సర్వసభ్య సమావేశము
మీ హృదయాన్ని యేసు క్రీస్తు వైపుకు తిప్పండి: ప్రాథమిక సంగీతం యొక్క పవిత్ర బహుమతి
2025 అక్టోబరు సర్వసభ్య సమావేశము


10:37

మీ హృదయాన్ని యేసు క్రీస్తు వైపుకు తిప్పండి: ప్రాథమిక సంగీతం యొక్క పవిత్ర బహుమతి

ప్రాథమిక పాటలు యేసు క్రీస్తు శిష్యుల కొరకైన ప్రసంగాలు, పునఃస్థాపించబడిన సువార్త యొక్క యథార్థతకు సాక్ష్యాలు మరియు సంగీతానికి అనుగుణమైన ప్రార్థనలు.

ప్రాథమిక సమూహములో నా సేవ యొక్క ఆశీర్వాదాలలో ఒకటి, నా నాలుక మాట్లాడలేని భాషల్లో కూడా నా హృదయం ప్రేమించడాన్ని నేర్చుకోవడం. పవిత్ర సంగీతం యొక్క ఉమ్మడి భాష ద్వారా తోటి పరిశుద్ధులతో సంబంధాలను పెంచుకోవడంలో నేను ఆనందాన్ని కనుగొన్నాను. ముఖ్యంగా ప్రాథమిక యొక్క సరళమైన పాటల ద్వారా, పరిశుద్ధాత్మ భాషా అడ్డంకులను అధిగమించి నా హృదయాన్ని తన నడిపింపుతో నింపారు. పిల్లల స్వరాలలో, దేవుడు మరియు ఆయన కుమారుడైన యేసు క్రీస్తు యొక్క ప్రేమ స్పష్టమైన, తీక్షణమైన సత్యంతో ప్రకటించబడింది.

నేను ప్రాథమికలో పెరగకపోయినా, ఆత్మ దాని పాటల పవిత్రతను నాకు త్వరగా నేర్పారు మరియు అవి నా వ్యక్తిగత ఆరాధనలో భాగమయ్యాయి. ప్రాథమిక పాటలు నా జీవితంలో పరిశుద్ధ ప్రభావాన్ని చూపాయి మరియు నా ఆత్మను ఉద్ధరించాయి, నాకు నిత్య సత్యాలను నేర్పించాయి మరియు నన్ను రక్షకునికి, ఆయన సువార్తకు దగ్గరగా తీసుకువచ్చాయి.

అధ్యక్షులు డాలిన్ హెచ్. ఓక్స్ ఒకసారి ఇలా బోధించారు, “పునఃస్థాపించబడిన సువార్త సిద్ధాంతాన్ని నేర్చుకోవడానికి ఉత్తమ మార్గాలలో ఒకటి కీర్తనలు పాడడం.” ఆ మాటలు మనందరి విషయంలో నిజం, కానీ ముఖ్యంగా పిల్లల విషయంలో నిజం. రక్షకుని యొక్క చిన్న శిష్యుల హృదయాలలో సాక్ష్యపు విత్తనాలను నాటడానికి దేవుడు ఉపయోగించే అత్యంత మృదువైన సాధనాల్లో ప్రాథమిక సంగీతం ఒకటి. తల్లిదండ్రులు, నాయకులు మరియు బోధకులు తమ సాక్ష్యమిస్తూ మరియు పరలోక తండ్రి, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు మరియు పరిశుద్ధాత్మ గురించి పిల్లలు తెలుసుకుంటున్న దాని గురించి వారి సాక్ష్యాలను ఆహ్వానిస్తూ ఆ విత్తనానికి పోషణను అందిస్తారు.

అనేక సంవత్సరాలపాటు నా ఈ సేవలో, నేను కొన్ని ప్రశ్నల గురించి ఆలోచిస్తూనే ప్రాథమిక సంగీతం నుండి నేర్చుకోవడంలో మరియు పాడడంలో సమయం గడిపాను:

  • బాల్యంలో నేర్చుకున్న ప్రాథమిక పాటలు పిల్లలు తమ జీవితాంతం సాక్ష్యమివ్వడానికి ఉపయోగించే ఆధ్యాత్మిక భాషగా ఎలా మారతాయి?

