“అధ్యాయము 12: బాప్తిస్మము మరియు నిర్ధారణ కొరకు సిద్ధపడేందుకు జనులకు సహాయపడండి,” నా సువార్తను ప్రకటించండి: యేసు క్రీస్తు యొక్క సువార్తను పంచుకొనుటకు మార్గదర్శి (2023)
“అధ్యాయము 12,” నా సువార్తను ప్రకటించండి
అధ్యాయము 12
బాప్తిస్మము మరియు నిర్ధారణ కొరకు సిద్ధపడేందుకు జనులకు సహాయపడండి
దీనిని పరిగణించండి
-
బాప్తిస్మము మరియు నిర్ధారణ కోసం సిద్ధం కావడానికి నేను జనులకు ఎలా సహాయం చేయగలను?
-
నేను బాప్తిస్మపు ఇంటర్వ్యూను ఎలా నిర్వహించాలి?
-
ఉత్తేజకరమైన బాప్తిస్మపు సేవను ఎలా ప్రణాళిక చేయాలి మరియు నిర్వహించాలి?
-
బాప్తిస్మము మరియు నిర్ధారణ ఫారమ్‌ను పూర్తి చేసి సమర్పించడం ఎందుకు ముఖ్యం?
-
నేను కొత్త సభ్యులకు ఎలా మద్దతు ఇవ్వగలను?
బాప్తిస్మము అనేది ఒక వ్యక్తి జీవితంలోకి దేవుని శక్తిని తీసుకువచ్చే నిరీక్షణ యొక్క ఆనందకరమైన విధి. ఆ శక్తి పరిశుద్ధాత్మ వరమును పొందడం ద్వారా వస్తుంది. ఒక వ్యక్తి బాప్తిస్మపు నిబంధనను పాటించడంలో అంతము వరకు సహించినప్పుడు ఇది కొనసాగుతుంది.
మీ బోధన యొక్క ఉద్దేశ్యం ఏమిటంటే, ఇతరులు యేసు క్రీస్తుపై తమ విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి, వారి పాపాలకు పశ్చాత్తాపపడడానికి మరియు క్రీస్తును అనుసరించాలనే హృదయపూర్వక కోరికతో బాప్తిస్మం తీసుకోవడానికి సహాయం చేయడం. మోర్మన్ బోధించినట్లుగా, “పశ్చాత్తాపము యొక్క ప్రథమ ఫలమే బాప్తిస్మము” (మొరోనై 8:25). మీరు బోధించే వ్యక్తులు మీరు వారిని చేయమని ఆహ్వానించిన నిబద్ధతలను పాటిస్తున్నప్పుడు, వారు దేవునితో నిబంధనలు చేసి పాటించడానికి మరియు వాగ్దానం చేయబడిన ఆశీర్వాదాలను ఆస్వాదించడానికి సిద్ధంగా ఉంటారు.
బాప్తిస్మం మరియు నిర్ధారణ అనేవి చివరి గమ్యస్థానం కాదు. బదులుగా, ఈ విధులు దేవుని పిల్లలు నిబంధన మార్గంలోకి ప్రవేశించే ద్వారం వంటివి. ఈ మార్గం దేవాలయం యొక్క విధులు, నిబంధనలు, ఆనందకరమైన ఆశీర్వాదాలకు —మరియు చివరికి నిత్యజీవానికి దారితీస్తుంది (3 నీఫై 11:20–40 చూడండి).
బాప్తిస్మము మరియు నిర్ధారణకు అర్హతలు
దేవుడు తన పిల్లలందరినీ బాప్తిస్మం మరియు నిర్ధారణ ద్వారా తన వద్దకు రమ్మని ఆహ్వానిస్తున్నారు (2 నీఫై 26:33; 3 నీఫై 27:20 చూడండి). బాప్తిస్మం పొందడానికి అర్హతలు అందరికీ ఒకటే.
సిద్ధాంతము మరియు నిబంధనలు 20:37 నుండి:
-
దేవుని యెదుట మిమ్మల్ని మీరు తగ్గించుకోండి.
-
బాప్తిస్మము తీసుకోవాలనే కోరిక కలిగియుండండి.
-
విరిగిన హృదయము మరియు నలిగిన మనస్సుతో ముందుకు రండి.
-
మీ పాపాలన్నింటికి పశ్చాత్తాపపడండి మరియు క్షమాపణ కోసం ప్రార్థించండి.
-
క్రీస్తు నామమును మీపై తీసుకోవడానికి సమ్మతించండి.
-
అంతము వరకు క్రీస్తును సేవించడానికి నిశ్చయించుకోండి.
-
మీ పాప క్షమాపణ నిమిత్తము క్రీస్తు యొక్క ఆత్మను మీరు పొందారని మీ పనుల ద్వారా చూపండి.
ప్రథమ అధ్యక్షత్వము మరియు పన్నెండుమంది అపొస్తలుల సమూహము నుండి:
-
బాప్తిస్మపు ఇంటర్వ్యూ ప్రశ్నలకు సరిగ్గా స్పందించండి.
-
సువార్తికుల పాఠాలన్నింటిని స్వీకరించండి.
-
పెద్దల సమూహ అధ్యక్షుడు, ఉపశమన సమాజ అధ్యక్షురాలు మరియు బిషప్పులను కలవండి.
-
అనేక సంస్కార కూడికలకు హాజరుకండి.
ఈ అర్హతలు పరివర్తన యొక్క ఆధ్యాత్మిక ప్రక్రియకు సూచికలు. జనులు ఈ అర్హతలు కలిగియున్నప్పుడు, వారు బాప్తిస్మము మరియు నిర్ధారణ అనే పవిత్ర విధులకు సిద్ధంగా ఉంటారు.
ఒక వ్యక్తి ఖచ్చితమైన బాప్తిస్మపు తేదీని నిర్ణయించుకున్నప్పుడు:
-
అవసరమైన సిద్ధాంతం మరియు ఆజ్ఞలను మీరు బోధించారని నిర్ధారించుకోవడానికి నా సువార్తను ప్రకటించండి యాప్‌లో అతని లేదా ఆమె రికార్డును జాగ్రత్తగా సమీక్షించండి.
-
బాప్తిస్మము మరియు నిర్ధారణ కోసం సిద్ధం కావడానికి అవసరమైన కార్యక్రమాల కోసం కాలపట్టికను రూపొందించండి. ఈ కాలపట్టికను ఆ వ్యక్తితో సమీక్షించండి.
-
వీలైతే, ఆ వ్యక్తిని తన స్వంత బాప్తిస్మమునకు ముందు బాప్తిస్మపు సేవకు హాజరుకమ్మని ఆహ్వానించండి.
