“అధ్యాయము 13: సంఘమును స్థాపించడానికి నాయకులు మరియు సభ్యులతో ఏకమవ్వండి,” నా సువార్తను ప్రకటించండి: యేసు క్రీస్తు యొక్క సువార్తను పంచుకొనుటకు మార్గదర్శి (2023)
“అధ్యాయము 13,” నా సువార్తను ప్రకటించండి
అధ్యాయము 13
సంఘమును స్థాపించడానికి నాయకులు మరియు సభ్యులతో ఏకమవ్వండి
దీనిని పరిగణించండి
-
సంఘమును స్థాపించడానికి వార్డు నాయకులతో మరియు సభ్యులతో నేను ఎలా పని చేయగలను?
-
సువార్త పరిచర్యలో స్టేకు మరియు వార్డు నాయకుల బాధ్యతలు ఏవి?
-
వార్డు నాయకులతో వారపు సమన్వయ సమావేశంలో ఏమి జరగాలి?
-
సువార్తను పంచుకోవడంలో, కొత్త మరియు తిరిగి వచ్చే సభ్యులను బలోపేతం చేయడంలో నేను నాయకులకు ఎలా మద్దతివ్వగలను?
బోధించడానికి మరియు రక్షకుని వైపు నడిపించడానికి జనులను కనుగొనడానికి సువార్తికులు స్థానిక నాయకులతో మరియు సభ్యులతో కలిసి పని చేస్తారు. మీరు దేవుని పట్ల మరియు ఆయన పిల్లల పట్ల మీకున్న ప్రేమ ద్వారా ఐక్యంగా ఉంటారు. స్థానిక నాయకులతో మరియు సభ్యులతో మీరు ఐక్యతతో పనిచేసేంతవరకు ఆయన మీ ప్రయత్నాలను ఘనపరుస్తారు. వారితో పనిచేయడాన్ని మీ లక్ష్యాలు మరియు ప్రణాళికలలో ముఖ్యమైన భాగంగా చేసుకోండి.
మీరు స్థానిక నాయకులను మరియు సభ్యులను తెలుసుకుని ప్రేమించినప్పుడు, వారి పిలుపులు మరియు సువార్తసేవా ప్రయత్నాలలో వారికి మద్దతివ్వగల మార్గాలను మీరు చూస్తారు. వారిని ఉద్ధరించే మరియు బలోపేతం చేసే మార్గాల్లో మీ బహుమానాలను మరియు ప్రతిభలను అందించండి.
సువార్తను పంచుకోవడంలో, కొత్త మరియు తిరిగి వచ్చే సభ్యులను బలోపేతం చేయడంలో మీరు సభ్యులతో ఎలా పని చేయవచ్చో ఈ అధ్యాయం వివరిస్తుంది. మరింత సమాచారం కోసం, “ప్రధాన చేతిపుస్తకము”లో 23వ అధ్యాయం చూడండి.
వ్యక్తిగత లేదా సహచర అధ్యయనము
ఆల్మా 18–19లో రాజైన లమోనై, అతని భార్య మరియు అతని ప్రజల యొక్క పరివర్తన వృత్తాంతాన్ని సమీక్షించండి.
-
ఈ పరివర్తనలో ఏబిష్ పాత్ర ఏమిటి? అమ్మోన్ చేయలేనిది ఏది ఆమె చేయగలదు?
-
సభ్యులు మరియు సువార్తికులు కలిసి పనిచేయడం గురించి ఆమె ఉదాహరణ నుండి మీరు ఏమి నేర్చుకుంటారు?
సువార్త పరిచర్యకు సహాయం చేసే సభ్యుల యొక్క ఈ ఇతర ఉదాహరణలను పరిగణించండి:
-
అమ్యులెక్ (ఆల్మా 10:1–11)
-
ప్రిస్కిల్ల మరియు అకుల (అపొస్తలుల కార్యములు 18:24–28)
-
సమరయ స్త్రీ (యోహాను 4:5–30, 39–42)
వారి ఉదాహరణలను అనుసరించమని నాయకులను మరియు సభ్యులను మీరెలా ప్రోత్సహించగలరు?
స్థానిక నాయకులతో మరియు సభ్యులతో సంబంధాలను పెంపొందించుకోండి
స్థానిక సంఘ నాయకులు మరియు సభ్యులు దేవుని పనిలో మీ భాగస్వాములు. పునఃస్థాపించబడిన సువార్తను పరలోక తండ్రి పిల్లలకు అందించడానికి మీరు కలిసి పనిచేయడానికి సహాయపడే సంబంధాలను నిర్మించుకోండి. ఈ సంబంధాలు మీ జీవితాంతం మిమ్మల్ని ఆశీర్వదించగలవు.
స్థానిక నాయకులతో మరియు సభ్యులతో నమ్మకమైన, నిజమైన స్నేహాలను పెంచుకోండి. వారిని సందర్శించి వారి కుటుంబాలు, నేపథ్యాలు, ఆసక్తులు మరియు సంఘ అనుభవం గురించి తెలుసుకోండి. వారి జీవితాలపై నిజమైన ఆసక్తి కలిగి ఉండండి.
