్వనిస్తున్నాయి: “దేవుని వైపు చూచి జీవించుము.” లియహోనాతో లీహై మరియు అతని ప్రజల అనుభవాన్ని ఆల్మా ఒక సూచనగా ఉదహరించాడు: “వాగ్దానదేశమునకు తిన్నని మార్గమును వారికి చూపు ఈ దిక్సూచి పట్ల శ్రద్ధ చూపుట మన పితరులకు ఎంత సులభముగా ఉండెనో, అట్లే నిత్య సంతోషమునకు తిన్నని మార్గమును మీకు చూపు క్రీస్తు యొక్క మాట పట్ల శ్రద్ధ చూపుట అంతే సులభమైయున్నది.” “వారు చూచిన యెడల వారు జీవించెదరు. … మరియు మనము చూచిన యెడల మనము నిరంతరము జీవించెదము,” అని ఆల్మా చెప్పాడు.
మరొక సందర్భంలో, ప్రాచీన ఇశ్రాయేలీయులు తాపకరమైన సర్పములచేత బాధించబడినప్పుడు మోషే పైకెత్తిన ఇత్తడి సర్పాన్ని ఆల్మా ఉదాహరణగా చెప్పాడు. “తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభముమీద పెట్టుము; అప్పుడు కరవబడిన ప్రతివాడును దానివైపుచూచి బ్రదుకునని” ప్రభువు మోషేతో చెప్పారు. ఇత్తడి ప్రతిమ సిలువపై ఎత్తబడే క్రీస్తుకు ఒక సూచన లేదా చిహ్నం అని ఆల్మా వివరించాడు. చాలామంది చూసి జీవించారు, కానీ ఇతరులు, ఆల్మా చెప్పినట్లుగా, “చాలా కఠినంగా” ఉన్నారు, వారు చూడనందున నశించారు.
ఆల్మా ఇలా అడిగాడు:
“ఓ నా సహోదరులారా, మీరు స్వస్థపరచబడునట్లు మీ కన్నులెత్తినంత మాత్రము చేత మీరు స్వస్థపరచబడిన యెడల మీరు త్వరితముగా చూచెదరా లేదా మీరు నశించునట్లు మీ హృదయములను అవిశ్వాసమందు కఠినపరచుకొని మీ కన్నులెత్తక సోమరులుగా ఉందురా?”
“ … అప్పుడు మీ కన్నులెత్తి దేవుని కుమారుడు తన జనులను విమోచించుటకు వచ్చునని, ఆయన వారి పాపముల కొరకు ప్రాయశ్చిత్తము చేయుటకు శ్రమపడి మరణించునని, ఆయన మృతులలో నుండి లేచునని, వారి క్రియలను బట్టి అంత్య మరియు తీర్పు దినమున తీర్పు తీర్చబడుటకు మనుష్యులందరు ఆయన యెదుట నిలబడునట్లు అది పునరుత్థానమును తెచ్చునని ఆయన యందు నమ్ముట మొదలుపెట్టుడి.”
“దేవుని వైపు చూచి జీవించుము” అనే సలహా మనకు నిత్యత్వంలో మాత్రమే అర్థవంతమైనది కాదు, కానీ మన మర్త్య జీవితాల స్వభావం మరియు నాణ్యతపై కూడా అధిక ప్రభావాన్ని చూపుతుంది. లెసూతోలోని యువ సహోదరి సెలబెలి ఇదివరకే చెప్పిన మాటలను గుర్తుంచుకోండి—“యేసు క్రీస్తు మనల్ని ప్రేమిస్తారు మరియు మన హృదయాలు గాయపడినప్పటికీ మనతో ఉన్నారు.”