లేఖన అధ్యయనము
క్రింది లేఖనాలను అధ్యయనం చేయండి. మీరు బోధించే వారు బాప్తిస్మము మరియు నిర్ధారణ కొరకు సిద్ధపడేందుకు మీరెలా సహాయపడగలరు? మీ అధ్యయనం నుండి మీరు నేర్చుకున్న వాటిని నమోదు చేయండి.
-
అపొస్తలుల కార్యములు 2:37–39
బాప్తిస్మపు ఇంటర్వ్యూ కోసం జనులు సిద్ధం కావడానికి సహాయం చేయండి
బాప్తిస్మపు ఇంటర్వ్యూ అనేది ఒక వ్యక్తి బాప్తిస్మం కోసం ప్రభువు చెప్పిన అర్హతలను కలిగి ఉన్నాడని నిర్ధారించుకోవడానికి ఒక ముఖ్యమైన దశ. ఒక వ్యక్తి సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే బాప్తిస్మపు ఇంటర్వ్యూను ఏర్పాటు చేయండి.
జనులు ఈ ఇంటర్వ్యూ కోసం సిద్ధం కావడానికి సహాయం చేయండి, తద్వారా వారు దాని గురించి సౌకర్యంగా భావిస్తారు. అది ఎలా ఉంటుందో వివరించండి. వారు మీలాంటి మరొక సువార్తికుడిని కలుస్తారని వారికి చెప్పండి.
ఇంటర్వ్యూ యొక్క ఉద్దేశ్యాన్ని వివరించండి. “వారి పాపములన్నింటి నిమిత్తము వారు పశ్చాత్తాపపడి, వారి పాప క్షమాపణ నిమిత్తము క్రీస్తు ఆత్మను పొందియున్నారని వారి క్రియల ద్వారా ప్రత్యక్షపరచబడ్డారని” (సిద్ధాంతము మరియు నిబంధనలు 20:37) సాక్ష్యమిచ్చేందుకు ఇది వారికి ఒక అవకాశం.
ఇంటర్వ్యూ చేసేవారు అడిగే ప్రశ్నలను పంచుకోండి (క్రింద చూడండి). ఇది వాటికి సమాధానం ఇవ్వడానికి ఆ వ్యక్తి సిద్ధం కావడానికి సహాయపడుతుంది.
మీరు బోధించిన దానిని మరియు బాప్తిస్మం సమయంలో అతను లేదా ఆమె చేసే నిబంధనను ఆ వ్యక్తి అర్థం చేసుకున్నారని నిర్ధారించుకోండి. ఈ నిబంధన అనగా:
-
యేసు క్రీస్తు నామమును అతను లేదా ఆమెపైకి తీసుకోవడానికి సమ్మతించడం.
-
దేవుని ఆజ్ఞలు పాటించడం.
-
దేవునికి మరియు ఇతరులకు సేవ చేయడం.
-
అంతము వరకు సహించడం. (4వ పాఠము చూడండి.)
బాప్తిస్మం తీసుకొని నిర్ధారించబడడం మరియు బాప్తిస్మపు నిబంధనను పాటించడం ద్వారా వచ్చే గొప్ప ఆశీర్వాదాల గురించి సాక్ష్యమివ్వండి. ఈ ఆశీర్వాదాలలో పాప క్షమాపణ మరియు పరిశుద్ధాత్మ వరము ఉన్నాయి.
బాప్తిస్మపు ఇంటర్వ్యూ నిర్వహించడం
బాప్తిస్మం తీసుకోవాలనుకునే ప్రతి వ్యక్తిని అధికారం కలిగియున్న యాజకత్వ నాయకుడు ఇంటర్వ్యూ చేస్తారు. ఒక మిషనులో, ఈ వ్యక్తి జిల్లా లేదా జోన్ నాయకుడు. అతను ఈ క్రింది వాటి కోసం ఇంటర్వ్యూలు నిర్వహిస్తాడు:
-
9 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు కలిగియుండి ఎన్నడూ బాప్తిస్మం తీసుకోని మరియు నిర్ధారించబడని వ్యక్తులకు.
-
తల్లిదండ్రులు సంఘ సభ్యులు కాని 8 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలకు.
-
బాప్తిస్మం పొంది నిర్ధారించబడుతున్న తల్లిదండ్రులను కలిగి ఉన్న 8 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలకు.
ఇంటర్వ్యూ చేసేవారికి మార్గదర్శకాలు క్రింద ఇవ్వబడ్డాయి.
-
ఆత్మను అనుభూతి చెందగలిగేలా ఇంటర్వ్యూను సౌకర్యవంతమైన, ఏకాంత ప్రదేశంలో నిర్వహించండి.
-
ఒక పిల్లవాడిని, యౌవనుడిని లేదా స్త్రీని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు, ఇంటర్వ్యూ చేసే వ్యక్తి యొక్క సహచరుడు పక్కనే ఉన్న గది, వరండా లేదా హాలులో ఉండాలి. వ్యక్తి కోరుకుంటే, ఇంటర్వ్యూలో పాల్గొనడానికి మరొక పెద్దవారిని ఆహ్వానించవచ్చు. తప్పుగా అర్థం చేసుకోబడగల అన్ని పరిస్థితులను సువార్తికులు నివారించాలి.
-
ప్రార్థనతో ప్రారంభించండి.
-
వ్యక్తి సౌకర్యంగా భావించడానికి సహాయం చేయండి.
-
ఇంటర్వ్యూను ఆధ్యాత్మికంగా ఉత్తేజపరిచే అనుభవంగా మార్చండి.
-
ఇంటర్వ్యూ ఉద్దేశ్యం ఏమిటో ఆ వ్యక్తి అర్థం చేసుకున్నారని నిర్ధారించుకోండి.
-
క్రింద జాబితా చేయబడిన బాప్తిస్మపు ఇంటర్వ్యూ ప్రశ్నలు అడగండి. వ్యక్తి వయస్సు, పరిపక్వత మరియు పరిస్థితులకు అనుగుణంగా ప్రశ్నలను మార్చుకోండి.
-
వ్యక్తి ప్రశ్నలకు ప్రతిస్పందించండి.
-
ఖచ్చితత్వం కోసం బాప్తిస్మము మరియు నిర్ధారణ ఫారమ్‌లోని సమాచారాన్ని సమీక్షించండి. వ్యక్తి మైనర్ అయితే, బాప్తిస్మమునకు ముందు తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఫారమ్‌పై సంతకం చేయాలి (ఈ అధ్యాయంలోని “బాప్తిస్మము మరియు నిర్ధారణ: ప్రశ్నలు మరియు సమాధానాలు” విభాగాన్ని చూడండి).