  • సువార్త సత్యాలను పాడడం పిల్లలు తమ నిబంధనలో భాగంగా ప్రభువును గుర్తుంచుకోవడానికి మరియు ఆయన విధులకు వారిని సిద్ధం చేయడానికి ఎలా సహాయపడుతుంది?

  • ఈ చిన్న శిష్యుల హృదయాలపై దేవుని ధర్మశాస్త్రాన్ని వ్రాయడానికి ప్రాథమిక పాటలు ఎలా సహాయపడగలవు?

1878లో ప్రాథమిక ప్రారంభమైనప్పుడు, దాని మొదటి అధ్యక్షురాలు ఆరేలియా స్పెన్సర్ రాజర్స్, “పాడడం అవసరం” అని గమనించారు. పిల్లలకు సువార్తను బోధించడంలో సంగీతం ఎల్లప్పుడూ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ప్రాథమిక పాటలు పిల్లల మొదటి ఆధ్యాత్మిక భాషగా మారగలవు, ఎందుకంటే వాటి సరళమైన, మరపురాని శ్రావ్యాలు సువార్త సత్యాలకు స్వరాన్నిస్తాయి. ఈ పాటలు జీవితాంతం పిల్లలతో ఉండే శక్తిని కలిగి ఉంటాయి, వారి శిష్యత్వంలో భాగం అవుతాయి మరియు రక్షకుని గురించి సాక్ష్యమివ్వడానికి వారికి సహజమైన, సాధారణమైన మార్గంగా మారతాయి.

పాట ద్వారా యేసు క్రీస్తు యొక్క సిద్ధాంతాన్ని బోధించడం

ప్రాథమిక పాటలు శక్తివంతమైన సిద్ధాంతాన్ని బోధించే సాధనాలుగా కూడా కాగలవు. కొన్ని పాటలు రక్షకుని జీవితం మరియు పరిచర్య యొక్క కథలను చెబుతాయి. మరికొన్ని ఆయన విశ్వాసం, ఆయన నిరీక్షణ మరియు ఆయన దాతృత్వం వంటి ఆయన లక్షణాలను బోధిస్తాయి. అత్యంత పవిత్రమైన పాటలు ఆయన అనంతమైన ప్రాయశ్చిత్తానికి మరియు ఆ రక్షణ చర్య నుండి ప్రవహించే ప్రేమకు సాక్ష్యమిస్తున్నాయి.

ప్రభువు యొక్క ఒక ప్రవక్త, అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఇలా బోధించారు: “[సంగీతం] పిల్లలు చిన్నగా ఉన్న సమయాలను మించి, మంచి కోసం నిరంతర ప్రభావాన్ని చూపగలదు. … [దీనికి] ఆధ్యాత్మిక పోషణను అందించే శక్తి ఉంది. దీనికి స్వస్థపరిచే శక్తి ఉంది. దీనికి ఆరాధనను సులభతరం చేసే శక్తి ఉంది; ఇది [రక్షకుని] ప్రాయశ్చిత్తం మరియు సువార్త పునఃస్థాపన గురించి, దాని రక్షణ సూత్రాలు మరియు ఉన్నతమైన విధులతోపాటు ఆలోచించడానికి అనుమతిస్తుంది. సంగీతం ప్రార్థనాపూర్వక ఆలోచనలను వ్యక్తపరచడానికి మరియు పవిత్ర సత్యాల గురించి సాక్ష్యమివ్వడానికి మనకు శక్తిని అందిస్తుంది.”