సాతాను క్రోధము రేపుతూ ఉన్న మరియు ప్రతి ఒక్కరూ అసంపూర్ణంగా ఉన్న—పతనమైన ప్రపంచపు స్వభావంలో నిరాశలు మరియు నేరాలు, బాధలు మరియు దుఃఖం, వైఫల్యం మరియు నష్టం, హింస మరియు అన్యాయం ఉంటాయి. దేవుని వైపు చూడడం ద్వారా మాత్రమే వ్యక్తులు, కుటుంబాలు మరియు దేశాలు కూడా అభివృద్ధి చెందుతాయి. అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఇలా బోధించారు, “రక్షకుడు తన అనంతమైన ప్రాయశ్చిత్తము ద్వారా, మనలో ప్రతీఒక్కరిని బలహీనత, పొరపాటులు, పాపము నుండి విమోచించినందు వలన మరియు మీరు ఎప్పుడైనా కలిగియుండగల ప్రతీ బాధను, విచారాన్ని, భారాన్ని ఆయన అనుభవించినందు వలన [ఆల్మా 7:11–13 చూడండి], మీరు నిజంగా పశ్చాత్తాపపడి, ఆయన సహాయం కోరినప్పుడు, మీరు నేటి అనిశ్చితమైన ప్రపంచపు సవాళ్ళను జయించగలరు.”
మోర్మన్ గ్రంథంలో ఇంతకంటే ఎక్కువ తరచుగా పునరావృతం చేయబడిన వాగ్దానం మరొకటి లేదు: “నా ఆజ్ఞలను పాటించియున్నంత కాలము మీరు దేశమందు వర్ధిల్లుదురు; కానీ, మీరు నా ఆజ్ఞలను పాటించకుండా ఉన్నంత కాలము మీరు నా సన్నిధి నుండి కొట్టివేయబడుదురు.” శతాబ్దాలుగా మోర్మన్ గ్రంథ ప్రజల సజీవ అనుభవం ఈ మాటల సత్యాన్ని ప్రదర్శిస్తుంది. “వర్ధిల్లడం” అంటే వారి జీవితాల్లో పరలోక మార్గదర్శకత్వాన్ని మరియు ఆశీర్వాదాలను ఆస్వాదించడం. “వర్ధిల్లడం” అంటే వారు వివాహం చేసుకోవడానికి, కుటుంబాలను పెంచడానికి మరియు ఇతరుల అవసరాలను తీర్చడానికి వీలు కల్పించే ఆర్థిక శ్రేయస్సు స్థాయిలను సాధించడం. “వర్ధిల్లడం”లో కష్టాలు మరియు పరీక్షలను అధిగమించే సామర్థ్యం ఉంటుంది. క్రీస్తు యొక్క కృప ద్వారా, “[వారికి] మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరిగాయి,” వారిని శుద్ధి చేసి, ఆయనతో వారి సంబంధాన్ని మరింతగా పెంచాయి.
దేవుని వైపు చూడడమంటే ఆయన ఆజ్ఞలను పాటించడం, ఆయన మద్దతు కోసం నిరంతరం ఆయనకు మొరపెట్టడం, మీ కార్యములన్నిటిలో ప్రభువుతో ఆలోచన చేయడం మరియు రాత్రి పగలు మీ హృదయము దేవునిపట్ల కృతజ్ఞతలతో నిండియుండనివ్వడం అని ఆల్మా వివరించాడు. దేవుని ఆజ్ఞలు మరియు సలహా లేఖనాలలో మరియు ఆయన సేవకుల మాటలలో కనిపిస్తాయి. “కుటుంబము: ప్రపంచమునకు ఒక ప్రకటన”లో పొందుపరచబడిన సూత్రాలు మరియు ఆదర్శాలు ఒక ప్రధాన ఉదాహరణ. మరొకటి యౌవనుల బలము కొరకు అనే పుస్తకంలో కనిపించే మార్గదర్శకత్వం. “క్రీస్తు వైపు చూడుము” అనేది ఈ సంవత్సరం కొరకు యువతీ యువకుల ఇతివృత్తం, ఇది “ప్రతి ఆలోచనలో నా వైపు చూడుడి;సందేహించవద్దు, భయపడవద్దు” అని జోసెఫ్ స్మిత్ మరియు ఆలివర్ కౌడరీలకు ప్రభువు ఇచ్చిన ఓదార్పుకరమైన దిశ నుండి తీసుకోబడింది. యౌవనుల బలము కొరకు దేవుని అత్యంత అవసరమైన అనేక ఆజ్ఞలు మరియు ప్రమాణాలను గురించి మాట్లాడుతుంది మరియు మంచి నిర్ణయాలు తీసుకోవడంలో ప్రభువు వైపు ఎలా చూడాలో బోధిస్తుంది. ఇది యౌవనులకే కాదు, మనందరికీ మార్గదర్శి.