-
సాక్ష్యం చెప్పడానికి లేదా అతని లేదా ఆమె భావాలను పంచుకోవడానికి వ్యక్తిని ఆహ్వానించండి.
-
ఆ వ్యక్తిని కలవగలిగినందుకు కృతజ్ఞతను తెలియజేయండి.
బాప్తిస్మపు ఇంటర్వ్యూ ప్రశ్నలు
బాప్తిస్మపు ఇంటర్వ్యూ ప్రశ్నలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
-
దేవుడు మన నిత్య తండ్రి అని మీరు నమ్ముతున్నారా? యేసు క్రీస్తు దేవుని కుమారుడని, లోక రక్షకుడని మరియు విమోచకుడని మీరు నమ్ముతున్నారా?
-
ప్రవక్త జోసెఫ్ స్మిత్ ద్వారా యేసు క్రీస్తు యొక్క సంఘము మరియు సువార్త పునఃస్థాపించబడ్డాయని మీరు నమ్ముతున్నారా? [ప్రస్తుత సంఘ అధ్యక్షుడు] దేవుని ప్రవక్త అని మీరు నమ్ముతున్నారా? ఇది మీకు ఏ అర్థాన్ని కలిగియున్నది?
-
పశ్చాత్తాపపడడం అంటే మీకు గల అర్థమేమిటి? మీరు మీ గత పాపాల గురించి పశ్చాత్తాపపడ్డారని భావిస్తున్నారా?
-
యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘములో సభ్యత్వం అనేది సువార్త ప్రమాణాలను జీవించడాన్ని కలిపి ఉంటుందని మీకు బోధించబడింది. ఈ క్రింది ప్రమాణాల గురించి మీరు ఏమి అర్థం చేసుకున్నారు? మీరు వాటిని పాటించడానికి సిద్ధంగా ఉన్నారా?
-
పవిత్రత యొక్క చట్టం, స్త్రీ పురుషుల మధ్య చట్టబద్ధమైన వివాహ బంధాల వెలుపల ఎలాంటి లైంగిక సంబంధాలనైనా ఇది నిషేధిస్తుంది.
-
దశమభాగ చట్టము
-
జ్ఞానవాక్యము
-
ప్రతీవారం సంస్కారమందు పాలుపంచుకోవడం మరియు ఇతరులకు సేవ చేయడంతో సహా విశ్రాంతిదినమును పరిశుద్ధంగా ఆచరించడం
-
-
మీరు ఎప్పుడైనా తీవ్రమైన నేరం చేశారా? అలా అయితే, మీరు ఇప్పుడు పరిశీలనలో ఉన్నారా లేదా పూచీకత్తులో ఉన్నారా?
-
మీరు ఎప్పుడైనా గర్భవిచ్ఛిత్తిలో పాల్గొన్నారా? (ప్రధాన చేతిపుస్తకము, 38.6.1 చూడండి.)
-
మీరు బాప్తిస్మం తీసుకున్నప్పుడు, మీరు క్రీస్తు నామాన్ని మీపైకి తీసుకోవడానికి, ఇతరులకు సేవ చేయడానికి, అన్ని సమయాల్లో దేవుని సాక్షిగా నిలబడడానికి మరియు మీ జీవితాంతం ఆయన ఆజ్ఞలను పాటించడానికి సిద్ధంగా ఉన్నారని దేవునితో నిబంధన చేస్తారు. మీరు ఈ నిబంధన చేయడానికి సిద్ధంగా ఉన్నారా మరియు దానిపట్ల నమ్మకంగా ఉండడానికి కృషి చేస్తారా?
5 లేదా 6వ ప్రశ్నకు వ్యక్తి నిశ్చయంగా సమాధానం ఇస్తే, సూచనల కోసం ప్రధాన చేతిపుస్తకము, 38.2.8.7 మరియు 38.2.8.8 చూడండి.
ప్రధాన చేతిపుస్తకము, 38.2.8లో బాప్తిస్మము మరియు నిర్ధారణకు సంబంధించిన విధానాలు మరియు మార్గదర్శకాలతో పరిచయం పెంచుకోండి. ఈ విధానాలలో కొన్ని మీరు ఎదుర్కొనే ప్రత్యేక పరిస్థితులను కలిగి ఉంటాయి.
ఇంటర్వ్యూ తర్వాత, సువార్తికుడు మరియు అభ్యర్థి తిరిగి ఇతర సువార్తికులతో చేరతారు. వ్యక్తి బాప్తిస్మము కోసం సిద్ధంగా ఉంటే, బాప్తిస్మపు సేవలో ఏమి జరుగుతుందో సువార్తికులు వివరిస్తారు. నిర్ధారణ సాధారణంగా వ్యక్తి నివసించే వార్డులోని సంస్కార కూడికలో జరుగుతుందని కూడా వారు వివరిస్తారు.
బాప్తిస్మము వాయిదా వేయాల్సి వచ్చినప్పుడు
కొన్నిసార్లు సాక్ష్యం లేదా యోగ్యతకు సంబంధించిన సవాళ్ల కారణంగా బాప్తిస్మము వాయిదా వేయాల్సి వస్తుంది. ఇది జరిగినప్పుడు, పరిస్థితులతో సున్నితంగా మరియు ఏకాంతంగా వ్యవహరించండి. భవిష్యత్ తేదీన బాప్తిస్మము కోసం ఎలా సిద్ధం కావాలో అర్థం చేసుకోవడానికి ఆ వ్యక్తికి సహాయం చేయండి.
ఆ వ్యక్తిని ప్రోత్సహించండి మరియు క్రీస్తునందు, ఆయన ప్రాయశ్చిత్తమందు నిరీక్షణను అందించండి. వార్డు సభ్యులను సహవాసం అందించమని అడగండి. వ్యక్తి బాప్తిస్మము పొందడానికి మరియు నిర్ధారించబడడానికి సిద్ధమయ్యే వరకు సువార్త యొక్క ప్రాథమిక సూత్రాలను బోధించడాన్ని కొనసాగించండి. కొత్త బాప్తిస్మపు తేదీని నిర్ణయించడానికి ఆ సమయం వరకు వేచి ఉండండి.
