2024 రండి, నన్ను అనుసరించండి
మే 4–10. “మీరు యెహోవామీద తిరుగబడకుడి, భయపడకుడి”: సంఖ్యాకాండము 11–14; 20–24; 27


“మే 4–10. ‘మీరు యెహోవామీద తిరుగబడకుడి, భయపడకుడి’: సంఖ్యాకాండము 11–14; 20–24; 27,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: పాత నిబంధన 2026 (2026)

“మే 4–10. ‘మీరు యెహోవామీద తిరుగబడకుడి, భయపడకుడి,’” రండి, నన్ను అనుసరించండి: పాత నిబంధన 2026

వాడి రమ్ యొక్క ఛాయాచిత్రము

సీనాయి ద్వీపకల్పానికి సమీపంలో ఉన్న ఎడారి

మే 4-10: “మీరు యెహోవామీద తిరుగబడకుడి, భయపడకుడి”

సంఖ్యాకాండము 11–14; 20–2427

నడిచి వెళ్లినా కూడా, సీనాయి అరణ్యము నుండి కనానులో వాగ్దాన దేశమునకు ప్రయాణించడానికి సాధారణంగా 40 సంవత్సరాలు పట్టదు. కానీ ఇశ్రాయేలీయులకు అంతకాలం అవసరము, భౌగోళిక దూరమును చేరుకొనుటకు కాదు, కానీ ఆత్మీయ దూరాన్ని చేరుకొనుటకు: వారు ఎవరు అనేదానికి మరియు ఆయన నిబంధన జనులుగా ప్రభువు వారు కావాలని కోరిన దానికి మధ్యగల దూరము.

సంఖ్యాకాండ గ్రంథము, వాగ్దాన దేశములో ప్రవేశించడానికి ముందు ఇశ్రాయేలీయులు నేర్చుకోవాల్సిన పాఠములతో సహా ఆ 40 సంవత్సరాలలో జరిగిన దానిలో కొంతవరకు వివరిస్తుంది. ప్రభువు యొక్క సేవకులపట్ల విశ్వాసపాత్రంగా ఉండడం గురించి వారు నేర్చుకున్నారు (సంఖ్యాకాండము 12 చూడండి). భవిష్యత్తు నిరాశాజనకంగా కనబడినప్పుడు కూడా, ప్రభువు యొక్క శక్తిని నమ్మడం గురించి వారు నేర్చుకున్నారు (సంఖ్యాకాండము 13–14 చూడండి). విశ్వాసరహితంగా ఉండడం ఆత్మీయంగా హాని కలిగిస్తుందని వారు తెలుసుకున్నారు, కానీ వారు పశ్చాత్తాపపడగలరు మరియు స్వస్థత కొరకు రక్షకుని వైపు చూడగలరు (సంఖ్యాకాండము 21:4–9 చూడండి).

కొన్ని విధాలుగా మనమందరం ఇశ్రాయేలీయుల వలె ఉన్నాము. ఆత్మీయ అరణ్యములో ఉండటం ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు మరియు వారు నేర్చుకొన్న పాఠములు మన వాగ్దాన దేశములో: మన పరలోక తండ్రితో నిత్యజీవములో ప్రవేశించడానికి సిద్ధపడటానికి మనకు సహాయపడగలవు.

సంఖ్యాకాండ గ్రంథమును సమీక్షించడానికి, బైబిలు నిఘంటువులో “సంఖ్యాకాండము” చూడండి.

అధ్యయన చిహ్నము

గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు

సంఖ్యాకాండము 11:11–17, 24–2912

బయల్పాటు అందరికీ లభ్యముగా ఉన్నది, కానీ దేవుడు తన సంఘాన్ని ఆయన ప్రవక్త ద్వారా నడిపిస్తారు.

