“అధ్యాయము 4: ఆత్మను వెదకండి మరియు దానిపై ఆధారపడండి,” నా సువార్తను ప్రకటించండి: యేసు క్రీస్తు యొక్క సువార్తను పంచుకొనుటకు మార్గదర్శి (2023)
“అధ్యాయము 4: ఆత్మను వెదకండి మరియు దానిపై ఆధారపడండి,” నా సువార్తను ప్రకటించండి
అధ్యాయము 4
ఆత్మను వెదకండి మరియు దానిపై ఆధారపడండి
దీనిని పరిగణించండి
-
నా జీవితంలో మరియు సువార్త సేవలో పరిశుద్ధాత్మ శక్తిని కలిగి ఉండడానికి నేను ఏమి చేయగలను?
-
పరివర్తనలో పరిశుద్ధాత్మ యొక్క పాత్ర ఏమిటి?
-
మేము బోధించే వ్యక్తులు, పరిశుద్ధాత్మ యొక్క ప్రభావాన్ని అనుభూతి చెందడానికి నేను ఎలా సహాయం చేయగలను?
-
నా ప్రార్థనలను నేను మరింత అర్థవంతంగా ఎలా చేయగలను?
-
పరిశుద్ధాత్మ ప్రేరేపణలను గుర్తించడాన్ని నేను ఎలా నేర్చుకోగలను?
పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును వెదకండి
పరిశుద్ధాత్మ వరం దేవుడు తన పిల్లలకు ఇచ్చిన గొప్ప బహుమానాలలో ఒకటి. సువార్తికునిగా మీ పనిలో ఇది చాలా ముఖ్యమైనది. బాప్తిస్మం తీసుకోవడానికి, నిర్ధారించబడడానికి మరియు పరివర్తన చెందడానికి మీరు జనులకు సహాయం చేస్తున్నప్పుడు మీకు పరిశుద్ధాత్మ యొక్క మార్గదర్శక, బయల్పరిచే శక్తి అవసరం.
మీ జీవితంలో పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును కలిగియుండడానికి ఆధ్యాత్మిక కార్యము అవసరమవుతుంది. ఈ కార్యము గంభీరమైన ప్రార్థనను మరియు నిరంతర లేఖన అధ్యయనాన్ని కలిపియున్నది. ఇందులో మీ నిబంధనలను మరియు దేవుని ఆజ్ఞలను పాటించడం కూడా ఉంది (మోషైయ 18:8–10, 13 చూడండి). ప్రతీ వారం సంస్కారాన్ని యోగ్యతతో తీసుకోవడం ఇందులో ఉంది (సిద్ధాంతము మరియు నిబంధనలు 20:77, 79 చూడండి).
మీరు ప్రతిరోజూ విభిన్న అవసరాలను మరియు పరిస్థితులను ఎదుర్కొంటారు. ఏమి చేయాలో మరియు ఏమి చెప్పాలో తెలుసుకోవడానికి ఆత్మ నుండి వచ్చే ప్రేరేపణలు మీకు సహాయపడతాయి. మీరు ఆత్మీయ ప్రేరేపణలను విని, వాటి ప్రకారం చేసినప్పుడు, పరిశుద్ధాత్మ మీ సామర్థ్యాలను మరియు సేవను మీరు స్వంతంగా చేయగలిగిన దానికంటే చాలా ఎక్కువ గొప్పగా చేస్తారు. మీ సువార్త సేవ మరియు మీ వ్యక్తిగత జీవితంలోని ప్రతి అంశంలో ఆయన మీకు సహాయం చేస్తారు. (2 నీఫై 32:2–5; ఆల్మా 17:3; హీలమన్ 5:17–19; సిద్ధాంతము మరియు నిబంధనలు 43:15–16; 84:85 చూడండి.)
“రాబోయే దినాలలో, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు, మార్గదర్శకత్వము, ఆదరణ మరియు స్థిరమైన ప్రభావము లేకుండా ఆత్మీయంగా బ్రతికియుండుట సాధ్యముకాదు” (రస్సెల్ ఎమ్. నెల్సన్, “సంఘము కొరకు బయల్పాటు, మన జీవితాల కొరకు బయల్పాటు,” లియహోనా, మే 2018, 96).
క్రీస్తు యొక్క వెలుగు
క్రీస్తు యొక్క వెలుగు “చెడు నుండి మంచిని ఎరుగునట్లు ప్రతి మనుష్యునికి ఇవ్వబడినది” (మొరోనై 7:16; 14–19 వచనాలు చూడండి; యోహాను 1:9 కూడా చూడండి). క్రీస్తు యొక్క వెలుగు అంటే యేసు క్రీస్తు ద్వారా ఇవ్వబడే జ్ఞానోదయం, జ్ఞానం మరియు ప్రభావం. పరిశుద్ధాత్మ వరమును పొందడానికి ఈ ప్రభావం ప్రాథమికమైనది. ఇది యేసు క్రీస్తు యొక్క పునఃస్థాపించబడిన సువార్తను నేర్చుకుని జీవించడానికి గ్రహణశక్తి ఉన్నవారికి మార్గనిర్దేశం చేస్తుంది.
పరిశుద్ధాత్మ
పరిశుద్ధాత్మ యొక్క వ్యక్తిత్వం
పరిశుద్ధాత్మ దైవసమూహములో మూడవ సభ్యుడు. ఆయన ఆత్మ శరీరుడు మరియు మాంసము, ఎముకలు గల శరీరమును కలిగిలేడు (సిద్ధాంతము మరియు నిబంధనలు 130:22 చూడండి). ఆయనే ఆదరణకర్త, తన అనుచరులకు అన్ని విషయాలను బోధిస్తారని మరియు యేసు బోధించిన వాటిని వారికి జ్ఞాపకం చేస్తారని రక్షకుడు ఆయన గురించి వాగ్దానం చేశారు (యోహాను 14:26 చూడండి).
పరిశుద్ధాత్మ శక్తి
బాప్తిస్మమునకు ముందు మనఃపూర్వకముగా సత్యాన్ని అన్వేషించేవారికి లభించే సాక్ష్యం పరిశుద్ధాత్మ శక్తి ద్వారా వస్తుంది. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా జనులందరూ యేసు క్రీస్తు గురించి మరియు పునఃస్థాపించబడిన ఆయన సువార్త గురించి సాక్ష్యాన్ని పొందవచ్చు. “పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మీరు అన్ని సంగతుల యొక్క సత్యమును తెలుసుకొనగలరు” (మొరోనై 10:5).
పరిశుద్ధాత్మ వరము
పరిశుద్ధాత్మ వరము అంటే మనం యోగ్యులుగా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ యొక్క నిరంతర సహవాసాన్ని పొందే హక్కు. నీటి ద్వారా బాప్తిస్మం పొందిన తర్వాత మనం పరిశుద్ధాత్మ వరాన్ని పొందుతాము. ఇది నిర్ధారణ యొక్క విధి ద్వారా ఇవ్వబడుతుంది.
ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ ఇలా అన్నారు: “పరిశుద్ధాత్మ మరియు పరిశుద్ధాత్మ వరానికి మధ్య తేడా ఉంది. కార్నీలియ బాప్తిస్మం పొందే ముందు పరిశుద్ధాత్మను పొందాడు, ఇది సువార్త సత్యాన్ని అతడు ఒప్పుకొనేలా చేసే దేవుని శక్తి, కానీ అతను బాప్తిస్మం తీసుకున్న తర్వాత గానీ పరిశుద్ధాత్మ వరాన్ని పొందలేకపోయాడు” (Teachings of Presidents of the Church: Joseph Smith [2007], 97).
పరిశుద్ధాత్మ వరము మరియు శక్తి ద్వారా మనం శుద్ధి చేయబడతాము—మరింత పవిత్రంగా, మరింత సంపూర్ణంగా, మరింత పూర్తిగా, దేవునిలాగా తయారు చేయబడతాము. మనం దేవునితో చేసే నిబంధనలను పాటిస్తున్నప్పుడు, క్రీస్తు యొక్క విమోచన మరియు పరిశుద్ధాత్మ యొక్క శుద్ధిచేయు శక్తి ద్వారా మనం ఆధ్యాత్మికంగా మళ్ళీ జన్మించగలము (మోషైయ 27:25–26 చూడండి).
పరిశుద్ధాత్మ వాగ్దానము
పరిశుద్ధాత్మను పరిశుద్ధాత్మ వాగ్దానము అని కూడా పిలుస్తారు (సిద్ధాంతము మరియు నిబంధనలు 88:3 చూడండి). ఈ సామర్థ్యంలో, మనం పొందే యాజకత్వ విధులు మరియు మనం చేసే నిబంధనలు దేవునికి ఆమోదయోగ్యమైనవని పరిశుద్ధాత్మ నిర్ధారిస్తారు. పరిశుద్ధాత్మ వాగ్దానం ద్వారా ముద్రవేయబడిన వారు తండ్రి కలిగియున్నవన్నీ పొందుతారు (సిద్ధాంతము మరియు నిబంధనలు 76:51–60; ఎఫెసీయులకు 1:13–14; Guide to the Scriptures, “Holy Spirit of Promise” చూడండి).
ఈ జీవితం తర్వాత చెల్లుబాటు కావాలంటే అన్ని విధులు మరియు నిబంధనలు పరిశుద్ధాత్మ వాగ్దానం ద్వారా ముద్రవేయబడాలి (సిద్ధాంతము మరియు నిబంధనలు 132:7, 18–19, 26 చూడండి). ఆ ముద్ర మన నిరంతర విశ్వాసంపై ఆధారపడి ఉంటుంది.
ఆత్మీయ బహుమానములు
మనల్ని ఆశీర్వదించడానికి మరియు ఇతరులను ఆశీర్వదించడంలో ఉపయోగించడానికి ప్రభువు మనకు ఆత్మీయ బహుమానములు ఇస్తారు (సిద్ధాంతము మరియు నిబంధనలు 46:8– 9, 26 చూడండి). ఉదాహరణకు, కొత్త భాష నేర్చుకునే సువార్తికులు ఇతరులకు వారి మాతృభాషలో బోధించడానికి దైవిక సహాయం పొందేందుకు భాషలు మాట్లాడే బహుమానాన్ని పొందవచ్చు.
మొరోనై 10:8–18, సిద్ధాంతము మరియు నిబంధనలు 46:11–33 మరియు 1 కొరింథీయులకు 12:1–12లో ఆత్మ యొక్క అనేక బహుమానాలు వివరించబడ్డాయి. ఇవి ఆత్మ యొక్క అనేక బహుమానాలలో కొన్ని మాత్రమే. మన విశ్వాసం, మన అవసరాలు మరియు ఇతరుల అవసరాలను బట్టి ప్రభువు మనల్ని ఇతర బహుమానాలతో ఆశీర్వదించవచ్చు.
హృదయపూర్వకంగా ఆత్మీయ బహుమానములను వెదకమని రక్షకుడు మనల్ని ఆహ్వానిస్తున్నారు (సిద్ధాంతము మరియు నిబంధనలు 46:8; 1 కొరింథీయులకు 14:1, 12 చూడండి). ఈ బహుమానములు ప్రార్థన, విశ్వాసం మరియు కృషి ద్వారా—మరియు దేవుని చిత్తప్రకారం వస్తాయి.
వ్యక్తిగత లేదా సహచర అధ్యయనము
పరిశుద్ధాత్మ స్వభావం మరియు పాత్ర గురించి వివరణ రాయండి.
అపొస్తలుల కార్యములు 4:1–33 చదవండి.
-
పేతురు మరియు యోహాను ఆత్మీయ బహుమానములను ఎలా వెదికారు?
-
దేవుడు వారి ప్రార్థనలకు ఏవిధంగా జవాబిచ్చారు?
-
మీ స్వంత పని గురించి ఈ అనుభవం నుండి మీరు ఏమి నేర్చుకోగలరు?
పరివర్తనలో ఆత్మ యొక్క శక్తి
పరిశుద్ధాత్మ శక్తి ద్వారా పరివర్తన జరుగుతుంది. ఒక వ్యక్తి జీవితంలోకి ఆత్మ యొక్క శక్తిని తీసుకురావడానికి సహాయపడడమే మీ పాత్ర. మీరు దీనిని చేయగల కొన్ని మార్గాలు క్రింద సూచించబడ్డాయి.
-
ప్రార్థించడం, లేఖనాలను పరిశోధించడం మరియు మీ నిబంధనలను పాటించడం ద్వారా ఆత్మను మీతో కలిగియుండడానికి ప్రయత్నించండి.
-
రక్షకుని గురించి మరియు పునఃస్థాపన సందేశం గురించి ఆత్మ ద్వారా బోధించండి. ప్రతి వ్యక్తి అవసరాలకు అనుగుణంగా మీ సందేశాన్ని మార్చుకోవడంలో ఆత్మ మార్గదర్శకత్వాన్ని అనుసరించండి.
-
మీరు బోధించేది సత్యమని పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మీకు తెలుసని సాక్ష్యమివ్వండి. మీరు సాక్ష్యమిస్తున్నప్పుడు, పరిశుద్ధాత్మ ఇతరులకు సాక్ష్యమివ్వగలరు.
-
చర్య తీసుకోవడానికి జనులను ఆహ్వానించండి మరియు వారి వాగ్దానాలను పాటించడంలో వారికి మద్దతు ఇవ్వండి. జనులు వాగ్దానాలను పాటిస్తున్నప్పుడు, వారు పరిశుద్ధాత్మ శక్తిని మరింత బలంగా అనుభవిస్తారు. 11వ అధ్యాయం చూడండి.
-
ఒక ఆహ్వానంపై వారు చర్య తీసుకున్నప్పుడు వారి అనుభవాల గురించి జనులను అడగండి. వారు పశ్చాత్తాపపడినప్పుడు, ఆజ్ఞలను పాటించినప్పుడు మరియు వారి వాగ్దానాలను పాటించినప్పుడు వారి విశ్వాసం పెరుగుతుంది. వారితో పనిచేస్తున్న ఆత్మను గుర్తించడంలో వారికి సహాయపడండి.