మీరు సందర్శించినప్పుడు, ఒక ఉద్దేశ్యంతో అలా చేయండి. మీరు కనుగొనే మరియు బోధించే పనిలో ఆత్రుతగా నిమగ్నమై ఉన్నారని చూపించండి. వారి సమయం మరియు కాలపట్టికను గౌరవించండి.
మీరు వారి ఇళ్లలో కలిసినప్పుడు లేదా సువార్తను బోధించినప్పుడు, వారి విశ్వాసాన్ని బలోపేతం చేసుకోవడానికి వారికి సహాయం చేయడానికి ప్రయత్నించండి. ప్రార్థనాపూర్వకంగా ఆత్మను మీతో కలిగి ఉండడానికి ప్రయత్నించండి. మీ ప్రాంతంలో సువార్త పరిచర్యతో మీకు ఉన్న అనుభవాలను పంచుకోండి.
స్థానిక నాయకులకు వారి పాత్రలలో మద్దతివ్వండి
కొన్ని నాయకత్వ పిలుపులు సువార్త పరిచర్యకు బాధ్యతలను కలిగి ఉంటాయి. ఈ బాధ్యతలను అర్థం చేసుకోవడం ఈ నాయకులకు మద్దతు ఇవ్వడానికి మీకు సహాయపడుతుంది. ప్రధాన చేతిపుస్తకములోని 23వ అధ్యాయం నుండి ఈ క్రింది వివరణలు తీసుకోబడ్డాయి.
స్టేకు అధ్యక్షుడు: స్టేకులో సువార్తను పంచుకోవడానికి, కొత్త మరియు తిరిగి వచ్చే సభ్యులను బలోపేతం చేయడానికి యాజకత్వ తాళపుచెవులను కలిగియుంటారు. ఈ ప్రయత్నాలకు అతను మరియు అతని సలహాదారులు పూర్తి దిశానిర్దేశం చేస్తారు.
బిషప్రిక్కు: సువార్తను పంచుకోవడానికి, కొత్త మరియు తిరిగి వచ్చే సభ్యులను బలోపేతం చేయడానికి వార్డు చేసే ప్రయత్నాలకు పెద్దల సమూహ మరియు ఉపశమన సమాజ అధ్యక్షత్వాలు నాయకత్వం వహిస్తున్నప్పుడు వారితో సమన్వయం చేసుకుంటారు.
పెద్దల సమూహ మరియు ఉపశమన సమాజ అధ్యక్షత్వాలు: సువార్తను పంచుకోవడానికి, కొత్త మరియు తిరిగి వచ్చే సభ్యులను బలోపేతం చేయడానికి వార్డు చేసే రోజువారీ ప్రయత్నాలకు నాయకత్వం వహిస్తారు. బిషప్పు సమన్వయంతో వార్డు సలహాసభతో కలిసి ఈ ప్రయత్నాలను నడిపించడానికి వారు కలిసి పనిచేస్తారు. ప్రధాన చేతిపుస్తకము, 8.2.3 మరియు 9.2.3 చూడండి.
వార్డు మిషను నాయకుడు (పిలువబడితే): వార్డు సభ్యులు మరియు నాయకులు, వార్డు సువార్తికులు మరియు పూర్తి-కాల సువార్తికుల పనిని సమన్వయం చేస్తారు. వార్డు మిషను నాయకుడు పిలువబడకపోతే, పెద్దల సమూహ అధ్యక్షత్వ సభ్యుడు ఈ పాత్రను పోషిస్తారు. ప్రధాన చేతిపుస్తకము, 23.5.3 చూడండి.
“నేను స్థానిక నాయకులకు ఒక ఆశీర్వాదమా?” అని క్రమం తప్పకుండా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. “నేను ఎలా సహాయం చేయగలను?” అనే వైఖరిని అభివృద్ధి చేసుకోండి.
సహచర అధ్యయనము
వార్డు నాయకుడిని క్లుప్తంగా కలవడానికి సమయం ఏర్పాటు చేసుకోండి. మీరు అతనికి లేదా ఆమెకు బాగా ఎలా మద్దతివ్వగలరో అడగండి. మెరుగుపరచడానికి ప్రణాళికలు రూపొందించండి.
వారపు సమన్వయ సమావేశాలు
మీ సువార్తసేవా ప్రయత్నాలలో ఐక్యంగా ఉండడానికి యువజన నాయకులతో సహా స్థానిక నాయకులతో సమన్వయం చాలా అవసరం. ఒక వార్డు మిషను నాయకుడు పిలువబడితే, అతను వారపు సమన్వయ సమావేశాలను నిర్వహిస్తాడు. లేకపోతే, ఈ పాత్రను పోషించే పెద్దల సమూహ అధ్యక్షత్వ సభ్యుడు నిర్వహిస్తాడు.
