సర్వసభ్య సమావేశము
గొఱ్ఱెలను గుర్తుంచుకొనుట
2025 అక్టోబరు సర్వసభ్య సమావేశము


12:14

గొఱ్ఱెలను గుర్తుంచుకొనుట

లెక్కించడం మరియు లెక్క చూసుకోవడం అనే సూత్రం పనిచేస్తుంది. అది ప్రభువు యొక్క విధానం.

క్రీస్తు మంచి గొఱ్ఱెలకాపరి. మందలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆయనకు అమూల్యమైనవారు. ఆయన గొర్రెలను కాసే విధానాన్ని అనుసరించి, వాక్యముచేతను, క్రియచేతను ఒక మంచి కాపరి యొక్క లక్షణాలను మనకు బోధించారు, వాటిలో మీ గొఱ్ఱెలను పేరు పేరునా తెలుసుకోవడం, వాటిని ప్రేమించడం, తప్పిపోయిన వాటిని కనుగొనడం, వాటికి ఆహారం ఇవ్వడం మరియు అంతిమంగా, వాటిని తిరిగి ఇంటికి నడిపించడం వంటివి ఉన్నాయి. ఆయనకు ఉపకాపరులుగా, మనము కూడా అదేవిధంగా చేయాలని ఆయన ఆశిస్తున్నారు.

ప్రాచీన ప్రవక్త—మరియు అద్భుతమైన కాపరి—అయిన మొరోనై నుండి ప్రభువు యొక్క విధానంలో పరిచర్య చేయడం గురించి మనం చాలా నేర్చుకోవచ్చు. అతను చాలా కష్టకాలంలో జీవించాడు, సెల్‌ఫోన్లు, కంప్యూటర్లు మరియు ఇంటర్నెట్ వంటి సౌకర్యాలు లేకుండా. కానీ అతను గొఱ్ఱెలను సరిగ్గా చూసుకోగలిగాడు. అది ఎలా చేయబడింది? మొరోనై 6లో అతని విధానాన్ని మనం కొంచెం చూడవచ్చు. అక్కడ, సభ్యులు “క్రీస్తు యొక్క సంఘ జనుల మధ్య లెక్కింపబడిరి; మరియు వారిని సరియైన మార్గమందు ఉంచుటకు, వారు జ్ఞాపకము చేసుకొనబడి, దేవుని సువార్త ద్వారా పోషింపబడునట్లు వారి పేర్లు తీసుకొనబడినవి. … ఉపవాసముండుటకు, ప్రార్థన చేయుటకు, వారి ఆత్మల సంక్షేమమును గూర్చి ఒకరితోనొకరు మాట్లాడుటకు” సంఘము తరచుగా కూడుకొనెను అని మనం చదువుతాం (మొరోనై 6:4–5; వివరణ చేర్చబడినది).

మొరోనై ఆందోళన చెందేది జనుల గురించి—పేర్లు గురించి! అందరూ గుర్తుంచుకోబడేలా, “లెక్కించడం మరియు లెక్క చూసుకోవడం” అనే సూత్రాన్ని అతను ఆచరించాడు. కష్టపడుతున్న లేదా తప్పిపోయిన వారందరూ గమనించబడ్డారు, తద్వారా వారి సంక్షేమం గురించి పరిశుద్ధులు సలహాసభలలో చర్చించగలిగారు. తొంభై తొమ్మిది గొఱ్ఱెలను విడిచిపెట్టి (అవి సురక్షితంగా మరియు భద్రంగా ఉన్నాయని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను), తప్పిపోయిన ఒకదాని కోసం వెళ్ళిన కాపరి వలె (లూకా 15:4–7 చూడండి), మనమూ మన మందల పట్ల అదే విధంగా శ్రద్ధ వహించాలని—గమనించాలని, గుర్తుంచుకోవాలని, వెళ్లి అలాగే చేయాలని అడగబడ్డాము.

భారతదేశంలో మిషను నాయకుడిగా ఉన్నప్పుడు, రాబోయే సంవత్సరానికి తను ఏర్పరుచుకున్న కొన్ని లక్ష్యాల గురించి ఒక యువ శాఖాధ్యక్షుణ్ని నేను అడిగిన విషయం నాకు గుర్తుంది: “మెల్కీసెదెకు యాజకత్వము స్వీకరించడానికి మీరు ఎంతమంది పురుషులను సిద్ధం చేస్తారు?” అతని తక్షణ ప్రతిస్పందన “ఏడు!”

