2024 రండి, నన్ను అనుసరించండి
జ్ఞాపకముంచుకోవలసిన ఆలోచనలు: పాత నిబంధనలో చారిత్రక గ్రంథాలు


“జ్ఞాపకముంచుకోవలసిన ఆలోచనలు: పాత నిబంధనలో చారిత్రక గ్రంథాలు,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: పాత నిబంధన 2026 (2026)

“పాత నిబంధనలో చారిత్రక గ్రంథాలు,” రండి, నన్ను అనుసరించండి: పాత నిబంధన 2026

ఆలోచనల చిహ్నము

జ్ఞాపకముంచుకోవలసిన ఆలోచనలు

పాత నిబంధనలో చారిత్రక గ్రంథాలు

యెహోషువ నుండి ఎస్తేరు వరకు గల గ్రంథాలు సాంప్రదాయకంగా పాత నిబంధన యొక్క “చారిత్రక గ్రంథాలుగా” పిలువబడ్డాయి. దీనర్థం పాత నిబంధనలో మిగిలిన గ్రంథాలు చారిత్రక విలువను కలిగిలేవని కాదు. బదులుగా, చారిత్రక గ్రంథాలు ఆవిధంగా పిలువబడినవి ఎందుకనగా, వాటి రచయితల యొక్క ప్రధాన ఉద్దేశము ఇశ్రాయేలు యొక్క జనుల చరిత్రలో దేవుని యొక్క ప్రభావమును చూపుట. లేవీయకాండము మరియు ద్వితీయోపదేశకాండము చేసినట్లుగా, మోషే ధర్మశాస్త్రమును సంక్షిప్తపరచుట వాటి ఉద్దేశము కాదు. కీర్తనలు మరియు విలాపవాక్యములు చేసినట్లుగా, స్తుతి లేదా కవిత్వ రూపంలో విలాపమును వ్యక్తపరచుట కాదు. యెషయా మరియు యెహెజ్కేలు గ్రంథాలు చేసినట్లుగా, అవి ప్రవక్తల మాటలను వ్రాయడానికి కాదు. బదులుగా, చారిత్రక గ్రంథాలు కథలు చెప్తాయి.

దృష్టికోణముగల ఒక విషయము

సహజంగానే, ఈ కథలు ఒక నిర్దిష్ట దృష్టికోణము నుండి చెప్పబడతాయి. ఒక సమయంలో ఒకటి కంటే ఎక్కువ కోణాల నుండి ఒక పువ్వు, రాయి లేదా చెట్టును చూడడం అసాధ్యం అయినట్లే, ఒక చారిత్రక వృత్తాంతము అది వ్రాసే వ్యక్తి లేదా జన సమూహము యొక్క దృక్కోణాన్ని ప్రతిబింబించడం అనివార్యం. ఈ దృక్కోణములో రచయితల జాతీయ లేదా జాతి సంబంధాలు మరియు వారి సాంస్కృతిక కట్టుబాట్లు, నమ్మకాలు ఉంటాయి. దీనిని తెలుసుకోవడం చారిత్రక గ్రంథాల రచయతలు మరియు సంగ్రహకులు మిగిలిన వాటిని విడిచిపెట్టి నిర్దిష్టమైన వివరణలపై దృష్టిసారించారని అర్థం చేసుకోవడానికి మనకు సహాయపడుతుంది. వారు ఇతరులు చేయని కొన్ని నిర్దిష్టమైన అంచనాలు చేసారు. ఆ వివరణలు మరియు అంచనాల ఆధారంగా వారు నిర్ణయాలకు వచ్చారు. మనం బైబిలులోని గ్రంథాలలో విభిన్న దృక్కోణాలను కూడా చూడవచ్చు (మరియు కొన్నిసార్లు అదే గ్రంథములోపల). ఈ దృక్కోణాల గురించి మనం ఎంత ఎక్కువగా తెలుసుకుంటే, మనం చారిత్రక గ్రంథాలను అంత బాగా అర్థం చేసుకోగలము.

పాత నిబంధన యొక్క చారిత్రక గ్రంథాలకు ఉమ్మడిగా ఉన్న ఒక దృక్కోణం దేవుని యొక్క నిబంధన జనులుగా ఇశ్రాయేలీయుల దృక్కోణం. ప్రభువు నందు వారి విశ్వాసము వారి జీవితాలలో మరియు వారి దేశ వ్యవహారాలలో ఆయన హస్తమును చూడడానికి వారికి సహాయపడింది. లౌకిక చరిత్ర గ్రంథాలు విషయాలను ఈ విధంగా చూడనప్పటికీ, ఈ ఆత్మ సంబంధమైన దృక్కోణము దేవునియందు వారి స్వంత విశ్వాసమును పెంపొందించుకోవాలని కోరే వారికి పాత నిబంధన యొక్క చారిత్రక గ్రంథాలను ఎంతో విలువైనవిగా చేస్తాయి.

