సువార్త కోర్సులు
అధ్యాయము 11: నిబద్ధతలను చేయడానికి మరియు పాటించడానికి జనులకు సహాయపడండి


“అధ్యాయము 11: నిబద్ధతలను చేయడానికి మరియు పాటించడానికి జనులకు సహాయపడండి,” నా సువార్తను ప్రకటించండి: యేసు క్రీస్తు యొక్క సువార్తను పంచుకొనుటకు మార్గదర్శి (2023)

“అధ్యాయము 11,” నా సువార్తను ప్రకటించండి

I Shall Not Want [నాకు ఏమి కొదువలేదు], యాంగ్‌సుంగ్ కిమ్ చేత

అధ్యాయము 11

నిబద్ధతలను చేయడానికి మరియు పాటించడానికి జనులకు సహాయపడండి

దీనిని పరిగణించండి

  • నిబద్ధతలను పాటించడం పరివర్తనతో ఎలా సంబంధం కలిగి ఉంటుంది?

  • నిబద్ధతలను పాటించడం, నిబంధనలను పాటించడంతో ఎలా సంబంధం కలిగి ఉంటుంది?

  • జనులు ఆధ్యాత్మికంగా ఎదగడానికి మరియు యేసు క్రీస్తుపై వారి విశ్వాసాన్ని బలోపేతం చేసుకోవడానికి నేను ఎలా ఆహ్వానాలను అందించగలను?

  • నిజాయితీగల సాక్ష్యాన్ని పంచుకోవడం ఎందుకు ముఖ్యం?

  • నేను ఏ ఆశీర్వాదాలను వాగ్దానం చేయగలను?

  • జనులు నిబద్ధతలను పాటించడంలో నేను ఎలా సహాయం చేయగలను?

పశ్చాత్తాపం, నిబద్ధత మరియు పరివర్తన

యేసు క్రీస్తు యొక్క సువార్తికునిగా మరియు శిష్యునిగా, మీరు ఆత్మల రక్షణను కోరుకుంటారు (మోషైయ 28:3 చూడండి). బాప్తిస్మంతో ప్రారంభమై, ముఖ్యమైన యాజకత్వ విధులను స్వీకరించడం ద్వారా వారు చేసే నిబంధనలను పాటించే వారిని రక్షకుడు “రక్షించుటకు శక్తిమంతుడు” (2 నీఫై 31:19 చూడండి). ఆహ్వానాలను అందించడం మరియు జనులు నిబద్ధతలను పాటించడంలో సహాయపడడం వారిని బాప్తిస్మం కోసం సిద్ధం చేస్తుంది.

పశ్చాత్తాపం యొక్క షరతుపై జనులు రక్షించబడతారు (హీలమన్ 5:11 చూడండి). పశ్చాత్తాపం అంటే యేసు క్రీస్తు వైపు పూర్తిగా మరియు నిజాయితీగా మరలడం. నిబద్ధత అనేది పశ్చాత్తాపం యొక్క ముఖ్యమైన భాగం. మీ బోధనలో భాగంగా నిబద్ధతలను చేయమని మీరు జనులను ఆహ్వానించినప్పుడు, మీరు వారిని పశ్చాత్తాపపడమని ఆహ్వానిస్తున్నారు.

నిబద్ధత అంటే చర్య యొక్క మార్గాన్ని ఎంచుకోవడం మరియు ఆ ఎంపికను అనుసరించడం. సువార్త సత్యాలపై స్థిరంగా పనిచేయడం పరివర్తనకు దారితీస్తుంది.

పరివర్తన అనేది దేవుని చిత్తాన్ని అంగీకరించడానికి మరియు అనుసరించడానికి ఒక వ్యక్తి నమ్మకాలు, హృదయం మరియు జీవితంలో చేసే మార్పు. క్రీస్తు శిష్యుడిగా మారడానికి అది ఒక తెలివైన నిర్ణయం. జనులు క్రీస్తుపై విశ్వాసం ఉంచి, తమ పాపాలకు పశ్చాత్తాపపడి, బాప్తిస్మం తీసుకుని, పరిశుద్ధాత్మ వరమును పొంది, అంతము వరకు సహించినప్పుడు పరివర్తన జరుగుతుంది. ప్రభువు మరియు ఆయన ప్రవక్తలు ఈ మార్పును ఆధ్యాత్మిక పునర్జన్మగా సూచిస్తారు (యోహాను 3:3–5; మోషైయ 27:25–26 చూడండి).

రక్షకుని ప్రాయశ్చిత్తం పరివర్తనను సాధ్యం చేస్తుంది మరియు పరిశుద్ధాత్మ హృదయమందు ఈ బలమైన మార్పును తెస్తారు (మోషైయ 5:2; ఆల్మా 5:12–14 చూడండి).

పరివర్తన అనేది ఒక ప్రక్రియ, ఒక సంఘటన కాదు. యేసు క్రీస్తు వైపు జనులు పరివర్తన చెందడానికి సహాయం చేయడం సువార్తికునిగా మీ ఉద్దేశ్యంలో కీలకమైనది. ఆత్మ చేత నడిపించబడినట్లుగా, మీరు జనులు ఆధ్యాత్మికంగా ఎదగడానికి మరియు వారి జీవితాల్లో పరిశుద్ధాత్మ ప్రభావాన్ని అనుభూతి చెందడానికి సహాయపడే నిబద్ధతలను చేయమని ఆహ్వానిస్తారు. అప్పుడు మీరు వారు చేసిన నిబద్ధతలను పాటించడంలో జనులకు మద్దతు ఇస్తారు. శాశ్వత మార్పు వైపు విశ్వాసంతో వ్యవహరించడంలో మీరు వారికి సహాయం చేస్తారు (మోషైయ 6:3 చూడండి).

