సర్వసభ్య సమావేశము
నవ్వుతున్న ముఖాలు మరియు కృతజ్ఞతగల హృదయాలు
2025 అక్టోబరు సర్వసభ్య సమావేశము


10:52

నవ్వుతున్న ముఖాలు మరియు కృతజ్ఞతగల హృదయాలు

ఆఫ్రికాలోని మన పరిశుద్ధులు జీవితపు సవాళ్లను మరియు పెరుగుతున్న సంఘ అవసరాలను ఎదుర్కొంటున్నప్పుడు వారి గొప్పతనం మరింత స్పష్టంగా కనిపిస్తుంది.

ఒక సంవత్సరం క్రితం, డెబ్బది యొక్క అధ్యక్షత్వములో నా నియామకం నుండి నేను విడుదలయ్యాను, ఈ మార్పును ఇక్కడ సర్వసభ్య సమావేశములో ప్రకటించారు. గౌరవస్థాన బాధ్యతలు స్వీకరించే ప్రధాన అధికారులతో పాటు నా పేరు చదవబడినందున, నేను నా సేవా సమయాన్ని కూడా ముగించుకుంటున్నానని చాలామంది భావించారు. సమావేశం తరువాత, నా జీవితంలో తదుపరి దశకు కృతజ్ఞతలు మరియు శుభాకాంక్షలతో కూడిన అనేక సందేశాలను నేను అందుకున్నాను. కొంతమంది నార్త్ సాల్ట్ లేక్‌లోని నా ఇంటిని కొనుగోలు చేయడానికి కూడా ప్రతిపాదించారు. నేను నా పిలుపును పూర్తి చేసిన తర్వాత నన్ను గుర్తుచేసుకుంటారని మరియు మా ఇంటిని అమ్మడంలో మాకు ఇబ్బంది ఉండదని తెలుసుకోవడం ఆనందంగా ఉంది. కానీ నేను ఇంకా అంతవరకు రాలేదు.

నా కొత్త నియామకం నన్ను మరియు మోనికాను అందమైన ఆఫ్రికాకు తీసుకెళ్లింది, అక్కడ సంఘము వర్ధిల్లుతోంది. ఆఫ్రికా దక్షిణ ప్రాంతంలో విశ్వాసులైన పరిశుద్ధుల మధ్య సేవ చేయడం మరియు వారి పట్ల ప్రభువుకు ఉన్న ప్రేమను చూడడం ఒక ఆశీర్వాదంగా ఉంది. అన్ని నేపథ్యాల నుండి వచ్చిన తరాల కుటుంబాలను చూడడం స్ఫూర్తిదాయకంగా ఉంది, వారిలో విజయవంతమైన మరియు బాగా చదువుకున్న చాలా మంది సంఘ సభ్యులు తమ సమయాన్ని మరియు ప్రతిభను ఇతరులకు సేవ చేయడానికి అంకితం చేస్తున్నారు.

అదే సమయంలో, ఈ ప్రాంతం యొక్క జనాభా దృష్ట్యా, చాలామంది సామాన్యులు సంఘములో చేరుతున్నారు మరియు విశ్వాసంతో దశమభాగం చెల్లించడం యొక్క ఆశీర్వాదాలు మరియు సంఘము అందించే విద్యా అవకాశాల ద్వారా వారి జీవితాలను మార్చుకుంటున్నారు. సక్సీడ్ ఇన్ స్కూల్, ఇంగ్లీష్ కనెక్ట్, బివైయు–పాత్‌వే వరల్డ్‌వైడ్ మరియు శాశ్వత విద్యా నిధి వంటి కార్యక్రమాలు చాలా మంది జీవితాలను, ముఖ్యంగా భావితరానికి చెందిన వారి జీవితాలను దీవిస్తాయి.