అధ్యక్షులు ఎమ్. రస్సెల్ బాల్లర్డ్ ఇలా బోధించారు: “నిజమైన పరివర్తన ఆత్మ యొక్క శక్తి ద్వారా వస్తుంది. ఆత్మ హృదయాన్ని తాకినప్పుడు, హృదయాలు మారతాయి. వ్యక్తులు … ఆత్మ తమతో పనిచేస్తున్నట్లు భావించినప్పుడు లేదా వారి జీవితాల్లో ప్రభువు ప్రేమ మరియు దయ యొక్క రుజువును చూసినప్పుడు, వారు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెంది బలపడతారు మరియు ఆయనపై వారి విశ్వాసం పెరుగుతుంది. ఒక వ్యక్తి వాక్యంపై ప్రయోగం చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఆత్మతో ఈ అనుభవాలు సహజంగానే వస్తాయి [ఆల్మా 32:27 చూడండి]. ఈ విధంగా మనం సువార్త నిజమనే అనుభూతి పొందుతాము” (“Now Is the Time,” Ensign, Nov. 2000, 75).
వ్యక్తిగత లేదా సహచర అధ్యయనము
-
క్రింది గద్యభాగాలలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వాటిని అధ్యయనం చేయండి. మీరు చదువుతున్నప్పుడు, పరివర్తన ప్రక్రియలో ఒక వ్యక్తి ఏమి భావిస్తున్నాడో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీ మనోభావాలను మీ అధ్యయన పుస్తకంలో నమోదు చేసుకోండి. మీ అంతర్దృష్టులను ఇతర సువార్తికులు మరియు సభ్యులతో చర్చించండి.
2 నీఫై 4:16–35; ఈనస్ 1; మోషైయ 4–5; 18:7–14; 27–28; ఆల్మా 5; 17–22; 32; 36; 38
-
క్రింది గద్యభాగాలలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వాటిని అధ్యయనం చేయండి. మీరు చదువుతున్నప్పుడు, ఆత్మ యొక్క పరివర్తన శక్తితో మీరు బాగా ఎలా బోధించవచ్చో పరిగణించండి. మీ అభిప్రాయాలను మరియు మనోభావాలను మీ అధ్యయన పుస్తకంలో నమోదు చేసుకోండి. మీ ఆలోచనలను ఇతర సువార్తికులు మరియు సభ్యులతో చర్చించండి.
1 నీఫై 8:11–12; మోషైయ 28:1–4; ఆల్మా 26; 29; 31:26–38; 32; మొరోనై 7:43–48; సిద్ధాంతము మరియు నిబంధనలు 4; 18:10–16; 50:21–22.
లేఖన అధ్యయనము
మీ పనిలో ఆత్మ యొక్క శక్తి గురించి ఈ క్రింది లేఖనాలు ఏమి బోధిస్తాయి?
-
అపొస్తలుల కార్యములు 2:37–38
-
1 కొరింథీయులకు 2:11–14
మీ పనిలో ఆత్మ యొక్క శక్తిని కలిగియుండడానికి మీరు ఏమి చేయగలరు?
-
యోహాను 7:17
యేసు క్రీస్తునందు విశ్వాసంతో ప్రార్థించండి
ఇతరులు పరివర్తన చెందడంలో సహాయపడడానికి, మీరు ఆత్మ యొక్క శక్తితో బోధించాలి (సిద్ధాంతము మరియు నిబంధనలు 50:13–14, 17–22 చూడండి). “విశ్వాస సహితమైన ప్రార్థన ద్వారా ఆత్మ మీకు అనుగ్రహించబడును; మీరు ఆత్మను పొందనియెడల, మీరు బోధించరాదు” (సిద్ధాంతము మరియు నిబంధనలు 42:14) అని ప్రభువు చెప్పారు.
మీరు మీ బోధనలో సహాయం కోసం ప్రార్థించినప్పుడు, పరిశుద్ధాత్మ శక్తి మీ బోధనలను “నరుల సంతానము యొక్క హృదయములకు కొనిపోవును” (2 నీఫై 33:1). మీరు ఆత్మ ద్వారా బోధించినప్పుడు మరియు ఇతరులు ఆత్మ ద్వారా స్వీకరించినప్పుడు, మీరు “ఒకరినొకరు అర్థము చేసుకొందురు” మరియు “ఆత్మీయాభివృద్ధిని పొంది, కలిసి ఆనందించెదరు” (సిద్ధాంతము మరియు నిబంధనలు 50:22).
ఎలా ప్రార్థించాలి
ఎలా ప్రార్థించాలో యేసు మనకు బోధించారు (మత్తయి 6:9–13; 3 నీఫై 18:19 చూడండి). పరిశుద్ధాత్మ నుండి మీరు పొందే ప్రేరేపణలపై పనిచేయడానికి మనఃపూర్వకంగా మరియు నిజమైన ఉద్దేశ్యంతో ప్రార్థించండి. ప్రభావవంతమైన ప్రార్థనకు వినయపూర్వకమైన, నిరంతర కృషి అవసరం (మొరోనై 10:3–4; సిద్ధాంతము మరియు నిబంధనలు 8:10 చూడండి.)
దేవునితో ప్రేమపూర్వకమైన, ఆరాధనాపూర్వకమైన సంబంధాన్ని తెలియజేసే భాషను ఉపయోగించండి. ఇంగ్లీషులో, నువ్వు, నీ మరియు నీ యొక్క అనే సర్వనామాలకు బదులుగా మీకు, మీరు, మీ మరియు మీ యొక్క వంటి లేఖనాధారిత భాషను ఉపయోగించండి.
ఎల్లప్పుడూ కృతజ్ఞతను వ్యక్తపరచండి. కృతజ్ఞతతో ఉండడానికి బుద్ధిపూర్వక ప్రయత్నం చేయడం, దేవుడు మీ జీవితంలో ఎంత దయ చూపారో గుర్తించడానికి మీకు సహాయపడుతుంది. ఇది మీ హృదయాన్ని మరియు మనస్సును ప్రేరణ కొరకు తెరుస్తుంది.
దాతృత్వం మీకు అనుగ్రహించబడాలని “హృదయము యొక్క పూర్ణ శక్తితో” ప్రార్థించండి (మొరోనై 7:48). ఇతరుల కోసం పేరు పేరున ప్రార్థించండి. మీరు బోధిస్తున్న వారి కోసం ప్రార్థించండి. క్రీస్తు యొద్దకు రావడానికి మీరు వారిని ఎలా ఆహ్వానిస్తారో మరియు వారికి ఎలా సహాయం చేస్తారో తెలుసుకోవడానికి ప్రేరేపణను కోరండి.
వ్యక్తిగత అధ్యయనము
మత్తయి 6:9–13లో ఉన్న ప్రభువు యొక్క ప్రార్థనను అధ్యయనం చేయండి. మిమ్మల్ని మీరు ఈ క్రింది ప్రశ్నలు అడగండి మరియు మీ అధ్యయన పుస్తకంలో మనోభావాలను నమోదు చేసుకోండి.
