సువార్త కోర్సులు
అధ్యాయము 7: మీ మిషను భాష నేర్చుకోండి


“అధ్యాయము 7: మీ మిషను భాష నేర్చుకోండి,” నా సువార్తను ప్రకటించండి: యేసు క్రీస్తు యొక్క సువార్తను పంచుకొనుటకు మార్గదర్శి (2023)

“అధ్యాయము 7,” నా సువార్తను ప్రకటించండి

భూగోళం మరియు జెండాలు

అధ్యాయము 7

మీ మిషను భాష నేర్చుకోండి

దీనిని పరిగణించండి

  • కొత్త భాష నేర్చుకోవడానికి నాకు సహాయం చేయడానికి ప్రభువుపై నా విశ్వాసాన్ని నేను ఎలా బలపరచుకోగలను?

  • నా భాషా సామర్థ్యాలను నేను నిరంతరం ఎందుకు మెరుగుపరచుకోవాలి?

  • నా మిషను భాషలో మాట్లాడే మరియు బోధించే నా సామర్థ్యాన్ని నేను ఎలా మెరుగుపరచుకోగలను?

  • నేను భాషలు మాట్లాడే బహుమానాన్ని ఎలా పొందగలను?

ఆధ్యాత్మికంగా మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి

“ఈ అధికారమునకు నియమించబడిన వారి ద్వారా, ప్రతి మనుష్యుడు సువార్త యొక్క సంపూర్ణతను తన మాతృభాషలో, తన స్వంత భాషలో వినును” (సిద్ధాంతము మరియు నిబంధనలు 90:11) అని ప్రభువు ప్రకటించారు.

మీ మిషను భాషలో బోధించడానికి మరియు సాక్ష్యమివ్వడానికి ప్రభువు మీకు సహాయం చేస్తారనే మీ విశ్వాసాన్ని మీరు బలోపేతం చేసుకోగల మార్గాలు క్రింద ఇవ్వబడ్డాయి:

  • మీరు దేవునిచేత ఒక ప్రవక్త ద్వారా పిలువబడ్డారని నమ్మండి.

  • హృదయపూర్వక ప్రార్థన ద్వారా దేవుని సహాయం కోసం అడగండి.

  • ప్రతిరోజూ మీ మిషను భాషను అధ్యయనం చేయడం, సాధన చేయడం మరియు ఉపయోగించడం ద్వారా శ్రద్ధగా పని చేయండి.

  • ఆజ్ఞలను పాటించడం మరియు సువార్తికుల ప్రమాణాలను జీవించడం ద్వారా పరిశుద్ధాత్మ సహవాసానికి అర్హులుగా ఉండండి.

  • దేవుడిని ప్రేమించడం ద్వారా, ఆయన పిల్లలను ప్రేమించడం మరియు వారిని ఆశీర్వదించాలని కోరుకోవడం ద్వారా మీ ఉద్దేశాలను శుద్ధి చేసుకోండి.

అంకితభావం మరియు శ్రద్ధగలవారిగా ఉండండి

మీ మిషను భాషలో ప్రభావవంతంగా బోధించడం నేర్చుకోవడానికి శ్రద్ధగల ప్రయత్నం మరియు ఆత్మ యొక్క బహుమానాలు అవసరం. ఆ పని కష్టంగా అనిపిస్తే ఆశ్చర్యపోకండి. దానికి సమయం పడుతుంది. మీపట్ల మీరు ఓపికగా ఉండండి. భాష నేర్చుకోవడానికి మిమ్మల్ని మీరు అంకితం చేసుకుంటే, సువార్తికునిగా మీ లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి అవసరమైన నైపుణ్యాలను మీరు పొందుతారు.

మీ మిషను భాషను నేర్చుకోవడంలో మీరు ఒంటరిగా లేరు. మీరు వారి సహాయం కోరినప్పుడు పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తు మీకు సహాయం చేస్తారు. మీ సహచరుడు, సభ్యులు, మీరు బోధించేవారు, ఇతర సువార్తికులు మరియు ఇతర వ్యక్తుల సహాయం కోరండి మరియు వారి సహాయం తీసుకోవడానికి సిద్ధంగా ఉండండి.

