“అధ్యాయము 2: లేఖనములను పరిశోధించండి మరియు దేవుని కవచమును ధరించండి,” నా సువార్తను ప్రకటించండి: యేసు క్రీస్తు యొక్క సువార్తను పంచుకొనుటకు మార్గదర్శి (2023)
“లేఖనములను పరిశోధించండి మరియు దేవుని కవచమును ధరించండి,” నా సువార్తను ప్రకటించండి
అధ్యాయము 2
లేఖనములను పరిశోధించండి మరియు దేవుని కవచమును ధరించండి
దీనిని పరిగణించండి
-
లేఖనాలలో దేవుని వాక్యాన్ని నిరంతరం అధ్యయనం చేయడం ఎందుకు ముఖ్యం?
-
నేను నా లేఖన అధ్యయనాన్ని మరింత ప్రభావవంతంగా ఎలా మార్చుకోగలను?
-
నా ఉద్దేశ్యాన్ని నెరవేర్చుకోవడానికి నేను సాంకేతికతను ఎలా నీతియుక్తంగా ఉపయోగించుకోగలను?
-
దేవుని కవచమును ధరించడమంటే అర్థమేమిటి?
లేఖనములను పరిశోధించండి
యేసు క్రీస్తు “లోకమునకు జీవము మరియు వెలుగైయున్నాడు. ఆయనే సత్యము మరియు నీతి వాక్యమైయున్నాడు” (ఆల్మా 38:9; యోహాను 1 కూడా చూడండి). లేఖనాలలో దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయడం వల్ల మీ జీవితానికి సమృద్ధి కలుగుతుంది (యోహాను 10:10 చూడండి). ఆయన మాటలు మిమ్మల్ని—మరియు మీరు బోధించే వారిని—వెలుగు మరియు సత్యముతో నింపుతాయి. అవి మీకు—మరియు మీరు బోధించే వారికి—నీతిమంతులుగా జీవించడానికి మరియు దైవిక రక్షణను, బలాన్ని పొందడానికి సహాయపడతాయి. అవి ఆయన గురించి తెలుసుకోవడానికి మరియు అన్నిటికంటే మధురమైన ఆయన ప్రేమను రుచి చూడడానికి మీకు సహాయపడతాయి. ఆయన మాటలు మీ ఆత్మను ఆనందంతో నింపుతాయి (1 నీఫై 8:11–12; 1–34 వచనాలను చూడండి).
లేఖనాలు ఒక పరలోక బహుమానము. మీ సువార్తసేవ యొక్క గొప్ప ఆశీర్వాదాలలో ఒకటి, ప్రతిరోజూ వాటిని అధ్యయనం చేయడానికి ఒక నిర్దిష్ట సమయాన్ని కలిగియుండడం.
సువార్త అధ్యయనం మీరు చేయగలిగే అత్యంత ప్రతిఫలదాయకమైన ఆధ్యాత్మిక పని. ఇది మానసికంగా మరియు ఆధ్యాత్మికంగా ఉత్తేజపరిచేది. ఆల్మా బోధించినట్లుగా, మీరు మీ హృదయంలో దేవుని వాక్యాన్ని “నాటినప్పుడు”, అది “[మీ] గ్రహింపును స్పష్టం చేస్తుంది” మరియు మీకు సంతోషకరంగా మారుతుంది (ఆల్మా 32:28; ఈనస్ 1:3–4 కూడా చూడండి). మీరు దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయడం మరియు అన్వయించడం కొనసాగిస్తున్నప్పుడు, అది “వేరు పారి, నిత్య జీవమునకై అంకురించు వృక్షము వలే ఉంటుంది” (ఆల్మా 32:41; 42–43 వచనాలను కూడా చూడండి). సువార్త గురించి మీ జ్ఞానం మరియు సాక్ష్యం పెరుగుతుంది. సువార్తను పంచుకోవాలనే మీ కోరిక మరియు సామర్థ్యం కూడా పెరుగుతుంది.
మంచి గురువు నుండి నేర్చుకోవడం ముఖ్యం, కానీ మీ స్వంత లేఖన అధ్యయనం నుండి అర్థవంతమైన అభ్యాస అనుభవాలను కలిగియుండడం కూడా మీకు ముఖ్యమైనది. మీరు బోధించే వ్యక్తులకు కూడా ఇది వర్తిస్తుంది.
లేఖనాలను అర్థం చేసుకోవడం మొదట్లో సవాలుగా ఉండవచ్చు. అయితే, మీరు దేవుని వాక్యాన్ని ఓపికగా అధ్యయనం చేయడంలో పట్టుదలతో ఉన్నప్పుడు, మీ అవగాహన పెరుగుతుంది. మీరు లేఖనాలతో మీ సమయాన్ని విలువైనదిగా భావిస్తారు. మీరు నేర్చుకునే మరియు అనుభూతి చెందే దాని కోసం మీరు ఆసక్తిగా ఎదురు చూస్తారు.