బాప్తిస్మమునకు ముందు నిబద్ధతలను పాటించే వ్యక్తులు తరువాత పవిత్ర నిబంధనలను చేసి వాటిని పాటించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నిబద్ధతలను పాటించమని మీరు జనులకు బోధించినప్పుడు, మీరు వారికి నిబంధనలను పాటించమని బోధిస్తున్నారు. నిబంధనలు చేయడం మరియు పాటించడం అనేది యేసు క్రీస్తు సువార్తలో మరియు ఆయన పిల్లల కోసం దేవుని ప్రణాళికలో ముఖ్యమైన భాగం.

ఈ అధ్యాయంలో ఆహ్వానాలను అందించడం, ఆశీర్వాదాలను వాగ్దానం చేయడం, మీ సాక్ష్యాన్ని పంచుకోవడం మరియు జనులు రక్షకుని వద్దకు వచ్చి రక్షింపబడేలా వారి నిబద్ధతలను పాటించడంలో సహాయపడడం కోసం మార్గదర్శకాలు ఉన్నాయి.

స్త్రీలకు బోధిస్తున్న సువార్తికులు

ఆహ్వానాలను విస్తరించండి

యేసు క్రీస్తు యొక్క ప్రతినిధిగా, ఆయనను అనుసరించమని మరియు ఆయన సువార్త యొక్క ఆనందాన్ని పొందమని మీరు జనులను ఆహ్వానిస్తారు. క్రీస్తుపై వారి విశ్వాసాన్ని పెంపొందించే పనులు చేయడానికి మీరు వారికి నిర్దిష్ట ఆహ్వానాలను అందిస్తారు. అప్పుడు వారి నిబద్ధతలను పాటించడంలో మీరు వారికి మద్దతు ఇస్తారు.

ఆహ్వానాలు మరియు నిబద్ధతలు ఈ క్రింది కారణాల వల్ల చాలా ముఖ్యమైనవి:

  • ఆత్మ యొక్క ధృవీకరించే సాక్ష్యాన్ని అనుభూతి చెందడానికి వారు నేర్చుకున్న సూత్రాలను జీవించడానికి అవి జనులకు సహాయపడతాయి.

  • నిబద్ధతలను పాటించడం అనేది జనులు పశ్చాత్తాపాన్ని ప్రదర్శించే ఒక మార్గం (సిద్ధాంతము మరియు నిబంధనలు 20:37 చూడండి).

  • పశ్చాత్తాపం జనులు దేవుని క్షమాపణ యొక్క శాంతిని మరియు ఆనందాన్ని అనుభవించడానికి సహాయపడుతుంది. వారు తమ సవాళ్లకు దేవుని నుండి ఎక్కువ సహాయం పొందుతారు.

  • నిబద్ధతలను పాటించడం అనేది జనులను పవిత్ర నిబంధనలు చేసి, పాటించడానికి సిద్ధం చేస్తుంది.

  • జనులు తమ నిబద్ధతలను నిలబెట్టుకోవడంలో సహాయపడడం ద్వారా మీరు జనుల పట్ల మీ ప్రేమను మరియు దేవుని వాగ్దానాలపై మీ విశ్వాసాన్ని చూపించవచ్చు.

ఆత్మ చేత నడిపించబడినట్లుగా ఆహ్వానించండి

ఏ ఆహ్వానాలను అందించాలి మరియు వాటిని ఎప్పుడు అందించాలి అనే దాని గురించి ఆత్మ మార్గదర్శకత్వాన్ని కోరండి. సరిగ్గా అర్థం చేసుకున్న ఏ బోధన లేదా సిద్ధాంతం మీ ఆహ్వానాన్ని అంగీకరించడానికి ఒక వ్యక్తికి సహాయపడుతుందో పరిగణించండి. సరైన సమయంలో సరైన ఆహ్వానం వారి విశ్వాసాన్ని పెంపొందించే పనులను చేయడానికి జనులను ప్రేరేపించగలదు. ఈ చర్యలు హృదయమందు బలమైన మార్పుకు దారితీయవచ్చు (మోషైయ 5:2; ఆల్మా 5:12–14 చూడండి).

మీరు అందించే ఆహ్వానాలు చిన్నవిగా ఉండవచ్చు, ఉదాహరణకు లేఖనంలోని ఒక అధ్యాయాన్ని చదవడం లేదా సంస్కార కూడికకు రావడం వంటివి. లేదా అవి బాప్తిస్మం తీసుకోవడం వంటి కీలకమైనవి కావచ్చు. ఒక వ్యక్తి ఆమె లేదా అతని ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉన్న చోట ఆహ్వానాలు సముచితంగా ఉండాలి.

ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందడానికి సహాయపడేందుకు ఆత్మ చేత నడిపించబడిన ఆహ్వానాలు ఒకదానిపై ఒకటి నిర్మించబడతాయి (2 నీఫై 28:30; సిద్ధాంతము మరియు నిబంధనలు 93:12–13 చూడండి). మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి, “ఆ వ్యక్తి ఏ నిబద్ధతలను పాటిస్తున్నాడు? పురోగతి కోసం అతను లేదా ఆమె తదుపరి ఏమి చేయాలి?”

మీరు మాట్లాడుతున్న లేదా బోధిస్తున్న వారి మాట వినండి. మీరు వినే మరియు అనుభూతి చెందే దాని నుండి, ప్రతి వ్యక్తి పవిత్ర నిబంధనలు చేయడంలో పురోగతి సాధించడానికి ఏ ఆహ్వానాలు సహాయపడతాయనే దాని గురించి ఆత్మ మార్గదర్శకత్వం కోసం వెదకండి.