బాప్తిస్మము మరియు నిర్ధారణ: ప్రశ్నలు మరియు సమాధానాలు
ఒక మైనర్‌కు బాప్తిస్మం ఇవ్వడానికి నాకు అనుమతి అవసరమా? పిల్లల శ్రేయస్సు మరియు వారి ఇంటి వాతావరణం యొక్క సామరస్యం గురించి సంఘము శ్రద్ధ వహిస్తుంది. స్థానిక చట్టాల ద్వారా నిర్వచించబడిన మైనర్, ఈ క్రింది రెండు షరతులు నెరవేరినప్పుడు బాప్తిస్మం తీసుకోవచ్చు:
-
సంరక్షణనిచ్చే తల్లిదండ్రులు లేదా చట్టపరమైన సంరక్షకులు వ్రాతపూర్వక అనుమతి ఇచ్చినప్పుడు. సంఘ సభ్యునిగా తమ బిడ్డకు బోధించబడే సిద్ధాంతం గురించి వారికి సాధారణ అవగాహన ఉండాలి. బాప్తిస్మపు నిబంధనను చేసి, పాటించడంలో వారు బిడ్డకు మద్దతు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉండాలి.
-
ఇంటర్వ్యూ నిర్వహించే వ్యక్తి పిల్లవాడు బాప్తిస్మపు నిబంధనను అర్థం చేసుకున్నాడని తెలుసుకున్నప్పుడు. సంఘ సమావేశాలకు హాజరుకావడంతో సహా ఆజ్ఞలను పాటించడం ద్వారా పిల్లవాడు ఈ నిబంధనను పాటించడానికి ప్రయత్నిస్తాడని అతను నమ్మకంగా ఉండాలి.
ఒక భర్త లేదా భార్యకు బాప్తిస్మం ఇవ్వడానికి జీవిత భాగస్వామి అనుమతి నాకు అవసరమా? అవసరం. వివాహిత వ్యక్తి బాప్తిస్మం తీసుకునే ముందు అతని లేదా ఆమె జీవిత భాగస్వామి అనుమతి పొందాలి.
ఒక కుటుంబంలోని తల్లిదండ్రులు బాప్తిస్మమునకు సిద్ధంగా లేకపోతే, నేను ఇతర కుటుంబ సభ్యులకు బాప్తిస్మం ఇవ్వాలా లేదా తల్లిదండ్రులు సిద్ధపడే వరకు వేచి ఉండాలా? కుటుంబ సభ్యులు కలిసి బాప్తిస్మం తీసుకోవడం మంచిది. అయితే, కొందరు సిద్ధంగా లేకపోతే, అవసరమైన అనుమతి ఇచ్చినంత వరకు ఇతర కుటుంబ సభ్యులు బాప్తిస్మం తీసుకోవచ్చు.
తండ్రి అహరోను యాజకత్వాన్ని పొంది, స్వయంగా బాప్తిస్మం నిర్వహించే వరకు కుటుంబ సభ్యుల బాప్తిస్మములను ఆలస్యం చేయాలా? లేదు. కొత్తగా బాప్తిస్మం తీసుకున్న సహోదరులు బాప్తిస్మం తీసుకున్న రోజున అహరోను యాజకత్వాన్ని పొందరు. ముందుగా వారు బిషప్పు చేత ఇంటర్వ్యూ చేయబడాలి మరియు వార్డు సభ్యులచే ఆమోదించబడాలి.
సంఘ సభ్యత్వానికి రాజీనామా చేసిన లేదా సభ్యత్వం ఉపసంహరించుకున్న వ్యక్తికి నేను బోధించవచ్చా మరియు బాప్తిస్మం ఇవ్వవచ్చా? సంఘ సభ్యత్వానికి రాజీనామా చేసిన లేదా సభ్యత్వం ఉపసంహరించుకున్న వ్యక్తులను బాప్తిస్మము మరియు నిర్ధారణ ద్వారా తిరిగి చేర్చుకోవచ్చు. వారు బోధించబడాలనుకుంటే, మీరు పోషించగల పాత్ర గురించి స్థానిక యాజకత్వ నాయకులతో మరియు మీ మిషను అధ్యక్షుడితో చర్చించండి.
స్టేకులో, బాప్తిస్మము ద్వారా పునఃప్రవేశం బిషప్పు లేదా స్టేకు అధ్యక్షుని ఆధ్వర్యంలో జరుగుతుంది. మిషనులో, పునఃప్రవేశం మిషను అధ్యక్షుని ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ నాయకులు అవసరమైన విధంగా ప్రథమ అధ్యక్షత్వం నుండి మార్గదర్శకత్వం పొందుతారు. సువార్తికులు ఈ బాప్తిస్మపు ఇంటర్వ్యూలను నిర్వహించరు లేదా బాప్తిస్మము మరియు నిర్ధారణ ఫారమ్‌ను పూరించరు. అయితే, బాప్తిస్మము ఇవ్వడానికి ఒక సువార్తికుడిని ఆహ్వానించవచ్చు.
తిరిగి చేరిన సంఘ మాజీ సభ్యులు పరివర్తన చెందినవారు కాదు. అయినప్పటికీ, సంఘ సభ్యత్వం యొక్క ఆశీర్వాదాలను మళ్ళీ ఆస్వాదించడంలో వారికి సహాయపడడంలో సువార్తికులు కొన్నిసార్లు ముఖ్యమైన పాత్ర పోషించవచ్చు.
ఒక వ్యక్తికి బాప్తిస్మపు తేదీ నిర్ణయించబడినప్పటికీ అన్ని నిబద్ధతలను పాటించకపోతే ఏమి చేయాలి? వ్యక్తి నిబద్ధతలను పాటిస్తూ బాప్తిస్మపు అర్హతలను సాధించే వరకు బాప్తిస్మపు ఇంటర్వ్యూను ఏర్పాటు చేయడానికి వేచి ఉండండి. ఈ అధ్యాయంలో “బాప్తిస్మమును ఎప్పుడు వాయిదా వేయాలి” చూడండి.
ఒక జంట బాప్తిస్మము పొందాలనుకుంటే, కానీ కలిసి జీవిస్తుంటే ఏమి చేయాలి? స్త్రీ పురుషుల మధ్య చట్టబద్ధమైన వివాహానికి వెలుపల కలిసి జీవిస్తున్న జంట పవిత్రత యొక్క చట్టాన్ని అనుసరించే వరకు బాప్తిస్మం పొందకూడదు. దీనర్థం—ఒక భిన్న లింగ జంటగా లేదా స్వలింగ జంటగా ఇకపై కలిసి జీవించకూడదు—లేదా ఒక పురుషుడు మరియు స్త్రీకి దీనర్థం వివాహం చేసుకోవడం. సిద్ధాంతము మరియు నిబంధనలు 20:37లో వివరించిన విధంగా పశ్చాత్తాపం నిమిత్తం విశ్వాసాన్ని సాధన చేయడం కూడా ఇందులో ఉంది. స్త్రీ పురుషుల మధ్య వివాహం అనేది దేవుని ప్రణాళికలో ఆవశ్యకమైన భాగం.
