సర్వసభ్య సమావేశము
ఒకరినొకరు ఉత్సాహపరచుకోవడం
2025 అక్టోబరు సర్వసభ్య సమావేశము


11:53

ఒకరినొకరు ఉత్సాహపరచుకోవడం

మన వ్యక్తిగత పరిమితులు మరియు సామర్థ్యం ప్రభువుకు మాత్రమే పూర్తిగా తెలుసు, అందుకే, మన పనితీరును అంచనా వేయడానికి ఆయన మాత్రమే పూర్తిగా అర్హత కలిగియున్నారు.

ఇటీవల నేను ఒక అనుభవాన్ని చదివాను, అది నన్ను గాఢంగా హత్తుకుంది. అది USA మాస్టర్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్ నేషనల్ ఛాంపియన్‌షిప్‌లో జరిగింది—అది వృద్ధుల కోసం జరిగే ఒక పోటీ.

1,500 మీటర్ల ఈవెంట్‌లో పాల్గొన్న వారిలో 100 ఏళ్ల ఓర్విల్ రాజర్స్ ఒకరు. రచయిత ఇలా వ్రాస్తున్నారు:

“స్టార్టర్ పిస్టల్ పేలినప్పుడు, పరిగెత్తేవారు బయలుదేరారు, ఓర్విల్ చివరి స్థానంలో నిలిచాడు, ఆ రేసు మొత్తంలో అతను ఒంటరిగా మిగిలిపోయాడు, చాలా నెమ్మదిగా ముందుకు సాగాడు. ఓర్విల్‌తోపాటు ఉన్న చివరి రన్నర్ పూర్తి చేసే సమయానికి, ఓర్విల్‌కి ఇంకా రెండున్నర రౌండ్‌లు మిగిలి ఉన్నాయి. దాదాపు 3,000 మంది ప్రేక్షకులు నిశ్శబ్దంగా కూర్చుని అతను ట్రాక్ చుట్టూ నెమ్మదిగా తిరుగుతున్న తీరును చూస్తూ ఉన్నారు—పూర్తిగా నిశ్శబ్దంగా మరియు ఒంటరితనంతో అసౌకర్యంగా ఉన్నాడతను.

“[అయితే] అతను తన చివరి రౌండ్‌ను ప్రారంభించినప్పుడు, జనసమూహం లేచి నిలబడి, హర్షధ్వానాలు చేస్తూ, చప్పట్లు కొట్టారు. అతను ముగింపు రేఖను చేరుకునే సమయానికి, జనం కేరింతలు కొడుతున్నారు. వేలాదిమంది ప్రేక్షకుల ప్రోత్సాహంతో, ఓర్విల్ చివరి వరకు తన శక్తిని కూడగట్టుకున్నాడు. అతను ముగింపు రేఖను దాటినప్పుడు మరియు అతని పోటీదారులు అతన్ని ఆలింగనం చేసుకున్నప్పుడు ప్రేక్షకులు ఆనందంతో ఉప్పొంగిపోయారు. ఓర్విల్ వినయంగా మరియు కృతజ్ఞతతో జనసమూహానికి చేయి ఊపి, తన కొత్త స్నేహితులతో కలిసి ట్రాక్ నుండి వెళ్ళిపోయాడు.”

ఇది ఓర్విల్ పాల్గొన్న పోటీల్లో ఐదవ రేసు మరియు ప్రతీ ఇతర పోటీ‌లోనూ అతను చివరి స్థానంలో నిలిచాడు. ఓర్విల్, ఈ వయస్సులో పోటీ చేయకూడదని, అతను ట్రాక్‌పై కూడా ఉండకూడదని, ఎందుకంటే అతని వల్ల పోటీలు చాలా ఆలస్యమయ్యాయని భావించి, అతన్ని తీర్పు తీర్చడానికి కొందరు శోధించబడి ఉండవచ్చు.