సంఖ్యాకాండము 11:11–17, 24–29 లో, మోషే ఎదుర్కొన్న సమస్యను, దేవుడు ప్రతిపాదించిన పరిష్కారమును గమనించండి. మోషే “యెహోవా ప్రజలందరును ప్రవక్తలగునట్లు” తాను కోరుతున్నానని చెప్పినప్పుడు, అతడి ఉద్దేశ్యమేమిటని మీరనుకుంటున్నారు? (29వ వచనము). మీరు ఈ ప్రశ్నను ధ్యానిస్తున్నప్పుడు, అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ గారి సందేశం, “సంఘము కొరకు బయల్పాటు, మన జీవితాల కొరకు బయల్పాటు” (లియహోనా, మే 2018, 93–96)లో సాధ్యమైన సమాధానాల కోసం చూడండి.

మనమందరం బయల్పాటును పొందగలమని చెప్పడానికి అర్థము, మోషే నడిపించిన విధంగా మనమందరం దేవుని ప్రజలను నడిపించగలమని కాదు. సంఖ్యాకాండము 12లో వ్రాయబడిన సంఘటన దీనిని స్పష్టం చేస్తుంది. ఈ అధ్యాయంలో మీరు ఏ హెచ్చరికలను కనుగొంటారు? వ్యక్తిగత బయల్పాటు మరియు ప్రవక్తను అనుసరించుట గురించి మీరు గ్రహించాలని ప్రభువు మిమ్మల్ని కోరుతున్నదేమిటని మీరు భావిస్తున్నారు?

1 నీఫై 10:17; సిద్ధాంతము మరియు నిబంధనలు 28:1–7 కూడా చూడండి.

అత్యంత ముఖ్యమైన దానిపై దృష్టిపెట్టండి. రండి, నన్ను అనుసరించండి లో వారపు పఠన సూచనలతో కొంతమంది ఉక్కిరిబిక్కిరి అవుతారు. మీరు నమూనా‌లను సమీక్షిస్తున్నప్పుడు, ఆత్మను అనుసరించండి. మీ స్వంత అవసరాలు మరియు మీరు బోధించే వ్యక్తుల అవసరాలను పరిగణించండి. అనేక అధ్యాయాలను కేవలం పైపైన చదవడం కంటే వారంలో ఒక సూత్రాన్ని అర్థం చేసుకోవడం మరియు పూర్తిగా అన్వయించడం మరింత ఉపయోగకరంగా ఉంటుంది.

సంఖ్యాకాండము 12:3

“మోషే మిక్కిలి సాత్వికుడు.”

ఫరో ముందు నిలబడి, ప్రభువు శక్తితో గొప్ప అద్భుతాలు చేసిన మోషే కూడా “మిక్కిలి సాత్వికుడు” (సంఖ్యాకాండము 12:3) అని తెలుసుకుని కొంతమంది ఆశ్చర్యపోతారు. సాత్వికంగా ఉండడం అంటే అర్థమేమిటి? “సాత్వికులు మరియు దీనులు” (లియహోనా, మే 2018, 30–33)లో ఎల్డర్ డేవిడ్ ఎ. బెడ్నార్ గారి వివరణను అధ్యయనం చేయడాన్ని పరిగణించండి.

నిర్గమకాండము 18:13–25; సంఖ్యాకాండము 11:26–29; సంఖ్యాకాండము 12; హెబ్రీయులకు 11:24–27 మరియు మోషే 1:10–11లో సాత్వికమునకు మోషే యొక్క మాదిరుల నుండి మీరేమి నేర్చుకుంటారు? రక్షకుడు ఎలా సాత్వికాన్ని చూపించారో కూడా మీరు ఆలోచించవచ్చు (మత్తయి 11:29; 27:11–14; లూకా 22:41–42; యోహాను 13:4–5 చూడండి). ఈ మాదిరులు మీకు ఏమి బోధిస్తాయి?

సంఖ్యాకాండము 13–14

ప్రభువునందు విశ్వాసముతో, నేను భవిష్యత్తు కొరకు నిరీక్షణను కలిగియుండగలను.