ఆహ్వానాలను విస్తరించడానికి సూత్రాలు

ఆహ్వానాలను విస్తరించడానికి క్రీస్తుపై విశ్వాసం అవసరం. జనులు మీ ఆహ్వానాలను అంగీకరించి వాటిని అనుసరించినప్పుడు ఆయన వారిని ఆశీర్వదిస్తారని విశ్వాసం కలిగి ఉండండి.

సువార్త సత్యంపై చర్య తీసుకోవడానికి మరియు ఆ మార్పు వారిని ఎలా ఆశీర్వదిస్తుందో చూడడానికి మీరు వారిని ఆహ్వానించినప్పుడు జనులు మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వారు ఆత్మను అనుభూతి చెందే స్థాయికి మరియు యేసు క్రీస్తు సువార్తను జీవించడం వల్ల కలిగే ఆనందాన్ని అనుభవించే స్థాయికి వారు మారతారు.

మీరు వ్యక్తిగతంగా లేదా ఆన్‌లైన్‌లో జనులను కలిసినప్పుడల్లా, క్రీస్తుపై వారి విశ్వాసాన్ని బలోపేతం చేసుకోవడానికి మరియు ఆత్మను అనుభూతి చెందడానికి ఏ ఆహ్వానం వారికి సహాయపడుతుందో పరిగణించండి. కొన్నిసార్లు ఇది మిమ్మల్ని మళ్ళీ కలవడం లేదా సంఘ ప్రోత్సాహకార్యక్రమాలకు రావడం వంటిది కావచ్చు.

మీరు పాఠం నేర్పడానికి సిద్ధమవుతున్నప్పుడు, ప్రతి వ్యక్తి యొక్క అవసరాలు మరియు పురోగతిని పరిగణించండి. మీ పాఠ్య ప్రణాళికలో వ్యక్తి పురోగతికి సహాయపడే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఆహ్వానాలు ఉన్నాయని నిర్ధారించుకోండి.

ఒకేసారి ఎక్కువ ఆహ్వానాలను ఇవ్వకుండా జాగ్రత్త వహించండి. ఒక వ్యక్తికి చర్య తీసుకోవడానికి, ఎదగడానికి మరియు ప్రతి ఆహ్వానం నుండి నేర్చుకోవడానికి సమయం అవసరం.

జనులను నిబద్ధతలు చేయమని మీరు ఆహ్వానించేటప్పుడు ధైర్యంగా ఉండండి, కానీ బలవంతపర్చేలా ప్రవర్తించవద్దు (ఆల్మా 38:12 చూడండి). జనుల కర్తృత్వాన్ని గౌరవించండి.

లేఖన అధ్యయనము

నిబద్ధతలు ఎందుకు ముఖ్యమైనవి?

దయగల మరియు స్పష్టమైన భాషలో ఆహ్వానించండి

ఆహ్వానం తరచుగా “మీరు చేస్తారా” అనే ప్రశ్న రూపంలో ఉంటుంది, దీనికి అవును లేదా కాదు అనే ప్రతిస్పందన అవసరం. మీ ఆహ్వానాలను దయగలవిగా, నిర్దిష్టమైనవిగా మరియు స్పష్టమైనవిగా చేయండి. అవి యేసు క్రీస్తుపై విశ్వాసంతో వ్యవహరించడానికి నిబద్ధత కలిగి ఉండడానికి జనులను ఆహ్వానించాలి లేదా నడిపించాలి.

మీ ఆహ్వానాలు ప్రతి వ్యక్తికి ప్రత్యేకంగా ఉన్నప్పటికీ, ఈ క్రింది ఉదాహరణలను పరిగణించండి:

  • సంఘానికి హాజరు కావడం మీరు దేవుణ్ణి ఆరాధించడానికి మరియు ఆయన ఆత్మను అనుభవించడానికి సమయాన్ని మరియు స్థలాన్ని అందిస్తుంది. రక్షకునికి దగ్గరగా రావడానికి మీరు మార్పులు చేసుకునేటప్పుడు మద్దతు ఇచ్చే సమాజంలో భాగం కావడానికి కూడా ఇది మీకు సహాయపడుతుంది. ఈ ఆదివారం మీరు సంస్కార కూడికకు మాతో వస్తారా?

  • ఇప్పుడు మనం లేఖనాలను అధ్యయనం చేయడం యొక్క ప్రాముఖ్యత గురించి చర్చించాము, కాబట్టి మీరు [లేఖనంలోని ఒక నిర్దిష్ట భాగాన్ని] చదువుతారా? మీరు ఏవైనా మనోభావాలు లేదా ప్రశ్నలు కలిగియుంటే వాటిని వ్రాస్తారా? తదుపరిసారి మనం కలిసినప్పుడు మీ ఆలోచనలను చర్చించవచ్చు.

  • మనం రక్షకుని జీవితం మరియు ఆయన ఆజ్ఞల గురించి చర్చిస్తున్నాము. ఆయన సంఘంలోకి బాప్తిస్మం తీసుకొని ఆయనతో వాగ్దానాలు చేయడం ద్వారా మీరు ఆయన మాదిరిని అనుసరిస్తారా? (3వ అధ్యాయములో “బాప్తిస్మము పొంది, నిర్ధారించబడడానికి ఆహ్వానము” చూడండి.)

  • మీ జీవితంలో దేవునితో మరింతగా జతచేరడానికి మీరు ఆసక్తిని వ్యక్తం చేశారు. ప్రార్థన యొక్క ఆశీర్వాదాలను అనుభవించడానికి రాబోయే కొద్ది రోజుల్లో మీరు విశ్వాసంతో ప్రార్థిస్తారా?

  • మీకు ఉపయోగకరంగా ఉంటుందని మేము భావిస్తున్న వీడియో మా వద్ద ఉంది. మేము దానిని మీకు చూపించవచ్చా లేదా లింక్ పంపవచ్చా? మీరు దానిని చూస్తారా? మీరు ఏమనుకుంటున్నారో తెలుసుకోవడానికి రేపు మిమ్మల్ని సంప్రదించవచ్చా?