బాప్తిస్మపు ఇంటర్వ్యూలో 5 మరియు 6వ ప్రశ్నలు ఒక వ్యక్తి ఎప్పుడైనా తీవ్రమైన నేరం చేశాడా లేదా గర్భస్రావంలో పాల్గొన్నాడా అని అడుగుతాయి. ఈ ప్రశ్నలలో దేనికైనా ఎవరైనా “అవును” అని సమాధానం ఇస్తే నేను ఏమి చేయాలి? బాప్తిస్మపు ఇంటర్వ్యూ సమయంలో ఈ పరిస్థితులలో ఒకదాని గురించి మీకు తెలిస్తే, వివరాల గురించి అడగవద్దు. ఆ వ్యక్తి బాప్తిస్మము కోసం ఆమోదించబడతారని వాగ్దానం చేయవద్దు. బదులుగా, మీ ప్రేమను వ్యక్తపరచండి మరియు మరింత పరిణతి, అనుభవం ఉన్నవారెవరైనా ఆ వ్యక్తితో మాట్లాడి సహాయం చేస్తారని దయతో వివరించండి.
మీ మిషను అధ్యక్షుడికి బాప్తిస్మపు ఇంటర్వ్యూ అభ్యర్థనను పంపండి. అతను లేదా అతని సలహాదారులలో ఒకరు ఆ వ్యక్తిని కలుస్తారు. ప్రధాన చేతి పుస్తకం, 38.2.8.7 మరియు 38.2.8.8 చూడండి.
నేను బాప్తిస్మము మరియు నిర్ధారణ ఫారమ్‌ను సమర్పించడానికి ముందే సభ్యత్వ రికార్డు సృష్టించబడితే నేను ఏమి చేయాలి? సూచనల కోసం మీ మిషను అధ్యక్షుడిని సంప్రదించండి.
వ్యక్తిగత అధ్యయనము
మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తుంటే మీకు ఎలా అనిపిస్తుందో ఆలోచించండి. ఈ క్రింది ప్రశ్నలను పరిగణించి, మీ అభిప్రాయాలను నమోదు చేయండి.
-
ఇంటర్వ్యూ మీకు ఎలా అసౌకర్యంగా అనిపించవచ్చు? ఇంటర్వ్యూ చేసే వ్యక్తి మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచడానికి ఏమి చేయవచ్చు లేదా చెప్పవచ్చు?
-
ఇంటర్వ్యూ చేసే వ్యక్తి మీతో ఎలా సంభాషించాలని మీరు కోరుకుంటారు?
-
మీరు సందేహాలు లేదా అపార్థాలను వ్యక్తం చేస్తే లేదా మీరు తీవ్రమైన పాపాలను ఒప్పుకుంటే ఇంటర్వ్యూ చేసే వ్యక్తి ఎలా స్పందించాలని మీరు కోరుకుంటారు?
బాప్తిస్మపు సేవ
కొత్త సభ్యునికి బాప్తిస్మపు సేవ మరియు నిర్ధారణ ఆధ్యాత్మిక ముఖ్యాంశాలుగా ఉండాలి. ఒక వ్యక్తి బాప్తిస్మానికి అర్హత సాధించిన వెంటనే బాప్తిస్మపు సేవను ఏర్పాటు చేయాలి. ఏమి ప్రణాళిక చేయబడింది మరియు ఎందుకు అనే దాని గురించి వివరించండి. బాప్తిస్మము కోసం ఎలా ఒక వ్యక్తికి తెల్ల దుస్తులు ధరించడానికి ఇస్తారనే దానితో సహా సరైన దుస్తుల గురించి చర్చించండి.
పరివర్తన చెందిన వారికి బాప్తిస్మపు సేవలు బిషప్రిక్కు మార్గదర్శకత్వంలో ప్రణాళిక చేయబడతాయి. వార్డు మిషను నాయకుడు (ఎవరైనా పిలువబడితే) లేదా సువార్త పరిచర్యను నడిపించే పెద్దల సమూహ అధ్యక్షత్వ సభ్యుడు ఈ సేవలను ప్రణాళిక చేసి, నిర్వహిస్తారు. అతను పూర్తి-కాల సువార్తికులతో సమన్వయం చేసుకుంటాడు. బాప్తిస్మపు సేవలు సరళంగా, క్లుప్తంగా మరియు ఆధ్యాత్మికంగా ఉద్ధరించేలా ఉండాలి.
బిషప్రిక్కు సభ్యుడిని, ఉపశమన సమాజ అధ్యక్షత్వ సభ్యురాలిని మరియు పెద్దల సమూహ అధ్యక్షత్వ సభ్యుడిని (అతను నిర్వహించకపోతే) బాప్తిస్మపు సేవకు హాజరు కావడానికి ఆహ్వానించండి. సముచితమైనప్పుడు, ఇతర నిర్మాణ నాయకులు, యౌవనుల నాయకులు మరియు పరిచర్య చేస్తున్న సహోదర సహోదరీలను (నియమించబడితే) ఆహ్వానించండి. బాప్తిస్మపు సేవ మరియు నిర్ధారణకు హాజరు కావడానికి స్నేహితులు మరియు బంధువులను ఆహ్వానించడానికి బాప్తిస్మము పొందుతున్న వ్యక్తితో కలిసి పనిచేయండి.
మీరు బోధిస్తున్న ఇతర వ్యక్తులను ఆహ్వానించడాన్ని పరిగణించండి. ఈ అనుభవాలు వారు ఆత్మను అనుభూతి చెందడానికి మరియు సువార్త గురించి మరింత తెలుసుకోవడానికి సహాయపడతాయి. సేవ తర్వాత, వారి అనుభవాన్ని చర్చించడానికి మరియు బోధించబడడానికి వారిని ఆహ్వానించడానికి తదుపరి చర్య తీసుకోండి.
బాప్తిస్మపు సేవలో ఈ క్రిందివి ఉండవచ్చు:
-
సభకు ముందు సంగీతం
-
సేవను నిర్వహిస్తున్న యాజకత్వ నాయకుడి నుండి క్లుప్త స్వాగతం (వీలైతే బిషప్రిక్కు సభ్యుడు అధ్యక్షత్వం వహించాలి)
-
ప్రారంభ కీర్తన మరియు ప్రార్థన
-
బాప్తిస్మము మరియు పరిశుద్ధాత్మ వరము వంటి సువార్త విషయాలపై ఒకటి లేదా రెండు చిన్న సందేశాలు
-
ఎంపిక చేసిన సంగీతం
-
బాప్తిస్మము
-
బాప్తిస్మములో పాల్గొన్నవారు పొడి బట్టలు మార్చుకునేటప్పుడు భక్తితో కూడిన సమయం. (ఈ సమయంలో కీర్తనలు లేదా ప్రాథమిక పాటలు వాయించవచ్చు లేదా పాడవచ్చు. లేదా సువార్తికులు క్లుప్తంగా సువార్త ప్రదర్శన ఇవ్వవచ్చు.)