జాగ్రత్తగా వినండి మరియు ప్రతి అవకాశంలోనూ ఆ భాష మాట్లాడండి. తప్పులు మాట్లాడతామేమో అని భయపడకండి. కొత్త భాష నేర్చుకునే ప్రతి ఒక్కరూ తప్పులు మాట్లాడతారు. జనులు అర్థం చేసుకుంటారు మరియు వారి భాషను నేర్చుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలను వారు అభినందిస్తారు.

మీ సువార్తసేవ ముగిసే వరకు మీ భాషా నైపుణ్యాలను మెరుగుపరచుకుంటూ ఉండండి. ఆ భాష మాట్లాడే మీ సామర్థ్యం పెరిగేకొద్దీ, జనులు మీరు ఎలా చెబుతారు అనే దాని కంటే ఎక్కువగా మీరు ఏమి చెప్తారనే దానిని వింటారు. మీరు ఎలా సంభాషించాలనే దాని గురించి తక్కువగా ఆందోళన చెందుతారు మరియు ఇతరుల అవసరాలపట్ల బాగా స్పందించగలుగుతారు.

ఎల్డర్ జెఫ్రీ ఆర్. హాలండ్

“కొత్త భాషను నేర్చుకునే ప్రతీ సువార్తికుడు … సాధ్యమైన ప్రతి విధానంలో దానిలో ప్రావీణ్యం సంపాదించాలని మేము ఆశిస్తున్నాము. … మరియు మీరు అలా చేస్తున్నప్పుడు, మీ [బోధన] మరియు సాక్ష్యమిచ్చే నైపుణ్యాలు మెరుగుపడతాయి. [మీరు బోధించే వ్యక్తుల] ద్వారా మీరు బాగా స్వీకరించబడతారు మరియు వారిని మరింత ఆధ్యాత్మికంగా ఆకట్టుకుంటారు. …

“మనం సువార్తికుల పదజాలం అని పిలిచే దానితో మాత్రమే సంతృప్తి చెందకండి. భాషలో మిమ్మల్ని మీరు విస్తరించుకోండి, అప్పుడు మీరు జనుల హృదయాలను ఎక్కువగా చేరుకుంటారు” (Jeffrey R. Holland, missionary satellite broadcast, Aug. 1998).

మీరు ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత మీ మిషను భాషను ఉపయోగించడాన్ని కొనసాగించండి. ప్రభువు మిమ్మల్ని ఎంతగానో దీవించారు మరియు తరువాత మీ జీవితంలో మీ భాషా సామర్థ్యాలకు ఆయన ఉపయోగాలను కలిగి ఉండవచ్చు.

ఇంగ్లీషు నేర్చుకోండి

మీరు ఇంగ్లీషు మాట్లాడకపోతే, మీరు సువార్తికునిగా దానిని అధ్యయనం చేయాలి. ఇది మీ సువార్తసేవ సమయంలో మరియు మీ జీవితాంతం మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది. ఇంగ్లీషు నేర్చుకోవడం మీ కుటుంబాన్ని కూడా ఆశీర్వదిస్తుంది.

ఇంగ్లీషు నేర్చుకోవడంలో మరింత సహాయం కోసం, EnglishConnect for Missionaries చూడండి.

దినచర్య పుస్తకంలో వ్రాస్తున్న స్త్రీ

భాషా అభ్యాస సూత్రాలు

బాధ్యత తీసుకోండి

మీ భాషా సామర్థ్యాన్ని మెరుగుపరచుకోవడానికి లక్ష్యాలను నిర్దేశించుకోండి మరియు వాటిని క్రమం తప్పకుండా సర్దుబాటు చేసుకోండి. భాషా అధ్యయన ప్రణాళికను రూపొందించండి. ప్రతి అవకాశంలోనూ ఆ భాషను ఉపయోగించండి.

మీ అధ్యయనాన్ని అర్థవంతంగా చేయండి

మీరు చదువుతున్న దానిని నిజ జీవిత పరిస్థితులకు మరియు మీ దైనందిన కార్యకలాపాలకు అన్వయించండి. మీరు చెప్పాల్సినది చెప్పడానికి సహాయపడే భాషపై దృష్టి పెట్టండి.

సంభాషించడానికి ప్రయత్నించండి

మీ సహచరుడితో వీలైనంత ఎక్కువగా ఆ భాష మాట్లాడండి. నేర్చుకోవడానికి మరియు సాధన చేయడానికి ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఉదాహరణకు, తిరిగి వచ్చే సభ్యుడిని లేదా మీరు బోధిస్తున్న ఎవరినైనా భాషలో మీకు సహాయం చేయమని మీరు అడగవచ్చు. భాష మాట్లాడే స్థానికులతో మాట్లాడడం కంటే ప్రత్యామ్నాయం లేదు.