దయగల, నిర్దిష్టమైన మరియు స్పష్టమైన ఆహ్వానాలను అందించడానికి మీరు సహజ మార్గాలను పరిశీలిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణలను కోరండి.

వ్యక్తిగత లేదా సహచర అధ్యయనము

మీ అధ్యయన పుస్తకంలో, ఒక పాఠంలోని ప్రతి నిబద్ధతకు సరళమైన, ప్రత్యక్షమైన మరియు స్పష్టమైన ఆహ్వానాన్ని రాయండి. మీరు ఈ కార్యకలాపాన్ని ఇంతకు ముందు చేసి ఉంటే, దాన్ని పునరావృతం చేసి, మీ కొత్త ఆహ్వానాలను మునుపటి ఆహ్వానాలతో పోల్చండి.

మీరు రాసిన ఆహ్వానాలను మీ సహచరుడితో సమీక్షించండి. ఆ తర్వాత ఈ క్రింది ప్రశ్నలను చర్చించండి:

  • ఈ ఆహ్వానానికి సంబంధించి ప్రభువు వాగ్దానం చేసిన ఆశీర్వాదాలను జనులు అర్థం చేసుకోవడానికి మనం ఎలా సహాయం చేయవచ్చు?

  • ఈ ఆహ్వానం నాకు వ్యక్తిగతంగా ఎందుకు ముఖ్యమైనది?

  • నేను ఆహ్వానాలను అందిస్తున్నప్పుడు జనులు వారి పట్ల దేవుని ప్రేమను అనుభూతి చెందడానికి నేను ఎలా సహాయం చేయగలను?

  • నేను అందించే ఆహ్వానాలపై ఇతరులు చర్య తీసుకోవడానికి సహాయం చేయడంలో నేను ఎలా మెరుగుపడగలను?

మీరు బోధిస్తున్న ఒక వ్యక్తి గురించి ఆలోచించండి. మీరు ఆ వ్యక్తిని ఉద్దేశించి మాట్లాడుతున్నట్లుగా ఈ ఆహ్వానాలను అందించడం అలవాటు చేసుకోండి. మీ ఆహ్వానాలను అవసరమైన విధంగా సవరించండి.

జనులకు ఆశీర్వాదాలను వాగ్దానం చేయండి

మనం ఆయన ఆజ్ఞలను పాటిస్తున్నప్పుడు దేవుడు మనల్ని దీవిస్తానని వాగ్దానం చేస్తారు (సిద్ధాంతము మరియు నిబంధనలు 130:20–21 చూడండి). ఆజ్ఞలను పాటించి విశ్వాసంగా ఉండే వ్యక్తులు “అన్ని విషయాలలోను ఆశీర్వదించబడతారు” మరియు “దేవునితో ఎన్నడూ అంతముకాని సంతోషము యొక్క స్థితిలో నివసించెదరు” (మోషైయ 2:41).

మీరు జనులను నిబద్ధతలు చేసుకోమని ఆహ్వానించినప్పుడు, వారి నిబద్ధతలను పాటించినందుకు వారికి ఆశీర్వాదాలను వాగ్దానం చేయండి. లేఖనాలను, కడవరి-దిన ప్రవక్తల బోధనలను మరియు 3వ అధ్యాయంలోని పాఠాలను అధ్యయనం చేయడం ద్వారా మీరు ఈ ఆశీర్వాదాలలో చాలా వాటిని గుర్తించవచ్చు. మీ స్వంత జీవితంలోని ఆశీర్వాదాల గురించి కూడా ఆలోచించండి. మీరు ఆహ్వానాలను అందిస్తున్నప్పుడు ప్రతి వ్యక్తికి ఏ ఆశీర్వాదాలను వాగ్దానం చేయాలో ప్రార్థనాపూర్వకంగా నిర్ణయించుకోండి.

ఒక ఆజ్ఞను బట్టి జీవించమని ఒక వ్యక్తిని ఆహ్వానించేటప్పుడు, ఈ క్రింది వాటిని బోధించండి:

  • ఆజ్ఞలను పాటించడం పరలోక తండ్రి మరియు ఆయన కుమారుడైన యేసు క్రీస్తు పట్ల మన ప్రేమను చూపుతుంది (యోహాను 14:15 చూడండి).

  • ఆజ్ఞలను పాటించడం మనం ఆయనను నమ్ముతున్నామని దేవునికి చూపుతుంది (సామెతలు 3: 5–6 చూడండి).

  • దేవుని దీవెనలు ఆధ్యాత్మికమైనవి మరియు తాత్కాలికమైనవి (మోషైయ 2:41).

  • నిత్యజీవం దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదం (సిద్ధాంతము మరియు నిబంధనలు 14:7 చూడండి).

  • మనం హృదయపూర్వకంగా ప్రార్థించి, విశ్వాసంతో చర్య తీసుకున్నప్పుడు, దేవుడు మనకు ఆజ్ఞాపించిన పనులను నెరవేర్చడంలో మనకు సహాయం చేస్తారు (1 నీఫై 3:7 చూడండి).

  • మనల్ని ఆశీర్వదిస్తాననే తన వాగ్దానాలను దేవుడు తన స్వమార్గంలో మరియు స్వకాలంలో నెరవేరుస్తారు (సిద్ధాంతము మరియు నిబంధనలు 88:68 చూడండి).