ఈ సంక్షిప్త, అనధికారిక సమావేశాలలో, స్థానిక నాయకులు మరియు మీరు సువార్తను పంచుకోవడానికి, కొత్త మరియు తిరిగి వచ్చే సభ్యులను బలోపేతం చేయడానికి చేసే ప్రయత్నాలను సమన్వయం చేస్తారు (ప్రధాన చేతిపుస్తకము, 23.4 చూడండి). సమావేశాలను స్వయంగా లేదా దూరం నుండి నిర్వహించవచ్చు. వారంలో ఫోనులు, సందేశాలు మరియు ఇమెయిల్‌లతో సహా ఇతర మార్గాల్లో కూడా సమన్వయం జరగాలి.
“సువార్తికుల ప్రణాళిక మరియు లక్ష్య నిర్దేశం వార్డు లేదా శాఖ ప్రణాళిక మరియు లక్ష్య నిర్దేశంతో సమలేఖనం చేయబడిన ఐక్య ప్రయత్నం మరియు దృష్టి ఇశ్రాయేలును సమకూర్చే పనిని సాధించడానికి చాలా సహాయకారిగా ఉండగలదు” (Quentin L. Cook, “Purpose and Planning,” mission leadership seminar, June 25, 2019).
వారపు సమన్వయ సమావేశం కొరకు సిద్ధపడండి
వారపు సమన్వయ సమావేశంలో పాల్గొనడానికి సిద్ధపడి రావడం ద్వారా వార్డు నాయకులకు మద్దతు ఇవ్వండి. సమావేశానికి ముందు, సహచర అధ్యయన సమయంలో మీరు ఎలా సమర్థవంతంగా పాల్గొనవచ్చో చర్చించడానికి సమయం కేటాయించండి.
నా సువార్తను ప్రకటించండి యాప్‌లో మీ రికార్డులను నవీకరించండి, తద్వారా నాయకులు మీరు పనిచేస్తున్న వారి గురించి ప్రస్తుత సమాచారాన్ని కలిగి ఉంటారు. మునుపటి సమావేశాలలోని నియామకాలపై నివేదించడానికి సిద్ధమవ్వండి.
వారపు సమన్వయ సమావేశంలో పాల్గొనండి
వారపు సమన్వయ సమావేశాలు వ్యక్తుల అవసరాలపై దృష్టి పెట్టడానికి ఉద్దేశించబడ్డాయి. సమావేశంలో, యౌవనులతో సహా వ్యక్తుల అవసరాలను తీర్చడంలో సహాయపడేందుకు వార్డు సభ్యులకు మీరు ఎలా మద్దతు ఇవ్వగలరో తెలియజేయండి.
వారపు సమన్వయ సమావేశంలో సాధారణంగా ఈ క్రింది నాలుగు అంశాలు ఉంటాయి:
బోధించబడుతున్న వారికి మనం ఎలా సహాయం చేయవచ్చు? చర్చకు అవకాశం ఉన్న అంశాలు:
-
ఈ రాబోయే వారం పాఠాలలో ఏ సభ్యులు పాల్గొనవచ్చు? పాల్గొనమని వారిని ఎవరు ఆహ్వానిస్తారు?
-
బోధించబడుతున్న వారికి ఉన్న సవాళ్లు ఏమిటి? సభ్యులు ఎలా సహాయం చేయవచ్చు?
-
బాప్తిస్మపు తేదీ నిర్ణయించబడిన వారికి గల అవసరాలు ఏమిటి? బాప్తిస్మం ప్రణాళిక చేయబడిందా? (12వ అధ్యాయంలో “బాప్తిస్మపు సేవ” చూడండి.)
ఇటీవల బాప్తిస్మం తీసుకున్న వారికి మనం ఎలా సహాయం చేయవచ్చు? చర్చకు అవకాశం ఉన్న అంశాలు:
-
సభ్యత్వం పొందిన మొదటి సంవత్సరంలో ఏ కొత్త సభ్యులు సంస్కార కూడికకు హాజరవుతున్నారు? హాజరు కాని వారికి మనం ఎలా సహాయం చేయవచ్చు?
-
వార్డులో ఏ కొత్త సభ్యులకు స్నేహితులు ఉన్నారు? పరిచర్య చేసే సహోదర సహోదరీలు ఎలా సహాయం చేయవచ్చు? యౌవనుల సమూహాలు మరియు తరగతులు ఎలా సహాయపడగలవు?
-
ఏ కొత్త సభ్యులకు నియామకం లేదా పిలుపు ఉంది?
-
మరణించిన తమ పూర్వీకుల కోసం దేవాలయ విధులు నిర్వహించబడడానికి వీలుగా కొత్త సభ్యులు వారి గురించి పరిశోధించడం ప్రారంభించడానికి మనం ఎలా సహాయం చేయవచ్చు? కొత్త సభ్యులు దేవాలయ సిఫారసు కలిగియున్నారా? దేవాలయం సమీపంలో ఉంటే, ఈ పూర్వీకులకు బాప్తిస్మం నిర్వహించడానికి దేవాలయానికి వెళ్లడానికి మనం వారికి ఎలా సహాయం చేయవచ్చు?
-
3వ అధ్యాయం నుండి ఇంకా ఏ పాఠాలను మళ్ళీ బోధించాలి? సభ్యులు ఎలా పాల్గొనవచ్చు?