-
సువార్తికునిగా మీ ప్రస్తుత బాధ్యత మీ ప్రార్థనలను ఎలా ప్రభావితం చేస్తుంది?
-
మీ ప్రార్థనలు ఇతరుల జీవితాలను ఏ విధాలుగా ఆశీర్వదించడానికి ప్రయత్నిస్తున్నాయి?
-
శోధనను అధిగమించగలగడానికి మీరు ఎలా ప్రార్థిస్తున్నారు?
-
మీ ఆధ్యాత్మిక మరియు భౌతిక అవసరాలను తీర్చడంలో సహాయం కోసం మీరు ఎలా ప్రార్థిస్తారు?
-
మీరు ప్రార్థన చేసేటప్పుడు దేవునికి ఎలా మహిమను ఇస్తారు?
ఎప్పుడు ప్రార్థించాలి
మీరు ఎప్పుడు ప్రార్థించాలి? “శ్రద్ధగా వెదకుడి; ఎల్లప్పుడు ప్రార్థించుడి, నమ్మికగలవారిగా ఉండుడి, మీ మేలుకొరకు సమస్తము సమకూడి జరుగును” అని ప్రభువు చెప్పారు (సిద్ధాంతము మరియు నిబంధనలు 90:24).
“నీ కార్యములన్నిటిలో ప్రభువుతో ఆలోచన చేయుము మరియు ఆయన నిన్ను మేలు కొరకు నడిపించును; నీ నిద్రలో ప్రభువు నీపై కావలికాయునట్లు, రాత్రియందు నీవు పరుండుము మరియు ఉదయమందు నీవు లేచునప్పుడు నీ హృదయము దేవునిపట్ల కృతజ్ఞతలతో నిండియుండనిమ్ము” అని ఆల్మా చెప్పాడు (ఆల్మా 37:37; 34:17–27 కూడా చూడండి).
ప్రార్థన చేయడానికి నిశ్శబ్దమైన, ఏకాంత సమయాలను కేటాయించమని ప్రభువు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు: “నీ గది లోనికి వెళ్ళి తలుపువేసి, … నీ తండ్రికి ప్రార్థన చేయుము” (3 నీఫై 13:6; 7–13 వచనాలు కూడా చూడండి).
అధ్యక్షులు గార్డన్ బి. హింక్లి ఇలా బోధించారు: “ప్రతి ఉదయం…, సువార్తికులు మోకాళ్లపై నిలబడి, తమ నాలుకలను వదులు చేసి, వారు బోధించే వారిని దీవించడం కోసం తమ ద్వారా మాట్లాడమని ప్రభువును వేడుకోవాలి. వారు ఇలా చేస్తే, వారి జీవితాల్లోకి కొత్త వెలుగు వస్తుంది. పని పట్ల ఎక్కువ ఉత్సాహం ఉంటుంది. వాస్తవానికి, వారు ప్రభువు తరఫున మాట్లాడే సేవకులని వారు తెలుసుకుంటారు” (“Missionary Service,” First Worldwide Leadership Training Meeting, Jan. 11, 2003, 20).
మనం ప్రార్థించేటప్పుడు దేవుణ్ణి విశ్వసించడం
దేవునిపై విశ్వాసం కలిగి ఉండడం అంటే ఆయనను నమ్మడం. దీనిలో ఆయన చిత్తాన్ని మరియు మీ ప్రార్థనలకు సమాధానం ఇవ్వడంలో ఆయన సమయాన్ని నమ్మడం కూడా ఉంది (యెషయా 55:8–9 చూడండి). అధ్యక్షులు డాలిన్ హెచ్. ఓక్స్ ఇలా బోధించారు:
“మన విశ్వాసం ఎంత బలంగా ఉన్నా, మనం ఎవరి యందు విశ్వాసం కలిగి ఉన్నామో ఆయన చిత్తానికి విరుద్ధంగా అది ఫలితాన్ని ఇవ్వదు. మీ ప్రార్థనలకు మీరు కోరుకున్న విధంగా లేదా కోరుకున్న సమయంలో సమాధానం లభించనప్పుడు దానిని గుర్తుంచుకోండి. ప్రభువైన యేసు క్రీస్తుపై విశ్వాసం యొక్క సాధన ఎల్లప్పుడూ పరలోక క్రమానికి, ప్రభువు యొక్క మంచితనం, చిత్తం, జ్ఞానం మరియు సమయానికి లోబడి ఉంటుంది. ప్రభువుపై మనకు ఆ రకమైన విశ్వాసం మరియు నమ్మకం ఉన్నప్పుడు, మన జీవితాల్లో నిజమైన భద్రత మరియు ప్రశాంతత ఉంటుంది” (“The Atonement and Faith,” Ensign, Apr. 2010, 30).
సమాధానం దొరకని ప్రార్థనల గురించి అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఇలా అన్నారు:
“ఆ అనుభూతి నాకు తెలుసు! అలాంటి క్షణాల భయాలు మరియు కన్నీళ్లు నాకు తెలుసు. కానీ మన ప్రార్థనలు ఎప్పుడూ విస్మరించబడవని కూడా నాకు తెలుసు. మన విశ్వాసం ఎప్పుడూ ప్రశంసించబడకుండా ఉండదు. సర్వ జ్ఞాని అయిన పరలోక తండ్రి యొక్క దృక్పథం మన దృక్పథం కంటే చాలా విస్తృతమైనదని నాకు తెలుసు. మన మర్త్య సమస్యలు మరియు బాధల గురించి మనకు తెలిసినప్పటికీ, మన అమర్త్య పురోగతి మరియు సామర్థ్యం గురించి ఆయనకు తెలుసు. మనం ఆయన చిత్తాన్ని తెలుసుకోవడానికి ప్రార్థిస్తే మరియు సహనంతో, ధైర్యంతో మనల్ని మనం దానికి సమర్పించుకుంటే, ఆయన స్వంత మార్గంలో మరియు సమయంలో పరలోక స్వస్థత కలుగుతుంది” (“Jesus Christ—the Master Healer,” Liahona, Nov. 2005, 86).
ఆత్మ యొక్క ప్రేరేపణలను గుర్తించడాన్ని నేర్చుకోండి
మీరు మరియు మీరు బోధించే వ్యక్తులు ఆత్మ నుండి వచ్చే సంభాషణలను గుర్తించడాన్ని నేర్చుకోవడం చాలా ముఖ్యం. ఆత్మ సాధారణంగా మీ భావాలు, మనస్సు మరియు హృదయం ద్వారా నిశ్శబ్దంగా సంభాషిస్తారు. గాలిలో, భూకంపములో లేదా అగ్నిలో ప్రభువు స్వరము లేదు—కానీ అది “మిక్కిలి నిమ్మళముగా మాటలాడు ఒక స్వరము,” (1 రాజులు 19:12) అని ప్రవక్త ఏలీయా కనుగొన్నాడు. అది “ఉరుము యొక్క స్వరము కాదు,” కానీ బదులుగా “గుసగుస వంటి పరిపూర్ణ మృదుత్వము యొక్క నిర్మలమైన స్వరము,” అయినప్పటికీ అది “సూటిగా ఆత్మకు కూడా గ్రుచ్చుకొనెను” (హీలమన్ 5:30).