అయితే అతను ఎల్లప్పుడూ చివరి స్థానంలో నిలిచినప్పటికీ, ఓర్విల్ ఆ రోజు ఐదు ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టాడు. అతని రేసును చూసే వారెవరూ అది సాధ్యమని నమ్మియుండరు, అయితే ప్రేక్షకులుగాని, అతని పోటీదారులుగాని ఎవరూ అతనిని తీర్పు తీర్చలేదు. ఓర్విల్ ఎటువంటి నియమాలను ఉల్లంఘించలేదు మరియు అధికారులు అతని కోసం ఎటువంటి ప్రమాణాలను తగ్గించలేదు. ఇతర పోటీదారులందరివలే, అతను అదే రేసులో పరిగెత్తాడు మరియు అవే అర్హతలను నెరవేర్చాడు. కానీ అతనిని 100 పైబడిన వయస్సు విభాగంలో ఉంచడం ద్వారా—అతని కష్టం యొక్క స్థాయి—ఈ సందర్భంలో అతని వయస్సు మరియు పరిమిత శారీరక సామర్థ్యం పరిగణనలోకి తీసుకోబడ్డాయి. మరియు విభాగంలో అతను ఐదు ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టాడు.

ప్రతిసారీ ఆ ట్రాక్‌పై అడుగు పెట్టడానికి ఓర్విల్‌కు గొప్ప ధైర్యం అవసరమైనట్లే, రక్షకుడిని అనుసరించడానికి మరియు ఆయనతో వారి నిబంధనలను గౌరవించడానికి భయంకరమైన అసమానతలకు వ్యతిరేకంగా వారు చేయగలిగినంత ఉత్తమంగా చేస్తున్నప్పటికీ, అన్యాయంగా తీర్పు తీర్చబడతారని తెలుసుకున్న మన సహోదరులకు మరియు సహోదరీలకు కూడా అనుదిన జీవిత రంగంలోకి అడుగు పెట్టడానికి గొప్ప ధైర్యం అవసరం.

మనం ప్రపంచంలో ఎక్కడ నివసిస్తున్నా, మన వయస్సు ఎంతైనా, మన పరిస్థితులు లేదా పరిమితులు ఏమైనా, మనం అందరం చెందినవారమని భావించడం, కావలసిన వారమని మరియు అవసరమైనవారమని భావించడం, మన జీవితాలకు ఒక ఉద్దేశ్యం మరియు అర్థం ఉందని భావించడం అనేది మనిషికి గల ప్రాథమిక అవసరం.

రేసు చివరి రౌండ్‌లో, ప్రేక్షకులు ఓర్విల్‌ను ఉత్సాహపరిచారు, ముందుకు సాగడానికి అతనికి బలాన్ని ఇచ్చారు. అతను చివరి స్థానంలో నిలిచాడనేది పెద్ద విషయమే కాదు. పాల్గొన్నవారికి మరియు ప్రేక్షకులకు, ఇది పోటీ కంటే చాలా ఎక్కువ. అనేక విధాలుగా, ఇది రక్షకుని యొక్క ప్రేమను క్రియలలో చూపించే అందమైన ఉదాహరణ. ఓర్విల్ ముగించినప్పుడు, అందరూ కలిసి సంతోషించారు.

మాస్టర్స్ ఛాంపియన్‌షిప్‌లాగా, మన సంఘాలు మరియు కుటుంబాలు మనం ఒకరినొకరు ఉత్సాహపరిచే సమావేశ స్థలాలుగా ఉండవచ్చు—ఒకరిపై ఒకరు క్రీస్తు ప్రేమతో ప్రేరేపించబడిన నిబంధన సంఘాలుగా—మనం ఎదుర్కొనే ఏ సవాలునైనా అధిగమించడానికి ఒకరికొకరు సహాయం చేసుకుంటూ, ఒకరినొకరు తీర్పు తీర్చుకోకుండా ఒకరికొకరు బలంగా మరియు ప్రోత్సాహకరముగా ఉండవచ్చు. మనం ఒకరికొకరం అవసరము. దైవిక బలం ఐక్యత నుండి వస్తుంది, అందుకే సాతాను మనల్ని విభజించాలని ఉద్దేశించాడు.