-
ప్రతి కొత్త సభ్యుని కొరకు My Covenant Path [నా నిబంధన మార్గము] పురోగతిని సమీక్షించండి.
తిరిగి వచ్చే సభ్యులకు మనం ఎలా సహాయం చేయవచ్చు? చర్చకు అవకాశం ఉన్న అంశాలు:
-
సువార్తికులు ఏ పాక్షిక-సభ్యత్వ కుటుంబాలను సందర్శించి బోధించవచ్చు?
-
తిరిగి వచ్చే ఏ సభ్యులను సువార్తికులు సందర్శించి బోధించవచ్చు?
-
తిరిగి వచ్చే సభ్యులలో ఎవరు వార్డులో స్నేహితులను మరియు సేవ చేయడానికి తగిన అవకాశాలను కలిగియున్నారు?
-
ఈ సభ్యులకు మనం ఎలా సహాయం చేయవచ్చు?
బోధించడానికి మనం ఎక్కువమందిని ఎలా కనుగొనగలం? చర్చకు అవకాశం ఉన్న అంశాలు:
-
యౌవనులతో సహా వ్యక్తులు మరియు కుటుంబాలు ప్రేమించు, పంచుకొను మరియు ఆహ్వానించు అనే సూత్రాలను అన్వయించడంలో మనం ఎలా సహాయపడగలం? (9వ అధ్యాయంలో “సభ్యులతో ఏకమవ్వండి” చూడండి.)
-
ప్రాథమిక నాయకులతో సహా సభ్యులు వార్డు కార్యకలాపాలకు స్నేహితులను ఆహ్వానించడంలో మనం ఎలా సహాయపడగలం?
సహచర అధ్యయనము
ప్రధాన చేతిపుస్తకము, 23.4లో వారపు సమన్వయ సమావేశం యొక్క వీడియోను చూడండి. తదుపరి వారపు సమన్వయ సమావేశంలో అన్వయించగలిగేలా మీరు ఏమి నేర్చుకున్నారు? వార్డు నాయకులతో అవసరాలను చర్చించడానికి మరియు ప్రణాళిక చేయడానికి మీరు బాగా ఎలా సిద్ధం కావచ్చు? మీ తదుపరి ప్రణాళికా సభలో, మీరు ఎలా మెరుగుపడతారనే లక్ష్యాలను నిర్దేశించుకోండి.
సువార్తను పంచుకోవడానికి వార్డు ప్రణాళికకు మద్దతివ్వండి
సువార్తను పంచుకోవడానికి వార్డు సలహాసభ ఒక సరళమైన ప్రణాళికను రూపొందిస్తుంది (ప్రధాన చేతిపుస్తకము, 23.5.6 చూడండి). ఈ ప్రణాళికతో పరిచయం పెంచుకోండి. వారపు సమన్వయ సమావేశాలలో, నాయకులు వారి లక్ష్యాల వైపు పనిచేయడానికి సహాయపడే మార్గాల కోసం చూడండి. సువార్తను పంచుకోవడంలో సభ్యులకు మద్దతు ఇవ్వడానికి మీరు ఏమి చేస్తున్నారో నాయకులకు తెలియజేయండి.
వార్డు సలహాసభ సమావేశానికి హాజరు కావడానికి మీరు ఆహ్వానించబడితే, మీరు బోధిస్తున్న వారి పురోగతి మరియు మీరు అందుకున్న నియామకాల గురించి క్లుప్తంగా తెలియజేయడానికి సిద్ధంగా ఉండండి (ప్రధాన చేతిపుస్తకము, 29.2.5 చూడండి). ఈ అవకాశాన్ని వార్డు నాయకుల విశ్వాసం మరియు నమ్మకాన్ని పెంపొందించే సమయంగా చూడండి.
స్థానిక ప్రాంతీయ అవసరాలకు అనుగుణంగా మారండి
ప్రతి వార్డు లేదా శాఖ మీరు స్వీకరించడానికి ప్రత్యేకమైన అవసరాలను కలిగి ఉంటుంది. మీరు ఒక చిన్న శాఖలో లేదా ఒంటరి వయోజన వార్డులో సేవ చేయవచ్చు లేదా మీరు బహుళ వార్డులకు సేవ చేయవచ్చు. కొంతమంది నాయకులకు ఎక్కువ అనుభవం ఉంటుంది మరియు కొంతమందికి తక్కువ ఉంటుంది. కొంతమంది నాయకులకు ఇతరులకన్నా ఎక్కువ సమయం అందుబాటులో ఉంటుంది.
స్థానిక నాయకులకు సహాయం చేయడానికి మార్గాల కొరకు చూడండి. సభ్యులకు వారి పరిచర్య నియామకాలలో మద్దతు ఇవ్వడానికి వారు మిమ్మల్ని అడగవచ్చు. తమ స్నేహితులను సంఘానికి హాజరు కావడానికి ఆహ్వానించమని కొత్త సభ్యులను ప్రోత్సహించమని వారు మిమ్మల్ని అడగవచ్చు. నాయకులు మరియు సభ్యులు సువార్తను పంచుకునే మార్గాలను నేర్చుకునేటప్పుడు సువార్త పరిచర్య గురించి విలువైన అంతర్దృష్టులను మీరు అందించవచ్చు.