పోల్చవద్దు

మీ భాషా నైపుణ్యాలను మీ సహచరుడితో లేదా ఇతర సువార్తికులతో పోల్చవద్దు. పోలిక గర్వం లేదా నిరుత్సాహానికి దారితీస్తుంది.

కొత్త భావనలను పూర్తిగా నేర్చుకోండి

మీరు అధ్యయనం చేసిన దానిని క్రమం తప్పకుండా సమీక్షించండి మరియు కొత్త పరిస్థితులలో దానిని సాధన చేయండి. ఇది మీరు నేర్చుకుంటున్న వాటిని గుర్తుకు తెచ్చుకోవడానికి మరియు అన్వయించడానికి మీకు సహాయపడుతుంది.

పుస్తకాన్ని చూస్తున్న వ్యక్తి

భాషా అధ్యయన ప్రణాళికను రూపొందించండి

భాషా అధ్యయన ప్రణాళిక కొత్త మరియు అనుభవజ్ఞులైన సువార్తికులు ఇద్దరూ తమ మిషను భాషను మాట్లాడే సామర్థ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ప్రతిరోజూ ఏమి చేయగలరనే దానిపై దృష్టి పెట్టడానికి సహాయపడుతుంది. మీ భాషా అధ్యయన సమయంలో మరియు రోజంతా మీరు ఏమి చేస్తారనేది మీ ప్రణాళికలో ఉంటుంది.

8వ అధ్యాయం నుండి లక్ష్య నిర్దేశ ప్రక్రియను ఉపయోగించి మీరు భాషా అధ్యయన ప్రణాళికను ఎలా రూపొందించవచ్చో ఈ క్రింది దశలు చూపుతాయి. ఈ ప్రక్రియను అవసరమైన విధంగా స్వీకరించండి.

  1. ప్రార్థనాపూర్వకంగా లక్ష్యాలను నిర్దేశించుకోండి మరియు ప్రణాళికలు రూపొందించండి. సంభాషించడానికి మరియు సువార్తను బోధించడానికి మీ సాధారణ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి వారపు మరియు రోజువారీ లక్ష్యాలను నిర్దేశించుకోండి. పదాలు, వాక్యభాగాలు, లేఖనాలు మరియు గద్యభాగాల వంటి మీరు గుర్తుంచుకోవాలనుకునే విషయాలను చేర్చండి.

  2. నమోదు చేసి, జాబితా చేయండి. మీ లక్ష్యాలను సాధించడంలో మీకు ఏ భాషా సాధనాలు సహాయపడతాయో నిర్ణయించుకోండి. భాషా సాధనాలలో లేఖనాలు, నిఘంటువులు, వ్యాకరణ పుస్తకాలు, TALL Embark యాప్ మరియు ఇతరాలు ఉండవచ్చు. మీరు భాషను అధికారికంగా అధ్యయనం చేసి ఉపయోగించే సమయాలను జాబితా చేసుకోండి. ఉదాహరణకు, మీరు ప్రతిరోజూ మధ్యాహ్న భోజన సమయంలో 15 నిమిషాల పాటు మోర్మన్ గ్రంథం నుండి బిగ్గరగా చదవడానికి సమయాన్ని కేటాయించుకోవచ్చు.

  3. మీ ప్రణాళికలపై పని చేయండి. ప్రభువు ప్రయత్నమును ప్రేమిస్తారు, కాబట్టి మీ లక్ష్యాలను సాధించడానికి శ్రద్ధగా పని చేయండి. మీ భాషా అధ్యయన సమయాన్ని కాపాడుకోండి మరియు విభేదాలు తలెత్తితే దానిని మరో సమయానికి నిర్ణయించుకోండి.

  4. సమీక్షించండి మరియు తదుపరి చర్య తీసుకోండి. మీ అధ్యయన ప్రణాళిక ఎంత బాగా పనిచేస్తుందో అంచనా వేయడానికి తరచుగా సమీక్షించండి. మీరు మెరుగుపడగల మార్గాలను సూచించమని మీ సహచరుడు, మిషను నాయకులు, సభ్యులు మరియు మీ ప్రాంతంలోని ఇతరులను ఆహ్వానించండి. మీ పురోగతిని వివరించడానికి మరియు మెరుగుపడడానికి మార్గాలను గుర్తించడానికి క్రమం తప్పకుండా నిర్ణయించబడిన భాషా మూల్యాంకనాలలో పాల్గొనండి.