ఆజ్ఞలను పాటించడంలో జనులు తరచుగా వ్యతిరేకతను ఎదుర్కొంటారు. మీరు బోధించే వారికి మద్దతు ఇవ్వండి మరియు వారు ఆయన చిత్తాన్ని చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు దేవుడు వారిని ఆశీర్వదిస్తారని వారికి హామీ ఇవ్వండి. క్రీస్తును అనుసరించడం కష్టంగా ఉన్నప్పటికీ దానిని ఎంచుకోవడం ద్వారా వ్యతిరేకత అనేది ఎదగడానికి ఒక అవకాశం అని అర్థం చేసుకోవడానికి వారికి సహాయపడండి (2 నీఫై 2:11, 13–16 చూడండి).

ఎల్డర్ జెఫ్రీ ఆర్. హాలండ్ ఇలా బోధించారు: “కొన్ని దీవెనలు త్వరగా వస్తాయి, కొన్ని ఆలస్యంగా వస్తాయి, కొన్ని పరలోకానికి చేరేవరకు రావు; కానీ యేసు క్రీస్తు సువార్తను హత్తుకున్న వారికి అవి వస్తాయి” (“An High Priest of Good Things to Come,” Ensign, Nov. 1999, 38).

లేఖన అధ్యయనము

మనల్ని దీవించాలనే ప్రభువు యొక్క కోరిక గురించి ఈ క్రింది లేఖనాలు ఏమి బోధిస్తాయి?

వ్యక్తిగత అధ్యయనము

సిద్ధాంతము మరియు నిబంధనలు 82:10 మరియు 130:20–21 చదవండి. తర్వాత క్రింది లేఖనాలను అధ్యయనం చేయండి. మీ అధ్యయన పుస్తకంలో రెండు వరుసలు గీయండి. ఒక వైపు, ప్రతి గద్యభాగంలో మీరు కనుగొన్న ఆజ్ఞను రాయండి. మరోవైపు, ఆజ్ఞను పాటించినందుకు వాగ్దానాన్ని రాయండి.

మీ సాక్ష్యాన్ని పంచుకోండి

మీరు ఆహ్వానం ఇచ్చినప్పుడల్లా మరియు ఆశీర్వాదాలను వాగ్దానం చేసినప్పుడల్లా మీ సాక్ష్యాన్ని పంచుకోండి. మీరు బోధిస్తున్న సూత్రాన్ని జీవించడం వల్ల మీరెలా ఆశీర్వదించబడ్డారో చెప్పండి. అతను లేదా ఆమె ఆ సూత్రాన్ని జీవించినప్పుడు అది వారి జీవితాన్ని ఆశీర్వదిస్తుందనే మీ సాక్ష్యాన్ని పంచుకోండి.

మీ నిజాయితీగల సాక్ష్యం జనులు పరిశుద్ధాత్మ సత్యాన్ని ధృవీకరించినట్లు భావించే వాతావరణాన్ని సృష్టించడంలో సహాయపడుతుంది. మీరు అందించే ఆహ్వానాలను అంగీకరించడానికి ఇది వారిని ప్రోత్సహిస్తుంది.

మరింత సమాచారం కోసం, 10వ అధ్యాయంలో “మీ సాక్ష్యాన్ని పంచుకోండి” చూడండి.

ప్రార్థిస్తున్న సమూహం

జనులు తమ నిబద్ధతలను పాటించడానికి సహాయం చేయండి

ఏదైనా చేయమనే మీ ఆహ్వానాలను జనులు అంగీకరించినప్పుడు, వారి నిబద్ధతలను పాటించడానికి వారికి సహాయం చేయడానికి తదుపరి చర్య తీసుకోండి. జనులు క్రీస్తుపై విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి మీరు సహాయం చేస్తున్నారు. మీ పాత్ర ఏమిటంటే, వారి విశ్వాసాన్ని మరియు పూర్తి పరివర్తన వైపు ముందుకు సాగడానికి వారి సంకల్పాన్ని బలోపేతం చేయడంలో వారికి సహాయం చేయడం. కేవలం జనులను మారమని ఆహ్వానించకండి; అలా చేయడంలో వారికి మద్దతు ఇవ్వండి.

జనులు తమ నిబద్ధతలను పాటించడం ద్వారా పశ్చాత్తాపం నిమిత్తము విశ్వాసం చూపినప్పుడు ఆత్మ యొక్క సాక్ష్యాన్ని పొందుతారు. ఆ సాక్ష్యం తరచుగా “[వారి] విశ్వాసము పరీక్షించబడు వరకు” (ఈథర్ 12:6) రాదు. వ్యతిరేకత తలెత్తినప్పుడు ఆశ్చర్యపోకండి. వారు ఆత్మ యొక్క సాక్ష్యాన్ని పొందేలా మీరు శ్రమలలో వారికి ఎలా సహాయం చేస్తారో ప్రణాళిక చేయండి. సంఘంలోని ఇతర సభ్యులు కూడా మద్దతు ఇవ్వగలరు.

మీరు వారితో ఉన్నప్పుడు జనులు తరచుగా ఆత్మ యొక్క ప్రభావాన్ని అనుభవిస్తారు. వారు తమంతట తాముగా ఉన్నప్పుడు ఈ భావాలను కలిగి ఉండేలా ప్రార్థించడం, లేఖనాలను చదవడం మరియు మీ ఆహ్వానాలను అనుసరించడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పండి.

నిబద్ధతలను పాటించడం జీవితకాల పరివర్తన మార్గంలో విధులు మరియు నిబంధనల కొరకు జనులను సిద్ధం చేస్తుంది. మీ ప్రయత్నాలు యేసు క్రీస్తును అనుసరించాలనే వారి కోరికను “వారి క్రియల ద్వారా ప్రత్యక్షపరచడానికి” వారికి సహాయపడతాయి (సిద్ధాంతము మరియు నిబంధనలు 20:37).