సంఘము సాపేక్షంగా కొత్తగా ఉన్న చోట, ప్రభువు తన సంఘాన్ని ఎలా స్థాపించారో అర్థం చేసుకోవడానికి కొత్త సభ్యులకు సహాయం చేయమని శాఖ నాయకులు మిమ్మల్ని అడగవచ్చు.
నాయకులతో మీ పని వివిధ ప్రాంతాలలో భిన్నంగా ఉండవచ్చు, కానీ ఈ కార్యకలాపాలన్నీ వ్యక్తులను ఆశీర్వదించడానికి మరియు ప్రభువు యొక్క సంఘాన్ని స్థాపించడానికి చాలా అవసరం.
ప్రేమించు, పంచుకొను మరియు ఆహ్వానించు అనే సూత్రాలను అన్వయించడంలో సభ్యులకు సహాయం చేయండి
సువార్తను సాధారణమైన, సహజమైన విధానాలలో పంచుకోమని సభ్యులను ప్రోత్సహించండి. ప్రేమించు, పంచుకొను మరియు ఆహ్వానించు అనే సూత్రాలను పాటించడం ద్వారా దీన్ని చేయడంలో సభ్యులకు మరియు నాయకులకు సహాయపడడానికి ప్రధాన చేతిపుస్తకము సూచనలను మరియు వీడియోలను అందిస్తుంది (ప్రధాన చేతిపుస్తకము, 23.1.1, 23.1.2 మరియు 23.1.3 చూడండి). మీరు నాయకులతో కలిసి పనిచేసేటప్పుడు ఈ సూత్రాలను గుర్తుంచుకోండి.
ఈ పనిలో మీరు నాయకుల ప్రయత్నాలకు మద్దతు ఇస్తున్నప్పుడు మీరు వారికి ఒక ఆశీర్వాదంగా ఉంటారు. దానికి బదులుగా, సువార్తను పంచుకోవడంలో, కొత్త మరియు తిరిగి వచ్చే సభ్యులను బలోపేతం చేయడంలో మరింతగా పాల్గొనడానికి వారి ఉదాహరణ సభ్యులకు సహాయపడుతుంది.
సువార్తను పంచుకోవడానికి వారి ప్రయత్నాలలో సభ్యులకు మద్దతు ఇవ్వడం గురించి ఆలోచనల కోసం 9వ అధ్యాయంలో “సభ్యులతో ఏకమవ్వండి” చూడండి.
లేఖన అధ్యయనము
క్రింది లేఖనాలను అధ్యయనం చేయండి: రక్షకుడు మరియు ఈ శిష్యులు ఎలా ప్రేమించారు, పంచుకున్నారు మరియు ఆహ్వానించారు? ఈ ఉదాహరణలు మీ బోధనలో ఏ చర్యలను ప్రేరేపిస్తాయి? సువార్తను సాధారణమైన, సహజమైన విధానాలలో పంచుకోవడానికి సభ్యులకు మీరెలా సహాయపడగలరు?
ప్రేమించు
-
మత్తయి 22:36–39; 25:40
-
యోహాను 13:34–35
-
అపొస్తలుల కార్యములు 10:34
పంచుకొను
ఆహ్వానించు
మీరు అధ్యయనం చేసే ప్రతిసారీ, మీరు నేర్చుకున్న వాటిని నమోదు చేయండి.
కొత్త సభ్యులను బలోపేతం చేయడంలో స్థానిక నాయకులకు మద్దతు ఇవ్వండి
జనులు బాప్తిస్మం తీసుకొని నిర్ధారించబడినప్పుడు, వారు “పరిశుద్ధులతో ఏక పట్టణస్థులుగా, దేవుని యింటివారుగా” మారతారు (ఎఫెసీయులకు 2:19; 1 కొరింథీయులకు 12:12–27 కూడా చూడండి). కొత్త సభ్యులు “దేవుని సువార్త ద్వారా పోషించబడుటకు, సరియైన మార్గమందు ఉంచబడుటకు, … క్రీస్తు యొక్క యోగ్యతలపై మాత్రమే ఆధారపడునట్లు చేయుటకు” (మొరోనై 6:4) సహాయపడేందుకు స్థానిక నాయకులతో కలిసి పనిచేయండి.
“కొత్తగా పరివర్తన చెందినవారు తాము కనుగొన్న దాని పట్ల ఉత్సాహంతో సంఘములోకి వస్తారు. మనం వెంటనే ఆ ఉత్సాహాన్ని పెంపొందించాలి. … సువార్తికులు తాము బోధించే వ్యక్తులను మరియు కొత్తగా పరివర్తన చెందిన వారిని బాప్తిస్మం తీసుకోవడానికి ముందే వారిని చేరుకునే, వారి మాట వినే, వారికి మార్గనిర్దేశం చేసే మరియు సంఘానికి స్వాగతించే విశ్వాసులైన సభ్యులకు పరిచయం చేయడంలో మరియు అనుసంధానించడంలో సహాయపడగలరు. … బాప్తిస్మపు నీటిలోకి ప్రవేశించే వారికి మనం [పరిచర్య చేస్తున్నప్పుడు], దేవుని పిల్లలలో చాలామంది అంతము వరకు సహించి నిత్యజీవాన్ని పొందడం మనం చూస్తాము” (Ulisses S. Soares, “Convert Retention,” mission leadership seminar, June 25, 2018).