భాషా పునాదిని సృష్టించడానికి దీర్ఘకాలిక లక్ష్యాలు మరియు నిర్దిష్ట కార్యకలాపాల కొరకు, మీరు బోధిస్తున్న వ్యక్తుల కొరకు స్వల్పకాలిక లక్ష్యాల మధ్య మీ భాషా అధ్యయనాన్ని సమతుల్యం చేయండి.

మీ అధికారిక భాషా అధ్యయన సమయంలో, క్రింద చూపిన భాష యొక్క ప్రాథమిక రంగాలలో మీ లక్ష్యాలను మరియు ప్రణాళికలను సమతుల్యం చేసుకోండి. రోజంతా మీరు ఏమి నేర్చుకుంటారో నిర్ణయించుకోండి.

శ్రవణ నైపుణ్యాలు

పఠన నైపుణ్యాలు

వ్యాకరణం

మాట్లాడే నైపుణ్యాలు

వ్రాసే నైపుణ్యాలు

పదజాలం

వ్యక్తిగత లేదా సహచర అధ్యయనము

ఈ క్రింది ప్రశ్నలు అడగడం ద్వారా ప్రతి వారం మీ భాషా అధ్యయనాన్ని అంచనా వేయడానికి సమయం కేటాయించండి:

  • ఈ వారం నేను నా మిషను భాషను ప్రతిరోజూ అధ్యయనం చేశానా? నా మిషను భాషను స్థిరంగా మెరుగుపరచుకోవడానికి నేను ఏమి చేయగలను?

  • కనుగొనడానికి, బోధించడానికి మరియు సభ్యులతో బాగా పని చేయడానికి నా ప్రణాళిక నాకు సహాయపడుతోందా? నా ప్రణాళికలో నేను ఏ సర్దుబాట్లు చేసుకోవాలి?

  • నా భాషా అధ్యయనంలో నేను దేని గురించి ఎక్కువగా ఆనందిస్తాను? దానిని ఎక్కువగా ఆస్వాదించడానికి నేను ఏమి చేయగలను?

  • వినడం, చదవడం, రాయడం మరియు మాట్లాడడం సాధన చేయడానికి నేను ఎంత సమయం కేటాయించాలి? పదజాలం, వ్యాకరణం మరియు ఉచ్ఛారణను నేను బాగా ఎలా నేర్చుకోగలను?

  • భాషను అధ్యయనం చేయడానికి నేను ఏ కార్యకలాపాలను మరియు వనరులను ఉపయోగిస్తున్నాను? ఏవి నాకు ఎక్కువగా సహాయపడుతున్నాయి? ఏ ఇతర వనరులు లేదా కార్యకలాపాలు ఉపయోగకరంగా ఉండవచ్చు?

  • దేనికి ఎక్కువ శ్రద్ధ అవసరం?

ఈ ప్రశ్నలకు సమాధానమిచ్చిన తర్వాత, మీ అధ్యయన ప్రణాళికలను సర్దుబాటు చేసుకోండి మరియు అవి మీ ఫలితాలను మెరుగుపరుస్తాయో లేదో చూడండి. మీరు మీ భాషా అధ్యయనాన్ని మెరుగుపరచడానికి నిరంతరం ప్రయత్నిస్తున్నప్పుడు ఆత్మ మిమ్మల్ని నడిపిస్తారు.

మీ సహచరులతోపాటు నేర్చుకోండి

మిషను భాష నేర్చుకోవడంలో లేదా ఇంగ్లీషు నేర్చుకోవడంలో మీ సహచరులు విజయాన్ని అనుభవించడానికి మరియు విశ్వాసాన్ని పొందడానికి సహాయం చేయండి. వారి పురోగతి గురించి మీ సహచరులను, ఇతర సువార్తికులను హృదయపూర్వకంగా మరియు తరచుగా అభినందించండి.

దయతో సరళమైన మరియు ఆచరణాత్మకమైన అభిప్రాయాన్ని అందించండి. విజయవంతంగా బోధించడానికి మరియు సాక్ష్యమివ్వడానికి వారికి అనేక అవకాశాలను ఇవ్వండి. ఈ క్రింది నిజమైన వృత్తాంతంలో మరింత అనుభవజ్ఞుడైన సువార్తికుడు తన సహచరుడికి ఎలా సహాయం చేశాడో గమనించండి.