దురదృష్టవశాత్తు, మనలో కొంతమందికి, అనేక కారణాల వల్ల సంఘానికి హాజరు కావడం కొన్నిసార్లు కష్టంగా ఉంటుంది. అది విశ్వాసానికి సంబంధించిన ప్రశ్నలతో పోరాడుతున్న వ్యక్తి కావచ్చు లేదా సామాజిక ఆందోళన లేదా నిరాశతో బాధపడుతున్న వ్యక్తి కావచ్చు. అది వేరే దేశం, జాతి నుండి వచ్చిన వ్యక్తి కావచ్చు లేదా విభిన్న జీవిత అనుభవాలు లేదా విషయాలను చూసే విధానాలు ఉన్న వ్యక్తి కావచ్చు, వారు ఈ స్వభావమునకు సరిపోరని భావించవచ్చు. అది నిద్రలేమి మరియు మానసిక ఒత్తిడితో బాధపడుతున్న పసిపిల్లలు మరియు చిన్నపిల్లల తల్లిదండ్రులు కావచ్చు లేదా జంటలు, కుటుంబాలతో నిండిన సంఘంలో ఒంటరిగా ఉన్న వ్యక్తి కావచ్చు. అది సంవత్సరాల తరబడి దూరంగా ఉన్న తర్వాత తిరిగి రావడానికి ధైర్యం కూడగట్టుకున్న వ్యక్తి కావచ్చు లేదా తాము సరితూగలేమని, ఎప్పటికీ చెందినవారము కాలేమని నిరంతరం బాధపడే వ్యక్తి కూడా కావచ్చు.

అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఇలా అన్నారు: “మీ వార్డులో ఒక జంట విడాకులు తీసుకున్నా లేదా ఒక యువ సువార్తికుడు ముందుగానే ఇంటికి వచ్చేసినా లేదా ఒక యుక్తవయస్కుడు తన సాక్ష్యాన్ని సందేహించినా, వారికి మీ తీర్పు అవసరం లేదు. మీ మాటలు మరియు చర్యలలో ప్రతిబింబించే యేసు క్రీస్తు ప్రేమను వారు అనుభవించాలి.”

సంఘములో మన అనుభవం ప్రభువుతో మరియు ఒకరితో ఒకరికి మన ఆధ్యాత్మిక, భావోద్వేగ శ్రేయస్సుకు అవసరమైన కీలకమైన సంబంధాలను అందించడానికి ఉద్దేశించబడింది. చేయవలసిన పనుల జాబితాలో టిక్ చేయడం మాత్రమే కాకుండా, దేవుని కుటుంబ సభ్యులుగా, క్రీస్తులో ఒక్క శరీరముగా, ఒకరినొకరు ప్రేమించుకోవడం మరియు శ్రద్ధ వహించడం మన బాధ్యత, ఇది బాప్తిస్మముతో ప్రారంభమై మనం దేవునితో చేసుకునే నిబంధనలలో అంతర్లీనంగా ఉంది.

క్రీస్తువంటి ప్రేమ మరియు శ్రద్ధ ఉన్నతమైనవి మరియు పరిశుద్ధమైనవి. దాతృత్వము క్రీస్తు యొక్క శుద్ధమైన ప్రేమయైయున్నది. అధ్యక్షులు నెల్సన్ బోధించినట్లుగా, “దాతృత్వం మనల్ని ఒకరిపై ఒకరు భారాలను మోపడానికి బదులుగా, ‘ఒకరి భారములు ఒకరు భరించడానికి’ [మోషైయ 18:8] ప్రేరేపిస్తుంది.”

రక్షకుడు ఇలా అన్నారు, “మీరు ఒకనియెడల ఒకడు ప్రేమగలవారైనయెడల దీనిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందురు.” మరియు అధ్యక్షులు నెల్సన్ ఇలా అన్నారు: “దాతృత్వమనేది యేసు క్రీస్తు యొక్క నిజమైన అనుచరుని ప్రధాన లక్షణం.” “రక్షకుని సందేశము స్పష్టమైనది: ఆయన నిజమైన శిష్యులు నిర్మించి, ఉద్ధరించి, ప్రోత్సహించి, ఒప్పించి, ప్రేరేపిస్తారు. … … మనం ఇతరులతో మరియు ఇతరుల గురించి ఎలా మాట్లాడతాము అనేది ముఖ్యమైనది.”

దీనిపై రక్షకుని యొక్క బోధన చాలా సాధారణమైనది. ఇది ఈ పరమ ధర్మంలో సంగ్రహించబడింది: ఇతరులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో ఆలాగుననే మీరును ఇతరులకు చేయండి. ఆ వ్యక్తి స్థానంలో మిమ్మల్ని మీరు ఉంచుకుని, మీరు వారి పరిస్థితిలో ఉంటే మీపట్ల ఎలా వ్యవహరించాలని కోరుకుంటారో అలాగే వారితో వ్యవహరించండి.