ఆత్మ నుండి వచ్చే సంభాషణలు వేర్వేరు వ్యక్తులకు భిన్నంగా అనిపించవచ్చు. ఈ సంభాషణలు ఎలా అనిపించినా, వాటిని ఎలా గుర్తించాలో లేఖనాలు బోధిస్తాయి. ఉదాహరణకు, ఆత్మ మిమ్మల్ని బలపరుస్తారు మరియు మంచి చేయడానికి మిమ్మల్ని నడిపిస్తారు. ఆయన మీ మనస్సును ప్రకాశవంతం చేస్తారు. మీరు వినయంగా నడుచుకునేలా మరియు నీతిగా తీర్పు తీర్చేలా ఆయన మిమ్మల్ని నడిపిస్తారు. (సిద్ధాంతము మరియు నిబంధనలు 11:12–14 మరియు ఈ విభాగంలో తరువాత ఉన్న “వ్యక్తిగత అధ్యయనం” పెట్టె చూడండి.)
“ఆత్మ యొక్క ప్రేరేపణలను మనం ఎలా గుర్తిస్తాము?” అనే ప్రశ్నకు సమాధానంగా అధ్యక్షులు గార్డన్ బి. హింక్లి మొరోనై 7:13, 16–17 చదివారు. తర్వాత ఆయన ఇలా చెప్పారు:
“అన్నీ చెప్పి, చేసిన తర్వాత అదే పరీక్ష. అది మంచి చేయడానికి, ఎదగడానికి, ఉన్నతంగా నిలబడడానికి, సరైన పని చేయడానికి, దయగా ఉండడానికి, ఉదారంగా ఉండడానికి ఒకరిని ప్రేరేపిస్తుందా? అప్పుడు అది దేవుని ఆత్మ నుండి వచ్చింది. …
“… అది మంచి చేయడానికి ఆహ్వానిస్తే, అది దేవుని నుండి వచ్చింది. అది చెడు చేయడానికి ఆహ్వానిస్తే, అది అపవాది నుండి వచ్చింది. … మీరు సరైన పని చేస్తుంటే మరియు మీరు సరైన మార్గంలో జీవిస్తుంటే, ఆత్మ మీకు చెప్పేదానిని మీరు మీ హృదయంలో తెలుసుకుంటారు.
“ఆత్మ ఫలాల ద్వారా ఆత్మ యొక్క ప్రేరేపణలను మీరు గుర్తిస్తారు—జ్ఞానోదయం కలిగించేది, నిర్మించేది, సానుకూలమైనది, నిశ్చయాత్మకమైనది, ఉద్ధరించేది మరియు మనల్ని మంచి ఆలోచనలు, మంచి మాటలు మరియు మంచి పనులకు నడిపించేది దేవుని ఆత్మ నుండి వచ్చింది” (Teachings of Gordon B. Hinckley [1997], 260–61).
మీరు పరిశుద్ధాత్మ నడిపింపును వెదికి, అనుసరించినప్పుడు, ఆయన ప్రేరేపణలను వివేచించి అర్థం చేసుకునే మీ సామర్థ్యం కాలక్రమేణా అభివృద్ధి చెందుతుంది (2 నీఫై 28:30 చూడండి). ఆత్మ యొక్క భాషకు మరింత అనుగుణంగా మారడం కొన్ని విధాలుగా మరొక భాషను నేర్చుకోవడం వలె ఉన్నది. అది శ్రద్ధ మరియు ఓపికగల ప్రయత్నము అవసరమయ్యే క్రమమైన ప్రక్రియ.
హృదయపూర్వక ఉద్దేశ్యంతో పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును వెదకండి. మీరు ఇతర విషయాలలో నిమగ్నమై ఉంటే, మీరు ఆత్మ యొక్క సున్నితమైన గుసగుసలను గ్రహించకపోవచ్చు. లేదా ఆయన ప్రేరేపణలపై చర్య తీసుకోవడానికి వినయపూర్వకమైన సంకల్పంతో మీరు ఆయన ప్రభావాన్ని కోరుకునే వరకు ఆయన సంభాషించడానికి వేచి ఉండవచ్చు.
లోకంలోని స్వరాలు మీ దృష్టి కోసం పోటీ పడతాయి. మీరు మీ హృదయంలో ఆత్మకు స్థానం ఇవ్వకపోతే అవి ఆధ్యాత్మిక మనోభావాలను సులభంగా తిప్పికొట్టగలవు. ప్రభువు నుండి వచ్చిన ఈ సలహాను గుర్తుంచుకోండి: “ఊరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకొనుడి” (కీర్తన 46:10; సిద్ధాంతము మరియు నిబంధనలు 101:16 కూడా చూడండి).
“మనస్సుకు ఆలోచనలు, హృదయానికి భావాలు, కలలు, … మరియు ప్రేరేపణ వంటి వివిధ రకాల నమూనాలను ఉపయోగించి దేవుడు తన కుమారులు మరియు కుమార్తెలకు బయల్పాటులను తెలియజేస్తారు. కొన్ని బయల్పాటులు వెంటనే మరియు తీవ్రంగా పొందబడతాయి; కొన్ని క్రమంగా మరియు సూక్ష్మంగా గుర్తించబడతాయి. దేవుని నుండి బయల్పాటులను పొందడం, గుర్తించడం మరియు వాటికి ప్రతిస్పందించడం అనేవి మనమందరం కోరుకోవలసిన మరియు తగిన విధంగా వెదకవలసిన ఆధ్యాత్మిక బహుమానాలు” (David A. Bednar, “The Spirit of Revelation in the Work,” 2018 mission leadership seminar).
వ్యక్తిగత అధ్యయనము
క్రింది పట్టికలోని లేఖనాలను అధ్యయనం చేయండి. ఈ వచనాలలో వివరించబడిన భావాలు, ఆలోచనలు లేదా మనోభావాలను మీరు అనుభవించిన సమయాల గురించి ఆలోచించండి. మీరు అధ్యయనం చేసి అనుభవాన్ని పొందుతున్నప్పుడు, ఈ జాబితాకు ఇతర లేఖనాలను జోడించండి. ఇతరులు ఆత్మను అనుభూతి చెందడానికి మరియు గుర్తించడానికి సహాయపడేందుకు మీరు ఈ సూత్రాలను ఎలా ఉపయోగించగలరో ఆలోచించండి.