తల్లిదండ్రులుగా, నాయకులుగా మరియు బోధకులుగా, సంగీతంలో కనిపించే సువార్త సత్యాలను ఉద్దేశపూర్వకంగా బోధించడం ద్వారా వాగ్దానం చేయబడిన ఈ ఆశీర్వాదాలను పొందడంలో పిల్లలకు సహాయపడడానికి మనం రకరకాలుగా ప్రయత్నం చేస్తాం. “పిల్లలు ఒక తరగతిలో ఎంత సిద్ధాంతాన్ని నేర్చుకుంటున్నారో, పాడడం నేర్చుకున్నప్పుడు కూడా అంతే సిద్ధాంతాన్ని నేర్చుకోగలరు” అని కూడా అధ్యక్షులు నెల్సన్ బోధించారు. ఈ పాటలు విశ్వాసాన్ని పెంపొందించే పాఠాలను అందించగలవు, అవి పిల్లల దృష్టిని రక్షకునిపై నిలుపుతాయి మరియు ఆయన సువార్త పట్ల భక్తిని పెంపొందించడంలో వారికి సహాయపడతాయి.

నీతిమంతుల హృదయం నుండి వచ్చే కీర్తనలు రక్షకునికి ప్రార్థన వంటివి అని లేఖనాలు బోధిస్తున్నాయి. రక్షకుని చిన్న శిష్యుల స్వరాలు కలిగించే ఆనందాన్ని చూసి నేను ఆశ్చర్యపోగలను. వారి ప్రార్థనా గీతాలు నిత్య సత్యాలను నిర్ధారించడానికి పరిశుద్ధాత్మను ఆహ్వానించే విశ్వాస వ్యక్తీకరణలుగా పరలోకానికి చేరుకుంటాయని మరియు ఆయనను అనుసరించి ఇంటికి రమ్మనే మన రక్షకుని పిలుపును అంగీకరించడానికి ఇతరులను మృదువుగా మరియు సున్నితంగా ఆహ్వానిస్తాయని నాకు తెలుసు. ఎల్డర్ హెన్రీ బి. ఐరింగ్ మనకు గుర్తు చేసినట్లుగా, ఆత్మను అనుభవించే ఆ క్షణాలలోనే రక్షకుని ప్రాయశ్చిత్తం మన జీవితాల్లో పనిచేస్తుందనే రుజువు మనకు లభిస్తుంది.

హృదయంలో సత్యాన్ని ముద్రించడం

ప్రాథమిక సంగీతం శిష్యులుగా మన పిల్లలు తమ జీవితకాలం లాభం పొందే అద్భుతం కాగలదు. ఆరేళ్ల వయసులో నేర్చుకున్న పాట మనతో ఉండగల శక్తిని కలిగి ఉంటుంది—మరియు దశాబ్దాల తరువాత నిర్ణయం, శోధన, దుఃఖం లేదా ఆనందం యొక్క క్షణాలలో తిరిగి రాగలదు. బహుశా మనం పెద్దయ్యాక, “నేను దేవుని ప్రణాళికను అనుసరిస్తాను” అనే సాహిత్యం మనకు దేవుని వాగ్దానాల నిశ్చయత గురించి అపొస్తలుడైన పౌలు ఇచ్చిన సాక్ష్యాన్ని ప్రతిధ్వనించే ఆధ్యాత్మిక లంగరుగా పనిచేయవచ్చు. లేదా దేవుడు తన వాగ్దానాలను నిలబెట్టుకుంటారు కాబట్టి, ఆయన నిబంధనలు బలమైన ఓదార్పును, ఆశ్రయ స్థలాన్ని అందిస్తాయని అవి మనకు గుర్తు చేయవచ్చు మరియు యేసు క్రీస్తుపై, ఆయన ప్రాయశ్చిత్త శక్తిపై మన నిరీక్షణను, నమ్మకాన్ని స్థిరంగా ఉంచమని మనల్ని ఆహ్వానించవచ్చు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న వయోజన సభ్యులు, కష్ట సమయాల్లో, తరచుగా వారు చిన్నప్పుడు నేర్చుకున్న ప్రాథమిక పాటలను గుర్తుచేసుకుంటారు మరియు వాటి వైపు మొగ్గు చూపుతారు. చాలామందికి, ఈ పాటలు యేసు క్రీస్తుపై వారి విశ్వాసం యొక్క ప్రారంభానికి మద్దతు ఇచ్చాయి మరియు తరచుగా ఆయన సువార్తకు పరివర్తన చెందడం ప్రారంభమైన మొదటి ప్రదేశంగా ఉన్నాయి. తల్లిదండ్రులు, నాయకులు మరియు బోధకులు పిల్లలకు బోధించడం, పాడడం మరియు శ్రద్ధతో సాక్ష్యమివ్వడం ద్వారా ఆ విశ్వాసాన్ని సంవత్సరాలుగా పెంపొందించారు.