లేఖనాలను తెలుసుకోవడం మరియు ప్రేమించడం మీ సువార్త సేవ యొక్క గొప్ప జీవితకాల ఆశీర్వాదం కావచ్చు. మీ సువార్తసేవా సమయంలో లేఖన అధ్యయనం యొక్క ఆశీర్వాదాలను మీరు అనుభవిస్తున్నప్పుడు, మీరు మీ జీవితాంతం దానిని కొనసాగించాలని కోరుకుంటారు.
“లేఖనాలన్నిటి యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే, మన ఆత్మలను తండ్రియైన దేవునియందు మరియు ఆయన కుమారుడైన యేసు క్రీస్తుయందు విశ్వాసంతో నింపడం—వారు ఉన్నారనే విశ్వాసం; మన అమర్త్యత్వం మరియు నిత్యజీవం కోసం తండ్రి ప్రణాళిక యందు విశ్వాసం; ఈ సంతోష ప్రణాళికను ప్రేరేపించే యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తం మరియు పునరుత్థానంలో విశ్వాసం; యేసు క్రీస్తు యొక్క సువార్తను మన జీవన మార్గంగా చేసుకోవడానికి విశ్వాసం; మరియు ‘అద్వితీయ సత్య దేవుడిని మరియు [ఆయన] పంపిన యేసు క్రీస్తును’ తెలుసుకోవడానికి విశ్వాసం (యోహాను 17:3)” (D. Todd Christofferson, “The Blessing of Scripture,” Liahona, May 2010, 34).
వ్యక్తిగత అధ్యయనము
ఈ అధ్యాయం ప్రారంభంలో ఉన్న జోసెఫ్ స్మిత్ చిత్రాన్ని చూడండి. జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:11–13 చదవండి. మీ అధ్యయన పుస్తకంలో ఈ క్రింది ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి.
-
జోసెఫ్ స్మిత్ యాకోబు 1:5ను చదవడం మరియు ధ్యానించడం అతడు బయల్పాటు పొందడానికి ఎలా దారితీసింది?
-
అతని అధ్యయనం భవిష్యత్ తరాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపింది?
-
అధ్యయనం చేయాలనే మరియు వెదకాలనే అతని నిర్ణయం మీ జీవితంలో ఎలాంటి ప్రభావాన్ని చూపింది?
-
మీ సువార్త అధ్యయనం మీ జీవితాన్ని మరియు ఇతరుల జీవితాలను ఎలా ప్రభావితం చేసింది?
లేఖన అధ్యయనము
సువార్త అధ్యయనాన్ని ఎలా చేయాలనే దాని గురించి ఈ క్రింది లేఖనాల నుండి మీరు ఏమి నేర్చుకోవచ్చు?
ఆత్మను వెదకండి
సువార్తను నేర్చుకోవడం అనేది సమాచారాన్ని పొందడం కంటే చాలా ఎక్కువైనది. ఇది పరిశుద్ధాత్మ మార్గదర్శకత్వంలో నిత్య సత్యాన్ని అన్వయించే ఆధ్యాత్మిక ప్రక్రియ కూడా (జేకబ్ 4:8; సిద్ధాంతము మరియు నిబంధనలు 50:19–25 చూడండి). మీరు లేఖనాలను అధ్యయనం చేస్తున్నప్పుడు మీకు బోధించడానికి ఆత్మను వెదకండి మరియు నమ్మండి. మీరు నేర్చుకున్న దానిపై చర్య తీసుకోవాలనే నిజమైన ఉద్దేశ్యంతో లేఖనాలను మీతో పోల్చుకునే స్థాయికి ఇది జరుగుతుంది (1 నీఫై 19:23; మొరోనై 10:4; జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:18 చూడండి).
ప్రార్థనాపూర్వకంగా లేఖనాలను అధ్యయనం చేయడం వలన ఆత్మ మీ మనస్సులోను మీ హృదయములోను మాట్లాడడానికి బయల్పాటుకు ఒక అవకాశం కలుగుతుంది. ఆయన మిమ్మల్ని నడిపింపు, ప్రేరణ మరియు మీ ప్రశ్నలకు సమాధానాలతో ఆశీర్వదిస్తారు. మీ లేఖన అధ్యయనం ద్వారా, పరిశుద్ధాత్మ మిమ్మల్ని బలపరచి ఓదారుస్తారు. ఆయన మీకు జ్ఞానాన్ని మరియు దృఢ నిశ్చయాన్ని ఇస్తారు, అది మీ జీవితాన్ని ఆశీర్వదిస్తుంది మరియు ఇతరులను శాశ్వతంగా ఆశీర్వదించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.
లేఖన అధ్యయనము
ఒక వ్యక్తి సువార్తను నేర్చుకోవడానికి సహాయం చేయడంలో పరిశుద్ధాత్మ పాత్ర ఏమిటి?
-
యోహాను 14:26; 16:13
ప్రశ్నలకు జవాబుల కోసం వెదకండి.