|
సిద్ధాంతము మరియు నిబంధనలు 6:23; 11:12–14; 88:3; యోహాను 14:26–27; రోమా 15:13; గలతీయులకు 5:22–23 |
ప్రేమ, ఆనందం, శాంతి, ఓదార్పు, సహనం, సాత్వికత, సౌమ్యత, విశ్వాసం మరియు నిరీక్షణ యొక్క అనుభూతులను ఇస్తుంది. |
|
ఆల్మా 32:28; సిద్ధాంతము మరియు నిబంధనలు 6:14–15; 8:2–3; 1 కొరింథీయులకు 2:9–11 |
ప్రకాశింపజేస్తుంది మరియు మనస్సులో ఆలోచనలను, హృదయంలో భావాలను ఇస్తుంది. |
|
లేఖనాలు బలమైన ప్రభావాన్ని కలిగియుండడంలో సహాయపడుతుంది. | |
|
చీకటిని వెలుగుతో భర్తీ చేస్తుంది. | |
|
చెడును నివారించి, ఆజ్ఞలను పాటించాలనే కోరికను బలపరుస్తుంది. | |
|
మొరోనై 10:5; సిద్ధాంతము మరియు నిబంధనలు 21:9; 100:8; యోహాను 14:26; 15:26; 16:13 |
సత్యాన్ని బోధిస్తుంది మరియు దానిని జ్ఞాపకం చేస్తుంది. |
|
మార్గనిర్దేశం చేస్తుంది మరియు మోసం నుండి రక్షిస్తుంది. | |
|
2 నీఫై 31:18; సిద్ధాంతము మరియు నిబంధనలు 20:27; యోహాను 16:13–14 |
తండ్రియైన దేవుడు మరియు యేసు క్రీస్తును మహిమపరుస్తుంది మరియు సాక్ష్యమిస్తుంది. |
|
సిద్ధాంతము మరియు నిబంధనలు 42:16; 84:85; 100:5–8; లూకా 12:11–12 |
వినయపూర్వకమైన బోధకుల మాటలను నడిపిస్తుంది. |
|
మొరోనై 10:8–17; సిద్ధాంతము మరియు నిబంధనలు 46:8–26; 1 కొరింథీయులకు 12 |
ఆత్మ యొక్క వరములను ఇస్తుంది. |
|
దేనికోసం ప్రార్థించాలో చెబుతుంది. | |
|
ఏమి చేయాలో చెబుతుంది. | |
|
నీతిమంతులు శక్తితో మరియు అధికారంతో మాట్లాడడానికి సహాయపడుతుంది. | |
|
శుద్ధిచేస్తుంది మరియు పాప పరిహారం చేస్తుంది. | |
|
వినేవారి హృదయానికి సత్యాన్ని తీసుకువెళుతుంది. | |
|
1 నీఫై 18:1–3; నిర్గమకాండము 31:3–5 |
నైపుణ్యాలు మరియు సామర్థ్యాలను పెంచుతుంది. |
|
1 నీఫై 7:15; 2 నీఫై 28:1; 32:7; ఆల్మా 14:11; మోర్మన్ 3:16; ఈథర్ 12:2 |
ముందుకు సాగమని ప్రోత్సహిస్తుంది లేదా వెనక్కి లాగి ఉంచుతుంది. |
|
బోధకుడు మరియు విద్యార్థులు ఇరువురినీ బలపరుస్తుంది. |
ఆత్మపై ఆధారపడండి
ప్రభువు యొక్క సేవకుడిగా, మీరు ఆయన పనిని ఆయన మార్గంలో మరియు ఆయన శక్తితో చేయాలి. “పరిశుద్ధాత్మ లేకుండా ఏ వ్యక్తి సువార్తను ప్రకటించలేడు” అని ప్రవక్త జోసెఫ్ స్మిత్ బోధించారు (Teachings: Joseph Smith, 332).
మీ పనిలోని ప్రతి అంశంలోనూ మిమ్మల్ని నడిపించడానికి ఆత్మను విశ్వసించండి. ఆయన మీకు జ్ఞానోదయం కలిగించి, ప్రేరేపిస్తారు. బోధించడానికి జనులను కనుగొనడంలో ఆయన మీకు సహాయం చేస్తారు మరియు మీ బోధనకు శక్తిని తెస్తారు. మీరు సభ్యులకు, తిరిగి వస్తున్న సభ్యులకు మరియు కొత్తగా పరివర్తన చెందినవారికి వారి విశ్వాసాన్ని బలోపేతం చేసుకోవడానికి సహాయం చేస్తున్నప్పుడు, ఆయన మీకు సహాయం చేస్తారు.
కొంతమంది సువార్తికులు తమపై తాము నమ్మకంగా ఉంటారు. మరికొందరికి అలాంటి నమ్మకం ఉండదు. వినయంగా మీ నమ్మకాన్ని మరియు విశ్వాసాన్ని మీపై కాకుండా యేసు క్రీస్తుపై ఉంచండి. మీ స్వంత ప్రతిభలు మరియు సామర్థ్యాల మీద కంటే ఆత్మపై ఆధారపడండి. మీరు మీ స్వంతంగా చేయగలిగే దానిని మించి పరిశుద్ధాత్మ మీ ప్రయత్నాలను చాలా గొప్పగా చేస్తారు.
లేఖన అధ్యయనము
ఈ క్రింది లేఖనాలను అధ్యయనం చేసి, మీరు ప్రతిరోజూ అడగవలసిన ఈ ముఖ్యమైన ప్రశ్నలకు అవి ఎలా సమాధానం ఇస్తాయో పరిశీలించండి. ఈ భాగాలలోని బోధనలను మీ అన్వేషణ ప్రయత్నాలు, ప్రణాళిక సభలు, వ్యక్తిగత మరియు సహచర అధ్యయనానికి మీరు ఎలా అన్వయించవచ్చు? బోధించడానికి, వాగ్దానాలు చేయడానికి జనులను ఆహ్వానించడానికి మరియు వాగ్దానాల గురించి ప్రశ్నించడానికి మీ ప్రయత్నాలకు మీరు ఈ భాగాలను ఎలా అన్వయించవచ్చు?
నేను ఎక్కడికి వెళ్లాలి?
నేనేమి చేయాలి?
నేనేమి చెప్పాలి?
-
మత్తయి 10:19–20
-
మార్కు 13:11
-
1 కొరింథీయులకు 2:4–5, 12–13
-
నిర్గమకాండము 4:10–12
నా బోధనలో నేను లేఖనాలను ఏ విధంగా ఉపయోగించాలి?
-
లూకా 24:13–32
కొన్ని హెచ్చరిక మాటలు
మీ మనోభావాలను విశ్వసనీయ వనరులతో ధృవీకరించండి
మీరు ప్రేరేపణ కోసం ప్రార్థిస్తున్నప్పుడు, మీ ఆధ్యాత్మిక మనోభావాలను లేఖనాలతో మరియు సజీవ ప్రవక్తల బోధనలతో పోల్చండి. ఆత్మ నుండి వచ్చే మనోభావాలు ఈ వనరులతో సరిపోలుతాయి.
మీ నియామకంలో బయల్పాటును వెదకండి
మీరు పొందే భావాలు మీ నియామకంతో ఏకరీతిగా ఉన్నాయని నిర్ధారించుకోండి. మీరు సరైన అధికారముచేత పిలువబడితే తప్ప, ఇతరులకు సలహా ఇవ్వడానికి లేదా సరిదిద్దడానికి ఆత్మ నుండి మనోభావాలు మీకివ్వబడవు. ఉదాహరణకు, ఒక బిషప్పు తన పిలుపులో ఏమి చేయాలో చెప్పడానికి మీరు బయల్పాటును పొందలేరు.