కొత్త సభ్యులు సంస్కార కూడికకు హాజరు కావడానికి సహాయం చేయండి
కొత్త సభ్యులు సంఘానికి హాజరు కావడానికి సహాయపడడంలో మీకు ముఖ్యమైన పాత్ర ఉంది. వారు హాజరవడానికి మీరు లేదా వార్డు సభ్యులు సహాయపడుతున్నారని నిశ్చయపరిచేందుకు నాయకులతో కలిసి పనిచేయండి. కొత్త సభ్యుని సంస్కార కూడిక హాజరును చూపించే కీలక సూచిక అతనికి లేదా ఆమెకు అదనపు ప్రోత్సాహం ఎప్పుడు అవసరమో చూడడానికి మీకు మరియు వార్డు నాయకులకు సహాయపడుతుంది.
కొత్త సభ్యులకు వార్డులో స్నేహితులు ఉన్నప్పుడు వారు సంస్కార కూడికకు హాజరు కావడం మరియు సంస్కారంలో పాల్గొనడం కొనసాగించే అవకాశం చాలా ఎక్కువ. ముఖ్యంగా వారి సువార్త జీవితంలో మొదటి సంవత్సరంలో, చెందియున్నామనే భావనను వారికి కలిగించడంలో సహాయపడండి. (సిద్ధాంతము మరియు నిబంధనలు 84:106, 108 చూడండి.)
3వ అధ్యాయములో ఉన్న పాఠాలను మళ్ళీ బోధించండి
రక్షకుడైన యేసు క్రీస్తు మరియు ఆయన సువార్తపై కొత్త సభ్యులు తమ విశ్వాసాన్ని బలోపేతం చేసుకోవడానికి సహాయం చేయండి. కొత్త సభ్యులు ఆత్మ ద్వారా నేర్చుకోవడం కొనసాగిస్తున్నప్పుడు సువార్త యొక్క సత్యాలు మరియు సూత్రాలు లోతుగా పాతుకుపోతాయి.
నిర్ధారణ తర్వాత, మళ్ళీ సువార్తికుల పాఠాలను బోధించండి. బోధనకు మీరు నాయకత్వం వహించండి. అయితే, వార్డు సువార్తికులు లేదా ఇతర సభ్యులు పాల్గొనేలా వార్డు నాయకులతో సమన్వయం చేసుకోండి. 3వ అధ్యాయంలోని పాఠాలను తిరిగి బోధించడం అనేది కొత్త సభ్యులు “దేవుని సువార్త ద్వారా పోషింపబడడానికి” సహాయపడే ఒక ముఖ్యమైన మార్గం (మొరోనై 6:4). మీరు బోధించేటప్పుడు, పాఠాలలోని అన్ని నిబద్ధతలను పాటించమని కొత్త సభ్యులను ప్రోత్సహించండి.
కొత్త సభ్యులతో లేఖనాలను, ముఖ్యంగా మోర్మన్ గ్రంథాన్ని చదవండి మరియు సువార్త సూత్రాలను బోధించండి. వారి స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో సువార్తను పంచుకోవడానికి వారికి సహాయం చేయండి. ప్రతీ కొత్త సభ్యునికి నిర్దిష్ట అవసరాలు ఉంటాయి మరియు అతను లేదా ఆమె ప్రేమించబడినట్లు మరియు స్వాగతించబడినట్లు భావించడంలో మీరు సహాయపడవచ్చు.
Covenant Path Progress [నిబంధన మార్గ పురోగతి] నివేదిక మరియు My Covenant Path [నా నిబంధన మార్గము]
మీలాగే స్థానిక నాయకులు వారి సువార్తసేవా ప్రయత్నాలకు వనరులను కలిగి ఉంటారు. వాటిలో ఒకటి Member Tools యాప్ లేదా నాయకుడు మరియు గుమాస్తా వనరులలో కనిపించే Covenant Path Progress [నిబంధన మార్గ పురోగతి] నివేదిక. ఈ నివేదిక బాప్తిస్మమునకు ముందు మరియు తరువాత ఒక వ్యక్తి నిబంధన మార్గంలో పురోగమిస్తూ ఉండడానికి అవసరమైన ముఖ్యమైన అనుభవాలను చూడడానికి స్థానిక నాయకులకు వీలు కల్పిస్తుంది.
