దేవుని ప్రవక్తలు
రెండవ రాకడ వరకు ప్రతి మంచి విషయాన్ని పట్టుకోవడానికి ప్రవక్త స్వరాన్ని వినడం మరియు పాటించడం చాలా ముఖ్యం.
ప్రియమైన యౌవనులారా, మనము ఎంత అందమైన సమావేశ సభను కలిగియున్నాము! మనం ఇప్పటికే యేసు క్రీస్తు యొక్క ముగ్గురు జీవిస్తున్న అపొస్తలుల నుండి విన్నాము. ఎంత అద్భుతమైన దీవెన! మనం ఇంకా ఒకరి నుండి వింటాము, ఎల్డర్ హెన్రీ బి. ఐరింగ్. ఆధ్యాత్మిక విందు కొనసాగుతుంది!
గత సంవత్సరం నేను మాట్లాడినప్పుడు, గొల్యాతుతో దావీదు అనుభవం ద్వారా ఈ ప్రపంచాన్ని ఎలా ఎదుర్కోవాలో నేర్చుకున్నాము. ఐదు రాళ్ళు గుర్తున్నాయా? ఈ రోజు, మీ వయస్సులో నేను చదివిన ఒక పాత నిబంధన కథనాన్ని పంచుకుంటున్నాను. ఆ కథలోని కథానాయకురాలిగా ఉండాలనే కోరిక నాకు మిగిలిపోయింది. బైబిలు ఆమె పేరు మనకు చెప్పదు, కాబట్టి మనము ఆమెను షూనేము స్త్రీ అని పిలుద్దాము, ఎందుకంటే అది ఆమె పట్టణం పేరు.
ఒకనాడు ప్రవక్త ఎలీషా షూనేము పట్టణము గుండా వెళుతుండగా, అచ్చట “ఘనురాలైన యొక స్త్రీ ఉండెను; ఆమె అతనిని భోజనమునకు రమ్మని [ఆహ్వానించెను] అని మనం చదువుతాము. గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్ల … ఆమె యింట భోజనము చేయుచువచ్చెను.” ఆమె ఇంట్లో భోజనం చేయమని వచ్చిన ఆహ్వానానికి ప్రవక్త ఎలీషా చాలా సంతోషంగా ఉన్నాడని నేను ఊహించాను! అతను ఇప్పటికే చాలాసార్లు భోజనమునకు వెళ్ళియుండెను, ఒకరోజు ఆ స్త్రీ తన భర్తతో అంది, “ఇప్పుడు, మనయొద్దకు వచ్చుచు పోవుచున్నవాడు భక్తిగల దైవజనుడని నేనెరుగుదును.”
“ఇప్పుడు, నాకు అర్థమైంది” అని చెప్పింది. ఎలీషా ప్రవక్త అని ఆమెకు తెలియకుండానే అతనిని తన ఇంటికి ఆహ్వానించినట్లు అనిపిస్తుంది; ఎలీషా చెప్పినది మరియు బోధించినది జాగ్రత్తగా వినుట వలన ఆమె పరిశుద్ధాత్మ ద్వారా తన సాక్ష్యాన్ని పొందింది. (గుర్తుంచుకోండి, ఆ కాలములో చిత్రాలు లేవు! కాబట్టి ప్రవక్తను అతని ముఖం చూసి గుర్తించడం కష్టం.)
కానీ కథ అక్కడితో ముగిసిపోలేదు. ఒకరోజు ఆ స్త్రీ తన భర్తతో ఇలా చెప్పింది, “కావున మనము అతనికి గోడమీద ఒక చిన్నగది కట్టించి … అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీప స్తంభము నుంచుదము; అతడు మనయొద్దకు వచ్చునప్పుడెల్ల అందులో బస చేయవచ్చును.”
ఆ నమ్మకమైన స్త్రీ తన ఇంట్లో ఒక గది కట్టడానికి సిద్ధంగా ఉంది, తద్వారా ఆ ప్రవక్త పట్టణం గుండా వెళ్తున్నప్పుడు బస చేయడానికి స్థలం దొరుకుతుంది!
ఈ అనుభవం నుండి మనం ఈరోజు ఒక శక్తివంతమైన పాఠం నేర్చుకోవచ్చు.