-
కావాలనుకుంటే కొత్త సభ్యులచే సాక్ష్యం చెప్పించవచ్చు
-
ముగింపు కీర్తన మరియు ప్రార్థన
-
సభ తర్వాత సంగీతం
మీరు ఆదివారం బాప్తిస్మం ఏర్పాటు చేస్తే, సాధారణ ఆదివారపు సమావేశాలకు సాధ్యమైనంత తక్కువ విరుద్ధంగా ఉండే సమయాన్ని ఎంచుకోండి.
నిర్ధారణ
ఒక వ్యక్తి బాప్తిస్మం తీసుకున్న తర్వాత నిర్ధారణ విధిని పొందుతాడు (సిద్ధాంతము మరియు నిబంధనలు 20:41 చూడండి). బాప్తిస్మము మరియు నిర్ధారణ యొక్క విధులు రెండూ పూర్తయిన తర్వాత మరియు సరిగ్గా నమోదు చేయబడిన తర్వాత కొత్తగా పరివర్తన చెందిన వ్యక్తి సంఘ సభ్యునిగా పరిగణించబడతాడు.
నిర్ధారణలు బిషప్పు మార్గదర్శకత్వంలో చేయబడతాయి. అయితే, అతను నిర్ధారణ కోసం ప్రత్యేక ఇంటర్వ్యూ నిర్వహించడు.
కొత్తగా పరివర్తన చెందినవారు నిర్ధారించబడ్డారని నిశ్చయించడానికి బిషప్పు మరియు వార్డు మిషను నాయకుడితో (ఒకరు పిలువబడితే) కలిసి పని చేయండి. బాప్తిస్మము తర్వాత వీలైనంత త్వరగా నిర్ధారణ జరగాలి, ముఖ్యంగా తరువాతి ఆదివారం. అయితే, మినహాయింపుగా బాప్తిస్మపు సేవలో నిర్ధారణ జరగడానికి బిషప్పు అనుమతించవచ్చు (ప్రధాన చేతిపుస్తకము, 18.8 చూడండి).
పరివర్తన చెందినవారు సాధారణంగా వారు నివసించే వార్డులో జరిగే సంస్కార కూడికలో నిర్ధారించబడతారు. బిషప్పు సాధారణంగా వార్డులో పనిచేస్తున్న సువార్తికులను నిర్ధారణలో పాల్గొనమని ఆహ్వానిస్తారు. ఒక సువార్తికుడు నిర్ధారణ చేస్తే, అతనికి మిషను అధ్యక్షుడి నుండి ఆమోదం కూడా అవసరం (ప్రధాన చేతిపుస్తకము, 18.8.1 చూడండి). బిషప్రిక్కులో కనీసం ఒక సభ్యుడు పాల్గొంటారు.
బాప్తిస్మము మరియు నిర్ధారణ ఫారమ్‌ను పూర్తి చేయండి
ఒక వ్యక్తి బాప్తిస్మము పొంది నిర్ధారించబడిన తర్వాత సభ్యత్వ రికార్డును వెంటనే సృష్టించడం చాలా ముఖ్యం. అతని కాలంలో అటువంటి రికార్డుల గురించి మొరోనై ఇలా వ్రాసాడు, కొత్త సభ్యులు “క్రీస్తు యొక్క సంఘ జనుల మధ్య లెక్కింపబడిరి; మరియు వారిని సరియైన మార్గమందు ఉంచుటకు, వారు జ్ఞాపకము చేసుకొనబడి, దేవుని సువార్త ద్వారా పోషింపబడునట్లు వారి పేర్లు తీసుకొనబడినవి” (మొరోనై 6:4).
బాప్తిస్మము పొందడానికి సిద్ధమవుతున్న వారెవరికైనా మీరు బోధించేటప్పుడు, నా సువార్తను ప్రకటించండి యాప్‌లో బాప్తిస్మము మరియు నిర్ధారణ ఫారమ్‌ను పూరించడం ప్రారంభించండి. సభ్యత్వ రికార్డును సృష్టించడానికి ఈ ఫారమ్ ఉపయోగించబడుతుందని వివరించండి. ఈ రికార్డులో వ్యక్తి పొందే విధుల గురించి ముఖ్యమైన సమాచారం ఉంటుంది. సంఘ సభ్యులు స్థలం మారినప్పుడు, వారి సభ్యత్వ రికార్డు వారి కొత్త వార్డుకు పంపబడుతుంది, తద్వారా స్థానిక నాయకులు మరియు సభ్యులు వారికి మద్దతు ఇవ్వగలరు.
కొత్త సభ్యుడు బాప్తిస్మము పొంది నిర్ధారించబడిన వెంటనే, దానిని ఎవరు నిర్వహించారనే దానితో సహా ప్రతీ విధి గురించిన సమాచారంతో ఫారమ్‌ను నవీకరించండి. మీరు ఫారమ్‌ను పూర్తి చేసిన తర్వాత, నా సువార్తను ప్రకటించండి యాప్‌లో సమాచారాన్ని నమోదు చేసి, దానిని ఎలక్ట్రానిక్‌గా వార్డు గుమాస్తాకు సమర్పించండి. గుమాస్తా ఫారమ్‌ను అందుకున్న వెంటనే, దానిని సమీక్షించి సభ్యత్వ రికార్డును సృష్టిస్తాడు.
సభ్యత్వ రికార్డు సృష్టించబడిన తర్వాత, ఒక గుమాస్తా బాప్తిస్మము మరియు నిర్ధారణ ధృవపత్రాన్ని సిద్ధం చేస్తాడు. ఈ ధృవపత్రం బిషప్పుచేత సంతకం చేయబడి, వ్యక్తికి ఇవ్వబడుతుంది.
సభ్యత్వ రికార్డు మరియు ధృవపత్రంలోని పేరు మరియు లింగం వ్యక్తి యొక్క జనన ధృవీకరణ పత్రం, పౌర జనన నమోదు పుస్తకం లేదా ప్రస్తుత చట్టపరమైన పేరుతో సరిపోలాలి.