ఒక సువార్తికునిగా, మీరు అనేక ప్రశ్నలను వింటారు. మీకు మీ స్వంత ప్రశ్నలు కూడా ఉంటాయి. ఈ ప్రశ్నలకు సమాధానాల కోసం లేఖనాలు మరియు ఇతర ఆమోదించబడిన వనరులను పరిశోధించడం అధ్యయనం చేయడానికి ఒక శక్తివంతమైన మార్గం. ప్రశ్నలను, మీరు నేర్చుకున్న మరియు అనుభూతి చెందుతున్న వాటిని మీ అధ్యయన పుస్తకంలో నమోదు చేయండి.
మీ అధ్యయనంలో ఖచ్చితమైన, నమ్మదగిన వనరులను ఉపయోగించండి—ప్రధానంగా లేఖనాలు, సజీవ ప్రవక్తల మాటలు మరియు నా సువార్తను ప్రకటించండి. మీరు బోధించే జనుల భాషల్లో ఏ వనరులు అందుబాటులో ఉన్నాయో తెలుసుకోండి.
“జీవితంలో నేను నేర్చుకున్న ఒక విషయం ఏమిటంటే, ప్రభువు మన ప్రశ్నలకు చాలా తరచుగా సమాధానం ఇస్తారు మరియు లేఖనాల ద్వారా మనకు సలహా ఇస్తారు.… అప్పుడు మనం ప్రభువుకు ప్రార్థన చేద్దాం, సహాయం లేదా సమాధానాల కోసం వేడుకుందాం; మనం లేఖనాలను తెరిచి వాటిని అధ్యయనం చేయడం ప్రారంభించినప్పుడు ఆ సమాధానాలు వస్తాయి. కొన్నిసార్లు వందల లేదా వేల సంవత్సరాల నాటి ఒక గద్యభాగం మన ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి ప్రత్యేకంగా నిర్దేశించబడినట్లుగా ఉంటుంది” (M. Russell Ballard, “Be Strong in the Lord, and in the Power of His Might” [Brigham Young University fireside, Mar. 3, 2002], 5, speeches.byu.edu).
మీరు నేర్చుకొన్న దానిని బట్టి జీవించండి
సువార్తను అర్థం చేసుకోవడంలో ఎదగడం నుండి వచ్చే ఆనందాన్ని మీరు అనుభవించినప్పుడు, మీరు నేర్చుకొన్న దానిని అన్వయించాలని మీరు కోరుకుంటారు. మీరు నేర్చుకొనే దానికి అనుగుణంగా జీవించడానికి ప్రయత్నించండి. ఆవిధంగా చేయడం మీ విశ్వాసము, జ్ఞానము మరియు సాక్ష్యాన్ని బలపరుస్తుంది. మీరు నేర్చుకున్న దానిపై చర్య తీసుకోవడం వలన అదనపు మరియు శాశ్వతమైన అవగాహన వస్తుంది. (యోహాను 7:17 చూడండి.)
“నిజమైన సిద్ధాంతాన్ని అర్థం చేసుకున్నప్పుడు, అది వైఖరులను మరియు ప్రవర్తనను మారుస్తుంది. ప్రవర్తన యొక్క అధ్యయనం మన ప్రవర్తనను మెరుగు పరిచే దాని కంటే, సువార్త [సిద్ధాంతం] యొక్క అధ్యయనం మన ప్రవర్తనను త్వరగా మెరుగుపరుస్తుంది” (Boyd K. Packer, “Little Children,” Ensign, Nov. 1986, 17).
వ్యక్తిగత అధ్యయనము
సువార్తను నేర్చుకోవడం గురించి ఈ క్రింది లేఖనాలు ఏమి బోధిస్తాయి?
సువార్త గ్రంథాలయాన్ని ఉపయోగించండి
సువార్త గ్రంథాలయం అనేది మీ అధ్యయనం మరియు బోధనను బాగా మెరుగుపరిచే ఆన్‌లైన్ వనరు. దాని అనేక ప్రత్యేకతలతో పరిచయం పెంచుకోండి. మీ అధ్యయనం మరియు బోధనలో భాగంగా సువార్త గ్రంథాలయాన్ని ఉపయోగించడం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు క్రింద ఇవ్వబడ్డాయి.
-
ఇది మీకు లేఖనాలు, సజీవ ప్రవక్తల మాటలు మరియు అనేక భాషలలోని ఇతర సంఘ సంబంధిత విషయాలకు టెక్స్ట్, ఆడియో మరియు వీడియో రూపాలలో ప్రవేశాన్ని కల్పిస్తుంది.
-
మీరు నేర్చుకొనే వాటిని మరియు మీరు పొందిన మనోభావాలను సువార్త గ్రంథాలయంలో నమోదు చేస్తే, మీ సువార్తసేవ తర్వాత మీరు ఆ సమాచారాన్ని పొందడాన్ని కొనసాగించవచ్చు మరియు దాని ద్వారా బలపడవచ్చు.
-
లేఖనాలు, సజీవ ప్రవక్తల నుండి వ్యాఖ్యానాలు మరియు వీడియోలను మీరు బోధించే వారితో సులభంగా పంచుకోవడానికి ఇది మిమ్మల్ని అనుమతిస్తుంది.
