2024 రండి, నన్ను అనుసరించండి
జ్ఞాపకముంచుకోవలసిన ఆలోచనలు: సాక్ష్యపు గుడారము మరియు బలి


“జ్ఞాపకముంచుకోవలసిన ఆలోచనలు: సాక్ష్యపు గుడారము మరియు బలి,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: పాత నిబంధన 2026 (2026)

“సాక్ష్యపు గుడారము మరియు బలి,” రండి, నన్ను అనుసరించండి: పాత నిబంధన 2026

ఆలోచనల చిహ్నము

జ్ఞాపకముంచుకోవలసిన ఆలోచనలు

సాక్ష్యపు గుడారము మరియు బలి

మనము పాత నిబంధన చదివినప్పుడు, ప్రభువుకు అతి ముఖ్యమైన విషయాలను గూర్చిన సుదీర్ఘమైన లేఖన భాగాలను కొన్నిసార్లు మనము కనుగొంటాము, కానీ అవి నేడు మనకు సంబంధించినవి అని వెంటనే అనిపించకపోవచ్చు. నిర్గమకాండము 25–30; 35–40 మరియు లేవీయకాండము 1–9; 16–17 దానికి ఉదాహరణలు. ఈ అధ్యాయాలు అరణ్యములోని ఇశ్రాయేలీయుల సాక్ష్యపు గుడారమును మరియు అక్కడ జరుపబడిన జంతు బలులను సవివరంగా వివరిస్తాయి. సాక్ష్యపు గుడారము ఒక చిన్న దేవాలయము, ఆయన జనుల మధ్య ప్రభువు యొక్క నివాస స్థలము.

మన ఆధునిక దేవాలయాలు ఇశ్రాయేలీయుల సాక్ష్యపు గుడారముతో పోలికలను కలిగియున్నాయి, కానీ అవి నిశ్చయంగా నిర్గమకాండములో ఉన్న వివరణతో సరిపోల్చబడవు. 2,000 సంవత్సరాల క్రితం రక్షకుని యొక్క ప్రాయశ్చిత్తము జంతు బలిని ముగించింది గనుక మన దేవాలయాలలో మనము జంతువులను చంపము. అయితే, ఈ తేడాలు ఉన్నప్పటికీ, ప్రత్యేకించి మోర్మన్ గ్రంథంలోని దేవుని జనులు చూసినట్లుగా—“క్రీస్తునందు వారి విశ్వాసమును బలపరచడానికి” మార్గముగా(ఆల్మా 25:16). మనం వాటిని చూసినట్లయితే ప్రాచీన ఇశ్రాయేలు యొక్క ఆరాధనా రూపాల గురించి చదవడంలో నేడు గొప్ప విలువ ఉంది. గుడారం మరియు జంతుబలి యొక్క ప్రతీకలను మనం అర్థం చేసుకున్నప్పుడు, క్రీస్తుపై మన విశ్వాసాన్ని బలపరిచే ఆధ్యాత్మిక అంతర్దృష్టులను కూడా మనం పొందవచ్చు.

సాక్ష్యపు గుడారానికి గొర్రెపిల్లను తెస్తున్న ఇశ్రాయేలీయులు

Sacrifice of a Lamb [గొర్రెపిల్ల యొక్క బలి], రాబర్ట్ టి. బారెట్ చేత

సాక్ష్యపు గుడారము క్రీస్తునందు విశ్వాసాన్ని బలపరుస్తుంది

ఇశ్రాయేలీయుల శిబిరములో ఒక సాక్ష్యపు గుడారమును కట్టమని దేవుడు మోషేను ఆజ్ఞాపించినప్పుడు, ఆయన దాని ఉద్దేశ్యమును వివరించారు: “నేను వారిలో నివసించునట్లు” (నిర్గమకాండము 25:8). సాక్ష్యపు గుడారము లోపల, దేవుని యొక్క సన్నిధి నిబంధన మందసము చేత సూచించబడింది— బంగారంతో కప్పబడిన ఒక చెక్క పెట్టె, ఆయన జనులతో దేవుని యొక్క నిబంధన వ్రాయబడిన వృత్తాంతమును కలిగియున్నది. మందసము అత్యంత పరిశుద్ధమైన, లోపలి గదిలో ఉంచబడింది, ఒక తెర చేత సాక్ష్యపు గుడారములోనున్న మిగిలిన వాటినుండి ప్రత్యేకించబడింది. పతనము కారణంగా దేవుని సన్నిధి నుండి మనం విడిపోవడాన్ని ఈ తెర సూచిస్తుంది, అలాగే రక్షకుని ద్వారా ఆయన వద్దకు తిరిగి వెళ్ళే మార్గాన్ని సూచిస్తుంది.