అధ్యక్షులు జేమ్స్ ఇ. ఫౌస్ట్ ఒకసారి ఇలా అన్నారు, “ఈ సంఘము తరచుగా గొప్ప వ్యక్తులను ఆకర్షించదు, కానీ తప్పనిసరిగా సాధారణ ప్రజలను గొప్ప వ్యక్తులుగా చేస్తుంది అని చెప్పబడింది.”

ఆఫ్రికాలోని మన పరిశుద్ధులు జీవితపు సవాళ్లను మరియు పెరుగుతున్న సంఘ అవసరాలను ఎదుర్కొంటున్నప్పుడు వారి గొప్పతనం మరింత స్పష్టంగా కనిపిస్తుంది. వారు ఎల్లప్పుడూ సానుకూల దృక్పథంతో దానిని సమీపిస్తారు. వారు అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ నుండి వచ్చిన ప్రసిద్ధ బోధనను చక్కగా ప్రతిబింబిస్తారు:

“మనము అనుభవించు సంతోషము మన జీవితపు పరిస్థితులతో పెద్దగా సంబంధము కలిగిలేదు, కానీ మన జీవితముల యొక్క దృష్టితో పూర్తి సంబంధము కలిగియున్నది.

“మన జీవితాల యొక్క దృష్టి అంతా దేవుని యొక్క రక్షణ ప్రణాళికపైన … యేసు క్రీస్తు మరియు ఆయన సువార్త పైన ఉన్నప్పుడు, మన జీవితాల్లో ఏమి జరుగుతోంది—ఏమి జరగడం లేదు—అనేదానితో సంబంధం లేకుండా మనం ఆనందమును అనుభవించగలము.”

వారికి సవాళ్లు ఉన్నప్పటికీ వారు ఆనందాన్ని కనుగొంటారు. రక్షకునితో మనకున్న సంబంధం నవ్వుతున్న ముఖాలతో మరియు కృతజ్ఞతగల హృదయాలతో కష్టాలను ఎదుర్కోవడానికి మనకు సహాయపడుతుందని వారు నేర్చుకున్నారు.

ఆఫ్రికా పరిశుద్ధులు

మొజాంబిక్‌తో ప్రారంభించి, ఈ సూత్రాన్ని వివరించే ఈ విశ్వాసులైన పరిశుద్ధులతో నాకున్న అనుభవాలలో కొన్నింటిని పంచుకుంటాను.

మొజాంబిక్

కొన్ని నెలల క్రితం, అప్పటికే 10 విభాగాలున్న ఒక సంవత్సర కాలపు స్టేకు యొక్క స్టేకు సమావేశానికి నేను అధ్యక్షత్వం వహించాను. 2,000 కంటే ఎక్కువ మంది ప్రజలు చిన్న ప్రార్థనా మందిరం మరియు బయట ఏర్పాటు చేసిన మూడు గుడారాలలో నిండిపోయారు. స్టేకు అధ్యక్షుడికి 31 సంవత్సరాలు, ఆయన భార్యకు 26 సంవత్సరాలు మరియు వారికి ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. అతను ఈ పెరుగుతున్న మరియు సవాలుతో కూడిన స్టేకును ఎటువంటి ఫిర్యాదులు లేకుండా—నవ్వుతున్న ముఖం మరియు కృతజ్ఞతగల హృదయంతో నడిపిస్తున్నాడు.

గోత్రజనకునితో జరిగిన ఒక ఇంటర్వ్యూలో, ఆయన భార్య తీవ్ర అనారోగ్యంతో ఉందని, ఆమె సంరక్షణకు ఆయన చాలా కష్టపడుతున్నారని నేను తెలుసుకున్నాను. స్టేకు అధ్యక్షుడితో సమస్యను గురించి ప్రస్తావించిన తర్వాత, మేము ఆమెకు యాజకత్వ దీవెన ఇచ్చాము. సగటున ఎన్ని గోత్రజనక దీవెనలు ఇస్తారని నేను గోత్రజనకుడిని విచారించాను.