హత్తుకుంటున్న స్త్రీలు

రోజువారీ సంక్షిప్త సంప్రదింపుల కోసం ప్రణాళిక చేయండి

మీరు మొదటిసారి సందర్శించి, వారికి బోధించినప్పుడే నిబద్ధతలను పాటించడంలో జనులకు సహాయపడడం ప్రారంభమవుతుంది. వారి ఫోను, క్యాలెండరు లేదా మీరు వారితో వదిలి వెళ్ళే దానిలో వారి నిబద్ధతను నమోదు చేయమని వారిని అడగండి.

మీరు లేదా పాల్గొంటున్న సభ్యుడు బోధనా సందర్శనల మధ్య క్లుప్తమైన రోజువారీ సంప్రదింపులు జరుపవచ్చా అని అడగండి. ఈ సంప్రదింపుల ఉద్దేశ్యం వారికి మద్దతు ఇవ్వడం అని వివరించండి మరియు మీరు దానిని చేయగల కొన్ని మార్గాలను వివరించండి. ఈ సంప్రదింపులు సిద్ధాంతము మరియు నిబంధనలు 84:106 లోని సూత్రాన్ని వర్తింపజేయడానికి ఒక మార్గం.

సంక్షిప్త సందర్శన, ఫోను చేయడం, టెక్స్ట్ లేదా సామాజిక మాధ్యమ సందేశం వంటి అత్యంత ప్రభావవంతమైన సంప్రదింపు పద్ధతిని నిర్ణయించండి. అదనపు జ్ఞాపిక‌లు మరియు మద్దతు కోసం సాంకేతికత అనేక ఎంపికలను అందిస్తుంది.

మీ రోజువారీ సంప్రదింపులో వ్యక్తులను ప్రోత్సహించండి మరియు సహాయం చేయండి

మీరు అందించే ప్రతి ఆహ్వానానికి, మరుసటి రోజు ఏ చర్య తీసుకోవాలనే దాని గురించి నా సువార్తను ప్రకటించండి యాప్‌లో వివరాలను నమోదు చేయండి. మీరు మరుసటి రోజు ప్రణాళిక వేసుకునేటప్పుడు, జనులు తమ నిబద్ధతలను పాటించడానికి ఎలా సహాయపడాలో చర్చించేటప్పుడు ఆత్మ యొక్క నడిపింపును కోరండి.

జనులతో మీ రోజువారీ సంప్రదింపులను సానుకూలంగా మరియు ప్రోత్సాహకరంగా మార్చుకోండి. వారి కొరకు ప్రార్థించండి. వారి నిబద్ధతలను పాటించడానికి మీరు వారికి సహాయం చేస్తున్నప్పుడు ప్రేమ మరియు అవగాహనను చూపించండి. ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి మరియు సవాళ్లను అధిగమించడంలో వారికి సహాయపడండి. సమయం ఉంటే, మోర్మన్ గ్రంథం నుండి కలిసి చదవండి. సంఘము ఉత్పత్తి చేసే సంగీతంతో సహా సంబంధిత సంఘ మీడియాను పంచుకోండి, అది వారిని ఉత్తేజపరచవచ్చు. వారి సమయం మరియు కోరికలను గౌరవించండి.

వారిని ఇతర సంఘ సభ్యులకు పరిచయం చేయండి. సముచితమైనప్పుడు, జనులు తమ నిబద్ధతలను పాటించడానికి సహాయం చేయమని సభ్యులను అడగండి (10వ అధ్యాయం చూడండి).

తమ నిబద్ధతలను పాటించడానికి కృషి చేస్తున్న వ్యక్తులను అభినందించండి. ప్రభువు వారి ప్రయత్నాలను ఎలా ఇష్టపడుతున్నారో వారికి చూపించండి. ఈ వ్యక్తులు తమ జీవితాలను మార్చుకుంటున్నారు, దానికి చాలా శ్రమ మరియు ఓపిక అవసరం. వారు పొందుతున్న ఆశీర్వాదాలను గుర్తించడంలో వారికి సహాయపడండి. వారు విజయం సాధించగలరనే విశ్వాసాన్ని వ్యక్తపరచండి.

జనులు తమ నిబద్ధతలను పాటించకపోయినా కూడా ప్రేమ చూపించండి. మీ రోజువారీ సంప్రదింపు సమయంలో వారికి మద్దతు ఇస్తామని చెప్పండి. ఉదాహరణకు, మోర్మన్ గ్రంథములో ఒక అధ్యాయాన్ని చదవడానికి ఎవరైనా ఆహ్వానాన్ని అంగీకరించి, ఇంకా దానిని చేయకపోతే, దానిని కలిసి చదువుదామని చెప్పండి. నిబద్ధతలను పాటించడం అతని లేదా ఆమె జీవితాన్ని ఎలా ఆశీర్వదిస్తుందో అనుభవం ద్వారా తెలుసుకోవడానికి ఆ వ్యక్తికి సహాయం చేయండి.

నిబద్ధతను పాటించడానికి జనులు చాలా ప్రయత్నాలు చేయవలసిరావచ్చు మరియు మీరు వారికి సహాయం చేయడానికి అనేక సందర్శనలు చేయవలసిరావచ్చు. నిబద్ధతలను పాటించడంలోని సవాళ్లను వారు ఎలా అధిగమించవచ్చో చర్చించండి. విమర్శనాత్మకంగా లేదా తీర్పు తీర్చేవారిగా కాకుండా, ఓపికగా మరియు మద్దతిచ్చేవారిగా ఉండండి.

మీ రోజువారీ సంప్రదింపులో పరిశుద్ధాత్మ ప్రభావాన్ని కలిగి ఉండండి

మీరు వ్యక్తులను సంప్రదించినప్పుడు, నిబద్ధతలను పాటించడంలో వారి అనుభవాన్ని పంచుకోమని వారిని అడగండి. వారు ఏమి నేర్చుకున్నారో మరియు ఏమి అనుభవించారో అడగండి. ఇది వారి జీవితాల్లో ఆత్మ ప్రభావాన్ని గుర్తించడంలో వారికి సహాయపడుతుంది మరియు తదుపరి దశను గుర్తించడంలో వారికి సహాయపడుతుంది.