ఇతరుల పట్ల క్రీస్తులా వ్యవహరించడం అనేది మన కుటుంబాలు మరియు సంఘాలను మించి చాలా దూరం వెళుతుంది. ఇందులో ఇతర విశ్వాసాలకు చెందిన లేదా అసలు విశ్వాసం లేని మన సహోదరీలు మరియు సహోదరులు కూడా ఉన్నారు. ఇందులో ఇతర దేశాలు మరియు సంస్కృతుల నుండి వచ్చిన మన సహోదర సహోదరీలు, అలాగే విభిన్న రాజకీయ విశ్వాసాలు కలిగిన వారు కూడా ఉన్నారు. మనమందరము దేవుని కుటుంబంలో భాగమైయున్నాము మరియు ఆయన తన పిల్లలందరినీ ప్రేమిస్తారు. ఆయన పిల్లలు ఆయనను ప్రేమించాలని మరియు ఒకరినొకరు ప్రేమించాలని కూడా ఆయన కోరుకుంటారు.

సమాజం నుండి బహిష్కరించబడినవారిని మరియు అపవిత్రులుగా తీర్పు తీర్చబడిన వారిని కూడా ప్రేమించడం, సమకూర్చడం మరియు ఉద్ధరించడం వంటి వాటికి రక్షకుని జీవితం ఒక ఉదాహరణ. మనకు ఒక ఆదర్శమైన ఆయనను అనుసరించమని మనం ఆజ్ఞాపించబడ్డాము. క్రీస్తు వంటి లక్షణాలను పెంపొందించుకోవడానికి మరియు చివరికి మన రక్షకుడిలా మారడానికి మనం ఇక్కడ ఉన్నాము. ఆయనది పనుల జాబితాల సువార్త కాదు; అది మారే సువార్తఆయన వలె మారడం మరియు ఆయన వలె ప్రేమించడం. మనం సీయోను ప్రజలుగా మారాలని ఆయన కోరుతున్నారు.

నేను నా 20ల వయస్సులో ఉన్నప్పుడు, నేను తీవ్ర నిరాశకు గురయ్యాను మరియు ఆ సమయంలో, దేవుడు ఉన్నాడనే వాస్తవం అకస్మాత్తుగా పోయినట్లు అనిపించింది. నేను పూర్తిగా దారి తప్పిపోయినట్లు అనిపించిందని చెప్పడం తప్ప ఆ అనుభూతిని పూర్తిగా వివరించలేను. చిన్నప్పటి నుండి, నా పరలోక తండ్రి ఉన్నారని మరియు నేను ఆయనతో మాట్లాడగలనని నాకు తెలుసు. కానీ ఆ సమయంలో, దేవుడు ఉన్నాడో లేదో నాకు తెలియలేదు. నా జీవితంలో ఇంతకు ముందు ఎప్పుడూ అలాంటిది నేను అనుభవించలేదు మరియు నా పునాది మొత్తం కదిలినట్లు అనిపించింది.

ఫలితంగా, సంఘానికి హాజరు కావడం నాకు కష్టమైంది. నేను వెళ్ళాను, కానీ దానికి కారణం నన్ను “నిష్క్రియాత్మకురాలు” లేదా “తక్కువ విశ్వాసురాలు,” అని ముద్ర వేస్తారనే భయం మరియు నేను ఎవరికైనా కేటాయించబడిన పనిగా మారతాననే భయం. ఆ సమయంలో నాకు నిజంగా కావలసింది నా చుట్టూ ఉన్న వారి నుండి నిజమైన ప్రేమ, అవగాహన మరియు మద్దతును అనుభవించడమే తప్ప, తీర్పు కాదు.

జనులు నా గురించి ఏమనుకుంటారో అని ఉహించుకొని నేను భయపడ్డాను, ఎందుకంటే ఇతరులు సంఘానికి క్రమం తప్పకుండా హాజరు కానప్పుడు వారి గురించి నేను కూడా అనుకున్నాను కాబట్టి. ఆ బాధాకరమైన వ్యక్తిగత అనుభవం, ఒకరినొకరు అన్యాయంగా తీర్పు తీర్చుకోరాదని మనం ఎందుకు ఆజ్ఞాపించబడ్డామనే దాని గురించి నాకు కొన్ని విలువైన పాఠాలు నేర్పింది.

తమలో దాగి ఉన్న కష్టాలు ఇతరులకు తెలిస్తే ప్రతిచర్య ఎలా ఉంటుందో తెలియక భయపడి, మౌనంగా బాధపడేవారు మనలో ఉన్నారా?