మోషే కాకుండా, మనకు తెలిసి ఆ “అతిపరిశుద్ధ స్థలములో” (నిర్గమకాండము 26:34) ప్రవేశించగల ఏకైక వ్యక్తి—ప్రధాన యాజకుడు. మిగిలిన యాజకుల వలె, అతడు మొదట కడగబడి, అభిషేకించబడాలి మరియు అతడి స్థానము యొక్క చిహ్నపూర్వకమైన పవిత్ర వస్త్రమును ధరించాలి. సంవత్సరానికి ఒకసారి, ప్రాయశ్చిత్త దినము అని పిలువబడిన రోజున, సాక్ష్యపు గుడారములోనికి ఒంటరిగా ప్రవేశించడానికి ముందు జనుల తరఫున ప్రధాన యాజకుడు బలులను అర్పిస్తాడు. తెర వద్ద అతడు ధూపం వెలిగిస్తాడు. పరిమళధూపము పరలోకమునకు ఎక్కివెళ్ళుట జనుల యొక్క ప్రార్థనలు దేవునికి ఆరోహణమగుటను సూచిస్తుంది. తరువాత ప్రధాన యాజకుడు, ఒక జంతు బలి నుండి రక్తమును తీసుకొని, తెర గుండా దాటి, నిబంధన మందసము చేత చిహ్నపూర్వకముగా ఉన్న దేవుని సింహాసనమును సమీపిస్తాడు.

పరలోక తండ్రి యొక్క ప్రణాళికలో యేసు క్రీస్తు మరియు ఆయన పాత్ర గురించి మీకు తెలిసిన దానిని ఎరిగియుండి, సాక్ష్యపు గుడారము రక్షకుని వైపు మనకెలా దారి చూపిస్తుందో మీరు చూడగలరా? సాక్ష్యపు గుడారము, దానిలోని మందసము, ఆయన జనుల మధ్య దేవుని సన్నిధిని సూచించినట్లుగా, యేసు క్రీస్తు ఆయన జనుల మధ్య దేవుని సన్నిధిగా ఉన్నారు. ప్రధాన యాజకుని వలె, యేసు క్రీస్తు మనకు మరియు తండ్రియైన దేవునికి మధ్య మధ్యవర్తిగా ఉన్నారు. ఆయన స్వంత త్యాగపు రక్తము యొక్క సుగుణముచేత మన కొరకు మధ్యవర్తిత్వము చేయడానికి ఆయన తెరను దాటి వెళ్ళారు.

ప్రత్యేకించి మీ స్వంత విధులు పొందడానికి మీరు దేవాలయానికి వెళ్ళినట్లయితే, ఇశ్రాయేలీయుల సాక్ష్యపు గుడారములో కొన్ని అంశాలు మీకు పరిచయమైనవిగా ధ్వనించవచ్చు. దేవాలయము ప్రభువు యొక్క మందిరము—ఆయన జనుల మధ్య ఆయన నివసించే స్థలము. సాక్ష్యపు గుడారము యొక్క అతి పరిశుద్ధమైన స్థలము వలె, దేవాలయము యొక్క సిలెస్టియల్ గది దేవుని సన్నిధిని సూచిస్తుంది. దానిలో ప్రవేశించడానికి, మనము మొదట కడగబడాలి మరియు అభిషేకించబడాలి. మనము పవిత్ర వస్త్రములను ధరిస్తాము. మనం నిబంధనలు చేస్తాము. బలపీఠము వద్ద మనము ప్రార్థిస్తాము, దాని నుండి ప్రార్థనలు దేవునికి ఆరోహణమవుతాయి. మరియు చివరిగా తెరగుండా మనము దేవుని సన్నిధిలోనికి వెళ్తాము.