-
మీరు బోధించే మరియు బాప్తిస్మం ఇచ్చే చాలా మంది వ్యక్తులు సంఘ వనరులకు ప్రవేశం పొందడానికి సువార్త గ్రంథాలయాన్ని ఉపయోగిస్తారు. సువార్త గ్రంథాలయ ప్రత్యేకతలతో పరిచయం పెంచుకోండి, తద్వారా దానిని ఉపయోగించడాన్ని నేర్చుకోవడంలో మీరు వారికి సహాయపడవచ్చు.
వ్యక్తిగత అధ్యయనము
“Gospel Library User Guide” ను సమీక్షించండి. మీ తదుపరి వ్యక్తిగత మరియు సహచర అధ్యయనంలో ప్రయత్నించడానికి సువార్త గ్రంథాలయం నుండి ఒక ప్రత్యేకతను ఎంచుకోండి. ఈ ప్రత్యేకత మీ అధ్యయనానికి ఎలా సహాయపడింది? మీరు తదుపరిసారి ఏమి ప్రయత్నిస్తారు? మీరు నేర్చుకొనే వాటిని ఇతర సువార్తికులకు బోధించండి.
సాంకేతికతను నీతియుక్తంగా ఉపయోగించండి
ప్రభువు మరియు ఆయన ప్రవక్తలు ఆయన పనిని సాధించడానికి మీకు సాంకేతికతను అప్పగించారు. సాంకేతికత లేఖనాలు మరియు నా సువార్తను ప్రకటించండి యొక్క మీ అధ్యయనాన్ని మెరుగుపరచగలదు. డిజిటల్ వనరులు కూడా ప్రణాళిక చేయడానికి మీకు సహాయపడతాయి. అవి మీ బోధనలో మరియు బోధించడానికి వ్యక్తులను కనుగొనే మీ ప్రయత్నాలలో సహాయపడతాయి.
సాంకేతికతను తెలివిగా మరియు నీతియుక్తంగా ఉపయోగించడం సువార్తికునిగా మీ ఉద్దేశ్యాన్ని నెరవేర్చడంలో మరియు సమయాన్ని సమర్థవంతంగా ఉపయోగించడంలో మీకు సహాయపడుతుంది. ఇది అనుచితమైన విషయాలను నివారించడంలో కూడా మీకు సహాయపడుతుంది.
యేసు క్రీస్తుపై మీ విశ్వాసాన్ని, మీరు సేవ చేసే మరియు బోధించే వారి విశ్వాసాన్ని బలోపేతం చేయడానికి సహాయపడే మార్గాల్లో సాంకేతికతను ఎప్పుడు మరియు ఎలా ఉపయోగించాలనే దాని గురించి ఆత్మను అనుసరించండి.
సాంకేతికతను ఉపయోగించడం కోసం భద్రతా చర్యలను అనుసరించండి
క్రింద వివరించిన నాలుగు భద్రతా చర్యలు మీరు సాంకేతిక పరిజ్ఞానాన్ని సముచితంగా ఉపయోగించడంలో సహాయపడతాయి. ఈ భద్రతా చర్యలను అనుసరించడం అనేది “మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించడానికి” మీకు ఒక ముఖ్యమైన మార్గం (ఎఫెసీయులు 6:11).
ఆధ్యాత్మిక ప్రేరణలకు అనుగుణంగా ఉండండి
“మీరు మార్గము ద్వారా ప్రవేశించి పరిశుద్ధాత్మను పొందిన యెడల, మీరు చేయవలసిన కార్యములన్నిటినీ ఆయన మీకు చూపును” (2 నీఫై 32:5) అని నీఫై వాగ్దానం చేసాడు. మీకు సహాయపడేలా మీ పరలోక తండ్రి రెండు శక్తివంతమైన బహుమానాలను ఇచ్చారు: నైతిక కర్తృత్వము మరియు పరిశుద్ధాత్మ వరము. పరిశుద్ధాత్మ నడిపింపును అనుసరించాలని ఎంచుకోవడానికి మీకు శక్తి ఉంది. సాంకేతికతను ఉపయోగిస్తున్నప్పుడు మంచి చేయడానికి మీకు సహాయం చేయడంలో ఆయన నడిపింపు చాలా ముఖ్యమైనది. ఇది మిమ్మల్ని చెడు నుండి రక్షించడంలో కూడా సహాయపడుతుంది.
సువార్తికునిగా మీ ఉద్దేశ్యంపై దృష్టి పెట్టండి
“నా మహిమ కొరకు మీ కన్ను తేటగానుండిన యెడల, మీ దేహములు అంతయు వెలుగుతో నింపబడును, మీలో చీకటి ఏదియు ఉండదు; వెలుగుతో నిండిన దేహము అన్ని సంగతులను గ్రహించును” (సిద్ధాంతము మరియు నిబంధనలు 88:67) అని ప్రభువు చెప్పారు. దేవుని మహిమ కొరకు మీ కన్ను తేటగానుండడం అంటే, దేవుని ఉద్దేశ్యంపై పూర్తిగా దృష్టి పెట్టడం, సువార్తకునిగా మీ ఉద్దేశ్యం కూడా అదే.