ఒక సహోదరి ప్రాథమిక సంగీతం తనకు ఎంతో ఇష్టమని నాకు చెప్పింది మరియు 20 సంవత్సరాల తర్వాత యేసు క్రీస్తు సువార్తకు తన నిరంతర పరివర్తనను వేగవంతం చేయడంలో దానికి ఆమె ఘనతనిచ్చింది. మరో సభ్యుడు తన చిన్నతనంలో ప్రాథమిక ఆవగింజంత విశ్వాసాన్ని నాటిందని మరియు 30 ఏళ్ల వయస్సులో అతను ప్రభువు యొక్క సంఘానికి తిరిగి రావడానికి కారణమైందని సాక్ష్యమిచ్చాడు. రక్షకుడు ఇలా వాగ్దానం చేశారు, “ఆదరణకర్త … సమస్తమును మీకు బోధించి, అన్ని సంగతులను మీకు జ్ఞాపకము చేయును.” ఆ వాగ్దానం నెరవేరడానికి ప్రాథమిక సంగీతం ఒక మార్గం కావచ్చు.

మరొక ప్రియమైన ప్రాథమిక పాట సరళమైన విశ్వాసం మరియు శాశ్వత సాక్ష్యం యొక్క శక్తిని సంగ్రహిస్తుంది:

నేను యేసుతో పరలోకానికి నడుస్తున్నప్పుడు,

ఆయన నన్ను తన ఆత్మతో ఆశీర్వదించి, తన ప్రేమతో నన్ను నింపుతారు,

నా హృదయాన్ని శాశ్వతంగా మార్చి, నేను స్పష్టంగా చూడడానికి సహాయం చేస్తారు.

నేను యేసుతో నడుస్తాను మరియు ఆయన నాతో నడుస్తారు.

పిల్లలు పాడుతున్నప్పుడు, వారు ఒక శిష్యుడి యొక్క కోరికను వ్యక్తపరుస్తున్నారు మరియు నిబంధన జీవన విధానాన్ని నేర్చుకుంటున్నారు. ఆత్మ వారి లేత హృదయాలపై నిత్య సత్యాలను చెక్కడానికి సంగీతాన్ని ఉపయోగించవచ్చు. మరియు కాలక్రమేణా, పిల్లలు యేసు క్రీస్తుతో పవిత్ర నిబంధనలు చేసి పాటించడం ద్వారా వారి హృదయాలను, వారి జీవితాలను ఆయన వైపు మళ్లించడానికి మరియు శ్రుతి చేయడానికి ఎంచుకోవచ్చు.

మన నిబంధనలను గుర్తుంచుకోవడం మరియు విధుల కోసం సిద్ధపడడం

పవిత్ర సంగీతం క్రీస్తు సిద్ధాంతాన్ని ఆత్మ లోతుల్లోకి వ్రాయడానికి మరియు ఆయన విధులను పొందడానికి మనల్ని సిద్ధం చేయడానికి సహాయపడుతుంది. ఇది రక్షకుని సిద్ధాంతాన్ని మన జ్ఞాపకశక్తికి మరియు ఆ జ్ఞాపకాన్ని ఆయనలోని మన శిష్యత్వానికి అనుసంధానిస్తుంది.

ప్రాథమిక నాయకులుగా, ప్రాథమికలో సంగీతం ఆనందంతో, సిద్ధాంతపరమైన అవగాహనతో మరియు ఆత్మతో బోధించబడుతుందని నిర్ధారించే అవకాశం మరియు పవిత్ర బాధ్యత మనకు ఉంది. దీనిలో పిల్లలు పాడేటప్పుడు వారు ఏమి అనుభూతి చెందుతారో గమనించమని ఆహ్వానించడం మరియు ఆ భావాలు పరిశుద్ధాత్మ నుండి వచ్చాయని గుర్తించడంలో వారికి సహాయపడడం ఉన్నాయి. ఈ ప్రయత్నాలు మన పిల్లలను బాప్తిస్మం మరియు నిర్ధారణ వంటి పవిత్ర విధులకు సిద్ధం చేయడంలో సహాయపడతాయి, అలాగే వారు దేవునితో తమ వాగ్దానాలను క్రమం తప్పకుండా పునరుద్ధరిస్తున్నప్పుడు వారి నిబంధన జ్ఞాపకశక్తిని ప్రేరేపిస్తాయి.

