నీవును వెళ్ళి ఆలాగు చేయుము
సేవా నియామకాలకు పిలువబడిన సువార్తికుల గురించి ప్రత్యేకంగా మాట్లాడాలని నేను కోరుతున్నాను. వారు మనకు మాదిరులు.
రక్షకుడు బేత్సయిదా గుండా ప్రయాణిస్తుండగా, కొందరు వ్యక్తులు ఆయన వద్దకు ఒక గ్రుడ్డి వానిని తీసుకొని వచ్చారు. బహుశా వారు ఒక అద్భుతాన్ని ప్రత్యక్షంగా చూడాలని ఆశించారు. రక్షకుడు “ఆ గ్రుడ్డివాని చెయ్యిపట్టుకొని ఊరి వెలుపలికి తోడుకొనిపోయి” అతడిని వ్యక్తిగతంగా స్వస్థపరిచెను. మొదట, స్వస్థత తక్కువ ప్రభావవంతంగా కనిపించింది. ఆ మనుష్యుడు “కన్నులెత్తి, మనుష్యులు నాకు కనబడుచున్నారు; వారు చెట్లవలె నడుచుచున్నట్లుగా కనబడుచున్నారనెను.” యేసు, కనికరముతో, “మరల తన చేతులు వాని కన్నులమీద నుంచగా, వాడు తేరిచూచునట్లు చేసెను.” రక్షకుని చేతులను అదనంగా తాకడంతో, ఆ గ్రుడ్డి వాడు ఇప్పుడు “తేటగా చూడసాగెను” …
రక్షకుని జీవితం వినయపూర్వకమైన సేవా చర్యల ద్వారా ఎలా చిత్రీకరించబడింది అనే దానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఆయన “పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకు వచ్చెను” అని ఆయన మనకు గుర్తు చేస్తున్నారు మరియు ఒక మైలు దూరము వెళ్ళమని, అడిగిన వారికి ఇవ్వమని మరియు మన పొరుగువానిని ప్రేమించుట ద్వారా ఆయన మాదిరిని అనుసరించమని ఆయన మనల్ని ఆహ్వానిస్తున్నారు. “నా పొరుగువాడెవడు?” అని అడగబడినప్పుడు, క్రీస్తు, “నీవును వెళ్లి ఆలాగు చేయుమని” ఆజ్ఞాపిస్తూ మంచి సమరయుని ఉపమానమును పంచుకున్నారు.
యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము యొక్క సువార్తికులు క్రీస్తు మనల్ని మారమని ఆహ్వానించిన మంచి సమరయులకు మాదిరిగా ఉన్నారు. సేవా నియామకాలకు పిలువబడిన సువార్తికుల గురించి ప్రత్యేకంగా మాట్లాడాలని నేను కోరుతున్నాను. సేవ (1) యేసు క్రీస్తు సువార్త పట్ల జనులు మరింత గ్రహీతలుగా మారడంలో ఏవిధంగా సహాయపడుతుంది, (2) మన పరిస్థితులను లక్ష్యపెట్టకుండా పరిచర్య చేయడానికి మనందరిని ఏవిధంగా అనుమతిస్తుంది మరియు క్రీస్తు యొక్క శక్తిని మన జీవితాలలోనికి ఎలా తెస్తుంది అనే వాటికి వారు మనకు మాదిరిగా ఉన్నారు.