ఆ నిర్దిష్ట సంఖ్యను అతను ఎక్కడి నుండి ఊహించి చెప్పాడో అని నేను ఆశ్చర్యపోయాను! నేను ప్రతిస్పందించేలోపే, అతను ఒకటి నుండి ఏడు వరకు సంఖ్యలు ప్రక్కన వ్రాసి ఉన్న ఒక కాగితం ముక్కను తీశాడు. మొదటి ఐదు వరుసల్లో పేర్లు ఉన్నాయి—అతను మరియు అతని పెద్దల సమూహం వారి జీవితాల్లో యాజకత్వ దీవెన పొందాలని ఆహ్వానించి, ప్రోత్సహించబోయే నిజమైన వ్యక్తుల పేర్లు. తప్పకుండా, నేను ఖాళీగా ఉన్న ఆరవ మరియు ఏడవ వరుసల గురించి అడగవలసి వచ్చింది. “ఓహ్, అధ్యక్షా,” అని అతను సానుభూతితో తల ఊపుతూ, “సంవత్సరాంతానికి యాజకత్వం పొందగలిగే కనీసం ఇద్దరు వ్యక్తులకైనా సంవత్సరం మొదటి భాగంలో బాప్తిస్మం ఇస్తాము” అని అన్నాడు. ఈ అద్భుతమైన నాయకుడు లెక్కించడం మరియు లెక్క చూసుకోవడం అనే సూత్రాన్ని అర్థం చేసుకున్నాడు.

ప్రతి ఆత్మ ఆయనకు ప్రియమైనది కనుక, ఏ ఒక్క ఆత్మనైనా మరచిపోవడం కష్టంగా ఉండేలా, క్రీస్తు తన సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఒక వార్డులోని ప్రతి వ్యక్తికి, వయస్సు లేదా లింగంతో సంబంధం లేకుండా, అనేకమంది గృహనిర్వాహకులు—గొఱ్ఱెల కాపరులు—ఉంటారు, వారు వారిని చూసుకోవడం, గుర్తుంచుకోవడం వంటి బాధ్యతలను కలిగియుంటారు. ఉదాహరణకు, ఒక యువకుడి సంక్షేమం కోసం బిషప్రిక్కు, పరిచర్య చేయు సహోదరులు, వయోజనులైన యువజన సలహాదారులు, సెమినరీ బోధకులు, సమూహ అధ్యక్షత్వాలు మరియు ఇంకొందరు రక్షణ వలలుగా, ఆ యువకుడు పడిపోతే పట్టుకునేలా అతని క్రింద బలంగా నిలబడడానికి నియమించబడతారు. ఏ ఒక్క రక్షణ వల సరిగ్గా అమర్చబడినా, ఆ యువకుడు సురక్షితంగా ఉంటాడు, గమనించబడతాడు మరియు గుర్తుంచుకోబడతాడు. అయినా, తరచుగా మనం ఒక్క రక్షణ వల కూడా అమర్చబడిలేదని గమనిస్తాము. జనులు తరచుగా పొగమంచులో తప్పిపోతుంటారు—కానీ ఎవరూ గమనించరు. మనం మంచి కాపరులుగా ఎలా ఉండగలం? మనం లెక్కించడం మరియు లెక్క చూసుకోవడం నేర్చుకోవచ్చు.

అలా—గుర్తుంచుకోవడానికి, సంఘం మనకు నివేదికలు మరియు సాధనాలను అందిస్తుంది. త్రైమాసిక నివేదిక ఒక ప్రధాన ఉదాహరణ. ప్రతి సభ్యుడిని అనేకసార్లు లెక్కించడానికి మరియు లెక్క చూసుకోవడానికి, తప్పిపోయిన వారిని లేదా మన సహాయం మరియు ప్రేమ అవసరం ఉన్నవారిని గమనించడానికి ఇది మనల్ని అనుమతిస్తుంది. చర్య మరియు మౌఖికాల జాబితా ప్రస్తుతం మన దృష్టి అవసరమయ్యే వారిని గుర్తిస్తుంది, అలాగే దేవాలయ సిఫారసు స్థితి నివేదిక మరియు ఇతర నివేదికలు కూడా అదే చేస్తాయి. ఈ లెక్కింపు మరియు లెక్కల సాధనాలు మన దృష్టిని వ్యక్తులపై కేంద్రీకరిస్తాయి. పిలుపు, యాజకత్వ పురోగతి లేదా కుటుంబ పేరును దేవాలయానికి తీసుకువెళ్ళడంలో సహాయం ఎవరికి అవసరం? పూర్తి-కాల సువార్తసేవ‌కు సిద్ధం కావడానికి మనం ఎవరికి సహాయం చేయవచ్చు? ఈ నెలలో ఎవరు తప్పిపోయారు? జనులను గుర్తుంచుకోవడానికి ఈ సాధనాలు మనకు సహాయపడతాయి.