రక్షకుడు సంస్కారమును స్థాపించిన తర్వాత, చివరి భోజన సమయంలో, “అంతట వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్లిరి” అని మత్తయి నమోదు చేశాడు. ప్రతీవారం, బాప్తిస్మం తీసుకొని నిర్ధారించబడిన ప్రభువు యొక్క పునఃస్థాపించబడిన సంఘ సభ్యులు, ఎనిమిది సంవత్సరాల వయస్సు కలిగియుండి బాప్తిస్మం తీసుకున్న పిల్లలతో సహా, ప్రభువు యొక్క సంస్కారమును స్వీకరించడానికి సిద్ధమవుతారు. పవిత్ర సంగీతాన్ని పాడడం ద్వారా, ఆయన నామాన్ని తమపై తీసుకోవడానికి, ఎల్లప్పుడూ ఆయనను గుర్తుంచుకోవడానికి మరియు ఆయన ఆజ్ఞలను పాటించడానికి ఆ పవిత్ర విధి కొరకు తమ హృదయాలను సిద్ధం చేసుకునే అవకాశం దేవుని పిల్లల సమూహాలకు ఇవ్వబడుతుంది.

ముగింపు సాక్ష్యము

ప్రియమైన స్నేహితులారా, మనల్ని యేసు క్రీస్తు మరియు ఆయన సువార్త వైపు నడిపించే నిత్య సత్యాలను మరియు సిద్ధాంతాన్ని ప్రాథమిక పాటలు బోధిస్తాయని నేను సాక్ష్యమిస్తున్నాను. ఈ పాటల యొక్క సరళమైన బోధనల ద్వారా మీ హృదయాలలో ఏ మూల సత్యాలు వ్రాయబడ్డాయో పరిశీలించమని మరియు పాట ద్వారా సువార్త యొక్క శుభవార్తను రక్షకుని చిన్న శిష్యులకు బోధించేటప్పుడు ఆ సత్యాల గురించి వారికి సాక్ష్యమివ్వమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను.

మన తండ్రి అయిన దేవుడు, తన అనంతమైన ప్రేమతో, తన ప్రియ కుమారుడిని మనకు బోధించడానికి, మనకు మార్గాన్ని చూపించడానికి మరియు తన ప్రాయశ్చిత్తం ద్వారా మనల్ని విమోచించడానికి భూమికి పంపారని నాకు తెలుసు.

రక్షకుని జీవితం మరియు పరిచర్య నిజమైనవని, వ్యక్తిగతమైనవని నాకు తెలుసు. లేఖనాలు ఆయన స్వస్థత, ఆయన దయ మరియు ఆయన అద్భుతాల కథలతో నిండి ఉన్నాయి.

పరలోక తండ్రి తన పిల్లల వయస్సు, పరిస్థితి లేదా భాషతో సంబంధం లేకుండా వారి హృదయపూర్వక ప్రార్థనలను విని, సమాధానమిస్తారని నాకు తెలుసు. ఆయన మన హృదయాలలోని నిశ్శబ్ద విన్నపాలను వింటారు.

గెత్సేమనేలో, యేసు క్రీస్తు మన పాపాలు, చింతలు మరియు బాధల బరువును భరించారని నేను సాక్ష్యమిస్తున్నాను. మన పట్ల ఆయనకున్న ప్రేమ కారణంగా ఆయన ఇష్టపూర్వకంగా బాధపడ్డారు మరియు మనం క్షమించబడడానికి, ఇంటికి తిరిగి రావడానికి వీలు కల్పించారు.