సాంకేతికత యొక్క మీ వినియోగం మీ ఉద్దేశ్యంపై కేంద్రీకృతమై ఉండాలి. మీరు ఏ సువార్తికుని ఉద్దేశ్యం కోసం దానిని ఉపయోగిస్తారో గుర్తించిన తర్వాత మాత్రమే మీ పరికరాన్ని ఆన్ చేయండి. ఆ ఉద్దేశ్యం పూర్తయిన తర్వాత దాన్ని ఆపివేయండి.
మీరు మనస్సులో నిర్దిష్ట ఉద్దేశ్యం లేకుండా వెబ్‌లో సర్ఫింగ్ చేస్తున్నప్పుడు అంతర్జాలంలో అనుచితమైన విషయాలను ఎదుర్కొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
క్రమశిక్షణతో ఉండండి
మోర్మన్ ఇలా వ్రాశాడు: “నేను దేవుని కుమారుడైన యేసు క్రీస్తు యొక్క శిష్యుడను. ఆయన జనులు నిత్యజీవము కలిగియుండునట్లు ఆయన వాక్యమును వారి మధ్య ప్రకటించుటకు నేను ఆయన ద్వారా పిలువబడియున్నాను” (3 నీఫై 5:13). మోర్మన్ వలె, మీరు క్రీస్తు యొక్క శిష్యులు. పూర్తి-కాల సువార్తికునిగా సేవ చేయడం అనేది మీ శిష్యత్వాన్ని మరింతగా పెంచుకోవడానికి ఒక ప్రత్యేక అవకాశం.
శిష్యుడు మరియు క్రమశిక్షణ అనే పదాలు “అభ్యాసకుడు” లేదా “విద్యార్థి” అనే అర్థం వచ్చే ఒకే మూల పదం నుండి వచ్చాయి. క్రీస్తు యొక్క శిష్యునిగా ఉండడం అంటే మీరు ఆయనను అనుసరించడానికి మరియు ఆయన ఆజ్ఞలను పాటించడానికి ప్రయత్నిస్తారు. దాని అర్థం మీరు నిరంతరం క్రీస్తు గురించి నేర్చుకుంటారు మరియు బోధిస్తారు.
మీరు సాంకేతికతను ఎలా ఉపయోగిస్తారనే విషయంలో క్రమశిక్షణతో ఉండండి మరియు నీతివంతమైన ఎంపికలు చేసుకోండి. భద్రతా చర్యలను అనుసరించడానికి ఎంచుకోండి. మీరు జనులతో ముఖాముఖిగా మాట్లాడేటప్పుడు, సందేశాలను చూడవద్దు లేదా ఫోన్‌కాల్‌కు సమాధానం ఇవ్వవద్దు. మీరు ఈ పరికరాలను ఎలా ఉపయోగిస్తారనే దానిని నియంత్రించండి. అవి మిమ్మల్ని నియంత్రించనివ్వకండి.
ప్రభువు ఇలా ప్రకటించారు, “ఎవడైతే నా ధర్మశాస్త్రమును పొంది, దానికి విధేయుడైయుండునో, అట్టివాడే నా శిష్యుడు; ఎవడైతే దానిని పొందితినని చెప్పి, దానికి విధేయుడైయుండడో, అట్టివాడు నా శిష్యుడు కాడు” (సిద్ధాంతము మరియు నిబంధనలు 41:5). ఎవరూ పరిపూర్ణులు కానప్పటికీ, ప్రభువు ఆయనను అనుసరించడానికి స్థిరమైన, నిరంతర కృషిని ఆశిస్తారు.
సువార్త యొక్క అందం ఏమిటంటే మనం పశ్చాత్తాపపడినప్పుడు క్షమించబడవచ్చు—మరియు మనం ఆలస్యం చేయకుండా పశ్చాత్తాపపడాలని ప్రభువు కోరుకుంటున్నారు (సిద్ధాంతము మరియు నిబంధనలు 109:21 చూడండి). మీరు సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుచితంగా ఉపయోగించడంతో సహా ఏదైనా తప్పు చేస్తే, ఆ క్షణంలో పశ్చాత్తాపపడి ఆయన చట్టాన్ని అనుసరించడానికి ప్రయత్నిస్తూ ఉండండి. ఇది క్రీస్తు యొక్క శిష్యునిగా ఉండడంలో భాగం.
ఒకటిగా నుండుడి
“ఒకటిగా నుండుడి; మీరు ఒకటిగా నుండని యెడల మీరు నా వారు కారు” అని ప్రభువు చెప్పారు (సిద్ధాంతము మరియు నిబంధనలు 38:27). మీ సువార్తసేవలో ఐక్యత, నమ్మకం, జవాబుదారీతనం మరియు కనికరము అనే సంస్కృతిని పెంపొందించడంలో సహాయపడండి, తద్వారా మీరు ఒకరినొకరు బలోపేతం చేసుకోవచ్చు మరియు మద్దతు ఇవ్వవచ్చు.