సంఖ్యాకాండము 13–14 మీరు చదివినప్పుడు, ఇశ్రాయేలీయుల స్థానములో మిమ్మల్ని మీరు ఉంచడానికి ప్రయత్నించండి. “ఐగుప్తుకు తిరిగి వెళ్లడానికి” వారు ఎందుకు కోరుకున్నారని మీరనుకుంటున్నారు? (సంఖ్యాకాండము 14:3). కాలేబు కలిగియున్న ఇతర “ఆత్మను” మీరు ఎలా వర్ణిస్తారు? (సంఖ్యాకాండము 14:24). కాలేబు మరియు యెహోషువ యొక్క విశ్వాసము గురించి మిమ్మల్ని ఆకట్టుకొనేది ఏది మరియు మీరు ఎదుర్కొనే పరిస్థితులకు వారి మాదిరులను మీరు ఎలా అన్వయిస్తారు?

మోషే మరియు కొంతమంది ఇశ్రాయేలీయుల గూఢచారులు

ఇశ్రాయేలీయుల గూఢచారులలో పదిమంది భయపడ్డారు; యెహోషువ మరియు కాలేబు విశ్వాసం కలిగి ఉన్నారు. యెహోషువ మరియు కాలేబు: విధేయతగల గూఢచారులు, డగ్లస్ క్లాబా చేత. © Lifeway Collection/licensed from goodsalt.com

సంఖ్యాకాండము 21:4–9

సెమినరీ చిహ్నము
యేసు క్రీస్తు వైపు నేను విశ్వాసముతో చూసినట్లయితే, ఆయన నన్ను ఆత్మీయంగా స్వస్థపరచగలరు.

సంఖ్యాకాండము 21:4–9లో వ్రాయబడిన కథనమును మోర్మన్ గ్రంథ ప్రవక్తలు ఎరుగుదురు మరియు దాని ఆత్మీయ ప్రాముఖ్యతను వారు గ్రహించారు. ఈ కథను గూర్చి వారి బోధనలను 1 నీఫై 17:40–41; ఆల్మా 33:18–22; మరియు హీలమన్ 8:13–15లో చదవండి. మీరు చదివినప్పుడు ధ్యానించడానికి ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఉన్నాయి:

  • ఇత్తడి సర్పము దేనిని సూచించవచ్చు?

  • పాము కాటులు దేనిని సూచిస్తాయి?

  • ఇశ్రాయేలీయులు స్వస్థపరచబడడానికి “ఇత్తడి సర్పమును [చూడాలి]” (సంఖ్యాకాండము 21:9). చూడడానికి కొంతమంది ఎందుకు నిరాకరించారని మీరనుకుంటున్నారు? అటువంటిది ఏదైనా మీకెప్పుడైనా జరిగిందా?

  • మరింత సంపూర్ణంగా “దేవుని యొక్క కుమారుని వైపు విశ్వాసముతో చూడడానికి” మరియు స్వస్థపరచబడడానికి ఏమి చేయాలని మీరు ప్రేరేపించబడ్డారు? (హీలమన్ 8:15).

ఈ గద్యభాగాలను చదవడం జనులు క్రీస్తుపై దృష్టి కేంద్రీకరించడం అవసరమైన లేఖనాలలోని ఇతర సమయాలను మీకు గుర్తు చేయవచ్చు. ఉదాహరణకు, సంఖ్యాకాండము 21:4–9లోని సందేశాన్ని మత్తయి 14:25–31 మరియు 1 నీఫై 8:24–28తో పోల్చండి (ఈ వారపు నమూనా చివరనున్న చిత్రాలను కూడా చూడండి). ఏది మనల్ని క్రీస్తు నుండి దూరం చేస్తుంది? ఆయనపై దృష్టి కేంద్రీకరించే వ్యక్తులను ఆయన ఎలా ఆశీర్వదిస్తారు?