ఒక ముఖ్యమైన ఉదాహరణగా, యౌవనుల బలము కొరకు అనే పుస్తకంలో “మీ శరీరము పవిత్రమైనది” అనే అధ్యాయంలో కీలకమైన నడిపింపు ఉంది. “మీ శరీరాన్ని—మరియు ఇతరుల శరీరాలను—గౌరవంగా చూసుకోండి. మీ దుస్తులు, కేశాలంకరణ మరియు రూపము గురించి మీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు, మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి, “నా శరీరాన్ని దేవుడు ఇచ్చిన పవిత్ర బహుమతిగా నేను గౌరవిస్తున్నానా?”
యౌవనుల బలము కొరకు ఇంకా ఇలా చెప్తుంది, “లైంగికతను మరియు లైంగిక భావాలను పవిత్రంగా ఉంచండి. అవి పరిహాసాలుగా లేదా వినోదానికి సంబంధించిన అంశాలుగా ఉండకూడదు. ఒక స్త్రీ మరియు పురుషుని మధ్య వివాహం జరగకుండా, దుస్తులు ధరించినప్పటికీ మరొక వ్యక్తి యొక్క శరీరంలోని వ్యక్తిగత మరియు పవిత్రమైన భాగాలను తాకడం తప్పు. మీరు చేసే పనుల గురించి, చూడడం, చదవడం, వినడం, ఆలోచించడం, పోస్ట్ చేయడం లేదా మెసేజ్ చేయడం వంటి ఎంపికలలో, ఇతరులలో లేదా మీలో ఉద్దేశపూర్వకంగా వ్యామోహముగల భావోద్వేగాలను రేకెత్తించే దేనినైనా నివారించండి.”
ఇది అధ్యక్షులు నెల్సన్ ఇటీవల ఇచ్చిన హెచ్చరికను గుర్తుకు తెస్తుంది:
“ఈ దైవిక చట్టాన్ని ఉల్లంఘించడం కంటే మీ జీవితాన్ని త్వరగా క్లిష్టతరం చేసే విషయాలు చాలా తక్కువగా ఉంటాయి. దేవునితో నిబంధనలు చేసుకున్న మీరు, మీ సాక్ష్యాన్ని కోల్పోవడానికి గల త్వరిత మార్గాలలో ఒకటి అనైతికత.
“… జీవితాన్ని సృష్టించే శక్తి అనేది దైవత్వం యొక్క ఒక ప్రత్యేక హక్కు, ఆయన మర్త్య సంతానం దానిని సాధన చేయడానికి పరలోక తండ్రి అనుమతిస్తారు. అందువలన, సజీవమైన ఈ దైవిక శక్తిని ఉపయోగించడం కోసం దేవుడు స్పష్టమైన మార్గదర్శకాలను ఏర్పాటు చేసారు. శారీరక సాన్నిహిత్యం అనేది కేవలం ఒకరినొకరు వివాహం చేసుకున్న స్త్రీ పురుషుల కొరకైనది.