అవసరమైనప్పుడు సహాయం కోరడానికి సువార్తికులందరు సౌకర్యంగా భావించాలి. ఆత్మలో బలంగా ఉన్న సువార్తికుడు బలహీనంగా ఉన్న వ్యక్తికి సహాయం చేయగలడు (సిద్ధాంతము మరియు నిబంధనలు 84:106 చూడండి). మీరు శోధించబడినట్లు భావిస్తే, మీ సహచరుడిని లేదా మిషను నాయకుడిని సహాయం కోసం అడగండి.
అంతర్జాలం లేదా అశ్లీల చిత్రాలతో సంబంధం ఉన్న దాదాపు అన్ని సవాళ్లు ఒంటరిగా ఉన్నప్పుడు వస్తాయి. మీరు ఒకరి స్క్రీన్‌లను ఒకరు చూడగలిగినప్పుడు మాత్రమే పరికరాలను ఉపయోగించండి. ధైర్యం కలిగి ఉండండి మరియు ఒకరికొకరు జవాబుదారీగా ఉండండి.
మీతో సహా ఆయన పిలిచిన ప్రతి సువార్తికునిపై ప్రభువుకు నమ్మకం ఉంది. మిమ్మల్ని రక్షించడానికి మరియు మద్దతు ఇవ్వడానికి ఆయన సహచరులను, నాయకులను అందించారు. ఆల్మా తన సహచరుడైన అమ్యులెక్‌కు మద్దతు ఇచ్చినట్లే, ఒకరినొకరు బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నించండి (ఆల్మా 15:18 చూడండి).
మీరు దుర్బలంగా లేదా సున్నితంగా భావిస్తే ఏమి చేయాలి?
ఈ నాలుగు భద్రతలను అనుసరించడం నేర్చుకోవడానికి ప్రయత్నం, క్రమశిక్షణ మరియు సాధన అవసరం. మీరు ఆలోచించే మరియు ప్రవర్తించే విధానంలో భద్రతలు సహజమైన భాగంగా మారిన తర్వాత కూడా, మీరు దుర్బలంగా లేదా సున్నితంగా భావించే సందర్భాలు మీకు ఉంటాయి. మీ సువార్తసేవకు ముందు మీకు కొన్ని పేలవమైన సాంకేతిక అలవాట్లు ఉండవచ్చు, వాటిని అధిగమించడం కష్టమైయుండవచ్చు. కొంతమంది సువార్తికులు వారి పిలుపుకు ముందు అశ్లీలతతో పోరాడారు మరియు మునుపటి ప్రవర్తనా విధానాలలోకి తిరిగి రావడానికి వారు శోధించబడవచ్చు.
క్రింద ఉన్న సూత్రాలు మీరు భద్రతలను జీవించడంలో మరియు శోధనకు వ్యతిరేకంగా మిమ్మల్ని మీరు బలోపేతం చేసుకోవడంలో సహాయపడతాయి:
-
మీ ఆలోచనలు, భావాలు మరియు ప్రవర్తనల గురించి తెలుసుకోండి. సాంకేతికతను దుర్వినియోగం చేయడానికి అవి మిమ్మల్ని మరింత దుర్బలంగా ఎలా చేస్తాయో అర్థం చేసుకోండి.
-
చర్య తీసుకోవడానికి ఎంచుకోండి. మీరు భావిస్తున్న దానికి నీతివంతమైన, ఉత్పాదక మార్గాల్లో స్పందించండి.
-
నేర్చుకోండి, పశ్చాత్తాపపడండి మరియు వృద్ధిచెందండి. నేర్చుకోవడం మరియు వృద్ధిచెందడం కొనసాగించడానికి మీ అనుభవాలను ఉపయోగించండి.
మీరు స్వంతంగా సవాళ్లను అధిగమించాల్సిన అవసరం లేదు. రక్షకుని ప్రాయశ్చిత్తం ద్వారా మరియు మీరు ఆయనతో చేసిన నిబంధనల ద్వారా వచ్చే బలంపై ఆధారపడండి. మీరు ఎదుర్కొనే సవాళ్లు ప్రభువుకు తెలుసు మరియు ఈ గొప్ప పనిలో ఆయన మీకు సహాయం చేస్తారు.
రక్షకుడిని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవడం మీరు సాంకేతిక పరిజ్ఞానాన్ని నీతియుక్తంగా ఉపయోగించడంలో సహాయపడుతుంది. ఆయన మీ మీద ఉంచిన నమ్మకానికి నిజాయితీగా ఉండండి. “ఆయన యెదుట యథార్థముగా నడవడానికి” నిశ్చయించుకోండి (ఆల్మా 53:21; 20వ వచనం కూడా చూడండి). ఆయన మరియు తండ్రి మీ కోసం చేసిన వాటన్నిటికీ కృతజ్ఞత కలిగి ఉండడం మీరు డిజిటల్ వనరులను ఉపయోగించడంలో మంచి ఎంపికలు చేసుకోవడానికి సహాయపడుతుంది.