మనలో ప్రతిఒక్కరూ జీవితపు పరుగు పందెంలో ఉన్నప్పుడు మనకున్న కష్టాల యొక్క వాస్తవ స్థాయి ప్రభువుకు మాత్రమే పూర్తిగా తెలుసు—మనం ఎదుర్కొనే భారాలు, సవాళ్లు మరియు అడ్డంకులు తరచుగా ఇతరులకు కనిపించవు. మనలో కొందరు గతంలో అనుభవించిన, వర్తమానంలో కూడా మనల్ని ప్రభావితం చేస్తున్న, జీవితాన్ని మార్చే గాయాలను ఆయన మాత్రమే పూర్తిగా అర్థం చేసుకుంటారు.

తరచుగా, మనం పందెం‌లో చాలా ముందు ఉండాలని ఆలోచిస్తూ, మనల్ని మనం కఠినంగా తీర్పు తీర్చుకుంటాము. మన వ్యక్తిగత పరిమితులు మరియు సామర్థ్యం ప్రభువుకు మాత్రమే పూర్తిగా తెలుసు, అందుకే, మన పనితీరును అంచనా వేయడానికి ఆయన మాత్రమే పూర్తిగా అర్హత కలిగియున్నారు.

సహోదరీ సహోదరులారా, కథలోని ప్రేక్షకుల్లా ఉండి, మన పరిస్థితులు ఎలా ఉన్నా శిష్యత్వ ప్రయాణంలో ఒకరినొకరు ప్రోత్సహించుకుందాం! దానికోసం మనం నియమాలను ఉల్లంఘించాల్సిన అవసరం లేదు లేదా ప్రమాణాలను తగ్గించుకోవలసిన అవసరం లేదు. ఇది నిజానికి రెండవ గొప్ప ఆజ్ఞ—నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెను. మరియు మన రక్షకుడు చెప్పినట్లుగా, “నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక … , నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను,” మంచి కొరకైనా, చెడు కొరకైనా. ఆయన మనకు ఇలా కూడా చెప్పారు, “మీరు ఒకటిగానుండని యెడల మీరు నా వారు కారు.”

మనందరి జీవితంలోనూ సహాయం మరియు ప్రోత్సాహం అవసరమైన సందర్భాలు వస్తాయి. ఎల్లప్పుడూ ఒకరికొకరు అలా చేయడానికి ఇప్పుడే కట్టుబడి ఉందాం. మనం అలా చేసినప్పుడు, మనం గొప్ప ఐక్యతను పెంపొందించుకుంటాము మరియు రక్షకుడు మనలో ప్రతి ఒక్కరినీ స్వస్థపరిచే మరియు రూపాంతరం చెందించే తన పవిత్ర కార్యమును చేయడానికి తగిన వాతావరణాన్ని సృష్టిస్తాము.

ఈ జీవితపు పరుగు పందెంలో, ఈ మర్త్య ప్రయాణంలో మీరు చాలా వెనుకబడి ఉన్నారని భావించే వారు ఎవరైనా దయచేసి ముందుకు సాగండి. ఈ సమయంలో మీరు ఎక్కడ ఉండాలి అని రక్షకుడు మాత్రమే పూర్తిగా తీర్పు తీర్చగలరు మరియు ఆయన కరుణామయుడు, న్యాయవంతుడు. ఆయన జీవితపు పరుగు పందెం యొక్క గొప్ప న్యాయమూర్తి మరియు మీరు పరిగెత్తడం, నడవడం లేదా కదలడంలో ఉన్న కష్ట స్థాయిని ఆయన మాత్రమే పూర్తిగా అర్థం చేసుకుంటారు. ఆయన మీ పరిమితులను, మీ సామర్థ్యాన్ని, మీ జీవిత అనుభవాలను, మీరు మోసే కనబడని భారాలను, అలాగే మీ హృదయ వాంఛలను పరిగణనలోకి తీసుకుంటారు. నిజానికి మీరు కూడా చిహ్న రూపకమైన ప్రపంచ రికార్డులను బద్దలు కొడుతూ ఉండవచ్చు. దయచేసి నిరీక్షణ కోల్పోవద్దు. దయచేసి దానిని కొనసాగించండి! దయచేసి ప్రయత్నిస్తూ ఉండండి! మీరూ చెందినవారే! ప్రభువుకు మీరు కావాలి మరియు మాకు మీరు కావాలి!