మొదటిది, సేవ యేసు క్రీస్తు సువార్త పట్ల జనులు మరింత గ్రహీతలుగా మారడంలో సహాయపడుతుంది
దాదాపు క్రీ.పూ. 91 లో, అమ్మోన్ అనే మోర్మన్ గ్రంథ సువార్తికుడు, రాజైన లమోనైకు తనను తాను పరిచయం చేసుకుంటూ ఇలా అన్నాడు, “నేను కొంతకాలము పాటు ఈ జనుల మధ్య నివసించుటకు కోరుచున్నాను; … [మరియు] నేను నీ సేవకునిగా ఉండెదను.” రాజుకు అతడు చేసిన సేవ కారణముగా, అమ్మోన్ “ధైర్యముగా మాట్లాడడానికి, …మరియు … ఏ శక్తి ద్వారా తన సేవను నెరవేర్చాడో [రాజైన లమోనైకు]” చెప్పడానికి అవకాశము ఇవ్వబడ్డాడు. బదులుగా, రాజు “[అమ్మోన్] ఏమి కోరినను [రాజు] దానిని ఇచ్చెదను” అని వాగ్దానమిచ్చాడు. యేసు క్రీస్తు యొక్క సువార్త సందేశాన్ని రాజు వినాలన్నది మాత్రమే అమ్మోన్ మనవి. అమ్మోన్ యొక్క సేవ ఫలితంగా “వేలమంది ఆత్మలు పశ్చాత్తాపపడునట్లు చేయబడ్డాయి.”
మన కాలంలో, సువార్త వైపు ఇతరులను నడిపించడాన్ని సేవ కొనసాగిస్తుంది. సహోదరి బెవాన్ ఒక సువార్తికురాలిగా సేవ చేస్తుండగా ఆమె ఆరోగ్య సమస్యలను అనుభవించింది, చికిత్స కోసం ఆమె ఇంటికి తిరిగి వెళ్ళాల్సిన అవసరం కలిగింది. విడుదల చేయబడడానికి బదులుగా, ఆమె ఇంటి నుండి సేవ చేసే సువార్తికురాలిగా సేవ చేయడం కొనసాగించగలిగింది.
ఒక పార్కును సందర్శించినప్పుడు, సహోదరి బెవాన్ మరియు ఆమె స్నేహితురాలు నలుగురు చిన్న పిల్లలు గల ఒక తల్లితో మాట్లాడడానికి ప్రేరేపించబడ్డారు, కానీ వారు సంకోచించారు మరియు ఆ కుటుంబం అక్కడి నుండి వెళ్లిపోయింది. మరుసటి రోజు, ఆ కుటుంబం అక్కడ ఉండాలని ప్రార్థిస్తూ, వారు పార్కు వద్దకు తిరిగి వెళ్ళారు. అద్భుతరీతిలో, ఆ తల్లి ముందు రోజు కూర్చున్న అదే స్థలంలో కూర్చుంది. ఈసారి, సహోదరి బెవాన్ మరియు ఆమె స్నేహితురాలు ఆ తల్లిని సమీపించి, ఆమె గురించి తెలుసుకున్నారు మరియు ఆమెకు భౌతికంగా చాలా సహాయం అవసరమని కనుగొన్నారు. వారు సహాయాన్ని అందించారు మరియు తరువాత సువార్త గురించి తెలుసుకోమని ఆమెను ఆహ్వానించారు.
ఆ సేవ మరియు ఆహ్వానం వలన, ఆ తల్లి మరియు పెద్ద బిడ్డ బాప్తిస్మము తీసుకున్నారు, ఒక సంవత్సరం తరువాత రెండవ బిడ్డ బాప్తిస్మము తీసుకున్నారు. నేటి వరకు వారు చురుకుగా ఉన్నారు. ఈ అనుభవం దైవికంగా ప్రేరేపించబడిందని సహోదరి బెవాన్‌కు తెలుసు మరియు “[ఆమె] ఎక్కడ ఉండాలని దేవుడు కోరారో ఖచ్చితంగా [ఆమె] అక్కడ ఉన్నదని [ఆమెకు] రుజువు చేయబడింది.”
అమ్మోన్ మరియు సహోదరి బెవాన్ వలే, మనం ఇతరులకు సేవ చేసినప్పుడు, మనం “మంచి మాదిరులను వారికి చూపుతాము“ మరియు వారు [మనలో] ఉన్న నిరీక్షణను గూర్చిన హేతువును” తెలుసుకోవాలని కోరతారు.
“నీవును వెళ్ళి ఆలాగు చేయుము” అని యేసు మనల్ని ఆహ్వానిస్తున్నారు.
