1.
దేవుని యొక్క ప్రణాళిక మీ కోసమే
మీరు భూమిపైకి రాకముందు, మీరు మీ పరలోక తల్లిదండ్రులతో నివసించారు. మీరు వారి ప్రియమైన బిడ్డ. పరలోకంలో, తన కుటుంబం పట్ల దేవుని ప్రణాళిక గురించి మీరు తెలుసుకున్నారు. మీరు ఈ ప్రణాళికను సంతోషంగా స్వీకరించారు, ఎందుకంటే ఇది భౌతిక శరీరాన్ని పొందడం ద్వారా, భూలోక కుటుంబంలో భాగం కావడం ద్వారా మరియు భూమిపై జీవితాన్ని అనుభవించడం ద్వారా మీరు అభివృద్ధి చెంది, దేవునిలా మారడానికి సహాయపడుతుంది. ఈ అనుభవాలలో కొన్ని కష్టంగా ఉంటాయి. మన తండ్రికి ఈ విషయం తెలుసు, కాబట్టి తన ప్రణాళికలో భాగంగా, మీకు సహాయం చేయడానికి ఆయన రక్షకుడైన యేసు క్రీస్తును పంపారు. దీనిని మనం రక్షణ ప్రణాళిక లేదా సంతోష ప్రణాళిక అని పిలుస్తాము.
నిత్య సత్యాలు
ఈ ప్రణాళిక రచయిత పరలోక తండ్రే. ఆయన మీ ఆత్మకు తండ్రి మరియు ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. ఆయన మీకు తన గొప్ప దీవెనను ఇవ్వాలనుకుంటున్నారు—అదే ఆయనతో కలిసి జీవించగలిగే నిత్యజీవము. మరో మాటలో చెప్పాలంటే, మీరు ఆయనలా మారాలని మరియు ఆయన జీవించే ఆనందకరమైన, మహిమగల జీవితాన్ని మీరు కూడా జీవించాలని ఆయన కోరుకుంటున్నారు. ఆయన సమస్త శక్తిని కలిగియున్నారు మరియు సమస్తమును ఎరిగియున్నారు. జీవితం కష్టంగా ఉన్నప్పుడు కూడా మీరు ఆయనను నమ్మవచ్చు.
యేసు క్రీస్తు ప్రణాళికను సాధ్యము చేస్తారు. లోకము సృష్టించబడక ముందు, మనల్ని రక్షించడానికి పరలోక తండ్రి ఆయనను మీ రక్షకుడిగా ఉండటానికి ఎంచుకున్నారు. పరలోకంలో ఉన్న మీ తండ్రి వద్దకు మిమ్మల్ని తిరిగి తీసుకువెళ్లగల ఏకైక వ్యక్తి యేసు క్రీస్తు మాత్రమే. ఈ కారణంగానే మనము ఆయనను అనుసరించాలని ఎంచుకున్నాము. అంతా ఆ ఎంపికపైనే ఆధారపడి ఉంటుంది!
వివాహం మరియు కుటుంబం దేవుని ప్రణాళికకు అత్యంత ఆవశ్యకమైనవి. మీరు దేవుని కుటుంబంలో భాగం, మరియు ఆయన ఆత్మ సంతానమంతా తల్లిదండ్రుల ద్వారానే భూమిపైకి వస్తారు. దేవుడు తన కుమార్తెలు మరియు కుమారులు నిత్యత్వ పరిపూర్ణత వైపు కలిసి పురోగమించాలని కోరుకుంటారు. ప్రేమపూర్వకమైన, ఐక్యమైన వివాహానికి పురుషులు మరియు మహిళలు ఇద్దరూ సమానంగా దోహదపడతారు. ఈ భూమిపై కుటుంబ జీవితం—దానిలోని అన్ని లోపాలతో ఉన్నప్పటికీ—గొప్ప ఆనందాన్ని తీసుకురాగలదు. ఇది దేవునితో నిత్యజీవము కోసం మిమ్మల్ని సిద్ధం చేయడానికి ఉద్దేశించబడింది.
ఆహ్వానాలు
నిత్య దృక్పథాన్ని కలిగి ఉండండి. మీరు శోధనలు, కష్టాలు, నిరాశలు లేదా కఠినమైన నిర్ణయాలను ఎదుర్కొన్నప్పుడల్లా, దేవుని ప్రణాళికను మీకు మీరే గుర్తు చేసుకోండి. ఆయన ప్రణాళిక గురించి మీకు తెలిసిన నిత్య సత్యాలు మీ సవాళ్లను భిన్నమైన దృక్కోణంలో చూడటానికి మీకు ఎలా సహాయపడతాయో గమనించండి.
మీ జీవితంలో దేవుని హస్తాన్ని చూడండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్న విధానాలను గమనించండి. అది ఎవరో చేసే ఒక మంచి పని కావచ్చు, ఒక ప్రశాంతమైన క్షణం కావచ్చు, లేదా ప్రార్థనకు లభించిన సమాధానం కావచ్చు.