సంయుక్త రాష్ట్రాల్లో ఉంటూ ఆఫ్రికాలో నియామకం తీసుకున్న ఒక కుటుంబం నాకు తెలుసు. తమ మొదటి ఆదివారం రోజునే వారు ఆ దేశంలోని ఏకైక సంఘ విభాగంలోకి నడుచుకుంటూ వెళ్లారు, అక్కడ వారిని ఉత్సాహంగా స్వాగతించారు. ఉదయం ముగిసే సమయానికి, ఆ వ్యక్తి భార్య ఉపశమన సమాజ అధ్యక్షురాలిగా మరియు అతను యువకుల నాయకుడిగా పిలువబడ్డారు! అలసిపోయినట్లు కనిపిస్తున్న శాఖాధ్యక్షుడిని, ఎంతమంది యువకులు ఉన్నారని అతను అడిగాడు. విశ్వాసపాత్రుడైన ఈ మొదటి తరం నాయకుడు సంస్కార కూడిక గది వెనుకవైపు చూపిస్తూ, “అక్కడ ఉన్న ఆ ఇద్దరు” అని చెప్పాడు. ఆ వ్యక్తికి సముచితంగానే సందేహం కలిగింది, కాబట్టి అతను శాఖ జాబితాను ఇంటికి తీసుకెళ్లి, దానిలో నిజానికి 20 మంది యువకులు ఉన్నారని వెంటనే గమనించాడు. అతను శాఖాధ్యక్షుడి వద్దకు తిరిగి వెళ్లి, తన సలహాదారులుగా సేవ చేయడానికి రెండు భాషలు మాట్లాడే ఇద్దరు శక్తివంతమైన వయోజనులు కావాలని అడిగాడు, ఆపై వారితో మరియు ఆ ఇద్దరు యువకులతో పేర్లను సమీక్షించడానికి కూర్చున్నాడు.

అప్పుడు ఈ శ్రద్ధగల యువకులు పనికి వెళ్లారు. తరువాతి కొన్ని నెలల్లో, వారు జాబితాలో ఉన్న ప్రతి అబ్బాయిని కనుగొన్నారు. పేరు పేరునా, ఆ తప్పిపోయిన గొఱ్ఱెలను వారి తోటివారు తిరిగి స్వాగతించి, ఆధ్యాత్మికంగా మరియు శారీరకంగా పోషించారు! ఒక సంవత్సరంలోపు, ఏ ఆదివారం చూసినా, సగటున 21 మంది యువకులు హాజరయ్యేవారు. లెక్కించిన మరియు లెక్క చూసిన యువకుల కొరకు దేవునికి కృతజ్ఞతలు.

నా ప్రియమైన స్నేహితుడు, యువ పట్టభద్ర విద్యార్థిగా, తన కుటుంబంతో కలిసి తన విద్యను కొనసాగించడానికి అమెరికాలోని ఒక పెద్ద నగరానికి వెళ్లాడు. వెంటనే అతను పెద్దల సమూహానికి అధ్యక్షత్వం వహించడానికి పిలువబడ్డాడు. స్టేకు అధ్యక్షుడితో తన మొదటి మౌఖికం గురించి కొంచెం భయపడుతూ, అతను సిద్ధపడి వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. రాబోయే సంవత్సరానికి తనకు మూడు లక్ష్యాలు ఉన్నాయని అతను స్టేకు అధ్యక్షుడికి చెప్పాడు: (1) 90 శాతం పరిచర్య, (2) ప్రతి వారం ఒక సారవంతమైన సువార్త పాఠం మరియు (3) ప్రతి నెల మంచి ప్రణాళికాబద్ధమైన ఒక సమూహ కార్యక్రమం.

