12.
యేసు క్రీస్తు ఆనందాన్ని ఇస్తారు
సిద్ధాంతము మరియు నిబంధనలు 101:36
మీ పరలోక తండ్రి సంతోషంగా ఉన్నారు. తన బిడ్డవైన నీకు సాధ్యమైనంత ఎక్కువ ఆనందం కలగాలని ఆయన కోరుకుంటున్నారు. అందుకే ఆయన సంతోష ప్రణాళికను సిద్ధం చేశారు. ఆయన తన కుమారుడైన యేసు క్రీస్తును మీ రక్షకునిగా ఉండటానికి మరియు తన సువార్తను బోధించడానికి పంపారు. సువార్త అనే పదానికి “శుభవార్త” అని అర్థం, మరియు ఆ శుభవార్త ఏమిటంటే, యేసు క్రీస్తు కారణంగా, మీరు ఈ జీవితంలో ఆనందాన్ని మరియు నిత్యత్వంలో సంపూర్ణమైన సంతోషాన్ని పొందవచ్చు.
నిత్య సత్యాలు
మీరు ఆనందం మరియు సంతోషాన్ని పొందడానికి అర్హులు. అదే మీ జీవితం యొక్క ఉద్దేశ్యం. ఇది పరలోక తండ్రి యొక్క సంతోషకర ప్రణాళిక ఉద్దేశ్యం. దీని అర్థం మీరు ఎప్పటికీ విచారపడరని లేదా కష్ట సమయాలను ఎదుర్కోరని కాదు. అయితే, కష్ట సమయాలను అధిగమించడానికి మరియు ఆనందాన్ని కనుగొనడానికి రక్షకుడు మీకు సహాయం చేయగలరని దీని అర్థం.
ఆనందం మీ పరిస్థితుల నుండి రాదు; అది యేసు క్రీస్తును అనుసరించడం ద్వారా వస్తుంది. మీకు ఒక చెడ్డ రోజు, ఒక చెడ్డ వారం లేదా ఒక చెడ్డ సంవత్సరం ఎదురుకావచ్చు. అయితే ఆనందం అనేది మీ జీవితంలో దుఃఖం లేకపోవడం కాదు; అది మీ జీవితంలో క్రీస్తు యొక్క ఉనికి.
రక్షకుని ఆనందం ఇతర ఆనందముల కంటే గొప్పది మరియు ఎక్కువ కాలం నిలిచి ఉండేది. స్వార్థపూరితమైన మార్గాలలో లేదా ప్రాపంచిక సుఖాల నుండి ఆనందాన్ని మరియు సంతృప్తిని పొందమని సాతాను మిమ్మల్ని ప్రలోభపెడతాడు. యేసు క్రీస్తుకు మరియు ఆయన ఆజ్ఞలకు విరుద్ధమైన ఏదీ మీకు నిజమైన, శాశ్వతమైన ఆనందాన్ని మరియు సంతోషాన్ని తీసుకురాలేదు. ఈ భూమిపై ఉన్న విషయాలు తాత్కాలికమైనవని గుర్తుంచుకోండి. యేసు క్రీస్తు సువార్త లోతైన, పవిత్రమైన మరియు శాశ్వతమైన ఆనందాన్ని మరియు సంతోషాన్ని అందిస్తుంది.
ఆహ్వానాలు
సంతోషాన్ని ఎంచుకొనుము. ఈ లోకంలో దుఃఖం మరియు కష్టాలు ఉన్నాయన్నది నిజమే అయినప్పటికీ, పరలోక తండ్రి ఈ లోకాన్ని అనేక అందమైన మరియు మంచి విషయాలతో కూడా నింపారు. వాటిని వెతికి పట్టుకోండి. ప్రతిరోజూ సంతోషించడానికి కారణాలను గమనించడానికి ప్రయత్నించండి—వీలైతే వాటిని రాసి పెట్టుకోండి. ఇవి పరలోకంలో ఉన్న మీ ప్రేమగల తండ్రి నుండి వచ్చిన బహుమతులు.
ఇతరులకు ఆనందాన్ని మరియు సంతోషాన్ని కలిగించండి. మనకు ఆనందాన్ని కలిగించడంలో యేసు క్రీస్తు సంపూర్ణమైన ఆనందాన్ని పొందారు. ఇతరులకు సేవ చేయడం ద్వారా ఆనందాన్ని మరియు సంతోషాన్ని పొందడం ద్వారా మీరు ఆయన మాదిరిని అనుసరించవచ్చు. ఎవరైనా ప్రేమించబడుతున్నారని అనిపించేలా వారికి సహాయం చేయండి. హృదయపూర్వక అభినందన ఇవ్వండి. కష్టాలలో ఉన్న వ్యక్తిని ప్రోత్సహించండి. మీ జీవితంలో మీకు మరింత ఆనందం అవసరమని ఎప్పుడైనా అనిపిస్తే, ఇతరుల జీవితంలోకి ఆనందాన్ని తీసుకురావడానికి ప్రయత్నించండి.
ప్రభువును ఆరాధించడంలో ఆనందంగా ఉండండి. మీరు సంఘానికి వెళ్ళినప్పుడు, యేసు క్రీస్తు మీకు ఇచ్చే ఆనందంపై దృష్టి పెట్టండి మరియు దాని కోసం ఆయనను స్తుతించండి! మీ సంఘ సమావేశాలలో ఆనందకరమైన వాతావరణాన్ని పెంపొందించడానికి మీ వంతు కృషి చేయండి. పవిత్రమైన సంగీతాన్ని మీ గృహములో మరియు సంఘములో చేసే ఆరాధనలో భాగం చేసుకోండి.