నేను నా రెండవ ప్రాంతానికి చేరుకున్నప్పుడు, విందు సమయంలో ఆధ్యాత్మిక ఆలోచన చెప్పడం నా వంతు అని నా సహచరుడు నాకు చెప్పాడు. నా మొదటి సహచరుడు ఎల్లప్పుడూ బోధన చేయడానికి సంతోషంగా ఉండేవాడు మరియు నేను పాఠంలో నా చిన్న భాగాన్ని చెప్పి, ఆపై వినడం అలవాటు చేసుకున్నాను.

ఆధ్యాత్మిక ఆలోచన చెప్పమని నా సహచరుడిని ఒప్పించడానికి నేను ప్రయత్నించాను, కానీ అతను నన్ను ఆ నియామకాన్ని తీసుకోమని ప్రోత్సహించాడు. నేను అతని సహాయంతో సాధన చేసాను.

సమయం వచ్చినప్పుడు, నేను నా లేఖనాలను తెరిచి 3 నీఫై 5 మరియు 7 నుండి చదివాను. నేను ఇబ్బంది పడ్డాను కానీ, నేను ఎంచుకున్న గద్యభాగాలు ఎందుకు ముఖ్యమైనవని భావిస్తున్నానో వివరించగలిగాను మరియు నేను పూర్తి చేసినప్పుడు నాకు ఉపశమనం కలిగింది. ఒక ప్రశ్న అడగబడినప్పుడు, నేను సమాధానం కోసం నా సహచరుడి వైపు చూశాను, కానీ అతను నోరు తెరవలేదు. అప్పుడు నేను అర్థమయ్యే ఫ్రెంచ్‌ భాషలో సమాధానం చెప్పగలిగినందుకు ఆశ్చర్యపోయాను. నా సంభాషణా నైపుణ్యాల గురించి నేను అభద్రతాభావంతో ఉన్నానని సభ్యుడు గ్రహించనందుకు నేను మరింత ఆశ్చర్యపోయాను. నేను ఆత్మవిశ్వాసం పొందాను మరియు నా ఫ్రెంచ్ భాష నేను అనుకున్న దానికంటే మెరుగ్గా ఉందని గ్రహించాను.

వారాలు గడిచాయి మరియు—నేను దానిని చేయగలనని అనుకోనప్పుడు మరియు నేను దానిని చేయగలనా అని బహుశా అతను ఆశ్చర్యపోయినప్పటికీ, నా సహచరుడు నేను బోధించడానికి అనుమతిస్తూనే ఉన్నాడు. నేను నిశ్శబ్ద సహచరుడిగా ఉండడానికి బదులుగా మన పరలోక తండ్రి యొక్క సాధనంగా మారానని భావించాను.

వ్యక్తిగత లేదా సహచర అధ్యయనము

మీ మిషను భాషను నేర్చుకోవడంలో మీకు సహాయపడడానికి ఇతర సువార్తికులతో కలిసి పనిచేయండి.

  • మీరు కొత్త సువార్తికునితో కలిసి పనిచేస్తుంటే, మీ సహచరుడు ఆ భాష నేర్చుకోవడానికి లేదా ఇంగ్లీషు నేర్చుకోవడానికి మీరు బాగా ఎలా సహాయం చేయగలరు?

  • మీరు కొత్త సువార్తికుడు అయితే, మీ సహచరుడి నుండి మీరు ఎలాంటి సహాయం అడగవచ్చు?

స్త్రీకి బోధిస్తున్న సువార్తికులు

సంస్కృతి మరియు భాషా అభ్యాసం

సంస్కృతి మరియు భాష దగ్గరి సంబంధం కలిగి ఉన్నాయి. జనుల సంస్కృతిని అర్థం చేసుకోవడం భాషను ఉపయోగించే విధానాన్ని వివరించడంలో సహాయపడుతుంది. ఈ అవగాహన పునఃస్థాపన సందేశంలోని ప్రత్యేక అంశాలను జనులకు స్పష్టంగా అర్థమయ్యే విధంగా తెలియజేయడంలో కూడా మీకు సహాయపడుతుంది.