బహుశా ఆధునిక దేవాలయాలు మరియు ప్రాచీన సాక్ష్యపు గుడారము మధ్య అత్యంత ముఖ్యమైన పోలిక, సరిగ్గా గ్రహించబడితే, యేసు క్రీస్తునందు మన విశ్వాసాన్ని బలపరుస్తుంది మరియు ఆయన ప్రాయశ్చిత్త త్యాగము కొరకు మనల్ని కృతజ్ఞతతో నింపుతుంది. దేవుడు తన పిల్లలందరు ఆయన సన్నిధిలో ప్రవేశించాలని కోరుతున్నారు; ఆయన “యాజకులు” మరియు యాజకురాళ్ళు ఉన్న రాజ్యమును కోరుతున్నారు (నిర్గమకాండము 19:6). కానీ మన పాపములు ఆ దీవెన పొందడం నుండి మనల్ని ఆపివేస్తాయి, ఏలయనగా “అపవిత్రమైన వస్తువేదియు దేవునితో నివసింపజాలదు” (1 నీఫై 10:21). కనుక తండ్రియైన దేవుడు, మన “మేలుల విషయమై ప్రధాన యాజకుడైన” (హెబ్రీయులకు 9:11) యేసు క్రీస్తును పంపారు. ఆయన మన కొరకు తెరను తెరచి, “మనము కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుటకు” (హెబ్రీయులకు 4:16) దేవుని యొక్క పిల్లలు అందరికి అధికారమిస్తారు.

ఈ రోజు, దేవాలయముల యొక్క ఉద్దేశము మనకై మనం ఉన్నతస్థితిని పొందడం కంటె ఎక్కువైనది. మన స్వంత విధులను పొంది, దేవునితో నిబంధనలు చేసిన తరువాత, మనం మన పూర్వీకుల స్థానములో నిలబడి, వారి తరఫున విధులను పొందగలము. ఒక భావనలో, మనము ప్రాచీన ప్రధాన యాజకునిగా—ఇతరుల కొరకు దేవుని సన్నిధికి మార్గమును తెరుస్తూ—గొప్ప ప్రధాన యాజకునిగా కాగలము.

త్యాగము యేసు క్రీస్తుపై విశ్వాసాన్ని బలపరుస్తుంది.

ప్రాయశ్చిత్తము మరియు సయోధ్య యొక్క సూత్రములు మోషే ధర్మశాస్త్రము కంటే చాలాకాలం ముందున్న ప్రాచీన జంతు బలి ఆచరణలో శక్తివంతంగా బోధింపబడ్డాయి. ఆదాము హవ్వలు బలిని అర్పించారు. రక్షకుని త్యాగానికి సంబంధించిన దాని ప్రతీకాత్మక సూచనను వారు అర్థం చేసుకున్నారు. మరియు వారు దీనిని వారి పిల్లలకు బోధించారు.

ప్రాచీన ఇశ్రాయేలీయుల ప్రాయశ్చిత్త దినోత్సవం (హెబ్రీయ భాషలో “యోమ్ కిప్పుర్”) సందర్భంగా జంతు బలి యొక్క ప్రతీకవాదం ప్రత్యేకంగా చాలా పదునైనదిగా అనిపించవచ్చు. ఈ వార్షిక వేడుక కొరకు అవసరత లేవీయకాండము 16:30లో వ్యక్తపరచబడింది: “మీరు యెహోవా సన్నిధిని మీ సమస్త పాపములనుండి పవిత్రులగునట్లు, ఆ దినమున మిమ్ము పవిత్రపరచునట్లు, మీ నిమిత్తము యాజకుడు ప్రాయశ్చిత్తము చేయును.” ఇది జనుల మధ్య దేవుని సన్నిధి నిలిచియుండేందుకు అనుమతించింది. ఈ ప్రాయశ్చిత్తము వివిధ రకాల వేడుకల ద్వారా సాధించబడింది. వీటిలో ఒకదానిలో, ఒక మేక జనుల యొక్క పాపముల కొరకు అర్పణగా చంపబడుతుంది మరియు ప్రధాన యాజకుడు ఆ మేక రక్తమును అత్యంత పరిశుద్ధ స్థలానికి తీసుకొనివెళ్తాడు. తరువాత, ప్రధాన యాజకుడు ప్రాణమున్న మేకపై తన చేతులుంచి ఇశ్రాయేలీయుల పాపములను ఒప్పుకుంటాడు—చిహ్నపూర్వకంగా ఆ పాపములు ఆ మేకకు బదిలీచేస్తాడు. తరువాత ఆ మేక ఇశ్రాయేలీయుల గుడారము నుండి తరిమివేయబడుతుంది.

ఈ ఆచారక్రియలలో, మేకలు పాపులైన జనుల స్థానమును తీసుకొంటూ యేసు క్రీస్తును సూచిస్తున్నాయి. పాపము దేవుని సన్నిధిలో అనుమతించబడరాదు. కానీ పాపులను నాశనము చేయుట లేదా తరిమివేయుటకు బదులుగా, దేవుడు మరొక మార్గమును అందించారు—బదులుగా ఒక మేక చంపబడుతుంది లేదా తరిమివేయబడుతుంది. “ఆ మేక వారి దోషములన్నిటిని భరించిపోతుంది” (లేవీయకాండము 16:22).