దేవుని ప్రణాళికను అనుసరించడానికి ఎంచుకోండి. మీ పరలోక తండ్రి మీరు ఏమి చేయాలని కోరుకుంటున్నారో తెలుసుకోండి. మీరు లేఖనాలను, జీవించియున్న ప్రవక్తల మాటలను, కుటుంబ ప్రకటనను మరియు మీ గోత్రజనకుని దీవెనను అధ్యయనం చేస్తున్నప్పుడు, ఆయన మార్గదర్శకత్వం కోసం వెతకండి. ఇది ఒక సువార్తికునిగా ప్రభువుకు సేవ చేయడానికి మిమ్మల్ని సిద్ధపరచుటకు సహాయపడుతుంది మరియు మీ జీవితాంతం సహాయపడుతుంది. ప్రభువుకు సేవ చేయడం, నిత్య వివాహం మరియు పిల్లలను పెంచడం వంటి వాటికి అధిక ప్రాధాన్యత ఇవ్వండి. యేసు క్రీస్తు బోధనలను అనుసరించడం ద్వారా ఇప్పుడు ఒక సంతోషకరమైన కుటుంబాన్ని కలిగి ఉండటానికి ఇప్పుడే మీ వంతు కృషి చేయండి.
వాగ్దానం చేయబడిన దీవెనలు
క్రీస్తునందు విశ్వాసంతో మీరు జీవితంలోని కష్టాలను ధైర్యంగా మరియు నిరీక్షణతో ఎదుర్కోగలరు. దేవుని యొక్క శాశ్వత ప్రణాళిక గురించి మీకు తెలిసినందున, కష్ట సమయాల్లో మీకు సహాయపడగల ఒక విలువైన సాధనం మీ వద్ద ఉంది. పుట్టుకకు మరియు మరణానికి మధ్య జరిగే వాటిని మించి జీవితం ఇంకా చాలా ఎక్కువ ఉందని మీకు తెలుసు. మీరు నిజంగా ఎవరో, మీ ఉద్దేశ్యం ఏమిటో, మరియు రక్షకుని సహాయంతో మీరు ఎలా మారగలరో మీకు తెలుసు. యేసు క్రీస్తే మీ బలం!
మీరు యేసు క్రీస్తును వెంబడించినప్పుడు, మీరు నిత్యజీవాన్ని పొందవచ్చు. ఆయనలా మారడానికి, మీ పరలోక తల్లిదండ్రుల వద్దకు తిరిగి వెళ్ళడానికి మరియు మీ ప్రియమైనవారితో నిత్యం ఆనందంగా జీవించడానికి ఆయన మీకు శక్తిని ఇస్తారు. యేసు క్రీస్తునందు విశ్వాసముంచండి.
ప్రశ్నలు మరియు సమాధానాలు
ఎందుకు జీవితం కొన్నిసార్లు చాలా కష్టంగా ఉంటుంది? నేను శక్తిని ఎలా కనుగొనగలను? ఈ జీవితంలో మీ అనుభవాలు—అత్యంత కష్టమైనవి కూడా—మీ మంచి కొరకే కావచ్చు. మీరు రక్షకుని తట్టు తిరిగినప్పుడు, అవి మీరు ఎదగడానికి మరియు పురోగతి సాధించడానికి సహాయపడగలవు. యేసు క్రీస్తు తన ప్రాయశ్చిత్త త్యాగము కారణంగా అర్థం చేసుకోలేని పరిస్థితి ఏదీ మీరు ఎదుర్కోవడం లేదు. మీకు ఎలా సహాయం చేయాలో ఆయనకు ఖచ్చితంగా తెలుసు. మీ జీవితాన్ని ఆయనపై కేంద్రీకరించండి, అప్పుడు ఆయన మిమ్మల్ని అన్ని సందేహాలు మరియు భయాల నుండి పైకెత్తుతారు.
కొన్నిసార్లు, కుటుంబంలో మరియు వివాహంలో ఆనందం అనే భావన చాలా దూరంగా ఉన్నట్లు అనిపిస్తుంది. నేను ఆత్మవిశ్వాసాన్ని ఎలా కనుగొనగలను? మీ పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ, పరలోక తండ్రి ప్రణాళికను వదులుకోవద్దు. ఆయన మిమ్మల్ని వదిలిపెట్టరు. మీరు రక్షకుడికి మరియు మీ నిబంధనలకు విశ్వాసముగా ఉంటే, మీరు యేసు క్రీస్తు బోధనలలో సమాధానాలను కనుగొంటారు. మీరు అనుభవించే ప్రతిదాన్ని ఆయన అర్థం చేసుకుంటారు. ఆయన ద్వారా, దేవుని ఆజ్ఞలను పాటించడానికి మరియు ఆయన వాగ్దానం చేసిన దీవెనలను పొందడానికి మీరు బలాన్ని పొందుతారు. ఆయనను మరియు ఆయన సువార్తను నమ్మండి.
2 నీఫై 9:13 (దేవుని ప్రణాళిక ఎంత గొప్పది!); మోషైయ 2:41 (ఆజ్ఞలను గైకొను వారు ఎన్నడూ అంతముకాని సంతోషము యొక్క స్థితిలో నివసించెదరు); ఆల్మా 12:28–34 (దేవుడు తన విమోచన ప్రణాళికను తన పిల్లలకు తెలియజేశారు.); అబ్రాహాము 3:22–26 (దేవుని యొక్క ప్రణాళికలో మనల్ని భూమికి పంపడం కూడా ఉంది, అక్కడ మనం ఆయన ఆజ్ఞలను పాటించాలా వద్దా అని మనమే స్వయంగా ఎంచుకోవచ్చు.) చూడండి.
దేవాలయ సిఫారసు ప్రశ్న
-
నిత్యుడగు తండ్రియైన దేవునియందు, ఆయన కుమారుడైన యేసు క్రీస్తునందు మరియు పరిశుద్ధాత్మయందు మీరు విశ్వాసమును మరియు సాక్ష్యమును కలిగియున్నారా?