రెండవది, సేవ మన పరిస్థితులను లక్ష్యపెట్టకుండా పరిచర్య చేయడానికి మనందరిని అనుమతిస్తుంది
“యోగ్యతగల ప్రతీ యువకుడు సువార్తసేవ కొరకు సిద్ధపడాలని, సేవ చేయాలని” మరియు “సమర్థురాలైన ప్రతీ యువతి ప్రభువు తనను సువార్తసేవ చేయమంటున్నారా అని తెలుసుకోవడానికి ప్రార్థించాలని” అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ పిలుపునిచ్చారు. “సువార్తను ప్రకటించడానికైనా లేదా సేవా మిషను చేయుటకైనా సరే, సువార్త సేవ చేయాలనే మీ నిర్ణయం మిమ్మల్ని మరియు ఇతరులను ఆశీర్వదిస్తుంది,” అని ఆయన వాగ్దానమిచ్చారు. సేవా మిషనులు సమర్థులైన అనే పదము యొక్క నిర్వచనాన్ని మార్చివేసాయి. ప్రభువు కొరకు పూర్తి-కాల సువార్తసేవ చేయాలని కోరిన యోగ్యతగల ప్రతీ పురుషుడు మరియు స్త్రీ, చాలా తక్కువ మినహాయింపులతో ఆవిధంగా చేయవచ్చు.
వ్యక్తిగత పరిస్థితులను లక్ష్యపెట్టకుండా సేవ చేసిన వారికి ఎల్డర్ హొల్గాడో ఒక మాదిరి. అతడు అరుదైన జన్యుపరమైన రుగ్మతతో జన్మించాడు, అది అతడిని బోధించే సువార్తికునిగా సేవ చేయకుండా నిరోధించింది. ఎల్డర్ హొల్గాడో సేవా సువార్తికునిగా పిలువబడ్డాడు మరియు బిషప్పు గిడ్డంగిలో స్వచ్ఛందంగా పని చేసాడు, అక్కడ అతడు ఇతరులకు అవసరమైన సహాయాన్ని వారికి అందించడానికి సహాయపడ్డాడు. అతడు అల్మారాలను నింపాడు, కూరగాయలను సంచుల్లో వేసాడు మరియు కార్డుబోర్డు పెట్టెలను పొడిగా చేసాడు.
ఎల్డర్ హొల్గాడో తన సువార్తసేవ తరువాత సంస్కార సమావేశంలో మాట్లాడినప్పుడు, “దేవునికి సేవా సువార్తికులు కావాలి. ఇతరులను ప్రేమించి, సేవ చేసేవారు ఆయనకు కావాలి. ఈ జనులు టాయిలెట్ కాగితాన్ని నింపుతారు, బ్రోకలీని సంచిలో వేస్తారు, ఉపకరణాలను తయారుచేస్తారు మరియు జనులతో మంచిగా ఉంటారు,” అని చెప్పాడు.
మంచి చేయడానికి మీకు సేవా నియామకం ఉండనవసరం లేదు లేదా ఒక పేరును ధరించాల్సిన అవసరం లేదు. సేవ యొక్క ప్రతీ చర్య రక్షకునిచే గుర్తించబడుతుంది. ప్రేమపూర్వక దయతో సేవ చేయడం ద్వారా క్రీస్తు నొద్దకు రావడానికి ఇతరులకు మనందరం సహాయం చేయగలము. పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా ఒకరికి క్రీస్తు నామములో మనమందరం పరిచర్య చేయగలం మరియు యేసు క్రీస్తునందు విశ్వాసము యొక్క మాదిరులుగా జీవించగలము. సేవ దేవునికి అంగీకారమైన సజీవ బలులుగా మనల్ని మనం సమర్పించుకోవడానికి అనుమతిస్తుంది.
“నీవును వెళ్ళి ఆలాగు చేయుము” అని యేసు మనల్ని ఆహ్వానిస్తున్నారు.