“ప్రపంచంలో అధికశాతం దీనిని విశ్వసించరు, అయితే ప్రజాభిప్రాయం సత్యానికి మధ్యవర్తి కాదు. అపవిత్రులెవరూ సిలెస్టియల్ రాజ్యాన్ని పొందలేరని ప్రభువు ప్రకటించారు. … ఒకవేళ మీరు అపవిత్రులుగా ఉన్నట్లయితే, పశ్చాత్తాపపడమని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. క్రీస్తు యొద్దకు రండి మరియు మీ పాపాల కొరకు మీరు పూర్తిగా పశ్చాత్తాపపడినప్పుడు, ఆయన వాగ్దానమిచ్చిన సంపూర్ణ క్షమాపణను పొందండి [యెషయా 1:16–18; సిద్ధాంతము మరియు నిబంధనలు 58:42–43 చూడండి].”
మోర్మన్ గ్రంథ వాగ్దానంలో, వర్ధిల్లడానికి వ్యతిరేకం పేదరికం కాదని గుర్తుంచుకోండి—అది ప్రభువు సన్నిధి నుండి కొట్టివేయబడడం. ఆయన సన్నిధి ఒకరి జీవితంలో ఆయన ఆత్మ ప్రభావాన్ని సూచిస్తుంది. లోకంలోకి వచ్చినప్పుడు అందరూ క్రీస్తు వెలుగుతో నింపబడి ఉంటారు. అదనంగా, కొందరు బాప్తిస్మం తీసుకోవడానికి, పరిశుద్ధాత్మ వరమును మరియు అదనపు వెలుగును పొందడానికి పనిచేస్తారు. ఆయన ప్రేరణను, నడిపింపును ఇస్తారు, పుట్టుకతో వచ్చే ఒకరి బహుమానాలను, సామర్థ్యాలను పెంచి, శుద్ధి చేస్తారు మరియు చెడు ప్రభావాలు, చెడు నిర్ణయాలు, గమ్యం లేని మార్గాలను నివారించడానికి సహాయం చేస్తారు.
మీలాగే, ఒకప్పుడు పరిశుద్ధాత్మ వరాన్ని ఆస్వాదించిన కొంతమంది నాకు తెలుసు, కానీ దేవుని ఆజ్ఞలను పాటించడంలో విఫలమైనందున వారు ఆ ఆశీర్వాదాన్ని కోల్పోయారు. అతిక్రమణ కారణంగా సంఘంలో సభ్యత్వం తొలగించబడిన ఒక వ్యక్తి నాకు ప్రత్యేకంగా గుర్తుకు వస్తున్నాడు. అతని మొదటి ప్రతిస్పందన మనస్తాపం చెందడం అని అతను చెప్పాడు. అపరిపూర్ణ నాయకులచేత తీర్పు తీర్చబడినట్లు అతను భావించాడు. తన ప్రవర్తన తప్పు అని అతనికి తెలుసు, కానీ ఇతరుల తప్పులు మరియు వైఫల్యాలను ఎత్తి చూపడం ద్వారా అతను దానిని సమర్థించుకున్నాడు. కొంతకాలం తర్వాత, సంఘం వెలుపల జీవనశైలిలో పిలుపుల బాధ్యతలు, ఆరాధన సేవలకు హాజరు కావాలని ఆశించబడడం మరియు ఇతరులకు పరిచర్య చేయడం అనేవి లేకుండా అతను సౌకర్యంగా భావించడం ప్రారంభించాడు.
ఇది కొంతకాలం కొనసాగింది, కానీ అతను తన జీవితంలో పరిశుద్ధాత్మ—దేవుని ఉనికి—లేకపోవడాన్ని మరింత తీవ్రంగా భావించడం ప్రారంభించాడు. అనుభవం ద్వారా, రోజురోజుకూ ఆత్మ ద్వారా కలిగే ఓదార్పు, మార్గదర్శకత్వం మరియు విశ్వాసం ఎలా ఉంటుందో అతనికి తెలుసు మరియు అతను దానిని కోల్పోయాడు. చివరికి, పశ్చాత్తాపపడడానికి, నీటి ద్వారా మరియు ఆత్మద్వారా బాప్తిస్మానికి మరోసారి అర్హత సాధించడానికి అవసరమైన దానిని అతను చేశాడు.