“ఎనిమిది నుండి పది,” అని అతను అన్నాడు.

“ఒక నెలకా?”, అని నేను అడిగాను.

“వారానికి!”, అని అతను జవాబిచ్చాడు. వారాంతంలో అంత ఎక్కువ చేయడం తెలివైన పని కాదని నేను అతనికి సలహా ఇచ్చాను.

“ఎల్డర్ గోడోయ్, వారు ప్రతీ వారం వస్తూనే ఉంటారు, కొత్త సభ్యులతో సహా చాలామంది యువకులు కూడా వస్తూనే ఉంటారు,” అని అతను అన్నాడు. మరలా, ఎటువంటి ఫిర్యాదులు లేవు—నవ్వుతున్న ముఖం మరియు కృతజ్ఞతగల హృదయం మాత్రమే.

శనివారం సాయంత్రం స్టేకు సమావేశం తర్వాత, నేను హోటల్‌కు వెళ్తుండగా, రాత్రి ఆలస్యంగా రోడ్డు పక్కన ప్రజలు ఆహారం కొంటున్నట్లు నేను గమనించాను. పగటిపూట కాకుండా చీకటిగా ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారని నేను నా డ్రైవర్‌ను అడిగాను. ఆహారం కొనడానికి డబ్బు కోసం వారు పగటిపూట పని చేస్తున్నారని అతను బదులిచ్చాడు.

“అంటే, వాళ్ళు రేపు తినడానికి ఈ రోజు పని చేస్తున్నారు,” అని నేను అన్నాను.

అయితే అతను నన్ను సరిచేశాడు: “లేదు, వాళ్ళు ఈ రాత్రి తినడానికి పగటిపూట పని చేస్తున్నారు.” మన సభ్యులు మెరుగైన పరిస్థితిలో ఉంటారని నేను ఆశించాను, కానీ దేశంలోని ఆ ప్రాంతంలో చాలామంది ఇలాంటి సవాళ్లను ఎదుర్కొన్నారని అతను ధృవీకరించాడు. వారి పరిస్థితుల గురించి కొత్తగా తెలుసుకున్న నేను, మరుసటి రోజు ఉదయం మా ఆదివారపు సభ‌లో, వారి నవ్వుతున్న ముఖాలు మరియు కృతజ్ఞతగల హృదయాలను చూసి మరింత కదిలిపోయాను.

జాంబియా

స్టేకు అధ్యక్షుడు మరియు నేను ఒక ఆదివారం సమావేశానికి వెళ్ళేటప్పుడు, ఒక జంట ఒక చిన్నబిడ్డ మరియు ఇద్దరు పిల్లలతో రోడ్డు వెంట నడవడం చూశాము. మేము వాళ్ళని ఎక్కించుకోవడానికి ఆగాము. వారు ఆశ్చర్యపోయారు మరియు ఆనందించారు. ప్రార్థనా మందిరానికి ఎంత దూరం నడవాలి అని నేను అడిగినప్పుడు, పిల్లలు నడిచే వేగాన్ని బట్టి 45 నిమిషాల నుండి గంట వరకు పట్టవచ్చని తండ్రి బదులిచ్చాడు. వారు ప్రతీ ఆదివారం ఎటువంటి ఫిర్యాదులు లేకుండా—నవ్వుతున్న ముఖాలు మరియు కృతజ్ఞతగల హృదయాలతో—నడుచుకొని వెళ్లి, తిరిగి వస్తున్నారు.