మిగిలిన పాత నిబంధన కోసం సందర్భం

ఇశ్రాయేలీయులు అరణ్యంలో సంచరిస్తున్న సంవత్సరాలు ముగియడంతో, ద్వితీయోపదేశకాండ గ్రంథము ఆగిన చోట చారిత్రక గ్రంథాలు ప్రారంభమయ్యాయి. యెహోషువ గ్రంథము ఇశ్రాయేలీయులు తమ వాగ్దాన దేశమైన కనానులో ప్రవేశించడానికి సిద్ధపడియున్నారని చూపుతుంది మరియు వారు దానిని ఎలా స్వాధీనం చేసుకున్నారో వివరిస్తుంది. న్యాయాధిపతులు నుండి 2 దినవృత్తాంతములు తరువాత వచ్చిన గ్రంథాలు, వాగ్దాన దేశములో వారు స్థిరపడిన సమయము నుండి, అష్షూరియా మరియు బబులోనుచేత వారు జయించబడే సమయం వరకు ఇశ్రాయేలీయుల అనుభవాన్ని వర్ణిస్తాయి. ఎజ్రా మరియు నెహెమ్యా గ్రంథాలు దశాబ్దాల తరువాత వారి రాజధానియైన యెరూషలేముకు ఇశ్రాయేలీయులలో అనేక గుంపులు తిరిగి వెళ్ళుటను వివరిస్తాయి. చివరిగా ఎస్తేరు గ్రంథము పర్షియా పాలన క్రింద బహిష్కరణలో జీవిస్తున్న ఇశ్రాయేలీయుల వృత్తాంతాన్ని వివరిస్తుంది.

అక్కడే పాత నిబంధన కాలక్రమం ముగుస్తుంది. మొదటిసారి బైబిలు చదివే పాఠకులు కొందరు దాని పేజీలలో సగం కంటే ఎక్కువ చదవకముందే పాతనిబంధన కథనం చదవడాన్ని నిజంగా పూర్తి చేసారని తెలుసుకోవడానికి ఆశ్చర్యపడతారు. ఎస్తేరు తరువాత, ఇశ్రాయేలీయుల చరిత్ర గురించి మనకు ఎక్కువ సమాచారం లభించదు. బదులుగా, తరువాత వచ్చే గ్రంథాలు—ప్రత్యేకంగా ప్రవక్తల గ్రంథాలు—చారిత్రక గ్రంథాలు సమర్పించిన కాలక్రమం లోపల సరిపోతాయి. ఉదాహరణకు, యిర్మీయా ప్రవక్త యొక్క పరిచర్య, 2 రాజులు 22–25లో వ్రాయబడిన సంఘటనలందు జరిగింది (మరియు 2 దినవృత్తాంతములు 34–36లో సాదృశ్యమైన వృత్తాంతముంది). దీనిని తెలుసుకోవడం మీరు చదివే చారిత్రక కథనాలు మరియు ప్రవచనాత్మక గ్రంథాలు రెండింటిని చదివే విధానాన్ని ప్రభావితం చేయగలదు.

ఏదైనా సరిపోనప్పుడు

పాత నిబంధనను చదివేటప్పుడు, ఏదైనా చరిత్రలో వలె, ఆధునిక దృష్టికి వింతగా లేదా ఇబ్బందికరంగా అనిపించే విషయాలను చేసే లేదా చెప్పే వ్యక్తుల గురించి మీరు చదివే అవకాశం ఉంది. పాత నిబంధన రచయతలు కొన్ని విధాలుగా మనకంటె చాలా భిన్నమైన దృక్కోణము నుండి లోకమును చూసారని మనము ఆశించవచ్చు. హింస, జాతి సంబంధాలు మరియు మహిళల పాత్రలు ప్రాచీన రచయితలు ఈ రోజు మనకంటే భిన్నంగా చూసిన కొన్ని సమస్యలైయుండవచ్చు.