అర్థం, ఆనందం మరియు సహాయం కోసం ప్రజలు వెదుకుతున్న వివిధ వనరులకు అంతం లేనట్లు అనిపిస్తుంది. చాలా మంది “గురిని దాటి చూస్తున్నారు.” కానీ మనం “పసిపిల్లలమై యుండి, కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు [లేదా సంప్రదాయానికి] ఇటు అటు కొట్టుకొనిపోతూ” ఉండనవసరం లేదు. దేవుని వైపు చూడడం ద్వారా, కష్టాల్లో మనం శాంతిని కనుగొనవచ్చు, సందేహం మరియు ఆధ్యాత్మిక సవాలు సమయాల్లో కూడా మన విశ్వాసం పెరుగుతూనే ఉంటుంది. వ్యతిరేకత మరియు ఒంటరితనం ఎదుర్కొన్నప్పుడు కూడా మనం బలాన్ని పొందవచ్చు. మనం ప్రస్తుత వాస్తవికతతో ఆదర్శాన్ని సమన్వయం చేసుకోవచ్చు. దేవుడు స్వయంగా నియమించిన దానికంటే నిజంగా వేరే మార్గం లేదు: “భూదిగంతముల నివాసులారా, నావైపు చూచి రక్షణ పొందుడి: దేవుడను నేనే మరి ఏ దేవుడును లేడు.”
దేవుని వైపు చూడడం అంటే ఆయన మన ప్రాధాన్యతలలో ఒకటి మాత్రమే కాదు; బదులుగా, ఆయన మన అత్యున్నత ప్రాధాన్యత అని దానర్థం. గత జూన్‌లో లెసూతోలో జరిగిన ఆ భయంకరమైన ప్రమాదం నాకు మళ్ళీ గుర్తుకు వస్తోంది. ప్రాణాలతో బయటపడిన యువతుల నాయకురాళ్ళలో ఒకరు, సంఘంలో చేరడానికి ముందు దేవుడిని నమ్మని ఆమె ఆసుపత్రి మంచం మీద ఉండి, తన ప్రాణం ఎందుకు కాపాడబడిందో తెలుసుకోవడమే ఇప్పుడు తన ఉద్దేశ్యం అని చెప్పింది. “నాకు జవాబు తెలిస్తే, నిరంతరం దేవుణ్ణి సేవించడం ద్వారా నాకు జవాబు తెలుస్తుంది” అని ఆమె చెప్పింది. “నేను దేవుడిని ప్రేమిస్తున్నానని అనుకునేదాన్ని, కానీ ఇప్పుడు నేను నిజంగా, నిజంగా, నిజంగా, నిజంగా, నిజంగా ఆయనను ప్రేమిస్తున్నాను. ఇప్పుడు ఆయన నా జీవితంలో [మొట్టమొదటి] ప్రాధాన్యత.”
తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మ గురించి నేను సాక్ష్యమిస్తున్నాను, వారు మాట, ఆలోచన, ఉద్దేశ్యం మరియు చర్య యొక్క పరిపూర్ణ ఐక్యతతో, అన్ని మంచి విషయాల కోసం మనం ఎదురుచూడగల ఏకైక దేవుడు. “నా వైపు చూచి, అంతము వరకు సహించుడి మరియు మీరు జీవించెదరు; ఏలయనగా అంతము వరకు సహించువానికి నేను నిత్యజీవము నిచ్చెదను” అనే అద్భుతమైన వాగ్దానాన్ని నెరవేర్చే శక్తి యేసు క్రీస్తు ప్రాయశ్చిత్తం నుండి వచ్చిందని నేను సాక్ష్యమిస్తున్నాను. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.