వ్యక్తిగత లేదా సహచర అధ్యయనము
మోషైయ 6:1–3 మరియు మొరోనై 6:1–4 అధ్యయనం చేయండి. బాప్తిస్మము మరియు నిర్ధారణల యొక్క ఖచ్చితమైన రికార్డులను ఉంచడంతో ఈ గద్యభాగాలు ఎలా సంబంధం కలిగి ఉన్నాయి?
బాప్తిస్మము మరియు నిర్ధారణ తర్వాత
పరిచర్య చేయడం కొనసాగించండి
కొత్త సభ్యులు బాప్తిస్మము పొంది నిర్ధారించబడిన తర్వాత సహవాసం కొనసాగించండి మరియు వారికి మద్దతు ఇవ్వండి. సంఘానికి హాజరు కావడానికి మరియు సభ్యులతో సంబంధాలను పెంపొందించుకోవడానికి వారికి సహాయం చేయండి. వారితో కలిసి మోర్మన్ గ్రంథాన్ని చదవండి మరియు కుటుంబ సభ్యులతో, స్నేహితులతో సువార్తను పంచుకోవడంలో వారికి సహాయపడండి. My Covenant Path పుస్తకాన్ని వారికి పరిచయం చేయండి. వారి పురోగతిని నమోదు చేయడానికి నా సువార్తను ప్రకటించండి యాప్‌ను ఉపయోగించడం కొనసాగించండి, ఉదాహరణకు సంస్కార కూడికకు వారి హాజరు మరియు వారు పొందిన పాఠాలు వంటివి.
నిర్ధారణ తర్వాత, మళ్ళీ సువార్తికుల పాఠాలను బోధించండి. బోధనకు మీరు నాయకత్వం వహించండి. అయితే, వార్డు సువార్తికులు లేదా ఇతర సభ్యులు పాల్గొనేలా వార్డు నాయకులతో సమన్వయం చేసుకోండి. మీరు బోధించేటప్పుడు, పాఠాలలోని అన్ని నిబద్ధతలను పాటించడానికి కొత్త సభ్యులను ప్రోత్సహించండి.
వారపు సమన్వయ సమావేశాలలో, సభ్యులు కొత్తగా పరివర్తన చెందినవారికి ఎలా మద్దతు ఇవ్వవచ్చో మరియు వారు సంఘములో చురుకుగా నిమగ్నమై ఉండడానికి ఎలా సహాయపడవచ్చో చర్చించండి. వారిని సమూహ లేదా నిర్మాణ నాయకులకు ఎవరు పరిచయం చేయాలో ప్రణాళిక చేయండి. మీరు మళ్ళీ పాఠాలు బోధించేటప్పుడు ఇతర సభ్యుల భాగస్వామ్యాన్ని సమన్వయం చేసుకోండి. పరిచర్య చేసే సహోదరులను (మరియు స్త్రీల కొరకు పరిచర్య చేసే సహోదరీలను) నియమించమని అడగండి.
ఒక పురుషుడు నిర్ధారించబడిన తర్వాత, సంవత్సరం చివరి నాటికి అతనికి కనీసం 12 సంవత్సరాల వయస్సు ఉంటే అతను అహరోను యాజకత్వాన్ని పొందేందుకు అర్హుడు. అహరోను యాజకత్వ నియామకాలు బిషప్పు మార్గదర్శకత్వంలో జరుగుతాయి (ప్రధాన చేతిపుస్తకము, 38.2.9.1 చూడండి).
సముచితంగా, మీరు బోధించిన వారితో మీ జీవితాంతం సంభాషించండి. యేసు క్రీస్తు సువార్త యొక్క అన్ని ఆశీర్వాదాలను పొందడంలో వారికి మద్దతు ఇవ్వండి.
“మనము విరిగిన హృదయాలతో మరియు నలిగిన ఆత్మలతో వచ్చినప్పుడు, మనం యేసు క్రీస్తులో స్వరాన్ని కనుగొనవచ్చు మరియు ఆయన అవగాహన అనే సురక్షితమైన చేతులలో చుట్టబడవచ్చు. పవిత్ర విధులు అంతర్గత ఉద్దేశ్యాన్ని మరియు బాహ్య చర్యను పవిత్రం చేయడానికి నిబంధనకు చెందేలా చేస్తాయి మరియు ‘దైవత్వం యొక్క శక్తిని’ అందిస్తాయి [సిద్ధాంతము మరియు నిబంధనలు 84:20]. ఆయన ప్రేమ-దయ మరియు దీర్ఘశాంతముతో, ఆయన సంఘము మన సత్రం అవుతుంది” (గెరిట్ డబ్ల్యు. గాంగ్, “సత్రములో స్థలము,” లియహోనా, మే 2021, 27).
దేవాలయ దీవెనలలో పాల్గొనడానికి కొత్త సభ్యులకు సహాయం చేయండి
తగిన వయస్సు గల కొత్త సభ్యులు మరణించిన కుటుంబ సభ్యుల కోసం బాప్తిస్మము పొందడానికి అనుమతించే దేవాలయ సిఫారసును పొందవచ్చు (ప్రధాన చేతిపుస్తకము, 26.4.2 చూడండి). వారు బిషప్పు నుండి ఈ సిఫారసును అందుకుంటారు. కొత్త సభ్యులు వీలైనంత త్వరగా దేవాలయ సిఫారసును పొందేలా ప్రోత్సహించండి మరియు సహాయం చేయండి. దేవాలయం సమీపంలో ఉంటే, మరణించిన పూర్వీకుల కోసం బాప్తిస్మం పొందడానికి కొత్త సభ్యులకు నిర్దిష్ట సమయం కోసం ఆహ్వానాన్ని అందించడాన్ని పరిగణించండి.
వారపు సమన్వయ సమావేశాలలో, వార్డు దేవాలయము మరియు కుటుంబ చరిత్ర నాయకుడికి కొత్త సభ్యులను ఎవరు పరిచయం చేస్తారో ప్రణాళిక చేయండి. వారి స్వంత దేవాలయ నిబంధనలను చేయడం ద్వారా దేవాలయ దీవెనలను పొందడానికి సిద్ధం కావడానికి ఈ నాయకుడు వారికి సహాయం చేయగలడు.
అధ్యయనము మరియు అన్వయము కొరకు ఉపాయములు
వ్యక్తిగత అధ్యయనము
-
ఒక బాప్తిస్మపు అభ్యర్థి ఎదుర్కొనే సవాళ్లను జాబితా చేయండి. ఒక వ్యక్తి సంఘ సభ్యుల ప్రేమను మరియు స్నేహాన్ని అనుభవించడం ఎందుకు ముఖ్యం?