జనుల విశ్వాసం మరియు ప్రేమను పొందడానికి మీరు చేయగలిగే గొప్ప విషయాలలో ఒకటి వారి సంస్కృతిని తగిన మార్గాల్లో గౌరవించడం మరియు హత్తుకోవడం. చాలా మంది గొప్ప సువార్తికులు దీనిని చేశారు (1 కొరింథీయులకు 9:20–23 చూడండి).

వ్యక్తిగత లేదా సహచర అధ్యయనము

వేరే సంస్కృతి లేదా నేపథ్యం ఉన్న వ్యక్తికి బోధించడానికి సిద్ధం కావడానికి మీకు సహాయపడేందుకు క్రింద ఇవ్వబడిన ఆలోచనను ఉపయోగించండి.

  • మీరు బోధించే వ్యక్తుల సాంస్కృతిక మరియు మతపరమైన నేపథ్యం గురించి ఆలోచించండి. ఒక సువార్త సూత్రాన్ని అర్థం చేసుకోవడాన్ని వారికి కష్టతరం చేసే వారి నేపథ్యం యొక్క ఒక అంశాన్ని గుర్తించండి. ఈ సూత్రాన్ని స్పష్టంగా బోధించడానికి మార్గాలను ప్రణాళిక చేయండి.

భాషలు మాట్లాడు బహుమానము

ఆత్మ యొక్క బహుమానములు నిజమైనవి. భాషలు మాట్లాడు బహుమానము మరియు భాషాంతరము చేయు బహుమానము అనేక వ్యక్తీకరణలను కలిగి ఉంటాయి. వీటిలో భాషలను మాట్లాడడం, అర్థం చేసుకోవడం మరియు భాషాంతరము చేయడం వంటివి కొన్ని ఉన్నాయి. నేడు సువార్తికులు వారి మిషను‌లో భాషను నేర్చుకోవడంలో సహాయపడేందుకు భాషలు మాట్లాడు బహుమానము చాలా తరచుగా ఆత్మ-మెరుగుపరచిన అభ్యాసం మరియు అధ్యయనం ద్వారా వ్యక్తమవుతుంది.

మీకు మరియు మీరు బోధించే వారికి మధ్య భాషా అవరోధం ఉన్నప్పటికీ, పరిశుద్ధాత్మ మీ సాక్ష్యం యొక్క సత్యాన్ని వ్యక్తపరచగలరు. అదేవిధంగా, పదాలను మరియు వాక్యభాగాలను పరిశుద్ధాత్మ మీకు గుర్తుచేయగలరు మరియు జనులు వారి మనస్సులో నుండి ఏమి చెబుతున్నారో అర్థం చేసుకోవడానికి మీకు సహాయపడగలరు.

చాలా వరకు, మీరు ఈ బహుమానాలను ప్రయత్నం లేకుండా పొందలేరు. ఇతరులను ఆశీర్వదించడానికి మీరు వాటిని చురుకుగా వెదకాలి (సిద్ధాంతము మరియు నిబంధనలు 46:8–9, 26 చూడండి). భాషలు మాట్లాడు బహుమానాన్ని కోరుకోవడంలో ఒక భాగమేమనగా, భాష నేర్చుకోవడానికి శ్రమించడం మరియు మీరు చేయగలిగినదంతా చేయడం. మీరు ప్రార్థనాపూర్వకంగా భాషను అధ్యయనం చేసి, సాధన చేస్తున్నప్పుడు ఓపికగా ఉండండి. మీరు శ్రద్ధగా ప్రయత్నించేటప్పుడు ఆత్మ మీకు సహాయం చేస్తారని నమ్మండి. భాషలు మాట్లాడు బహుమానము మీకు మరియు మీరు బోధించే వారికి సహాయం చేయగలదని మీరు విశ్వసించండి.

మీరు కోరుకున్నంత స్పష్టంగా మిమ్మల్ని మీరు వ్యక్తపరచడానికి ఇబ్బంది పడినప్పుడు, ఆత్మ దేవుని పిల్లల హృదయాలతో మాట్లాడగలరని గుర్తుంచుకోండి. అధ్యక్షులు థామస్ ఎస్. మాన్సన్ ఇలా బోధించారు:

“ప్రతి సువార్తికునికి ఉమ్మడిగా ఉండే ఒక భాష ఉంది … అది ఆత్మ యొక్క భాష. ఇది అక్షరాస్యులు రాసిన పాఠ్యపుస్తకాల నుండి నేర్చుకోబడదు, చదవడం మరియు కంఠస్థం చేయడం ద్వారా పొందబడదు. దేవుడిని తెలుసుకోవడానికి మరియు ఆయన దైవిక ఆజ్ఞలను పాటించడానికి హృదయపూర్వకంగా ప్రయత్నించే వ్యక్తికి ఆత్మ యొక్క భాష వస్తుంది. ఈ భాషలో ప్రావీణ్యం హద్దులను చెరిపివేయడానికి, అడ్డంకులను అధిగమించడానికి మరియు మానవ హృదయాన్ని తాకడానికి అనుమతిస్తుంది” (“The Spirit Giveth Life,” Ensign, June 1997, 2).