ఈ ఆచారక్రియలు ఆయన సన్నిధికి మనల్ని తిరిగి తెచ్చుటకు దేవుడు సిద్ధపరచిన మార్గమును అనగా యేసు క్రీస్తు మరియు ఆయన ప్రాయశ్చిత్తమును సూచిస్తాయి. రక్షకుడు “మన రోగములను భరించెను, మన వ్యసనములను, మనయందరి దోషమును వహించెను” (యెషయా 53:4, 6). ఆయన మన స్థానములో నిలబడ్డారు, పాపములకు పరిహారం చెల్లించడానికి తన ప్రాణమును ఇచ్చారు మరియు తరువాత తన పునరుత్థానము ద్వారా మరణమును జయించారు. యేసు క్రీస్తు యొక్క త్యాగము “గొప్ప మరియు చివరి బలి, అవును, ఒక మనుష్యుని యొక్క లేదా జంతువు యొక్క బలి కాదు”, కానీ “అనంతమైన మరియు నిత్యమైన బలి” (ఆల్మా 34:10). ఆయన ప్రాచీన బలులు సూచించిన సమస్తము యొక్క నెరవేర్పు.

సిలువను మోసుకెళ్తున్న యేసు

ఈ కారణము చేత, ఆయన త్యాగము పూర్తి చేయబడిన తరువాత ఆయన ఇలా అన్నారు, “మీరు నా కొరకు ఇకపై రక్తము చిందించరు; మీ బలులు … నిలిపి వేయబడును. … మీరు విరిగిన హృదయమును, నలిగిన ఆత్మను బలిగా నాకు అర్పించెదరు” (3 నీఫై 9:19–20).

పాత నిబంధనలో బలులు మరియు సాక్ష్యపు గుడారముల (లేదా తరువాత, దేవాలయము) గురించిన గద్యభాగాలను మీరు కనుగొన్నప్పుడు—మరియు మీరు వాటిలో అనేకమును కనుగొంటారు—అన్నిటి యొక్క ప్రధాన ఉద్దేశము మెస్సీయ అయిన యేసు క్రీస్తునందు మీ విశ్వాసమును బలపరచుట అని జ్ఞాపకముంచుకోండి. మీరు చదివిన మరియు నేర్చుకున్న వాటిని ఆయన మందిరములో మీ ఆరాధనతో జతచేయండి. మీ హృదయము, మీ మనస్సు ఆయనవైపు మరలనివ్వండి. దేవుని సన్నిధికి మిమ్మల్ని తిరిగి తేవడానికి ఆయన చేసిన దానిని—మరియు ఆయనను వెంబడించడానికి మీరు చేసే దానిని ధ్యానించండి.

వివరణలు

  1. నిర్గమకాండము 33:7–11 “ప్రత్యక్షపు గుడారమును” తెలియజేస్తుంది, అక్కడ మోషే ప్రభువుతో మాట్లాడాడు, కానీ అది నిర్గమకాండము మరియు లేవీయకాండములో వివరించబడిన బలుల కొరకైన సందర్భము కాదు. నిర్గమకాండము 25–30లో వివరించబడిన సాక్ష్యపు గుడారములో ఆ బలులు నెరవేర్చబడినవి, దానిని నిర్మించమని దేవుడు మోషేను మరియు ఇశ్రాయేలీయులను ఆజ్ఞాపించారు (నిర్గమకాండము 35–40 చూడండి). అహరోను మరియు అతని కుమారులు జంతు బలులు నిర్వహించిన ఈ సాక్ష్యపు గుడారము, తరచుగా “ప్రత్యక్షపు గుడారము”గా (ఉదాహరణకు, నిర్గమకాండము 28:43; 38:30; లేవీయకాండము 1:3 చూడండి) కూడా సూచించబడింది.

  2. జేకబ్ 4:5; జేరమ్ 1:11 కూడా చూడండి.

  3. నిర్గమకాండము 25:10–22 చూడండి.

  4. హెబ్రీయులకు 10:19–20 చూడండి.

  5. నిర్గమకాండము 40:12–13 చూడండి.

  6. నిర్గమకాండము 28 చూడండి.

  7. లేవీయకాండము 16:12 చూడండి.

  8. కీర్తనలు 141:2 చూడండి.

  9. లేవీయకాండము 16:14–15 చూడండి.

  10. యోహాను 1:14 చూడండి.

  11. హెబ్రీయులకు 8–10 చూడండి.

  12. మోషే 5:4–12; ఆదికాండము 4:4 కూడా చూడండి.

  13. మోషైయ 15:8–9 చూడండి.