మీరు ప్రతిరోజూ జనులను సంప్రదిస్తున్నప్పుడు, మీ ఉద్దేశ్యంలో ముఖ్యమైన భాగం పరిశుద్ధాత్మ ప్రభావాన్ని వారి జీవితాల్లోకి ఆహ్వానించడం. మీరు లేనప్పుడు ఆత్మను ఎలా అనుభూతి చెందాలో గుర్తించడంలో వారికి సహాయపడండి. మీరు వారికి బోధించినప్పుడు వారు అనుభవించిన ఆధ్యాత్మిక భావాలను మీ రోజువారీ సంప్రదింపులు బలోపేతం చేయాలి. వారు పరిశుద్ధాత్మ శక్తిని మరియు ప్రభావాన్ని అనుభవించినప్పుడు వారు మార్చబడతారు.

ప్రేమ చూపించండి

పరివర్తన ప్రక్రియ క్రీస్తువంటి ప్రేమలో కేంద్రీకృతమై ఉంది (4 నీఫై 1:15 చూడండి). దాతృత్వమనే బహుమానాన్ని వెదకండి. నిష్కపటమైన ప్రేమను చూపించడం జనులు తమ జీవితాల్లో ఆత్మను అనుభూతి చెందడానికి సహాయపడగలదు. మీ ప్రేమ యొక్క వ్యక్తీకరణలు ఆహ్వానాలను అంగీకరించడానికి మరియు పరివర్తనకు దారితీసే నిబద్ధతలను పాటించడానికి కూడా సహాయపడగలవు.

మీరు ఇతరులను ప్రేమించి బోధించినప్పుడు, రక్షకుని వైపు మీ స్వంత పరివర్తన మరింత లోతుగా మారుతుంది.

మరొక వ్యక్తి పరివర్తనకు సహాయం చేయడం ఒక పవిత్రమైన కార్యము. మీరు ఈ పనికి మరియు ఇతరులకు సేవ చేయడానికి మిమ్మల్ని అంకితం చేసుకున్నప్పుడు మీరు శాశ్వత ఆనందాన్ని పొందుతారు (మత్తయి 10:39; మోషైయ 2:17; ఆల్మా 27:17–18; సిద్ధాంతము మరియు నిబంధనలు 18:10–16 చూడండి).

వ్యక్తిగత లేదా సహచర అధ్యయనము

మీరు బోధిస్తున్న ప్రతి వ్యక్తితో మీ రోజువారీ సంప్రదింపు కోసం మీ ప్రణాళికలను నా సువార్తను ప్రకటించండి యాప్‌లో నమోదు చేయండి. ప్రతి వ్యక్తితో మీరు ఏమి చేయాలో చాలా రోజుల ముందుగానే ప్రణాళిక చేసుకోండి.

మీరు ప్రతి వ్యక్తికి బోధించేటప్పుడు మీరు అందించే ఒక ఆహ్వానాన్ని ఎంచుకోండి. తరువాత ఎవరైనా ఆ నిబద్ధతను అంగీకరించకుండా లేదా నిలబెట్టుకోకుండా నిరోధించే వివిధ ఆందోళనలను గుర్తించండి. జనులు తమ సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తున్నప్పుడు మీరు ఎలా ఉత్తమంగా సహాయం చేయగలరో చర్చించి సాధన చేయండి.

జనులు వచ్చి నిలిచియుండాలని ప్రభువు కోరుకుంటున్నారు

సువార్తను జీవించడానికి మరియు వారి జీవితమంతా సంఘములో చురుకుగా ఉండడానికి జనులు నిబద్ధతను చేసి, పాటించినప్పుడు సువార్త పరిచర్య గొప్ప ప్రభావాన్ని చూపుతుంది. వారు సంఘములోకి రావడం మాత్రమే సరిపోదు. వారు వచ్చి నిలిచియుండాలని ప్రభువు కోరుకుంటున్నారు (యోహాను 15:16 చూడండి). మీ బోధన మరియు ఆహ్వానాలన్నింటినీ ఆ లక్ష్యం వైపు మళ్ళించండి. పరలోక తండ్రి వారి కోసం కలిగి ఉన్న అన్ని ఆశీర్వాదాలను పొందడానికి, సభ్యులు ఆజ్ఞలను పాటించడం ద్వారా మరియు సంఘములో చురుకుగా ఉన్నప్పుడు వారు చేసిన నిబంధనలను పాటించడం ద్వారా సువార్తను జీవించడం కొనసాగించాలి.

నీఫై ఇలా బోధించాడు: “మీరు ఈ తిన్నని, ఇరుకైన మార్గమున ప్రవేశించిన తరువాత, సమస్తము చేయబడెనా? అని నేను అడుగుచున్నాను; లేదు, అని నేను మీతో చెప్పుచున్నాను; … క్రీస్తు నందు నిలకడతో, … మీరు శ్రద్ధగా ముందుకు సాగవలెను మరియు [మీరు] అంతము వరకు స్థిరముగానుండిన యెడల మీరు నిత్యజీవము పొందెదరని తండ్రి సెలవిచ్చుచున్నాడు” (2 నీఫై 31: 19–20).

“దేవుని బహుమానములలోకెల్లా అత్యంత ఘనమైన బహుమానమైన నిత్యజీవమును” పొందుటకు జనులు అర్హులు కావడానికి మీ శాయశక్తులా కృషి చేయండి (సిద్ధాంతము మరియు నిబంధనలు 14:7).