వాగ్దానం చేయబడిన దీవెనలు
జీవితం కష్టంగా ఉన్నప్పుడు కూడా మీరు ఆనందాన్ని అనుభూతి చెందవచ్చు. ఇది ఎలా సాధ్యమని మీరు ఆశ్చర్యపోవచ్చు, కానీ ఇది నిజం. యేసు క్రీస్తుపై మరియు ఆయన స్వస్థపరిచే శక్తిపై మరియు ఆయన శాశ్వత వాగ్దానాలపై మీకు ఉన్న విశ్వాసం మీకు నిరంతర ఆనందాన్ని ఇవ్వగలదు. ఆయన ఆనందం దుఃఖాన్ని అధిగమిస్తుంది మరియు మానవులు గ్రహించలేని అతీతమైన శాంతిని ప్రసాదిస్తుంది.
దేవుని సిలెస్టియల్ రాజ్యములో సంపూర్ణమైన ఆనందం మీ కొరకు ఎదురుచూస్తుంది. నిత్య ఆనందాన్ని పొందకుండా మిమ్మల్ని అడ్డుకోగల వాటన్నింటినీ యేసు క్రీస్తు జయించారు. మీరు ఆయనను విశ్వసించి, ఆయనను అనుసరించినప్పుడు, ఈ ఆనందం మీకు లభిస్తుంది.
ప్రశ్నలు మరియు సమాధానాలు
సువార్త ఆనందకరమైనదైతే, నాకు ఎందుకు ఇంత విచారంగా అనిపిస్తుంది? విచారంగా ఉండటం అనేది మీరు సువార్త ప్రకారం జీవించడంలేదు అనడానికి సంకేతం కాదు. ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు, పరీక్షలు మరియు దుఃఖం ఉంటాయి. యేసు క్రీస్తును అనుసరించడం దీనిని మార్చదు, కానీ అది మిమ్మల్ని ఓ రక్షకుడితో అనుసంధానిస్తుంది, ఆయన మీకు ఓదార్పునివ్వగలరు మరియు ఆనందం, సంతోషాన్ని కనుగొనడంలో మీకు సహాయం చేయగలరు.
ప్రపంచంలో ఇన్ని బాధలు ఎందుకు ఉన్నాయి? ప్రపంచంలో జరిగే కొన్ని కష్టాలకు కారణం, ప్రజలు తమ స్వేచ్ఛను ఉపయోగించి చెడు నిర్ణయాలు తీసుకోవడమే. ఇది వారికి మరియు ఇతరులకు కూడా బాధను కలిగించవచ్చు. మరికొన్ని సందర్భాలలో, బాధ అనేది ఎవరో చేసిన తప్పు వలన వచ్చేది కాదు—అది కేవలం అసంపూర్ణమైన ప్రపంచంలో జీవించడం వల్ల కలిగే ఫలితం మాత్రమే. కారణం ఏదైనప్పటికీ, ఎవరైనా బాధపడటాన్ని చూడటం, ముఖ్యంగా మీరు ప్రేమించేవారు బాధపడటాన్ని చూడటం హృదయ విదారకంగా ఉంటుంది. మీరు బాధపడినప్పుడు దేవుడు కూడా దుఃఖిస్తారని తెలుసుకోండి. ఆయన మర్త్య జీవితంలోని శ్రమలను మీరు ఎదుగుటకు మరియు ఆయనతో పాటు నిత్య ఆనందం కోసం సిద్ధపడేలా సహాయపడటానికి అనుమతిస్తారు, కానీ ఆయన మిమ్మల్ని బాధలలో ఒంటరిగా వదిలిపెట్టరు. ఆయన మీ బాధను తనపైకి తీసుకుని, మీకు సహాయం చేయడానికి యేసు క్రీస్తును పంపారు. యేసు క్రీస్తే మీ బలం! మరియు తన అనుచరులలో ఒకరిగా, ఇతరుల బాధలను తగ్గించడంలో సహాయపడటానికి మీకు చేతనైనది చేయమని ఆయన మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు.
కీర్తనలు 16:11 (దేవుని సన్నిధిలో సంపూర్ణ ఆనందం ఉంటుంది); 95:1 (ప్రభువును కీర్తించండి); యోహాను 16:33 (ధైర్యంగా ఉండండి; యేసు క్రీస్తు లోకాన్ని జయించారు); గలతీయులు 5:22 (ఆత్మ ఫలము యొక్క ఆనందము); హెబ్రీయులు 12:2 (దేవుని బిడ్డలను రక్షించడం వల్ల కలిగే ఆనందం కోసమే యేసు తన బాధలను సహించారు.); 2 నీఫై 2:25 (దేవుడు మీరు ఆనందంగా ఉండాలని కోరుకుంటారు.); ఆల్మా 26:15–16 (దేవుని పని చేయడం ఆనందానికి దారితీస్తుంది.); సిద్ధాంతము మరియు నిబంధనలు 18:15–16 (ఇతరులు క్రీస్తు వద్దకు రావడానికి మీరు సహాయం చేసినప్పుడు మీ ఆనందం ఎంత గొప్పగా ఉంటుందో!) చూడండి.
దేవాలయ సిఫారసు ప్రశ్న
-
యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తమును గూర్చి మరియు రక్షకునిగా, విమోచకునిగా ఆయన పాత్రను గూర్చి మీరు సాక్ష్యమును కలిగియున్నారా?