-
మొరోనై 6; సిద్ధాంతము మరియు నిబంధనలు 20:68–69 అధ్యయనం చేయండి. బాప్తిస్మము మరియు నిర్ధారణ కోసం సిద్ధం కావడానికి జనులకు సహాయం చేయడం గురించి మీరు ఈ వచనాల నుండి ఏమి నేర్చుకోవచ్చు? మీరు నేర్చుకున్న వాటిని వ్రాయండి. సహచర అధ్యయన సమయంలో మీ ఆలోచనలను మీ సహచరుడితో పంచుకోండి.
సహచర అధ్యయనము మరియు సహచర మార్పిడి
-
సువార్త ప్రమాణాలు ఎందుకు ముఖ్యమైనవో అధ్యక్షులు హెన్రీ బి. ఐరింగ్ వివరించారు. క్రింది సలహాను చర్చించండి. ఈ ప్రమాణాలను పాటించాలనే కోరికను మీరు జనులలో ఎలా ప్రోత్సహించగలరు?
“ప్రభువు మనల్ని ఆశీర్వదించగలిగేలా తన ప్రమాణాలను నిర్దేశిస్తారు. ఆ ఆశీర్వాదాల గురించి ఆలోచించండి: ప్రమాణాలను పాటించే వారికి పరిశుద్ధాత్మ సహాయం ఇస్తానని ఆయన వాగ్దానం చేస్తారు. వ్యక్తిగత శాంతిని ఆయన వాగ్దానం చేస్తారు. ఆయన మందిరంలో పరిశుద్ధ విధులను పొందే అవకాశాన్ని ఆయన వాగ్దానం చేస్తారు. మరియు ఆయన ప్రమాణాలను పాటించడంలో సహనంతో ఉన్నవారికి నిత్యజీవం లభిస్తుందని ఆయన వాగ్దానం చేస్తున్నారు. …
“మనం సేవ చేసే జనులను మనం ప్రేమిస్తున్నాము కాబట్టి, ప్రభువు యొక్క ఆశీర్వాదాలన్నింటిని పొందడానికి మన పరలోక తండ్రి పిల్లలకు అవసరమైన విశ్వాసం మరియు స్వచ్ఛతకు వారిని పైకెత్తడంలో మనమందరం మెరుగ్గా చేయాలనుకుంటున్నాము. …
“… మీరు ప్రభువు యొక్క ప్రమాణాలను స్పష్టంగా మరియు సమర్థన లేకుండా పాటించడం ద్వారా ప్రారంభిస్తారు. ఎంత ఎక్కువగా ప్రపంచం వాటి నుండి తొలగిపోయి వాటిని ఎగతాళి చేస్తుందో, అంతగా వాటిని పాటించడంలో మనం ధైర్యంగా ఉండాలి” (“Standards of Worthiness,” First Worldwide Leadership Training Meeting, Jan. 2003, 10–11).
-
బాప్తిస్మపు ఇంటర్వ్యూ ప్రశ్నలను సమీక్షించండి. ఈ క్రింది వంటి పరిస్థితులలో మీరు ఎలా వ్యవహరిస్తారో పరిగణించండి:
-
ఆ వ్యక్తి తాను చేసిన నేరానికి పరిశీలనలో ఉన్నానని మీకు చెప్పలేదు.
-
జోసెఫ్ స్మిత్ ఒక ప్రవక్తయా అనే ప్రార్థనకు ఆ వ్యక్తి జవాబు పొందలేదు.
-
ఆ వ్యక్తి రెండు రోజుల క్రితం సిగరెట్ తాగాడు.
-
ఆ వ్యక్తి తన ప్రార్థనలకు సమాధానం పొందిందని ఆమెకు ఖచ్చితంగా తెలియదు.
-
ఆ కుటుంబం స్నేహితుల నుండి ఒత్తిడిని ఎదుర్కొంది మరియు వారు బాప్తిస్మమునకు సిద్ధంగా ఉన్నారో లేదో వారికి ఖచ్చితంగా తెలియదు.
-
-
బాప్తిస్మము మరియు నిర్ధారణ ఫారమ్‌ను సమీక్షించండి. మీరు అందించే సమాచారం ఎందుకు సరైనదిగా మరియు పూర్తిగా ఉండాలి?
జిల్లా సలహాసభ, జోన్ సభ్యసమావేశాలు మరియు మిషను నాయకత్వ సలహాసభ
-
బాప్తిస్మపు ఇంటర్వ్యూ యొక్క ప్రాముఖ్యతను సమీక్షించండి. ఇంటర్వ్యూ కోసం సిద్ధం కావడానికి సువార్తికులు జనులకు ఎలా సహాయపడగలరో చర్చించండి.
-
బాప్తిస్మపు సేవలు మరియు నిర్ధారణలను అన్వేషణా అవకాశాలుగా ఎలా ఉపయోగించాలో చర్చించండి.
మిషను నాయకులు మరియు మిషను సలహాదారులు
-
వారు Covenant Path Progress [నిబంధన మార్గ పురోగతి] నివేదికను సమర్థవంతంగా ఉపయోగిస్తున్నారని నిర్ధారించుకోవడానికి స్థానిక యాజకత్వ మరియు నిర్మాణ నాయకులతో కలిసి పని చేయండి.
-
బాప్తిస్మపు ఇంటర్వ్యూ కోసం జనులను ఎలా సిద్ధం చేయాలో జిల్లా నాయకులకు, జోన్ నాయకులకు మరియు శిక్షణనిచ్చే సహోదరి నాయకులకు నేర్పండి. ఈ ఇంటర్వ్యూ కోసం జనులను సిద్ధం చేయడానికి ఇతర సువార్తికులకు శిక్షణ ఇవ్వమని వారిని ఆహ్వానించండి.
-
బాప్తిస్మపు ఇంటర్వ్యూలను ఎలా నిర్వహించాలో జిల్లా మరియు జోన్ నాయకులకు నేర్పండి.
-
ఒక వ్యక్తి తాను తీవ్రమైన పాపం చేశానని వెల్లడించినప్పుడు బాప్తిస్మపు ఇంటర్వ్యూలో ఎలా స్పందించాలో నేర్పండి.
-
వీలైనప్పుడు, కొత్త సభ్యుల కోసం బాప్తిస్మపు సేవలకు హాజరుకండి. కొత్త సభ్యులతో మాట్లాడండి మరియు వారి పరివర్తన అనుభవాల గురించి తెలుసుకోండి. మీరు నేర్చుకున్న వాటిని మీ సహచరుడితో మరియు సువార్తికులతో పంచుకోండి.