సంఖ్యాకాండము 22–24

వద్దని ఇతరులు నన్ను ఒప్పించడానికి ప్రయత్నించినప్పటికీ, నేను దేవుని చిత్తమును అనుసరించగలను.

మోయాబు రాజైన బాలాకు, ఇశ్రాయేలీయులు సమీపిస్తున్నారని తెలుసుకొన్నప్పుడు దీవెనలు మరియు శాపములు ప్రకటించడానికి ప్రసిద్ధి చెందిన బిలామును పిలిపించాడు. అతడు ఇశ్రాయేలీయులను శపించాలని బాలాకు కోరుకున్నాడు. బాలాకు బిలామును ఒప్పించడానికి ఎలా ప్రయత్నించాడో గమనించండి (సంఖ్యాకాండము 22:5–7, 15–17 చూడండి) మరియు దేవుని చిత్తమునకు వ్యతిరేకంగా చేయాలని మీరు ఎదుర్కొనే శోధనలను గూర్చి ఆలోచించండి. సంఖ్యాకాండము 22:18, 38; 23:8, 12, 26; 24:13 లో బిలాము యొక్క జవాబులను గూర్చి మిమ్మల్ని ఆకట్టుకొనేది ఏది? విచారకరంగా, చివరకు బిలాము ఒత్తిడికి లొంగిపోయి, ఇశ్రాయేలీయులను మోసగించాడు (సంఖ్యాకాండము 31:16; యూదా 1:11 చూడండి). ఇతరుల ఒత్తిడిని లక్ష్యపెట్టకుండా మీరు ప్రభువుపట్ల ఎలా విశ్వాసంగా ఉండగలరో ధ్యానించండి.

పిల్లల విభాగపు చిహ్నము

పిల్లలకు బోధించడానికి ఉపాయములు

సంఖ్యాకాండము 11:4-10

ప్రభువు నాకిచ్చిన వాటిని బట్టి నేను కృతజ్ఞత కలిగియుండగలను.

  • ఇశ్రాయేలీయులకు సహాయం చేయడానికి యెహోవా చేసిన కొన్ని అద్భుతాలు మీకు గుర్తున్నాయా అని మీ పిల్లలను అడగండి (పాత నిబంధన కథలు, 67–74లో “ఐగుప్తులో తెగుళ్ళు” మరియు “పస్కా పండుగ” చూడండి). తర్వాత, ఇశ్రాయేలీయులు తమ ఆశీర్వాదాలను మరచిపోయి ఫిర్యాదు చేస్తున్నారని నొక్కి చెప్తూ మీరు వారి కోసం సంఖ్యాకాండము 11:4–10 ని సంక్షిప్తం చేయవచ్చు. మనం కొన్నిసార్లు ఏ ఆశీర్వాదాలను మరచిపోతాము?

సంఖ్యాకాండము 12

ఆయన ప్రవక్తను అనుసరించాలని ప్రభువు నన్ను కోరుతున్నారు.

  • సంఖ్యాకాండము 12 ను పరిచయం చేయడానికి, మోషే సోదరుడు మరియు సోదరి అయిన అహరోను మరియు మిర్యాములతో ప్రభువు సంతోషంగా లేరని మీరు మీ పిల్లలకు చెప్పవచ్చు. ఎందుకు అని తెలుసుకోవడానికి సంఖ్యాకాండము 12:1–8 చదవమని వారిని ఆహ్వానించండి. ప్రభువు యొక్క ప్రవక్తను గౌరవించి, ఆశీర్వదించబడిన వ్యక్తుల ఉదాహరణలను లేఖనాలలో కనుగొనడంలో మీ పిల్లలకు సహాయం చేయడానికి Gospel Art Book [సువార్త కళా పుస్తకము]‌ను ఉపయోగించడాన్ని పరిగణించండి. ప్రభువు యొక్క ప్రవక్తను అనుసరించినప్పుడు మనం ఎలా ఆశీర్వదించబడతాము?

సంఖ్యాకాండము 21:6-9

నేను యేసు క్రీస్తు వైపు చూడగలను.