నా స్నేహితుని వైపు చిరునవ్వుతో చూసి, ఈ తెలివైన స్టేకు అధ్యక్షుడు, “ఈ సంవత్సరం తన కుటుంబంతో దేవాలయానికి వెళ్లడానికి మీరు సహాయం చేయగల తక్కువ-చురుకైన సమూహ సభ్యుడి గురించి చెప్పగలరా?” అని అడిగాడు. అది నా స్నేహితుడిని ఆశ్చర్యపరిచింది. అతను జాగ్రత్తగా ఆలోచించి ఒక పేరు చెప్పాడు. “దానిని వ్రాసుకోండి,” అని స్టేకు అధ్యక్షుడు సూచించాడు. తరువాత ఈ అనుభవజ్ఞుడైన నాయకుడు అదే ప్రశ్నను మూడుసార్లు మరలా అడిగాడు—మరియు మౌఖికం ముగిసింది. ఆ యువకుడు నాయకత్వం మరియు పరిచర్య గురించి తన గొప్ప పాఠాలలో ఒకదాన్ని నేర్చుకుని ఆ మౌఖికం నుండి బయటకు వెళ్ళాడు. అతను కార్యక్రమాలు, పాఠాలు మరియు కార్యకలాపాలతో మౌఖికానికి వెళ్ళాడు. అతను పేర్లతో బయటకు వచ్చాడు! తదనంతరం, ఆ నాలుగు పేర్లు అతని మరియు అతని సమూహం యొక్క పరిచర్యకు ప్రధాన లక్ష్యంగా మారాయి.

ఒక మిషను నాయకుడిగా, నేను ఒక ఆదివారం ఉదయం నా శాఖలలో ఒకదానిని సందర్శించాను. శాఖాధ్యక్షుడు తన జేబులోంచి ఒక కాగితపు కార్డు తీసి దానిపై వ్రాయడం నేను గమనించాను. ముగింపు ప్రార్థన తర్వాత దాని గురించి అతనిని అడగాలని నిర్ణయించుకున్నాను. సమావేశం ముగిసిన వెంటనే, నేను కార్డు గురించి అడగకముందే, శాఖ మిషను నాయకుడు వేదిక పైకి పరిగెత్తాడు, అక్కడ అతనికి ఆ కాగితం ఇవ్వబడింది. వెంటనే నేను ఈ ఉత్సాహభరితమైన నాయకుడితో వారపు శాఖ సువార్తికుల సమన్వయ సమావేశానికి వెళ్ళాను. వాళ్ళు మొదలుపెట్టే ముందు, అతను జేబులోంచి కాగితాన్ని తీశాడు. అది సంస్కార కూడికకు రాని సభ్యుల పేర్లతో నిండి ఉంది. కొద్ది నిమిషాల్లోనే, సలహాసభలోని ప్రతి సభ్యుడు ఒకటి లేదా రెండు పేర్లను ఎంచుకుని, అదే రోజు వారిని సందర్శించి, వారు క్షేమంగా ఉన్నారని నిర్ధారించుకోవడానికి మరియు వారు గుర్తు చేసుకోబడ్డారని వారికి తెలియజేయడానికి కట్టుబడి ఉన్నారు. అది లెక్కించడం మరియు లెక్క చూసుకోవడం అంటే.

దగ్గరలోని దేవాలయానికి గంటల తరబడి విమానంలో ప్రయాణించే ఒక జిల్లా నాకు గుర్తుంది, దేవాలయ సిఫారసు ఎప్పటికీ ఉపయోగించబడనప్పటికీ, అక్కడ చలామణిలో ఉన్న సిఫారసును కలిగియుండడం చాలా ప్రాధాన్యతగా వుంది. ప్రతి నెల మొదటి ఆదివారం, నాయకులు తమ లెక్కింపు సాధనాలను ఉపయోగించి వరము పొందిన తమ సభ్యులను లెక్కించేవారు. ఒక సిఫారసు గడువు త్వరలో ముగియబోతోందని వారు గమనించినట్లయితే, కార్యనిర్వాహక కార్యదర్శి పునరుద్ధరణ మౌఖికమును షెడ్యూల్ చేస్తాడు. గడువు ముగిసిన సిఫారసులు ఉన్న వ్యక్తులకు సలహా ఇవ్వబడింది, తరువాత నిబంధన మార్గానికి తిరిగి రావడంలో వారికి సహాయం చేయడానికి ప్రయత్నం చేయబడింది. వరము పొందిన వారి సభ్యులలో ఎంతమందికి చలామణిలో ఉన్న సిఫారసు ఉందని నేను అడిగాను. సమాధానం ఆశ్చర్యపరిచేలా 98.6 శాతం. సిఫారసుల గడువు ముగిసిన ఆరుగురి గురించి అడిగినప్పుడు, నాయకులు వారిని పేర్లతో గుర్తించగలిగారు మరియు వారిని తిరిగి తీసుకురావడానికి జరుగుతున్న ప్రయత్నాల గురించి నాకు వివరించారు!