వ్యక్తిగత లేదా సహచర అధ్యయనము

భాషలు మాట్లాడు బహుమానాన్ని పొందడానికి మీరు చేసే ప్రయత్నాలను అంచనా వేయడానికి ఈ క్రింది ప్రకటనలను ఉపయోగించండి. మీ భాషా అభ్యాసాన్ని మెరుగుపరచడంలో మీకు సహాయపడడానికి మనోభావాలను మరియు లక్ష్యాలను నమోదు చేయండి.

  • కొత్త భాషలో సువార్త ప్రకటించడానికి దేవుడు తన ప్రవక్త ద్వారా నన్ను పిలిచారని నేను నమ్ముతున్నాను. (సిద్ధాంతము మరియు నిబంధనలు 90:11)

  • ప్రభువు పట్ల మరియు నేను సేవ చేసే వారి పట్ల నాకున్న ప్రేమ నన్ను ప్రేరేపిస్తుంది. (సిద్ధాంతము మరియు నిబంధనలు 46:9; 1 కొరింథీయులకు 14:12)

  • ఆజ్ఞలను పాటించడం, మిషను ప్రమాణాలను జీవించడం మరియు ప్రతిరోజూ పశ్చాత్తాపపడడం ద్వారా పరిశుద్ధాత్మను కలిగియుండేందుకు యోగ్యునిగా జీవించడానికి నేను ప్రయత్నిస్తాను. (సిద్ధాంతము మరియు నిబంధనలు 46:9, 33)

  • భాషలు మాట్లాడు బహుమానాన్ని పొందాలని నేను నిరంతరం ప్రార్థిస్తాను. (సిద్ధాంతము మరియు నిబంధనలు 46:28, 30–32)

  • నేను ప్రతిరోజూ వీలైనంత ఎక్కువగా మిషను భాషను అధ్యయనం చేస్తాను, సాధన చేస్తాను మరియు ఉపయోగిస్తాను. (1 కొరింథీయులకు 12:31)


అధ్యయనము మరియు అన్వయము కొరకు ఉపాయములు

వ్యక్తిగత అధ్యయనము

  • Missionary Portal ‌లోని భాషా వనరులను సమీక్షించండి. మీరు ప్రయత్నించని దాన్ని గుర్తించి, రాబోయే కొన్ని రోజులు దానిని ప్రయత్నించాలని లక్ష్యంగా పెట్టుకోండి.

  • మీ తదుపరి జిల్లా సలహాసభ‌లో, మంచి భాషా సామర్థ్యం ఉన్న అనుభవజ్ఞుడైన సువార్తికుడిని భాష నేర్చుకోవడానికి అతను లేదా ఆమె ఏమి చేశారో అడగండి.

సహచర అధ్యయనము మరియు సహచర మార్పిడి

  • మీ మిషను భాషలో ఒకరికొకరు సువార్తికుల పాఠాలను బోధించడాన్ని సాధన చేయండి. మొదట, కొత్త సువార్తికులు చాలా సరళంగా బోధించవచ్చు, సరళమైన సాక్ష్యాలను పంచుకోవచ్చు మరియు కంఠస్థం చేసిన లేఖనాలను పఠించవచ్చు. వారి విశ్వాసం మరియు సామర్థ్యం పెరిగేకొద్దీ, వారు బోధనలో మరింత పూర్తిగా పాల్గొనగలుగుతారు.

  • ఈ అధ్యాయంలోని ఆలోచనలను మరియు Missionary Portal ‌లోని భాషా వనరులను సమీక్షించండి. వచ్చే వారం సహచర అధ్యయనంలో మీరు ఏ సూచనలను ఉపయోగించవచ్చో చర్చించండి.