My Covenant Path [నా నిబంధన మార్గము] అనేది కొత్త సభ్యులకు “యేసు క్రీస్తుపై [వారి] విశ్వాసంలో స్థిరపడి, సంఘములో ఉన్నప్పుడు ఇంట్లో ఉన్నట్లు భావించడానికి” సహాయపడే ఒక వనరు (My Covenant Path, iv). ఇది కుటుంబ చరిత్ర మరియు మరణించిన పూర్వీకులు దేవాలయంలో పవిత్ర విధులను పొందడంలో సహాయపడడం వంటి కార్యకలాపాలకు మరియు అవకాశాలకు కొత్త సభ్యులను పరిచయం చేస్తుంది. ఈ అనుభవాల ద్వారా కొత్త సభ్యులకు మార్గనిర్దేశం చేయడానికి స్థానిక సభ్యులను ప్రోత్సహించండి. అభ్యర్థించిన విధంగా మద్దతు ఇవ్వండి.
వ్యక్తిగత లేదా సహచర అధ్యయనము
My Covenant Path [నా నిబంధన మార్గము] అధ్యయనం చేయండి. కొత్తగా పరివర్తన చెందిన సభ్యులను బలోపేతం చేయడంలో మీ పాత్ర గురించి మీరు ఏమి నేర్చుకున్నారు? వార్డు సలహాసభ ప్రయత్నాలకు మీరు ఎలా మద్దతివ్వగలరు? ఈ అధ్యాయాన్ని మీరు అధ్యయనం చేసిన ప్రతిసారీ, మీరు నేర్చుకునే వాటిని నమోదు చేయండి.
తిరిగి వచ్చే సభ్యులను బలోపేతం చేయడంలో స్థానిక నాయకులకు మద్దతు ఇవ్వండి
కొంతమంది సభ్యులు సంఘములో పాల్గొనడం మానేయాలని ఎంచుకుంటారు. స్థానిక నాయకులు మరియు ఇతర సభ్యులు వారితో బలమైన సంబంధాలను ఏర్పరచుకోవడానికి మరియు వారిని చేరుకోవడానికి ప్రయత్నిస్తారు. రక్షకుడు ఇలా చెప్పారు:
“అట్టి వారికి పరిచర్య చేయుటను మీరు కొనసాగించవలెను; ఏలయనగా వారు తిరిగి వచ్చి పశ్చాత్తాపపడి, హృదయము యొక్క పూర్ణ ఉద్దేశ్యముతో నా యొద్దకు వచ్చెదరేమో, నేను వారిని స్వస్థపరచుదునేమో మరియు వారికి రక్షణ తెచ్చుటకు మీరు సాధనముగా ఉందురేమో మీరెరుగరు” (3 నీఫై 18:32).
తిరిగి వచ్చే సభ్యులు వారి విశ్వాసాన్ని పెంచుకోవడానికి సహాయపడమని స్థానిక నాయకులు మిమ్మల్ని కోరవచ్చు. తరచుగా ఈ నియామకాలు పాక్షిక-సభ్యత్వ కుటుంబాలతో ఉంటాయి. మీరు తిరిగి వచ్చే సభ్యులకు సువార్త సూత్రాలను బోధిస్తూ, చర్య తీసుకోవడానికి వారిని ఆహ్వానిస్తున్నప్పుడు, వారి ఇళ్లలోకి ఆత్మను ఎలా ఆహ్వానించవచ్చో ప్రార్థనాపూర్వకంగా పరిగణించండి. వారి ఆందోళనల పట్ల సానుభూతి మరియు కరుణ చూపండి.
పరిస్థితులు అనుమతించినంత వరకు, ఇంట్లో ఇంకా బాప్తిస్మం తీసుకోని వారికి సువార్తను బోధించండి. మీ ప్రేమ మరియు మద్దతు క్రీస్తుపై వారి విశ్వాసాన్ని పెంచుకోవడానికి మరియు నిబంధనలు చేసి పాటించాలనే వారి కోరికను పెంచుకోవడానికి వారికి సహాయపడగలవు.
తిరిగి వచ్చే సభ్యులతో కలిసి పనిచేసేటప్పుడు మీరు స్థానిక నాయకులతో సమన్వయం చేసుకోండి. ఈ ప్రయత్నాలు వ్యక్తులు మరియు స్థానిక సంఘంపై శాశ్వత ప్రభావాన్ని చూపుతాయి.
లేఖన అధ్యయనము
కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయడం గురించి యేసు క్రీస్తు ఏమి బోధించారు?
-
లూకా 15:4–10
సంఘము నుండి దూరమైన చాలామందికి ఆల్మా మరియు అమ్యులెక్ బోధించారు. తిరిగి వచ్చే సభ్యులను బలోపేతం చేయడం గురించి వారి అనుభవాల నుండి మీరు ఏమి నేర్చుకోవచ్చు?
అధ్యయనము మరియు అన్వయము కొరకు ఉపాయములు
వ్యక్తిగత అధ్యయనము
-
తమ జీవితాలను మార్చుకుంటున్న మరియు సంఘానికి హాజరవుతున్న కొత్తవారు మరియు ఇటీవల తిరిగి వచ్చిన సభ్యులతో మాట్లాడడానికి ప్రణాళికలు రూపొందించడానికి నా సువార్తను ప్రకటించండి యాప్‌ను ఉపయోగించండి. ఏది వారికి ఎక్కువగా సహాయపడింది? మీ అధ్యయన పుస్తకంలో, వారి అనుభవాల గురించి మీ ఆలోచనలను వ్రాయండి. మీరు ప్రస్తుతం బోధిస్తున్న వారితో కలిసి పనిచేయడానికి మీకు సహాయపడేలా మీరు ఏమి నేర్చుకున్నారు?