లేఖనాలలో ఇబ్బందికరంగా అనిపించే గద్యభాగాలను ఎదుర్కొన్నప్పుడు మనము ఏమి చేయాలి? మొదట, ప్రతి భాగాన్ని విస్తృత సందర్భంలో పరిగణించడానికి ఇది సహాయపడవచ్చు. ఇది దేవుని యొక్క రక్షణ ప్రణాళికలో ఎలా సరిపోతుంది? పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తు యొక్క స్వభావము గురించి మీకు తెలిసిన దానితో ఇది ఎలా సరిపోతుంది? ఇతర లేఖనాలలో బయల్పరచబడిన సత్యములతో లేదా జీవిస్తున్న ప్రవక్తల బోధనలతో ఇది ఎలా సరిపోతుంది? ఇది మీ స్వంత హృదయానికి, మనస్సుకు ఆత్మ ఇచ్చే ప్రేరేపణలతో ఎలా సరిపోతుంది?

కొన్ని సందర్భాలలో, గద్యభాగము వీటిలో దేనితోను సరిపోయినట్లు కనబడకపోవచ్చు. కొన్నిసార్లు గద్యభాగము ఒక పజిల్ ముక్కలా ఉండవచ్చు, మీరు ఇప్పటికే సమకూర్చిన ఇతర ముక్కల మధ్య దానికి చోటు ఉన్నట్లు అనిపించకపోవచ్చు. ఆ ముక్క సరిపోయేలా బలవంతం చేయడానికి ప్రయత్నించడం ఉత్తమ విధానం కాదు. అయితే పూర్తిగా పజిల్‌ను వదిలివేయడం కూడా మంచిదికాదు. బదులుగా, ప్రస్తుతానికి మీరు పజిల్‌ ముక్కను ప్రక్కన పెట్టవలసి ఉంటుంది. మీరు ఎక్కువగా నేర్చుకొని, ఎక్కువగా పజిల్‌ను కలిపి చేర్చినప్పుడు, ముక్కలు ఎలా కలిసిపోతాయో మీరు బాగా చూడగలరు.

ఒక నిర్దిష్ట దృక్కోణానికి పరిమితం కావడంతో పాటు, లేఖనాత్మక చరిత్రలు మానవ తప్పిదానికి లోబడి ఉంటాయని గుర్తుంచుకోవడానికి కూడా ఇది సహాయపడగలదు. ఉదాహరణకు, శతాబ్దాలుగా, సిద్ధాంతము, విధులు మరియు నిబంధనలను గూర్చి ముఖ్యమైన సత్యములతో కలిపి “[బైబిలు] నుండి స్పష్టమైన మరియు అతి ప్రశస్థమైన అనేక భాగములు [తీసివేయబడినవి],” (1 నీఫై 13:28; 26, 29, 40 వచనాలు కూడా చూడండి). అదే సమయంలో, మన స్వంత దృక్కోణాలు కూడా పరిమితమైనవని మనము ఒప్పుకోవాలి: మనము పూర్తిగా గ్రహించని విషయాలు మరియు మనమింకా జవాబివ్వలేని ప్రశ్నలు ఎల్లప్పుడూ ఉంటాయి.

పజిల్‌ను అమర్చుతున్న ఒకరు

కొన్ని లేఖన గద్యభాగాలు పజిల్ ముక్కల వలె ఉండి, మిగిలిన పజిల్‌తో ఎలా సరిపోతాయో మనకు తెలియకపోవచ్చు.

రత్నాలను కనుగొనుట

కానీ ఈ లోపు, జవాబివ్వబడని ప్రశ్నలు పాత నిబంధనలో కనబడిన నిత్య సత్యము యొక్క ప్రశస్థమైన రత్నాలనుండి మనల్ని దూరంగా ఉంచాల్సినవసరం లేదు—ఆ రత్నాలు కొన్నిసార్లు కష్టమైన అనుభవాలు మరియు అపరిపూర్ణులైన జనుల చేత చేయబడిన బలహీనమైన ఎంపికలు గల రాతినేలలో దాచబడినప్పడు కూడా. బహుశా ఈ రత్నాలలో మిక్కిలి ప్రశస్థమైనవి దేవుని యొక్క ప్రేమను గూర్చి సాక్ష్యమిచ్చే కథనాలు మరియు గద్యభాగాలు—ప్రత్యేకించి యేసు క్రీస్తు యొక్క త్యాగము గురించి ఆలోచించడానికి మన మనస్సులను నడిపించేవి కావచ్చు. ఏ కోణంలో చూసినా, ఇటువంటి రత్నములు అప్పుడు విలువైనవిగా ఉన్నట్లే ఈరోజూ విలువైనవిగా ఉన్నాయి. ఈ వృత్తాంతములు దేవుని నిబంధన జనులను గూర్చి చెప్తున్నాయి కనుక—మానవ బలహీనతలు కలిగియున్నప్పటికీ, ప్రభువును ప్రేమించి, సేవించిన స్త్రీ పురుషులు—పాత నిబంధన యొక్క చారిత్రక గ్రంథాలలో సమృద్ధిగా ఉన్న సత్యము యొక్క రత్నాలు.