మలావి

స్టేకు సమావేశానికి ముందు ఒక ఆదివారం, ప్రభుత్వ పాఠశాలలను సమావేశ మందిరాలుగా ఉపయోగిస్తున్న రెండు శాఖలను నేను సందర్శించాను. కనీసం కొన్ని ప్రాథమిక సౌకర్యాలు కూడా లేని భవనాల యొక్క దుర్భరమైన మరియు నిరాడంబరమైన పరిస్థితులను చూసి నేను ఆశ్చర్యపోయాను. అక్కడ కొంతమంది సభ్యులను కలిసినప్పుడు, వారి సమావేశ మందిరం యొక్క లోపభూయిష్టమైన పరిస్థితులకు క్షమాపణ చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను, కానీ వారు చాలా దూరం నడిచే అవసరం లేకుండా, సమీపంలో సమావేశమయ్యేందుకు ఒక స్థలం లభించిందని సంతోషంగా ఉన్నారు. మరలా, అక్కడ ఎటువంటి ఫిర్యాదులు లేవు—నవ్వుతున్న ముఖాలు మరియు కృతజ్ఞతగల హృదయాలు మాత్రమే ఉన్నాయి.

జింబాబ్వే

శనివారం నాయకత్వ శిక్షణ జరిగిన తర్వాత, స్టేకు అధ్యక్షుడు నన్ను ఆదివారం సేవలు జరుగుతున్న అద్దె ఇంట్లోకి తీసుకెళ్లారు. 240 మంది వ్యక్తులు హాజరయ్యారు. ఆ తరువాత బిషప్పు ఆ వారంలో బాప్తిస్మము పొందిన 10 మంది కొత్త సభ్యులను పరిచయం చేశారు. ఆ సంఘం రెండు చిన్న గదులలో విస్తరించి ఉంది, కొంతమంది సభ్యులు భవనం వెలుపల కూర్చుని, కిటికీలు మరియు తలుపుల ద్వారా సమావేశాన్ని చూస్తున్నారు. మరలా, అక్కడ ఎటువంటి ఫిర్యాదులు లేవు—నవ్వుతున్న ముఖాలు మరియు కృతజ్ఞతగల హృదయాలు మాత్రమే ఉన్నాయి.

లెసూతో

స్టేకుగా మారడానికి సిద్ధమవుతున్న సంఘ జిల్లాను చూడడానికి “ద మౌంటెయిన్ కింగ్డమ్” అని కూడా పిలువబడే ఈ అందమైన చిన్న దేశాన్ని నేను సందర్శించాను. శనివారం సమావేశాల తర్వాత, అద్దె ఇంటిలో ఉన్న వారి శాఖలలో ఒకదానిలో ఆదివారం సేవలకు నేను హాజరయ్యాను. సంస్కార గది నిండిపోయింది, సంస్కారంలో పాల్గొనడానికి జనులు తలుపు బయట నిలబడి ఉన్నారు. పెద్ద ఇల్లు అవసరమని నేను శాఖాధ్యక్షుడితో చెప్పాను. నా ఆశ్చర్యానికి, అది అతని సభ్యత్వంలో సగం మాత్రమే అని అతను నాకు తెలియజేశాడు. రెండవ సమావేశం తర్వాత మిగిలిన సగం మంది రెండవ సంస్కార సమావేశానికి హాజరవుతారు. మరలా, అక్కడ ఎటువంటి ఫిర్యాదులు లేవు—నవ్వుతున్న ముఖాలు మరియు కృతజ్ఞతగల హృదయాలు మాత్రమే ఉన్నాయి.

తరువాత, మన యౌవనులలో చాలామందికి జరిగిన ప్రాణాంతకమైన రోడ్డు ప్రమాదం కారణంగా నేను లెసూతోకు తిరిగి వచ్చాను. దాని గురించి ఇంతకు ముందు ఎల్డర్ డి. టాడ్ క్రిస్టాఫర్‌సన్ ప్రస్తావించారు. నేను ఆ కుటుంబాలను, నాయకులను సందర్శించినప్పుడు, అక్కడ దుఃఖంతో కూడిన వాతావరణం ఉంటుందని నేను ఊహించాను. బదులుగా, పరిస్థితిని ఉత్తేజకరమైన మరియు స్ఫూర్తిదాయకమైన రీతిలో ఎదుర్కొంటున్న బలమైన మరియు హుషారైన పరిశుద్ధులను నేను కలిశాను.