మూడవది, సేవ క్రీస్తు యొక్క శక్తిని మన జీవితాలలోనికి తెస్తుంది
బోధించే నియామకం నుండి సేవా నియామకానికి మార్చబడిన ఒక యువ సువార్తికుడు కొన్ని వ్యక్తిగత సమస్యలతో ప్రయాసపడ్డాడు, దాని వలన అతనికి క్రీస్తు యొక్క స్వస్థపరిచే శక్తి అవసరమయ్యింది. ప్రతిష్ఠించబడిన సేవ ఆ శక్తిని అతని జీవితంలోనికి తెచ్చింది. “నేను ప్రయాసపడుతున్నప్పుడు, క్రీస్తు నన్ను పైకెత్తడాన్ని అనుభూతి చెందగలిగాను. ఆయన ఆహార నిల్వ గది ద్వారా, దేవాలయంలో మరియు ఆయన సువార్త ద్వారా ఆయన జనులను దీవించడాన్ని చూడడంలో ఏదో ఒక ప్రత్యేకత ఉంది.”
ఈ ఎల్డర్ లోతైన సంతోషాన్ని అనుభవించసాగాడు మరియు క్రొత్తగా కనుగొనబడిన అతని ఉత్సాహము అతడిని, అతని మొత్తం కుటుంబాన్ని దీవించింది. ఆత్మ మరింత సమృద్ధిగా వారి గృహంలో ప్రవేశించింది, వారు మరింత క్రమంగా దేవాలయానికి కలిసి హాజరయ్యారు మరియు క్రీస్తు వారి కుటుంబంలో గొప్ప కేంద్రంగా అయ్యారు. ఈ సువార్తికుడు క్రీస్తు తన జీవితాన్ని రక్షించారని మరియు సేవ ద్వారా తన కుటుంబాన్ని దీవించారని నమ్ముతున్నాడు.
అధ్యక్షులు నెల్సన్ ఇలా బోధించారు, “సేవ చేయడానికి సమ్మతించుట మరియు ఇతరులను బలపరచుట రక్షకుని యొక్క విమోచించు శక్తి ద్వారా స్వస్థపరచబడడానికి ఒకరి సిద్ధపాటు యొక్క చిహ్నంగా నిలిచియున్నది.
“నీవును వెళ్ళి ఆలాగు చేయుము” అని యేసు మనల్ని ఆహ్వానిస్తున్నారు.
సేవా సువార్తికులు యేసు క్రీస్తు యొక్క ప్రతిష్ఠించబడిన శిష్యులకు మాదిరిగా ఉన్నారు
మీరు లేదా మీ కుటుంబ సభ్యులొకరు సేవా సువార్తకునిగా ఒక పిలుపుతో దీవించబడినట్లయితే, అది వేడుక జరుపుకునే సమయం. మీ కుటుంబం ఇప్పుడు మీ గృహంలో ప్రభువైన యేసు క్రీస్తు యొక్క నియమించబడిన ప్రతినిధిని కలిగియున్నారు. అది మేలు కొరకు మీ అందరిని మారుస్తుంది. సేవ చేయడానికి ఏ పిలుపులో కూడా నిరాశ ఉండకూడదు. “మీరు ఎక్కడికి వెళ్ళమని నన్ను కోరితే అక్కడికి నేను వెళతాను,” అని మనం పాడతాము. మనం చెప్పే దానిని చేస్తామని చూపడానికి ఇక్కడ ఒక అవకాశమున్నది!
సేవ చేసే మీ అందరిని, ప్రత్యేకించి 4000 మందికి పైగా ఉన్న యువ సేవా సువార్తికులారా, మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాము! బోధించే సువార్తికులు ప్రభువు చెప్పే దానిని చెబితే, అప్పుడు సేవా సువార్తికులైన మీరు ప్రభువు చేసే దానిని చేస్తారు మరియు మీరేమి తక్కువ విలువైన వారు కారు. ఇశ్రాయేలును సమకూర్చడంలో మీలో ప్రతిఒక్కరూ ముఖ్యమైనవారు. అధ్యక్షులు నెల్సన్ ఇలా బోధించారు, “దేవునితో వారి నిబంధనలు చేయడానికి మరియు పాటించడానికి … ఎవరికైనా సహాయపడేందుకు ఎప్పుడైనా మనమేదైనా చేసినప్పుడు, మనం ఇశ్రాయేలును సమకూర్చడానికి సహాయపడుతున్నాము.”