ఎలీషా దేవుని ప్రవక్త అని షూనేమను పట్టణ స్త్రీకి ప్రభువు సాక్ష్యమిచ్చారు మరియు ఆమె అతన్ని స్వాగతించడానికి తన ఇంటిని తెరవడం ద్వారా చర్య తీసుకుంది.
ఈ రోజు మనం కూడా దేవుని ప్రవక్తల యొక్క వ్యక్తిగత సాక్ష్యాన్ని పొందవచ్చు మరియు ఈ కడవరి దినాలలో మన పరలోక తండ్రి మనకు అందించిన సందేశానికి మన హృదయాలను మరియు మనస్సులను—మన గృహమును—తెరవవచ్చు.
ప్రియమైన యౌవనులారా, మిమ్మల్ని మీరు ఈ ప్రశ్న అడగమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను: దేవుని యొక్క సజీవ ప్రవక్తల గురించి నాకు వ్యక్తిగత సాక్ష్యం ఉందా?
ప్రాథమిక అంశంతోనే ప్రారంభిద్దాం.
ప్రవక్త అంటే ఏమిటి? ప్రవక్త అంటే దేవునిచేత పిలువబడిన మరియు దేవుని కొరకు మాట్లాడే వ్యక్తి. పూర్వకాలంలో ఉన్నట్లే ఈరోజు కూడా భూమిపై ప్రవక్తలున్నారు.
ప్రవక్తలు దీర్ఘదర్శులు మరియు బయల్పాటుదారులు. అంటే ఇతరులు చూడలేని వాటిని వారు చూడగలరు మరియు భవిష్యత్తులో జరుగబోయే సంఘటనల గురించి వారు ప్రవచించగలరు. విపత్తుల కొరకు కూడా వారు మనల్ని సిద్ధం చేయగలరు. ప్రవక్తలు ప్రభువు నుండి ఆజ్ఞలను మరియు బయల్పాటులను పొందుతారు. ఈ చివరి రోజుల్లో నిరంతర బయల్పాటు గురించి తొమ్మిదవ విశ్వాస ప్రమాణం మాట్లాడుతుంది. ఆ ప్రమాణం ఇలా చెబుతోంది, “మరియు దేవుడు బయలుపరచిన సమస్తమును, ఇప్పుడు ఆయన బయలుపరచు సమస్తమును మేము నమ్ముచున్నాము, దేవుని రాజ్యమునకు సంబంధించిన గొప్ప మరియు ముఖ్యమైన సంగతులనేకము ఆయన ఇంకా బయలుపరచునని మేము నమ్ముచున్నాము.”
“ప్రభువు ఈ రోజు తన ఆజ్ఞలను మరియు చిత్తాన్ని తన ప్రవక్తలకు బయల్పరుస్తూనే ఉన్నారు, ఎందుకంటే ఆయన మనలను ఈ జీవితంలో ఆనందానికి మరియు తదుపరి జీవితంలో సిలెస్టియల్ మహిమకు నడిపించాలని కోరుకుంటున్నారు” అని ఎల్డర్ గ్యారీ ఈ. స్టీవెన్‌సన్ అన్నారు.
ప్రవక్తలు కూడా సువార్తను ప్రకటిస్తారు, వారు భూమిపై ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రేరేపిత బోధకులు మరియు దేవుని యొక్క దూతలు.
ప్రథమ అధ్యక్షత్వము మరియు పన్నెండుమంది అపొస్తలుల సమూహములోని ప్రతీ సభ్యుడు ఒక ప్రవక్త, దీర్ఘదర్శి మరియు బయల్పాటుదారుడు. ప్రభువు నిర్దేశంలో ఒక సలహాసభగా పనిచేస్తూ, వారు సిద్ధాంతాన్ని ప్రకటించడానికి, వివరించడానికి మరియు ఆయన సంఘానికి విధానాన్ని స్థాపించడానికి అధికారం కలిగియున్నారు. వారు జాగ్రత్తగా ప్రార్థిస్తారు మరియు ఉద్దేశపూర్వకంగా ఆలోచిస్తారు, ఎందుకంటే ఈ సమూహాలలో నిర్ణయాలు ఏకగ్రీవంగా ఉండాలి. ఈ విధంగా, ప్రభువు తన చిత్తం నెరవేరుతుందని మనకు హామీ ఇస్తున్నారు.