మనం అక్షరాలా దేవుని పిల్లలమని, ఆయన స్వరూపంలో సృష్టించబడ్డామని, దైవిక సామర్థ్యంతో దీవించబడ్డామని మరియు యేసు క్రీస్తును అనుసరించాలని ఎంచుకుంటే ఆయనతో కలిసి జీవించడానికి తిరిగి రావాలని ఆహ్వానించబడ్డామని నాకు తెలుసు.

యేసు క్రీస్తు మన పరిపూర్ణ మాదిరి అని నాకు తెలుసు మరియు సేవ చేయడం, క్షమించడం, ఇతరులను ప్రేమించడం ద్వారా మనం ఆయనను అనుసరిస్తున్నప్పుడు, మనం రోజురోజుకూ ఆయనలాగా మారతాము.

ప్రభువు యొక్క పరిశుద్ధ దేవాలయాలు భూమిపై ఆయన మందిరము అని నాకు తెలుసు. వాటిలో, మనం పవిత్ర నిబంధనలు చేస్తాము, శాశ్వతమైన ఆశీర్వాదాలను పొందుతాము, ఆయన గురించి మరింత నేర్చుకుంటాము మరియు ఆయన ఉనికిని ఎక్కువగా అనుభూతి చెందుతాము. దేవాలయం అనేది అభ్యాసానికి, శాంతికి నిలయము మరియు మన జీవితాలకు సిద్ధపాటు.

మన పిల్లలకు ఈ ప్రాథమిక పాటలను నేర్పించడానికి మరియు పాడడానికి మనం చేసే ప్రయత్నాలు మన మత సంప్రదాయంలో ఒక మంచి భాగం మాత్రమే కాదని నేను సాక్ష్యమిస్తున్నాను. అవి యేసు క్రీస్తు శిష్యుల కొరకైన ప్రసంగాలు, పునఃస్థాపించబడిన సువార్త యొక్క యథార్థతకు సాక్ష్యాలు మరియు సంగీతానికి అనుగుణమైన ప్రార్థనలు. పవిత్ర సంగీతం వినేవారిపై క్రీస్తు యొక్క వెలుగును ప్రకాశింపజేయగలదు మరియు గాయకుడి హృదయంలో దానిని క్రుమ్మరించగలదు. ప్రియమైన స్నేహితులారా, యేసు ఇప్పటికీ ఆయన ప్రభావాన్ని మనం పంచుకోవాలని కోరుకుంటున్నారు. ఈవిధంగా యేసు క్రీస్తు యొక్క పవిత్ర నామములో నేను సాక్ష్యమిస్తున్నాను, ఆమేన్.

వివరణలు

  1. Dallin H. Oaks, “Worship through Music,” Ensign, Nov. 1994, 10.

  2. “నీతిమంతుల కీర్తన నాకు ప్రార్థన వంటిది ” (సిద్ధాంతము మరియు నిబంధనలు 25:12).

  3. “పవిత్ర సంగీతం అనేది సంస్కార సమావేశంలో మరియు ఇతర సంఘ సమావేశాలలో ఒక ముఖ్యమైన భాగం. … సభ్యులు సంస్కారంలో పాలుపంచుకోవడం ద్వారా యేసు క్రీస్తును జ్ఞాపకం చేసుకోవడానికి సంస్కార సమావేశంలో సమకూడుతారు. వారు విశ్వాసాన్ని, సాక్ష్యాన్ని నిర్మించడానికి మరియు పరలోక తండ్రిని, యేసు క్రీస్తును ఆరాధించడానికి సమకూడుతారు. ఈ ప్రయోజనాలను సాధించడంలో సహాయపడడానికి సంగీతాన్ని ఎంచుకోవాలి. … సంస్కార కీర్తన సంస్కారాన్ని లేదా రక్షకుని త్యాగాన్ని సూచించాలి” (ప్రధాన చేతిపుస్తకము: యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము‌లో సేవ చేయుట, 19.3, 19.3.2, సువార్త గ్రంథాలయము).

  4. “వారి మనస్సులలో నా ధర్మవిధి ఉంచెదను, వారి హృదయముమీద దాని వ్రాసెదను” (యిర్మీయా 31:33).