-
2 నీఫై 31:18–20, ఆల్మా 26:1–7, ఆల్మా 32:32–43 మరియు మొరోనై 6 అధ్యయనం చేయండి. కొత్త సభ్యులను బలోపేతం చేయడం గురించి ఈ వచనాల నుండి మీరు నేర్చుకున్న వాటిని వ్రాయండి.
సహచర అధ్యయనము మరియు సహచర మార్పిడి
-
ప్రధాన చేతిపుస్తకములో 23వ అధ్యాయాన్ని చదివి చర్చించండి. స్థానిక నాయకులకు వారి బాధ్యతలలో మీరు ఎలా మద్దతు ఇవ్వగలరు?
-
వారపు సమన్వయ సమావేశాల సమయంలో, మీ ప్రాంతంలో ఈ వారం మీరు సందర్శించాలని వారు కోరుకుంటున్న తిరిగి వచ్చే సభ్యులు ఎవరైనా ఉన్నారా అని వార్డు నాయకులను అడగండి. మీరు వారిని సందర్శించినప్పుడు, యేసు క్రీస్తుపై వారి విశ్వాసాన్ని పెంపొందించడానికి ప్రయత్నించండి.
-
గత సంవత్సరంలో బాప్తిస్మం తీసుకొని నిర్ధారించబడిన వారందరినీ గుర్తించండి. వారిలో ఒకరి రికార్డును సమీక్షించండి మరియు ఈ వ్యక్తికి సహాయం చేయడానికి తదుపరి వారపు సమన్వయ సమావేశంలో మీరు నాయకులతో ఎలా పని చేయవచ్చో చర్చించండి. నా సువార్తను ప్రకటించండి యాప్‌లో మీ ఆలోచనలు మరియు సూచనలు నమోదు చేయండి. మీ ప్రాంతంలో ఇటీవల పరివర్తన చెందిన వారందరికీ దీన్ని పునరావృతం చేయండి.
జిల్లా సలహాసభ, జోన్ సభ్యసమావేశాలు మరియు మిషను నాయకత్వ సలహాసభ
-
కొత్త మరియు తిరిగి వచ్చే సభ్యులను బలోపేతం చేయడం గురించి మాట్లాడడానికి బిషప్పు లేదా ఇతర వార్డు నాయకుడిని ఆహ్వానించండి. సువార్తికులు ఎలా సహాయపడతారో నొక్కి చెప్పమని ఈ వ్యక్తిని అడగండి.
-
తప్పిపోయిన గొర్రె, తప్పిపోయిన నాణెం మరియు తప్పిపోయిన కొడుకు యొక్క ఉపమానాలను చర్చించండి. (లూకా 15 చూడండి). సువార్తికులు ఏమి నేర్చుకుంటున్నారో మరియు దానిని వారి సువార్త పరిచర్యలో ఎలా అన్వయించుకోవచ్చో పంచుకోమని వారిని ఆహ్వానించండి.
మిషను నాయకులు మరియు మిషను సలహాదారులు
-
కొత్త సభ్యులకు సహాయం చేయడానికి వారిని ప్రోత్సహించడానికి స్థానిక నాయకులతో కలిసి పనిచేయండి:
-
(తగిన వయస్సు గల పురుషులకు) యాజకత్వ స్థానానికి నియమించబడండి.
-
పరిచర్య చేసే సహోదరులుగా (మరియు మహిళలు పరిచర్య చేసే సహోదరీలుగా) నియమించబడండి.
-
మరణించిన వారి పూర్వీకుల కోసం దేవాలయంలో బాప్తిస్మం పొందడానికి దేవాలయ సిఫారసును పొందండి.
-
దేవాలయానికి తీసుకెళ్లడానికి మరణించిన పూర్వీకుల పేరును సిద్ధం చేయండి.
-
వారి వార్డు లేదా శాఖలో సేవ చేయడానికి ఒక నియామకాన్ని లేదా పిలుపును స్వీకరించండి.
-
-
స్టేకు అధ్యక్షుడితో సమన్వయంతో, ప్రభావవంతమైన వారపు సమన్వయ సమావేశాలను ఎలా నిర్వహించాలో స్థానిక నాయకులకు నేర్పండి.
-
వారు ఎలా ఉన్నారో, సువార్తికులు మరియు సభ్యులు ఎలా సహాయపడగలరో తెలుసుకోవడానికి అప్పుడప్పుడు కొత్త సభ్యులతో మాట్లాడండి.
-
సువార్తికులతో మాట్లాడడానికి మరియు సంఘములో వారి అనుభవాలను చెప్పడానికి కొత్త సభ్యులను ఆహ్వానించండి.