కొన్ని సంవత్సరాల క్రితం, మా కుటుంబం సంయుక్త రాష్ట్రాలకు తిరిగి వెళ్లింది. చిన్న, మరింత ఏకాకి విభాగాల్లో 26 అద్భుతమైన సంవత్సరాలు గడిపిన తర్వాత ఇక్కడ సంఘానికి హాజరు కావడానికి మేము ఉత్సాహంగా ఉన్నాము. నేను వార్డు సువార్తికునిగా పిలువబడ్డాను. మాకు ఒక గొప్ప వార్డు మిషను నాయకుడు ఉండేవారు మరియు మేము ఉత్సాహకరమైన పనులు చేస్తూ అద్భుతమైన వ్యక్తులకు బోధించేవాళ్ళం. గమనించడానికి మరియు మేము పనిచేస్తున్న స్నేహితుల కోసం వారి సహాయం పొందడానికి నేను వార్డు సలహాసభ సమావేశానికి హాజరవుతానని అడిగాను. రాబోయే వార్డు కార్యక్రమం గురించి మాత్రమే చర్చించబడినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. ఆ తర్వాత నేను వార్డు మిషను నాయకుడి దగ్గరకు వెళ్లి, మన జనుల గురించి నివేదించడానికి మీకు అవకాశం లభించలేదే అని నా అభిప్రాయం తెలియజేశాను. అతని ప్రతిస్పందన? “ఓహ్, నివేదించడానికి నాకు ఎప్పుడూ అవకాశం లభించదు.”

నేను కొన్ని వారాలకు ముందు హాజరైన, పాకిస్తాన్‌లోని లాహోర్‌లోని ఒక శాఖ సలహాసభ సమావేశంతో నేను దానిని పోల్చాను. ఈ చిన్న సమూహం ఒక చిన్న బల్ల చుట్టూ కూర్చుంది మరియు వారు మాట్లాడుకున్నదంతా జనుల గురించే. పేర్లు. ప్రతీ నాయకుడు తన గృహనిర్వాహకత్వముపై మరియు వారు ఆందోళన చెందుతున్న వ్యక్తులు మరియు కుటుంబాలపై నివేదిక ఇచ్చారు. చర్చించబడుతున్న వారిని ఆశీర్వదించడానికి ఉత్తమ మార్గాలపై వారి ఆలోచనలను జోడించే అవకాశం అందరికీ లభించింది. ప్రణాళికలు రూపొందించబడ్డాయి మరియు బాధ్యతలు కేటాయించబడ్డాయి. మొదటి తరానికి చెందిన మన సహోదర సహోదరీల దగ్గర నుండి పేరు పేరునా లెక్కించడం మరియు లెక్క చూసుకోవడంలో ఇది ఎంత గొప్ప పాఠం.

యేసు క్రీస్తు యొక్క సంఘంలో, గత ప్రవక్తలు మరియు ప్రస్తుత ప్రవక్తల చేత—అలాగే మన రక్షకుడు ఏర్పరచిన నమూనా ద్వారా—ఎలా పరిచర్య చేయాలో మనకు బోధించబడింది. మనం పేర్లు తీసుకుంటాము, మనం గుర్తుంచుకుంటాము మరియు ఆత్మల సంక్షేమంపై చర్చిస్తాము. ఇది చేసే నాయకులకు తమ సలహాసభ సమావేశాలలో చర్చించాల్సిన అంశాలు ఎప్పుడూ ముగియవు! లెక్కించడం మరియు లెక్క చూసుకోవడం అనే సూత్రం పనిచేస్తుంది. అది ప్రభువు యొక్క విధానం. మనం ఇంకా బాగా చేయగలం. విశ్వాన్ని సృష్టించి, అన్నింటినీ పరిపాలించే దేవునికి, ఈ కార్యము—ఆయన కార్యము మరియు మహిమ—చాలా వ్యక్తిగతమైనది. ఆయన అద్భుతమైన రక్షణ మరియు ఉన్నతస్థితి యొక్క కార్యంలో ఆయన చేతుల్లో సాధనాలుగా అది మనకు కూడా అలాగే ఉండాలి. నిజమైన వ్యక్తుల జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.