  5. Aurelia Spencer Rogers, in “A History of the Primary Organization,” history.ChurchofJesusChrist.org.

  6. Russell M. Nelson, “Power and Protection Provided by Worthy Music” (Brigham Young University devotional, May 4, 2008), 4, 5, speeches.byu.edu.

  7. Russell M. Nelson, in “Keep Singing Songs That Teach Doctrine, Says President Nelson” (video), ChurchofJesusChrist.org.

  8. “ప్రసంగించడానికి పిలువబడే నాయకులు, బోధకులు మరియు సభ్యులు తరచుగా కీర్తనల పుస్తకాన్ని ఆశ్రయించి, పద్యాలలో శక్తివంతంగా మరియు అందంగా అందించబడిన ప్రసంగాలను కనుగొంటారని మేము ఆశిస్తున్నాము. …

    కుటుంబాలను గొప్ప ఆధ్యాత్మికత మరియు సువార్త పట్ల భక్తి వైపు నడిపించడానికి సంగీతానికి అపరిమితమైన శక్తులు ఉన్నాయి. కడవరి-దిన పరిశుద్ధులు తమ ఇళ్లను విలువైన సంగీత ధ్వనితో నింపాలి. …

    “మీ పిల్లలకు కీర్తనలను ప్రేమించడం నేర్పండి. విశ్రాంతిదినమున, గృహ సాయంకాలములో, లేఖన అధ్యయన సమయంలో, ప్రార్థన సమయంలో వాటిని పాడండి. మీరు పని చేస్తున్నప్పుడు, మీరు ఆడుతున్నప్పుడు మరియు మీరు కలిసి ప్రయాణిస్తున్నప్పుడు పాడండి. మీ చిన్న పిల్లలలో విశ్వాసాన్ని మరియు సాక్ష్యాన్ని పెంపొందించడానికి కీర్తనలను లాలిపాటలుగా పాడండి” (“First Presidency Preface,” Hymns, ix, x).

  9. సిద్ధాంతము మరియు నిబంధనలు 25:12 చూడండి.

  10. “మీరు పరిశుద్ధాత్మ యొక్క ప్రభావాన్ని భావించినట్లైతే … , ప్రాయశ్చిత్తము మీ జీవితములో పనిచేస్తుందని దానిని మీరు ఒక నిదర్శనంగా తీసుకొనవచ్చును” (Henry B. Eyring, “Gifts of the Spirit for Hard Times” [Brigham Young Univers

  11. హెబ్రీయులకు 6:17-19 చూడండి.

  12. మొరోనై 7:41 చూడండి.

  13. యోహాను 14:26.

  14. “I Will Walk with Jesus,” Hymns—For Home and Church, Gospel Library.

  15. మత్తయి 26:30.

  16. “సంస్కారము యొక్క విధి సంఘ సభ్యులకు సంబంధించినది అయినప్పటికీ, ఇతరులు దానిలో పాల్గొనకుండా నిరోధించడానికి ఏమీ చేయకూడదు” (ప్రధాన చేతిపుస్తకము, 18.9.3). ముఖ్యంగా, చిన్న పిల్లలు జవాబుదారీతనపు వయస్సు రాకముందు సంస్కారములో పాల్గొనడం సముచితం, తద్వారా వారు యేసు క్రీస్తు యొక్క త్యాగం పట్ల ఎక్కువ కృతజ్ఞతను పెంచుకోవచ్చు మరియు భవిష్యత్తులో దేవునితో పవిత్ర నిబంధనలలోకి ప్రవేశించడానికి సిద్ధపడవచ్చు.

  17. See “He Sent His Son,” Children’s Songbook, 34–35.

  18. See “Tell Me the Stories of Jesus,” Children’s Songbook, 57.

  19. See “A Child’s Prayer,” Children’s Songbook, 12–13.

  20. See “Gethsemane,” Hymns—For Home and Church.

  21. See “I Am a Child of God,” Children’s Songbook, 2–3.

  22. See “I’m Trying to Be Like Jesus,” Children’s Songbook, 78–79.

  23. See “I Love to See the Temple,” Children’s Songbook, 95.

  24. See “Jesus Wants Me for a Sunbeam,” Children’s Songbook, 60.