మీరు ప్రపంచంలో ఎక్కడ నివసిస్తున్నా, అది ఎంత దూరంలో ఉన్నా, మీ పరలోక తండ్రి మరియు మీ రక్షకుడు మిమ్మల్ని పూర్తిగా యెరిగియున్నారని మరియు మిమ్మల్ని పరిపూర్ణంగా ప్రేమిస్తున్నారని దయచేసి ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. వారు మిమ్మల్ని ఎప్పటికీ మరచిపోరు. వారు మిమ్మల్ని ఇంటికి తీసుకురావాలని కోరుతున్నారు.

మీ దృష్టిని రక్షకునిపై నిలపండి. ఆయన మీ ఇనుప దండము. ఆయనను వదులుకోవద్దు. ఆయన సజీవుడని మరియు మీరు ఆయనను విశ్వసించవచ్చని నేను సాక్ష్యమిస్తున్నాను. ఆయన మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నారని కూడా నేను సాక్ష్యమిస్తున్నాను.

మనమందరం రక్షకుని మాదిరిని అనుసరించి, ఒకరినొకరు ఉత్సాహపరుచుకుందాం, ఇది యేసు క్రీస్తు నామములో నా ప్రార్థన, ఆమేన్.

వివరణలు

  1. జెఫ్రీ సి. స్ట్రాంగ్, వ్యక్తిగత ఉత్తరప్రత్యుత్తరాలు; అనుమతితో ఉపయోగించబడింది.

  2. మన అధ్యక్షత్వ ప్రాధాన్యతలలో ఒకటి, సంఘములోని మన సహోదరీలు తాము సంఘానికి చెందినవారనే భావనను కలిగియుండడం, ముఖ్యంగా ఉపశమన సమాజములో. ఉత్తరాలు చదివి మరియు అనుభవాలను విని నేను బాధపడిన సందర్భాలు ఉన్నాయి.

  3. 1 కొరింథీయులకు 12:26 చూడండి.

  4. See Henry B. Eyring, “Our Hearts Knit as One,” Liahona, Nov. 2008, 68–71; యులిసెస్ సోవారెస్, “క్రీస్తునందు ఏకముగా ఉన్నాము,” సర్వసభ్య సమావేశము, అక్టో. 2018; “One in Christ” (video), Gospel Library కూడా చూడండి.

  5. 3 నీఫై 11:29 చూడండి.

  6. రస్సెల్ ఎమ్. నెల్సన్, “సమాధానపరచువారు కావాలి,” లియహోనా, మే 2023, 100. అదే ప్రసంగంలో, ఆయన ఇలా అన్నారు, “వివాదం ఆత్మను తరిమివేస్తుంది—ప్రతీసారి.” (100వ పేజీ). ఇతరుల గురించి తీర్పు చెప్పే ఆలోచనలు కూడా ఆత్మను దూరం చేస్తాయని నేను జోడిస్తాను. విమర్శనాత్మక ఆలోచనలతో మనం ఇతరులను తక్కువచేసి చూసినప్పుడు, అది గర్వానికి నిదర్శనం మరియు “అహంకారం ఐక్యతకు గొప్ప శత్రువు” అని అధ్యక్షులు హెన్రీ బి. ఐరింగ్ అన్నారు (“Our Hearts Knit as One,” 70).

  7. See J. Anette Dennis, in “Come and Take Your Place as Covenant Women” (address given by the Relief Society General Presidency at Brigham Young University Women’s Conference, May 1, 2024), Gospel Library; మోషైయ 18:8–10 కూడా చూడండి.

  8. 1 కొరింథీయులకు 12:14–26 చూడండి.

  9. మొరోనై 7:47 చూడండి.

  10. రస్సెల్ ఎమ్. నెల్సన్, “సమాధానపరచువారు కావాలి,” 101; వివరణ చేర్చబడింది.

  11. యోహాను 13:35; వివరణ చేర్చబడింది.

  12. రస్సెల్ ఎమ్. నెల్సన్, “సమాధానపరచువారు కావాలి,” 100, 99.

  13. మత్తయి 7:12 చూడండి.