సేవా సువార్తికులు అనేక విధాలుగా ప్రతిరోజూ ఇశ్రాయేలును సమకూరుస్తున్నారు మరియు మీ సేవ జీవితాలను మారుస్తుంది. మీ సేవ యొక్క లబ్ధిదారులెవరో తరచుగా మీకు తెలియదు, కానీ దేవునికి తెలుసు. “మిక్కిలి అల్పులైన యీ సహోదరులలో ఒకనికి మీరు [సేవ] చేసితిరి గనుక, … [ఆయనకు చేసితిరి]” అని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. సంఘ కాల్ సెంటర్లలలో మీరు స్వచ్ఛందంగా సేవ చేసినప్పుడు మేము మీ స్వరములను వింటాము; సమాజ నిర్మాణాలలో మీరు సహాయపడినప్పుడు మీ చిరునవ్వులను మేము చూస్తాము; మరియు దేవాలయాలలో మీరు సేవ చేసినప్పుడు మీ వెలుగును మేము అనుభవిస్తాము. మీరు ఆకలిగొనిన వారికి ఆహారమును, దిగంబరులకు వస్త్రములను మరియు దప్పిగొనిన వారికి దాహమును ఇస్తున్నారు.
మనమందరం “వెళ్ళి … ఆలాగు చేయవలెను.”
సేవ క్రీస్తు శిష్యులుగా ఉండుటలో ముఖ్యమైన భాగము
సేవ ఒకరు సువార్త సత్యమును అనుభూతి చెందడానికి అనుమతిస్తుంది మరియు మన పూర్ణాత్మను క్రీస్తుకు సమర్పించడానికి మనల్ని అనుమతిస్తుంది. అది ఆయన వలె ఎక్కువగా మారడానికి మన హృదయాలను మారుస్తుంది మరియు ఆ ప్రక్రియలో, మనం ఇతరులను ఉద్ధరిస్తాము. అధ్యక్షులు నెల్సన్ ఒకసారి ఇలా అడిగారు, “ఆత్మీయ క్షీణతతో నిండిన ఈ ప్రపంచంలో, వ్యక్తులు … మార్పును తీసుకొనిరాగలరా?” ఆయన జవాబు: “అవును! … ‘ప్రభువు యొక్క నిబంధన జనులు, … గొప్ప మహిమయందు దేవుని శక్తి … ధరింపజేయబడి … సమస్త మానవాళి యొక్క జీవితాలను ఉద్ధరించగలరు.” సేవ ద్వారా మనము జీవితాలను—లోకమును మార్చగలము.
క్రీస్తు “మేలు చేయుచు సంచరించుచుండెను.” ఆయన రోగులకు పరిచర్య చేసారు, గ్రుడ్డి వారికి చూపునిచ్చారు, క్రుంగిన వారిని సందర్శించారు. “ఆయన భోజనాలను వండారు, వివాహ విందులలో సహాయపడ్డారు మరియు ఆకలిగొన్న వేలమందికి ఆహారమిచ్చారు. క్రీస్తు నామములో మనం ఒకరికి సేవ చేసినప్పుడు, మనం ఎక్కువ పరిశుద్ధులుగా మారతాము మరియు నిత్యజీవపు బహుమానానికి యోగ్యత కలిగియుంటాము. యేసు క్రీస్తు జీవిస్తున్నారు. ఆయన నా రక్షకుడు మరియు మీ రక్షకుడు. ఆయనే మన విమోచకుడు. పరిచర్య చేయడంలో ఆయన మనకు గొప్ప మాదిరిగా ఉన్నారు. వెళ్ళి ఆలాగు చేయుమని మనలో ప్రతిఒక్కరిని నేను ఆహ్వానిస్తున్నాను. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.