మీ సువార్తసేవ సాంకేతికతను తెలివిగా ఉపయోగించడాన్ని నేర్చుకోవడానికి ఒక గొప్ప అవకాశం. మీ సువార్తసేవ సమయంలో మీరు అభివృద్ధి చేసుకునే నిబద్ధత మరియు మంచి అలవాట్లు మీ జీవితాంతం మీకు ప్రయోజనం చేకూరుస్తాయి.
దేవుని కవచాన్ని ధరించండి
మీరు లేఖనాలను, సజీవ ప్రవక్తల మాటలను, నా సువార్తను ప్రకటించండి, Missionary Standards for Disciples of Jesus Christ మరియు ఈ అధ్యాయంలో వివరించిన భద్రతలను అధ్యయనం చేసి అన్వయించినప్పుడు శోధనను ఎదిరించే మీ సామర్థ్యం పెరుగుతుంది.
“దేవుడిచ్చు సర్వాంగకవచమును” ధరించడం ద్వారా, మీరు తప్పు ఒప్పులు తెలుసుకోగలరు. మీరు మీ పాదాలకు “సమాధాన సువార్త” అనే చెప్పులు ధరించుకుంటారు. “నీతియను మైమరువు” ధరించడం మిమ్మల్ని కాపాడుతుంది. “విశ్వాసమను డాలుతో” మీరు దుష్టుని అగ్ని బాణములను ఆర్పగలరు. శక్తి మరియు అధికారంతో సత్యాన్ని బోధించడానికి మీరు “[ఆయన] ఆత్మఖడ్గమును” తీసుకుంటారు. మీరు దారి తప్పడానికి, ఒంటరిగా ఉండడానికి మరియు దూరం కావడానికి దారితీసే లోక ప్రభావాలకు వ్యతిరేకంగా మీరు బలపరచబడతారు. (ఎఫెసీయులకు 6:10–18 చూడండి; 1 నీఫై 8:20, 30; 15:24–25; హీలమన్ 3:29–30; సిద్ధాంతము మరియు నిబంధనలు 27:15–18; జోసెఫ్ స్మిత్—మత్తయి 1:37; 2 తిమోతి 3:15–17 కూడా చూడండి.)
వ్యక్తిగత అధ్యయనము
ఈ వారం దృష్టి పెట్టవలసిన భద్రతలలో ఒకదాన్ని ప్రార్థనాపూర్వకంగా గుర్తించండి. ప్రభువు యొక్క సహాయమును వెదకండి. మీరు నేర్చుకుంటున్న దానిని మరియు మీ భావాలను నమోదు చేయండి.
అధ్యయనము మరియు అన్వయము కొరకు ఉపాయములు
వ్యక్తిగత అధ్యయనము
-
మీ అధ్యయనాన్ని మెరుగుపరచుకోవడానికి ఈ క్రింది సూచనలలో కొన్నింటిని ప్రయత్నించండి:
-
ప్రశ్నలు మరియు ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని లేఖనాలను చదవండి.
-
మీరు నేర్చుకున్న వాటిని ఇతర సువార్తికులతో మరియు మీరు బోధించే వారితో పంచుకోండి. ఒక సిద్ధాంతాన్ని లేదా సూత్రాన్ని వివరించడం మీరు దానిని గుర్తుంచుకోవడానికి మరియు స్పష్టత పొందడానికి సహాయపడుతుంది.
-
అంశాలవారీగా అధ్యయనం చేయండి. మీకు మరియు మీరు బోధించే వ్యక్తులకు సహాయపడే అంశాలపై దృష్టి పెట్టండి.
-
మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి, “రచయిత ఏమి చెబుతున్నారు? ప్రధాన సందేశం ఏమిటి? ఇది నాకు ఎలా వర్తిస్తుంది? మనం బోధిస్తున్న వ్యక్తికి ఇది ఎలా సహాయపడుతుంది?”
-
మీరు చదువుతున్న దాన్ని దృశ్యమానం చేసుకోండి లేదా గీయండి. ఉదాహరణకు, లేమనీయుల రాజు ముందు నిలబడడం అమ్మోన్‌కు ఎలా ఉండియుంటుందో ఊహించుకోండి.
-
ఒక గద్యభాగం యొక్క ప్రధాన ఆలోచనను ఒక వాక్యంలో లేదా చిన్న పేరాలో వ్రాయండి.
-
మీరు బోధించే సూత్రాలను వివరించే మరియు మద్దతు ఇచ్చే లేఖనాలను గుర్తుంచుకోండి.
-
-
ఈ క్రింది వాటి ప్రకారం మిమ్మల్ని మీరు అంచనా వేయండి (1=ఎన్నడూ కాదు, 3=కొన్నిసార్లు, మరియు 5=దాదాపు ఎల్లప్పుడూ).