అధ్యయనము మరియు అన్వయము కొరకు ఉపాయములు

వ్యక్తిగత అధ్యయనము

  • 4వ పాఠం నుండి ఒక ఆజ్ఞను గుర్తించండి. ఈ ఆజ్ఞతో ముడిపడి ఉన్న వాగ్దానం చేయబడిన ఆశీర్వాదాలను వివరించే లేఖన సూచికలు మరియు కడవరి-దిన ప్రవక్తల వ్యాఖ్యానాలను కనుగొని నమోదు చేయండి. ఈ ఆజ్ఞను పాటించడం ద్వారా మీరు పొందిన ఆశీర్వాదాల గురించి ఆలోచించండి మరియు వాటిని మీ దినచర్య పుస్తకంలో రాయండి.

  • మీరు మీ కుటుంబంతో లేదా ఇతరులతో సంభాషించేటప్పుడు, ఒక నిర్దిష్ట ఆజ్ఞను పాటించడం ద్వారా వారు ఎలా ఆశీర్వదించబడ్డారో అడగండి (ఉదాహరణకు, ఆదివారాన్ని పరిశుద్ధంగా ఆచరించడం, దశమభాగ చట్టానికి లోబడడం లేదా మీరు బోధిస్తున్న వ్యక్తికి కష్టమైన ఆజ్ఞను పాటించడం).

  • ఆహ్వానాలను అందించేటప్పుడు మీరు మెరుగుపరచగల ప్రాంతాలను గుర్తించడంలో మీకు సహాయపడడానికి ఈ క్రింది ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి. మెరుగుపరచడానికి ప్రణాళికలు వేయండి.

    • నేను వారిని ప్రేమిస్తున్నానని జనులకు తెలుసా?

    • మన ఆహ్వానాలపై చర్య తీసుకోవడం ద్వారా వారు ఆశీర్వదించబడతారని నాకు నమ్మకం ఉందా?

    • వారి నిబద్ధతలను పాటించడానికి వారికి సహాయపడడానికి నేను జనులతో రోజువారీ సంప్రదింపులు జరపడానికి తగిన సమయం ఇస్తానా మరియు శ్రద్ధ చూపుతానా?

    • మన పాఠ్య ప్రణాళికలలో చర్య తీసుకోవడానికి నిర్దిష్ట ఆహ్వానాలు ఉన్నాయా?

సహచర అధ్యయనము మరియు సహచర మార్పిడి

  • సువార్తికుల పాఠాలలో ఒకదానిలోని ఆహ్వానాలను సమీక్షించండి. ప్రతి ఆహ్వానానికి, ఈ క్రింది ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి:

    • ఈ నిబద్ధతను పాటించేవారికి ప్రభువు ఏ ఆశీర్వాదాలను వాగ్దానం చేశారు?

    • ఈ సూత్రాన్ని పాటించడం జనులు తమ విశ్వాసాన్ని మరియు సాక్ష్యాన్ని పెంచుకోవడానికి ఎలా సహాయపడుతుంది?

    • ఈ నిబద్ధత జనులు పశ్చాత్తాపపడడానికి మరియు ఆత్మ పట్ల మరింత సున్నితంగా ఉండడానికి ఎలా సహాయపడుతుంది?

  • మీ ప్రణాళికా సాధనాల నుండి, గత రెండు రోజుల్లో మీరు సంప్రదించిన వ్యక్తుల జాబితాను రూపొందించండి. మీరు బోధిస్తున్న వారిని మరియు సభ్యులను చేర్చండి.

    • ప్రతి వ్యక్తి కొరకు, మీరు అందించిన ఆహ్వానాలను మరియు వారు చేసిన నిబద్ధతలను వ్రాయండి.

    • మీరు అందించగల ఇతర ఆహ్వానాలను పరిగణించండి.

    • ఈ వ్యక్తులలో కొంతమంది నుండి మీరు ఎందుకు నిబద్ధతలను పొందగలిగారు మరియు ఇతరుల నుండి ఎందుకు పొందలేకపోయారో చర్చించండి.

    • ఈ ఆహ్వానాలపై తదుపరి చర్య తీసుకోవడానికి మీరు ఏమి చేస్తారు?

జిల్లా సలహాసభ, జోన్ సభ్యసమావేశాలు మరియు మిషను నాయకత్వ సలహాసభ

  • మీరు బోధిస్తున్న వ్యక్తులతో రోజువారీ సంప్రదింపు కోసం ప్రభావవంతమైన మరియు సృజనాత్మక ఆలోచనలను చర్చించండి. సువార్తికులు సభ్యులతో ఎలా సమర్థవంతంగా పనిచేశారు? ఏ ముద్రిత లేదా డిజిటల్ మీడియా ఉపయోగకరంగా ఉంది? జనులు ఇంట్లో లేనప్పుడు లేదా మిమ్మల్ని కలవడానికి తీరికగా లేనప్పుడు మీరు ఏమి చేయవచ్చు?

  • 4వ పాఠంలోని ఆజ్ఞలను సువార్తికులు సమర్థవంతంగా బోధించిన మార్గాలను చర్చించండి.

మిషను నాయకులు మరియు మిషను సలహాదారులు

  • సాధ్యమైనప్పుడల్లా, సువార్తికులు బోధించేటప్పుడు వారితో పాటు వెళ్లండి. నిబద్ధతలను చేసి, పాటించడంలో జనులకు సహాయపడడంపై దృష్టి పెట్టడంలో వారికి సహాయపడండి.

  • జనులు ఈ సంప్రదింపుకు అంగీకరించినట్లయితే—సువార్తికులు బోధిస్తున్న వ్యక్తులతో రోజువారీ సంప్రదింపులు జరపమని వార్డు యాజకత్వ నాయకులను, నిర్మాణ నాయకులను మరియు సభ్యులను ప్రోత్సహించండి.