ఎంపిహెచ్ఓ అనకైయా ఎన్‌కూ

ఈ చిత్రంలో ప్రాణాలతో బయటపడిన 14 ఏళ్ల ఎంపిహెచ్ఓ అనకైయా ఎన్‌కూ తన స్వంత మాటలలో దీనిని బాగా వివరించింది: “యేసును నమ్మండి మరియు ఎల్లప్పుడూ ఆయన వైపు చూడండి, ఎందుకంటే ఆయన ద్వారా మీరు శాంతిని పొందుతారు మరియు స్వస్థత ప్రక్రియలో ఆయన మీకు సహాయం చేస్తారు.”

వారు తమ జీవితాలను యేసు క్రీస్తు సువార్తలో కేంద్రీకరించినందున వారి సానుకూల వైఖరిని మనం చూసే కొన్ని ఉదాహరణలు ఇవి. సహాయం మరియు నిరీక్షణ ఎక్కడ దొరుకుతుందో వారికి తెలుసు.

రక్షకుని యొక్క స్వస్థపరిచే శక్తి

మన జీవితంలోని ఏ పరిస్థితుల్లోనైనా రక్షకుడు వారికి మరియు మనకు ఎందుకు సహాయం చేయగలరు? దీనికి సమాధానం లేఖనాలలో చూడవచ్చు:

“ఆయన ప్రతి విధమైన బాధలు, శ్రమలు మరియు శోధనలు అనుభవించుచూ ముందుకు సాగును. …

“… మరియు… ఆయన ప్రేగులు కనికరముతో నిండునట్లు, వారి బలహీనతలను బట్టి తన జనులను ఎట్లు ఆదరించవలెనో… ఆయన ఎరుగునట్లు, ఆయన వారి బలహీనతలను తనపై తీసుకొనును.”

ఎల్డర్ డేవిడ్ ఎ. బెడ్నార్ బోధించినట్లుగా, మనం అనుభవించే ఏ శారీరక బాధ, వేదన లేదా బలహీనత రక్షకునికి తెలియనిది కాదు. “బలహీనమైన క్షణంలో మీరు మరియు నేను, ‘[నేను ఏమి అనుభవిస్తున్నానో] ఎవ్వరూ అర్థం చేసుకోవడంలేదు’ అని కేకలు వేయవచ్చు. …’ బహుశా ఏ మానవుడికీ తెలియకపోవచ్చు. కానీ దేవుని కుమారునికి సంపూర్ణంగా తెలుసు మరియు అర్థం చేసుకుంటారు.” ఎందుకు? ఎందుకంటే “మనం భరించకముందే ఆయన మన భారాలను అనుభవించారు మరియు మోసారు.”

మత్తయి 11 లో ఉన్న క్రీస్తు యొక్క మాటల గురించి నా సాక్ష్యంతో నేను ముగిస్తాను:

“ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును.

“నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును.

“ఏలయనగా నా కాడి సుళువుగాను నా భారము తేలికగాను ఉన్నవి.”

ఆఫ్రికాలోని ఆ పరిశుద్ధుల మాదిరిగానే, ఈ వాగ్దానం నిజమని నాకు తెలుసు. ఇది అక్కడ నిజం మరియు ఇది ప్రతిచోటా నిజం. దీనిని గూర్చి నేను యేసు క్రీస్తు నామములో సాక్ష్యమిస్తున్నాను, ఆమేన్.

వివరణలు

  1. James E. Faust, “Five Loaves and Two Fishes,” Ensign, May 1994, 5.

  2. Russell M. Nelson, “Joy and Spiritual Survival,” Liahona, Nov. 2016, 82.

  3. ఆల్మా 7:11–12.

  4. David A. Bednar, “The Atonement and the Journey of Mortality,” Liahona, Apr. 2012, 19.

  5. మత్తయి 11:28–30.