రత్నము

వివరణలు

  1. ఈ రోజు మన దగ్గర ఉన్న బైబిలు యొక్క చారిత్రక కథనాలు ప్రధానంగా పేరులేని చాలామంది రచయితలు మరియు సంగ్రహకుల పని, వారు కొన్నిసార్లు వారు వర్ణించిన కాలవ్యవధి తరువాత చాలా సంవత్సరాలు, శతాబ్దాలు కూడా పనిచేశారు. వారు అనేక రకాల చారిత్రక వనరులపై ఆధారపడ్డారు మరియు వారి వృత్తాంతాలలో ఏమి చేర్చాలి మరియు దేనిని మినహాయించాలి అనే దానిపై నిర్ణయాలు తీసుకున్నారు.

  2. ఉదాహరణకు, 1–2 దినవృత్తాంతములు 1 సమూయేలు 31 నుండి 2 రాజులు ముగింపు వరకు దాదాపు అదే కాలాన్ని గురించి చెప్పినప్పటికీ, 1–2 దినవృత్తాంతములు ‌లోని వృత్తాంతము విభిన్న వివరాలను నొక్కిచెప్తుంది మరియు భిన్నమైన దృక్పథాన్ని ప్రదర్శిస్తుంది, దాదాపుగా యూదా యొక్క దక్షిణ రాజ్యముపై దృష్టి సారిస్తుంది మరియు తరచుగా దావీదు మరియు సొలొమోను గురించి ప్రతికూల కథనాలను వదిలివేస్తుంది (ఉదాహరణకు, 1 దినవృత్తాంతములు 19–20 తో 2 సమూయేలు 10–12ను మరియు 2 దినవృత్తాంతములు 9తో 1 రాజులు 10–11ను పోల్చండి). 1 మరియు 2 దినవృత్తాంతములతో ఆ వృత్తాంతమును పోల్చుటలో విలువ ఉన్నప్పటికీ, రండి, నన్ను అనుసరించండి 1 మరియు 2 రాజులు లోనున్న వృత్తాంతమును అధ్యయనము చేయడాన్ని నొక్కిచెప్తుంది. 1 సమూయేలు–2 రాజులు నివేదిక వ్రాయడం బబులోనీయ సామ్రాజ్యం యూదాను జయించడానికి ముందే ప్రారంభమై బబులోనులో బహిష్కరణ సమయమందు పూర్తి చేయబడిందని తెలుసుకోవడం సహాయకరంగా ఉండవచ్చు. 1—2 దినవృత్తాంతములుగా మారిన నివేదిక, మరొకవైపు, యూదులు తమ బహిష్కరణ నుండి యెరూషలేముకు తిరిగి వచ్చిన తరువాత సంగ్రహించబడింది. మీరు చదివినప్పుడు, ఈ విభిన్న పరిస్థితులు వేర్వేరు వృత్తాంతపు సంగ్రహకర్తల దృక్కోణాలను ఎలా ప్రభావితం చేసియుండవచ్చో మీరు పరిగణించవచ్చు.

  3. ఈ వనరు ప్రారంభంలో మీరు “పాత నిబంధన సమీక్ష”ను కనుగొంటారు, అది ఇశ్రాయేలీయుల చరిత్రలో ప్రతీ ప్రవక్త యొక్క పరిచర్య ఎలా ఇమిడియుంటుందో చూపే కాలక్రమం (అదేవిధంగా నిర్ణయించవచ్చు). పాత నిబంధన యొక్క ప్రవచనాత్మక గ్రంథాలలో అనేకము ఆ కాలక్రమం చివరలో వస్తాయని మీరు గమనించవచ్చు—ఇశ్రాయేలీయుల సంతతి జయించబడి, బహిష్కరించబడి, వారి శత్రువులచేత చెదరగొట్టబడకముందు మరియు తరువాత.

  4. విశ్వాస ప్రమాణాలు 1:8 చూడండి.