-
నేను నా విశ్వాసంలో ఎదుగుతున్నాను, పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తు గురించి బాగా తెలుసుకుంటున్నాను.
-
నేను అధ్యయనం చేసేటప్పుడు నేను బోధించే వ్యక్తుల గురించి ఆలోచిస్తాను.
-
రోజంతా, నేను ఉదయం చదివిన దాని గురించి ఆలోచిస్తాను.
-
నేను చదువుతున్నప్పుడు, ఇంతకు ముందు నాకు రాని ఆలోచనలు నా మనస్సులోకి వస్తాయి.
-
నేను ఆధ్యాత్మిక మనోభావాలను మరియు ఆలోచనలను తగిన ప్రదేశంలో నమోదు చేస్తాను.
-
నేను చదువుతున్నప్పుడు మేల్కొని ఉంటాను.
-
నేను వ్యక్తిగత అధ్యయనం కోసం ఎదురు చూస్తున్నాను.
-
నేను సహచర అధ్యయనం కోసం ఎదురు చూస్తున్నాను.
మీ ప్రతిస్పందనలను సమీక్షించండి. మీరు ఏమి బాగా చేస్తున్నారు? మీరు ఎలా మెరుగుపడవచ్చు? మీ అధ్యయన నాణ్యతను మెరుగుపరచడానికి ఒకటి లేదా రెండు లక్ష్యాలను నిర్దేశించుకోండి.
-
సహచర అధ్యయనము మరియు సహచర మార్పిడి
-
ఈ క్రింది గద్యభాగాలలో అనేకము కలిసి చదవండి. దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయడం వల్ల కలిగే ఆశీర్వాదాలను చర్చించండి. మీరు బోధించే వారికి ఏ గద్యభాగాలు బాగా సహాయపడతాయి?
జిల్లా సలహాసభ, జోన్ సభ్యసమావేశాలు మరియు మిషను నాయకత్వ సలహాసభ
-
3వ అధ్యాయంలోని ఒక పాఠం నుండి సువార్త గురించి ఒకటి లేదా రెండు ప్రశ్నలు వ్రాయమని సువార్తికులను అడగండి. ఈ ప్రశ్నలు వ్యక్తిగతమైనవి కావచ్చు లేదా వారు బోధించే వ్యక్తుల నుండి కావచ్చు. వారి ప్రశ్నలను సమూహంతో పంచుకోమని సువార్తికులను ఆహ్వానించండి. ప్రతి ప్రశ్న కొరకు, ఈ క్రింది వాటిని చర్చించండి:
-
ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వడం సువార్తికుని జీవితాన్ని ఎలా ఆశీర్వదిస్తుంది?
-
అతను లేదా ఆమె బోధిస్తున్న జనుల జీవితాలను అది ఎలా ఆశీర్వదిస్తుంది?
-
ఒక సువార్తికుడు సమాధానాన్ని ఎలా కనుగొనగలడు?
-
-
సువార్తికులను సమూహాలుగా విభజించి, ప్రతి సమూహాన్ని నాలుగు భద్రతా చర్యలలో ఒకదాన్ని మరియు దానితో పాటు ఉన్న లేఖనాలను అధ్యయనం చేయడానికి నియమించండి. వారు నేర్చుకున్న వాటి గురించి మరియు భద్రతా చర్యలు వారికి ఎలా సహాయపడ్డాయనే దాని గురించి పంచుకోమని సువార్తికులను ఆహ్వానించండి.
మిషను నాయకులు మరియు మిషను సలహాదారులు
-
అప్పుడప్పుడు సువార్తికులతో వారి సహచర అధ్యయనంలో పాల్గొనండి.
-
ఇంటర్వ్యూలు లేదా సంభాషణల సమయంలో, ఈ క్రింది ప్రశ్నలలో కొన్నింటిని అడగండి:
-
మీ లేఖన అధ్యయనంలో మీరు ఇటీవల పొందిన మనోభావాలేవి?
-
గత రెండు వారాల్లో నా సువార్తను ప్రకటించండి యొక్క ఏ అధ్యాయం లేదా విభాగం మీకు ఎక్కువగా సహాయపడింది? అది మీకు ఎలా సహాయపడింది?
-
నేర్చుకోవడానికి మీకు సహాయపడేలా మీ వ్యక్తిగత అధ్యయనంలో మీరేమి చేస్తున్నారు?
-
-
ఇంటర్వ్యూలలో, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంలో భద్రతా చర్యలను సమీక్షించడాన్ని మరియు సువార్తికులు వాటిని వర్తింపజేసేటప్పుడు వారు ఏమి నేర్చుకుంటున్నారని అడగడాన్ని పరిగణించండి.
-
మీ వ్యక్తిగత అధ్యయనం నుండి అంతర్దృష్టులను పంచుకోండి. మీ అధ్యయన పుస్తకంలో వ్రాసిన వాటిని మరియు సువార్త అధ్యయనం యొక్క ప్రాముఖ్యత గురించి మీ సాక్ష్యాన్ని పంచుకోండి.