ప్రవక్తలు క్రీస్తును గురించి—ఆయన ఉనికి, ఆయన పరిచర్య మరియు ఆయన దైవత్వం గురించి సాక్ష్యమిస్తారు.
మోర్మన్ గ్రంథములోని ప్రవక్తల నుండి కొన్ని సాక్ష్యాలను మనం చదువుదాం.
అబినడై ఇలా ప్రకటించాడు:
“దేవుడు తానే నరుల సంతానము మధ్యకు దిగివచ్చును మరియు తన జనులను విమోచించును.
“ఆయన శరీరమందు నివసించినందున ఆయన దేవుని కుమారుడని పిలువబడును.”
యేసు క్రీస్తు “దేవుని కుమారుడు, భూమ్యాకాశముల యొక్క తండ్రి, ఆది నుండి సమస్త వస్తువుల సృష్టికర్త” అని లేమనీయుడైన సమూయేలు కూడా సాక్ష్యమిచ్చాడు.
మరియు ప్రవక్త మొరోనై ఇలా అన్నాడు, “నేను యేసును చూచియున్నాను మరియు … ఆయన నాతో ముఖాముఖిగా మాట్లాడియున్నారు.”
క్రీస్తు నీఫైయులను సందర్శించినప్పుడు, ఆయన చేసిన మొదటి పనులలో ఒకటి పన్నెండుమంది అపొస్తలులను పిలవడం. మరియు ఆయన ప్రజలతో, “నేను ఎన్నుకొనిన ఈ పండ్రెండుగురి మాటలను మీరు లక్ష్యపెట్టిన యెడల, మీరు ధన్యులు,” అని అన్నారు.
ఇప్పుడు, పిల్లలను పెంచే తల్లిదండ్రులు లేదా ఇతర కుటుంబ సభ్యుల కోసం నేను కొన్ని మాటలు పంచుకుంటాను. ప్రభువు స్వయంగా ఆదాము హవ్వలకు రక్షణ ప్రణాళిక యొక్క సత్యాలను బోధించారు. ఆపై ఆయన వారితో, “కాబట్టి ఈ సంగతులను నిస్సంకోచముగా నీ పిల్లలకు బోధించమని నేను నీకొక ఆజ్ఞనిచ్చుచున్నాను,” అని చెప్పారు.
నిస్సంకోచముగా బోధించడం అంటే అర్థమేమిటి? దానర్థం సువార్త సత్యాలను నేర్చుకోవడం, వాటి గురించి వ్యక్తిగత సాక్ష్యం కలిగియుండడం మరియు ఆ జ్ఞానాన్ని మన పిల్లలతో పంచుకోవడం. అధికారిక మరియు అనధికారిక బోధనా క్షణాలను ప్రోత్సహించడం. ఆ జ్ఞానం మరియు సాక్ష్యం ప్రకారం జీవించడం.
మోర్మన్ గ్రంథము 2,060 యువసైనికులను “వారు సత్యవంతులు నిగ్రహము గలవారైయుండిరి, ఏలయనగా దేవుని ఆజ్ఞలను పాటించవలెనని, ఆయన యెదుట యథార్థముగా నడువవలెనని వారు బోధింపబడియుండిరి,” అని వర్ణించింది. ఈ యువకులు ఆ సమయంలో వారి సైన్యాధిపతి మరియు ప్రవక్త అయిన హీలమన్‌కు నమ్మకంగా విధేయత చూపారు మరియు వారి తల్లులు వారి హృదయాలను సత్యంతో, విశ్వాసంతో నింపారని వారు గుర్తించారు.
తల్లిదండ్రులారా, అనేక స్వరాలు మరియు కొన్నిసార్లు చాలా అంధకారమున్న ఈ ప్రపంచంలో, మీ పిల్లలను వెలుగునందు మరియు సత్యమునందు పెంచమని దేవుడే మనకు ఆజ్ఞాపించారు. మన పిల్లలకు సువార్త యొక్క రక్షణ సత్యాలను బోధించే బాధ్యతను ఆయన మనకు అప్పగించారు. మనం అలా చేయడంలో విఫలమైతే, ప్రపంచం కూడా దానిని చేయదు.