  14. మనం రక్షకుడిని అనుసరించి, ఆయనలా మారాలని కోరుకున్నప్పుడు, ఆయన ప్రతి ఒక్కరినీ చూసే విధంగా చూడడానికి మనం ప్రయత్నిస్తాము మరియు దాతృత్వపు బహుమతి కోసం మనం ప్రార్థించడం కొనసాగిస్తున్నప్పుడు, చివరికి మన హృదయాలలో ప్రేమ మరియు శ్రద్ధ యొక్క హృదయపూర్వక భావన పెరుగుతుంది. మనం ఇతరులను “నిర్మించడానికి, పైకి లేపడానికి, ప్రోత్సహించడానికి, ఒప్పించడానికి మరియు ప్రేరేపించడానికి” ఒక కోరికను అభివృద్ధి చేసుకుంటాము, అది విధి భావనతో కాదు కానీ మనం క్రమంగా మన రక్షకుడిలా మారుతున్నాము కాబట్టి (రస్సెల్ ఎమ్. నెల్సన్, “సమాధానపరచువారు కావాలి,” 100). ఇతరులకు క్రీస్తులాగా పరిచర్య చేయడం మనం చేసే పని గురించి కాదు, మనం ఎవరో తెలియజేస్తుంది.

  15. మోషైయ 23:15 చూడండి.

  16. ఉదాహరణకు, మత్తయి 9:10–13; మార్కు 1:40–42; లూకా 8:43–48; 14:13–14; యోహాను 4:7–26; 5:2–9; 8:3–11 చూడండి.

  17. 3 నీఫై 27:27 చూడండి; రాబర్ట్ సి. గే, “యేసు క్రీస్తు యొక్క నామమును మనపై తీసుకొనుట,” సర్వసభ్య సమావేశము, అక్టో. 2018 కూడా చూడండి.

  18. “The only permanent solution to the differences that divide us is for all of us to follow our Savior’s teachings and to gradually become even as He is” (Dallin H. Oaks, in Joel Randall, “Following Christ Is ‘a Continuous Commitment and Way of Life,’ President Oaks Teaches European Saints from Belgium,” Church News, July 14, 2025).

  19. See Dallin H. Oaks, “The Challenge to Become,” Liahona, Jan. 2001, 40–43.

  20. యోహాను 13:34 చూడండి.

  21. “యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘ సభ్యులకు స్పష్టమైన పిలుపు ఏమిటంటే, ఏక హృదయము, ఏక మనస్సు గలిగి నీతియందు నివసించే సీయోను ప్రజలుగా ఉండడానికి ప్రయత్నించడం” (క్వింటిన్ ఎల్. కుక్, “నీతియందును, ఐక్యతయందును హృదయములు ముడివేయబడెను,” సర్వసభ్య సమావేశము, అక్టోబరు 2020).

  22. See J. Anette Dennis, “Why I Choose to Stay” (address given at Brigham Young University Women’s Conference, May 2, 2024), Gospel Library.

  23. జోసెఫ్ స్మిత్ అనువాదము, మత్తయి 7:1–2 (మత్తయి 7:1లో, పాదవివరణ ); ఆల్మా 41:14 చూడండి.

  24. జె. అనెట్ డెన్నిస్, “ఆయన కాడి సుళువుగాను ఆయన భారము తేలికగాను ఉన్నవి,” సర్వసభ్య సమావేశము, అక్టోబరు 2022 చూడండి

  25. ఆల్మా 7:11–12 చూడండి.

  26. మత్తయి 22:36–40 చూడండి.

  27. మత్తయి 25:40.

  28. సిద్ధాంతము మరియు నిబంధనలు 38:27.

  29. కీర్తనలు 145:8–9; ఎఫెసీయులకు 2:4–5 చూడండి.

  30. తమారా డబ్ల్యు. రూనియా, “మీ పశ్చాత్తాపము యేసు క్రీస్తుకు భారం కాదు; అది ఆయనకు ఆనందాన్నిస్తుంది,” సర్వసభ్య సమావేశము, ఏప్రిల్, 2025 చూడండి.

  31. సిద్ధాంతము మరియు నిబంధనలు 137:9 చూడండి.

  32. రోమా 8:38–39 చూడండి.

  33. పాట్రిక్ కీరన్, “మిమ్మల్ని గృహానికి తీసుకురావడమే దేవుని ఉద్దేశం,” సర్వసభ్య సమావేశము, ఏప్రిల్, 2024 కూడా చూడండి.

  34. యోహాను 1, అధ్యాయ శీర్షిక మరియు 1వ వచనం చూడండి; 1 నీఫై 11:24–25.

  35. See Jeffrey R. Holland, “Tomorrow the Lord Will Do Wonders Among You,” Liahona, May 2016, 127.