ఆత్మ యొక్క నిజమైన ప్రభావాన్ని వివేచించండి
అధ్యక్షులు హావర్డ్ డబ్ల్యు. హంటర్ ఇలా సలహా ఇచ్చారు: “నేను ఒక హెచ్చరిక మాట చెబుతున్నాను. … మనం జాగ్రత్తగా లేకపోతే …, మనం ప్రభువు ఆత్మ యొక్క నిజమైన ప్రభావాన్ని అనర్హమైన మరియు మోసపూరిత మార్గాల ద్వారా కృత్రిమంగా కల్పించడానికి ప్రయత్నించడాన్ని ప్రారంభించవచ్చు. బలమైన భావోద్వేగం లేదా స్వేచ్ఛగా ప్రవహించే కన్నీళ్లు ఆత్మ యొక్క ఉనికితో సమానం అయినట్లు కనిపించినప్పుడు నేను ఆందోళన చెందుతాను. ఖచ్చితంగా ప్రభువు యొక్క ఆత్మ కన్నీళ్లతో సహా బలమైన భావోద్వేగ భావాలను తీసుకురాగలదు, కానీ ఆ బాహ్య వ్యక్తీకరణను ఆత్మ యొక్క ఉనికితో అయోమయం చేయకూడదు” (The Teachings of Howard W. Hunter [1997], 184).
ఆధ్యాత్మిక విషయాలను బలవంతం చేయడానికి ప్రయత్నించవద్దు
ఆధ్యాత్మిక విషయాలు బలవంతం చేయబడలేవు. మీరు ఆత్మను ఆహ్వానించే వైఖరిని, వాతావరణాన్ని కల్పించవచ్చు మరియు మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవచ్చు, కానీ ప్రేరేపణ ఎలా లేదా ఎప్పుడు వస్తుందో మీరు నిర్దేశించలేరు. ఓపికగా ఉండండి మరియు సరైన సమయం వచ్చినప్పుడు మీకు అవసరమైన దానిని పొందుతారని నమ్మండి.
ఆధ్యాత్మిక అనుభవాలను పవిత్రంగా ఉంచుకోండి
ఒక సువార్తికునిగా, మీరు మీ జీవితంలో ఆధ్యాత్మిక అనుభవాల గురించి ఇంతకు ముందు కంటే ఎక్కువగా తెలుసుకుని ఉండవచ్చు. ఈ అనుభవాలు పవిత్రమైనవి మరియు సాధారణంగా మీ స్వంత మెరుగుదల, బోధన లేదా దిద్దుబాటు కోసం ఉంటాయి.
ఈ అనుభవాలలో చాలా వాటిని వ్యక్తిగతంగా ఉంచడం ఉత్తమం. మీరు అలా చేయడం ద్వారా ఇతరులను ఆశీర్వదించవచ్చని ఆత్మ సూచించినప్పుడు మాత్రమే పంచుకోండి (ఆల్మా 12:9; సిద్ధాంతము మరియు నిబంధనలు 63:64; 84:73 చూడండి).
కొన్ని సందర్భాలలో మీ స్వంత ఉత్తమ తీర్పును ఉపయోగించండి
కొన్నసార్లు అన్ని విషయాలందు ఆత్మచేత నడిపించబడాలని మనము కోరతాము. అయితే, తరచుగా ప్రభువు మన స్వంత ఉత్తమ తీర్పును ఉపయోగించి వ్యవహరించాలని కోరుకుంటారు (సిద్ధాంతము మరియు నిబంధనలు 60:5; 61:22; 62:5) చూడండి). అధ్యక్షులు డాలిన్ హెచ్. ఓక్స్ ఇలా బోధించారు:
“ప్రభువు చేత నడిపించబడాలనే కోరిక ఒక బలం, కానీ మన పరలోక తండ్రి చాలా నిర్ణయాలను మన వ్యక్తిగత ఎంపికల కొరకు వదిలివేస్తారని అర్థం చేసుకోవడం దానికి అవసరం. వ్యక్తిగత నిర్ణయం తీసుకోవడం అనేది మనం మర్త్యత్వంలో అనుభవించాల్సిన ఎదుగుదల యొక్క మూలాల్లో ఒకటి. అన్ని నిర్ణయాలు తీసుకోవడాన్ని ప్రభువు వైపుకు మరల్చడానికి ప్రయత్నించేవారు మరియు ప్రతి ఎంపికలో బయల్పాటు కోసం వేడుకునే వ్యక్తులు, మార్గదర్శకత్వం కోసం ప్రార్థించి దానిని పొందని పరిస్థితులను త్వరలో కనుగొంటారు. ఉదాహరణకు, ఎంపికలు అల్పమైనవిగా లేదా రెండు ఎంపికలలో ఏదైనా ఆమోదయోగ్యమైనదిగా ఉన్న అనేక పరిస్థితులలో ఇది జరిగే అవకాశం ఉంది.
“మన సృష్టికర్త మనలో ఉంచిన తార్కిక శక్తులను ఉపయోగించి, మన మనస్సులలో మనం విషయాలను అధ్యయనం చేయాలి. అప్పుడు మనం నడిపింపు కోసం ప్రార్థించాలి మరియు దానిని పొందినట్లయితే, దానిపై చర్య తీసుకోవాలి. మనము నడిపింపును పొందకపోతే, మన ఉత్తమమైన తీర్పును మనం అమలు చేయాలి. ప్రభువు మనకు నిర్దేశించని అంశాలపై బయల్పాటు సహిత మార్గదర్శకత్వం కోరుతూ పట్టుదలతో ఉన్న వ్యక్తులు తమ స్వంత ఊహ లేదా పక్షపాతంతో సమాధానాన్ని కల్పించుకోవచ్చు లేదా తప్పుడు బయల్పాటు మాధ్యమం ద్వారా కూడా సమాధానాన్ని పొందవచ్చు” (“Our Strengths Can Become Our Downfall,” Ensign, Oct. 1994, 13–14).
లేఖన అధ్యయనము
ఆత్మపై ఆధారపడడం చాలా ముఖ్యమైనది, అందుకే ఆత్మను తిరస్కరించవద్దని లేదా పోగొట్టుకోవద్దని ప్రభువు మనల్ని హెచ్చరిస్తున్నారు. ఈ క్రింది లేఖన గద్యభాగాల నుండి మీరు ఏమి నేర్చుకుంటారు?
-
1 థెస్సలొనీకయులకు 5:19–20
అధ్యయనము మరియు అన్వయము కొరకు ఉపాయములు
వ్యక్తిగత అధ్యయనము
-
ఒక పేజీని రెండు నిలువు వరుసలుగా విభజించండి. ఒక నిలువు వరుసలో “ప్రభువు ఏమి చేసారు” అని మరియు మరొక నిలువు వరుసలో “లీహై లేదా నీఫై ఏమి చేసాడు” అని రాయండి. లియహోనా మరియు విరిగిన విల్లు కథ (1 నీఫై 16:9–31) లేదా నీఫై ఓడను నిర్మించిన కథ (1 నీఫై 17:7–16; 18:1–6) చదవండి. కథ నుండి సంఘటనలను తగిన నిలువు వరుసలలో జాబితా చేయండి. ప్రేరేపణ యొక్క స్వభావం గురించి కథ మీకు ఏమి బోధించగలదో పరిగణించండి.