ప్రియమైన యువ స్నేహితులారా, మీ కొరకు నా దగ్గర ఒక ఆహ్వానం ఉంది: రాబోయే రోజుల్లో, మోకరించి, మీ హృదయాలను తెరిచి, ఆయన ఎన్నుకున్న ప్రవక్త మరియు అపొస్తలులు, నేడు భూమిపై యేసు క్రీస్తు యొక్క స్వరమని మీకు ధృవీకరించమని అడుగుతూ పరలోక తండ్రికి విశ్వాసంతో ప్రార్థన చేయమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను.
పరిశుద్ధాత్మ ద్వారా మనం ఆ సాక్ష్యాన్ని పొందగలమని షూనేము స్త్రీ మనకు నేర్పింది. వారు దేవుని అభిషిక్తులని మనం తెలుసుకొని, నమ్మకం, విశ్వాసం మరియు నిరీక్షణతో వారి స్వరాలకు విధేయులుగా ఉన్నపుడు, మనకు నిరంతర సవాళ్లు ఉన్నప్పటికీ, మన జీవితాలు సులభతరంగా మారతాయని నేను మీకు వాగ్దానం చేస్తున్నాను. మన రక్షకుని రెండవ రాకడ వరకు ప్రతి మంచి విషయాన్ని పట్టుకోవడానికి ప్రవక్త స్వరాన్ని వినడం మరియు పాటించడం చాలా ముఖ్యం.
లోకంలో దుష్టత్వం పెరుగుతోంది, కానీ యేసు క్రీస్తు సంఘము మరియు ఆయన రాజ్యం గతంలో కంటే బలంగా ఉన్నాయి. సీయోను తన సుందర వస్త్రములను ధరించుకుంటోంది మరియు క్రీస్తు సింహాసనం కదలక నిత్యము నిలుస్తుంది. మనము మన సాక్ష్యాలలో బలంగా ఉండాలని, విశ్వాసంతో నిండియుండాలని మరియు ప్రతిరోజూ పశ్చాత్తాపపడాలని ప్రభువు ఆశిస్తున్నారు. మన రక్షకుడైన యేసు క్రీస్తు తన కార్యమును కొనసాగించడానికి మనలో ప్రతి ఒక్కరినీ విశ్వసిస్తున్నారు.
ఒకసారి, ప్రవక్త జోసెఫ్ స్మిత్ ఇలా అన్నారు, “సహోదరులారా, మనము ఒక గొప్ప కార్యములో ముందుకు సాగుటలేదా?” అయితే, నా సందేశం ప్రధానంగా యువతరమైన మీ కోసమే కాబట్టి, నేను సహోదరులు అనే పదానికి బదులుగా యౌవనులు అనే పదాన్ని ఉపయోగించాలనుకుంటున్నాను. సిద్ధంగా ఉన్నారా?
”[యౌవనులారా], మనము ఒక గొప్ప కార్యములో ముందుకు సాగటం లేదా? వెనుకకు మరలక ముందుకు సాగుడి. [యౌవనులారా] ధైర్యము తెచ్చుకొనుడి; జయము పొందుటకు ముందుకు సాగుడి! మీ హృదయాలను సంతోషింపజేసి, గొప్ప ఆనందమును పొందనీయుడి.”
జీవించియున్న ప్రవక్తల యొక్క మార్గదర్శకత్వం మరియు అంకితభావంతో కూడిన ప్రయత్నాలకు నేను కృతజ్ఞురాలను. ఈ రోజు భూమిపై ఆయన రాజ్యాన్ని కొనసాగించడానికి, స్థాపించడానికి మరియు నడిపించడానికి వారు దేవునిచే పిలువబడ్డారని నేను మీకు నా పవిత్రమైన సాక్ష్యాన్నిస్తున్నాను. మరియు అది ఎల్లప్పుడూ అలాగే ఉంటుంది. తన సేవకులను ఎల్లప్పుడూ ప్రభువే ఎన్నుకుంటారు. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.