  • మీ పిల్లలు సంఖ్యాకాండము 21:6-9లో జరిగిన దానిని తెలుసుకోవడానికి పాత నిబంధన కథలు, 83-84లో ఉన్న “మోషే మరియు ఇత్తడి సర్పము”ను మీరు ఉపయోగించవచ్చు. ఇత్తడి సర్పం యేసు క్రీస్తు వలె ఎలా ఉంది? (యోహాను 3:14–15 చూడండి). మీ పిల్లలు కాగితంతో పాముని తయారు చేసి, దానిపై “విశ్వాసంతో దేవుని కుమారుని వైపు చూడడానికి” (హీలమన్ 8:15) చేయగలిగే కొన్ని సాధారణ విషయాలను వ్రాయడాన్ని ఆనందించవచ్చు.

    1:2

    Moses and the Brass Serpent

  • పెద్ద పిల్లలు ఈ క్రింది లేఖనాల్లో ఒకదాన్ని ఎంచుకోవచ్చు మరియు కథపై వారి అవగాహనకు తోడ్పడే వాటిని పంచుకోవచ్చు: 1 నీఫై 17:41; ఆల్మా 33:18–20; హీలమన్ 8:13–15; సిద్ధాంతము మరియు నిబంధనలు 6:36.

ఇత్తడి సర్పము

Bronze Serpent [కంచు సర్పము], బ్రెంట్ ఎవన్స్ చేత

సంఖ్యాకాండము 22–24

వద్దని ఇతరులు నన్ను ఒప్పించడానికి ప్రయత్నించినప్పటికీ, నేను దేవుని చిత్తమును అనుసరించగలను.

  • మోయాబు రాజు బాలాకు అతనికి ఘనతను, సంపదలను ఇచ్చినప్పటికీ, బిలాము దేవుని జనులను శపించడానికి ఎలా నిరాకరించాడో నొక్కి చెబుతూ, మీ పిల్లల కోసం సంఖ్యాకాండము 22:1–18 ని సంక్షిప్తం చేయండి. అప్పుడు బిలాము దేవుణ్ణి వెంబడించాలనుకుంటున్నాడని చూపించే వాక్యభాగాల కోసం ఈ క్రింది వచనాలను శోధించడంలో మీరు మీ పిల్లలకు సహాయం చేయవచ్చు: సంఖ్యాకాండము 22:18; 23:26; 24:13. బహుశా మీ పిల్లలు వారు ఇష్టపడే ఒక వాక్యభాగాన్ని ఎంచుకుని, ప్రభువుపట్ల విధేయత చూపడాన్ని గుర్తుంచుకోవడానికి వారికి సహాయం చేసేలా దానిని కార్డుపై వ్రాసుకోవచ్చు.

అధికము కొరకు, ఫ్రెండ్ పత్రిక యొక్క ఈ నెల సంచికను చూడండి.

సిలువపై ఉన్న యేసు, ఇత్తడి సర్పం, పేతురు నీటిపై నడవడానికి సహాయం చేస్తున్న యేసు మరియు లీహై దర్శనమును చూపుతున్న మిశ్రమ చిత్రం

ఎడమవైపు పైన:The Crucifixion of Christ [క్రీస్తు యొక్క సిలువధారణ]. కుడివైపు పైన:Moses and the Brass Serpent [మోషే మరియు ఇత్తడి సర్పము], జూడిత్ మెహ‌ర్ చేత. ఎడమవైపు క్రింద:Finisher of Faith [విశ్వాసమునకు కర్త], కెల్సీ మరియు జెస్సీ లైట్‌వేవ్ చేత కుడివైపు క్రింద:Lehi’s Dream [లీహై యొక్క కల], జెర్రీ థాంప్సన్ చేత

ప్రాథమిక ప్రోత్సాహకార్యక్రమ పేజీ: నేను యేసు క్రీస్తు వైపు చూడగలను