  • మీ ఉచ్ఛారణను వినమని మరియు మెరుగుపరచడంలో మీకు సహాయపడమని మీ సహచరుడిని అడగండి. మీకు అర్థం కాని పరిస్థితులను గమనించమని అతనిని లేదా ఆమెను అడగండి. సహాయపడే పదాలు, వాక్యభాగాలు లేదా వ్యాకరణాల జాబితాను రూపొందించండి. రాబోయే కార్యకలాపాలలో జాబితాలో ఉన్న వాటిని ఎలా ఉపయోగించాలో వివరించండి మరియు సాధన చేయండి.

  • చురుకుగా వినడాన్ని సాధన చేయండి. మీరు నేర్చుకున్న పదజాలం మరియు నమూనాలను గుర్తించడానికి చురుకుగా వినడానికి రోజులో ఒక సమయాన్ని ప్రణాళిక చేసుకోండి. మీరు చెప్పే విధానానికి భిన్నంగా వ్యక్తీకరించబడిన వాక్యభాగాన్ని మీరు విన్నప్పుడు, దానిని వ్రాసి సాధన చేయండి.

  • ఆ రోజు జనులు చెప్పగల విషయాల జాబితాను రూపొందించండి. మీరు స్పందించగల మార్గాలను ప్రణాళిక చేయండి మరియు సాధన చేయండి.

జిల్లా సలహాసభ, జోన్ సభ్యసమావేశాలు మరియు మిషను నాయకత్వ సలహాసభ

  • ఈ సమావేశాలలో ఒకదానికి హాజరు కావడానికి స్థానిక భాష మాట్లాడేవారిని ఆహ్వానించండి. సువార్తికులు చిన్న సమూహాలలో వారికి బోధించేలా ఏర్పాటు చేయండి. సువార్తికుల భాషా సామర్థ్యం గురించి వివరాలు వ్రాసుకొని అభిప్రాయాన్ని చెప్పమని స్థానిక భాష మాట్లాడేవారిని అడగండి.

  • భాషను అధ్యయనం చేయడంలో వారు సాధించిన విజయాల గురించి చెప్పడానికి ఒకరు లేదా ఇద్దరు సువార్తికులను ముందుగానే కేటాయించండి.

  • సాధారణంగా సువార్తికులకు కష్టంగా ఉండే భాషలోని కొంత భాగాన్ని క్లుప్తంగా చెప్పడానికి అనుభవజ్ఞుడైన సువార్తికుడిని నియమించండి. మంచి భాష వాడకం యొక్క ఉదాహరణలను అతడు లేదా ఆమె చెప్పనివ్వండి మరియు సువార్తికులు వాటిని సాధన చేయనివ్వండి.

  • సంస్కృతికి స్థానికంగా ఉన్న సువార్తికులు తమ అంతర్దృష్టులను పంచుకోనివ్వండి.

మిషను నాయకులు మరియు మిషను సలహాదారులు

  • ప్రతిరోజూ భాషను స్థిరంగా అధ్యయనం చేయడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పండి.

  • సాధ్యమైనంతవరకు మిషను భాషను ఉపయోగించమని సువార్తికులను ప్రోత్సహించండి.

  • మిషను భాషా అధ్యయన ప్రణాళిక యొక్క అంశాలను క్రమబద్ధమైన అధ్యయన కాలపట్టిక‌లో అందించండి. జిల్లా సలహాసభ సమావేశాలలో దీనిని సమీక్షించండి.

  • వారు నేర్చుకుంటున్న భాషలో సువార్తికులతో మాట్లాడే అవకాశాల కోసం చూడండి. కాలానుగుణంగా ఆ భాషలో వారిని ఇంటర్వ్యూ చేయండి.

  • సువార్తికులు తమ భాషా సామర్థ్యాన్ని ఎలా మెరుగుపరచుకోవచ్చనే దాని కొరకు ఉపాయాల కోసం స్థానిక నాయకులను మరియు సభ్యులను అడగండి.

  • మీ మిషను భాషను నేర్చుకుంటున్న సువార్తికులు చేసే అత్యంత సాధారణ తప్పులపై జోన్ సభ్యసమావేశము లేదా మిషను నాయకత్వ సలహాసభలో సూచన ఇవ్వండి.

  • సువార్తికులకు ఆధ్యాత్మిక బహుమానాల గురించి బోధించండి.

  • సువార్తికులు మిషను భాషలో బోధించేటప్పుడు వారిని గమనించండి.