-
మీ దినచర్య పుస్తకాన్ని పరిశీలించి, మీరు ఆత్మచేత నడిపించబడిన లేదా ఆత్మ యొక్క బహుమానాన్ని అనుభవించిన సందర్భాలను కనుగొనండి. ఈ అనుభవాలు ఎప్పుడు, ఎక్కడ మరియు ఎందుకు జరిగాయో ఆలోచించండి. ప్రభువు యొక్క హస్తం ఎలా చూపబడింది? మీరు ఎలా భావించారు? ఈ అనుభవాలను గుర్తుంచుకోవడం, ఆత్మను గుర్తించడంలో మీకు సహాయపడుతుంది.
-
ఆల్మా 33:1–12 మరియు ఆల్మా 34:17–31 అధ్యయనం చేయండి. ఆల్మా మరియు అమ్యులెక్ ఏ ప్రశ్నలకు సమాధానమిస్తున్నారు? (ఆల్మా 33:1–2 సమీక్షించండి.) వారు ఈ ప్రశ్నలకు ఎలా సమాధానమిచ్చారు? వారు ఏ హామీలు ఇచ్చారు?
-
ఆత్మ మనల్ని అనేక ముఖ్యమైన మార్గాల్లో నడిపిస్తారని ప్రభువు వాగ్దానం చేశారు. మీరు ఈ క్రింది గద్యభాగాలను చదువుతున్నప్పుడు, మీ పనిలో ఆత్మ యొక్క నడిపింపు అవసరమయ్యే అంశాలను గుర్తించండి. ఈ క్రింది లేఖనాలలోని సూత్రాలు మీ వ్యక్తిగత మరియు సహచర అధ్యయనానికి, జిల్లా సలహాసభ సమావేశాలు, జోన్ సమావేశాలు, బాప్తిస్మపు సేవలు మరియు ఇతర సమావేశాల కోసం దేనిని సూచిస్తాయి?
ప్రార్థించుట
-
రోమా 8:26
సమావేశాలను నిర్వహించుట
సహచర అధ్యయనము మరియు సహచర మార్పిడి
-
సహచరులుగా మీరు చేసే ప్రార్థనల గురించి మాట్లాడండి. అవి పరిశుద్ధాత్మచేత నడిపించబడుతున్నాయా? సహవాసులుగా మీ ప్రార్థనలకు మీరు ఎలా సమాధానాలు పొందారు? సహచరులుగా ప్రార్థించినప్పుడు, మీరు:
-
నీతిమంతులుగా మరియు ఆయన చిత్తానుసారంగా మీరు అడిగిన దానిని దేవుడు ఇస్తారని నమ్ముతున్నారా?
-
మీ ప్రార్థనలకు సమాధానాలను గుర్తించి కృతజ్ఞతలు తెలియజేస్తారా?
-
జనుల కోసం పేరు పేరునా ప్రార్థించి, వారి అవసరాలను పరిగణిస్తారా?
-
ఒకరి కోసం ఒకరు మరియు ఆత్మ మిమ్మల్ని నడిపించాలని ప్రార్థిస్తారా?
-
మీ ప్రార్థనలకు సమాధానాలను గుర్తిస్తారా?
-
మీరు పొందే ప్రేరేపణలపై చర్య తీసుకోవడానికి నిబద్ధతతో ప్రార్థిస్తారా?
-
-
మీరు ఆత్మను మరింత హృదయపూర్వకంగా ఎలా వెదుకుతారో చర్చించండి.
-
జనులు పరిశుద్ధాత్మ ప్రభావాన్ని వివరించే వివిధ మార్గాలను చర్చించండి. మీరు బోధించేవారు ఆత్మతో తమ అనుభవాల గురించి చేసిన వ్యాఖ్యలను మీ అధ్యయన పుస్తకంలో నమోదు చేసుకోండి. ఈ పవిత్ర ప్రభావాన్ని గుర్తించడంలో ఇతరులకు మీరు ఎలా సహాయం చేయవచ్చు?
జిల్లా సలహాసభ, జోన్ సభ్యసమావేశాలు మరియు మిషను నాయకత్వ సలహాసభ
-
సముచితంగా, సువార్తికులు ఇటీవలి సాక్ష్యపు సమావేశంలో, బోధనా అనుభవంలో లేదా ఇతర సందర్భాలలో విన్న కథ లేదా అనుభవాన్ని పంచుకోనివ్వండి. ఇతర వ్యక్తులు చెప్పే ఆధ్యాత్మిక కథలు, అనుభవాలు విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి మరియు ఆత్మ యొక్క ప్రభావం విస్తృతంగా మరియు తరచుగా వ్యక్తమవుతుందని గుర్తించడానికి మీకు సహాయపడతాయి.
-
సువార్తసేవ మరియు పరిశుద్ధాత్మ యొక్క శక్తి గురించి ప్రసంగాలు ఇవ్వమని సువార్తికులను అడగండి.
-
కృతజ్ఞతను వ్యక్తపరచడం అనేది చిన్నవైనప్పటికీ ప్రభువు మిమ్మల్ని ఆశీర్వదించే చాలా ముఖ్యమైన మార్గాలను చూడడానికి మీకు ఎలా సహాయపడుతుందో చర్చించండి (ఈథర్ 3:5; సిద్ధాంతము మరియు నిబంధనలు 59:21 చూడండి). కృతజ్ఞతను వ్యక్తపరిచే మార్గాలను చర్చించండి.
-
సంఘము గురించి నేర్చుకునేటప్పుడు ఆత్మ ద్వారా అతను లేదా ఆమె ఎలా ప్రభావితమయ్యారో చెప్పమని కొత్త సభ్యుడిని అడగండి. సరైనవిగా భావించే అనుభవాలను మాత్రమే పంచుకోమని వారిని అడగండి.
మిషను నాయకులు మరియు మిషను సలహాదారులు
-
సువార్తికులు మీకు వ్రాసే వారపు లేఖలో తగిన ఆధ్యాత్మిక అనుభవాలను చేర్చమని మీరు అడగవచ్చు.
-
ఇంటర్వ్యూలలో లేదా సంభాషణలలో, అప్పుడప్పుడు సువార్తికులను వారి ఉదయకాల మరియు సాయంకాల ప్రార్థనల గురించి అడగండి. అవసరమైతే, వారి ప్రార్థనలను మరింత అర్థవంతంగా ఎలా చేయాలనే దాని గురించి వారితో చర్చించండి.
-
వారు బోధించే వారికి ఆత్మను అనుభూతి చెందడానికి మరియు గుర్తించడానికి ఎలా సహాయపడతారో సువార్తికులను అడగండి.